20 వ శతాబ్దం సృష్టించిన అద్భుతమైన కవులలో ఒకరిగా ఈ పోర్చుగీసు కవి, ఫెర్నాండో పెస్సోవ గురించి పేర్కొంటారు. కొందరు విమర్శకుల అంచనా ప్రకారం, పాబ్లో నెరూడా స్థాయి కవి పెస్సోవ. దురదృష్టం ఏమిటంటే, తన 47 ఏళ్ల స్వల్ప జీవిత కాలంలో అనేక పేర్లతో కవిత్వం రాయడం వలన, పెస్సోవ బతికి వుండగా అతడికి రావలసినంత పేరు రాలేదు. సాహిత్య పత్రిక నిర్వహణ ద్వారా పోర్చుగీసు ప్రజలకు నూతన సాహిత్యాన్ని అందించాలన్న తపనే తప్ప తన కవిత్వాన్ని పుస్తకాలుగా వేసుకోవాలన్న తపన లేకుండా ఒంటరిగా బతికిన కవి పెస్సోవ. కాలేయ సంబంధ వ్యాధితో చనిపోవడానికి కేవలం రెండేళ్ల ముందు అతడి ఒకే ఒక్క పోర్చుగీసు కవిత్వ పుస్తకం (మెన్సజెమ్) అచ్చయింది. అతడు మరణించిన పిదప, పెద్ద ట్రంకు పెట్టెలో వివిధ పేర్లతో రాసిన 25000 కవితలు, ఇతర రచనలు బయట పడడంతో ఐరోపీయ సాహిత్య ప్రపంచానికి పెస్సోవ సాహిత్యం పట్ల అమితమైన ఆసక్తి ఏర్పడింది. దాదాపు 72 భిన్నమైన పేర్లతో పెస్సోవ రచనలు చేశాడని చెబుతారు. ఆ మరుసటి దశాబ్దానికంతా పెస్సోవ ప్రపంచ సాహిత్యంలోని గొప్ప కవులలో ఒకడిగా మారిపోయాడు.
తన కవితలలో ఒకచోట పెస్సోవ ఇట్లా రాసుకున్నాడు –
‘నన్ను నేను తెలుసుకోవడం మొదలుపెట్టాను. నేనింకా ఉనికి లోకి రాలేదు’
‘నేను వుండాలని ఆశించే స్థితికి, ఇతరులు నన్ను నెట్టిన స్థితికి నడుమ వున్న ఖాళీయే నేను’
మరణించడానికి ఒకరోజు ముందు పెస్సోవ రాసుకున్న మాట – ‘రేపు అన్నది నా కోసం ఏమి తీసుకొస్తుందో నాకు తెలియదు’
ఫెర్నాండో పెసోవా కవితలు రెండు:
కొన్ని సమయాలు
కొన్ని సమయాలలో
పువ్వులు నవ్వుల్ని విరబూస్తాయనీ
గల గల పారే నదిలో పాటలు దాగుంటాయనీ
నేను మీకు చెబితే
పువ్వుల్లో నవ్వులు దాగున్నాయనీ
పారే నదిలో పాటలున్నాయని
నేను నిజంగా భావిస్తున్నానని కాదు
అట్లా చెప్పకపోతే
పూలూ నదుల నిజమైన ఉనికిని
దారితప్పిన పురుషుల అనుభవంలోకి తెచ్చేదెలా?
నేను వాళ్ళ కోసం రాస్తున్నాను కాబట్టి
కొన్నిసార్లు వాళ్ళ ఆథమస్థాయి అభిరుచికి
దిగిపోయి రాస్తాను
ఇది సరైనది కాదని తెలుసు
ఇందుకు నన్ను నేను క్షమించుకుంటాను
ప్రకృతి భాషను ఆకళింపు చేసుకోలేని
పురుషులున్న చోట
నేను ప్రకృతి సౌందర్యాన్ని వ్యాఖ్యానించే
ఇబ్బందికరమైన పాత్రను ఎంచుకున్నాను
అసలిది ఏ భాష కూడా కాదు
కిటికీ తెరిచిన తరువాత
ఆరుబయట పచ్చని పొలాలనూ
పారే నదినీ దర్శించడానికి
నీవు కిటికీ మాత్రమే తెరిస్తే సరిపోదు
పచ్చా పచ్చని చెట్లనీ,
రంగురంగుల పూవులనీ దర్శించడానికి నీవు
గుడ్డివాడివి కాకుండా వుండడమొకటే సరిపోదు
నీదైన వేదాంతమేదీ లేకపోతే మరీ మంచిది
వేదాంతమున్నచోట చెట్లు వుండవు
కేవలం ఆలోచనలుంటాయి
మనలో ప్రతీ ఒక్కరూ ఒక గుహ వంటి మనిషి
మూసిన కిటికీ ఒకటి
తక్కిన ప్రపంచమంతా అవతల
కిటికీ తెరిచిన తరువాత చూడబోయే
ఆ ప్రపంచం గురించి ఒక కలగంటావు
కిటికీ తెరిచిన తరువాత చూసిన ప్రపంచం
నీవు కలగన్నది కాదని తెలుసుకుంటావు