ద్వేషాన్ని పెంపొందించినంత తేలికగా ప్రేమని పెంపొందించగలమా?

పౌరసత్వ సవరణ చట్టం నేటి నుండి అమలులోకి వస్తుంది అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జనవరి 10 నాడు ఉత్తర్వు జారీ చేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ కి, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు ఎడతెరిపి లేకుండా జరుగుతున్నాయి. బిజేపి అధికారంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, అస్సాం రాష్ట్రాలలో పోలీసుల హింసకి కూడా దారితీసాయి. ముఖ్యంగా పూర్తి హిందూ ఫాసిస్టు రాష్ట్రంగా అవతరించిన ఉత్తర్ ప్రదేశ్ లో పోలీసుల హింసకి అంతూ పొంతూ లేదు. ఆ అంకెలు ఇక్కడ చెప్పుకోవటం కూడా అనవసరం. ఒక రెండు ఉదంతాలు చెప్పుకుంటే సరిపోతుంది. తన బిడ్డకి పాలు తీసుకురావటానికి బయటకి వెళ్ళిన ఒక వ్యక్తిని పోలీసులు కాల్పుల్లో హతమార్చారు. అలాగే ఇంకోచోట ఒక ఆరు సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి మీద ఇప్పుడు జరుగుతున్న నిరసనల్లో గొడవలు చేస్తున్నాడు అని కేసు పెట్టి, కోర్టుకి హాజరుకావాలని అయన కొడుకుకి నోటీసు ఇచ్చారు. మా నాన్న చనిపోయి సంవత్సరాలు అయ్యింది అని చెప్పినా వినకుండా, వచ్చే వారం ఆయన కోర్టుకి రాకపోతే దాని పర్యవసానాలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది అని తనని బెదిరించారు. ఇదంతా కూడా చాలా సునాయాసంగా జరిగిపోతుంది ఉత్తర్ ప్రదేశ్ లో. ఇక్కడ వీటికన్నా భయపెట్టే, బాధించే విషయం ఏమిటంటే ఆ రాష్ట్రంలో ఇటువంటి వాటికి పెద్దగా వ్యతిరేకత రాకపోవటం. అక్కడ పరిస్థితి అలా ఉండగా దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి.

ఏమిటీ పౌరసత్వ సవరణ చట్టం? ఏమిటీ జాతీయ పౌర పట్టిక? జాతీయ జనాభా పట్టిక అంటే ఏమిటి? రాజ్యాంగంలో అధికరణ 5 నుండి అధికరణ 11 వరకు భారతదేశ పౌరసత్వం గురించి పేర్కొనటం జరిగింది. టూకీగా చెప్పుకోవాలంటే రాజ్యాంగంలోని అధికరణ 5 ప్రకారం రాజ్యాంగం ఆమోదించబడిన సమయానికి (నవంబర్ 26, 1949) ఈ దేశంలో నివసిస్తున్న వారైవుండి ఈ దేశ భూభాగంలో జన్మించిన వారుగానీ, తల్లితండ్రులలో ఒకరు ఈ దేశంలో జన్మించిన వారుగానీ, ఈ రాజ్యాంగం అమలులోకి రాక మునుపు ఐదు సంవత్సరాల పాటు ఈ దేశంలో నివసిస్తున్న వారుగానీ ఈ దేశ పౌరులే. అలాగే దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుండి భారతదేశానికి, ఇక్కడ నుండి పాకిస్థాన్ దేశానికి వెళ్ళి మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చిన వారి పౌరసత్వం గురించి ఇతర అధికరణాలు తెలుపుతున్నాయి. రాజ్యాంగ అధికరణాల ప్రకారం 1955లో పౌరసత్వం చట్టం ఒకటి చేశారు. ఈ చట్టానికి తరువాత కాలంలో 1986, 1992, 2003, 2005, 2015, 2019 సంవత్సరాలలో ఈ చట్టానికి సవరణలు చేశారు. ఈ చట్టంలో భారతదేశ పౌరులు అవ్వటానికి అవసరమైన నిబంధనలు అన్నీ పేర్కొన్నారు. అవన్నీ ఇక్కడ అంత అవసరం ఉండదు కానీ కొన్నిటినైతే చెప్పుకోవాలి.

  1. పైన పేర్కొన్న విధంగా నవంబర్ 26, 1949 నాటికి భారతదేశ భూభాగంలో నివసిస్తున్న వారు భారతదేశ పౌరులు.
  2. జనవరి 26, 1950 నుండి జూలై 1, 1987 మధ్యలో ఈ దేశంలో పుట్టిన వారు ఈ దేశ పౌరులు.
  3. జూలై 1, 1987 నుండి డిసెంబర్ 3, 2004 మధ్యలో పుట్టినవారు ఈ దేశ పౌరులు అవ్వాలంటే వారి తల్లితండ్రులలో ఒకరు ఈ దేశ పౌరులు తప్పక అయ్యుండాలి.
  4. డిసెంబర్ 3, 2004 తరువాత పుట్టినవారు ఈ దేశ పౌరులు అవ్వాలంటే తల్లి తండ్రులు ఇద్దరూ ఈ దేశ పౌరులు తప్పక అయ్యుండాలి లేదా తల్లితండ్రులలో ఒకరు ఈ దేశ పౌరులు అయ్యుండాలి, మరొకరు అక్రమ వలసదారులు అయ్యుండకూడదు.
  5. జనవరి 26, 1950 నుండి డిసెంబర్ 10, 1992 మధ్య వేరే దేశంలో పుట్టినవారు ఈ దేశ పౌరులుగా గుర్తింపబడాలి అంటే వారు పుట్టిన సమయానికి వారి వారి తండ్రులు (గమనించండి తండ్రులు మాత్రమే) ఈ దేశ పౌరులు అయ్యుండాలి.
  6. డిసెంబర్ 10, 1992 తరువాత వేరే దేశంలో పుట్టినవారు ఈ దేశ పౌరులుగా గుర్తింపబడాలి అంటే వారు పుట్టిన సమయానికి వారి తల్లితండ్రులలో ఒకరు ఈ దేశ పౌరులు అయ్యుండాలి.

ఇక్కడ ఒకటి గమనించాలి. పైన పేర్కొన్న నియమాలు క్రమంగా ఎలా మారుతూ వచ్చాయో. మొదట్లో ఈ దేశ భూభాగంలో పుట్టిన వారందరూ ఈ దేశ పౌరులే అనే ఒక విశాల దృక్పధం ఉండింది. అయితే క్రమంగా అది కాస్త వారసత్వ ఆధారంగా పౌరసత్వం లభించే ప్రక్రియగా మారిపోయింది. దీనికి బీజాలు ఈ దేశ స్వాతంత్రం సమయంలో ఉన్నాయి. ఈ దేశం ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి మాత్రమే పొంది ఉంటే బహుశా నేడు ఈ గొడవంతా ఉండకపోయేదేమో. అయితే దేశ స్వాతంత్రంతో పాటు దేశ విభజన కూడా జరిగింది. నేటి ఈ ఫాసిస్టు చట్టానికి బీజాలు అక్కడే ఉన్నాయని చెప్పుకోవాలేమో. దేశ విభజన సమయంలో జనాభా మార్పిడి జరిగిన విషయం తెలిసిందే. ఒక కోటి నలభై లక్షలు మంది వరకు ఈ దేశం నుండి పాకిస్థాన్ కి, పాకిస్థాన్ నుండి భారతదేశానికి వచ్చారు. అది దాదాపుగా మత ప్రాతిపదికనే జరిగింది. ముస్లిం లు భారతదేశం నుండి పాకిస్థాన్ కి, హిందువులు పాకిస్థాన్ నుండి భారతదేశానికి వచ్చారు. పైన పేర్కొనట్టు ఈ దేశ భూభాగంలో నివసిస్తున్న వారందరూ ఈ దేశ పౌరులు అని చేసిన నిర్ణయానికి ఇప్పుడు ఈ కొత్త పరిస్థితి తోడయ్యింది. అయితే పాకిస్థాన్ నుండి భారతదేశం వచ్చిన హిందువులకి ఇక్కడికి రాగానే పౌరసత్వం కోసం నమోదు చేసుకునే అవకాశం కలిపించారు. ఇది తప్పు అని ఎవరూ అనరు. అయితే ఈ దేశం నుండి పాకిస్థాన్ కి వెళ్ళి తిరిగి భారతదేశానికి వచ్చిన వారికి మాత్రం (వాళ్ళు ముస్లింలు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా) ఆ సదవకాశం లేదు. వారు ముందుగా అక్కడ ఇండియన్ ఎంబసీ నుండి పర్మిట్లు తీసుకోవాల్సి ఉంది. హిందువులకి లేని అడ్డంకి వీళ్ళకి మాత్రమే ఎందుకు కలిపించారు? దాని కోసం రాజ్యంగ పరిషత్ లో నాడు పౌరసత్వం గురించి జరిగిన చర్చని ఇక్కడ మాట్లాడుకోవాలి (రాజ్యాంగంలో ఏ అధికరణ గురించి లేనన్ని వాద వివాదాలు పౌరసత్వం అధికరణ గురించి జరిగాయి అని నెహ్రూ అన్నాడు). రాజ్యంగ పరిషత్ చర్చలలో ఇటు నుండి పాకిస్థాన్ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసిన వారి గురించి భారీ చర్చే నడిచింది. కొద్ది మంది సభ్యులు మినహా చాలా మంది ముస్లిం ల ఉద్దేశాలని శంకిస్తూనే మాట్లడారు. వాళ్ళు పాకిస్థాన్ ఏజెంట్లుగా తిరిగి వస్తున్నారని, ఇక్కడ వదిలేసుకున్న ఆస్తి కోసం మళ్ళీ వస్తున్నారని (నేడు ఎనిమీ ప్రాపర్టీ చట్టంగా ఉన్న చట్టం నాడు ఏలియన్ ప్రాపర్టీ చట్టం పేరు మీద ఉండింది. విభజన సమయంలో ఈ దేశం వదిలి పాకిస్థాన్ కి వెళ్ళిన వారందరి ఆస్తి ప్రభుత్వం తన స్వాధీనంలో పెట్టుకుంది) అంతే కానీ వారికి ఈ దేశం అంటే ప్రేమ ఏమి లేదని, వారు పాకిస్థాన్ దేశస్తులేనని వాదించారు. మతం పేరు ఎత్తకపోయినా కొంతమందిని “శరణార్ధులు” అని సంబోధించారు, మిగతా వారిని “చొరబాటుదారులు” అని సంబోధించారు. వారు మతం పేరు ఎత్తకపోయినా ఎవరిని “శరణార్ధులు “ అంటున్నారో, ఎవరిని “చొరబాటుదారులు” అంటున్నారో అర్థం చేసుకోవటం పెద్ద విషయమేమీ కాదు.

ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పటానికి కారణం ఈ ఫాసిస్టు చట్టం రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది కాదు, హిందుత్వ అనేది మోదీ అధికారంలోకి రాగానే ప్రబలింది కాదు అని చెప్పటానికి. భారతదేశం స్వాతంత్రం సమయానికి ‘పౌరులు’ అనబడేవారు కొంతమందే. బ్రిటిష్ హయాములో ఇరవయ్యో శతాబ్దంలో కొంతమందికి మాత్రమే ‘పౌరసత్వం’ లభించింది. ఇక్కడ ‘పౌరసత్వం’ అని దేనిని అంటున్నామో తెలుసుకోవటం అవసరం. పౌరసత్వం అనేది ప్రాధమికంగా హక్కులకి సంబంధించిన విషయం. ఈ ప్రపంచంలో సమసమాజం ఏర్పడి, సరిహద్దులు తొలగిపోయినప్పుడు ‘పౌరులు’ అనే భావన బహుశా ఉండకపోవచ్చేమో కానీ నేటి నేషన్-స్టేట్ సమాజంలో ఒక మనిషి మనిషిగా హక్కులు అనుభవించాలంటే మధ్యలో పౌరసత్వం అనే ఒక చట్టపరమైన భావన మీడియేట్ చెయ్యక తప్పని పరిస్థితి నేడు. ఈ చట్టపరమైన భావనకి నేడు ప్రజాబాహుళ్య మద్దతు అనేది కూడా ఉంది అని చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో పౌరసత్వం కోల్పోవటం అంటే మనిషిగా అస్తిత్వం పూర్తిగా కోల్పోవటమే. బ్రిటిష్ వారి సమయంలో అటువంటి పౌరులు కొంతమందే ఉన్నారు. చదువుకున్నవారు, ఆస్థి కలిగిన వారు అలా. ఎన్నికలలో ఓట్లు వేసే హక్కు వాళ్ళకి మాత్రమే దఖలు పడింది. మిగతా వారందరూ కూడా ప్రభువు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవిస్తున్నట్టే. అయితే భారత రాజ్యాంగం ఇటువంటి వాటిని కాదని ఒక విశాల పౌరసత్వ దృక్పధం తీసుకుంది. అయితే మనం పైన చెప్పుకున్నట్టు హిందుత్వ ప్రాపంచిక దృక్పధం అనేది నిద్రాణంగా కూడా ఉన్నది. అప్పుడు కూడా ఓటు హక్కు అనేదానిని కొన్ని సమూహాలకి మాత్రమే పరిమితం చెయ్యాలి అనే సన్నాయి నొక్కులు వినపడ్డాయి కానీ వాటికి విలువనివ్వకుండా ఒక నైతిక, విశాల ప్రాతిపదికని పౌరసత్వం కోసం ఎంచుకున్నారు. పౌరసత్వం అంటే ప్రపధమంగా మనిషిగా మనిషికి సహజంగా ఉండే హక్కులకి ఒక నేషన్-స్టేట్ చట్రంలో లభించే చట్టపరమైన మద్దతు అని పైన చెప్పుకున్నాము. ఈ కారణంగానే పౌరసత్వానికి ఒక పోజిటివ్ పాత్ర ఉంది, అలాగే నెగటివ్ స్వభావము ఉంది. రాజ్యం చేత పౌరులకి హక్కులు ఉన్నాయి, వాటికి లోబడి రాజ్యం పని చెయ్యాలి అనే ఒక విశాల అవగాహనని పెంపొందించటం అంత తేలికైన పని కాదు. పౌరసత్వం కారణంగా అది కాస్త తేలికైంది. ఆ మాత్రం వరకు పౌరసత్వం పోజిటివ్ పాత్రని కాదనలేము. అయితే పౌరసత్వం లేకపోతే మనిషి అనే పాత్రే లేకపోవటం అనే ఒక దుర్మార్గం దాని నెగటివ్.

ఒక ఉదారవాద రాజ్యంలో పౌరసత్వం కోల్పోవటం ఒక ఎత్తు, ఒక ఫాసిస్టు రాజ్యంలో కోల్పోవటం పూర్తిగా మరొక విషయం. ఫాసిస్టు రాజ్యం పూర్తిగా పర మతం/పర జాతి ద్వేషం మీద మాత్రమే జీవిస్తుంది. ద్వేషాన్ని ఒక స్థాయి వరకు అర్థం చేసుకోవచ్చు. అయితే జర్మనీలో లక్షల మందిని గ్యాస్ ఛాంబార్స్ కి పంపించటం, రువాండాలో పది రోజులలో సుమారుగా పది లక్షల మంది చంపటం, గుజరాత్ రాష్ట్రంలో కడుపులో ఉన్న పిండాన్ని బయటకి లాగి కత్తితో పొడిచి చంపటం ఇటువంటి స్థాయి ద్వేషాన్ని ఎలా అర్థం చేసుకుంటాము? ఫాసిస్టు ద్వేషం ఇటువంటి ద్వేషం. జర్మనీలో యూదులు, రువాండాలో టుట్సిలు, భారతదేశంలో ముస్లింలు. వీళ్ళు ప్రముఖంగా ఈ ద్వేషం బాధితులు. ఉదారవాద రాజ్యంలో పౌరసత్వం కోల్పోవటంతో మనిషికి రాజ్యం మధ్యవర్తిగా పౌరసత్వం రూపంలో ఉన్న హక్కులు మాత్రమే కోల్పోతారు. అయితే ఫాసిస్టు రాజ్యంలో అది హక్కులు కోల్పోవటంతో ఆగదు. ఒక వర్గం మొత్తాన్ని తుడిచిపెట్టడానికి ఇది ఒక కర్టైన్ రైజర్ గా ఉండటాన్ని తోసిపుచ్చడానికి లేదు. బహుశా ఇది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. ఎప్పుడో నలభైలలో జర్మనీలో జరిగింది, తరువాత ప్రపంచం చాలా ముందడుగు వేసింది, ఇతర దేశాలు చూస్తూ ఊరుకుంటాయా, శక్తిమంతమైన ముస్లిం దేశాలు ఉన్నాయి వగైరా వగైరా అని చెప్పొచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుచెయ్యాలి. రువాండాలో జరిగింది తొంభైలలో, గుజరాత్ జరిగింది మొన్నీమధ్యే. గత ఆరేళ్ళుగా జరుగుతున్న దమనకాండపై పెద్దగా నోరు విప్పిన శక్తివంతమైన ముస్లిం దేశం లేదు. గత డెబ్బై ఏళ్ళుగా ఉన్న కాశ్మీర్ స్వాతంత్ర ఆకాంక్షకి మద్దతు ఇచ్చిన దేశమే లేదు. కాబట్టి అప్పుడు జరిగింది మళ్ళీ జరగదులే అనుకోవటానికి లేదు. జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫాసిస్ట్ జర్మనీ బాధితుడు ఇటాలియన్ యూదు అయిన ప్రైమో లెవి అనే గొప్ప సాహిత్యవేత్త సాహిత్య ప్రయాణం ఇలాంటిది మళ్ళీ జరగదు, జరగలేదు అనే నమ్మకంతో మొదలయ్యి, ఇటువంటిది మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి అనే దగ్గర సమాప్తం అయ్యింది. ఈ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోగలిగితే ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి ఇతోధిక సహాయం చేసిన వాళ్ళము అవుతాము.

ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం దగ్గరికి వస్తే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల నుండి ముస్లిమేతర మతాల ప్రజలకి పౌరసత్వం లభించే ప్రక్రియని సులభతరం చేస్తే అందులో ఈ దేశ వాసులకి ప్రమాదం ఏముంది అని అడగవచ్చు. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. మొదటిది చట్టంలో ‘మైనారిటీలు’ అనే పదం వాడలేదు. మతాల పేర్లు వాడారు. హిందూ, సిక్కు, బౌద్ధ, పార్సీ, క్రైస్తవ మతాల పేర్లు వాడారు. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వటం కానీ పౌరసత్వం ప్రక్రియ సులభతరం చెయ్యటం కానీ పూర్తిగా రాజ్యాంగవిరుద్ధం అనేది తెలిసిందే. రెండవది సవరణ చట్టంలో మైనారిటీలు అని రాయకుండా నిర్దిష్టంగా మతాల పేర్లు ఎందుకు వాడారు? మైనారిటీలు అని వాడి ఉంటే పాకిస్థాన్ లోని ఆహ్మదీయాలు, షియాలు కూడా అందులోకే వచ్చేవారు. కేవలం ఈ మూడు దేశాలే ఎందుకు? శ్రీలంకలో తమిళులు (హిందువులు, ముస్లింలు ఇద్దరూ) ఉన్నారు, బర్మాలో రోహింగ్యా ముస్లింలు ఉన్నారు. ఈ రెండు కూడా భారతదేశం సరిహద్దు దేశాలే. బహుశా ఇక్కడే ఈ హిందుత్వ ఫాసిస్టు శక్తుల లక్ష్యం తెలుస్తుంది. చూస్తే ఇదంతా కూడా అసంబద్ధంగా ఉంటుంది. అయితే హిందుత్వ ఫాసిస్టు అవగాహనలో మాత్రం పూర్తిగా సరైనదే, తార్కికమైనదే. హిందువులు బాధితులు, శతాబ్దాలుగా వారు బాధితులు, ఈ మూడు దేశాలు ముస్లిం మెజారిటీ దేశాలు కావటం కారణంగా అక్కడ వీరు బాధితులుగా ఉంటున్నారు అనే ఒక విక్టిమ్ హుడ్ భావన ఇది. గుప్తుల కాలం స్వర్ణ కాలం, ముస్లిం ఆక్రమణదారుల కారణంగా మహోన్నతమైన హిందూ మత సామ్రాజ్యం కూలిపోయింది, హిందూ మత సామ్రాజ్యాన్ని తిరిగి నిలబెట్టాలి, మళ్ళీ ఆ స్వర్ణ కాలపు వైభవాలు తిరిగి పొందాలి అనే ఆలోచన వీళ్ళది. ఇది మనకి నవ్వులాటగా అనిపించొచ్చు కానీ వారు మనసా వాచా కర్మణా నమ్మేది. మరీ ముఖ్యంగా ఇవేమీ వారు ఆర్ధిక సమస్యల నుంచో ఇంకో దాని నుంచో దృష్టి మరల్చటానికి చెప్పేవి కావు. వారు నమ్మేదే వారు చెబుతున్నారు, ఇప్పుడు కాదు వంద సంవత్సరాల నుండి చెబుతూనే ఉన్నారు.

ఇక్కడ సందేహం తప్పక ఉంటుంది. పక్క దేశాలలోని ముస్లిమేతరులకి పౌరసత్వం ఇవ్వటానికి ఇక్కడ ఉన్న వారి పౌరసత్వం తొలగించడానికి సంబంధం ఏమిటి అని. ఇప్పుడు ఈ ప్రభుత్వం జరపదలుచుకున్న జాతీయ జనాభా పట్టిక నవీకరణ, దేశ వ్యాప్త పౌర జాబితా తయారీ గురించి మాట్లాడుకోవాలి.

అస్సాం ఈశాన్య రాష్ట్రాలలో ఒక రాష్ట్రం. అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా జరుపుతూ గత సంవత్సరం ఆగస్ట్ నెలలో జాతీయ పౌర పట్టిక నవీనకరణ పూర్తి చేశారు. పూర్తి చేసిన జాబితాని ఆగస్ట్ నెలలో విడుదల చేశారు. పంతొమ్మిది లక్షల ఆరు వేల ఆరు వందల యాభై ఏడు మంది జాబితాలో పేరు దక్కించుకోలేకపోయారు. అస్సాం జనాభా 3.3 కోట్లకి పైమాటే. అందులో 3.29 కోట్ల మంది ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ పత్రంలో నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 3.11 కోట్ల మంది పేర్లు ముఖ్య జాబితాలో చేరాయి. మిగతావి తిరస్కరణకి గురయ్యాయి. ముఖ్య జాబితా విడుదలకి కొన్ని నెలల ముందు విడుదల చేసిన ముసాయిదా జాబితాలో నలభై లక్షల ఏడు వేల ఏడు మంది పేర్లు ఉన్నాయి. దాని తరువాత ఇంకో లక్ష మంది పేర్లు కూడా జతచేశారు. అంటే ముసాయిదా జాబితాకి, ముఖ్య జాబితాకి మధ్య తేడా పన్నెండు లక్షలు. ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ అంటే ఏమిటి? క్లుప్తంగా చెప్పాలంటే ఈ దేశపు నిజమైన పౌరుల జాబితా. అస్సాం రాష్ట్రంలో 1951 సంవత్సరంలో మొదటిసారిగా ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ తయారు చేశారు. దాని తరువాత మళ్ళీ దానిని అప్డేట్ చెయ్యలేదు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేశారు?

అస్సాం రాష్ట్రాన్ని బర్మా రాజుల నుండి బ్రిటిష్ వారు తీసుకుని, ఈశాన్య భారతదేశంలో మిగతా రాజ్యాలని కలుపుకుని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే వారు. బర్మా రాజుల కన్నా ముందు అహోం రాజులు పరిపాలించేవారు. ఈ అహోం రాజులు ఇక్కడి వాళ్ళు కాదు. ఆగ్నేయ ఆసియా నుండి వచ్చినవారు. అందుకే ‘ప్రధాన స్రవంతి’ అస్సాం ప్రజలని ఆహోమియా అంటారు. అస్సాం లో ఈ ప్రధాన స్రవంతి వారే కాక స్థానిక ఆదివాసీ తెగలు (ఉదాహరణకి మిసింగ్ ఒక తెగ పేరు), టీ ట్రైబ్స్ (అస్సాం తేయాకు తోటలలో పని చెయ్యటానికి ఝార్ఖండ్, బెంగాల్ లాంటి రాష్ట్రాల నుండి తీసుకురాబడిన ఆదివాసీలు, బెంగాలి భాష మాతృ భాషగా కలిగిన వారు, బెంగాల్ ప్రాంతం నుండి వచ్చినవారు (వీరి మాతృ భాష అస్సామీ. అయితే వీరు బెంగాల్ నుండి వలస వచ్చినవారు), ఇక దేశంలో ఏ మూలకి పోయిన కనిపించే మార్వాడీలు ఉన్నారు. బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాక బెంగాల్ ప్రాంతం నుండి (అప్పటికి బెంగాల్ ఇంకా విడిపోలేదు. ఇది పంతొమ్మిదో శతాబ్దం సంగతి) ఇక్కడ బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో వ్యవసాయం చెయ్యడానికి హిందువులు, ముస్లింలు ఇద్దరినీ ఇక్కడ సెటిల్ చేశారు. ఆలాగే బెంగాలీ భాషని అధికారిక భాష చేశారు. అప్పటి నుండి మొదలయ్యింది అస్సామీ ప్రజల అసంతృప్తి. అయితే అస్సామీ ప్రజలు గొడవ చెయ్యటంతో తిరిగి అస్సామీ భాషనే అధికారిక భాష చేశారు. అయితే అప్పటివరకు బెంగాలీ భాష అధికార భాషగా ఉండటంతో బ్రిటిష్ ప్రభుత్వం అధికారిక పదవులలో బెంగాలీ వాళ్ళే ఉండేవారు. అది కూడా అసంతృప్తికి కారణం (ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మద్రాస్ ప్రభుత్వంలో తమిళ బ్రాహ్మల ఆధిపత్యం ఉందని తెలుగు బ్రాహ్మలు గొడవ మొదలెట్టారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడటానికి అది కూడా ఒక ముఖ్య కారణం. అదేమీ మంచిది కాదని కాదు కానీ ఎవరి ప్రయోజనాలు అందులో ఉన్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవటం అవసరం). తరువాత కాలంలో పక్కన ఉన్న బెంగాల్ ని తూర్పు, పశ్చిమ బెంగాల్ గా విడదీసారు. ఇది ఒక రకంగా మతం ఆధారిత విభజన. తూర్పు బెంగాల్ లో ఎక్కువ మంది ముస్లింలు, పశ్చిమ బెంగాల్ లో ఎక్కువ మంది హిందువులు ఉండేవారు. అస్సాం కి తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ రెండూ సరిహద్దు రాష్ట్రాలే. ఒకపక్క ఇదంతా జరుగుతానే ఉండగా ఉపఖండాన్ని విభజించారు. ఉపఖండం విభజన కూడా మతం ఆధారంగానే జరిగింది. అది పశ్చిమాన అయినా, తూర్పున అయినా. దానితో తూర్పు బెంగాల్ పాకిస్థాన్ లో భాగం అయ్యింది. అలాగే అస్సాంలోని సిల్హెట్ ప్రాంతంలో చాలా భాగం తూర్పు బెంగాల్ లో భాగం అయ్యింది. విభజన జరిగినప్పుడు జరిగిన మత కల్లోలాలు గురించి మనకి తెలుసు. ఆ విభజన కారణంగా, ఈ మత కల్లోలాల కారణంగా జనాభా అటు నుండి ఇటు, ఇటు నుండి అటు మారారు. బ్రిటిష్ వాడు గీసిన గీతకి భారతదేశ ప్రజలు భారీ మూల్యాన్నే చెల్లించారు. ఒక పక్క కల్లోలాలు, ఇంకో పక్క జనాల రాకపోకాలు సాగినాయి. ఇటువంటి పరిస్థితులలోనే 1951లో మొదటిసారి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ అస్సాం రాష్ట్రంలో తయారు చేశారు. మనలాంటి ప్రదేశంలో అది తయారు చెయ్యటం వేరు, అస్సాం, బెంగాల్, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో చెయ్యటం వేరు. విభజన ప్రభావం మన మీద ఏమీ లేదు. కానీ ఈ మూడు రాష్ట్రాల పరిస్థితి అలా కాదు. అంతా అల్లకల్లోలంగా ఉండింది అప్పుడు. అలాంటి పరిస్థితుల్లో, పెద్దగా అక్షరాస్యత లేని రోజుల్లో ఎంత మంది దగ్గర సరైన కాగితాలు ఉంటాయి? ఆ గణనలో పాల్గొన్న ఉద్యోగుల గురించి ఒక వార్తా కధనం వచ్చింది. వారికి పెద్దగా ఇష్టం లేకపోయినా బలవంతానా ఈ పనిలోకి దింపారు అని. అందులో పాల్గొన్న వారందరూ ప్రభుత్వ ఉద్యోగులే. వారికి కొన్ని రోజులు శిక్షణ ఇచ్చి దీనికి పంపారు. ఆసక్తి లేకపోయినా పంపటం, కొన్ని రోజులే అని చెప్పి చాలా రోజులు కొనసాగించటం, అప్పటికి ఇవన్నీ ఎవరికీ తెలియకపోవటం ఇన్ని కారణాల మధ్య ఆ కార్యక్రమం ఎంత వరకు సాఫీగా జరిగుంటదో మనం ఊహించుకోవచ్చు. అలా మొదటి సారి ఆ జాబితా తయారు చేశారు.

దాని తరువాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అస్సాం, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు కలిపి అస్సాం రాష్ట్రంగా ఏర్పడింది. అన్ని చోట్ల లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చినాక కేవలం అస్సాం భాషనే అధికారిక భాషగా చెయ్యటానికి నిర్ణయించుకుంది. దానికి బెంగాలీల నుండి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా బరాక్ లోయ నుండి. బరాక్ లోయలో ఉండేవారు సిల్హెటి బెంగాలి మాట్లాడతారు. ఈ నిరసనలు హింసాత్మకం అయ్యాయి. బ్రహ్మపుత్ర లోయలో బెంగాలీల మీద దాడులు కూడా జరిగాయి అంటారు. అస్సాం సాహిత్య పరిషత్ అస్సాం భాషని ప్రచారం చెయ్యటానికి ఎంతో పని చేసింది. అప్పటికే అస్సామీలలో బెంగాలీలు అంటే ఒక రకమైన కోపం ఉంది. ఇప్పుడు అది ఇంకా పెరిగింది. ఇదిలా కొనసాగుతుండగా నాటి తూర్పు బెంగాల్ నుండి రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నాటికి బెంగాల్- బంగ్లాదేశ్ సరిహద్దుకి ఇరువైపులా ఉండే వారి మధ్య సంబంధాలు బాగానే కొనసాగుతున్నాయి. పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. అప్పుడు అలాగే ఉండేది. నాటి తూర్పు బంగ్లాదేశ్ లో మత కల్లోలాలు జరుగుండటంతో చాలా మంది ఇటువైపుకి వచ్చేసేవారు. ఇస్లామిక్ దేశంగా ఏర్పడిన పాకిస్థాన్ తూర్పు బెంగాల్ ప్రాంతం మీద ఉర్దూ రుద్దటానికి విపరీతమైన ప్రయత్నాలు జరుపుతున్నది అప్పట్లో. తూర్పు బెంగాల్ అంతా బెంగాలీ మాట్లాడేవాళ్ళు. ముస్లింలు అయినా హిందువులు అయినా. ఇలా ఉర్దూ రుద్దే ప్రయత్నాలని తూర్పు బెంగాల్ నిరసించింది. అది కాస్త హింసాత్మకం అయ్యింది. దాని ఫలితం బంగ్లాదేశ్ అనే భాష ప్రయుక్త దేశం. ఈ బంగ్లాదేశ్ ఏర్పడటానికి భారతదేశం కూడా ఎంతో సహాయం చేసింది. బంగ్లాదేశ్ గెరిల్లాలకి శిక్షణ కూడా ఇచ్చింది. బంగ్లాదేశ్ జాతిపితగా ముజిబుర్ రెహ్మాన్ ని భావిస్తారు. మీకు ఈనాటికి ఈ పేరు అటు బంగ్లాదేశ్ లో, ఇటు బెంగాల్, అస్సాంలలో వినపడుతుంది. చాలా మంది తమ పిల్లలకి ఈ పేరే పెట్టారు. అంటే అర్థం చేసుకోండి బంగ్లాదేశ్ స్థాపనకి ఇక్కడ వారి మద్దతు ఎంత ఉందో.

మార్చ్ 24, 1971 నాడు బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఇదే తారీఖుని ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ నవీకరణకి కి కట్ ఆఫ్ డేట్ గా పెట్టారు. బంగ్లాదేశ్ ఏర్పడిన కాడి నుండి ఎంతో మంది అక్రమంగా భారతదేశంలోకి-ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలోకి- ప్రవేశించారు కాబట్టి ఆ రోజునే కట్ ఆఫ్ డేట్ గా పెట్టాలి అని డిమాండ్. ఇది జరిగిన తరువాత జరిగిన ఇంకొక ముఖ్య ఘట్టం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా) ఏర్పడటం. స్వాతంత్రం వచ్చిన కాడి నుండి భారతదేశం అస్సాం ని దోచుకుంటుంది, ఇక్కడ సంస్కృతి వేరు, మా వనరులు మాకే అన్న నినాదంతో ప్రత్యేక దేశం కోసం ఈ సాయుధ సంస్థ ఏర్పడింది. సామ్యవాద, లౌకిక అస్సాం దేశం మా లక్ష్యం అని వాళ్ళు ప్రకటించారు. ఇటువంటి సాయుధ సంస్థలు ఈశాన్యలో మిగతా చోట్ల కూడా ఏర్పడ్డాయి. అందులో కొన్ని ఇప్పటికీ సవాలుగానే ఉన్నాయి. అయితే వారి డిమాండ్ న్యాయమైనది. స్వయం నిర్ణయాధికారం అందరి హక్కు. దాన్ని ఐక్యరాజ సమితి కూడా గుర్తించింది. కశ్మీర్ లో ప్లెబిసైట్ నిర్వహిస్తామని నిర్వహించకపోవటం భారత దేశం పాకిస్థాన్ రెండూ చేసిన మోసం, దాని ఫలితం మనం ఈనాడు చూస్తున్నాము. ఈ ఉల్ఫా పోరాటానికి చాలా మద్దతు ఉండేది. ఒకప్పుడు మన దగ్గర నక్సలైట్ ఉద్యమానికి ప్రజాబాహుళ్యంలో ఇతోధిక మద్దతు లభించినట్టే ఉల్ఫా పోరాటానికి కూడా లభించింది. ఎంతో మంది మేధావులు, కళకారులు, పాత్రికేయులు బహిరంగంగా మద్దతు ప్రకటించేవారు. భారతదేశం మమ్మల్ని దోచుకుంటున్నది అన్న నినాదంతో వీళ్ళు పోరాడేవాళ్ళు. వీళ్ళ పోరాటం కూడా అస్సాం అస్థిత్వం గట్టిపడటానికి కారణం అయ్యింది. ఇదే సమయంలో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యునియన్ (ఆసు)ఏర్పడింది. అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించిన వాళ్ళు మా వనరులు దోచుకుంటున్నారు, మా సంస్కృతిని మాయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఇక్కడ నుండి పంపించివేయ్యాలి అని వాళ్ళు ఆరు సంవత్సరాలు పాటు ఉద్యమం చేసారు. ఇది కూడా హింసాత్మకమైన ఉద్యమమే. దానితో ఆరు సంవత్సరాల తరువాత 1985లో ఆసు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య ఒక ఒప్పందం కుదిరంది. అదే అస్సాం అకార్డ్. ఆ అస్సాం అకార్డ్ లో ఒక పాయింటే ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్. ఇంతక ముందు చెప్పుకున్నాము బ్రిటిష్ కాలం నుండి అస్సాం ప్రజలకి బెంగాలీ వాళ్ళ మీద అసంతృప్తి ఉంది అని. తరువాత అది తీవ్ర రూపం దాల్చింది. ఉల్ఫా ఉద్యమం, ఆసు ఉద్యమం ఆ అస్థిత్వాన్ని మరింతగా గట్టిపరిచాయి. ఈ సెట్లర్లు వల్లే స్థానిక ఆదివాసీల భూములు అన్యాక్రాంతం అయ్యాయి అనే అసంతృప్తి ఆదివాసీలలో ఉంది, అస్సాం ప్రజలలో కూడా ఉంది. ఒక రకంగా మన తెలంగాణా ఉద్యమం కారణం లాంటిదే. అయితే మన దగ్గర బ్రిటిష్ పాలన సమయం నుండి ఏదో ఒక రూపంలో స్వాతంత్ర్యాననంతరం ఎల్ టి ఆర్ చట్టంగా పేరు పెట్టిన చట్టం ఒకటి అమలులో ఉండింది. అక్కడ అటువంటిది ఉన్నట్టు లేదు. అటువంటి చట్టం ఒకటి తీసుకువస్తాము అని మొన్నీ మధ్యే అస్సాం ప్రభుత్వం పేర్కొనట్టు వార్తలు వచ్చాయి. ఈ మధ్యలోలోనే ఈ బెంగాలీ వ్యతిరేక ఉద్యమం ముస్లిం వ్యతిరేక రూపు రేఖలు సంతరించుకోవడం మొదలయ్యింది. 1983లో అస్సాంలోని నెల్లిలో జరిగిన ఊచకోతలో రెండు వేలకు పైగా ముస్లింలని హతమార్చారు. అంటే గోద్రా మారణకాండ జరగటానికి ఇరవై సంవత్సరాల ముందే ఇక్కడ జరిగింది అటువంటిది. ఆ ముస్లిం వ్యతిరేకత పెరుగుకుంటూ వచ్చిందే తప్ప తగ్గలేదు. ఇటు పక్క బెంగాలీ వ్యతిరేకత, అటు పక్క ముస్లిం వ్యతిరేకత. ఈ రెండిటికి సరిపోయిన వారు ఎవరంటే బంగ్లాదేశీ ముస్లింలు. బంగ్లాదేశ్ నుండి జనం రాలేదు అని ఎవరూ అనటం లేదు. వచ్చారు. ఎన్నో కారణాలతో వచ్చారు. అక్కడ అవకాశాలు లేక, అక్కడ నియంతృత్వ ప్రభుత్వాలలో ఉండలేక, అభివృద్ధి చెందిన, చెందుతున్న మనలాంటి దేశాల కాలుష్యం కారణంగా ముంపుకి గురవుతున్న లోతట్టు ప్రాంతాలలో బంగ్లాదేశ్ కూడా ఒకటి. దేశాననంతర వలసలకి అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. ఇలా ఎన్నో కారణలు ఉంటాయి. మన దేశం వాళ్ళు మాత్రం ఆఫ్రికా వెళ్ళలేదా,అభివృద్ధి చెందిన దేశాలకి వెళ్ళటానికి ఈనాటికి విపరీతమైన ఉత్సాహం చూపించటం లేదా? అదేమన్నా పెద్ద విషయమా? ఇదిలా ఉండగా తొంభైవ దశకం తరువాత నుండి భారతదేశంలో హిందుత్వ సిద్ధాంతం బలపడుతూ వచ్చింది. అస్సాంలో కూడా అదే జరిగింది. 1984 అకార్డ్ తరువాత అది పెద్దగా ముందుకి సాగలేదు. ఆ మధ్యలో అక్కడ అక్రమ వలసదారుల నియంత్రణ చట్టం ఒకటి చేశారు. దీని ద్వారా అక్రమంగా అస్సాం లో ఉంటున్న వారిని గుర్తించడానికి వీలు అవుతుంది. అయితే ఈ చట్టంలో ఉన్న నిబంధనలు అలా గుర్తించడానికి సులువుగా లేవని సుప్రీం కోర్టులో కేసు వేయాగా 2003లో ఆ నిబంధనలని కోర్టు కొట్టివేసింది. ఇలా అక్రమంగా ఉంటున్నారు అని గుర్తించిన వారిని డిటెన్షన్ కేంద్రాలకి (ఇవి జైళ్ళ లోపలే ఒక పక్కన ఉంటాయి) పంపుతారు. అంతకన్నా ముందు వీరు అక్రమ పౌరుల కాదా అనేది ఫారినర్ ట్రిబ్యునల్స్ నిర్ణయిస్తాయి. ఇవేమీ జ్యుడిషియల్ సంస్థలు కాదు. కొన్ని సంవత్సరాలు న్యాయవాదిగా అనుభవం ఉన్నవారెవరైనా సరే ఈ ట్రిబ్యునల్ సభ్యులు అవ్వొచ్చు. ఈ ట్రిబ్యునల్స్ కి వెళ్ళటం అంటే నరకంలో అడుగుపెట్టడమే అని చాలా మంది అభిప్రాయం. అవి అలాగే ఉంటాయి కూడా. ఇక డిటెన్షన్ కేంద్రాలని ఒక ముక్కలో చెప్పాలంటే అవి మరణ కూపాలు. అంతకన్నా చెప్పటం కూడా అనవసరం. అంత ఘోరమైనవి.

2003లో ఆ కఠినమైన నిబంధన కొట్టివేసాక ఆరు సంవత్సరాలకి శర్మ అనేబడే ఒక వ్యక్తి సుప్రీం కోర్టులో కేసు వేశాడు. అస్సాం అకార్డ్ ప్రకారం అస్సాం రాష్ట్రంలో రెండవ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ జాబితా తయారు చెయ్యాలి అని. ఆ కేసు పుణ్యమే ఈ ఎన్.ఆర్.సి. ఈ తంతూ అంతా 2013 నుండి సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. మొదటి నుండి దీన్ని పర్యవేక్షించింది మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్. ఆయన అస్సాం కి చెందిన వ్యక్తి. మరి అస్సాం కి చెందిన వ్యక్తి అస్సాం కి చెందిన ఇటువంటి చాలా సున్నితమైన అంశాన్ని తన పరిధిలోకి ఎలా తీసుకుంటాడు? అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందకి రాదా అనే ప్రశ్నలు మన న్యాయస్థానం పట్టించుకున్న పాపాన పోలేదు. సుప్రీంకోర్టే ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చుకుంటా వచ్చి చివరికీ ఈ రోజున తేలింది. ఈ మధ్యలో తమ పేరు ఈ జాబితాలోకి నమోదు చేయించుకోవటానికి ప్రజలు పడిన హింస అంతా మనం చూశాము. ఆత్మహత్యలు, ప్రాణాలు పోవటం, డిప్రెషన్, పిలల్లు-తల్లి తండ్రులు విడిపోవటం, కుటుంబంలో ఒకరి పేరుంటే మరొకరిది లేకపోవడం, ఆస్తులు అమ్ముకోవడం ఎన్ని చూడలేదు మనం. అంత హింస తరువాత ఈ రోజు సుమారుగా ఇరవై లక్షల మంది శాశ్వతంగా పౌరులే కాదు అని తేల్చారు. ఇంత జరిగాక నేడు అస్సాంలో ఒక పెద్ద డిటెన్షన్ కేంద్రం ఒకటి నిర్మిస్తున్నారు. ఇక్కడ ఒక వింత ఏమిటంటే ఈ డిటెన్షన్ కేంద్రం నిర్మాణానికి కూలీలుగా తీసుకురాబడిన వారిలో కొంతమంది పేర్లు పౌర పట్టికలో లేవు. అంటే వారు ఈ దేశ పౌరులు కాదు. అయినా కూడా ఇక్కడ పని చేస్తున్నారు. రేపు కేంద్ర నిర్మాణం పూర్తి అయ్యాక వీరినే అదే కేంద్రంలో నిర్భందించే అవకాశాలు కొట్టిపారేయ్యలేము.

అందుకే నేడు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో అస్సాం ముందంజలో ఉంది. అయితే ఒక తేడా ఉంది. అస్సాంలో ఎం ఆర్ సి కి సామాన్య జనంలో మద్దతు బాగానే ఉంది. వారి వ్యతిరేకత పౌరసత్వ సవరణ చట్టం గురించి. వాళ్ళు హిందువులా, ముస్లింలా మాకు అనవసరం. మాకు ఎవరూ వద్దు అనేది వారి డిమాండ్. త్రిపుర లాంటి ఇతర ఈశాన్య రాష్ట్రాలలో కూడా అదే డిమాండ్. అస్సాంలో ఈ ఆందోళనలలో ముందుని, ప్రజలని సమీకరించి, దీని మీదే కాకుండా అనేక ఇతర విషయాల మీద- పెద్ద డ్యాములకి వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా- దశాబ్దాలుగా పనిచేస్తున్న కృషక్ ముక్తి సంగ్రాం సమితి (కెఎంఎస్ఎస్) మీద తీవ్ర నిర్బంధం ఉంది. కెఎంఎస్ఎస్ ముఖ్య నాయకుడు అఖిల్ గోగోయ్ ని ఇప్పటికే ఎం ఐ ఏ చట్టం కింద అరెస్ట్ చేశారు. ఇతర ముఖ్య నాయకులని కూడా అరెస్ట్ చేశారు.

అస్సాంలో జరిగింది, జరుగుతున్నది ఇది టూకీగా. అయితే దేశవ్యాప్తంగా జరుపుతాము అని చెబుతున్న ఎం ఆర్ సి కి అస్సాంలో జరిగిన ఎం ఆర్ సి నవీకరణకి కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకోవాలంటే మనం కార్గిల్ యుద్ధం సమయానికి వెళ్ళాలి. కార్గిల్ యుద్ధం తరువాత యుద్ధ పరిస్థితులని అడ్డుబెట్టుకుని “చొరబాటుదారులు” దేశంలోకి ప్రవేశించారు, వారి గుర్తించాలి అని చెప్పి నాటి బిజెపి ప్రభుత్వం 2003లో పౌరసత్వ చట్టాన్ని సవరించింది. ఇంతకముందు ఉన్న నిబంధనలకి మరి కొన్ని నిబంధనలు జోడించటంతో పాటు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజెన్స్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఒకటి తయారు చెయ్యాలి, పౌరులకి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజెన్స్ ఆధారంగా గుర్తింపు కార్డు ఒకటి ఇవ్వాలి అని ఆ సవరణలో పొందుపరిచారు. ఇప్పుడు ఈ జాతీయ పౌర పట్టికకి, జన గణనకి ఒక ముఖ్యమైన తేడా ఉంది. జనగణన పౌరసత్వానికి చెందినది కాదు. జనాభా గణన అది. దేశ సామాజిక-ఆర్ధిక-ప్రాంతీయ వివరాలని సేకరించే ప్రక్రియ. జాతీయ పౌర పట్టిక దేశ జనాభాలో పౌరులని నిర్దేశించే ప్రక్రియ. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది దేశ జనాభా పట్టిక. ఇప్పుడు జాతీయ పౌర పట్టిక అనేది జాతీయ జనాభా పట్టికకి సబ్ సెట్ లాంటిది అని చెప్పుకోవచ్చు. 2003 సవరణ ద్వారా ఇవన్నీ చెయ్యాలి అని పేర్కొనటం అయితే పేర్కొన్నారు కానీ 2004 ఎన్నికలలో నాటి ప్రభుత్వం ఓటమి చెంది యుపిఏ అధికారంలోకి రావటంతో ఇది పెద్దగా ముందుకు జరగలేదు. అయితే జాతీయ జనాభా పట్టిక విషయంలో మాత్రం అడుగులు పడ్డాయి. 2010లో మొదటి సారిగా జాతీయ జనాభా పట్టికని తయారు చేశారు. జనగణనకి సమాంతరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ మధ్య కాలంలో దేశ ప్రజలందరికీ ఒక గుర్తింపు కార్డు ఉండాలని చెప్పి ఆధార్ ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆధార్ తో ప్రమాదాలు, దాని దుష్ప్రయోజనాలు పక్కన పెట్టగా అది పౌరులకి మాత్రమే పరిమితం కాకుండా దేశంలో నివసిస్తున్న వారందరికీ ఇచ్చిన సంఖ్య. ఆధార్ లో భాగంగా ఐరిస్ స్కాన్, ఫింగర్ ప్రింట్ స్కాన్ వివరాలు కూడా నమోదు చేసుకున్నారు. తరువాత జాతీయ జనాభా పట్టిక విభాగం వారు కూడా ఈ వివరాలు సేకరించారు. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలలో జాతీయ జనాభా పట్టిక విభాగం వారు ఆధార్ ప్రక్రియలో భాగంగా సేకరించిన ఈ స్కాన్ వివరాలని ఆధార్ వారితో పంచుకుంటున్నారు. ఇది సాంకేతికంగా బాగా సంక్లిష్టమైన ప్రక్రియలు. వీటిని వాడుకుని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు పూర్తి భారీ స్థాయి నిఘా వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నారు అనేది వేరే విషయం. ఇందులో ఎన్నో చట్టపరమైన విషయాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ జాతీయ జనాభా పట్టిక, జాతీయ పౌర జాబితా, ఆధార్ మూడు కలగలిపి వాడకం ఉంటుంది. అస్సాం రాష్ట్రానికి అయితే 1951లో చేసిన జాతీయ పౌర పట్టిక పునాది పత్రంగా ఉంది. మరి ఇప్పుడు భారతదేశంలో ఏ పత్రం పునాది పత్రంగా ఉంటుంది? ఇక్కడ అటువంటిది ఇప్పటివరకు జరగలేదుగా. ఇక్కడే జాతీయ జనాభా పట్టిక అవసరం తెలిసేది. 2010లో చేసిన మొదటి సారిగా తయారు చేసి, 2015లో మరిన్నీ వివరాలు జోడించిన ఈ పట్టికని మరొక్కసారి 2020లో తయారు చేస్తున్నారు. అదే జాతీయ పౌర జాబితాకి బేస్ డాక్యుమెంట్. 2010లో చేసిన జాబితాలో లేని ప్రశ్నలు రాబోయే సంవత్సరంలో జరగబోతున్న జాబితాలో ఉన్నాయి- ఉదాహరణకి మీ తల్లితండ్రులు ఎక్కడ పుట్టారు లాంటి ప్రశ్నలు? దీని ఆధారంగా జాతీయ పౌర జాబితాని తయారు చేస్తారు. ఇప్పుడు అస్సాంలో ఎం ఆర్ సి జరిగిన ప్రక్రియకి ఎన్ పి ఆర్ కి సంబంధం లేదు. అందుకనే అస్సాం రాష్ట్రాన్ని ఎన్ పి ఆర్ నుండి మినహాయించారు. అక్కడ ఎన్ ఆర్ సి నవీకరించాము కనుక అక్కడ అవసరం లేదు అని వాళ్ళు చెబుతున్నది. ఇప్పుడు మిగతా చోట్ల పైన పేర్కొన్న ఎన్ పి ఆర్ జాబితా నుండి ప్రభుత్వ అధికారులే ఒక ఎన్ ఆర్ సి జాబితా ఒకటి తయారుచేస్తారు. ఇది మరింత ప్రమాదకరం. అస్సాంలోనైనా కనీసం ఎన్ ఆర్ సి సేవా కేంద్రాలు, ఈ పత్రాలు అవసరమవుతాయి అని చెప్పి ప్రజలని తమ పౌరసత్వం నిరూపించుకోమన్నారు. ఇక్కడ అటువంటిది కూడా ఏమి ఉండదు. ప్రభుత్వ అధికారులు తయారు చేసిన ఎన్ పి ఆర్ జాబితా నుండి ప్రభుత్వ అధికారులే ఎన్ ఆర్ సి జాబితా తయారు చేస్తారు. మామూలు సమయంలోనే ప్రభుత్వ అధికారులకి పూర్తి అధికారాలు ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిన విషయమే. ఇక ఇటువంటి ఫాసిస్టు వాతావరణంలో, రాజ్యంలోని అన్ని అంగాలని తనకి లోబరుచుకున్న నేటి పరిస్థితుల్లో ఈ ప్రక్రియ అంతా ఎంత సాఫీగా జరగవచ్చునో మనం ఊహించుకోవచ్చు.

ఇది పౌరసత్వ సవరణ చట్టానికి, జాతీయ జనాభా పట్టికకి, జాతీయ పౌర పట్టికకి మధ్య ఉన్న ఆర్గానిక్ సంబంధం. దీనిని మరింతగా అర్థం చ్సుకోవాలంటే గతం నుండీ జరుగుతూ వస్తున్న కొన్ని విషయాలని తెలుసుకోవటం అవసరం. ఇది హిందూ దేశంగా ఉండాలి అనే హిందుత్వ ఫాసిస్టుల ఆలోచన నేటిది కాదని పైన చెప్పుకున్నాము. చట్టపరంగా, ఒక లౌకిక రాజ్యానికి ప్రతినిధిగా ఉండవలసిన ప్రభుత్వం కూడా దీనిని ఈ ఆలోచన ధోరణిని ముందుకు తీసుకువెళ్ళే చర్యలు చేపట్టడాన్ని మనం గమనించాలి. 1983లో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యునియన్ తో ఒప్పందం కుదిరింది అని పైన చెప్పుకున్నాము. నాటికి పౌరసత్వం అధికారాలు జిల్లా కలెక్టర్ల చేతిలో ఉండేవి. అయితే అలా ఉండటం కారణంగా కలెక్టర్లు అక్రమ వలసదారులకి కూడా పౌరసత్వం ఇస్తున్నారు అని అస్సాం నుండి అభ్యంతరం రావటంతో 1986లో పౌరసత్వ చట్టాన్ని సవరించి ఆ అధికారాలని కేంద్ర ప్రభుత్వానికి దఖలుపరిచారు. అయితే దానిని 2004లో కేవలం రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల కోసం సవరించి ఈ రెండు రాష్ట్రాలలో మాత్రం జిల్లా కలెక్టర్లు ఇవ్వవచ్చు అని 2004లో పౌరసత్వ చట్టాన్ని సవరించారు. గుజరాత్, రాజస్థాన్ రెండూ పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలే. పాకిస్థాన్ నుండి కొన్ని లక్షల సంఖ్యలోనే, ఎక్కువుగా హిందువులు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకి వలస వచ్చారు. డెబ్బైలలోనే నాటి జన సంఘ్ ప్రభుత్వం ఇందులో కొన్ని వేల మందికి పౌరసత్వం కలిపించింది. 2004లో ఈ రెండు రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా చేసిన సవరణతో ఇప్పటికీ కొన్ని లక్షల మందికి ఈ రెండు రాష్ట్రాలలో పౌరసత్వం ఇచ్చారు. ఈ రెండు రాష్ట్రాలకి ఎక్కువగా వచ్చింది హిందువులు కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకి మాత్రం మినహాయింపు ఇచ్చారు అని చెప్పుకోవక తప్పదు. అయితే పౌరసత్వం ఇవ్వటం తప్పు కాదు, హిందువులకి ఒక నియమం, ప్రత్యెక సవరణలు, ముస్లింలకి ఒక నియమం తప్పు అని. ఇది చెప్పటం యొక్క ముఖ్య ఉద్దేశం చారిత్రకంగా కూడా ఈ హిందుత్వ దాడి అనేది అనేక విధాలుగా, అనేక రూపాలలో నిరాటంకంగా జరుగుకుంటూ వస్తున్నదని. ఇది ఎదో కేవలం 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన వ్యవహారం కాదు. లేదా మోదీ తన ఆర్ధిక వైఫల్యాలని కప్పిపుచ్చుకోవటానికి చేస్తున్న జిమ్మిక్కు అంతకన్నా కాదు. ఫాసిస్టు శక్తులు తమ లక్ష్యాన్ని సాంస్కృతికంగా, చట్టపరంగా, సామాజికంగా చేసుకుంటూ వస్తున్నారు. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలంటే తొంభైలలో జరిగిన ‘ఆపరేషన్ పుష్ బ్యాక్’. బంగ్లాదేశీ చొరబాటుదారులు దేశంలో నివసిస్తున్నారు వారిని తరిమెయ్యాలి అనే వాదన తొంభైల నుండి బలం పుంజుకుంది. 1992లో ముఖ్యంగా దిల్లీలో నివసిస్తున్న బంగ్లాదేశీలని తీసుకువెళ్ళి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దు నుండి బంగ్లాదేశ్ లోకి తోసివెయ్యటం కూడా జరిగింది. అలా తోసేయ్యకముండు వారికి గుండు కొట్టిచ్చి, అవమానించి, కొట్టి చాలానే చేశారు. ఇటువంటి జరుగుతానే ఉంటాయి. ఇప్పుడు కాస్త ఇది ప్రధాన స్రవంతి కామన్ సెన్స్ అయ్యింది.

ద్వేషం అనేది రాత్రికి రాత్రి పుట్టుకురాదు. దాని వెనకాల చారిత్రక కారణాలు, సాంస్కృతికంగా, సామాజికంగా ఎంతో పని జరుగుతుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థ ఏదో సంస్థ కాదు. వారికున్నన్ని ఆసుపత్రులు, విద్యాలయాలు, సాంస్కృతిక కేంద్రాలు, కేడర్ మరెవరికీ లేవు. ఇది వాళ్ళ వంద సంవత్సరాల కృషి ఫలితం. మనిషి మస్తిష్కం ఒక బ్లాంక్ స్లేట్ లాంటిది. దాని మీద మనం ఆర్థికం అని రాస్తే ఆర్థికం గురించి మాట్లడతారు, సాంస్కృతికం అని రాస్తే దాని గురించి మాట్లడతారు, లేదా సాంస్కృతిక బూచి చూపించి ఆర్ధిక కష్టాల నుండి పక్కదారి పట్టిస్తే అలాగే పడతారు అనే ఒక క్రూడ్ వాదన చాలా నష్టం చేసింది, చేస్తూనే ఉన్నది. ఒక హైందవ అస్తిత్వం, దానికి స్వాభావికంగా ఉన్న ‘అథరింగ్’ క్రేవింగ్ కి వ్యతిరేకంగా పోరాడటం మామూలు విషయం కాదు. జీతాలు పెంచమని, డీజిల్ రెట్లు తగ్గించమని, సంక్షేమ పధకాలు ఉండాలని చెప్పి ప్రజలని సమీకరించడం ఒకంతవరకు తేలికైన విషయమే. ఎందుకంటే అది వారు కూడా నష్టపోతున్నారు కాబట్టి వారు వస్తారు. అయితే హిందూ అస్తిత్వం అనేది అందరికీ ఎంతో కొంత బలం, అధికార హోదా అనేది ఇస్తుంది. దానిని వదులుకోమని చెప్పి సమీకరించడం అంత తేలికైన పని కాదు. అధికారం అనేది కేవలం రాజ్య యంత్రంలో, పెట్టుబడిదారి వ్యవస్థలో మాత్రమే ఉంది, అవి బాహ్య ఎలిమెంట్స్ కాబట్టి వాటిని ఎదుర్కున్నట్టే ఈ హైందవ అస్తిత్వాన్ని, ఫాసిస్టు వ్యవస్థని ఎదుర్కోవటం కుదరని పని. బాహ్య అధికారాన్ని ఎదిరించేవారు అధికారం అనే దానిని సహజసిద్ధంగానే వ్యతిరేకిస్తారు అనే ఒక అవగాహన ఎంత తప్పైనదో బహుశా ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి. ఒక శతాబ్దం అనుభవం ఉంది మరి ఆ విషయంలో. స్వాభావికంగా ఉన్న దానిని వాడుకుని ఫాసిస్టులు నేడు పూర్తి అధికారం చెలాయించే స్థాయికి వచ్చారు. మరి ఫాసిస్టు వ్యతిరేకులు ఎక్కడ ఉన్నారు? ఇప్పటికీ ఇది పెట్టుబడిదారి కుట్ర, సామ్రాజ్యవాదం కుట్ర, ఆర్ధిక సంక్షోభం నుండి దృష్టి మరల్చే కుట్ర లాంటి కుట్ర రాజకీయాలలో మునిగి తేలుతున్నట్టు ఉంది. వాళ్ళే మాత్రం కుట్ర చేస్తున్నారో కానీ తమకంటూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకుని, బాహ్య ప్రపంచంలో జరిగే ప్రతిదానిని తాము సృష్టించుకున్న ప్రపంచంలో ఇమడ్చటానికి నానా పాట్లు పడుతూ, వామపక్ష కేడరే ఫాసిస్టు శక్తుల వైపుకి వెళ్ళే పరిస్థితిని తీసుకువచ్చారు. ఇదొక్కటే కాక అధికారం కోసం తాపత్రయపడటం ఆర్ఎస్ఎస్ ఉద్దేశం ఏనాడు కాదు. హిందూ రాష్ట్రం ఏర్పాటు చెయ్యటం వాళ్ళ ముఖ్య లక్ష్యం. వామపక్షవాదులు, అంబేద్కర్ వాదుల కన్నా ఈ ఫాసిస్టు శక్తులకి బాగా తెలిసినది ఒక విషయం- పూర్తి ఆధిపత్యం ఏర్పరచాలి అంటే అందుకు కావలసింది రాజ్యాధికారం కాదు, రాజ్యాధికారం అనేది ఆధిపత్యం ఏర్పాటు చేశాక జరిగే ఒక చర్య మాత్రమే అని. ప్రభుత్వంలో అధికారంలో ఉండటం అనేది సమాజంలో ఆమోదం ద్వారా తమ ఆధిపత్యం ఏర్పాటు చెయ్యడానికి ఒకానొక సాధనం మాత్రమే కానీ అది మాత్రమే సాధనం కాదు, అది వారి లక్ష్యం అసలే కాదు. అందుకే సంఘీయులు అన్ని పార్టీలలో, అన్ని భావజాల స్రవంతులలో కనిపిస్తుంటారు. అది వారి బలం. వారి దృష్టి అంతా హిందుత్వ ఫాసిజానికి సమాజంలో మద్దతు కూడగట్టడం. ఆ పనిలో వారు బానే సఫలీకృతం అయ్యారు. ఫాసిజం అనేది రాజ్యం సమాజం మీద బలవంతంగా రుద్దే పెత్తనం కాదు. అది ప్రజాబాహుళ్య మద్దతుతో నడిచే ఒక ఉద్యమం. సమాజంలో ఎంతోకొంత వేళ్లూనుకునే ప్రజాస్వామిక భావనలకి వ్యతిరేకంగా తమ మద్దతుని కూడకట్టుకునే ఒక ఉద్యమం. నేడు హిందుత్వ ఫాసిజం ఇంత మద్దతు కూడకట్టుకోవటం వెనకాల వంద సంవత్సరాల కృషి ఉంది.

బాలగోపాల్ చెప్పిన దానిని ఇక్కడ ఉటంకించి దీనిని ముగిస్తాను. “ద్వేషాన్ని పెంపొందించినంత తేలికగా ప్రేమని పెంపొందించగలమా? రాడికల్ భావజాలం కలిగిన వారు ఇటువంటి ప్రశ్నలు చూసి అభద్రతకి గురవుతుంటారు. ఎందుకంటే ఇటువంటి ప్రశ్నలు వారి ఉటోపియన్ కలలకి ప్రాణంతకమైనవి కాబట్టి. కలలు సరైనవే, బహుశా అవసరం కూడా, అయితే కలలని వాస్తవిక పరిస్థితుల పరిధిలోకి తీసుకురావలసిన నిజాయతి మనకి ఉండాలి.”

మానవ హక్కుల వేదిక కార్యకర్త

Leave a Reply