పౌరహక్కుల ఉద్యమ దివిటీ ప్రొ.శేషయ్య

ప్రొఫెసర్ శేషయ్య తెలుగు నేల మీద ముందుకొచ్చిన అనేక మానవ, పౌర హక్కుల ఉద్యమాల చరిత్ర తెలిసిన వారందరికీ బాగా తెలిసిన పేరు. పౌరహక్కుల సంఘం 2024 మార్చ్ నెలలో యాభై వసంతాల పౌరహక్కుల ఉద్యమ ముగింపు సభల్లో “అభివృద్ధి విధ్వంసం”, “నూతన ఆర్థిక విధానాలు కార్మికోద్యమం” అనే రెండు పుస్తకాలు ఆవిష్కరించారు.‌ ప్రొ. శేషయ్య విభిన్న సందర్భాల్లో రాసిన వ్యాసాలను పుస్తకరూపంలో తెచ్చారు. ఈ రెండు పుస్తకాలు అంతకు ముందు “రాజ్యాంగం పౌరహక్కులు”, “కాలంతో సంవాదం” అనే పుస్తకాలకు కొనసాగింపుగా భావించవచ్చు. ఈ రెండు పుస్తకాలు శేషయ్య పౌరహక్కుల ఉద్యమ నేపధ్యాన్ని అర్థం చేసుకోవడంలో తప్పకుండా ఉపయోగపడతాయి.

పౌరహక్కుల ఉద్యమాన్నీ, ప్రజాందోళనలనూ, కార్మిక ఉద్యమాలనూ ఎలా విడదీసి చూడలేమో శేషయ్యనూ, పౌరహక్కుల ఉద్యమాన్నీ విడదీసి చూడలేం. మేధావిగా శేషయ్యా, పౌరహక్కుల ఉద్యమం పరస్పర పూరకాలు.
శేషయ్య భారత రాజకీయార్థిక విశ్లేషణలో అపారమైన జ్ఞాన శిఖరాలను అందుకోవడమే కాదు, సామాజిక చలన- సంచలనాలకి మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పధాన్ని అన్వయించి, విశ్లేషించడంలో తిరుగులేని సాధికారత సాధించిన అతి కొద్దిమందిలో శేషయ్య ఒకరు.

దేశంలో మానవ హక్కుల, ప్రజాస్వామిక ఆందోళనల వృధ్ధికి భయపడి, వాటిని అణచివేయడంలో రాజ్య స్వభావం లో వచ్చిన స్పష్టమైన మార్పునూ, దాని ఫాసిస్టు స్వభావాన్నీ, మొదలు గుర్తించిన వారిలో కూడా శేషయ్య ముఖ్యులు. శేషయ్య ఈ విషయాన్ని పదే పదే తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ వచ్చారు. అనేక వ్యాసాల్లో రాశారు కూడా. రాజ్యం స్వభావానికీ, ఫాసిజానికి మధ్య చెరిగిపోయిన సన్నని రేఖని బలమైన తాత్విక పునాది మీద విశ్లేషించ గలిగారు. “నూతన ఆర్థిక విధానాల వల్ల లాటిన్ అమెరికా దేశాలు నియంతృత్వం బారిన పడ్డాయనీ, మనదేశంలో కూడా నియంతృత్వం వేళ్ళూనుకునే అవకాశం లేకపోలేదు” అని 1993 లోనే సూత్రీకరించారు శేషయ్య! అది ఇప్పుడు నిజం అవడం
మోడీ ప్రభుత్వ పనితీరులో మనం చూస్తున్నాం.

తిరుగుబాటు ప్రదర్శించే సాధారణ ప్రజలతో, ఆదీవాసీలతో, మహిళలలతో, దళితులతో, కార్మీకులతో ఆయనది సృహుద్భావ సంబంధం. నూతన ఆర్థిక విధానాల విధ్వంస స్వరూపాన్ని విశ్లేషిస్తూ ఈ నేపధ్యంలో కార్మిక ఉద్యమం బాధ్యతను గుర్తు చేస్తూ వచ్చారు. ఉద్యమాలన్నింటితో గొప్ప తాత్విక సంభాషణ‌ కొనసాగించారు. వీటికి దిశానిర్దేశం చేయడంలో మార్క్సిస్టు తత్వశాస్త్రాన్ని ఆధారం చేసుకొన్నారు. ఇందులో ఆయా ఉద్యమాల్లో లోపాలను నిర్ధిష్టంగా గుర్తించడంతో పాటు, వాటి పరిణితికి అవసరమైన సూచనలు చేస్తూ వచ్చారు.

దేశంలో విస్తరిస్తున్న పెట్టుబడి, లాభాల వేటలో అది సాగిస్తున్న ప్రకృతి వనరుల విధ్వంసం, ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా ముందుకొస్తున్న జనాందోళనలు, దానికి తగ్గట్టు గా రాజ్యం పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడానికి ప్రజల పై సాగిస్తున్న దమనకాండను తూర్పార బట్టడటమే కాదు ఆయా ప్రజలతో జీవన పర్యంతం కలిసి నడిచారు శేషయ్య.

ప్రజాస్వామిక పోరాటాలకు అవసరమైన బౌధ్ధిక, ప్రాపంచిక, వ్యూహపరమైన అవగాహనను అందిస్తూ వచ్చారు. వాటికి ప్రత్యామ్నాయ రాజకీయ తాత్వికతను అందివ్వడమే కాదు అనేక శిక్షణా తరగతులో బోధిస్తూ వచ్చారు. నిర్ధిష్టమైన తాత్విక దృష్టిని దేశ కాల మాన పరిస్థితుల ఆధారంగా ప్రజా ఉద్యమాలకు సమకూరుస్తూ ఒక చోదక శక్తి గా ఉన్నారు శేషయ్య. ప్రపంచ రాజకీయాలు మన దేశం మీద వేసే ప్రభావాన్ని విశ్లేషిస్తూ, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ కార్మిక, కర్షక ఆదివాసీ ప్రజల జీవితాలను ఎలా విధ్వంసం చేస్తుందో, ప్రభుత్వాల పనితీరు రాజ్యాంగ మౌళిక సూత్రాలకు ఎలా తిలోదకాలిస్తున్నదో, రాజ్యాంగాన్ని కూలంకషంగా అర్థం చేసుకున్న మేధావిగా, నిర్దిష్ట ప్రమాణాలతో నిరూపిస్తూ వచ్చారు. అయితే ఇది అభివృద్ధి పేర జరుగుతున్నది కాబట్టి ఈ పరిణామాలను అర్థం చేసుకోవడంలో చాలా మంది గందరగోళ పడుతున్నారు.‌ ఇందులో మేధావులూ లేకపోలేదు. సహజ అభివృధ్ధీ, కృత్రిమ అభివృధ్ధి మధ్య వ్యత్యాసాన్ని బోధిస్తూ ప్రకృతి వనరులు ఎప్పుడు ఎక్కడ ఎలా దోపిడికి గురి అవుతున్నాయో, ప్రకృతి సంపద పై హక్కును ప్రజల నుంచి దేశీయ, విదేశీయ గుత్త పెట్టుబడి దారులకు బదిలీ చేసిన ప్రభుత్వాలు ఎలా పర్యావరణ విధ్వంసానికి కారణమౌతున్నాయో సోదాహరణంగా, తగిన గణాంకాల ఆధారంగా వివరించగలిగారు.

అభివృద్ధి జరగకూడదని కాదు. దేశంలోని ధనిక వర్గాలకే అభివృధ్ధి అందుబాటులో ఉంటున్నది. ప్రకృతి వనరులన్నీ దేశీయ, అంతర్జాతీయ బడా కార్పోరేట్లకు ధారదత్తం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. నిజానికి మార్క్సిస్టు అవగాహన ఒక చోట అభివృధ్ధి ఇంకోచోట విధ్వంసానికి కారణమౌతుందని నమ్ముతుంది. వెనుకబడిన తరగతుల ప్రజలపై ఈ విధ్వంస‌భారం ఎక్కువై వారు శ్రమదోపిడికీ గురౌతున్నారనీ, ఈ అసమ అభివృధ్ధిలో సర్వం కోల్పోతున్న ఆదివాసీలూ, పేదలు తిరగబడతారనీ, దీనికి పౌరహక్కుల ఉద్యమం అండదండల అవసరాన్ని పదే పదే గుర్తు చేస్తూ వచ్చారు శేషయ్య!

భారతదేశంలో పెట్టుబడి సంచయానికీ, అమెరికా సామ్రాజ్యవాదానికి మధ్య లంకెను అర్థం చేసుకోవడంలో శేషయ్య పరిణితి, స్పష్టం గా ఇతర మేధావలతో ఆయనను విడదీస్తుంది. ఆయన ఇచ్చే వివరణల్లో నింపాది ఆశ్చర్యపరుస్తుంది. తన వాదన ఖచ్చితమైనదని నిరూపించుకోవడానికి ఆయన ఉద్వేగాలకు తావివ్వకుండా గణాంకాల మీద ఆధారపడతారు.

పెట్టుబడి విస్తరణ చాలా అసహజమైన ప్రక్రియ. దాని ప్రభావం మూడవ ప్రపంచదేశాలపైన స్పష్టంగా కనబడుతుంది. నదులు తమ‌సహజ ప్రవాహాలను కోల్పోతాయి. అరణ్యాల సహజ రూప క్రియలు ఆగిపోతాయి. మానవ జీవితంలో కృత్రిమత్వం వచ్చి చేరుతుంది. కృత్రిమ మానవ సంబంధాలు ఏర్పడతాయి. స్వార్థం వీటికి పూనాదిగా ఉంటుంది. ఆధునికి మార్కెట్ పెట్టుబడి విస్తరిస్తున్న ప్రాంతాలన్నీ రాజకీయ, ఆర్థిక సంక్షోభాల్లో కూరుకుపోతాయి. పెట్టుబడి దారులకు లాభాల పంట పండించుకోవడమే పరమావధి కాబట్టి ప్రజాసంక్షేమం ఏమీ ఉండదు. పెట్టుబడి దేనికీ బాధ్యత పడదు. డబ్బులు ఆకాశం నుంచి ఊడిపడవు అని, పెట్టుబడి రూపంలో దేశంలోకి వచ్చి ఆదాయవనరుగా మారుతుందనీ, ఉద్యోగాలొస్తాయనీ దీనితోనే ప్రజా సంక్షేమం అమలు అవుతుందనీ ప్రభుత్వాలు ప్రచారం చేస్తాయి. కానీ ఒక వైపు శ్రమదోపిడీ, ఇంకో వైపు వనరుల విధ్వంసం పెట్టుబడిగా మారుతుందనీ అది సృష్టించే లాభాన్ని పై స్థాయి వర్గాలు పంచుకుంటాయి కానీ ప్రజలకు అందదనీ, పైగా ఉద్యోగ భద్రతకు అటు ప్రభుత్వాలూ, ఇటు పెట్టుబడిదారులు హామీ పడరనీ కూడా ప్రజాఉద్యమాల రాజకీయ అవగాహన. ఈ అంశాలన్నీ శేషయ్య రాస్తూ, మాట్లాడుతూ వచ్చారు. ఆయన ఆలోచనలు, మార్క్సిజం భూమికగా ఏర్పరచుకొని తన భావాలు పౌరహక్కుల ఉద్యమానికి అనన్యమైన శక్తిని అందించాయి.

ఆయన మరణించిన తర్వాత ఆయనకు నివాళి గా ఇటీవల పుస్తక రూపంలో విడుదులైన ఆయన రచనలు పౌరహక్కుల ఉద్యమానికి , ప్రజలకూ, విద్యావేత్తలకూ, విద్యార్థులకూ, ప్రత్యామ్నాయ రాజకీయ కార్యకర్తలకు రాజకీయార్థిక, అవగాహనని అందిస్తాయనడం లో సందేహం లేదు. పైన ఉదహరించిన అంశాలన్నీ శేషయ్య రచనల్లో స్థానం సంపాదించాయి. పౌరహక్కుల సంఘం ప్రచురణ గా వచ్చిన ఈ పుస్తకాలు అందరూ తప్పకుండా చదవాలి. అంతే గాక రాజకీయాచరణ, రచన రెండు కళ్ళు గా జీవించిన శేషయ్య వ్యక్తిత్వాన్ని పాఠకులకు పరిచయం చేయడంలో ఈ పుస్తకాలు విజయం సాధించాయి.

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

Leave a Reply