ప్రేమభూమి…

పసితనంలో సందులు తాకి
ఒళ్ళంతా సలసల మండుతుంటే
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసిన చూపు
నా మదిలో ముద్రితమైంది
పెరిగిన కనురెప్పలను కత్తిరించిన
నీ మునివేళ్ళ స్పర్శ తడింకా పచ్చిగానేనుంది

నిరక్షరాస్యుడైనా
నా అయ్య శ్రమైక జీవనంలో
దినచర్యలోని ప్రతి పనికి
నీ హృదయ నాదపు అజానే కాల ప్రమాణమవుతుంది

దళిత – ముస్లిం మైత్రి
కట్టెల పొయ్యి మీద వండిన
అమ్మ చేతి గొడ్డుకూరంత కమ్మగుంటుంది

వలుపలెక్కడో
దాపలెక్కడో తెలియని
అజ్ఞానపు కాషాయ మూక
గోరక్షక రాజకీయ భజన చేస్తుంది

భగవంతుడిప్పుడు
బ్యాలెట్ పేపర్లో
ఈ.వి.ఎమ్. బాక్సుల్లో బంధీగానున్నాడు

బుద్దుడి పాదాల్ని ముద్దాడిన ప్రేమభూమి
బుల్డోజర్ దాడిలో విలవిలలాడుతుంది

బుసలు కొడుతున్న మతోన్మాదాన్ని
అలాయి నెగడిలో బూడిద చేద్దాం
ఊపిరున్నంత కాలం ఊదుతుంటాను
కాసిన్ని తుమ్మ మొద్దుల్ని మోసుకురారాదు

Leave a Reply