బతికుండడమంటే

మైదానమో
సముద్ర తీరమో…
దట్టమైన అరణ్యమో
చీకటి గుహలాంటి ప్రాంతమో

ఎక్కడైనా…

ప్రాణం స్వేచ్ఛగా కదలాలనుకుంటుంది
ప్రాణం కొంత వెచ్చదనం కోరుకుంటుంది
ప్రాణమున్నజీవమేదైనా…
చలినుంచో ఎండనుంచో వాననుంచో
కాస్త రక్షణ కోరుకుంటుంది…
కనీస అవసరం కోరుకోవడమే స్వేచ్ఛకదా…!

ఎప్పుడైనా…

స్వేచ్ఛను పాడే గొంతుకి
సంకెళ్ళు బిగిసుకుంటున్నపుడు
మాట్లాడలేని మనిషైనా దేశమైనా
జీవించి వున్నట్టుకాదు….!?

దేశం శోకాన్ని శ్లోకించే కంఠం
కారుణ్యం లేని గోడల మధ్య
మౌనంగా విలపిస్తున్నపుడు…
మాట్లాడలేని వాళ్ళెవరైనా…
ఊపిరితో ఉన్నట్టుకాదు

ఎవరైనాగానీ….

ఒక దేశమో
ఒకదేశం లాంటి మనిషో…
దారిపక్కనో…
అడవిలోనో…

విచక్షణ లేని ఈదర గాలులు వీస్తున్నప్పుడు
చలికి గజగజా వణుకుతున్నప్పుడూ
దేశమంతా
ఒక దుప్పటో తుండుగుడ్డో కాలేకపోవడం…
దేశంలో మనిషి బతికున్నట్టుకాదు!

పూర్తిపేరు ప‌ల్లిప‌ట్టు నాగ‌రాజు. చిత్తూరు జిల్లా ‘అరవై నాలుగు పెద్దూరు’లో తెలుగు ఉపాధ్యాయుడు. శ్రీ వెంకటేశ్వర విశ్వ‌విద్యాల‌యంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆరువంద‌ల‌కు పైగా కవితలు, మినీ కవితలు, 6 కథలు రాశారు. చిత్తూరు జిల్లా ‘అభ్యుదయ రచయితల సంఘం’, ‘ఈ తరం కవితా వేదిక’లో కార్యవర్గ స‌భ్యుడిగా ప‌నిచేస్తున్నారు.

3 thoughts on “బతికుండడమంటే

  1. చాలా మంచి కవిత.
    ‘అవసరాన్ని గుర్తించడమే స్వేచ్ఛకు తొలిమెట్టు, అయితే కేవలం అవసరాన్ని గిర్తించినంత మాత్రాన్నే అది స్వేచ్ఛ అవుతుందా? అనే ప్రశ్న కూడా అక్కడ మనకు ఎదురవుతుంది.

Leave a Reply