ప్రజా యోధులకు సంజాయిషీ

జనస్వప్నాల ఆవిష్కరణలో
జీవితాల్ని వెలిగించి చీకటిని ధిక్కరించిన
యోధులొరిగిన యుద్ధభూమికి తలవంచి నమస్కరిస్తున్నా

నేల తల్లి ఒడిన నెత్తురు విత్తనాలై
పోరువనాలై విరబూసిన ఆశయాలతో సాయుధమయ్యారు మీరు
వసంత మేఘగర్జన కవాతు గీతంగా సాగుతున్న
ప్రజా గెరిల్లా సేన యోధులారా!!
మీకు వినమ్రంగా విన్నవిస్తున్నా

బతుకు పర్చిన పల్లెర్ల పానుపు మీద నడిచి
కొండపోడున జొన్నకంకై పూసిన వాణ్ణి
ఇంద్రవెల్లి ఎదొలికిన నెత్తురు
గోదారి అలల ఒరవడిలో పోరు ప్రవాహామైనప్పుడు
యంత్రపు కొమ్ములపై రేల పూత పూయాలని
ఇప్పచిగుర్ల మద్య విన్పిస్తున్న కోకిల గానానికి
వంతవ్వాలని మీ చెంత చేరాను.
వడిగా సాగాల్సిన వేళ పడిపోయి పట్టుతప్పాను
కూడదీసుకున్నంతలోనే వేయోజనాలై సాగిపోయారు మీరు

***

మాటేసి కాటేయజూస్తున్న
శతృవు మృత్యు క్రీడల మధ్య
తూర్పుకనుమల్లో విరబూసిన ఆర్కిడ్స్ ను
బందూక్ సిగలో తురిమి సమతా శాంతుల కోసం
యుద్ధగీతాలాలపించిన రోజులు
శ్వాసింకనంత కాలం మరుపురాని మధుర స్మృతులే నాకు
మానేరు తీరం నుండి ఉద్దానం ఉద్యమాల వనం వరకు
నడికొంగుకట్టి వందల మందతో పోరాడుతున్న
పల్లెతల్లుల కనువెలుగుల “కరుణ” కమ్మని నవ్వులను ఎలా మరవగలను
కరీంనగర్ నుండి కోయిల్ తైమూర్ కొండల వరకు
అలెర్ట్! అడ్వాన్స్!! ఆటాక్ ప్రతిధ్వనులై మారుమోగుతున్న
చంద్రుడి యుద్ధనాదాన్ని విస్మరించడం ఎలా సాధ్యం

నిన్నకు నేటికి మధ్య నరసంచారం తగ్గుతున్న కాంక్రీట్ జంగల్లో
మనస్సు కండ్లు తొంగిచూసినంత మేర మీ అడుగుజాడలే
ఒక్కొక్క చోట ఒక యోధుడి పలకరింపు
ఎదమీద జ్ఞాపకాల మొలకవుతుంది
సంతోష్, సంజీవ్,విజయ్, వీరన్న
రవి, రామేశ్వర్, రాజు, రావణ
వేజ్యోతుల వెలుగై జ్వలిస్తున్న త్యాగాల తోరణాలను దాటి
ఎక్కడి కెల్లి దాక్కోను?

మాధవుడి మనోహారగానాన్ని ఆలపిస్తున్న
నల్లమల వెదురు వనాల సంగీతమే
నేనాలపించే గానం నాడు,నేడు, రేపు
సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్ళ మధ్య వేడుకుంటున్న
నా తడబడిన అడుగులకు ఆసరానివ్వండి
పోరు చంద్రుడికో నూలుపోగవుతా…

One thought on “ప్రజా యోధులకు సంజాయిషీ

Leave a Reply