పౌరసత్వ సవరణలపై ఉద్యమాల గర్జన

భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా త్వరలోనే మారవచ్చు. చైనాను అధిగమించవచ్చు. ప్రపంచంలోనే ప్రాచీన నాగరికతకు పురిటిగడ్డ ఈ దేశం. బహుళత్వానికి చిరునామా ఇక్కడి సమాజం. బ్రిటీషు సామ్రాజ్య కిరీటంలో కలికితురాయిగా Crown jewel of british empire గా అప్పట్లో పేరుపొందిన దేశం. ప్రపంచంలో పాశ్చాత్య వలసలకు భారతదేశంలో లభించిన వనరులు, మానవ వనరులే ముఖ్య బలంగా అప్పట్లో ఉపయోగపడ్డాయి. నేటికి కూడా ప్రపంచంలో పెట్టుబడిదారి వ్యవస్థ, ప్రజాస్వామిక పరిపాలనా వ్యవస్థల్లో భారతదేశం కీలకమైన దేశం.


నేడు ఎటు చూసినా ఉద్యమాలు, ఉద్రిక్తతలు, నిరసనలు, ప్రదర్శనలు హోరెత్తుతున్నాయి. చరిత్ర గమనంలో దేశం ఇప్పుడొక నలువీధుల కూడలిలో ఉంది. స్వతంత్రం తర్వాత లిఖిత రాజ్యాంగం ద్వారా బహుళత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పాం. సమానత్వానికి చిరునామాగా దేశాన్ని తీర్చిదిద్దే కలలతో స్వతంత్ర భారతదేశం ప్రారంభమైంది. మత వివక్షకు సంబంధించిన విమర్శలు అప్పుడప్పుడు వినిపించినా, సర్వసాధారణంగా భారతదేశం సెక్యులర్ దేశంగా ప్రపంచదేశాల్లో కీర్తిప్రతిష్ఠలు పొందింది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుందా?

పౌరసత్వ సవరణ చట్టంలో మత వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం మూడు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు మాత్రమే పౌరసత్వం ఇస్తామని కేంద్రప్రభుత్వం ఈ చట్టం చేసింది. శ్రీలంక నుంచి వచ్చిన తమిళ హిందూ మైనారిటీలు చేసిన పాపమేమిటి? వారు అణచివేతలు, దౌర్జన్యాలకు గురికాలేదా? కేవలం అవిభక్త భారతదేశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని చెప్పే అవకాశమూ లేదు. అదే నిజమైతే ఇందులో అఫ్గనిస్తాన్ ను ఎందుకు చేర్చారు. ఈ చట్టం చేయడం ద్వారా ఆరెస్సెస్ మార్గదర్శకత్వంలో పనిచేసే బీజేపీ ఒక ఆలోచనాసరళిని దేశంలో ప్రచారంలో పెడుతోంది. అదేమంటే, కేవలం ముస్లిం దేశాల్లో మాత్రమే మైనారిటీలపై దౌర్జన్యాలు జరుగుతాయని దేశ ప్రజలందరూ భావించే వాతావరణాన్ని సృష్టించాలనుకుంటుంది. నిజానికి శ్రీలంకలోను మైనారిటీలపై దౌర్జన్యాలు జరిగాయి, జరుగుతున్నాయి. కాని ముస్లిమేతర దేశాల్లో మైనారిటీలపై దౌర్జన్యాలు అణిచివేతలను ఈ చట్టం గుర్తించడం లేదు. ఆ విధంగా ముస్లిమేతర దేశాల్లో మైనారిటీలను పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటారు, ముస్లిం దేశాల్లో మాత్రమే మైనారిటీలను వేధిస్తారనే భావాన్ని ప్రచారంలో పెట్టడం ద్వార రెండు ప్రయోజనాలు సాధించుకోవచ్చు. ఒకటి, దేశంలోని ముస్లిం ప్రజల్లో న్యూనతాభావాన్ని పెంచడం, ఆ విధంగా వారిపై ఆధిపత్యాన్ని చెలాయించడం, రెండు ముస్లిమేతర ప్రజానీకాన్ని ఆదుకుంటున్న దేశంగా ముఖ్యంగా హిందువులకు ఆశ్రయమిస్తున్న దేశంగా హిందూ ఓటు బ్యాంకు సంపాదించుకోవడం. అందుకే మనకు తరచు వినిపించే వాదన, ప్రపంచంలో హిందువులు ఏ దేశానికి వెళతారు? మనం కాకపోతే మరెవరు ఆశ్రమిస్తారు? వంటి వాదనలు వినిపిస్తుంటారు.

ప్రపంచంలో మతం ప్రాతిపదికన ఆశ్రయమిచ్చే ఒకే ఒక్క దేశం ఇస్రాయీల్. అనేక దేశాల్లో క్రిస్టియన్లు అధికసంఖ్యాకులుగా ఉన్నారు. కాని ప్రపంచంలో ఏ దేశంలో అయినా క్రైస్తవ మైనారిటీలు దౌర్జన్యాలకు, అణిచివేతలకు గురైనా గాని, ఏ ఒక్క క్రైస్తవ మెజారిటీ దేశం వారిని పిలిచి ప్రత్యేకంగా వారికి పౌరసత్వం ఇస్తామని చట్టం చేయలేదు. అలాగే ప్రపంచంలో అనేక ముస్లిం దేశాలు ఉన్నాయి. ఏ ముస్లిం దేశం కూడా ప్రపంచంలో వేధింపులకు గురైన ముస్లిం మైనారిటీలకు మాత్రమే పౌరసత్వం ఇస్తామని చట్టం చేయడం జరగలేదు. వేధింపులకు గురైన వారెవరైనా, శరణార్థులుగా వస్తే వారికి ఆశ్రయం కల్పించడానికి మతాతీతంగా వ్యవహరించడమే నేటి ఆధునిక దేశాల విధానం.

ఈ క్రమంలో అనేక అబద్దాలు, అసత్యాలు, అర్థసత్యాలు ప్రచారంలోకి వస్తున్నాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు పెరిగిపోయాయని అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మూడోవంతు బంగ్లాదేశ్ ఇండియాలోకి వచ్చేసిందనే ప్రచారం కూడా వినబడుతోంది. వీటన్నింటి వెనుక ఉన్న రాజకీయం ఒక్కటే దేశంలో ముస్లిములను విలన్లుగా చిత్రించి హిందూ ఓటు బ్యాంకును పెంచుకోవడం. ఇలాంటి ప్రచారాల వలలో పడిన తర్వాత దేశంలో ఆర్ధికపరిస్థితి గురించి, వ్యవసాయ సంక్షోభం గురించి, నిరుద్యోగం గురించి ఎవరు ఆలోచించే వాతావరణమే ఉండదు. ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూ ఉంటుంది.


ఈ వ్యూహం చాలా కాలంగా మతతత్వ శక్తులకు ఉపయోగపడుతూ వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం వెనుక కూడా ఈ వ్యూహమే ఉంది. కాని ఇది కేవలం ముస్లిములకు మాత్రమే వ్యతిరేకమైనదా? హోం మంత్రి అమిత్ షా అనేక సందర్భాల్లో, చట్టసభలో కూడా చెప్పిన మాటలను బట్టి మనం క్రోనాలజీని, అంటే క్రమాన్ని అర్థం చేసుకోవాలి. ముందు పౌరసత్వ సవరణ చట్టం, ఆ తర్వాత ఎన్నార్సీ తీసుకొస్తామని ఆయన అన్నారు. అసలు ఎన్నార్సీ గురించి చర్చే జరగలేదని ప్రధాని మోడీ చెప్పిన మాటలు పచ్చి అబద్దాలని మీడియా ఆధారాలతో సహా స్పష్టం చేసింది. కాబట్టి పౌరసత్వ సవరణ చట్టం తర్వాత నిరసనల వేడి తగ్గడానికి ఒక ఎత్తుగడగా ప్రధాని ఆ మాటలు చెప్పారే కాని అందులో నిజం లేదు. నమ్మవలసిన విషయం క్రోనాలజీ ఒక్కటే. అదేమంటే, ముందు పౌరసత్వ సవరణ చట్టం, తర్వాత ఎన్నార్సీ. ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం నిరసనల వల్ల ఎన్నార్సీని కాస్త ఆలస్యం చేస్తూ ఎన్ పీ ఆర్ విషయంలో ఒత్తిడి పెడుతున్నారు.

ఈ రెండింటి విషయంలో చేతన్ భగత్ చెప్పిన మాటలు ఇవేమిటో అర్థం చేసుకోడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. చేతన్ భగత్ ముస్లిముల పక్షపాతి కాదు. రెండవ విషయం ఆయన మోడీ అభిమానిగా కూడా చాలా సందర్భాల్లో రుజువు చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి ఏం చెప్పాడంటే, ఒక విమానం గాల్లో ఉన్నప్పుడు అందులో ఉన్న వారందరిని బయటకు గెంటేయడం ఎన్నార్సీ, గెంటేసిన వారిలో కొందరికి పారాచూట్ ఇవ్వడం పౌరసత్వ సవరణ చట్టం. కొందరికి మాత్రమే పారాచూట్ ఇవ్వడం మిగిలిన వారికి కాదనడం వివక్ష.

ఇది చాలా అద్భుతమైన ఉదాహరణ. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకు వచ్చిన తర్వాత ఎన్నార్సీ తీసుకువస్తామనే క్రోనాలజీ గురించి అమిత్ షా చెప్పారు. అంటే దేశంలో పౌరులందరి ధృవీకరణ పత్రాలు, వారి తండ్రి తాతల ధృవీకరణ పత్రాలు పరిశీలించి అవన్నీ ఉన్నవారు మాత్రమే పౌరులు, అవి లేనివాళ్ళు పౌరులు కాదని తేల్చేస్తారు. అంటే విమానంలో ప్రయాణిస్తున్న చాలా మందిని బయటకు గెంటేస్తారు. కాని వారందరి పరిస్థితి ఏమిటి? ఇందులో ముస్లిమేతరులకు పౌరసత్వ సవరణ చట్టం అనే పారాచూట్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ప్రాణాలతో బతికి బయటపడతారు. అలాంటి పారాచూట్ లేని ముస్లిములు ఏమవుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అందువల్ల ఇది ముస్లిం వ్యతిరేక, జాతితత్వ, మతతత్వ చట్టం. అయితే దీని వల్ల బాధితులు కేవలం ముస్లిములు మాత్రమేనా? ఎందుకంటే వారికి మాత్రమే పారాచూట్ దొరకదు. గెంటివేయబడిన మిగిలిన వారికి పారాచూట్ దొరుకుతుంది. కాని వాళ్ళు కూడా గెంటివేయబడ్డారన్నది గమనించాలి. వారు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాల్లో, పారాచూట్ విప్పుకునే ప్రయత్నాల్లో ఉంటారే తప్ప విమానంలో సురక్షితంగా ప్రయాణం చేస్తూ ఉండరు. చేతన్ భగత్ ఇచ్చిన ఉదాహరణను మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

అస్సాం ఎన్నార్సీ సందర్భంగా మాజీ రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ కుటుంబ సభ్యులకు ఎన్నార్సీలో చోటు లభించలేదు. వారు దేశపౌరులు కాదని చెప్పేశారు. సైన్యంలో పనిచేస్తున్న వారికి ఎన్నార్సీలో చోటు లభించలేదు. పార్వతి అనే 70 సంవత్సరాల ముసలి మహిళ తండ్రి పేరులో సాంకేతిక లోపం ఉండడం వల్ల డిటెన్షన్ సెంటరుకు తరలించారు. ఎన్నార్సీలో దాదాపు 19 లక్షల మందికి పౌరసత్వం లేకుండా పోయింది. ఇందులో కేవలం ముస్లిములు లేరు. పెద్ద సంఖ్యలో ముస్లిమేతరులు ఉన్నారు. ఎందువల్ల ముస్లిమేతరులు ఇందులో ఉన్నారు?

దేశంలో నిరక్షరాస్యులు దాదాపు 30 శాతం ఉన్నారు. వీరి వద్ద అవసరమైన పత్రాలు ఉంటాయా? నిజానికి చదువుకున్న వారు, ఉద్యోగాల్లో ఉన్నవారు, ఆర్ధికంగా మంచి స్థితిలో ఉన్నవారి వద్ద కూడా తండ్రి తాతలకు సంబంధించిన పత్రాలు ఉండకపోవచ్చు. ఉన్నా అనేక పత్రాల్లో పేర్లలో స్పెల్లింగు పొరబాట్లు ఉండవచ్చు. స్పెల్లింగ్ పొరబాటును కూడా క్షమించడం జరగదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్తితిలో ముఖ్యంగా చాలా మంది బడుగు, బలహీనవర్గాలు, పేదలు, దళితులు ఎన్నార్సీలోకి రావడం సాధ్యం కాదు. చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి అందువల్లనే ఎన్నార్సీ అమలు చేస్తే సగం చత్తీస్ గఢ్ ఎన్నార్సీలోకి రాదని అన్నారు.

వీళ్ళందరి పరిస్థితి ఏమిటంటే, వీళ్ళంతా ముస్లిమేతరులు కాబట్టి వీరికి పారాచూట్ లాంటి పౌరసత్వ సవరణ చట్టం ఇచ్చారు. ఆ తర్వాత పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం పౌరసత్వం కోసం ప్రయత్నించాలి. అంటే వీళ్ళంతా తమకు ఇవ్వబడిన పారాచూట్ విప్పుకునే ప్రయత్నాలు చేయాలి. వారి ప్రయాణం హాయిగా విమానం సీటులో కూర్చుని కొనసాగించే ప్రయాణం కాదు.

పారాచూట్ విప్పుకునే ప్రయత్నం ఏమిటంటే, వీళ్ళంతా తమను శరణార్థులుగా, అక్రమంగా దేశంలోకి వచ్చిన శరణార్థులుగా గుర్తించాలని, తమకు పౌరసత్వం ఇవ్వాలని ధరఖాస్తు చేసుకోవాలి. తరతరాలుగా ఇక్కడే బతుకుతున్న ఈ బడుగు బలహీనవర్గాల ప్రజలు తమను తాము శరణార్థులుగా చెప్పుకునే పరిస్థితి వస్తుంది. పారాచూట్ విప్పుకునే కష్టాల్లో భాగం ఇది. నోట్లరద్దు తర్వాత కొన్ని కష్టాలు భరించలేరా? అని ప్రధాని అడిగారు. ప్రజలు భరించారు. కాని సాధించిందేమిటో ప్రజలకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. అవినీతి అంతం కాలేదు. నల్లడబ్బు దొరకలేదు. ఇప్పుడు ఈ పారాచూట్ విప్పుకునే ప్రయత్నం ఇదే. శరణార్థిగా చెప్పుకుని, పౌరసత్వ ధరఖాస్తు పెట్టుకుని క్యూల్లో నిలబడి పౌరసత్వం కోసం ప్రయత్నించుకోవాలి. నోట్లరద్దు బడుగు వర్గాలను, మధ్యతరగతినే దెబ్బతీసింది. ఇప్పుడు కూడా ఈ ఎన్నార్సీ ప్లస్ పౌరసత్వ సవరణ చట్టం బడుగు వర్గాలను, మధ్యతరగతినే దెబ్బతీస్తుంది. దేశం కోసం ఈ కష్టాలు సంపన్నులెవరూ భరించడం లేదు.

పారాచూట్ విప్పుకునే ప్రయత్నంలో ఉన్నవాడు, దాహమేస్తే కాస్త మంచినీళ్ళు తాగే పరిస్థితిలో ఉంటాడా? అలాగే పౌరసత్వం కోసం పడిగాపులు పడుతున్న వారు, తమ ఓటుహక్కు, సంక్షేమ పథకాలకు అర్హత, రిజర్వేషన్లు ఇవేవీ ఆలోచించే పరిస్థితే ఉండదు. శరణార్థులకు ఓటు హక్కు ఉంటుందా? కాబట్టి వారికి రాజకీయ బలం ఉండదు. కాబట్టి ఇది కేవలం ముస్లిముల సమస్య కాదు. దేశంలోని బడుగు బలహీనవర్గాలందరి సమస్య. అందుకే ఈ నిరసనలు, ఉద్యమాలను ప్రారంభించింది ముస్లిములే అయినా అనేకమంది ముస్లిమేతరులు ఇందులో చేరుతున్నారు.

హిందూ ముస్లిం ఉద్రిక్తతల వాతావరణం కొనసాగించడం దేశంలో రాజకీయంగా లాభసాటి ఎత్తుగడగా చాలా సార్లు ప్రయోజనాలు పొందిన శక్తులు ఇదే ఎత్తుగడను కొనసాగిస్తున్నాయి. కాని దేశంలో 13 కోట్ల మంది యువత ఉన్నారు. దేశంలో ఉద్యోగాలు కల్పించలేని వ్యవస్థ, ఆర్ధికపరిస్థితిని చక్కదిద్దలేని వ్యవస్థ మతతత్వ రాజకీయాలు నడపడాన్ని ఈ యువత గమనిస్తోంది. గ్లోబలైజేషన్ వాతావరణంలో పెరిగిన వాళ్ళు, ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది అమ్మాయిలు అబ్బాయిలు భారతదేశంలో జాబ్ మార్కెటులో ప్రవేశిస్తున్నారు. వీళ్ళందరికి ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత కావాలి.

2014లో మోడీ విజయానికి ముఖ్యమైన కారణం ఈ యువతరమే. సెల్ ఫోన్ చేతబట్టిన యువతరమే మంచి రోజుల కోసం మోడీని గెలిపించారు. 2019లో పుల్వామా దాడి ఉగ్రదాడి తర్వాతి వాతావరణం బీజేపీ విజయానికి చాలా వరకు తోడ్పడింది. భారతదేశం సాంస్కృతిక, చారిత్రక వైభవం హిందూ సంస్కృతి, హిందూరాష్ట్రలోనే ఉన్నాయని నమ్మే యువత బీజేపీకి చాలా ఉపయోగపడుతోంది. కాని మరోవైపు భారత లౌకికస్ఫూర్తిని, బహుళత్వాన్ని ప్రేమించే యువత కూడా చాలా మంది ఉన్నారని ఈ నిరసనలు చాటి చెప్పాయి. జనవరి 8వ తేదీన దాదాపు 25 కోట్ల మంది స్ట్రయిక్ లో పాల్గొన్నారని అంచనా. ఈ నిరసనలు, ప్రదర్శనలు భారతదేశంలో రాబోయే కాలంలో చోటు చేసుకునే మార్పులను సూచిస్తున్నాయి.

ఇంతకు ముందు చెప్పుకున్నట్లు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించింది ముస్లిములే అన్నది పాక్షికంగా మాత్రమే నిజం. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నిరసనలు మొదట ప్రారంభమయ్యాయి. అక్కడ నిరసన ప్రదర్శనలకు పూనుకున్నది ముస్లిములు కానే కాదు. తర్వాత ఈ నిరసనలు దేశంలో ప్రారంభం కావడానికి ముస్లిములే ప్రారంభించారన్నది నిజమే. ముఖ్యంగా ఢిల్లీలో షాహీన్ బాగ్ మహిళల నిరసన, ధర్నా జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ కూడా నిరసన ప్రారంభించింది ముస్లిం మహిళలే అయినా, తర్వాత ఈ నిరసన ప్రదర్శన మతాతీతంగా మారింది. అన్ని మతాల వారు అక్కడికి వచ్చారు. అంతేకాదు, ఈ నిరసనను కవర్ చేయడానికి వెళ్ళిన హిందూ రిపోర్టర్లు నిరసనలో భాగమైన వార్తలు కూడా వచ్చాయి.

షాహీన్ బాగ్ నిరసన ఇచ్చిన స్ఫూర్తితో కోల్ కతాలో పార్క్ సర్కస్ మైదాన్ లో నిరసన ప్రారంభించారు. ఈ మహిళలు ఉద్యమాలకు కొత్త దారి చూపించారు. పొద్దుట 5 గంటలకు లేచి కుటుంబానికి వంట చేసి, పిల్లలను స్కూలుకు పంపించి, తర్వాత తన ఉద్యోగానికి వెళ్ళి, ఉద్యోగం ముగిసిన వెంటనే పార్క్ మైదాన్ నిరసనలో వచ్చి కూర్చుంటున్న మహిళల కథనాలు వచ్చాయి. ఇరవై నాలుగ్గంటలు ఇక్కడ ధర్నా కొనసాగుతూనే ఉంది. షాహీన్ బాగ్ స్ఫూర్తిగా ఈ మహిళల స్థిరచిత్తం చూపిస్తున్నారు.

షాహీన్ బాగ్ నిరసన దాదాపు నెలరోజులుగా కొనసాగుతోంది. ఇందులో చాలా మంది ముస్లిం మహిళలే ఉన్నప్పటికీ అన్ని మతాల మహిళలు ఈ సమూహంలో కనబడతారు. పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలను బలప్రయోగంతో అణిచివేసిన పోలీసులు ఇక్కడ ఏం చేయాలో తోచని అయోమయంలో పడ్డారు. ఎన్నడూ ఇల్లు వదిలి బయటకు రాని మహిళలు కూడా ఇప్పుడు ఇక్కడి ధర్నాలో భాగమయ్యారు. షాహీన్ బాగ్ ధర్నాలు ఇప్పుడు దేశంలోని ఇతర పట్టణాలకు కూడా వ్యాపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్; బీహారులోని గయ, పట్నా, తెలంగాణాలోని హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి ధర్నాలకు మహిళలు ప్రయత్నిస్తున్నారు. ఈ మహిళలు ధర్నాలకు దిగడానికి ముఖ్యమైన కారణాలు రెండు తమ గుర్తింపు పై దాడిని నిరోధించడం, తాము భారతీయులమని చాటి చెప్పడం, భారతీయులుగా నిరూపించుకోవాలని చెప్పే మాటలను తిరస్కరించడం. ఢిల్లీ హైకోర్టు కూడా ఈ మహిళల నిరసన హక్కును సమర్థించింది. ట్రాఫిక్ కు ఏర్పడే అంతరాయాలను పరిష్కరించే బాధ్యత పోలీసులదే అని స్పష్టం చేసింది.

షాహీన్ బాగ్ నిరసనలు దేశంలోని అనేక మంది ప్రముఖులను కూడా ఆకర్షించాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక పట్టణాల్లో షాహీన్ బాగ్ లు ఏర్పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీఫ్ ఘోష్ వంటి వారు పౌరసత్వ సవరణ చట్టాన్ని కాదంటే పాతేస్తాం, చంపేస్తాం అంటూ వీరంగాలు వేస్తున్నప్పటికీ ఈ నిరసనలు ఆగడం లేదు. ఈ నిరసనలకు కోల్ కతా క్రయిస్తవ సమాజం మద్దతు పలుకుతూ వీధుల్లోకి వచ్చింది. డిసెంబర్ 15న ప్రారంభమైన షాహీన్ బాగ్ ధర్నాలో జామియా మిల్లియాలో చదువుతున్న వసుంధర వంటి అనేకమంది అమ్మాయిలున్నారు. జామియా మిల్లియా అంటే అందులో కేవలం ముస్లిములు మాత్రమే చదువుకుంటారనే అపోహలు కూడా చాలా మందిలో ఉన్నాయి. షాహీన్ బాగ్ ధర్నాల్లో భాగంగా మతవర్గాలన్నింటి సమారోహం కూడా జరిగింది. సిక్కు కీర్తనలు, హిందూ హవన్లతో పాటు రాజ్యాంగం అవతారికను చదవడం వంటి కార్యక్రమాలు జరిగాయి. గీతా, బైబిల్, ఖుర్ఆన్ పారాయణాలు కూడా జరిగాయి. ఈ నిరసనల ప్రదర్శనను కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ తో సహా అనేకమంది సందర్శించారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని, ఎన్నార్సీని శశిథరూర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాని నిరసనల్లో ముస్లిముల్లో కొందరు లాయిలాహ ఇల్లల్లాహ్ అని నినాదాలు చేయడాన్ని ఆయన తప్పుపట్టాడు. ఈ నినాదానికి అర్థమేమిటో ఒకసారి చూడాలి. దేవుడు ఒక్కడే, ఒక్క దేవుడు తప్ప మరో దేవుడు లేడు. ఇది ఈ నినాదానికి అర్థం. ముస్లిముల దేవుడు, హిందువుల దేవుడు, క్రయిస్తవుల దేవుడు అనే విభజన, వేర్పాటు ఏదీ ఈ నినాదంలో లేదు. కాని శశిథరూర్ కు ఈ నినాదం నచ్చలేదు. హిందూత్వపై పోరాడుతున్న మనం ఇస్లామీయ తీవ్రవాదాన్ని కూడా వ్యతిరేకించాలి అన్నాడు. ఇదొక విచిత్రమైన వాదన. అసలు ఈ నిరసనలు ఎందుకు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ముస్లిం వ్యతిరేక చట్టం తీసుకువచ్చినందుకు ప్రారంభమయ్యాయి. ఈ చట్టం ప్రత్యక్షంగా ముస్లిములకు వ్యతిరేకమైనది. ముస్లిములు తమ ఉనికి కోసం, మనుగడ కోసం ఉద్యమిస్తున్నారు.

ఇది కేవలం ముస్లిముల సమస్య మాత్రమే కాదని, బడుగుబలహీనవర్గాలందరితో పాటు భారతీయులందరినీ ప్రభావితం చేసే సమస్య అనే అవగాహన ప్రజలందరిలోను ఉంది. కాబట్టి పెద్ద సంఖ్యలో ప్రజలంతా వచ్చారు. వచ్చిన ప్రజలు తమ గుర్తింపు, తమ మనుగడ కోసమే ఉద్యమిస్తున్నారు. ఇది హిందూ వర్సెస్ ముస్లిం ఉద్యమం కాదు. ఈ నిరసనల్లో ఉన్న హిందువు తన గుర్తింపును ప్రకటించే జై శ్రీరాం నినాదం చేయడంలోను తప్పులేదు. ముస్లిము తన గుర్తింపును ప్రకటించడానికి లా ఇలాహ ఇల్లల్లాహ్ అనడంలోను తప్పులేదు. నిజానికి లాయిలాహ ఇల్లల్లాహ్ అనడంలో ముస్లిముల దేవుడు అనే భావ కూడా లేదు. అలాగే దళితులు జై భీం అని నినాదం చేయడంలోను తప్పులేదు. ఈ నినాదాలన్నీ ఈ నిరసనల్లో వినిపించవలసిందే. జై శ్రీరాం, జై భీం, లాయిలాహ్ ఇల్లల్లాహ్ అనే ఈనినాదాలన్నీ కలిసి కట్టుగా, సమైక్యంగా వినిపించాలి. ఎవరి గుర్తింపును వారు ప్రకటించడంలో ఎలాంటి తప్పులేదు. ఈ వాతావరణాన్ని మనం సృష్టించాలి. అంతేకాని, ఒకరి గుర్తింపును ప్రకటించడాన్ని విమర్శించడం మెజారిటేరియన్ రాజకీయాలకు తలొగ్గి చేసే వ్యాఖ్యలు మాత్రమే.

అందరూ అర్ధం చేసుకోవలసిన విషయమేమిటంటే, ఒక నినాదం ఇతరులకు వ్యతిరేకంగా లేనంత వరకు ఆ నినాదాన్ని అభ్యంతరపెట్టవలసిన అవసరం లేదు. లాయిలాహ ఇల్లల్లాహ్ అనేది ఇతర మతవర్గాలకు ఎవరికీ వ్యతిరేకమైనది కాదు. ఒకే ఒక్క దైవం తప్ప మరో దేవుడు లేడని మాత్రమే ఆ నినాదానికి అర్థం. అలాగే జై శ్రీరాం అని హిందు సోదరులెవరైనా నినాదాలు చేస్తే వారిని అభ్యంతర పెట్టవలసిన పని కూడా లేదు. వారి ఇష్టాన్ని, వారి మతపరమైన గుర్తింపు నినాదాన్ని గౌరవించాలి. దీన్న హిందూ వర్సెస్ ముస్లింగా మర్చాడానికి చేసే ప్రయత్నాలను నిరోధించాలి కాని, ఈ నినాదాలను కాదు.

వివక్ష, పీడన, అణిచివేతలకు గురయిన సమూహాలు తమ గుర్తింపును ప్రకటించకుండా ఉద్యమాలు, నిరసనలు చేయాలని చెప్పడం వారిపై పెత్తనం చెలాయించే మనస్తత్వమే. కశ్మీరు పండిట్లపై అణిచివేతలు జరిగాయి. ఈ అణిచివేతలను కశ్మీరీ పండిట్లపై జరిగిన అణిచివేతలని వారి గుర్తింపుతో సహా చెప్పాలే కాని కశ్మీరులో మైనారిటీలపై అణిచివేతలని సాధారణీకరించడం అనేది తప్పించుకు తిరిగే మనస్తత్వం. అలాగే పౌరసత్వ సవరణ చట్టం ముస్లిములకు వ్యతిరేకంగా ఉందన్నది వాస్తవమైనప్పుడు ముస్లిం గుర్తింపును గౌరవిస్తూ గుర్తించాలి. కాని ఈ అభ్యంతరాలు చెప్పేవారి ముఖ్యమైన ఉద్దేశ్యమేమంటే, ముస్లిముల గుర్తింపునకు సంబంధించిన లాయిలాహ ఇల్లల్లాహ్ వంటి నినాదం వినిపిస్తే హిందువులకు ఆగ్రహమొచ్చేస్తుంది, అప్పుడు బీజేపీకి మరింత బలం లభిస్తుందన్నది.

రాబిన్ వర్మ అనే ఒక స్వచ్ఛంద కార్యకర్తను ఈ నిరసనల్లో అరెస్టు చేసిన పోలీసులు అతని ఫోనులో ముస్లిం మిత్రుల పేర్లు చూసి నువ్వు హిందువు అయితే నీకు ముస్లిం మిత్రులెందుకున్నారని అడిగారట. ఇది గత ఐదు సంవత్సరాలుగా ఈ దేశంలో ఏర్పడిన వాతావరణం. ఈ వాతావరణాన్ని తొలగించడం అవసరం. ముస్లిం గుర్తింపు మాటలు వినిపిస్తే హిందువులకు కోపమొస్తుంది, ముస్లిం మిత్రులంటు హిందువులకు కోపమొస్తుంది అనే వాతావరణం మతతత్వ శక్తులు దేశంలో ఏర్పాటు చేశాయి. కాని పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు ఈ వాతావరణాన్ని పటాపంచలు చేస్తున్నాయి. హిందువులు, సిక్కులు, క్రయిస్తవులు అందరూ ఒక్కటవుతున్నారు. నిరసనల సందర్భంగా నమాజు సమయానికి ముస్లిములు నమాజు చేస్తుంటే వారికి రక్షణగా హిందువులు నిలబడుతున్నారు. ఇది అసలైన ఇండియా. ఈ ఇండియాను మళ్ళీ సాధించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి.

విచిత్రమేమంటే, నేనెందుకు హిందువును అని శశిథరూర్ ఒక పుస్తకం రాశాడు. ఆయన స్వయంగా తన గుర్తింపును ప్రకటించడానికి వెనుకాడలేదు. కాని ఇతరులు తమ గుర్తింపును ప్రకటించడమంటే ఆయనకు అభ్యంతరాలు కనబడుతున్నాయి. ఆయనకే కాదు చాలా మంది ఉదారవాదులకు కూడా ఇందులో అభ్యంతరాలు కనిపిస్తున్నాయి. గుర్తింపులను నిరాకరించి అందరినీ ఒకే మూసలో పోస్తామనడం బహుళత్వం కాదు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో సమానంగా పాల్గొన్నవారు ముస్లిములు.

అభ్యుదయ రచయితల సంఘం ప్రొగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ప్రారంభమైంది ఉర్దూలో తరఖ్ఖీ పసంద్ ముసన్నిఫీన్ అనే పేరుతో. దీని వెనుక ఉన్నవారిలో ఎక్కువ శాతం ముస్లిములే. దేశంలోని అనేక ఉద్యమాల్లో ముందుభాగాన నడిచింది ముస్లిములు. 1857 మొదటి స్వతంత్ర సంగ్రామంలో చురుకైన పాత్ర పోషించింది ముస్లిములు, నాయకత్వ బాధ్యతలు నిర్వహించింది ముస్లిములు. నేడు దేశభక్తులు, దేశస్వతంత్ర సంగ్రామయోధుల పేర్లు చెప్పమంటే చాలా మంది ముస్లిముల పేర్లు చెప్పలేకపోతున్నారంటే దానికి కారణం దేశంలో పాఠ్యపుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో వారికి చేసిన అన్యాయమే కారణం. ఝాన్సీ లక్ష్మీబాయి పేరు చాలా మందికి తెలుసు కాని అంతకన్నా ఎక్కువ ధీరోదాత్తంగా పోరాడిన బేగం హజ్రత్ మహల్ ఎవరో తెలియదు. గాంధీజీని హతమార్చిన గాడ్సే పేరు చాలా మందికి తెలుసు, కాని గాంధీజీ ప్రాణాలు కాపాడిన బతక్ మియా అన్సారీ పేరు ఎవరికీ తెలియదు.

సుభాష్ చంద్రబోస్ పేరు చాలా మందికి తెలుసు కాని ఆయన సైన్యంలో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించిన ముస్లిముల పేర్లు తెలియవు. కాని చరిత్రను దాచేసినంత మాత్రాన చేసిన త్యాగాలు కాకుండా పోవు. దేశస్వతంత్ర చరిత్రలో తమ రక్తంతో అధ్యయాలు రాసిన ముస్లిములు తమ హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు తమ గుర్తింపును ప్రకటించి పోరాడ్డంలో తప్పేమిటి? వై ఐ యాం ఏ హిందూ అని శశిథరూర్ చెప్పుకోవడంల తప్పులేదు కాని తమ ఉనికి కోసం నిరసనలు చేస్తున్న ముస్లిములు తమ గుర్తింపు నినాదాలు చేస్తే తప్పయ్యిందా?

ఒక ముస్లిమును ఒక హిందుత్వ గుంపులు పట్టుకుని జై శ్రీరాం అంటావా లేదా అని చావగొట్టడం మతతత్వమవుతుంది. కాని ప్రజాఉధ్యమానికి మద్దతుగా వచ్చిన హిందూ సోదరులు తమ గుర్తింపు నినాదంగా జై శ్రీరాం అనడంలో తప్పులేదు. అలాగే ప్రజాఉద్యమంలో భాగంగా ఉన్న దళితులు జై భీం అనడంలో కూడా తప్పులేదు. ముస్లిములు లాయిలాహ ఇల్లల్లాహ్ అనడంలోను తప్పులేదు. ఈ అవగాహన సమాజంలో పెరగవలసిన అవసరం ఉంది. షాహీన్ బాగ్ లో మతసమ్మేళనం నిర్వహించి ధర్నా చేస్తున్న వారు గీతా, బైబిల్, ఖుర్ఆన్ పారాయణాలను నిర్వహించారు. అక్కడే రాజ్యాంగ పీఠికను చదివారు. ఇదే నేడు కావలసింది. ముస్లిముల నిరసన ప్రదర్శనకు సంఘీభావం, మద్దతు ఇతర వర్గాల నుంచి అవసరం. రాజకీయ పార్టీల మద్దతు కూడా అవసరం. అయితే, వారి నెత్తిన పెత్తనం చెలాయించే మరో రూపంలో ఈ మద్దతు ఉండడం సముచితం కాదు.

ఈ పరిస్థితి కొంతవరకు కారణం ముస్లిములు అని కూడా చెప్పాలి. ముస్లిములకు సంబంధించిన గుర్తింపు మాటలకు అర్థమేమిటో, భావమేమిటో ముస్లిమేతరులకు చెప్పే ప్రయత్నం ముస్లిములు చేసింది చాలా తక్కువ. అల్లాహు అక్బర్ అంటే అక్బర్ చక్రవర్తి పేరు తలుస్తున్నారని భావించే హిందూ మిత్రులు కొందరు నాకు తెలుసు. అల్లాహు అక్బర్ అంటే అర్ధం – దైవం సర్వోన్నతుడు అని మాత్రమే. అస్సలాము అలైకుం అంటే మీకు శాంతి కలుగుగాక అని మాత్రమే అర్థం. లాయిలాహ ఇల్లల్లాహ్ అంటే దైవం ఒక్కడే మరో దైవం లేడు అని అర్థం. ఇది ఏకదైవారాధనకు సంబంధించిన విశ్వాస వచనం. నిర్గుణోపాసన అనేది హిందుధర్మంలో కూడా ఉంది కదా? ఈ పదాలు, వాక్యాలకు అర్థం, ఇస్లాం గురించి అవగాహన ముస్లిములు హిందూ సోదరులకు కలిగించే ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే నేడు ఈ అయోమయం ఉండేది కాదు.

ఫైజ్ అహ్మద్ రాసిన హమ్ దేఖేంగే కవితపై అభ్యంతరాలకు కూడా కారణం ఇదే. ఈ అవగాహన కల్పించవలసిన అవసరం నేడు ఉంది. ముస్లిములకు హిందు మతం గురించిన అవగాహన, హిందువులకు ఇస్లాం గురించిన అవగాహన కల్పించాలి. అందరిలోను అన్ని మతాల గురించి అవగాహన రావాలి. గాంధీజీ చెప్పిన మాటలు ఇక్కడ ప్రస్తావించవలసిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశం ఏదో ఒక మతానికి చెందిన దేశంగా మారడం నా కల కాదు. మతసహనంతో అందరూ కలిసికట్టుగా జీవించే దేశం కావాలన్నారు. అదే మనకు కావలసింది. ఈ మతసామరస్యం, సహనవాతావరణాలను ధ్వంసం చేసే పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ వంటి వాటిని వ్యతిరేకిస్తున్న ఉదారవాదులు, రాజకీయపార్టీలు అందరూ సర్వమతాల గుర్తింపులకు కూడా ఈ నిరసనల్లో సముచిత స్థానం కల్పించడమే సరయిన పంథా.

ముస్లిములు, సిక్కులు, క్రయిస్తవులు ఈ దేశంలో చాలా సవాళ్ళను ఎదుర్కున్నారు. ఢిల్లీలో సిక్కు వ్యతిరేక అల్లర్లు, గుజరాత్ లో ముస్లిం వ్యతిరేక మారణకాండ, క్రయిస్తవులపై దాడులు అందరికీ తెలిసినవే. కాబట్టి మైనారిటీ సమూహాలకు వారి మతపరమైన గుర్తింపులను ప్రదర్శించే స్వేచ్చ కలిగిన ఉద్యమాలు నేడు అవసరం. ఉదారవాదులు, రాజకీయపార్టీలు ఈ విషయాన్ని గుర్తించాలి. ముస్లిం పేరు మాత్రమే ఉంచుకో, ముస్లిం గుర్తింపును పక్కనపెట్టు, కవిత్వం గురించి మాట్లాడు కాని నీ ప్రార్థనల గురించి మాట్లాడకు, వంటి ఆంక్షలతో కలుపుకువెళ్ళడం సాధ్యమా?

ఇది కేవలం ముస్లిముల సమస్య మాత్రమే కాదని ఇంతకు ముందే చెప్పుకున్నాం. బడుగు బలహీనవర్గాలు మాత్రమే కాదు, చాలా మంది మధ్యతరగతి ప్రజలు కూడా ఈ సమస్యలో చిక్కుకునే అవకాశం ఉంది. పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల తర్వాత ఇప్పుడు ఎన్నార్సీని పక్కన పెట్టి నేషనల్ పాప్యులేషన్ రిజీష్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఎన్నర్సీకి తొలిదశ నేషనల్ పాప్యులేషన్ రిజీష్టరని చాలా మంది విశ్లేషణలతో సహా వివరించారు. ఈ నేపథ్యంలో మనం చేయవలసింది అందరూ కలిసి కట్టుగా రాజ్యాంగ విలువలను కాపాడుకోడానికి ఉద్యమించడం. ఈ ఉద్యమాల్లో ఎవరు తమ గుర్తింపు చిహ్నాలను ప్రదర్శించినా వాటిని సముద్రంలో కలుస్తున్న నదులుగా పరిగణించి స్వీకరించాలి.

కవి, రచయిత

2 thoughts on “పౌరసత్వ సవరణలపై ఉద్యమాల గర్జన

  1. “పౌరసత్వ సవరణలపై ఉద్యమాల గర్జన” చాలా వివరంగా బాగా చెప్పారు. ఈ ఉద్యమ గర్జనలో మహిళలు ముందుండి నడపడం కొత్త ఆశలు ఉద్యమాలకు ఒక చాలా encouraging మలుపు

  2. రచయిత సామాజిక అవగాహన గొప్పది. దానికి నమస్సులు. బహుశా అనుభవాలు నేర్పిన పాఠాల వల్ల ఇది అనివార్యం అని కాబోలు చాలామంది రచయితలు అస్తిత్వవాద ధోరణుల్లోనే పయనించాలని భావిస్తున్నారు. కానీ మత్తుమందు ఐన మతాన్ని వెలివెయ్యడమే ప్రపంచ మానవాళికి హితం, ప్రజావిముక్తికి పరిష్కారం. ఇలా ఆలోచిస్తే ఇంకా చాలా మంది మేధావులకి ఆమోదయోగ్యం కాగలదు. నమస్తే.

Leave a Reply