ఫాసిస్టుల అవకాశవాద ఆలింగనం

గుజరాత్ మారణకాండుకు (2002 లో) ముఖ్య కారకుడని నరేంద్రమోడీని తన దేశంలోకి రానివ్వమని తొమ్మిదేండ్లు (2005-2014) నిషేధం విధించిన అమెరికా, మొదటిసారి తాను ప్రధాని కాగానే ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. 2014 లోనే అమెరికా పర్యటన చేసి అప్పటి అధ్యక్షుడు ఒబామాతో వైట్ హౌస్ లో ప్రైవేట్ డిన్నర్ చేసి ప్రపంచ దేశాల కండ్లలో పూర్తి పునరావాసాన్ని పొందగలిగాడు మోడీ. తర్వాత 2015 లో ఫేస్ బుక్ ముఖ్య కార్యాలయంలో, 2016లో అమెరికన్ కాంగ్రెస్ లో ప్రసంగించి తన ఆవభావ ప్రదర్శన చేయగలిగాడు. మరలా రెండోసారి ప్రధాని అయ్యాక సెప్టెంబర్ చివరి వారంలో అమెరికా వచ్చిన మోడీకి ఘనస్వాగతం పలకడమే కాకుండా అధ్యక్షుడు ట్రంప్ మోడీని “దేశ పిత” గా అభివర్ణించాడు. ట్రంప్ మాటలకు అర్థాలు ప్రతి క్షణం మారుతుంటాయి కాబట్టి, అది పెద్దగా ప్రధాన్యత ఇచ్చే మాటగా మిగులకపోవచ్చు. కాని ఆ ఇద్దరి ఆలింగనం మాత్రం ప్రపంచానికి ఒక సంకేతాన్ని పంపిస్తుంది. అదేమంటే ఫాసిజం ఇక “ప్రధాన స్రవంతి” రాజకీయం కాబోతుందని. దానికి ప్రపంచ పాలక వర్గ వేదికలు సహితం హారతులు పట్టి స్వాగతం పలకబోతున్నాయని.

ఈ ఫాసిస్టుల కలయిక అంత ఆశ్చర్యాన్ని కలిగించేది ఏమి కాదు. ఎందుకంటే ట్రంప్, మోడీ ఇద్దరికి ఇద్దరూ తమ అతిజాతీయవాదం (ultra-nationalism) మీద, ద్వేష రాజకీయల మీద అధారపడి అధికారంలోకి వచ్చారు. ఇద్దరూ తమ దేశాల గత “ఘన కీర్తిని” పునర్నిర్మాణం చేయాలనే నినాదాన్ని ఎత్తుకున్నవాళ్ళు. ఒకే సమాజంలో తనతో ఏకీభవించే వాళ్ళను “మనము”గా, భిన్న స్వరాలు ఉన్న వారిని “వాళ్ళు”గా విభజన చేసి తమ రాజకీయ బేస్ ను ఇంకా గట్టి పరుచుకుంటున్నవాళ్ళు. ఇద్దరూ కూడా నిన్నటి వరకు అమలైన అనైతిక పాలనకు వ్యతిరేకులమని, ఇక నేటితో దేశ ప్రయోజనాలు కాపాడే “స్వచ్ఛమైన” “దేశీయమైన” పాలన కొనసాగుతుందని నమ్మబలికేవాళ్ళే. ఇద్దరూ చారిత్రక మలుపులో ఉన్నామనో, చరిత్రను మార్చేస్తామనో నినాదాలు చెప్పడంలో మంచి దిట్ట. ఇద్దరూ అన్ని రకాల అసమ్మతి గొంతుకలను నేరంగా భావించేవాళ్ళే. ట్రంప్ గ్లోబల్ వార్మింగ్ ఒక భూటకం అంటే, మోడీ గోమూత్రం సర్వరోగ నివారిణి అనే అహేతుకతను, అశాస్త్రీయ వాదనలను ప్రజల్లోకి పంపుతున్నారు. ఇద్దరూ సోషల్ మీడియాను తమ అసత్య ప్రచారాల కోసం విచ్చలవిడిగా వాడేవాళ్ళే. ఇద్దరూ ఫాసిజాన్ని ఒంటినిండా నింపుకోని అన్ని “ప్రజాస్వామిక” సంస్థలను (మీడియా, న్యాయవ్యవస్థతో సహా) తమ వర్గ ప్రయోజనాల కోసం నిర్వీర్యం చేస్తున్నవాళ్ళే. వీటన్నింటిని మించి ఈ ఇద్దరి వ్యవహారమంతా పూర్తిగా నిజమని భావించే ఒక మూఢ భక్తుల మూక పెద్ద ఎత్తున తయారవుతుంది. ఈ మూక తమకు ఉండాల్సిన కనీస మానవ మర్యాదను (minimum human decency) కూడ మరిచిపోయి నాజీలను పొగిడే వరకు పోయింది. అదే మూక టెక్సాస్ లో జరిగిన ఫాసిస్టు సమ్మేళనానికి మందలా తరలిపోయింది.

మోడీ-ట్రంప్ ల సభకు దాదాపు యాభై వేల మందిని తరలించారని ఒక అంచనా. ఆ సభకు పెట్టిన పేరు “Howdy, Modi!” (ఎలాగున్నారు, మోడీ!). దీనికి సమాధానంగా “దేశమంతా బాగుంది” అని ఆ సభలో మోడీ ప్రకటించాడు. ఆ ఒక్క మాటతో రోజురోజుకు దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థ పైకి ఎగబాకుతున్నట్లు, నిత్యం కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలు ఆగిపోయినట్లు, నిరుద్యోగులు పొద్దున్నే లేచి కొలువుకు పోయినట్లు, దారిద్ర్యరేఖ అడ్రస్ గల్లంతయినట్లు, మహిళపై హింస, లైంగిక అత్యాచారాలు ఆగిపోయినట్లు, ప్రజాస్వామ్యం వికసిస్తున్నట్లు, పౌరహక్కులు అడగక ముందే రాజ్యం హామీ పడుతున్నట్లు, కాశ్మీర్ శాంతి, అభివృద్ధి కోసం తనకు తానుగా ఢిల్లీ ముందు మోకరిల్లినట్టు భ్రమ పడిన భక్తులు కరతాళ ధ్వనులతో ఆనందం వ్యక్తం చేశారు. అది విన్న ట్రంప్ దేశానికి మోడీ తండ్రి మాదిరిగా అందరికి సమన్యాయం చేస్తున్నడని ప్రకటించి ఆ మహా డ్రామను మరింత రక్తికట్టించిండు.

ఈ డ్రామలు ట్రంపుకు కాని, మోడీకి కాని కొత్తేమి కాదు. వాస్తవానికి వీళ్ళను ప్రజల్లో నిలబెడుతున్నవి ఈ నిత్య డ్రామాలే. ఇవే వాళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులనుండి కాపాడుతున్నవి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి (meticulous గా) చేస్తున్న పనులే కాని యాధృచ్చికంగా (random) చేసే నాటకాలు కావు. వీటి వెనుక ఇద్దరి ప్రయోజనాలు దాగి వున్నవి. ప్రపంచం కన్నుల్లో శక్తివంతుడు, బుద్ధిమంతుడు (తండ్రిలాంటి వాడు!) అనే ఇమేజ్ మోడీకి చాలా అవసరం. దాని ముసుగులో దేశంలో ఎంత నెత్తురైనా ప్రవహింపచేయొచ్చు. అమెరికా అధ్యక్షుడే మంచి కితాబు ఇస్తే ఇక తిరుగుండదు. అంతేకాదు ప్రవాసంలో ఉన్న కాషాయ శక్తులను ఒక్కదాటి మీదికి తెస్తే వాళ్ళు సమకూర్చే సాంకేతిక, ఆర్థిక వనరులు హిందుత్వకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతాయి. ఇక ట్రంప్ కు రానున్న ఎన్నికల్లో అమెరికన్ హిందువుల ఓట్లు అవసరం కాబట్టి ముందే వాళ్ళకు మోడీ రూపంలో గాలం వేసే ప్రయత్నం చేసిండు. అయితే ప్రవాస భారతీయుల కపటబుద్ధి (hypocrisy) ట్రంప్ కు అర్థం కాదని అనుకోలేము. కపటబుద్ధి అనడం ఎందుకంటే మెజారిటి ప్రవాస భారతీయులకు దేశంలో మోడీ కావాలి, కాని అమెరికాలో మాత్రం ట్రంప్ వద్దనుకుంటరు. కారణం ట్రంప్ “బయటి” వారి పట్ల తీసుకున్న వివక్ష పూరిత విధానాలు. ఇలాంటి రాజకీయాలే మోడీ తమ దేశంలో చేస్తే స్వాగతిస్తరు, ఎందుకంటే తమను తాముగా మెజారిటీ లో భాగంగా చూసుకుంటరు కాబట్టి.

వీటికి తోడు ట్రంప్ మోడీకి అంత ప్రాధాన్యత ఇవ్వడంలో అమెరికా ఆర్థిక ప్రయోజనాలు కూడా వున్నాయి. మోడీ పర్యటనకు కొద్ది ముందే చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న 22 డ్రోన్ ల కొనుగోలు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో ఆ డ్రోన్లను అమెరికా నుండి కొనే డీల్ పూర్తయ్యింది. దీనికి తోడు మరో నలభై రెండు వేల కోట్ల ఆయుధ పరికరాలను కొనే ఒప్పందాలు కూడా కుదిరినట్లు అమెరికన్ పత్రికలు రాస్తున్నాయి. ఈ ఆయుధాలన్నీ రేపు ప్రజా ఉద్యమాలను అణిచివేయడానికి, “టెర్రరిజం” పేరిట ప్రజలను భయబ్రాంతుల చేయడానికి వాడబోయేవే.

అయితే ప్రవాస భారతీయులంతా మోడీ భక్తులు కారు. ఎందరో ప్రగతిశీల, సెక్యులర్, ప్రజాస్వామిక వాదులు మోడీ పర్యటనకు అడుగడుగున తమ నిరసనను తెలిపారు. టెక్సాస్ లోనే కాదు, ఐక్యరాజ్యసమితి జెనరల్ అసెంబ్లీ లో మోడీ ఉపన్యాసాన్ని నిరసించడానికి దాదాపు ఇరవై ఐదు వేల మంది దేశం నలుమూలల నుండి వచ్చారు. అలాంటి నిరసన ఈ మధ్య కాలంలో ఏ దేశ ప్రధాని లేదా అధ్యక్షుడు ఎదురుకోలేదు. ఆ నిరసనకారులు కేవలం భారతీయులు మాత్రమే కాదు, అమెరికన్ విశ్వవిద్యాలయాల విద్యార్థులు, అధ్యాపకులు, ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ కార్యకర్తలు, ప్రవాస పాలస్తీనియన్లు, కాశ్మీరీలు, అమెరికన్ ఆదివాసీ సమూహాలు, ఇంకా అనేక జాతులు ఆ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.

ఫాసిస్టులు మనషులను మతాలుగా, జాతులుగా, లింగాలుగా విడదీయాలనుకుంటే ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమం వారిని గొప్ప మానవీయ విలువల ఆధారంగా పోరాటంలో కలుపుతుంది. ఈ నిరసన ఉద్యమం ఒక సంఘటనగా ఆగి పోకుండా మరింత బలమైన ప్రజా ఐక్య ఉద్యమంగా నిర్మాణం చెందుతుందని ఆశిద్దాం. కేవలం ఐక్య ఉద్యమాల ద్వారనే ఫాసిస్టు భావజాలన్ని, ఆచరణను అడ్డుకోగలము.

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

One thought on “ఫాసిస్టుల అవకాశవాద ఆలింగనం

Leave a Reply