బతుకు మడతల్లో…

కొత్తగా కట్టిన సిద్దిపేట పాత బస్టాండు. ఎములాడ షెల్టర్ బస్సు వచ్చి ఆగింది. ఆగి ఆగంగనే జనం ఎగవడ్డరు.

“ఉండుడింట్ల పీనిగెల్ల… ఉన్నది ఉన్నదంటరు. ఉండి దేనికి లేక దేనికి. వాళ్ళ ఉండుడు వాగుల వోను. కనీసం పిడికెడు మెతుకులు సక్కగ పెట్టక పాయె. గింత పాపమా…” మరుదలును అడిపోసుకుంట జనాన్ని తోసుకుని బస్సెక్కింది శోభ.

వెంట కైలాసం కూడా ఉన్నడు. తనూ బస్సెక్కిండు. ఇద్దరికీ ఆగమాగముంది. సీట్లో కూసుండి చేతి సంచిని మరోసారి తెరిచి చూసుకుంది శోభ. ఒక పాత జాకెట్‌ ముక్క, రెండు ఎండిన కుడుకలు, నాలుగు కజ్జరపండ్లు, తమ్మలపాకు… పోక వక్కలు. వాటిని ముట్టుకోవాలంటేనే మనుసొప్పుతలేదు. ఒకలనొకలు చూసుకున్నరు. ఒకలు ఒకలతో చెప్పుకుంటలేరు గని, ఇద్దరి ఆలోచన ఒక్కటే ఉంది. ఎంతో ఆశతో వచ్చిండ్రు. అంతకంటే నిరాశతో పోతున్నరు.

సంచిని పక్కకు నెట్టి సీట్లో ఒరిగి కండ్లు మూసుకుంది శోభ. ఇంటికి వెళ్లాలంటేనే భయంగా ఉంది. కండ్లు మూసుకుంటే కండ్ల ముందు షాందిరి మెదిలింది. అది ఇప్పటిది కాదు. ఆరేండ్ల కింద అత్తగారింట్ల అడుగుపెట్టినప్పుడు అత్త చేతికిచ్చిన బతుకు తెరువు షాందిరి. రెండు పెద్దయి నిలువు ఎలిత బద్దలు, వాటికి ఆరు అడ్డం ఎలిత బద్దలు. మద్యలో నిలువు నిట్టాడు. అడ్డం ఎలిత బద్దలకు వరుసగా మొలలు. వాటికి తగిలేసిన పుల్లన్న గొయ్యలు, రబ్బరు బొమ్మలు, రంగు కండ్లద్దాలు, బుగ్గలు, ఇంకా పిల్లల ఆట వస్తువులు. అంగళ్ళు జాతరలు వీదులు షాందిరిని పట్టుకుని తిరిగి ఆట వస్తువులు అమ్మి పొట్టపోసుకోవడం. షాందిరి చేతులుంటే బతుక్కు ఎంతో బరోస. పొయ్యి మీద బియ్యం పెట్టి రెండు వాడలు తిరిగచ్చినా కూరగాయల మందం గిరాకయ్యేది.

డ్రైవర్ ఎక్కినట్టున్నాడు. ఒక్క కుదుపుతో బస్సు బరువుగా కదిలింది. ఉలిక్కిపడి కండ్లు తెరిచి పక్కకు చూసింది శోభ. ఆమె కంటే ఎక్కువ రందితో ఉన్నడు కైలాసం. భార్య కళ్ళల్లోకి సూటిగా చూడలేక తలతిప్పుకున్నడు.

“రేపు లేదు ఎల్లుండి కొత్తపెల్లి రథం. పోదామంటే సామాన్లు లేకపాయె. ఏంజేద్దాం” అడిగింది శోభ. అది అడిగినట్టు లేదు. బాధను చెప్పుకున్నట్టుంది. కైలాసం గాజులాట గురించి ఆలోచిస్తున్నడు. శోభ మాటలకు ఉలిక్కిపడి చూసిండు. అతడు వినలేదని మల్లా అవే మాటలన్నది శోభ.

‘అవును… కొత్తపెల్లి రథం. ఏం లేదన్నా మూడు రోజులు అమ్మకం. ఎప్పుడూ లాభం వెయ్యికంటే తక్కువ రాలేదు. ప్రతిసారి ఈ రథంల వచ్చిన లాభంతోనే గదా… యాడాది తల్లి గాసం కొంటం… ఇప్పుడెట్ల ’ అనుకున్నడు.

“చేతిలది వాయె… నూతిలది వాయె. చెప్పుదెబ్బలపాలాయె అన్నట్టుంది మనకత. చెల్లే… చెల్లే అని కలువరిల్లితివి. ఏదో దారి చూపిస్తదంటివి. ఏది దారి… ఇప్పుడు మన దారి ఏట్లకే… అయినా ఆమెకు ఎట్ల మంచిదైతది. ఓడిబియ్యం పొయ్యటానికచ్చి ఏడుసుకుంటపోతె మంచిదైతదా…” అన్నది శోభ దెప్పి పొడిచినట్టు.

కైలాసం కండ్లళ్ల నీళ్లు తిరిగినయి. ఆ సంఘటనలన్నీ ఒక్కొక్కటి గుర్తుకచ్చినయి.

*

పొద్దు పొద్దున పొలానికి నీళ్ళువెట్టి ఇంట్లకు వత్తవత్తనే ‘ఓడి బియ్యం… చెల్లెకు ఓడి బియ్యం పొయ్యాలె’ అని గుర్తు చేసిండు కైలాసం.

షాందిరి నిట్టాడుకు బొమ్మలను సదురుకుంటున్న శోభ భర్తను ఓ సూపు చూసి “ఆ…నువ్వు పొయ్యకపోతివని సూత్తండ్రు… వాళ్ళు ఉన్న మారాజులు. ఒడి బియ్యమంటే వట్టిగైతదా. ఏం బోత్తం… ఏం బెడుతం.” అన్నది శోభ.

గచ్చుల కాళ్ళు కడుక్కుని కూసుంటూ “పెట్టుడేం లేదు. ఐదు పిడికిళ్ళ బియ్యం… పసుపు కుంకుమ. ఎంత ఉన్న మారాజులైతేంది..? ఓడి బియ్యం పడగొడుతరా. ఇప్పుడు ఐదేండ్లు దాటుతయి. మా అవ్వనే ఉంటే నన్ను బతుకనిచ్చునా… పొద్దున మాపున పోరు వెట్టి ఎంటవడి పోపిత్తుండే” అన్నడు.

శోభ కొద్దిగా మెత్తవడ్డది. “ఇప్పుడెవలద్దంటున్నరు… పోత్తాం. పొయ్యడానికేముంది… గనీ వాళ్ళు వత్తరా అని…?” అనుమానంగా అడిగింది.

“వాళ్లేమత్తరు… ఈ పని ఆ పని అంటరు. ఏంలేదు… మనమే బియ్యం తీసుకపోదాం. రెండురోజులుండి వద్దాం” చెప్పిండు కైలాసం.

భర్త మాటలకు కోపంగ చూసింది శోభ. “ఉంటవుంటవు… ఎవ్వడేం అనకపోతే వారంరోజులుంటవు. నీ అసొంటోడే ఆషాఢ మాసంల ఆటీటు తిరిగి కార్తీకమాసంల కండ్లకు నీళ్ళు తీసుకున్నడట. రేపు లేదు ఎల్లుండి అంగడుంది. మూడు రోజులాగితే కొత్తపల్లి రథముంది. అక్కడుంటే నీ పొక్కలకెవడు పెడతడు” అన్నది యాష్టగా.

శోభ మాటలకు నోరెత్తలేదు కైలాసం. లేచి అంగట్ల గాజులాట పెట్టుడుకు సామాన్లు సదరుకుంటున్నడు. శోభనే మళ్లీ “నిన్నురమ్మని పోన్ల మీద పోన్లుచెయ్యవట్టిరి… నువ్వే పోకపోతివా. రమ్నన్నోడు లేడు. బియ్యం తెమ్మన్నోడు లేడు… నీకునువ్వే మురువ వడితివి ముక్కులది నోట్లెకు కారేతట్టు…” అన్నది ఎక్కిరిస్తూ.

కైలాసం నవ్వుకున్నాడు. నవ్వుకుంటూ “నన్ను ఒకలు రమ్మనాలెనాయె. నా చెల్లెకు బియ్యం పోసుడు నా బాధ్యత. నేను పోతే వద్దంటరా ఏంది..? చెల్లె ఎవ్వలకు ఎదురుసూడకుంట బతుకాలని అప్పు సప్పు జేసి ఉన్న ఇంటికిచ్చిన. దాని లగ్గానికి అప్పు జెయ్యకుంటే నేను రాజు లెక్క బతుకుదుంటి. అయినా నీకో సంగతి తెలుసునా. ఈసారి వట్టిగ పోదామంటలేను తియ్యి…” అన్నడు.

చేతుల బొమ్మను మొలకు చెక్కుతూ “ఇంక వట్టిగేందో పచ్చిగేందో. ఆడేమన్న దనం దాసుకున్నవా” అన్నది కోపంగా శోభ.

కైలాసం నవ్వుకుంట దగ్గరగా వచ్చి గుసగుసగా “మొన్న మన సర్పంచ్‌తోని నా పేరు యాది చేసిండట మా బావ” అన్నడు.

“ఎందుకో… ఉన్నడా పోయిండా అనా…” ఎక్కిరిస్తున్నట్టుగా అన్నది శోభ.

“ఏ…కాదు…నీకన్ని కారడ్డాలే. మీ బామ్మరిదిని దగ్గెరికి తీత్తేంది అని సర్పంచ్‌ మా బావను అడిగిండట. వాడు వత్తెగదా దగ్గెరికి తీసుడు… ఎత్తుకుంటే సంకకు రాడు… దించితె దిగడు అని మా బావన్నడట.” చెప్పిండు కైలాసం.

శోభకు కోపం మరింత ఎక్కువయ్యింది. “అయిన ఎత్తుకున్నదెన్నడో… నువ్వు సంకకు రానిదెన్నడో… పెట్టిపొయ్యనోడు పెయ్యంత ముట్టి చూసిండంటె గిదే” అన్నది.

శోభకు కోపం పెరుగుతుంటే కైలాసంకి నవ్వు వస్తుంది. నవ్వుకుంటనే “కాదే… ఒకసారి నువ్వే ఆలోచించు. ఎన్నడన్న మనం బావనో చెల్లెనో కలిసి నాకు గీ పని చూపియ్యి… గా పని జెయ్యి అని అడిగినమా. అడుగనిది ఎవలు జేత్తరు చెప్పు” అన్నడు.

శోభ కొంత సేపు మౌనంగా వుండి కండ్లకు నీళ్ళు తెచ్చుకుని “ఏం అడుగుతం. ఆయిన కంటికే కనవడడాయె. ఇగ ఆమె సుక్క తెగిపడ్డట్టు రాక రాక ఎప్పుడన్న ఒక్కసారి వచ్చినా గడియ నిలవడదాయె. మన నీడనే పారనియ్యకపాయె. కనీసం ఒకసారి రమ్మని నోటిమాటకన్న చెప్పకపాయె. నా లగ్గమయినప్పుడు చిన్నపిల్ల. తానం బోసిన… ముట్టు బట్టలు పిండిన… సాది సవరిచ్చిన. తల్లిగారిల్లని వత్తె రెండు కానుపులు చేసిన. గింత నెనరున్నదా… సూసుకుంట గుడ్డాట అన్నట్టు ఆమెకు మన బతుకు దెలువదా… మన బాధ తెలువదా.” అన్నది.

కైలాసం శోభను సముదాయిస్తున్నట్లు “సరె సరే… మనమేమో ఇట్లనుకుంటున్నం. అడుగంది మేమేం జేస్తం అని వాళ్ళనుకుంటుండ్రు గావచ్చు. చెల్లె నా చెల్లెగనీ బావ నా బావయితడా… ఈ సారి అడిగే సూద్దాం. ఏదన్నా పని చూపించుమందాం. ఎన్ని రోజులు ఈ ఎత్తుపోగుల బతుకుచెప్పు. సావకుంట బతుకకుంట. మనం జేసే కట్టం మన కూటికే సాలుతలేదాయే. రేపు రేపు పిల్లల గతేంది చెప్పు. వాళ్లను ఎట్ల సాదుతం…మనం ఎట్ల బతుకుతం.” అన్నడు కైలాసం.

శోభ మరింత ఆలోచనల్లో పడింది. ఆమెకు లోలోపల ఏదో ఆశ పుట్టింది. కైలాసం చెప్పుతున్నది నిజమే అనిపించింది. ‘అవును నిజమే… ఎన్నడన్న ఏదన్న అడిగినమా…’ అనుకుంది.

అట్ల అడుగక పోవడానికి కారణం కూడా ఉంది. ఈ మధ్య బతుకు దెరువుకు ఇబ్బంది అయితుందిగని అంతకుముందు ఒకలకు చెయ్యి సాపని బతుకే. ఆడుకుంటూ పాడుకుంటూ గడిచిపోయింది. లాభం ఎక్కువగానే ఉంటుండె. షాందిరి నిట్టాడు పట్టుకుని తిరుగుతుంటే జాతరలో గిరాకి బాగనే అయితుండె. అటువంటి నిట్టాడులు ఒకటో రెండో ఉంటుండె. చెప్పిందే ధర ఇచ్చిందే బొమ్మ. కావాలనే పిల్లలున్న చోటుకు వెళ్ళి లాయిలప్ప లబ్బరి బొమ్మ… రంగు రంగుల బంగారు బొమ్మ అని పాటెత్తుకుని తిరుగుతుంటే పిల్లల ఏడుపు పడలేక కొని తీరాల్సిందే. ఒక రౌండులనే షాందిరి మొత్తం అమ్ముడువోతుండె. కానీ ఈ మధ్య అమ్మకం పూర్తిగా తగ్గింది. జాతరల ఎటుచూసినా షాందిరీలే.

కైలాసం గాజులాటకైతే పూర్తిగా గిరాకిలేదు. ‘గాజులాట రాజులాట గాజులాట రాజులాట… ఏసుకో తీసుకో…’ అని పీట నడుమల వందనోటును అతికించి చుట్టూ సబ్బులు, బొట్టుబిళ్ల పాకెట్లు, కాటిక డబ్బీలు, ఐదు రూపాయల బిళ్ళలు అతికించి ఐదు రూపాయలకు రెండు గాజులు పదిరూపాయలకు ఐదుగాజులు అమ్మేటోడు. ఎప్పుడో సుక్క తెగిపడ్డట్టు ఐదు రూపాయలు పడేది అంతే. అప్పుడో ఇప్పుడో సబ్బుబిళ్లలు, కాటిక డబ్బీలు పడేవి. వందరూపాయలైతే ఎవరికీ పడేది కాదు. వాటిని అట్ల అమర్చేవాడు కైలాసం. జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు. ఇప్పుడు ఒర్రిఒర్రి నోరు పోతుంది గని ఆట ముందటి జోరులేదు.

“సరే…మరి ఎప్పుడు పోదాం…” శోభ అడిగింది.

“ఎప్పుడేంది… నువ్వు సరే అంటే రేపే పోదాం. బాపనైనను అడిగిన మంచి రోజేనట” కైలాసం అన్నడు.

“పోతే పోదాంగని ఒక పనిజేద్దాం. మీ చెల్లెకు పోన్‌ చేద్దాం. గిట్ల వత్తన్నమని చెప్పుదాం…” అన్నది

కైలాసం సరేనని చెల్లెకు పోన్‌ కొట్టిండు. చెల్లె ఫోన్‌ ఎత్తి ‘అన్నా… బాగున్నావే ’ అన్నది. లౌడ్‌స్పీకర్‌ వెట్టి సంగతంతా చెప్పిండు కైలాసం. పద్మ సంబురపడి పోయింది.

“అవ్వతోనే అన్ని పోయినయనుకున్న. నాకు యాదే లేదు. తప్పక తీసుకరాండ్రి. ఐదేండ్లు అయింది గదా… మట్టెలు గూడా చేయించుక రాండ్రి. బావగూడా మొన్నయాదిజేసిండు.” అన్నది.

చెల్లెలు ఉత్సాహం చూస్తుంటే కైలాసంకి పట్టరాని సంతోషం వచ్చింది. విన్నవా అన్నట్టు శోభవైపు చూసిండు. ఆమెకు మాత్రం మట్టెలనంగనే పాణం జల్లుమంది.

“రెండు మూడు రోజులు ఉండేతట్టు రాండ్రి… ఇక్కడికి వచ్చి ఆగం జెయ్యద్దు మరి” అని ఫోన్‌ పెట్టింది పద్మ.

అసలు సమస్య అక్కడ మొదలయ్యింది.

“మట్టెలంటే మాటలా… తోడు బట్టలు కావాలె… ఎట్ల…?” అడిగింది శోభ.

అప్పు తెద్దామని చెప్పిండు కైలాసం. ఇప్పటికిప్పుడు ఎక్కడా పుట్టదని హెచ్చరించింది శోభ.

“ఏంలేదన్నా కనీసం రెండువేయిల రూపాయలు… ఎక్కడినుండి తెద్దాం… తీసుకపోనేవద్దు తీసుకపోతే ఏలువెట్టి చూపియ్యకుంట ఉండాలె. అసలే మీ చెల్లె సూది. సుక్కలల్ల మచ్చలు సూత్తది.” అన్నది.

ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. “ఎలాగూ మనం ఈ పని మానేద్దామనుకుంటున్నం. వీటితో పనేంది…? అమ్మేద్దాం…” అన్నది శోభ. సరే అన్నడు కైలాసం.

అటు నిట్టాడును ఇటు గాజుల పీటను అమ్మకానికి పెట్టిండ్రు. జాతర్ల దినం కాబట్టి వెంటనే బేరంకుదిరింది. ధర గురించి ఆలోచించలేదు. తక్కువధరకే పక్కవాళ్ళు కొన్నరు. శోభ ఓడి బియ్యం సదిరింది. కైలాసం బట్టలు మట్టెలకు వెండి కొన్నడు. రాత్రి పూట అన్ని ముల్లెగట్టుకుని కొండంత ఆశతో ఇద్దరు మబ్బుల బస్సు ఎక్కిండ్రు.

కర కర పొద్దు పొడుత్తుండంగ సిరిసిల్లల బస్సు దిగి ఇంటికి నడుత్తుంటే ఎందుకో అనుమానం వచ్చింది శోభకు. ఆడుగుదునా వద్దా అని అడుగును ఆపి అడుగనే అడిగింది.

“అవూ… మనను కొనగంట సైసనోళ్ళు… పండుగలకు పబ్బాలకు కూడా పిలువనోళ్లు… ఆధారం చూపిస్తరంటవా…? ఉన్నది అమ్ముకొని వత్తిమి” అన్నది.

కైలాసంకి కోపమచ్చింది. “నీకు అన్ని అనుమానాలే… నీ ముంగటనే పోన్ జేసిన గదా… నడువు నడువు…” అన్నడు.

మూడంత్రాల మాల ముందాగి గేటు తీస్తుంటే ఎదురుగా వచ్చిండు రాజారాం.

“నమస్తె బావా… బాగున్నవా…” అని నవ్వుకుంట పక్కకు జరిగిండు కైలాసం.

“అన్నా… బాగున్నరా…” అడిగింది శోభ.

రాజారాం మొఖం గూడా తిప్పి చూడలేదు. తల ఊపుకుంటూ కారులో వెళ్ళిపోయిండు. కైలాసం మనసు కలుక్కుమంది. శోభ మొఖం చిన్నగ చేసుకుంది.

“పెండ్లయినప్పుడు ఎట్లుండె. బక్కగ… నూకితె నూరుజాగల పడేతట్టు. నడుమంత్రపు సిరి చూసినావు. భూముల ధరకు రెక్కలచ్చి మనిషి కండ్లు నెత్తి మీదికచ్చే. కనీసం ఎప్పడచ్చిండ్రని అంటలేడు సూడు.” అనుకుంది.

ఇంట్లకు పోంగనే ఎదురుంగ వచ్చింది పద్మ. పెయ్యి నిండ నగలతో అమ్మవారు లెక్క ఉంది. ఎప్పుడచ్చిండ్రు ఎట్లున్నరు అని అనకుంట ‘ఆటోల రావద్దానే… నెత్తిమీద ముల్లెవెట్టుకుని నడుసుకుంట వత్తరా. ఆయిన మిమ్ములను గాదు. నన్ను తిడుతుడు’ అన్నది కోపంగా.

కైలాసం నవ్విండు. శోభ మనుసుల ముల్లుగుచ్చినట్టయింది. చేతుల సంచిని పక్కకు బెట్టి నిలబడ్డది. పద్మ పనిమనిషిని పిలిచి ముల్లెను కైలాసం చేతుల సంచిని ఒక మూలకు పెట్టించింది. రాజారాం బయట నుంచే పద్మను పిలిచాడు. పద్మ వత్తన్నా అని చెప్పులేసుకుంది. బయటకు నడుత్తుంటే ‘చెల్లె…పన్నెండు లోపలనే బియ్యం పోసుకోవాలని చెప్పిండు పంతులు. అందుతమో లేమోనని మబ్బుల బస్సుకే వచ్చినం’ అన్నడు.

“ఆ…వత్తం వత్తం. అద్ద గంటల వత్తం. మీరు కూసోండ్రి” అంటూ బయటకు నడిచింది.

పని మనిషి అదోటి ఇదోటి సదిరి వెళ్లిపోయింది. ఇంట్ల ఇద్దరే మిగిలిండ్రు. పిల్లివట్టిన కోడిలెక్క ముడుచుకుని కూసున్నరు.

అద్దగంట అన్నది గంటయ్యింది. రెండు గంటలయింది. పన్నెండు దాటింది. పద్మ జాడలేదు పత్తలేదు. చేద్దామని పోన్ తీస్తుండు గనీ దైర్నం రాక మల్లా జేబుల పెట్టుకుంటుండు.

ఇద్దరు ఒకల మొఖాలు ఒకలు చూసుకున్నరు. బిందెల మంచి నీళ్ళుంటే ముంచుక తాగిండ్రు. ఆకలైతుంది. శోభ ఆ గిన్నె ఈ గిన్నె తీసి చూసింది. అన్నీ కడిగి బోర్లేసినయే. ఇద్దరికీ ఏడుపచ్చింది. కైలాసం పైకి మాత్రం ఏదో ధైర్నం చెప్పుతుండు. లోపల భయం భయంగానే ఉంది.

రెండు దాటుతుండంగ ఇంటి ముందు కారు చప్పుడు వినిపించింది. పద్మ ఒక్కతే వచ్చింది. ఇంట్లకు రాంగనే ఇద్దరిని చూసి ‘తిన్నరా’ అని అడిగింది. అడిగి ‘ఏందే పరాయిలలెక్క జేత్తరు. వండుకోని తింటే తప్పా… ఇట్ల జేత్తరనే జెట్టనచ్చిన’ అని యాష్ట పడుతూ అరగంటల వంటచేసింది.

“చెల్లే… మూర్తం దాటిపాయె…ఎట్లా? ఇప్పుడన్నా పోద్దామంటే బావ రాకపాయె” అన్నడు కైలాసం.

“అన్ని ఒక్కటేనాడాయె… వాళ్ళ దోస్తు ఇంట్ల పంక్షన్‌. వాళ్ళు మనకు చిన్నదానికి పెద్దదానికి నిలవడతరు. మనం నిలవడకపోతె ఎట్లా… అప్పటివరకు వత్తడు తియ్యి. ముందు మీరైతె తినుండ్రి” అని ఇద్దరికి అన్నం బెట్టింది.

తిన్నట్లు చేసి టీవి పెట్టుకుని కూసున్నరు. సూడంగ సూడంగ నాలుగు గొట్టంగ వచ్చిండు రాజారాం. ఇంట్ల పదినిమిషాలు నిలువలేదు. భార్యా భర్తలిద్దరు ఏదోమాట్లాడుకున్నరు. అన్నీ లక్షల ముచ్చట్లే. ఓడి బియ్యం ఊసే రాలేదు. హడావుడిగా తిరుగుతూ రాజారాం కండ్లతోనే సైగలు జేత్తండు. పద్మ భయం భయంగా చుట్టు తిరుగుతు అడిగింది అందిస్తుంది.

రాజారాం బయటకు నడుత్తుంటే కైలాసం వెంటవచ్చి ‘బావా’ అంటూ బియ్యాన్ని గుర్తు చేసిండు.

రాజారాం కిందికి మీదికి చూసి ‘మీ చెల్లెకు పోసిపో’ అని కారులో వెళ్ళి పోయిండు. కైలాసంకి కండ్లళ్ల నీళ్లు దిరిగినయి. లోపలికి వచ్చి పద్మతో చెప్పిండు. పద్మ నవ్వుతూ ‘ఆయన ఆగం కాదు ఆయన లెక్కగాదు. నువ్వు అడుగుడుగనీ… ఇంత ఆగంల ఎట్ల పోసుకుంటడే’ అన్నది. చివరగా తనే ‘అట్లనే తీసుకపోండ్రి….మల్ల ఎప్పుడన్నపోత్తురు తియ్యి’ అన్నది.

భార్య భర్తలిద్దరు సల్లబడ్డరు. ఒకల మొఖాలు ఒకలు సూసుకున్నరు. ముందుగా తేరుకున్న శోభ బాధగా చూసి “కొంటవోవుడెందుకు పద్మా… వరుస పడగొట్టద్దని తెత్తిమి… ఇక్కడనే ఉండని… మీకు తీర్పాటమున్నప్పుడు ఫోన్‌ జెయ్యిండ్రి… వచ్చి పోసిపోతం” అని సంచి పట్టుకుని బయలుదేరింది.

పద్మ ఉండుమనలేదు. పొమ్మనలేదు. బయటకు నడుత్తుంటే మాత్రం ‘ఆగుండ్రి’ అని ఆగమాగాన ఇంట్లకు పోయింది. అప్పుడే రాజారాం వచ్చిండు. పోతున్నరా అనలేదు ఉంటున్నరా అనలేదు. భార్యనే అనుమానంగా చూస్తుండు. ఇంట్లోంచి ఓ పాత జాకెట్టు బట్టను సుతారంగ తెచ్చి శోభ చేతులపెట్టింది. బట్టను సంచిలో పెట్టుకుని బయటకు వచ్చింది శోభ. కనీసం కడుప దాటి గూడా ఎవలు రాలేదు.

*

బస్సు వేగాన్ని అందుకుని తంగెళ్ళ పెల్లి వాగు మీదికి వచ్చింది. సంచిలోని జాకెట్‌ ముక్కను చూస్తుంటే శోభకు ఏడువేడువున దుక్కమచ్చింది.

“రాత పాడుగాను రాత జూసినావు. భూమ్మీద మనిశి పుట్టువాడి పుడితె యెవలది బాకి లేదాయె. కోట్లకు కోట్లున్నయి. కనీసం ఓ కొత్త బట్ట ముక్కనన్నా పెట్టలేదు. ఆమె ముల్లేంబోయిందో. ఎన్నొద్దులో ఈ నడుమంత్రపు సిరి” అనుకుంట దాన్ని బయటకు తీసింది. ఎలిసిపోయి పసుపు మరకలంటి పాతవడిన జాకెట్‌ ముక్క.

“చీ… గీ వక్క కోసమా… ఇంత దూరమచ్చింది. చేతుల పని అమ్ముకుంటిమి. గీ ఎలిసి పోయిన వక్క నాకెందుకు. బట్ట పాడుగాను…” అనుకుంట బాధగా కిటికీలనుంచి వాగు నీళ్ళల్లకు ఇసిరికొట్టింది.

గాలికి బట్ట ఇచ్చుకపోయింది. బట్టమడతల్లో ఉన్న రెండు వేల నోట్లు, ఇంకేదో కాయిదం చెల్లా చెదురుగా ఎండకు మెరుస్తూ ఎగురుతున్నాయి.

జ‌న‌నం: కరీంనగర్ జిల్లా, గంభీరావుపేట మండలం, భీముని మల్లారెడ్డిపేట. ఇంటర్మీడియట్ గంభీరావుపేట, బీఎస్సీ సిద్ధిపేట‌, ఎంఎస్సీ కాకతీయ విశ్వవిద్యాలయంలో చ‌దివారు. ఇల్లంతకుంట మండలం, రామాజీపేటలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేపనిచేస్తున్నారు. నవలలు: జిగిరి, ఎడారి మంటలు, దాడి, ఊరికి ఉప్పులం, సంచారి, లాంగ్ మార్చ్. కథాసంపుటాలు: ఊటబాయి, భూమడు, మాఊరి బాగోతం, మాయి ముంత, వలస బతుకులు, పోరుగడ్డ (కథలు, వ్యాసాలు), జుమ్మేకి రాత్ మే(క‌థ‌ల సంపుటి) ప్ర‌చురించారు.

Leave a Reply