ప్రైవేట్ విద్యా సంస్థ‌ల్లో ఉపాధ్యాయుల వెత‌లు

గత కొన్ని సంవత్సరాలుగా విద్యారంగానికి సంబంధించిన సలహాలు, సూచనలు, ప్రతిపాదనలతో, విమర్శలతో కూడిన సాహిత్యం ఇబ్బడి ముబ్బడిగా వస్తూనే ఉంది. అయితే విద్యారంగంలో అత్యంత కీలక పాత్ర వహిస్తారు ఉపాధ్యాయులు. విద్యారంగాన్ని ప్రైవేట్ పరం చేసి, ప్రైవేట్ విద్యాసంస్థలను అత్యధికంగా ప్రోత్సహిస్తున్న నేటి తరుణంలో ప్రైవేట్ విద్యా సంస్థలలో ఉపాధ్యాయుల స్థితి గతులు ఎలా ఉన్నాయో ఒక్క సారి పరిశీలిద్దాము. ఒక ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న రేణుక (పేరు మార్చాను) తన అనుభవాలను ఇలా చెప్తోంది.

ఏదైనా ఒక కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలలో జాయిన్ అవ్వాలంటే ముందుగా వాళ్ళు నిర్వహించే అర్హతా పరీక్షను రాయవలసి ఉంటుంది. అక్కడ ఉండే ప్రిన్సిపల్స్, హెచ్.ఓ.డి లు అర్హతా పరీక్షను నిర్వహించి మార్కులు వేసి రిపోర్ట్ ను మేనేజ్‌మెంట్ కు పంపుతారు. మేనేజ్‌మెంట్ తన ఇష్ట ప్రకారం మాత్రమే టీచర్లను ఎంపిక చేసుకుంటుంది. ప్రతి సంవత్సరం మార్చి దాకా అగ్రిమెంట్ ఉంటుంది. మార్చి నెల దాకా జీతాలు ఇస్తారు. ఏప్రిల్ నెల జీతం ఉండదు. ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల లోని ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో వాళ్ళు నిర్వహించిన అర్హతా పరీక్షలో “0”మార్కులు వచ్చిన ఆమెను టీచర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. టీచర్ సెలక్షన్ లో ఉన్నత విద్యార్హతలూ, అనుభవం ఇలా ఏమేమి అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు అంటే… ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే… ఒక్కోసారి తక్కువ జీతం ఎవరైతే కోట్ చేస్తారో వాళ్ళకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంది మేనేజ్‌మెంట్… ఉన్నత విద్యార్హతలూ, అనుభవం ఉన్న టీచర్లయినా మేనేజ్‌మెంట్ నిర్ణయించిన జీతానికి సిద్ధమైతేనే సెలెక్ట్ అవుతారు. ఎక్కువ చాకిరీ చేస్తూ, తక్కువ జీతాన్ని ఆశించటం ప్రధాన అర్హత!

టీచర్ ను సెలెక్ట్ చేసుకున్నాక సంవత్సరమంతా అదే విద్యాసంస్థలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా పని చేసేటట్టుగా అంగీకార పత్రాన్ని తీసుకుంటారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 – 6.00 గంటల దాకా పని చేయవలసిందే! ఆ తర్వాత ఇళ్ళకు వెళ్ళాక అడ్మిషన్స్ వర్క్ చేసుకోవాలి… పదవ తరగతికి ఆరు నెలల పాటు స్టడీ అవర్స్ ఉంటాయి. అప్పుడు ఉదయం 8 గంటల నుంచీ రాత్రి 8 గంటల దాకా స్కూల్ లో ఉండవలసిందే! ఇక రిజల్ట్ రాకపోతే టీచర్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. పిల్లలు ఫీజులు కట్టకపోతే కట్టించే బాధ్యత టీచర్లదే… ఫోన్లు చెయ్యాలి… లేకపోతే ఇళ్ళకు వెళ్ళి వసూలు చేసుకు రావాలి.

జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలు మొత్తం స్కూల్ లో పిల్లలను చదివించటమే టీచర్ కు ఉంటుంది. అక్టోబర్ నుండి అడ్మిషన్స్ కోసం టీచర్ ల వెతలు మొదలు అవుతాయి. పిల్లలకు మొత్తం చదువు సిలబస్ ప్రకారం నేర్పాలి. అలాగని ఏ పనినీ ఆపకూడదు. వాస్తవానికి వాళ్ళిచ్చే 4000 – 10000 మహా అయితే 15000 కు టీచర్ తనకంటూ వ్యక్తిగత జీవితమే లేకుండా తనను తాను తాకట్టు పెట్టుకోవలసిందే! స్కూలు 4. 30 కు అయిపోతే కరెక్షన్ వర్క్ లు చేసుకుంటూ 6. 30 దాకా స్కూల్ లో ఉండవలసిందే! అది కూడా కొన్ని నెలలే! ఆ తర్వాత ఎలాగూ అడ్మిషన్స్ కోసం వెళ్ళక తప్పదు! ఇక సిలబస్ విషయానికి వస్తే ప్రతి నెలా, అన్ని ఎగ్జామ్స్ కు వాళ్ళు నిర్ణయించిన ప్రకారం సిలబస్ పూర్తి చెయ్యాలి. క్లాస్ లలో సి.సి కెమెరాలు ఉంటాయి. క్లాస్ రూంలో టీచర్ లు ఎవరూ కూర్చోకూడదు. టీచరులందరూ 8.30 నుండీ 6.30 దాకా ఉండాలి. నర్సరీ నుండి రెండవతరగతి దాకా చెప్పే టీచర్ లు 3.30కు అయిపోయినా 5.30 దాకా ఉంటారు. ఒక్కో టీచర్ కు 8 పీరియడ్లు ఉంటాయి. స్టడీ అవర్స్ ను కలుపుకొని 12 పీరియడ్ లు చెప్పవలసి ఉంటుంది. ప్రైమరీ టీచర్లకు దిద్దే పని ఎక్కువగా ఉంటుంది. సినిమా, మీడియాల ప్రభావంతో, 9, 10 వ తరగతులు చదివే మొగపిల్లలు తమ క్లాస్ కు వచ్చే పెళ్ళి కాని మహిళా టీచర్ లను దారుణమైన, అశ్లీలమైన కామెంట్స్ చేస్తుంటారు అని అంటుంది రేణుక. వాళ్ళకు క్లాస్ చెప్పటమే నరకం అవుతుంది అంటుంది రేణుక. అలాంటి మానసిక స్థితులున్న విద్యార్థులకు ఎటువంటి కౌన్సిలింగ్ ఉండదు. వాళ్ళు చేసే అల్లరికి కూడా టీచరే బాధ్యురాలు. అప్పుడప్పుడు హెచ్.ఓ.డి లు వస్తుంటారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు పిల్లలు సరిగా సమాధానం చెప్పకపోతే “నువ్వు ఎందుకు పనికి రావు” అని సంబంధిత టీచర్ ను అందరి ముందూ తిడతారు. టీచర్ లను హింసించటంలో ఒక స్కూలు మరొక స్కూల్ తో పోటీ పడే సందర్భాలు లేకపోలేదు.

శనివారం స్టాఫ్ మీటింగ్స్ జరుగుతాయి. ఏదో ఒక విషయం లేక ఎదో ఒక కారణం “టీచర్లు మాట్లాడుకున్నారనో, ఆ టీచర్ అలా చేసిందనో, ఈ టీచర్ ఇలా చేసిందనో, క్లాస్ రూమ్ లో కుర్చున్నారనో, టీచర్ లు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారనో, ఇలాంటి కారణాలే ఎక్కువగా ఉంటాయి. స్టాఫ్ మీటింగ్ ఒక భయంకర అనుభవం అంటుంది రేణుక. కేవలం టీచర్ లను తిట్టటానికే స్టాఫ్ మీటింగ్… ఆ తిట్లు ఎలా ఉంటాయి అంటే “మీరసలు మనుషులేనా? మీరు అన్నం తింటున్నారా, ఇంకేమన్నా తింటున్నారా?” ఇలా తిడుతుంటాడు ప్రిన్సిపాల్. “పిల్లల జోలికి వెళితే జీపు లెక్కిస్తాం… అరెస్టులు చేయిస్తాం… కేసులు పెడతాం మీ పైన…” అని బెదిరించే ప్రిన్సిపల్స్ లేకపోలేదు … మేనేజ్‌మెంట్ కు బాకా ఊదుతూ టీచర్ లను అణగ పెట్టి ఉంచటమే ప్రిన్సిపాల్ పని. పిల్లల పేరెంట్స్ కు, టీచర్ కు మధ్య ఏమన్నా సమస్య వచ్చినప్పుడు మేనేజ్‌మెంట్ టీచర్లనే బాధ్యులను చేసి అప్పటికప్పుడు చేసిన రోజులకు జీతం కూడా ఇవ్వకుండా ఉద్యోగం లో నుంచి తీసేస్తుంది.

ఇక అడ్మిషన్స్ విషయానికి వస్తే “జూన్ నెల మొత్తం అడ్మిషన్ ల టార్చర్ ఉంటుంది” అంటుంది రేణుక. ఒక విద్యాసంస్థలోని టీచర్ ఒకామె “ఈ అడ్మిషన్స్ నేను చేయలేను. ఈ ఉద్యోగం నేను చేయలేను. నాకు అక్కర లేదు” అంటూ ఏడ్చి ఉద్యోగం మానేసిన సందర్భాలు ఉన్నాయంటే అడ్మిషన్ ప్రక్రియ ఎంత జఠిలంగా ఉన్నదో అర్ధమవుతుంది. అయితే అక్టోబర్ నుండే మానసిక వేధింపులు మొదలవుతాయి. “మీకు జీతాలు ఇవ్వం… ఆపేస్తాం” అని ప్రతి మీటింగ్ లోనూ బెదిరిస్తూ ఉంటారు. అడ్మిషన్స్ కోసం టీచర్ లు డోర్ స్టెప్ కు వెళ్తుంటారు. సేల్స్ గర్ల్స్ లాగా ఇళ్ళకు వెళ్ళి తలుపు కొట్టి మాట్లాడుతుంటారు. “ఫలానా స్కూల్ నుండి వచ్చాము. మాకు అడ్మిషన్స్ కావాలి. మీ పిల్లలను మా స్కూల్ లో చేర్పించండి” అని అడుగుతారు. లేక ఫీజుల కోసం వెళ్ళిన టీచర్లకు ఆ ఇళ్ళల్లో ఉండే మొగవాళ్ళు “మీకు అడ్మిషన్స్ ఇస్తాము. ఫీజులు కడతాం. మరి మాకేంటి? మాకేం ప్రయోజనం?” అంటూ రెండర్ధాల మాటలతో బాధించేవారూ లేకపోలేదు. ఈ మధ్య కాలంలో ఒక స్కూల్ లో అడ్మిషన్స్ కోసం వెళ్ళిన టీచర్ లు అడ్మిషన్స్ కోసం ఇళ్ళకు వెళ్ళము అని బాయ్‌కాట్ చేశారు. ఆ స్కూల్ మేనేజ్‌మెంట్ “అడ్మిషన్స్ తేకపోతే ఉద్యోగం లేదు” అని కరాఖండీ చెప్పేసింది. తప్పని సరై జీతం కోసం బాయ్‌కాట్ చేసిన ఆ టీచర్ లు అందరూ మళ్ళీ ఇళ్ళకు వెళ్ళటం మొదలు పెట్టారు. ఒక స్కూల్ లోని పిల్లలను మరొక స్కూల్ వాళ్ళు కిడ్నాప్ చేసి తమ క్యాంపసుల్లో పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.

మే నెలలో జీతం రావాలంటే టార్గెట్ పూర్తి చేయవలసిందే! జీతాన్ని బట్టి వాళ్ళ అడ్మిషన్ ల టార్గెట్ ఉంటుంది. 7000 జీతం ఉన్నవాళ్లకు 7 అడ్మిషన్స్, 10000 జీతం ఉన్నవాళ్ళకు 10 అడ్మిషన్స్ ఇలా ఉంటుంది…! ఎలాగోలా తంటాలు పడి, ఇబ్బందులు పడి టార్గెట్ పూర్తి చేస్తే “మీకు ఈ నెల జీతం కావాలంటే మరో 5 అడ్మిషన్ లు చెయ్యండి” అని ఇంకా టార్గెట్ పెంచుతారు. ఒకసారి ఒక టీచర్ తనకిచ్చిన టార్గెట్ 10 అడ్మిషన్స్ కంప్లీట్ చేసిన తరువాత “మీ సర్వీసెస్ మీద మాకు శాటిస్ఫాక్షన్ లేదు, మిమ్ములను తీసేస్తున్నాం” అని చెప్పి ఆమెను తీసేసాడు ప్రిన్సిపాల్. అయితే ఆమె ఆ పాఠశాల మేనేజ్‌మెంట్ కు ఫోన్ చేసుకుంది. వాళ్ళు “ప్రిన్సిపాల్ అట్లా ఎందుకు చేసాడు ప్రీ -ప్రయిమరీ మీకు ఇవ్వమని చెప్పాం కదా” అని సర్ది చెప్పారు. మేనేజ్‌మెంట్ ఎప్పుడూ సేఫ్ సైడ్ లోనే ఉంటుంది. ఉద్యోగుల మధ్యనే చిచ్చు పెడుతుంది.

అనేక మంది మేధావులూ, సామాజిక విశ్లేషకులూ, టీచర్ మానసిక స్థితులు విద్యార్థులపై ప్రభావాన్ని చూపుతాయని చెప్తున్నారు. ఐతే, ఇంతటి అననుకూల, అనారోగ్య వాతావరణంలో, ఇన్ని రకాల మానసిక వత్తిడుల మధ్య విద్యార్థికి టీచర్లు మనో వికాసాన్ని ఎలా కలిగించగలుగుతారు? అత్యధికంగా మహిళలనే టీచర్లు గా తీసుకుంటున్నారు. ప్రిన్సిపల్స్, హెడ్ లు మాత్రం తప్పనిసరిగా పురుషులనే నియమిస్తుంటారు. కేవలం లాభాపేక్ష తో మాత్రమే నడిచే ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు ఎటువంటి భవిష్యత్తును ఇవ్వగలుగుతాయి? ఫ్రీ ఎడ్యుకేషన్ తో పాటు, ఉన్నత విలువలు కలిగిన జాతీయ విద్యావిధానం, విద్యావ్యవస్థ ఉండాలి. విద్యను ప్రైవేట్ పరం చేయటం అతి పెద్ద తప్పిదం. మన దేశ అభివృద్ధికీ, అభ్యున్నతికీ, భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరం.

జ‌న‌నం: గుంటూరు జిల్లా, తెనాలి. నివాసం : హైదరాబాద్. ఎం.ఏ (హిందీ), ఎం. ఏ(ట్రాన్సలేషన్ స్టడీస్ ఇన్ హిందీ), బీఈడీ. 'జైనేంద్ర కుమార్ న‌వ‌ల‌ల్లో స్త్రీ పాత్రల మనో వైజ్ఞానిక చిత్రణ' అంశంపై ఎం.ఫిల్ చేశారు. 'కృష్ణా సొబతి& మమతా కాలియాల కథా సాహిత్యంలో స్త్రీ ల జీవితాలు' అంశంపై పీహెచ్‌డీ(ఉస్మానియా యూనివ‌ర్సిటీ) చేస్తున్నారు. సొంత‌ రచనలు : 1. పోరాడితేనే రాజ్యం, 2. ముగింపు మాటలా ..., 4. అభాగ్య జీవనాల భాగ్య నగరం. అనువాదాలు : 1. వైజ్ఞానిక భౌతికవాదం (రాహుల్ సాంకృత్యాయన్ ), 2. మధు పురి (రాహుల్ సాంకృత్యాయన్).

Leave a Reply