ఫాసిస్టు సందర్భంలో మౌనాన్ని బద్దలు కొట్టే కవిత్వం

మొదట ఈ కవితా సంపుటి శీర్షిక పాఠకులను ఆకర్షిస్తుంది.‌ “రాయగూడని పద్యం” అంటే ఏమిటీ? ఎందుకు ఈ పుస్తకానికి ఇలాంటి టైటిల్ పెట్టారు? అని సందేహం కలుగుతుంది?

అయితే సావకాశంగా పుస్తకం చదివి ఆలోచించినపుడు, ఈ శీర్షిక ఈ పుస్తకానికి వన్నె తెచ్చిందని అర్థమవుతుంది.

ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో ఎలాంటి రచనలు చేయాలి? రచయితలు సమాజానికి బాధ్యత పడి రచనలు చేయాలా? వద్దా? అనే శంక ప్రతి కవికి కలుగుతుంది. ఎందుకు బాధ్యత పడాలి ఎవరైనా సమాజానికి!? ఎందుకంటే మనకన్నీ సమాజమే సమకూర్చి పెడుతుంది కాబట్టి! మనం పుట్టిన సమాజం చెడిపోకుండా, అభివృధ్ధి నిరోధకతలో పడిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం మొదట గుర్తించేది కవూలూ-రచయితలే! మౌమితా ఆలం ఇటీవల ఓ మాట అన్నారు “చుట్టూ సమాజం రగిలి పోతూంటే చందమామ అందం మీద కవిత్వం రాయలేను” అని. ఈ మాటకి బలమైన ఉదాహరణ ఈమె కవిత్వం.

“ఇంతకూ నేను బతికి ఉన్నట్టా చనిపోయినట్టా స్పందనా తంత్రులు చచ్చు బడ్డాక ఏదైతే ఏంది?” (నేనెవర్ని)

ప్రజా రాజకీయాలు ప్రజలకు బాధ్యత పడినట్టే కళాకారులూ బాధ్యత పడాలి. అలా కాని పక్షంగా బతికి ఉన్నా చనిపోయినట్టే మౌమితా ఆలం కవిత్వంతో అటు ప్రభుత్వాన్నీ ఇటు సమాజాన్ని నిలదీస్తూనే మౌనంగా ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తుంది. కవుల అక్సరాల్లో అంతరాత్మని నిద్ర లేపుతుంది.

ఈ కవిత్వం బాధ్యతతో, బాధతో ,ఆగ్రహంతో రాయబడిన కవిత్వం కాబట్టి రాస్తే ఇలాంటి పద్యం రాయాలి! లేదంటే లేదు. ఏమీ రాయాలి? ఏమేమి రాయకూడదు? ఇందులోని కవిత్వం రెండింటి మధ్య తేడాను బహిర్గత పరుస్తుంది. ఈ తేడా తాత్వికమైనది. ఈ తాత్వికత జనం జీవితం నుంచీ, మరీ ముఖ్యంగా కడజాతి, మైనారిటీ ప్రజల జీవన సంక్షోభాలను అర్థం చేసుకోవడం లోంచి సాధించింది. “పుట్టుకకొక అర్థం లేదు చావుకొక గుర్తింపు లేదు చావు పుట్టుకల మధ్య బతుక్కొక ఇజ్జత్ లేదు.” సాధారణ మనిషి. ప్రాణం ఎంత విలువరాహిత్యమైందో చెప్పే వాక్యాలివి.

అలా చూసినప్పుడు ఈ కవిత్వం ఒక బలమైన రాజకీయ ప్రకటన! రాజ్యం ప్రజలను, ముఖ్యంగా ముస్లీం మైనారిటీలు, దళితులు, మహిళలు, ఆదివాసీల సాగిస్తున్న దమనకాండ చూపు ఉన్న కవిని ఉద్వేగానికీ, కోపానికీ గురిచేయడం సహజమైన విషయం. అంతే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజంలో ఈ విధ్వంసకర పరిణామాల పట్ల స్తబ్దతా-నిశ్శబ్దం ఆవరించి ఉన్నప్పుడు, కొంత మందినైనా రాజ్యస్వభావం కలుషితం చేయడం, ఒక సమూహం తన బాధ్యతను విస్మరించడం వల్ల కలిగిన బాధ లోంచి ఉధ్బవించింది.

“మాట్లాడాల్సిన చోట మౌనం లోకి జారుకొనే…ఎముకలు కుళ్ళిన రక్తం చ్చిన సమస్త పరాన్నజీవుల ప్రతినిధిని” అన్నపుడు ధ్వనించే అర్థం అదే!

అలా బాధ్యత పడకపోవడం వల్లే, జర్మనీ ప్రజలు మౌనం వహించడం వల్లే హిట్లర్ ఈ ప్రపంచానికి ఫాసిజం రుచి చూపాడు. రెండు ప్రపంచ యుధ్ధాలలో కోట్లమంది ప్రజల ప్రాణాలు కోల్పోయారు. యూదులు ఛిన్నాభిన్నమై పోయారు. ‌‌అప్పుడు ఆ పరిణామాల పట్ల, హింసపట్ల బహిరంగంగా నిలదీసి నిర్బంధాన్ని ఎదుర్కొన్నవాళ్ళు లేకపోలేదు.

జర్మన్ పాస్టర్ నిమిల్లర్ ఇలాంటి మౌనాన్ని ప్రశ్నిస్తూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కవిత రాశాడు. ఆ కవిత ఫాసిస్టు సందర్భంలో వాతావరణం ఎలా వుంటుందో ప్రపంచం ముందుంచింది. ఇలాంటి విధ్వంసాన్ని చూ‌స్తూ మౌనంగా ఉండడం అనే అశక్తతనే ఫాసిజం ప్రజా అంగీకారంగా ప్రచారం చేసుకుంటుంది. మోడీ నేను 400 సీట్లు గెలుస్తాను అనే ప్రకటన వెనుక ఉన్న అంతరార్థం ఇదే! “ఏమయింది నీకు..లేలే మొద్దు నిద్ర తుడిచేసుకులే. ప్రశాంతతను నిషేధించబడ్డ చోట నెర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి.”

మన దేశంలో జర్మనీ లాంటి నిశ్శబ్దం లేదు నిజానికి! కనీసం కవులూ, రచయితలు, కళాకారులు ఆ మధ్య మోడీ విధానాలకు నిరసనగా అవార్డులు వెనక్కు పంపారు. మహిళా కుస్తీ క్రీడాకారులు కూడా తమ‌పై ఒక బిజెపి ఎంపీ చేసిన లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాడారు. రైతులు ఇప్పటికీ పోరాడుతున్నారు. ఆదీవాసీలైతే డ్రోన్ దాడులను ఎదుర్కొంటున్నారు. ఈ వాతావరణంలో యుధ్ధం వాసనను పసిగట్టిన వారి ప్రతిస్పందన రాజ్యాన్ని ధిక్కరిస్తుంది. అలాంటి ధిక్కారమయ కవిత్వం ఇదీ.!

“మోగనీ మోగనీ మర ఫిరంగులు మోగనీ యుధ్ధ కవాతులు రేగనీ ప్రియా నిర్బంధం సాక్షిగా నేను నిన్ను ముద్దాడనీ”

అయితే ఇంకా శబ్దం ఇంకా గట్టిగా వినపడాలి! ఇంకా గట్టిగా ప్రజల్లో చైతన్యం నింపాలి. ఎంత గట్టిగా అంటే మౌమితా ఆలం కవిత్వం అంత ప్రతిధ్వని జనం కంఠంలో వినపడాలి!

రాజ్యం లేదా ప్రభుత్వం దృష్టిలో రాజ్యాన్ని నిలదీసే ప్రశ్నలు కానీ, రాతలు కానీ రాయడానికి వీల్లేదని అలా చేస్తే ఉపా చట్టం ద్వారా నిర్భింధించే అవకాశం ఉందనీ మన “భారత రాజ్యం” పుట్టినప్పటి నుండీ, మరీ ముఖ్యంగా ఇందిరాగాంధీ మొదలు ఇప్పటి మోడీ ప్రభుత్వం దాకా ఎదుర్కొంటున్న పరీక్షే!

ఈ స్పష్టత ఈ కవితా సంపుటి లో మనకు అడుగడుగునా కనబడుతుంది. కవయిత్రి ప్రభుత్వం చేసే దాష్టికాలను ప్రశ్నించి తీరాలి, అనే ఒక రాజకీయ ఉద్ద్యేశాన్ని ఇందులో లోని కవిత్వం ద్వారా మన ముందుంచుతుంది. “మనువాదం మతవాదం జత కలిసి వికృత నాట్యం చేసే చోట మీరు ఆమెను కత్తులకెర చేస్తూనే ఉన్నారు…. ఇంకెప్పుడు మారుతారు రా ఇంకెన్ని సార్లు కన్నతల్లిని చితకబొడుస్తారు.”దేశాన్ని ఇంకెంతగా నాశనం చేస్తారు అనే ఆగ్రాహాన్ని తన కవిత్వం లో పలికిస్తుంది.

ఈ రాజకీయాలు మనం కోరుకునే రాజకీయాలేనా? లేదా మన పై రుద్దబడ్డాయా? అనే ప్రశ్నలు మనం వేసుకోవాల్సిందే!

అందుకే ఇప్పటి రాజకీయాలపై స్పష్టత అవసరం.

ఈ రాజకీయాలు మనకు ఏం చేస్తున్నాయీ? ఏం ఇస్తున్నాయీ?

అసమానతలూ, మతతత్వం, కులోన్మాదం మనుషుల మధ్య గోడలు కడుతున్నపుడు వీటిని అధికారం కోసం ఉపయోగించుకుంటున్నపుడు, ఈ రాజకీయాల ఔన్యత్యాన్నీ, వీటిని కొందరు ఉపయోగించుకుంటున్న విధానాన్నీ ప్రశ్నించి తీరాలి! అనే ఉద్వేగ స్వరాన్ని ఈ కవిత్వం తనలో నిక్షిప్తం చేసుకుంది. ఇది వ్యక్తిగా తాను కోరుకుంటున్నది కాదు ఒక సమూహంలో భాగంగా ఉండి ఆ సమూహం పడుతున్న యాతనను బహిర్గతం చేసుకోలేని అశకత్తను అర్థం చేసుకొన్నది కాబట్టే ఇంత బలమైన కవిత్వం రాయగలిగింది. ఈ క్రింది వాక్యాలు చూడండి.

“ఒరేయ్ మందిరం పేరు మీదనో మసీదు పేరు మీదనో ఒట్లడగనీకీ వచ్చిన ప్రతిసారీ మీరు ఆమెను చంపుతున్నారు” , “పేపర్ మీద అభివృధ్ధి సూచిక మిరుమిట్లు గొలుపుతూ పైపైకి పాకుతుంది ఎవడ్రా అక్కడ ఖాళీ గిన్నెలు చప్పుడు చేసేది సుసంపన్న దేశం మనది.” దేశాభివృద్ధి లోని డొల్లతనాన్ని కవిత్వం చేయడానికా అవసరమైన అవగాహన పుష్కలంగా ఉన్న కవి మౌమిత ఆలం. “స్వేదం, అభద్రత,నిర్భంధం దేశం మాకిచ్చిన హోదాలు.” దేశంలో శ్రమ జీవులకు ఏ ఫలితం దొరుకుతుంది? వివరించే వాక్యం.

మనది ఒక లిబరల్ ప్రజాస్వామిక రాజ్యాంగం. ఇక్కడ మనుషులందరూ సమానమనేది ఒక రాజ్యాంగ విలువ.

కానీ ఇప్పుడు బిజెపి ప్రభుత్వం వచ్చాక ఏ విలువల మీద మన రాజ్యాంగం నిలబడిందో, ఏ లౌకిక ప్రజాస్వామ్యాన్ని ఎత్తపట్టవలసి ఉందో, మన రోజువారి జీవితంలో ఆచరించదగ్గ మౌళిక సూత్రాలను అందించిన లిబెరల్ ప్రజాస్వామిక సైధ్ధాంతిక పునాది ఇప్పుడు బీటలుబారుతోంది. మన రాజ్యాంగం, మన ప్రజాస్వామ్యం ప్రమాదం లో పడింది అని అర్థం అవుతోంది.

ఈ నేపధ్యంలో ప్రజలు ఎలా ఆలోచించాలి? రచయితలు ఏం రాయాలి? దీని చుట్టూ అల్లిన ఒక తాత్విక అల్లిక ఈ కవిత్వం. నిజానికి రచయితలు, కవులు మన సంపద. ఎందుకంటే మన దేశంలో మీడియా చచ్చిపోయింది. రవీష్ కుమార్ లాంటి పాత్రికేయులు, కవులు,రచయితలు, బతికే ఉన్నారు. వాళ్ళు బలమైన వాదనతో ఈ రాజ్యానికి ఉన్న ఫాసిస్టు కోణాన్ని నిలదీస్తున్నారు.

“మర్చిపోవద్దు నేను ప్రేమను మొక్కవోని విశ్వాసాన్ని హిజాబ్ ధరించే అమ్మాయిని” , ” కానీ మేమిక్కడ ఉంటాం తుఫాను గడిచాక నిఠారుగా నిలబడే గడ్డిపోచల్లాగా సడలని మా ఆత్మ విశ్వాసం తో కదం తొక్కుతుంటాం. మశీదులో నిర్భయంగా అజా వినిపిస్తాం.”

ప్రజలకు మంచి చదువు సత్యం తో నిండి జ్ఞానం మంచి ఆలోచనలు చేసేలా ప్రభుత్వాలు కృషి చేయాలి అని నేటి రచయితలు, కవులు కోరుకుంటున్నారు. దాని కోసం ధైర్యంగా గళం విప్పుతున్నారు.

ప్రజా సంక్షేమం కోసమే పుట్టిన సిధ్ధాంతాలు చాలానే ఉన్నాయి. వాటిని అటు సమాజమూ ఇటు ప్రభుత్వం అధ్యయనం చేయాలి అనేది ఈనాటి అవసరం. ఆ అధ్యయనం ద్వారా పొందిన జ్ఞానాన్ని పదుగురికి పంచాలి. ఇదొక ప్రాసెస్ ఈ ప్రాసెస్ దేశ ప్రగతిని నిర్ణయిస్తుంది. ప్రగతి అంటే మళ్ళీ ఏమిటీ? విశాలమైన రోడ్లు, కొందరికే ఉపయోగపడే బుల్లెట్ ట్రైన్ లు, వందేభారత్ లు కాదు. మన బౌధ్ధికాభివృధ్ధి, మానసికాభివృధ్ధి ఎలాంటిదీ అని? మన ఆలోచనలు ఎంత ఉన్నతమైనవి అనీ…

పరమతస్థుల పట్ల మన ధోరణి ఎలా ఉంటుంది? పేదల పట్ల, దళితులు, ఆదివాసీల పట్ల వాళ్ళ సమస్యల పట్ల మన ఆలోచనలు ఎలా ఉంటాయి? మన దేశంలోనే పక్క ప్రాంతాల వారి గురించి మనం ఎలా ఆలోచిస్తాం?
పక్కదేశాల గురించి మన ఆలోచనలు ఎలా ఉంటాయి? మహిళల పట్ల మన ధోరణి ఏమిటీ? మహిళలు ఈ సమాజంలో ఎంత స్వేచ్ఛగా ఉన్నారు? ఈ అంశాలతో ఇంకా అనేక అంశాలు వస్తువులుగా మౌమితా ఆలం కవిత్వం రాసింది.

ఆ లెక్కన ఆమె మన సమాజంలో ఒక బాధ్యతాయుతమైన కవి పాత్ర పోషిస్తున్నది. అంటే ఇందులో సమకాలీన సమస్యలన్నింటినీ వస్తువులుగా తీసుకున్నది. లవ్ జిహహాద్ మీద, యుధ్ధానికి వ్యతిరేకంగా, రాజ్యనిర్భందానికి వ్యతిరేకంగా, కేవలం ముస్లీం అయినందుకు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీదా, మహిళల సమస్యల మీదా, వివి, సాయిబాబాలాంటి వాళ్ళ అక్రమ నిర్భంధాన్ని ప్రశ్నించే కవితలు, కాశ్మీర్ సమస్య మీద, యుధ్ధంలో పిల్లలు పడే యాతన మీద, పాలస్తీనా పై ఇజ్యాయిల్ దురాక్రమణ‌మీద, ఇన్ని జరుగుతున్నా పట్టించుకొని ప్రజల మౌనం మీద, తండ్రులు తల్లులపై చేసే హింస మీదా, మైనారిటీ తిరని అమ్మాయిలపై సొంత బంధువులు చేసే లైంగిక దాడుల మీదా, ముస్లీం మహిళల గురించి..కౌవ్ స్లాటర్ అనే నెపంతో దళితుల మీద , ముస్లీం ల మీదా జరుగుతున్న దాడుల గురించి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయుల గురించీ, మొత్తానికి ప్రపంచం దృష్టిలో మన దేశ గౌరవ మర్యాదలను దెబ్బ తీస్తున్న అంశాలన్నింటి మీదా ఈమె కవిత్వం రాసింది. చాలా ధైర్యంగా స్పష్టంగా చెప్పదలుచుకున్న అంశాన్ని సూటిగా కొద్దిగా కవిత్వం చదువుకున్న వారికి కూడా అర్థం అయ్యేలా రాయగలిగింది.

ఈ కవిత్వం చదవడం ద్వారా మన చూపు ఇంకా విశాలంగా విచ్చుకుంటుంది.

ఇలాంటి కవిత్వాన్ని అనువాదం చేసినందుకు ఉదయమిత్ర గారికీ ఈ పుస్తకం వేసినందుకు మాతృక పత్రిక వారిని అభినందించాలి. ఉదయమిత్ర అనువాదాన్ని ఎక్కడా బిగువు కోల్పోకుండా నిర్వహించగలిగారు. అందరూ తప్పక చదవవలసిన కవిత్వం.

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

Leave a Reply