నా స్నేహితుడా…
నీ చుట్టూ ఇంత కాంతి, దగద్ధగాయమైన మెరుపులు ఉన్నాయి కదా!
వీటి మధ్యలో
నీ దుర్బలమైన రోజులని,
నీ ముందున్న జీవితాన్ని
సజీవంగా మార్చే ఎన్నో ప్రశ్నలు సిద్ధంగా ఉన్నప్పటికీ
చేయాల్సిన పని చాలా ఉన్నప్పటికీ
నువ్వెందుకింత ఒంటరిగా ఉన్నావో చెప్పు?
**
ఇటు చూడండి
కవిత్వం రాస్తూ, మేధో చర్చల్లో పాల్గొనడం అంటే
బోలెడంత ఇష్టం ఉన్న ఆ నవ యువకుడు ఏం చేస్తున్నాడో ?
“సార్, మీ దగ్గర నాకు ఏదైనా పని ఉందా”? అని అడుగుతూ
వీధుల్లో తిరుగుతున్నాడు!
ఎంత విషాదమో కదా ఇది?
**
జీవితంలోని సమస్తమైన ఆనందాలు
అనుభవించే హక్కున్న ఆ యువతి
ఎందుకంత ఉదాసీనంగా
భయంతో, అసంతృప్తి తో ఉంది?
ఎవరు చెబుతారు?
**
ఊహించనంత వెలుగుతో ఉండే
గొప్ప ఆలోచనలు కూడా
చీకటి మేఘాలలో కప్పడి పోయినప్పుడు,
స్నేహితుడా!
సమాధానాలు గాలిలొ
ఎంత అస్థిరంగా, నిస్సహాయంగా దారి తప్పి తేలి పోతున్నవో కదా !
**
అచ్చంగా ఎలా అంటే
ప్రతీ మనిషికీ ప్రతీ రోజూ ఆహారం అవసరమైనట్లు
స్త్రీలకి తమ హక్కులు, అధికారాలూ కావాల్సినట్లు
కళా కారుడికి రంగులూ, కుంచెలు కావాల్సినట్లు
అలాగే…స్నేహితుడా
మన కాలపు సంక్షోభానికి ఒక నూతన ఆలోచన,
ఒక ఉత్తేజకరమైన పిలుపు కావాలి
**
కానీ అంతులేని పోరాటాలు
అనంతమైన ఉత్తేజాలు
కలల్లో ఖైదు కాబడ్డాయి
నా స్నేహితుడా….
అలాగని పరిస్థితులతో రాజీ పడిపోకు
మనసు మార్చుకోకోయ్
లొంగి పోకు
**
ప్రపంచాన్ని నీ వైపుకి మార్చుకో
నీలో ఉన్న సమస్తమైన జ్ఞానాన్ని సమీకరించుకో
చూడు… మోకాళ్ళ బలంపై అస్సలు జీవించకు
లేచి స్థిరంగా నిలబడు
పాట, కళ, సత్యం
ఈ మూడింటి లోతుల్లోకి ఈదు
అంతు చూడు
అవును నా స్నేహితుడా….
నిరాశ పడకు
ప్రపంచాన్ని నీ వైపుకి మార్చుకో…
**
- కార్ల్ మార్క్స్
- తెలుగు అనువాదం : గీతాంజలి
(కార్ల్ మార్క్స్ 143వ ర్ధంతి సందర్భంగా…)