ఫూల్ ఔర్ కాంటే

అది నిజంగా మట్టి మనుషుల మహాసంగ్రామమే. సంగ్రామ ఘటనలను, చరిత్రలోని రైతుల పోరాటాలను, కొత్త చట్టాల నిగ్గును తేల్చే ఓ చిన్ని పుస్తకంలో పదునైన సమాచారం పరిచయం వుంది. సగటు మనిషి జీవితం ముళ్ళ బాట కావటానికి, కులవృత్తుల మరణానికి, వస్తు మార్పిడి విధానం అంతానికి కారణమైన ప్రపంచీకరణ ప్రైవేటీకరణ సరళీకరణను ఎండగడుతూ, ప్రజల చైతన్యంతో సాగే ఏ ఉద్యమమైనా తీరాలను తాకి జయ కేతనం ఎగుర వేస్తుందని చెప్పే ప్రయత్నమే ఈ పుస్తక సారాంశం. పెట్టుబడి విషాన్నైనా కొనిపిస్తుంది అమ్ముతుంది వంద శాతం కంటే ఎక్కువ లాభం వుంటే చంపటానికైనా వెనుకాడదనే విషయాన్ని తేట తెల్లం చేసిన ఘటన రైతుల ఉద్యమం పై సాగిన దమన కాండ. ఎండా కాలంలో ఇల్లిల్లూ విత్తనాల కోసం తాము పండించుకున్న ధాన్యం లోనే ఎన్నుకునేది. ఆ పరిజ్ఞానం రైతు సొంతం. టెక్నాలజీ పేర పునరుత్పత్తి లేని గింజలను మార్కెట్ లో అమ్మి కోట్లకి పడగెత్తింది పెట్టుబడి అలాగే మొలకెత్తని, ఏపుగా పెరిగి కాయలే కాయని విత్తనాలు చూసిన చరిత్ర రైతులది. ఒక వస్తువు ను తయారు చేసిన వ్యక్తి ఉత్పత్తి మార్కెటింగ్ వ్యయాన్ని బట్టి ఖరీదు నిర్ణయించుకునే అధికారం ఉన్నది. కాని పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర సైతం పొందలేని రైతు దీనావస్థ ను సూటిగా ప్రశ్నించారు నివేదికలో. దేశ జిడిపి లో 20 శాతం సమకూరుతున్న వ్యవసాయ రంగం పై కార్పోరేట్ కన్ను పడటమే నూతన వ్యవసాయ చట్టాల రూపకల్పన అని చాటారు. దేశంలో యాభై శాతం పైగా వ్యవసాయం మీద ఆధార పడి జీవిస్తున్న రైతులను1960లో మొదలైన కాంట్రాక్ట్ పద్ధతి వ్యవసాయం నుండి 1990 లో పెప్సికో పంజాబ్ హర్యానా లో టమాటా ఆలుగడ్డ ల వ్యవసాయం చేయించి ఆ తర్వాత అదే రైతుల పై పెప్సికో ఆలు గడ్డల పేటెంట్ మాదేనని కేసులు పెట్టిన ఘన చరిత్రను కళ్ళ ముందుంచారు.

బిల్లులను పార్లమెంట్ ఆమోదించే ముందు పార్లమెంటరీ కమిటీలకు రిఫర్ చేసే సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఏకపక్ష నిర్ణయాలను తీసుకున్న విధానాలని సోదాహరణంగా గత పార్లమెంట్ల డాటాను వివరిస్తూ నియంతృత్వాన్ని ఎండ గట్టారు. చిన్న కమతాల రైతులు పండించే పంట కి సరైన ధర లభించక దళారీ వ్యవస్థ లో ఇప్పటికే నష్ట పోతుంటే ట్రేడ్ అండ్ కామర్స్ ఆధారంగా తేదలచుకున్న వ్యవసాయ చట్టాలు రాజ్యాంగ ఉల్లంఘనయే అని స్పష్టంచేశారు. దాదాపు 41 సంఘాలు తలపెట్టిన రైతు మహోద్యమంలో నాలుగు వందల పైగా సంఘాలు పాల్గొని ముందుకు సాగించిన తీరు ని నయా ఇతిహాస్ వ్యాసంలో పొందుపరిచారు. ఎముకలు కొరికే చలిని తట్టుకుంటూ ట్రాక్టర్ ట్రాలీ లే నివాసాలు గా ఏర్పరుచుకుని తమ భూముల్లో కొంత భాగం అమ్మేసి ఖర్చు పెట్టుకుంటూ ఉద్యమాన్ని నిలబెట్టిన రైతుల నిబద్ధతను నూతన ఉద్యమ గ్రామాలు వ్యాసంలో రాశారు.

1917 లో చంపారన్ వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని, 1921 మొప్లా రైతాంగ పోరాటం, 1946 తెలంగాణా సాయుధ పోరాటాన్ని సందర్భోచితంగా ఉదహరించారు. చరిత్ర నేటి మహోద్యమానికి మార్గం గా పరిగణించవచ్చు. మూడు కొత్త చట్టాల్లోని లొసుగులను హేతువుతో సహా బైట పెట్టారు. పెట్టుబడికే అనుకూలం అని తేల్చారు. 2015-16 వ్యవసాయ గణాంకాల ప్రకారం 86.2 శాతం మంది వున్న చిన్న సన్న కారు రైతుల పాలిట ఉరియే నూతన వ్యవసాయ చట్టాల రూపకల్పన అని సోదాహరణంగా నిరూపించారు. భాష్ప వాయు గోళాలు ఇనుప కంచెలు జల ఫిరంగులు ఆపలేని ఉద్యమంలోని ప్రతి ఘట్టాన్ని వదలకుండా ఈ నివేదికలో పొందు పరిచారు. జియో సిమ్ బహిష్కరణ పిలుపే కార్పోరేట్ పై ప్రత్యక్ష యుద్దం నిస్సంకోచంగా . ట్రాయ్ గణాంకాల ప్రకారం 2020 డిసెంబర్ లో 15 లక్షల వినియోగదారులను కోల్పోయిందనే సాక్ష్యాన్ని ఉటంకించారు. పది లక్షల రైతులు పాల్గొని ఏడాది న్నర పాటు ఉద్యమాన్ని నిర్వహించటం మామూలు విషయం కాదు. 2021 జనవరిలో రిలయన్స్ సంస్థ తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని పంజాబ్ హర్యానా హైకోర్టు ను ఆశ్రయించే స్థాయిలో సాగిన ఉద్యమం. దక్షిణాది రాష్ట్రాల నుండి ఆశించిన మద్దతు లభించక పోయినా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు పాల్గొన్నాయి. కార్పోరేట్ పై సమరం పరాకాష్ఠ కి ధ్వంసమైన 1500 జియో టవర్లే సాక్ష్యం.ఒక పక్క ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతుంటే కర్ణాటకలోని రాయ్ చూరు లో 1000 క్వింటాళ్ళ సోనా మసూరిని మద్దతు ధర కన్నా 82 రూపాయల ఎక్కువకు రిలయన్స్ కొని ప్రలోభ పెట్టాలని చూసినా కర్ణాటక రాజ్య రైతు సంఘం తిప్పికొట్టిన సంగతిని బాహ్య ప్రపంచానికి తెలియ చేసారు.సోషల్ మీడియా పాత్ర కూడా ఈ ఉద్యమం లో మరువ లేనిదనే విషయాన్ని ప్రస్ఫుటంగా పేర్కొన్నారు.

న్యాయం ఎవరి పక్షం వ్యాసంలో చట్టాలను తాత్కాలికం గా నిలిపి వేస్తూ నియమించిన కమిటీ లోగుట్టు ను పసిగట్టి రైతులు నిర్ద్వంద్వంగా తోసి పుస్తూ సాగించిన ఉద్యమాన్ని వివరించారు. చట్టాలను సమర్ధిస్తూ వ్యాసాలు వ్రాసిన అశోక్ ఘులటి, ప్రమోద్ కుమార్ జోషి లను వద్దన్నారు. చట్టాల సంపూర్ణ రద్దే పరిష్కారం దిశగా సాగిన రైతుల విజ్ఞత ను ప్రశంసించారు.

అధికారానికి ఎదురెళ్లి బిజెపి ని ఓడించండి అంటూ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో రైతుల ప్రచారం అధికార పార్టీ కి వెన్నులో వణుకు పుట్టించే సంఘటన. ఫలితాలు సైతం బిజెపి కి వ్యతిరేకంగా రావటంతో నియంతృత్వ పోకడలకి బ్రేక్ పడ్డట్టయ్యింది. రిపబ్లిక్ పరేడ్ లో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి రైతు ఉద్యమాన్ని అంతర్జాతీయ దృష్టి కి తీసుకెళ్ళ గలిగారు.దేశ ద్రోహం చట్టం ప్రయోగించటం వెన్నతో పెట్టిన విద్య గా గల రాజ్యం 8 మంది పై మోపుట, ఇంటర్నెట్ సేవల నిలిపివేత మరియు ఎన్ ఐ ఎ ను ధార్మిక సంస్థల పైకి పురికొల్పుట లాంటి సంఘటనలను వ్యాసాల్లో చేర్చారు. మన్ దీప్ పునియా పై పెట్టిన అక్రమ కేసుల చిట్టా వెనుక గల సత్యాలను పాఠకులకు చేరవేసే ప్రయత్నం లో సఫలీ కృతులైన సంపాదకులు. రైతు ఉద్యమం లో అధికార అనుకూల వ్యతిరేక మీడియా లు గా విడిపోవటం జర్నలిజానికి ఓ మాయని మచ్చగా తెలిపారు.

ఉద్యమంలో వంటా వార్పు రహదార్లు వంట గదులు గా రోజూ లక్షలాది మంది కి ఆహారాన్ని సిద్దం చేయటం వెనుక గల కృషి ని సమాజం నుండి వచ్చిన సహకారాన్ని పూస గుచ్చినట్లు వివరించారు. ఢిల్లీ జల్ బోర్డ్ అందించిన నీటి సౌకర్యాన్ని, గురుద్వారా మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల చేయూత ను మరువకుండా సవివరంగా రాశారు.

సాంస్కృతిక కళా రూపాలు నిర్వహించిన పాత్రను శ్లాఘించారు. కొత్త పాటలు నాటకాలు రచిస్తూ, ప్రదర్శిస్తూ ఉద్యమానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చిన తీరును ఉటంకించారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్లు ఉద్యమంలోని వేర్వేరు కోణాలని రికార్డ్ చేసిన విషయాలను సైతం తెలియ చేసారు. స్థూలంగా ఉద్యమంలోని ప్రతి సంఘటన ను సన్నివేశాన్ని వదలకుండా కళ్ళ ముందుంచారు. రైతు ఉద్యమం లో మహిళ ల పాత్ర గురించి రాస్తూ పురుషులు రహదార్ల పై చెక్కు చెదరకుండా పాల్గొంటుంటే సాగుకు ఆటంకం లేకుండా వ్యవసాయాన్ని తమ బాధ్యత గా తీసుకున్న తీరుని విశదీకరించారు. లైబ్రరీ లు మెడికల్ క్యాంపు లు సైతం మహిళల ఆధ్వర్యంలో జరిగిన విషయాన్ని మరువ లేము. పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ గా వున్ననూ, పితృ స్వామ్య భావజాలం లో మహిళల సామాజిక స్థితి ని శాసిస్తున్ననూ అవేమీ ప్రభావం చూపలేదు. తమ కూలీ పనులు సైతం పోతాయని, కార్పోరేట్ దోపిడీ నిరంతరాయంగా జరుగుతుందనే చైతన్యం మహిళల్లో కాన వచ్చిందనే విషయాన్ని ఈ వ్యాసం లో తెలియ చేసారు. వ్యవసాయ రంగం లో ఆత్మహత్య లు7.4 శాతం కాగా, వారి ఆదాయంలో 64 శాతం ఋణాల చెల్లింపు కే సరిపోతుందని విపులంగా చెప్పారు.

యు ఎన్ ఓ ప్రభుత్వ అణచివేతను ఆక్షేపించిన విషయాన్ని, కెనడా ప్రధాని మద్దతును, బ్రిటన్ ఎగువ సభలో ఉద్యమం చర్చకు వచ్చిన విషయాన్ని నివేదిక లో చేర్చారు. సంఘీభావం తెలిపిన నటులు పర్యావరణ వేత్తల ను జర్నలిస్టులను ఎవరినీ మరువకుండా ఈ పుస్తకంలో గుర్తు చేసుకున్నారు. ది న్యూయార్క్ టైమ్స్ సంపాదకీయాన్ని ప్రచురించారు. గ్రెటా థన్ బర్గ్ పై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టినా నేను రైతుల పక్షమేనని ప్రకటించిన విషయాన్ని, కెనడా పాఠశాలల్లో పాఠ్యాంశాలు గా చేర్చిన తీరు ఉద్యమానికి దన్నుగా నిలబడిన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించ వచ్చు.

అన్నదాత పై చైనా పాకిస్తాన్ ఏజెంట్ ముద్ర, పంజాబ్ కే పరిమితమని దుష్ప్రచారం, ప్రతిపక్షాలు డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయని రాజ్యం కుయుక్తులు పన్నినా రైతు ఉద్యమం ముందుకే సాగింది. అంతర్జాతీయ మానవహక్కుల దినం సందర్భంగా రైతులు రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని ఏక్తా ఉగ్రహాన్ చేసిన డిమాండ్ తో ఉద్యమం కొత్త పుంతలు తొక్కిందనే సంగతిని బహిర్గతం చేసారు.

కేవలం ప్రతిభ తో ఎదగని సెలబ్రిటీలు రాజ్యానికి వత్తాసు పలికిన ప్రకటనలను కూడా పుస్తకంలో చేర్చి ఎవరు ప్రజాపక్షం ఎవరు కాదో తెల్సుకునే అవకాశాన్ని ఈ నివేదిక కల్పించింది. ఎన్ని కుట్రలు జరిగినా, కారుతో తొక్కించినా, రోడ్ల పై మేకులు దిగ్గొట్టినా చివరంటా పోరాటాన్ని నడిపి రాజ్యం తల వంచి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుని రద్దు చేసే దాకా సాగిన అలుపెరుగని పోరాటాన్ని నివేదిక రూపంలో తీసుకొచ్చి భావి తరాలకు ఓ పోరాట పటిమని అందించారు సంపాదకులు. క్రాంతి సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకం లో ఈ ఉద్యమ స్ఫూర్తి తో ఎన్ ఆర్ సి, సి ఎ ఎ లకి వ్యతిరేకంగా కదలాలనే సందేశాన్ని ఇచ్చారు.

కాపీల కోసం
bit.ly/chaayaabooks
All leading book shops
అమెజాన్ లో కూడా
వెల 120/- రూపాయలు

పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. విద్యార్థి దశలో ఎస్. ఎఫ్. ఐ. లో పని చేశారు. సామాజిక ఆర్థిక సమస్యలను కవితా వస్తువులు గా తీసుకుని  కవిత్వం రాస్తున్నారు.  వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

Leave a Reply