ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్, అమృత కాలం అంటూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్, గోడీమీడియా కొంతకాలంగా ఊదరగొడుతున్నాయి. నిజానికి దేశంలో అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అంతరాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, సహజ వనరులు కార్పొరేట్లకు పందేరం, ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ వంటి సమస్యలు ప్రజా ప్రయోజనాలకు ప్రతికూలంగా మారాయి. మోడీ ప్రభుత్వం 2014లో వాగ్దానం చేసిన హామీలు పదేళ్లలో అమలు కాలేదు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో లక్ష్యాలను చేరుకోలేదు సరికదా! పలు అంశాలలో సార్వత్రిక ప్రమాణాలను చేరుకోవడంలో మోడీ ప్రభుత్వం విఫలమైనట్లు పలు అంతర్జాతీయ నివేదికలు తెలుపుతున్నాయి. గడిచిన ఐదు సంవత్సరాలుగా హోరెత్తిస్తున్న అంశం భారత స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి) ఐదు ట్రిలియన్ డాలర్లు (420 లక్షల కోట్ల రూపాయలు) చేరుకుంటుందని, దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 3వ స్థానంగా నమోదు కాబోతున్నదని గొప్పగా చెబుతున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో 18వ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 2 వరకు ఏడు దఫాలుగా పోలింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ మార్చి 16న ప్రకటించింది.
అబద్ధాలపై అబద్ధాలతో విలువల పతనం :
బిజెపి అధికారానికి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి, అధ్యక్షతరహా పాలన తెస్తామని ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారం చేస్తున్నది. అందుకుగాను ఈసారి 400 సీట్లు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించింది. మూడవసారి అధికారం చేపట్టడానికి ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోని బిజెపి కూటమి విస్తృత ప్రచారం గావిస్తున్నది. ప్రచార, ప్రసార సాధనాలను వినియోగించడమేకాక సొంత సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ప్రచారం వెగటు పుట్టిస్తున్నది. గత పదేండ్లలో జరగని కృషిని జరిగినట్లు చెప్పడంతో పాటు 2047 నాటికి ‘వికసిత భారత్’ ఏర్పాటు చేస్తామని చెబుతున్నది. ప్రస్తుతం దేశం ‘ఆత్మ నిర్భర్ భారత్'(స్వయం పోషకత్వ దేశం)గా మారిందని చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘వాషింగ్ మిషన్’ విధానాన్ని అమలు జరుపుతున్నది. అంటే, వేలకోట్ల అవినీతిపరులు తమ పార్టీలోకి రావడంతో వారి అవినీతి ఆరోపణలను తొలగించి వేస్తున్నారు. అశోక్ చౌహాన్ (కార్గిల్ ఇండ్ల కుంభకోణం), అజిత్ పవార్ (రూ.25 వేల కోట్లు), నవీన్ జిందాల్ (ఎన్నికల బాండ్లు), గాలి జనార్ధన్‌రెడ్డి (వేల కోట్ల ఐరన్ ఒర్), తపస్ రారు, సువేంద్‌రారు లాంటి 60 మందికి వాషింగ్ మిషన్ పథకం కింద అవినీతి నేరాలను తొలగించారు.
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలంటే ప్రజలను తమ ఘనత గురించి, లేదా తమ అబద్ధాలతో, లేదా ప్రత్యర్థులపైన ఆరోపణలతో ఏదో ఒక విధంగా మెప్పించాలి. ఆ విధంగా తమ స్వంత వైఫల్యాలను, బలహీనతలను ప్రజల దృష్టిలో మరుగునపడేట్లు చేయాలి. వైఫల్యాలు, లోపాలు ఎంత ఉంటే తమ పట్ల ప్రజలకు ఎంత అపనమ్మకం ఉందనుకుంటే అంతగా, వాటిని మరపింపజేసేందుకు, ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు, తమ అబద్ధాలు, ఆరోపణలు, దూషణలతో, హంగామా సృష్టించి ప్రజల్లో మతపరమైన విభజన తెచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు సంస్కారం, నాగరికత, ప్రజాస్వామిక విలువలు మరిచి పట్టుదలతో కృషి చేస్తున్నాయి. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక అంశాలను ప్రస్తావించకుండా కేవలం మోడీ నాయకత్వం తిరగులేదని చూపుతూ ఆయన ‘శ్రీరాముని’ అవతారంగా చిత్రీకరించే ప్రయత్నం తీవ్రంగా జరుగుతుంది. ఈ విధంగా ఎన్నికల్లో అబద్ధపు ప్రచారాలు శృతి మించడం గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆరోపణలు దూషణలు చేసుకోవడం ఈ విలువల పతనానికి ప్రతి ఫలనాలే.
మరోవైపు ‘మోడీ ఉన్నాడు కాబట్టి దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం భద్రంగా ఉంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు…’ అన్నట్లు మాట్లాడుతున్నారు. తమ పార్టీ, ప్రభుత్వం కాకుండా తాను ప్రజలకు భరోసా అన్నట్లుగా మోడీ వ్యవహరిస్తున్నారు. పార్టీకి అతీతమైన నేతగా చెప్పుకొనే ధోరణి ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నట్లే కాగలదు. ఎన్నికల ప్రణాళికలో నిర్దిష్టమైన హామీలు, కార్యప్రణాళికలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేయలేదు. మోడీ ఎన్నికల ప్రసంగాల్లో కాంగ్రెస్‌ది ‘ముస్లింలీగ్ మ్యానిఫెస్టో’ అని ఆరోపించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఏప్రిల్ 5న విడుదల కాగా ఆ మరునాడే రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ముస్లింలీగ్ ముద్ర కన్పిస్తోందని విమర్శించారు. అయోధ్యలో జరిగిన బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రతిపక్షాలు గైర్హాజరు అయ్యాయని, హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతారని, మతపరమైన రిజర్వేషన్లు ఉండవని పదేపదే లేవనెత్తారు.
ఈసారి ఎన్నికలు ప్రపంచ దేశాలకు ఆసక్తి గొలుపుతున్నాయి. వీటిని పరిశీలించటానికి 23 దేశాల నుంచి 75 మంది ప్రతినిధులు ఇప్పటికే అరుదెంచారు. భారత ఎన్నికల కమిషన్ ఆహ్వానంపై విచ్చేసిన వీరు ఆయా దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థల (ఇఎంబిలు) ప్రతినిధులు కావటం విశేషం. భూటాన్, మంగోలియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, ఫిజి, కిర్ఘిజ్ రిపబ్లిక్, రష్యా, మాల్దోవా, టునీషియా, సెషల్స్, కాంబోడియా, నేపాల్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్, కజకిస్థాన్, జార్జియా, చిలీ, ఉజ్బెకిస్థాన్, మాల్దీవులు, పపువా న్యూ గినియా, నమీబియా ప్రతినిధులు వారిలో ఉన్నారు. ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్ సభ్యులు, భూటాన్, ఇజ్రాయెల్ మీడియా సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే మోడీ మత రాజకీయ విద్వేష ప్రసంగాలను ప్రపంచ మీడియా పలు వ్యాఖ్యానాలు, కథనాలతో దుమ్మెత్తి పోసింది.
ప్రజల ఎజెండా లేని ఎన్నికల ప్రచారం :
రెండు మాసాలుగా దేశమంతా లోక్ సభ ఎన్నికల కోలాహలంలో ఉంది. ఇప్పటికీ 6 విడతల ఎన్నికలు ముగిసి చివరి విడత ఎన్నికలు జూన్ 1న జరుగనున్నాయి. ఏ నాయకుడు, ఏ పార్టీతో, ఏ ఎజెండాతో ఓట్లడగటానికి వస్తాడో నామినేషన్ వేసే వరకు తెలియని పరిస్థితి. పార్టీల ప్రణాళికలు, జెండాలు, ఎజెండాలు పక్కదారి పట్టాయి. ప్రస్తుత ఎన్నికల సంబరంలో ప్రజల ఆకాంక్షలైన పెరిగిన ధరలు, ఉపాధిలేమి, పేదరికం, విద్య, వైద్యం వంటి అంశాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అత్యంత కీలకమైన ప్రజా సమస్యల ప్రస్తావన, వాటి పరిష్కారాల చర్చ మచ్చుకైనా కనబడడం లేదు, వినబడడం లేదు. వ్యవసాయ పారిశ్రామిక రంగాల సంక్షోభం, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, తీవ్రంగా పెరిగిపోతున్న అసమానతలు, దేశవ్యాప్తంగా ప్రతి ప్రజా సమూహంలోనూ పెచ్చరిల్లుతున్న అసంతృప్తి, దేశ వనరులను కార్పొరేట్లకు దోచిపెడుతున్న పాలక విధానాలు, ప్రశ్న మీద భిన్నాభిప్రాయం మీద అమలవుతున్న దమనకాండ వంటి ప్రధాన మౌలిక సమస్యలు అసలు చర్చకైనా రావడం లేదు.
ఎన్నికల ప్రచారంలో పరస్పర దూషణ, అబద్దాలు, విద్వేషాలు ప్రధాన ఎజెండగా మారాయి. ఎవరికి ఎవరు తీసిపోకుండా వారసులను పోటీకి దింపారు. ఒక పార్టీ టికెట్ ఇవ్వకపోతే, ఆ పార్టీని తిడుతూ, మరో పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. టికెట్ సంపాదించుకోవడానికి, పదవులు పొందడానికి దిగజారి ప్రవర్తించారు? అసలు గెలిస్తే ఏ పార్టీలోకి జంప్ అవుతాడో తెలియదు. ఇదంతా ప్రజాసేవా కోసమేనా? అంటే అదేమి కాదని అందరికి తెలుసు. దీంతో భారత పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఎంత డొల్లబారి పోయిందంటే, పాలకవర్గ ముఠా తగాదాలు ఎటువంటి విధానాలను, సూత్రాలను, విలువలను పాటించని వీధి రౌడీల కోట్లాటను తలపిస్తున్నాయి. దీనికి కారణం రాజకీయాలు వ్యాపారంగా మారడమే. దీంతో బూర్జువా ప్రజాస్వామిక విలువలు కూడ పతనమయ్యాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. మరోవైపు సమాజాన్ని మత ప్రాతిపదిక మీద చీల్చడం, ముస్లిం బూచి చూపి హిందువుల ఓట్లు దండుకునే ప్రయత్నం, ఆ క్రమంలో పచ్చి అబద్ధాలు, అర్ధసత్యాలు, ద్వేష ప్రవచనాలు, అధికారవర్గ దుర్వినియోగం, కప్పల తక్కెడ రాజకీయాలు విచ్చలవిడిగా సాగిపోతున్నాయి. అన్ని పార్టీల నాయకులూ ఎన్నికలను ప్రజలను మాయ చేసే ఒక సాధనంగా వాడుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా తమ వికృత మానసికతలను, ప్రవర్తనను బైట పెట్టుకుంటున్నారు.
ఎన్నికల నాటకంలో ఇవాళ ప్రత్యేకంగా చెప్పవలసినది సంఘ్ పరివార్ పాత్ర. మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశమంతా విషమూ విద్వేషమూ, మూఢత్వమూ వ్యాపింపజేస్తున్న నరేంద్ర మోడీ పాత్ర. ఇరవై శతాబ్ది ఫాసిజానికి ప్రతీక అడాల్ఫ్ హిట్లర్ నాంది పలికితే, ఆయన్నే ఆదర్శంగా తీసుకుని నరేంద్ర మోడీ తాను ఏ రాజ్యాంగం ఆధారంగా ఆ పదవికి చేరాడో, ఏ రాజ్యాంగం మీద ప్రమాణ చేసి అధికారం అనుభవిస్తున్నాడో, ఆ రాజ్యాంగ ఆదర్శాలకు తూట్లు పొడవడానికి ఎన్నికల ప్రచారంలో అనుక్షణం ప్రయత్నిస్తున్నాడు. సమానత్వానికి, అణగారిన వర్గాల సంక్షేమానికి, సహజీవనానికి, బహుళత్వానికి, సహనానికి లౌకికతకు సమాధి కడుతున్నాడు. అయితే భారత ప్రజలు కాషాయ పార్టీ మతోన్మాదాన్ని రానురాను అసహ్యించుకుంటున్నారు తిరస్కరిస్తున్నారు. అందువల్లనే మరోసారి విద్వేష ప్రసంగాలతో హిందూ మెజారిటీ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడానికి ప్రధాని అతని కాషాయ పరివారం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.
దేశాన్ని ఐదు దశాబ్దాల పాటు పాలించి అన్ని అక్రమాలకూ కన్నతల్లి అయిన కాంగ్రెస్ ఇప్పుడే తన పొరపాట్లు తెలిసినట్లు నటిస్తున్నది గాని, అధికారంలోకి వస్తే తన పాత తప్పులను సవరిస్తానని, కనీసమైన ప్రజానుకూల పాలన నెరపుతానని వాగ్దానం చెయ్యలేకపోతున్నది. యువతకు ఉపాధి కల్పిస్తామని, ధరలు తగ్గిస్తామని, అందరికి ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని, క్షీణిస్తున్న వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు, ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతామని, పౌర ప్రజాతంత్ర హక్కులు పునరుద్ధరిస్తామని, రాజ్యహింసను నియంత్రిస్తామని చెప్పడం లేదు. మొత్తం మీద అటైనా ఇటైనా వాళ్ల దృష్టిలో ప్రజలు లేరు, ప్రజా ప్రయోజనాలు లేవు, ప్రజా సంక్షేమం లేదు. అధికారంలో ఉంటే కార్పొరేట్ల భజన, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల మాట. అందువల్ల పాలకవర్గ పార్టీల వల్ల, క్రమం తప్పకుండా జరిగే ఎన్నికల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఏడున్నర దశాబ్దాల వలసానంతర భారత చరిత్ర వేనోళ్ల ప్రకటిస్తున్నది.
అపహాస్యం పాలవుతున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం :
బూర్జువా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉండేవాళ్లు కూడా సిగ్గుపడవలసినంత అన్యాయంగా ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ సాగుతున్నది. బూర్జువా ప్రజాస్వామ్యం రాచరిక, భూస్వామ్య, నిరంకుశత్వపు బంధనాల నుంచి సమాజాన్ని విముక్తం చేయదలచిన తొలినాటి పెట్టుబడిదారీ బూర్జువా వర్గం సమాజానికి ప్రజాస్వామ్య ఆదర్శాన్ని అందించింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని నినదించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, ఒక మనిషికి ఒక ఓటు, వ్యక్తిస్వేచ్ఛ, చట్టబద్ధ పాలన, అధికారాల విభజన, స్వతంత్ర న్యాయవ్యవస్థ సాధికారత, పత్రికా స్వేచ్ఛ, స్వేచ్ఛాయుత ఎన్నికలు, ప్రజా సంక్షేమం వంటి అనేక ఉదాత్త ఆదర్శాలను మానవజాతి ముందు పెట్టింది. బూర్జువా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థల తటస్థత, నిష్పాక్షికత ఉంటుంది. మోడీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు బిజెపి రాజకీయ ఉపాంగాలుగా మారాయి. ఇవాళ భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒక వర్గ పాలన అని తేలిపోయింది.
ఈ నేపథ్యంలో నిజమైన ప్రజల ప్రజాస్వామ్యం నుంచి బూర్జువా ప్రజాస్వామ్యాన్ని వేరు చేసి చూడవలసి ఉంది. భూస్వామ్య, రాచరిక విలువలు, లేదా ఆ విలువల అవశేషాలు కొనసాగే చోట బూర్జువా ప్రజాస్వామ్యమైనా మంచిదే, అది కూడా ఒక ప్రగతిశీల ముందడుగే అనిపిస్తుంది. నిజానికి బూర్జువా ప్రజాస్వామ్యం ప్రజల పట్ల ప్రజాస్వామ్యం కాదు. అది కేవలం పాలకవర్గ ముఠాల మధ్య సమన్వయాన్ని కుదిర్చే, వారి ప్రయోజనాల మధ్య సమతూకానికి హామీ ఇచ్చే ఏర్పాటు, అందువల్ల ఆ ముఠాల మధ్య ఇచ్చిపుచ్చుకునే మర్యాదలు, సమాన అవకాశాలకు కట్టుబడి ఉండే నిబద్ధత వంటివి ఉంటాయి. ఈ సారి ఎన్నికల్లో బూర్జువా విలువలు, ఆదర్శాలు కూడ కనిపించడం లేదు. వి-డెమ్ నివేదిక ప్రకారం మనదేశంలో మోడీ పాలనల కొనసాగుతున్నది ‘ఎలక్టోరల్ అటోక్రసీ’ మాత్రమే. అంటే నిర్ణీత వ్యవధిలో ఎన్నికలు జరుగుతాయి కాని ప్రజలపైన నియంతృత్వమే కొనసాగుతుంది.
ఈ దేశంలో కార్పొరేట్- హిందుత్వ విధానాల ఆచరణనూ భావజాలాన్నీ, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను ఏదో ఒక స్థాయిలో జీర్ణం చేసుకోని పార్లమెంటరీ రాజకీయ పక్షం ఒక్కటైనా ఉందా? అంటే లేదనే సమాధానం వస్తుంది. ఈ 2024 ఎన్నికలు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చివరి ఎన్నికలు అవుతాయని అనేవాళ్లు, ఈ ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితిలోనూ సంఘ్ పరివార్‌ను తిరిగి రానివ్వగూడదనే వాళ్లు, మోడీ మూడో మారు వచ్చి హిందూత్వ రాజ్యాన్ని, రామరాజ్యాన్ని సంపూర్ణం చేస్తాడనే వాళ్లు ఉన్నారు. విభిన్న ఆలోచనలు చెలరేగుతున్నందున ఇవి ఆసక్తికర ఎన్నికలు, సంఘ్ పరివార్ తిరిగి వస్తుందా? వచ్చినా ఎంత ఆధిక్యతతో వస్తుంది? ఆధిక్యత తగ్గితే ఇప్పటంత దూకుడుగా ఉండగలదా? ఒకవేళ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే నిజంగానే సంఘ్ పరివార్ ప్రయోజనాలకు అడ్డుకట్ట వేయగలదా? దేశంలో ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు, హిందుత్వ సామాజిక రాజకీయ విధానాలు ఆగిపోతాయా? వంటి ప్రశ్నలు బుద్ధిజీవులను వేధిస్తున్నాయి.
గత పది సంవత్సరాలలో లేదా అంతకు ముందు అరవై సంవత్సరాలలో మన అధికార యంత్రాంగాలలో సంఘ్ పరివార్ భావజాలంతో ఉన్న వ్యక్తులూ తమ పని కొనసాగించకుండా ఉంటారా? చివరికి ప్రజల మెదళ్లలో ఈ పది సంవత్సరాలలో పడిన కాషాయ విష బీజాలు మొక్కై మానై పెరగకుండా ఆపగలమా? ఈ పదేళ్లలో ఏకీభవించనోని పీక నొక్కు సిద్ధాంతం అమలయింది. పార్లమెంటరీ ప్రతిపక్షాలకు కూడా ప్రచారవకాశాలు లేకుండా చేయడం జరిగింది. ఆ ఆదుర్దాతో పాటే బైటపడుతున్న ఎన్నికల బాండ్ల అక్రమాలు ఈ వ్యవస్థ మరమ్మత్తు సాధ్యం కానంతగా పుచ్చిపోయిందని చూపుతున్నాయి. ఆ శైథిల్యానికి సంఘ్ పరివార్ ఒకానొక రూపం మాత్రమే. ఇప్పుడు ప్రశ్నించగలిగిన శక్తులను మేల్కొలపడం, సమీకరించడం, సంఘటితం చేయడం, సృజనాత్మక జవాబులకు, చర్చలకు, ఆలోచనల సంఘర్షణకు ఈ సమాజాన్ని సంసిద్ధం చేయడం బుద్ధిజీవుల కర్తవ్యం. ఈ దేశపు అట్టడుగు ప్రజానీకం, శ్రమజీవులు, ఆదివాసులు, దళితులు, మైనారిటీలు, మహిళలు, బహుజనులు. వారికి క్రియాశీలమైన చైతన్యం అందించవలసిన బాధ్యత పురోగామి శక్తులపైనే ఉంది.
మోడీ అబద్ధాలు- ఎన్నికల కమిషన్ నిర్లిప్తత :
సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ఎన్నికల కమిషన్ ఏర్పాటుకు ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిసి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉండగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి కేంద్ర కేబినెట్ మంత్రితో త్రిసభ్య కమిటీ వేసి ప్రస్తుత ఎన్నికల కమిషన్‌ను రికమండ్ చేసి భారత అధ్యకక్షునిచే మోడీ ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. దీంతో ఎన్నికల కమిషన్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి పాలక పక్షానికి వ్యతిరేకంగా ఎన్ని ఫిర్యాదులు అందుతున్నా నిమ్మకునీరెత్తినట్లు ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోంది. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్వేష ప్రసంగాలు చేయడం వల్ల కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. ప్రతిపక్షాల నేతలపై అందిన ఫిర్యాదులపై ఆఘమేఘాలపై స్పందించే ఎలక్షన్ కమీషన్ .. అధికార బిజెపి నేతలపై అందే ఫిర్యాదులపై మీనమేషాలు లెక్కిస్తూ దాటేస్తుండటంతో రాజ్యాంగ సంస్థపై క్రమేపి విశ్వాసం సన్నగిల్లుతోంది.
కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తూ, ముస్లిం మైనారిటీలను కించపరుస్తూ మతిభ్రమించి ప్రధాని నరేంద్ర మోడీ గత నెల 21న రాజస్థాన్‌లోని బాన్‌స్వారాలో చేసిన ఎన్నికల ప్రసంగానికి సంబంధించిన వీడియోను పూణేకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంకిత్ శూక్లా చూశారు. ఆయన గతంలో ఎన్నడూ ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాయలేదు. కానీ మోడీ ప్రసంగాన్ని విన్న రోజు రాత్రే ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు ఇ-మెయిల్ పంపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, ప్రజా ప్రాతినిధ్య చట్ట నిమయమావళిని ఉల్లంఘించినా మోడీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ‘భారతీయులకు వ్యతిరేకంగా విద్వేషం, మతోన్మాదం అనే విషంతో మనసును నింపుకున్న వ్యక్తిని ఎన్నికల్లో పాలుపంచుకునేందుకు అనుమతించకూడదు’ అని అందులో సూచించారు. అయితే శుక్లాకు ఇప్పటి వరకూ ఎలక్షన్ కమీషన్ నుండి సమాధానమే రాలేదు.
ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ అన్ని హద్దులూ దాటి ప్రతిపక్షాలపై నిందారోపణలు చేస్తున్నారు. ఏప్రిల్ 21న మోడీ రాజస్థాన్‌లోని బాన్‌స్వారాలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళల మంగల సూత్రాలతో సహా ప్రజల ఆస్తిని స్వాధీనం చేసుకుని ముస్లింలకు అప్పగించడానికి ప్రణాళిక వేస్తున్నదని పేర్కొన్నారు. పైగా ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో పెట్టిందని చెప్పారు. ఒక సెక్షన్ ప్రజలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే ఇటువంటి ప్రసంగాలు చేయడం ఎన్నికల నిబంధనావళి ప్రకారం నేరం. 24 గంటలు గడవక ముందే ఏప్రిల్ 22న అలీఘర్‌లో ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ దేశంలోని వనరులపై మొదటి హక్కు ముస్లింలకే ఉన్నదని కాంగ్రెస్ చెప్పిందని మరో అబద్ధం చెప్పారు. దేశ సంపదను ఆ పార్టీ ‘విదేశీ చొరబాటుదారులకూ’, ‘అధిక సంతానం కనేవారికీ’ పునఃపంపిణీ చేస్తుందని ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నించారు. మోడీ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే, ఎందుకంటే కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో అటువంటిదెక్కడా చెప్పలేదు. ముస్లిం మైనారిటీలపై విషం చిమ్ముతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఒబిసిల రిజర్వేషన్లను రద్దు చేసి వాటిని ముస్లింలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. మే 7వ తేదీన మూడవ దఫా పోలింగ్‌లో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న అనేక గ్రామాలలో వారి ఓటు హక్కు నిరాకరించబడింది. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల బయట నిరీక్షిస్తున్న ముస్లింలపై పోలీసులు దాడికి దిగారు.
మరోవైపు ముస్లింలను కించపరిచే వీడియోలను సామాజిక మాధ్యమాలలో బిజెపి ప్రచారంలో పెడుతోంది. ఇంత జరుగుతున్నా ఎన్నికల కమిషన్ కంటికి ఇవేమీ కన్పించడం లేదు. విద్వేష ప్రసంగాలు చెవులకు వినిపించడం లేదు. హిందూత్వ పార్టీ బాహాటంగా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా మౌనం వహిస్తోంది. బన్‌స్వారాలో మోడీ చేసిన ప్రసంగంపై బిజెపి అధ్యకక్షుడు జెపి నడ్డాకు ఎన్నికల కమిషన్ నోటీసు పంపింది. అందులో ఎక్కడా మోడీ పేరు లేదు. ముస్లింలను పరాన్నజీవి అయిన కోడిగా చూపుతూ కర్ణాటక రాష్ట్ర బిజెపి హ్యాండిల్ ఈ నెల 3న విద్వేషంతో నిండిన ఒక క్యారికేచర్ వీడియోను పోస్ట్ చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుండి ‘నిధుల’ దాణా అందుకున్న తర్వాత ఆ కోడి ఎస్సీ, ఎస్టీ, ఓబిసి పిల్లలను గూడు నుండి బయటకు తరిమేసినట్లు అందులో చిత్రించారు. ఈ క్యారికేచర్‌పై ఎన్ని ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఇసి పట్టించుకోలేదు. కర్ణాటకలో పోలింగ్ పూర్తయ్యే వరకూ వేచి ఉండి, ఆ తర్వాత వీడియోను తొలగించాలని ట్విటర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతే తప్ప బిజెపిపై ఎలాంటి చర్యలు లేవు.
డబ్బు చుట్టూ ఎన్నికలు :
ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యమంటూ, విశ్వగురువు అంటూ మాటలు చెబుతున్నారు. అయితే దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగై ధనస్వామ్యం నడుస్తోంది. బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తుంటే ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదు. లోక్‌సభ ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకోవడానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రలోభాల పర్వం సాగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.8,889 కోట్ల మేర విలువైన నగదు, మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇది సముద్రంలో కాకి రెట్ట మాత్రమే. బంగారం, వెండి వంటి ఆభరణాలు రూ. 1260.33 కోట్లు, ఇతర ఉచితాలు రూ.2006.59 కోట్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలియజేసింది. అత్యధికంగా గుజరాత్‌లో రూ.1461.73 కోట్ల విలువైన ప్రలోభాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం నివేదికలో వెల్లడైంది. రాజస్థాన్ రూ.1133.82 కోట్లు, పంజాబ్ రూ.734.54 కోట్లు, రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో రూ.301.75 కోట్లు, తెలంగాణలో రూ.333.55 కోట్లు సొత్తు జప్తు చేసింది.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బిజెపి 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు పలు స్వచ్చంధ సంస్థలు, పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ వివరాలను ‘ది వైర్’ ఒక కథనాన్ని ప్రచురించింది. రాష్ట్రాలలో బిజెపి చేస్తున్న వ్యయాన్ని కూడ కలుపుకుంటే 2024 ఎన్నికల్లో అక్షరాల లక్ష కోట్ల రూపాయల పైనే ఖర్చు చేయనుంది. బిజెపికి ఇంత మొత్తంలో నిధులు ఎక్కడ నుండి, ఎలా అందుతున్నాయంటే అదానీ, అంబానీ లాంటి ఆశ్రిత పెట్టుబడిదారుల నుండే నన్నది నగ్న సత్యం. బిజెపి 2014-15 నుండి 2022-23 వరకు అధికారికంగా ప్రకటించిన 14,663 కోట్ల రూపాయల ఆదాయంతో పోలిస్తే ఐదు నుండి ఏడు రెట్లు ఎక్కువ! దీనిని పరిగణలోకి తీసుకుంటే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆ పార్టీకి అందింది కేవలం 10 శాతం మాత్రమే! ఇంత జరుగుతున్నా ఎన్నికల కమిషన్‌లో ఉలుకు పలుకు లేదు.
ముగింపు :
మనది ‘అర్థవలస-అర్థభూస్వామ్య వ్యవస్థ’ మాత్రమేనని, ఏడున్నర థాబ్ధాలుగా రాజ్య పాలన విధానాలు తెలియజేస్తున్నాయి. భారత దేశ సంపదలో అత్యధిక భాగం 100 మంది దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల చేతుల్లో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 40 శాతం కుటుంబాలు సెంటుభూమి లేనివారుగానే ఉన్నారు. గ్రామీణ చేతి వృత్తులు ధ్వంసమై ప్రత్యామ్నాయం లేక దినసరి కూలీలుగా మారారు. బతుకు దెరువుకోసం కొందరు వలసలు వెళ్తున్నారు. ”పెట్టుబడిదారీ బూర్జువా వ్యవస్థలో ప్రజాస్వామ్యం అంటే రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే. పౌరులు ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని మార్చగలరు కాని రాజ్యాన్ని మార్చలేరు. ఆర్థిక, సామాజిక అసమానతల వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ఎన్నికలు అధికారాన్ని చలాయించే సంపన్నులనే వరిస్తాయి. బూర్జువా ప్రజాస్వామ్య చరిత్రలో ఇదే జరిగింది” అన్నారు (కాపిటలిజమ్ అండ్ ఇట్స్ ఎకనామిక్స్) డగ్‌లస్ దౌడు. బూర్జువా ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం అంటారు మాక్ చెన్ని. ”బూర్జువా ప్రజాస్వామ్యంలో ప్రజలను ములగ చెట్టెక్కించి, వారిని భ్రమల్లో ఉంచడం ద్వారా తమ వర్గస్వామ్య స్వభావాన్ని దాచి పెడతారు. యుక్తిగా తమ ప్రయోజనాలు నెరవేర్చుకుంటారు. ఆదాయం, సంపదలో అసమానతలున్న సమాజం ప్రజాస్వామిక సమాజం ఎలా అవుతుందని” డెమెక్రసీ-1988 గ్రంథ రచయిత మైఖేల్ ఫెర్నిటి ప్రశ్నించారు. భారతదేశంలో జరుగుతున్నది కూడా ఇదే. నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లి, ప్రజల సమస్యలు పరిష్కారమైన స్వేచ్ఛాయుత జీవితం గడుపాలంటే దేశంలో కార్మిక, కర్షక, మేధావి, విద్యార్థి ఐక్యతతో సంఘటితంగా జనతా ప్రజాతంత్ర విప్లవాన్ని విజయవంతం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు.