ఫాదర్

ఫాదర్, నా తండ్రీ!
మీరు ఎప్పుడు జీవితంలోకి విచ్చుకున్నారు
ఎంత అద్భుతంగా
ఎంత ఆశ్చర్యంగా విస్తరించారు

కలకూజితాల సుస్వరాల స్వాగతాలు
ముసినవ్వులూ పరుచుకున్న
ఇగురాకు పచ్చల వనాలలోకి
తొలి అడుగులతో ప్రవేశించినప్పుడా

పొదలు పొదలుగా అల్లుకున్న
జీవనానుబంధ సదృశ ఆకుపచ్చ వనాలలో
నవయవ్వనాలతో కరచాలనంచేసి
మీ హృదయంలోని ఆర్తిని తట్టిలేపినప్పుడా

వనాలమీద జనాలమీద నిలిచిన నేలమీద
నడుస్తున్న ధ్వంసరచనకి వడలిన
ముదురాకుల దైన్యజీవనానికి
కలత చెందినప్పుడా…? ఎప్పుడు తండ్రీ!

హృదయంలో శాంతి కోల్పోయి
కళ్ళలో మెరుపులు కోల్పోయి
తనకూ చేతికర్రకూ తేడా తెలియని
దుమ్ము కొట్టిన శరీరాలతో కొట్టుకులాడే
పండుటాకుల జీవనదైన్యం
మిమ్మల్ని విచలితం చేసినప్పుడా
తండ్రీ మీరెప్పుడు జీవితంలొకి విచ్చుకున్నారు

చదువులదేముంది? పట్టాలుంటాయి
అధికారాలదీ ఏముంది? అందలాలుంటాయి
కనులముందు మబ్బులై కమ్మి
ఏదీ కనబడనీయవు ఏదీ వినబడనీయవు

బహుశా మీరు చదువులను జయించి
అట్టడుగు జీవితాలలోంచి జీవనవాస్తవికతలోకి
తేరిపార చూసినప్పుడు కావచ్చు
హృదయంలోంచి జీవనదర్శనం చేసినప్పుడు కావచ్చు

అధికారకేంద్రాల అందని అగడ్తల
ఢిల్లో దర్బారు ఠీవికి
వ్యాపార సామ్రాజ్య పన్ను గడలకు
అగాధ జన జీవనాలను పోల్చి
కలతలలో కన్నీళ్ళలో
ఎండిన పెగలని రాలిపడిన గొంతుల ఆర్తరావంలో
దైవ దర్శనం చేసినప్పుడు కావచ్చు

ధనానిదేముంది?
దోపిడీ సామ్రాజ్యబానిస
అధికారానిదేముంది
అభివృద్ధి పొరలు కప్పి
పీడనకు ఊడిగం చేసే బానిస
ఈ మర్మం
మీ అంతరంగాన్ని తాకినప్పుడు కావచ్చు
ఈ ఎరుకతో మీరు
ఆదివాసిని అక్కువ చేర్చుకున్నప్పుడు కావచ్చు
నా తండ్రీ!
అక్కడే కదా మీ జీవితం మొదలైంది

సాటి మనిషి సౌఖ్యం తప్ప కోరికలులేని
మీ సార్థక జీవనాన్ని నిర్బంధించిన చోట
పక్కమనిషి మూలుగులు మీరు ప్రపంచానికి వినిపించారు

కరోనా విషక్రిమికి మిమ్ము ఎరవేసినచోట
మీ శరీరాన్ని రణక్షేత్రం చేసి గెలిచారు
ప్రాణప్రదమైన చివరాఖరి క్షణాల
జీవితానికింత స్వేచ్చకోసం
ప్రాణప్రదమైన మనుషుల కౌగిలింతల కోసం
న్యాయపీఠం మీద గొంతెత్తారు
ఏమడిగారని
కలిసి బతికిన మనిషితో కదా
కలపమన్నారు
న్యాయం మిమ్మల్ని మట్టిలో కలిపింది
మనిషంటే మట్టి కదా

నాతండ్రీ!
మీరు ఇప్పుడు మొదలయ్యారు
అసలైన అర్థంలో
మానవీయ శిఖిరాలమీద
మీ జీవనకాంతుల్ని మేము మట్టిలో దర్శిస్తున్నాము

(ఫాదర్ స్వామికి వినమ్రంగా)

Leave a Reply