ప్రతిఘటన

(సైమన్ ఆర్మీటేజ్)

మళ్ళీ యుద్ధమొచ్చింది : బాంబులదాడిలో
ధ్వంసమైన ఇంట్లో ఓ కుటుంబం
కాలిపోతున్న పైకప్పు కింది నుండి
తమ జీవితాల్ని బయటకు మోసుకెళ్తుంది.

తర్వాతి దృశ్యం పాత న్యూస్ రీల్ లా ఛళ్ళున చరుస్తుంది:
రద్దీతో కిటకిటలాడే ప్లాటుఫారంలు, రైళ్లు
(మళ్ళీ వద్దు, వద్దే వద్దు) తలలమీదుగా
బుజాలమీదుగా అందించుకునే పిల్లలూ,
లగేజి మూటల్లో కుక్కుకున్న జీవితకాలాలు.

మళ్ళీ యుద్ధమొచ్చింది: దగ్గరి దిగంతాల
మీద పొగమంచులా భ్రమించినా,
స్పష్టంగా పైకెగుస్తున్న నల్లని దట్టమైన పొగ.
గుండెల్ని అరచేతుల్లో పెట్టుకుంటాం.

ఓ పాత నీలిరంగు ట్రాక్టర్ మిలిటరీ ట్యాంకును
ఎవరిదీ కానీ భూమిలోనికి ఈడ్చుకొస్తుంది.

ఇది యుద్ధవిరమణ సమయం:
బారులు తీరిన ఉన్ని కోట్లకు, టోపీలకూ
శుభం కలుగుగాక
కూలిన వంతెనల వేలాడే తీగలపై వణుకుతూ
సూట్ కేసుల్నీ సంచుల్నీ మోస్తూ
తూర్పు పడమరల్ని కలుపుతూ
నడిచే వాళ్లకూ
జయం కలుగుగాక.

మళ్ళీ యుద్ధమొచ్చింది:
నల్ల దుస్తులు ధరించిన స్త్రీ ఒకామె
సైనికునికి సూర్యకాంతం పువ్వుల విత్తనాలిచ్చి
అతని మూలుగ జాతీయపుష్పానికి జవజీవాలంటుంది.

కలల్లో బుల్లెట్లు పక్షులుగా మారనీ,
బాంబుల గుత్తులు పుష్ప గుచ్చాలవనీ.

కనికరాన్ని కత్తిరించేసిన వార్తలు అబద్దపు వార్తలే.

మళ్ళీ యుద్ధమొచ్చింది:
గాలిని చీల్చే సైరన్ కూత
మోగుతున్న చర్చి గంటలను
గొంతు నొక్కలేదు.
దాన్నే మనం ఆశ అందాం.

(తెలుగు అనువాదం: నారాయణస్వామి వెంకటయోగి)

పుట్టింది సిద్ధిపేట‌, చదివింది జిల్లా ప‌రిష‌త్‌ హై స్కూల్ లచ్చపేట, స‌ర్వేల్‌, హైద‌రాబాద్‌ పబ్లిక్ స్కూల్, జేఎన్‌టీయూ, ఓ యూ. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా, అమెరికాలో గత 20 ఏండ్లుగా ఐటీలో, 14 ఏండ్లు విరసం సభ్యుడు. మూడు కవితా సంకలనాలు 'కల్లోల కలల మేఘం', 'సందుక', 'వానొస్తదా'?,  ఒక కవితా ప్రయాణ జ్ఞాపకాలు 'నడిసొచ్చిన తొవ్వ' – ఇప్పటిదాకా ప్రచురణలు. 'ప్రజాకళ', 'ప్రాణహిత'లతో సన్నిహిత సంబంధం.

Leave a Reply