ప్రభువు క్షమించినా, ప్రజలు క్షమించరు

రాజ్యం (అందులోను ఫాసిస్టు రాజ్యం) స్వభావం తెలిసిన ఎవ్వరికైనా ఫాదర్ స్టాన్ స్వామి మరణం ఆశ్చర్యాన్ని కలిగించదు. నిజానికి రాజ్యం చేయబోయే ఈ హత్యను స్టాన్ స్వామి ముందే ఊహించాడు. అదే విషయాన్ని కోర్టులకు, సమాజానికి తన మరణవాంగ్మూలంగా చెప్పాడు. అయితే తాను ఫాసిస్టు పాలకులను, వారి రాజ్య యంత్రాంగాన్ని తన విడుదల కోసం ప్రాధేయపడలేదు. ఎందుకంటే అది కౄరరాజ్యం మొదలు పెట్టిన వికృత ఆటని అతనికి తెలుసు. ఏది ఏమైనా (ప్రాణాలు పోయినా సరే!) నేరం రాజ్యమేలుతున్నప్పుడు మౌన ప్రేక్షకుడిగా ఉండలేను, అలా ఉంటే భవిష్యత్తు మనల్ని క్షమించదని సుతిమెత్తగానే చెప్పిండు.

కేవలం ప్రభువుకు, ప్రజలకు మాత్రమే విధేయుడనయి వుంటానే తప్ప దోపిడీ పాలక వర్గాలకు, వాళ్ళ ప్రభుత్వాలకు కాదని తన ధిక్కారస్వరాన్ని వినిపించిండు. ప్రజల జీవితాలలో శాంతి విరసిల్లాలని ప్రార్థనలు చేసిండు. కేవలం ప్రార్థనలే కాదు హక్కుల కోసం ప్రజాస్వామిక పోరాటం చెయ్యాలని ప్రజాఉద్యమాలలో భాగమయ్యిండు. ఆదివాసీ జీవితాలను విఛ్ఛిన్నం చేసే పాలకవర్గ కుట్రలను ఎండగట్టిండు. అణగారిన వర్గాల, కులాల గొంతుకయ్యిండు. ముంచుకొస్తున్న హిందుత్వ ఫాసిజాన్ని ముందే పసిగట్టి ప్రమాద ఘంటికలు మోగించిండు.

అతను చేసిన పనిలో మానవత్వం కనబడుతుంది. ఎంచుకున్న పోరాట మార్గంలో ప్రజాస్వామిక విలువలు కనబడుతాయి. అతను ప్రజలను ప్రేమించిన తీరులో దైవత్వం ప్రకటించబడుతుంది. అతను శాంతిని కోరుకున్నాడు. కాని రాజ్యం అతనిని “హింసావాది” అని ముద్రవేసింది. “కుట్ర”లో భాగం చేసింది. మృత్యుముఖంలోకి నెట్టివేసింది.

అతను తిరిగిరాడు. కాని అతను నమ్మిన, ఆచరించిన ప్రజాస్వామిక విలువలు, వాటిని శిలువేసిన రాజ్యం మాత్రం మన ముందే వుంటాయి. ఒక ఆశ, ఒక దుర్మార్గం ఒకే సందర్భంలో కనబడుతున్నాయి. ఇప్పుడు శిలువేయబడిన ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే రాజకీయ ఆచరణకు దిగకపోతే మొత్తం సమాజమే నష్టపోయే అవకాశం వుంది. ఇది భవిష్యవాణి కాదు, చరిత్ర చెబుతున్న పాఠం.

ఇప్పుడు అన్ని ధిక్కారాలు రాజద్రోహాలే, ఎందుకంటే ప్రజాద్రోహులు రాజ్యమేలుతున్నారు కాబట్టి. ప్రతి అక్షరంలోనూ రాజ్యం ఆయుధాలనే వెదుకుతుంది, ఎందుకంటే జ్ణానం వాడిని దహించివేస్తుంది కాబట్టి. పౌరహక్కుల ప్రకటన వాడికి కుట్రగానే వినిపిస్తుంది, ఎందుకంటే అణిచివేతే వాడి సాధనం కాబట్టి. శాంతిని కోరడమే నేరమవుతుంది, ఎందుకంటే హింసే వాడి జీవనాడి కాబట్టి. ఆదివాసుల ఆత్మబంధువు వాడికి శతృవే అవుతాడు, ఎందుకంటే వాడు మనిషితనానికే వ్యతిరేకి కాబట్టి.

స్టాన్ స్వామి హత్య దేశ రాజకీయ, సామాజిక ముఖచిత్రంలోని ఎన్నో కోణాలను మరోసారి పరిచయం చేస్తుంది. చట్టబద్దపాలనలో, న్యాయవ్యవస్థలో, రాజ్యాంగ అమలులో ఉన్న అనేక చీకటి కోణాలను వెలుగులోకి తెస్తుంది. అంతంత మాత్రంగా ఊపిరి పీలుస్తున్న ఈ వ్యవస్థలన్నింటిని హిందుత్వ శక్తులు ఏ విధంగా పట్టపగలే హత్య చేస్తున్నాయో చెబుతుంది. దోపిడీ పాలకవర్గాలు, వారి తొత్తు మేధావులు, మీడియా బ్రోకర్లు రొటీన్ గా చెప్పే “చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది” అనే మాట జుగుప్స కలిగేలా చేసింది. ప్రపంచం ముందు మోడీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టింది.

స్టాన్ స్వామి చంపబడ్డాడు. కాని ఆయన కొన ఊపిరిలో సహితం కొన్ని ప్రశ్నలను వేసిపోయాడు. చట్టసభల్లో పాతరేయబడుతున్న ప్రజాస్వామ్యం గురించి. రోజురోజుకు జీవఛ్ఛవమౌతున్న రాజ్యాంగం గురించి. న్యాయస్థానాలలో ఉరితీయబడుతున్న న్యాయం గురించి. పౌరసమాజంలో గొంతునొక్కుకుంటున్న మేధావుల గురించి. అమ్ముడు సరుకైన మీడియా గురించి. వీటిని ప్రశ్నించకుంటే, చర్చించకుంటే స్టాన్ స్వామి గురించి ఎంత బాధ పడినా వ్యర్థమే! ఎందుకంటే ఆ ప్రశ్నలలోనే స్టాన్ స్వామి జీవితసారముంది. ఆ ప్రశ్నలతోనే ఆయనను బతికించుకుందాం.

స్టాన్ స్వామిని బతికించుకోవడమంటే రాజ్యం పన్నిన కుట్రలనన్నింటిని ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేయడం. ఉన్మాద ఊపా చట్టం రద్దు అయ్యేవరకు పోరాటం చెయ్యడం. ఫాదర్ స్టాన్ స్వామి పరితపించిన ఆదివాసులకు అండగా నిలబడటం. వారి హక్కుల పోరాటంలో భాగం కావడం.

ఫాదర్ స్టాన్ స్వామి ప్రజలమనిషి. అతని హంతకులను ప్రభువు క్షమించినా, ప్రజలు క్షమించరు!

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

Leave a Reply