దేశవ్యాప్తంగా పౌరసత్వ సెగలు

దేశమంతా సిఏఏ, ఎన్ఆర్ సీ, ఎన్ పీఆర్ నిరసనలతో భగ్గుమంటుంటే హోమ్ మంత్రిత్వ శాఖ చల్లచల్లగా పౌరసత్వ సవరణ బిల్లు నిబంధనలు అమలులోకి రావటానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. చట్టం అయిన ఒక నెల రోజుల్లో అమలులోకి తెస్తామని చెప్పినట్లుగానే జనవరి 10న ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు డిసంబర్ 11న పార్లమెంటు ఆమోదం పొంది, మరుసటి రోజు రాష్ట్రపతి ఆమోదం పొంది చట్ట రూపం దాల్చి ఒక నెల గడిచింది. లెక్కలు సరిగ్గానే ఉన్నాయి. డిశంబర్ 31, 2014న, అంతకు ముందూ భారత దేశానికి వచ్చిన- నివాస పత్రాలు లేని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బాంగ్లాదేశ్ దేశాలలోని ముస్లీమేతర మతస్తులకు ఈ దేశంలో పౌరసత్వం లభిస్తుంది.

ఈ చట్టాన్ని అమలులోకి రాకుండా ఆపుకోవటానికి దేశంలో ఇంకో అత్యున్నత వ్యవస్థ అయిన సుప్రీం కోర్టు వైపు చూశారు భారత ప్రజలు. భారత పార్లమెంటేరియన్లు, హక్కుల సంఘాలు, ఎన్ జీవోలు, రాజకీయ పార్టీలు, యాక్టివిష్టులూ, సామాన్య ప్రజలు ఈ బిల్లు చట్ట బద్ధతను ప్రశ్నిస్తూ వేసిన 60 పిటిషన్లు సుప్రీం కోర్టులో పెండింగులో ఉన్నాయి. ఈ పిటీషన్లు వేసిన వారిలో ఒకరైన కాంగ్రెస్స్ నాయకుడు జైరాం రమేశ్ ‘ఈ చట్టం రెండు రకాల వర్గీకరణలను చేస్తుంది. ఒక మతాధార వర్గీకరణ, భౌగోళికాధార వర్గీకరణ. ఈ రెండు వర్గీకరణలు అసమంజసమైనవి’ అన్నారు.

వీటితో బాటు సిఏఏ కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారిపై చర్య తీసుకోవాలనే పిటీషన్ ను కూడా ఈ 60 పిటీషన్లతో బాటే పరిశీలిస్తామని సుప్రీం కోర్టు సెలవు ఇచ్చింది. ఈ చట్టం అమలు మీద మధ్యతర స్టే ఇవ్వటానికి నిరాకరించింది. ‘దేశం అసలే క్లిష్ట స్థితిలో ఉంది, ఇప్పుడు శాంతి నెలకొల్పే ప్రయత్నాలు చేయాలి. చట్టబద్దతకు ఎప్పుడూ అనుమానాలు ఉంటూనే ఉంటాయి’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ బోడ్బే. గత అనుభవం నుండి ఆలోచిస్తే కోర్టుల మీద పెద్ద నమ్మకం పెట్టుకోలేమని ఇక్కడ ప్రజల అంతరాత్మలకు అర్థం అవుతూనే ఉంది.

ఇక ఐక్య రాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రెస్ ఈ నిరసనల సందర్భంగా పోలీసు ఉపయోగిస్తున్న హింస గురించి పట్టించుకొంటూ మాట్లాడాడు. భావ ప్రకటన స్వేచ్ఛ పట్ల గౌరవం ఉండాలని ఆయన అన్నాడు. మానవ హక్కుల ఐక్య రాజ్య సమితి కమిటీ హై కమిషనర్ ప్రతినిధి ‘సవరించబడిన చట్టం, భారత రాజ్యాంగం ప్రతిష్టించిన ‘చట్టం ముందు అందరూ సమానులే’ అనే నిబద్ధతను పట్టించుకోనట్లు అనిపిస్తుంది అన్నారు. ‘నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు’ అనుకొనే భారత ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకొన్నట్లు అనిపించలేదు. ఈ నిరసనలన్నిటికీ స్వార్ధపరమైన ఆసక్తులు ఉన్నాయని మోడి పాత పాటే పాడాడు. ఆయన వరుసగా చేసిన ట్వీట్స్ లో ఈ చట్టం భారతదేశంలో ఏ మతానికి చెందిన పౌరుడినైనా ఇబ్బంది పెట్టదని చెబుతున్నాడు.

పాకిస్తాన్ లో హిందువుల సంఖ్య 23 శాతం నుండి 3 శాతానికి తగ్గిపోయిందనీ, చొరబాటుదారులు భారత్ లో ప్రవేశిస్తున్నారనీ వరుస అబద్ధాలను పదే ఉచ్చరిస్తున్న మోడి, అమిత్ షాల ద్వయాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి నమ్మేటట్లు కనబడటం లేదు. పౌరసత్వ సవరణ చట్టం (CAA), దానికి అనుసంధించిన జాతీయ పౌరపట్టిక (NRC), ఎన్ ఆర్ సీ కార్యాచరణ రూపమైన అయిన జాతీయ ప్రజాసంఖ్య పట్టిక (NPR)లు భారత ప్రజలను మతాలకతీయంగా భయపెడుతున్నాయి. యాక్టివిస్థు యోగేంద్ర యాదవ్ ‘నేను NPR పత్రాలను పూర్తి చేయను’ అంటే అమిత్ షా ‘అయితే నువ్వు దేశాన్ని విడిచి పోవాల్సి ఉంటుంది’ అని బహిరంగంగానే బెదిరించటం లాంటి చర్యలు, భారత ప్రజల భయాలకు అర్థం ఉన్నదని పూర్తి స్థాయిలో రుజువు చేస్తున్నాయి. ‘CAAను ఉపసంహరించండి’, ‘NPR ను తిరస్కరించండి’ ‘NPR ను బహిష్కరించండి’ అనే పిలుపులు దేశమంతా ఇప్పుడు మారుమోగుతున్నాయి. ప్రజలు ఉద్విక్తతకు గురి అవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ముస్లిములు బయటకు వచ్చి శాంతియుతంగానే తమనిరసనలను తెల్పుతున్నారు. వీరికి అపూర్వమైన ప్రజామద్దతు వస్తుంది. ఈ మద్దతు ఇచ్చేవారిలో ‘ఇంష్ట్రగ్రామ్’ ‘టిక్ టాక్’ ‘పిజ్జా’ల యువతరం ఉండటం ఒక విశేషం. నూతన ఆర్ధిక విధానాల అమలు తరువాత పుట్టుకొచ్చిన ఈ యువతరం, ప్రజాసమస్యలను పట్టించుకోకుండా తన కెరీర్ ను నిర్మించుకొంటారనే అపవాదును అబద్ధం చేస్తూ చాలా మంది యువతీ యువకులు ఈ ఉద్యమంలో భాగస్వాములు అవటమే కాదు., శక్తివంతంగా తమ గొంతులను వినిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని ఉద్యమ నిర్మాణం చేస్తున్నారు. ఎవరూ ఇంట్లో కూర్చోలేని పరిస్థితులు వచ్చేశాయి. ప్రజల చేత ఎన్నుకొబడిన ప్రభుత్వం ప్రజల పౌరసత్వాన్ని తమ కొలతలతో, మత ద్వేషంతో నిర్ణయిస్తామని చెబుతూ- విధివిధానాలను తయారు చేస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిగా వ్యతిరేకంగా పని చేయటానికి సిద్దపడుతున్నప్పుడు దాన్ని నిలవరించే బాధ్యతను ప్రజలు తలకెత్తుకొన్నారు.

భగ్గుమంటున్న అస్సాం:
CAA, NRC లకు వ్యతిరేకంగా మొదట వెల్లువెత్తిన ఈశాన్య రాష్ట్రాలలో అస్సాం ముఖ్యమైనది, దేశంలో మొదటిది కూడా. ఎందుకంటే ఈ చట్టానికి పునాదులు ఈశాన్య రాష్ట్రాలలోనే ఉన్నాయి. ఈ రాష్ట్రాల ప్రజల్లో ఉండే స్వజాతి అభిమానం, మతాధార జాతీయవాదాన్ని తీవ్రంగా అడ్డుకొంటున్నది. ఆ రాష్ట్రాలలో రాజకీయంగా శక్తివంతంగా ఉన్న రాష్ట్రాలు అస్సాం, మణిపుర్ లలో నెల రోజుల నుండి మనుషులు రోడ్ల మీదనే ఉన్నారు. ఆశు (AASU- All Assam Students Union) నాయకత్వంలో కొనసాగుతున్న ఈ ఉద్యమంకు నెల రోజుల వయసు ఉంది. అస్సామ్ లో ఇంకో సంస్థ అస్సాం జాతీయవాది యువచత్ర పరిషద్ కూడా ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తుంది. అస్సాం రాష్ట్ర అధికార బీజేపీ ప్రజలను ప్రసన్నం చేసుకోవటానికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టింది. సాహిత్య సభలకు నిధులను గుమ్మరిస్తూ ప్రలోభపెట్టింది. ఆయిల్, గ్యాస్ రంగాల్లో రాబోతున్న 42, 78, 228 కోట్ల విదేశీ పెట్టుబడులు ఈ ఉద్యమం వలన వెనక్కి పోబోతున్నాయని బెదిరించింది.

అయితే ఆశు నాయకులు ఈ చట్టాన్ని రద్దు చేసేదాకా నిద్రపోమని ప్రకటించారు. అధికారికంగానే అస్సాంలో ఈ నిరసనల సందర్భంగా జరిగిన హింసలో ఐదుగురు చనిపోయారు. జనవరి 10న సి‌ఏ‌ఏ అమలులోకి రాగానే కాటన్ యూనివర్సిటీ విద్యార్ధులు మోడి, అమిత్ షా బొమ్మలను దగ్ధం చేశారు. ప్రముఖ గాయకులు జుబిన్ గార్గ్, మానస్ రాబిన్ లు; పవిత్ర రాధ లాంటి థియేటర్ ఆర్టిస్టులుకూడా బయటకు వచ్చి వారి నిరసనలను కళారూపంలో ప్రదర్శించారు. జనవరి 22న సుప్రీం కోర్టు తీర్పులు పెండింగ్ లో ఉండగా హడావుడిగా సి‌ఏ‌ఏ విధానాలను ఎందుకు నోటిఫై చేశారని వారు అంటున్నారు. అస్సామ్ చీఫ్ మినిస్టర్ సర్బానంద సోనివాల్ ఎరుకతోనే, అనుమతితోనే ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యిందని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. సోనివాల్ పరిస్థితి ఇరకాటంలో పడింది. అతను బీజేపీ నుండి బయటపడి, అస్సాంలో కొత్త పార్టీ నిర్మాణంలో పాలు పంచుకోవాలని స్థానిక కాంగ్రెస్ నాయకుల నుండి డిమాండ్ వస్తుంది. బీజేపీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అననీయకుండా తన టీవీ చాట్ లో వారి మీద విరుచుకుప్దడే రిపబ్లిక్ టీవి యాంకర్ అర్నాబ్ గోస్వామి కూడా అస్సామీ అవటంతో ఇప్పుడు బీజేపీని, ఆర్ ఎస్ ఎస్ ను కూడా తిట్టిపోస్తున్నాడు. అస్సాం ప్రభుత్వం ఇప్పటి వరకూ 339 మందిని అరెష్టు చేసినట్లు హోమ్ మినిస్టర్ హిమంత్ బిశ్వా శర్మ చెబుతున్నాడు. వారిలో అస్సాం రైతు నాయకుడు, కృషి ముక్తి సంగ్రామ్ సమితి సలహాదారుడు అఖిల్ గొగోయి ఉన్నాడు. అతని మీద ఉప్మా కేసు పెట్టారు. ఫేస్ బుక్ పోస్టులనాధారం చేసుకొని అనేకమంది అరెస్టు చేశారు. చాలా పోస్టులు తొలగించేశారు కూడా.

ఉడికిపోతున్న ఢిల్లీ:
ఢిల్లీలోని జామియా మిలీయా, జె ఎన్ యూలు పోరాట యుద్ధ రంగాలు అయ్యాయి. జామియా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్ధిని ఆసక్ హైదర్ ‘పార్లమెంటులు మీవైతే, రహదార్లు మావి’ అంటూ నినాదం చేసింది. అదే యూనివర్సిటీ కేరళ విద్యార్ధునులు ఆయేషా, లదీదాలు పోలీసులకు ఎదురు తిరిగి చరిత్ర సృష్టించారు. డిశంబర్ 10న కేంద్రం ఆధీనంలో ఢిల్లీ పోలీసులు; స్థానిక ఏబీవీపీ, ఆర్ ఎస్ ఎస్ నాయకులతో కలిసి జామీయా యూనివర్సిటీ లైబ్రరీ, హాస్టళ్ల మీద విచక్షణారహితంగా దాడులు చేశారు. ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అనేకమంది విద్యార్దులు గాయపడ్డారు. ఇక్కడ హిందూ ముస్లిం విద్యార్ధుల మధ్య అపురూపమైన సఖ్యత, సమన్వయం ఏర్పడ్డాయి. ఈ సమస్య కేవలం ముస్లిముల సమస్య మాత్రమే కాదని హిందువులు గుర్తించగలిగారు. 75 సంవత్సరాలుగా భారత ప్రజల్లో అంతర్గతంగా దాగి ఉన్న లౌకిక, ప్రజాస్వామ్య భావనలు బయటకు వచ్చాయి. 500 సంవత్సరాలుగా పెనవేసుకొని ఉన్న అవిభాజ్య హిందూ ముస్లిముల జీవితాలను విభజించే రాజకీయాలను ప్రజలు ఓర్చుకోలేక పోయారు. మండల్ కమీషన్ గొడవలు 1990లో అయ్యాక, గత ముప్ఫై సంవత్సరాలలో ఎన్నడూ బయటకు రాని సెయింట్ స్టీఫన్ స్టెన్ కాలేజీ విద్యార్ధులు బయటకు వచ్చి రాజ్యాంగ పీఠికను పఠించారు. ‘స్టీఫన్ అగైనెస్ట్ ఫాసిజం’, ‘కాగజ్ నహి ధీఖాయెంగే’ (కాగితాలు చూపించము) లాంటి నినాదాలు ఇచ్చారు. మతతత్వ రాజకీయాలతో నిండి ఉండే ఢిల్లీ యూనివర్సిటీ నుండి కూడా విద్యార్ధులు ఈ ఉద్యమంలో పాత్ర తీసుకొన్నారు.

ఇప్పుడు ఢిల్లీ షాహిన్ బాగ్ ప్రాంతం నిరసనల అడ్డాగా మారింది. గడ్డ కట్టే చలిలో రాత్రింబవళ్లు విద్యార్ధులు, వృద్ధులు, మహిళలు, మేధావులు అక్కడ ధర్నా చేస్తునారు. అంత చలిలో అక్కడ ఏమి చేస్తున్నారు అని ఎన్ డీ టీవీ అడిగిన ప్రశ్నకు 90 సంవత్సరాల వృద్ధురాలు ఆస్మా ఖాతూన్ సమాధానం చెబుతూ ‘ఎందుకు మేము రోడ్ల మీద కూర్చొన్నామో మోదిని అడగండి’ అని చెప్పింది. ‘ఈ భూమిపై మేము వందల సంవత్సరాల నుండి జీవిస్తున్నాము’ అంటూ తన పది తరాల పెద్దల పేర్లు చెప్పి, మోడీని ఆయన పూర్వీకులు నాలుగు తరాల పేర్లు అయినా కనీసం చెప్పమని సవాలు విసిరింది.

నెత్తురు గడ్డ అయ్యిన ఉత్తరప్రదేశ్:
ఉత్తరప్రదేశ్ లో CAA, NRC నిరసనలలో పోలీసులు మొత్తం 21 జిల్లాల్లో నిరసనకారులపై విరుచుకొని పడగా మొత్తం 19మంది చనిపోయారు. 1240 మంది అరెస్టు అయ్యారు. 5558 మంది ముందస్తు అరెస్టులు అయ్యారు. 370 మంది మీద కేసులు పెట్టారు. ఉత్తరప్రదేశ్ లో CAA నిరసన జరిగిన ప్రదేశాల్లో అధికారికంగానే 405 ఖాళీ బుల్లెట్లను సేకరించారు. అయితే పోలీసులు ఎక్కడా ఫైరింగ్ చేయలేదని కాన్పూర్ ADG ప్రేమ్ ప్రకాష్ చెప్పాడు. 14101 సోషల్ మీడియా పోస్టుల మీద చర్యలు తీసుకొన్నారు. అందులో 5965 ట్విట్టర్ పోస్టులు, 7995 ఫేస్ బుక్ పోస్టులు, 141 యూ ట్యూబ్ పోస్టులట. ఇంటర్ నెట్ సేవలు చాలా రోజులు నిలిపివేశారు.

మీరట్ లో మొత్తం ఆరుగురు చనిపోయారనేది అధికార వార్త. కానీ ఎక్కువే చనిపోయి ఉండవచ్చునని చెబుతున్నారు. చాలా మంది ఇంకా కనబడటం లేదు. వారి బంధువులు పోలీస్ స్టేషన్ కూ, ఆసుపత్రికీ వెళ్లి వెతుక్కోవటానికి ఇంకా భయపడుతున్నారు. గాయాలు తగిలిన వాళ్లు వందల్లో ఉన్నారు. వారెవరూ గవర్న్మెంట్ హాస్పిటల్ కు కూడా పోలేదు భయపడి. పోలీసులతో బాటు స్థానిక బీజేపీ నేతలు కూడా దాడుల్లో పాల్గొన్నారు. చనిపోయిన కుటుంబాలను ఉత్తరప్రదేశ్ ను ఒకప్పుడు పరిపాలించిన సమాజ్ వాద్ పార్టీ కానీ, బహాజన సమాజ్ వాద్ పార్టీ వారు కానీ ఇంతవరకు పలకరించలేదు.


మీరట్ ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ లీసా గేట్ ప్రాంతంలో (ముస్లిములు ఎక్కువగా నివసించే ప్రాంతం) వీరంగాలు వేస్తూ ‘మీకు ఇష్టం లేకపోతే పాకిస్తాన్ పొండి’ అంటూ వీడియో క్లిప్పింగ్ లో దొరికాడు. దొరకటం వలన పెద్ద ప్రయోజనం ఏమీ లేదు కానీ, మీరట్ లో పొంగి పొరలిన ముస్లిం ద్వేషానికి కారణం కేవలం యోగీ ఆదిత్యనాథ్ కాదు, బ్యూరోక్రసీ కూడా పూర్తిగా కాషాయం అయిపోయింది అనే విషయం అర్థం అయింది. తరువాత జరిగిన మారణకాండకు కారణాలు దొరికాయి ఆ వీడియో ద్వారా. ‘ప్రతి కుటుంబం నుండి ఒక్కో మనిషిని జైల్లో ఏస్తా!’ అన్నాడు అఖిలేష్ నారాయణ్. ముఖ్య మంత్రి యోగి ఆధిత్యనాథ్ స్వయానా నిరసనకారుల మీద ‘పగ’ తీసుకొంటానని ప్రకటించాడు. ఏమైనా మాట్లాడగలిగినా, ఏమైనా చేయగలిగినా అనాగరిక, అమానవీయ రాజ్యం ఉత్తరప్రదేశ్! ముస్లిములకు ముఖ్యంగా రాష్ట్రమంతా పోలీస్ స్టేషనే.

మీరట్ లో అధికారికంగా చనిపోయిన ఆరుగురిలో ఐదుగురు ఆ కుటుంబాలకు తిండి పెట్టేవాళ్లు. వారి ఇళ్లకు కారవాన్ పత్రిక వాళ్లు వెళితే, ఆ ఇంటి వాళ్లు చాలా కోపంగా ఉన్నారు. చాలామంది హింది పత్రికల వాళ్లు వాళ్ల దగ్గరకు వచ్చి అన్ని విషయాలు కనుక్కొని వెళ్లి ఒక్క ముక్క కూడా పత్రికలో రాయలేదట. అన్ని పత్రికలు పోలీసులు చెప్పిన చిలక పలుకులే వల్లించాయట. ఆ పత్రికలు చెప్పిన దాని ప్రకారం అయితే నిరసనకారులే హింసపూరితంగా పోలీసులను గాయపరిచినట్లు. నిరసనకారులు వారికి వారే గాయపరుచుకొన్నట్లే. మోఃసిన్, ఆసిఫ్ వీరిద్దరూ డిసంబర్ 20న పోలీసు కాల్పుల్లో చనిపోయారు. ఈ హత్యలు జరిగి రెండు వారాలు అయినా, ఎంత మంది రాజకీయ నాయకుల చేత చెప్పించినా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ మాత్రం చేతికి రాలేదు. చనిపోయిన ఐదుగురి బంధువులు పోలీస్ స్టేషన్ కి వెళ్లటానికి భయపడుతున్నారు. వాళ్ల మీద కూడా కేసులు పెడతారేమోనని భయం వారికి. పోలీసులు నిరసనకారుల దగ్గరే ఆయుధాలు ఉన్నాయని, చనిపోయిన వాళ్లు ఆ బుల్లెట్లకు చనిపోయారని చెప్పిన కథనం, పోస్ట్ మార్టం రిపోర్ట్ తో అబద్దమని తేలుతుంది. అందుకే వాళ్లు రిపోర్ట్ ఇవ్వటం లేదని అసలు నిజం. చనిపోయిన వాళ్లంతా అతి పేదలు.అన్ని కేసుల్లో బుల్లెట్లు గురి పెట్టి కాల్చబడి ఉన్నాయి. పోలీసులు హడావుడిగా అత్యక్రియలు దగ్గర ఉండి జరిపించారు. ఎక్కడా కుటుంబ సభ్యులు తనివి తీరా తమ ప్రియతములను కౌగలించుకొని ఏడవనివ్వలేదు. చావు ఊరేగింపులు లేవు. మరణం ఇక్కడ క అతి తేలికపాటి రాజకీయం.

భారతదేశంలోనే అత్యంత ప్రతిస్తాత్మకమైన కాన్పూర్ ఐఐటి లో 300వందల మంది విద్యార్ధులు, కొంతమంది ప్రొఫెసర్లు ఐఐటిలో CAA ను వ్యతిరేకించిన ఇతర యూనివర్సిటీ విద్యార్ధుల మీద దాడిని ఖండిస్తూ డిశంబర్ 17న శాంతియుత ర్యాలీ తీశారు. రెండు రోజుల గడిచిన తరువాత, ర్యాలీ రోజు పిల్లలు ఫైజ్ అహమ్మద్ ఫైజ్ రాసిన ‘హామ్ దేఖెంగే …’ పాట పాడారని వంశీ మంత్ శర్మ అనే ఉద్యోగి ఫిర్యాదు చేశాడు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సందర్భంలో ఫైజ్ అహమ్మద్ రాసిన ఆ పాట భారతదేశానికి ద్రోహం చేస్తుందని అతని వాదన. దీని మీద ఒక విచారణ కమిటీని యూనివర్సిటీ వేశారు.


ఇది ఇలా ఉండగా అసలు బుల్లెట్లే పోలీసులు ఉపయోగించకుండా ఒక్క కాన్పూర్ లోనే ముగ్గురు చనిపోయారు. ఆ బుల్లెట్లు మావి కావని పోలీసులు బొంకుతుండగా విడుదల అయిన వీడియోలో పోలీసులు చక్కగా కాలుస్తున్నారు. ఈ విషయంగా ఎన్ డి టీవీ విలేఖరి ఉత్తరప్రదేశ్ పోలీస్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓపీ సింగ్ ను అడగగా ఆయన ‘మీరు చేసుకొంటారో, ఏమి రాసుకొంటారో, ఏమి చూపించుకొంటారో- అవి చేసుకోండీ’ అని సమాధానం ఇచ్చాడు. చనిపోయిన ముగ్గురూ అత్యంత పేదవారు. 31 సంవత్సరాల మహమ్మద్ రాయీస్ వేయించిన అప్పడాలు అమ్ముతూ జీవిస్తాడు. అతని తండ్రి మహమ్మద్ షరీఫ్ 60 ఏళ్లు పైబడిన వాడు. అతను ఇప్పటికీ రోజువారీ కూలి పనికి వెళుతుంటాడు. అతని భార్య పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో అంట్లు తోముతూ ఉంటుంది. కొడుకు చనిపోయాక ఆ తండ్రి హృదయవిదారక ఏడుపుతో కూడిన వీడియో విడుదల అయ్యింది. వాళ్ల కోసం వాళ్లకే సమయం లేని కుటుంబంలోని వ్యక్తి నిరసనలలో ఎలా పాల్గొనగలడు? అస్సహాయులైన ప్రజలు, అబద్దాలతో పోలీసులు, ప్రతీకారంతో రాజకీయ నాయకులు: ఇదీ ఇప్పటి కాన్పూర్ ముఖచిత్రం.

ముజఫర్ నగర్లో 26 సంవత్సరాల నూర్ అహమ్మద్ నవాజ్ కు వెళుతూ పోలీసు గుండుకు బలి అయి మరణించాడు. ముస్లిముల కోట్లాది ఆస్తి నాశనం అయ్యింది. రాత్రిళ్లు నిద్రపోతున్న కుటుంబాలపై దాడి చేసి లూటీలు చేశారు. ఆడవారిని కూడా గాయపరిచారు. ఆస్తి నష్టం చేస్తూ పోలీసులు సిసి కెమెరాలకు దొరకారు. ఇక్కడ 48మంది అరెస్టు అయ్యారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించటానికి కపిల్ దేవ్ అగర్వాల్ నిరాకరిస్తూ ‘రాష్ట్రాన్ని మంటలతో నింపిన వాళ్లను నేనెందుకు పలకరించాలి?’ అన్నాడు. నిస్సహాయులు అయిన తన ప్రజల పట్ల ఆయనకున్న అభిప్రాయం అది. ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్ దాస్ ఆస్తి ద్వంశం చేసిన వాళ్లు ముస్లిములే అంటూ వాళ్లు తిరిగి కట్టాలంటూ నోటీసులు పోలీసుల ద్వారా పంపిస్తున్నాడు. బాధితులనే నేరస్తులను చేసే ఆటవిక న్యాయం బీజేపీ హయాంలో ఉత్తరప్రదేశ్ లో పరిఢవిల్లుతుంది. ఇవి కాకుండా లక్నో, బిజ్నోర్ లలో కూడా ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయి. లక్నో యాక్టర్ యాక్టివిష్టు సదార్ జాఫర్ ను అరెష్టు చేసి పోలీసులు కొట్టారు. పాకిస్తానీ అంటూ ఆమెను నిందించారు. 76 సంవత్సరాల మాజీ ఐపియస్ ఆఫీసర్ ఎస్ ఆర్ ధారపురిని కూడా అనధికారికంగా అరెస్టు చేశారు. బిజ్నోర్ లో 2మంది, సంభాల్ లో 2 మంది, రామ్ పూర్ లో ఒకరు, వారణాసిలో ఒక బాలుడు ఈ కాల్పుల్లో చనిపోయారు.

పశ్చిమ బెంగాల్: ‘నా ప్రభుత్వం కూలిపోయినా పర్వాలేదు. నేను ఎన్ ఆర్సీ ని అమలు చేయను’ అని ప్రకటించిన మమతా బెనర్జీ స్వయంగా సి‌ఏ‌ఏ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొన్నది. బీజేపేతర పాలనలు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాసి ‘దేశాన్ని రక్షించమని’ పిలుపు ఇచ్చింది. అయితే సి‌ఏ‌ఏ కి వ్యతిరేకంగా మొదట గళం విప్పిన మమతా తరువాత ప్రతిపక్ష పార్టీలతో కలిసి పని చేయటానికి నిరాకరించింది. కాంగ్రెస్స్, వామపక్షాలు తన ప్రభుత్వాన్ని పడదోయాలని చూస్తున్నాయని ఆరోపించింది. అయితే కలకత్తాలో ఈ వ్యాసం రాసే రోజు వరకూ వివిధ రకాల ప్రొటెస్టులు అనేక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతూనే ఉన్నాయి.

కర్ణాటక: బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకాలోని మాంగళూర్ లో మొదట జరిగిన సి‌ఏ‌ఏ వ్యతిరేక ప్రదర్శనలలో ఇద్దరు చనిపోయారు. ప్రభుత్వం నుండి నిర్బంధం పెరుగుతున్నప్పటికీ నిరసనకారులు బయటనే ఉంటున్నారు. చరిత్రకారుడు రామచంద్ర గుహ ను బెంగుళూర్ లో అదుపులోకి తీసుకొన్నారు. 35 సంస్థలు ఉమ్మడి కార్యాచరణ ఏర్పాటు చేసుకొని వేల మందితో ప్రదర్శన చేశారు.

కేరళ: ఎన్ ఆర్సీ ని అమలు చేయమని మొట్టమొదట అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్రం కేరళ. సీయం పినరయి విజయన్ సి‌ఏ‌ఏ కి వ్యతిరేకంగా ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశాడు. ముస్లిములు 33 శాతంగా ఉండే కేరళలో లక్షలాది మందితో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. కాలికట్ దగ్గర మత్యకారులు వంద పడవలతో జాతీయ జెండాను ఊపుతూ విన్నూత ప్రదర్శన చేశారు. ‘ఎవరిదీ భూమి, మనది! ఎవరిదీ భారత దేశం, మనదీ’ అంటూ నినాదాలు ఇచ్చారు. షుమారు ఇరవై మంది సినిమా నటులు, నిర్మాతలు సి‌ఏ‌ఏ ను వ్యతిరేకిస్తూ ట్వీట్లు చేశారు. వారిలో మమ్ముటి, జయసూర్య, దుల్ఖర్ సల్మాన్, పృధ్వీ రాజ్ కపూర్, పార్వతి, రీమా కల్లింగల్, తోవినో థామస్, కుంచక్కో బొబన్, ఇంద్రజిత్, ఆసిక్ అబు, జకారియా మహమ్మద్, గీత మోహన్ దాస్, సౌబిన్ సాహిర్, ఆసిఫ్ ఆలీ, సన్నీ వైనే, ఉన్నారు. నటి పార్వతి CAA మొదలు పెట్టిన రోజు నుండి ట్విట్టర్ లో ఖండిస్తోంది.

జకారియా మహమ్మద్ (‘సుడాని ఫ్రమ్ నైజీరియా’ నేషనల్ ఆవార్డ్ సినిమా నిర్మాత) నేషనల్ అవార్డ్ ఈవెంట్ ను బాయ్ కాట్ చేస్తానని అన్నాడు. అందులో నటించి అవార్డు పొందిన సావిత్రి శ్రీధరన్ కూడా అదే మాట అన్నది. రీమా కల్లింగల్ తాను శాంతి, సమానత్వం, న్యాయం కావాలనుకొంటున్న విద్యార్ధులతోనే ఉంటానని అన్నది. ‘అధికార బలం కలవారు, శక్తివంతులు, ధనవంతులు చూపులు తప్పించుకొని పోతుంటే- ఈ పిల్లలు నీ కళ్లలోకి చూస్తూ సముచితమైన ప్రశ్నలు వేస్తున్నారు’ అన్నదామె తన ఫేస్ బుక్ పోస్ట్ లో. పోలీసులకు వేలు చూపిస్తున్న JMI విద్యార్ధిని బొమ్మను ఫేస్ బుక్ లో షేర్ చేస్తూ కుంచక్కో బొబన్ ‘ఆ వేలు చాలు- ఈ దేశంలో పిల్లలనందని ఏకం చేయటానికి. రాజ్యాంగానికి నిబద్ధులై ఉండండి. భారతదేశానికి నిజమైన కొడుకూ కూతుర్లుగా ఉండండి’ అని రాశాడు. డైరెక్టర్ ఆషిక్ అబు ‘ప్రతిఘటించండి’ అని పిలుపునిస్తూ ‘దేశం ఫాసిస్టుగా ఎప్పుడు మారుతుందంటే సగం జనాభాను అణచినపుడు కాదు, మిగతా సగం నోరు మూసుకొని ఉన్నప్పుడు’ అన్నాడు. సుకుమారన్ సోదరులు – పృధ్వీ రాజ్, ఇంద్రజిత్ లు ‘విప్లవం ఎప్పుడూ ఇంటి పంటే. లేచి నిలబడండి’ అన్నారు.

బీహార్: కన్నయ్య కుమార్ నాయకత్వంలో ఏడు జిల్లాల్లో పెద్దఎత్తున ఉద్యమాలు జరిగాయి.
తమిళనాడు: సినిమా యాక్టర్ సిద్ధార్ధ, కర్ణాటక సంగీతకారుడు టిఎమ్ కృష్ణతో పాటు వివిధ జిల్లాల నుండి వేలాది మంది తమిళనాడులో బయటకు వచ్చారు. మధురై లో జాకీర్ హుస్సైన్ అనే పోలీస్ ఇన్స్పెక్టర్ ను సి‌ఏ‌ఏ కు వ్యతిరేకంగా మాట్లాడినందుగాను బదిలీ చేశారు. ఎన్‌ఆర్‌సి, సి‌ఏ‌ఏ వ్యతిరేక ముగ్గులు పెట్టినందుకుగాను కొంతమంది స్త్రీలపై కేసులు బనాయించింది అన్నా డీఎంకే ప్రభుత్వం. చెన్నైలోని వల్లువరు కొట్టై ప్రాంతంలో 11 మందిని అరెస్టు చేశారు. మద్రాసు ఐఐటీలో చదివే పిల్లలు కూడా పెద్ద ఎత్తున కదిలారు.

మహారాష్ట్ర: శివసేన, కాంగ్రెస్స్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పటికీ మహారాష్ట్రలో ఊహించనంత స్పందన ఈ చట్టానికి వ్యతిరేకంగా వచ్చింది. మహారాష్ట్ర వివిధ యూనివర్శిటీల నుండి చాలా మంది విద్యార్ధులు జామియా, శాన్ బాగ్ లకు వెళ్లి మద్దతు తెలిపారు. జరిగిన ప్రదర్సనలన్నీ వేల మందితోనే జరిగాయి. బాలీవుడ్ వ్యక్తులు స్వర బాస్కర్, తాప్సీ, దియా మీర్జా, గౌహర్ ఖాన్, విశాల్ భరద్వాజ్, జోయ అక్తర్ లు బాంద్రా కార్టర్ రోడ్ లో ఈ చట్టానికి వ్యతిరేకంగా బైఠాయించారు. దర్శకుడు అనురాగ్ కాశ్యప్ ధైర్యంగా బీజేపీని విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్: స్థానిక కేసీయార్ ప్రభుత్వం ఎంత నాటకాలాడినా ప్రజలు పెద్ద ఎత్తున కదిలారు. హైదరాబాద్ లో అనేక నిరసన ప్రదర్శనలు జరిగాయి. అందులో ముఖ్యమైనది జనవరి మూడున లక్షమందితో జరిగిన రాలీ. ఆంధ్ర ప్రదేశ్ లో కడప, కర్నూల్, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయవాడలలో ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రజలు బాగా కదులుతున్నారు. ఎన్ పీ ఆర్ ను ఎదుర్కోవటానికి కార్యాచరణ సిద్దం అవుతుంది.

కార్టూనిష్టు సతీష్ ఆచార్య ఒక కార్టూన్ వేశాడు. అందులో ఒక సీసా బల్ల (అటూ, ఇటూ పిల్లలు కూర్చొని కిందకూ పైకీ ఊగే బల్ల) మీద నుండి ప్రజాస్వామ్యం అనే యువకుడు ఎక్కి చెట్టుకు ఉరేసుకోబోతుంటాడు. దాన్ని రక్షించటానికి ప్రజలు అందరూ అటువైపు ఎక్కుతారు. ఆ బరువుకు ఆ వైపు బల్ల కిందకు దిగి, రెండో వైపు బల్ల పైకి లేస్తుంది. లేచిన బల్ల మీద నిల్చోని మోడి, అమిత్ షాలు ఎన్నికల ఫలాలను ఆనందంగా కోసుకొంటుంటారు. ఈ కార్టూన్ నేటి పాలకుల వ్యూహాన్ని వివరిస్తుంది. ప్రజలను విభజించి పబ్బం గడుపుకోవాలనుకొనే మతతత్వ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఎన్నికల ఎత్తుగడ కాకుండా ఇంకో మార్గాన్ని పట్టుకోవాలనే ఆలోచన కలిగిస్తుంది. వివిధ పొరల నుండి వస్తున్న ఈ సి‌ఏ‌ఏ వ్యతిరేక నిరసనకారులు అందరూ కూడి చేపట్టాల్సిన మార్గం ఎన్నికలైతే మాత్రం కాదని స్పష్టం అవుతుంది.

స్వస్థలం ఒంగోలు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ మహిళా పాలిటిక్నిక్ కాలేజీలో ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ బ్రాంచ్ హెడ్ ఆఫ్ సెక్షన్ గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. 'మాతృక' బాధ్యతలు చూస్తున్నారు.

Leave a Reply