పెగాసస్‍పై సుప్రీమ్‍ దర్యాపు – బోనులో మోడీ సర్కార్‍

పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదిపేసిన పెగాసస్‍ నిఘా ఉదంతంపై కూలంకషమైన దర్యాప్తు కోసం ముగ్గురితో కూడిన నిపుణుల కమిటీని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆర్‍వి రవీంద్రన్‍ పర్యవేక్షణలో వేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయం స్వాగతించవలసిన అంశం. వేలాది మంది ప్రముఖులకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ భయానక సాఫ్ట్వేర్‍పై చర్చకు ససేమిరా అంటూ మొండికేసిన ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్‍కు ఇది ఓ హెచ్చరిక. వ్యక్తిగత గోప్యతను హరించే పెగాసస్‍ స్పైవేర్‍ ఒప్పందం ఎవరు కుదుర్చుకున్నారు? ఎందుకు కుదుర్చుకున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం నిగ్గుతేల్చే దిశగా సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం ప్రజలకు ఊరటనిస్తున్న అంశం. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, క్రీడాకారులు, జర్నలిస్టులు, చివరికి న్యాయమూర్తులపైన కూడా ఈస్పైవేర్‍తో నిఘా పెట్టారని ఈ ఏడాది జూలై 18న ‘ది వైర్‍’లో వచ్చిన వార్తపై ఆర్‍ఎస్‍ఎస్‍ బిజెపి సర్కారు స్పందించలేదు. ఎందుకోసం ఈ నిఘా వ్యవస్థను వినియోగించారన్న ప్రశ్నకు కూడా మౌనమే సమాధానమైంది. ప్రజా హక్కులను కాలరాసే ఈ చర్యకు మోడీ సర్కారు జవాబు చెప్పక తప్పదు. ప్రజల హక్కులే ప్రమాదంలో పడినప్పుడు, ఇంతకు మించిన దేశ ప్రయోజనాలు ఏమి ఉంటాయి?

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జన జీవితాన్ని సుఖమయం చేయడానికి ఉపయోగపడినంత కాలం ఇబ్బంది లేదు. కానీ ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని దొంగ చాటుగా ప్రజల మీదే ప్రయోగించి వారి వ్యక్తిగత గోప్యతకు, మౌలిక హక్కులకు భంగం కలిగించడం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదు. పెగాసస్‍ వివాదం చెలరేగినప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద గగ్గోలు మొదలైంది. ఇజ్రాయెల్‍ సంస్థ ఎన్‍ఎస్‍ఓ గ్రూపు క్యూ సైబర్‍ టెక్నాలజీస్‍ సృష్టించిన పెగాసస్‍ పరికరాన్ని ప్రయోగించి మోడీ ప్రభుత్వం పత్రికా రచయితల నుంచి మొదలుకొని, ప్రత్యర్థి పక్షాలకు చెందిన రాజకీయ నాయకులు, మానవ హక్కుల కోసం పాటు పడే కార్యకర్తలు కడకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసిన సీనియర్‍ అధికారులకు వ్యతిరేకంగా (పెగాసస్‍) వినియోగించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంగీకార యోగ్యం కాదు. పెగాసస్‍ సాంకేతిక పరిజ్ఞానాన్ని మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న దుమారం రేగినప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత అంటూ పెద్దపెద్ద మాటలతో దాటవేత ధోరణిని ప్రదర్శించింది. ఈ వ్యవహారంలో వివక్షాల ఆందోళనలకు కనీసం బాధ్యతాయుతమైన సమాధానం ఇవ్వలేదు. అంతేగాకుండా ఉన్నత న్యాయస్థానంను కూడా విశ్వాసంలోకి తీసుకోలేదు. ఇకపోతే పెగాసస్‍ వ్యవహారంపై ఇజ్రాయెల్‍ కూడా పెద్దగా స్పందించ లేదు. భారత్‍ అంతర్గత వ్యవహారంగా అది ప్రకటించింది. కానీ ఈ పరిజ్ఞానాన్ని భారత్‍కు అమ్మలేదని ఒక్క మాట కూడా చెప్పలేకపోయింది.

ప్రముఖులపై దేశంలో 300 పైగా మొబైల్‍ ఫోన్లపై నిఘా ఉంచారంటూ సీనియర్‍ జర్నలిస్టులు ఎన్‍ రామ్‍, మనోహర్‍లాల్‍ శర్మ, ఎడిటర్స్ గిల్డ్ సహా పలువురు జర్నలిస్టులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‍ ఎన్‍వి రమణ, జస్టిస్‍ సూర్యకాంక్‍, జస్టిస్‍ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం అక్టోబర్‍ 27న 46 పేజీల తీర్పు ఇచ్చింది. దీంతో పెగాసస్‍ స్పైవేర్‍పై విచారణలో సర్వోన్నత న్యాయస్థానం స్పందించిన తీరు, దేశంలో బిక్కు బిక్కుమంటున్న పౌరహక్కులకు కొత్త ఊపిరి పోసింది. సుప్రీంకోర్టు సర్కారు తీరును ఎత్తి చూపడంతో పాటు న్యాయవ్యవస్థ పట్ల అడుగంటుతున్న ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించినట్లయింది. పెగాసస్‍ అంశంపై దర్యాప్తునకు నిపుణుల కమిటీని తామే ఏర్పాటు చేస్తామన్న కేంద్ర విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రజాస్వామ్య దేశంలో అక్రమంగా వ్యక్తులపై నిఘా పెట్టడాన్ని అనుమతించలేమని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా కోర్టు రెండు పాత తీర్పులను ఉదాహరించింది. వాటిలో ఒకటి 1985 నాటి ఇండియన్‍ ఎక్స్ప్రెస్‍ను వర్సెస్‍ యూనియన్‍ ఆఫ్‍ ఇండియా కేసు. ఆకేసులో సుప్రీంకోర్టు పత్రికా స్వేచ్ఛకు సంబంధించి పేర్కొన్న అంశాలను తీర్పులో ప్రస్తావించింది. స్వేచ్ఛాయుత రాజ్యాంగాలు ఉన్న అన్ని దేశాల్లో పత్రికా స్వేచ్ఛను ఆయా రాజ్యాంగాల్లో పొందుపరచడం కోసం కఠినమైన, గొప్ప సంఘర్షణలు జరిగాయని… గణనీయమైన త్యాగాలు ,వేదనల ఫలితంగానే ఆయా లిఖితపూర్వక రాజ్యాంగాల్లో పత్రికా స్వేచ్ఛ పొందుపరచబడిందని నాటి తీర్పులో పేర్కొన్న విషయాన్ని జస్టిస్‍ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గుర్తుచేసింది. అలాగే… 2020 నాటి అనురాధ భాసిన్‍ వర్సెస్‍ యూనియన్‍ ఆఫ్‍ ఇండియా కేసు విచారణ సందర్భంగా ఆధునిక ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యత గురించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ఉటంకించింది. మొత్తం 46 పేజీల తీర్పులో సుప్రీంకోర్టు నాలుగు పారాగ్రాఫ్‍లు పత్రికా స్వేచ్ఛ గురించే ప్రముఖంగా ప్రస్తావించడం… పత్రికా స్వేచ్ఛ ఆవశ్యకతను నొక్కి చెప్పడం గమనార్హం.

గూడచర్యం ఆరోపణల్లో నిజనిజాలు తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు అక్టోబర్‍ 27 నాడు పెగాసస్‍ బ్రహ్మ రహస్యం చేధించే బాధ్యతను ముగ్గురు సభ్యులతో (డా.నవీన్‍ కుమార్‍ చౌదరి, డా. ప్రభాహరణ్‍, డా. అశ్విని అనిల్‍ గుమస్తే) కూడిన నిపుణుల కమిటీకి అప్పగించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‍ ఆర్‍వి రవీంద్రన్‍ కమిటీకి నేతృత్వం వహిస్తారని, దర్యాప్తు పారదర్శకంగా, సమర్థంగా జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కమిటీకి టర్మస్ ఆఫ్‍ రిఫరెన్స్ (టిఓసి)ను తీర్పులో పొందుపరిచింది. కమిటీ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్పష్టం చేసింది. సైబర్‍ భద్రత, డిజిటల్‍ ఫోరెన్సిక్స్, నెట్వర్క్, హార్డ్వేర్‍లను త్రిసభ్య ప్యానల్‍ పనితీరును జస్టిస్‍ రవీంద్రన్‍ పర్యవేక్షిస్తారని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.

దేశభద్రత, దేశద్రోహం అనే ఆయుధాలను ప్రయోగించి తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని పాలకులు ఎల్లవేళలా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే పెగాసస్‍ వ్యవహారం దుమారం రేపింది. అలాగే దేశద్రోహం కింద కూడా గతంలో సుప్రీం ధర్మాసనం తీవ్రంగానే స్పందించింది. ఎప్పుడో బ్రిటీష్‍ హయాంలో తెచ్చిన చట్టాన్ని ఇంకా దుర్వినియోగం చేయడంపై ఘాటు గానే వ్యాఖ్యానిస్తూ దానిని రద్దు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఇదే సందర్భంలో పాలకుల ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్న వారిని వేయికళ్ళతో కనిపెట్టడానికి పెగాసస్‍ వంటివాటిని ఉపయోగించినట్లు ఆరోపణలు రావడంతో దేశంలో దుమారం చెలరేగింది. మేధావులు, మాజీ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, పాత్రికేయులు ఇత్యాది అనేక రంగాలకు చెందిన ఎంతో మంది మీద నిఘాను ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్షాలు పార్లమెంటు వేదికగా ఆందోళన చేసినప్పటికీ బిజెపి పెద్దలు దానిని అబద్ధం అంటూ తప్పించుకో జూశారు. కానీ సుప్రీం మాత్రం దీనిని సీరియస్‍గానే తీసుకుంది.

పౌరులపై నిఘా, అందులో విదేశీసంస్థల ప్రమేయంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ప్రభుత్వంలో కనీస స్పందన కూడా కానరాలేదు. దీంతో ప్రభుత్వంపై సహజంగానే అనుమానాలు వచ్చాయి. ఈ స్థితిలో దీనిపై తీసుకున్న చర్యలేమిటో తెలియచేయమని కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు అవకాశం ఇచ్చిన విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. ప్రభుత్వం ఏమాత్రం వివరాలు చెప్పకుండా, అస్పష్టమైన, అసంపూర్ణమైన అఫిడవిట్‍ సమర్పించినందున కమిటీ ఏర్పాటు నిర్ణయానికి తాము రావలసి వచ్చిందని న్యాయస్థానం పేర్కొన్న తీరు కూడా మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎత్తి చూపింది. దేశభద్రత రీత్యా సమచారాన్ని ఇచ్చేది లేదన్న కేంద్రం వాదనను న్యాయస్థానం ఘాటుగానే విమర్శించింది. దాన్ని అడ్డుపెట్టుకొని పౌరహక్కులూ స్వేచ్ఛకు భంగం వాటిల్లే చర్యలకు ఉపక్రమించడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయ పడింది. కోర్టుకు సమాచారం ఇచ్చినప్పుడు దేశభద్రతకు ప్రమాదం వాటిల్లుతుందనడానికి తగిన ఆధారాలుండాలి తప్ప, అడిగినప్పుడల్లా అదేమాటతో న్యాయస్థానాల నోరు మూయించగలమనుకోవడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

స్పైవేర్‍ దుర్వినియోగం, వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని పిటిషన్‍ దారులు అంటున్నప్పుడు, దానిని ఉపయోగించామా లేదా అన్నది ప్రభుత్వం చెప్పనప్పుడు నిజాన్ని నిగ్గుతేల్చగలిగే కమిటీ ఏర్పాటు తప్ప మరోమార్గం లేదని న్యాయస్థానం అభిప్రాయ పడింది. అయితే ఇక్కడ మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‍లో పూర్తి నిర్లక్ష్యం కనబర్చింది. అందరికి చెప్పినట్లుగానే యథాలాపంగా సుప్రీంకోర్టు ముందు కూడా లేదు అన్న తీరులో సమాధానం ఇచ్చింది. సుప్రీంకోర్టు నిర్ణయం ఓ రకంగా చూస్తే ప్రజల స్వేచ్ఛను కాపాడేందుకు తీసుకున్న రక్షణ కవచంగా చూడాలి. పౌరుల విషయంలో పాలకుల నిరంకుశ ధోరణిని ఎండగట్టేదిగా చూడాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్నీ, పౌరహక్కులనూ కాపాడవలసిన పాలకులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం వల్లనే ఇవాళ న్యాయస్థానాలు ప్రజల పక్షాన ముందుకు రావడం ముదావాహం.

స్పైవేర్‍ పెగాసస్‍పై సమగ్రంగా పరిశీలించి, ఎనిమిది వారాల్లోగా నివేదిక అందించాలని కోరింది. అంటే ఈ ఏడాది డిసెంబర్‍ నాటికి నివేదిక సుప్రీంకోర్టుకు అందాలి. అయితే డిసెంబర్‍ అఖరి వారంలో సుప్రీంకోర్టుకు సెలవులు ఉంటాయి. కనుక వచ్చే ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు ఈ నివేదికను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయవచ్చు. వ్యక్తుల టెలిఫోన్‍ సంభాషణలను ప్రభుత్వ ఆధీనంలోని గూఢచార సంస్థలు దొంగ చాటుగా వినే సంప్రదాయం మనకు ఇంతకు ముందు కూడా ఉంది. ఆ ఆరోపణల కారణంగానే చంద్రశేఖర్‍ ప్రభుత్వం జూన్‍ 1991లోపడిపోయింది. అయినా మోడీ సర్కారు మాత్రం ఈ విషయంలో పెదవి విప్పిన పాపాన పోలేదు. చివరకు సుప్రీంకోర్టు కలగజేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. పెగాసస్‍ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వాదనలు చేసిన వారినందరినీ ప్రభుత్వం జాతి వ్యతిరేకుల జాబితాలో చేర్చేసింది.

సబ్‍కా సాత్‍, సబ్‍కా వికాస్‍, అచ్చేదిన్‍, పారదర్శక పాలన అదే వివాదాలతో మోడీ అధికారంలోకి వచ్చాడు. మోడీ దుష్పరిపాలనపై అభ్యంతరం చెప్పే వారిని, తమకు గిట్టని రాజకీయ పార్టీల నాయకులను దేశద్రోహుల కింద జమ కట్టడం ఈ ప్రభుత్వానికి పరిపాటి అయిపోయింది. రాజీవ్‍గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు బోఫోర్స్ కుంభకోణం బయటపడ్డప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి నానా యాగీ చేసింది. బోఫోర్స్ కుంభకోణంలో ఇమిడి ఉన్న డబ్బు కేవలం రూ.64 కోట్లు. ఈ ఆరోపణలు తీరా చూస్తే రుజువు కానే లేదు. అంత మాత్రం చేత కాంగ్రెస్‍ కడిగిన ముత్యం లాంటిదని చెప్పడం కాదు. ఒకవేళ ఆ ఆరోపణలు రుజువై ఉన్నా అది ప్రభుత్వతంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు అవినీతికి పాల్పడ్డారని తేలేదేమో గానీ శిక్షలు పడేవి కాదు. తమకు అధికారం ఇస్తే అవినీతి పంకిలంలో నుంచి ఈ దేశాన్ని బయటకు లాగుతామని శుష్క వాగ్దానాలు చేసిన మోడీ ప్రభుత్వం ఆ పని చేయలేక పోయింది.

ఎమర్జెన్సీ (1975) సమయంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్‍లను ట్యాప్‍ చేసినందుకు అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుని పడ్డాయి. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత బిజెపి మాతృక అయిన భారతీయ జనసంఘ్‍ కూడా వ్యక్తి స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్‍ నాయకులు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎమర్జెన్సీ నాటి చట్టాల కన్నా ఇది ఏమాత్రం తక్కువేమీ కాదని వాదించారు. అయితే, పార్లమెంటులో తనకున్న బలాన్ని పురస్కరించుకుని ప్రతిపక్షాల అభ్యర్థనను తిరస్కరించింది. పెగాసస్‍ సాంకేతిక పరిజ్ఞానాన్ని మోడీ సర్కారు దుర్వినియోగం చేసినట్టు రుజువు అవుతుందో లేదో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ మీద, ఒకవేళ సుప్రీంకోర్టు ఆ నివేదికను ఆమోదించి ఉత్తర్వు జారీ చేస్తుందా లేదా అన్న అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థలు అన్ని తమ స్వతంత్రను కోల్పోయి ప్రభుత్వ కనుసన్నల్లో వ్యవహరిస్తున్న మోడీ ఫాసిస్టు పాలన కాలంలో మనమున్నాం.

సుప్రీంకోర్టు గుచ్చిగుచ్చి అడిగినా మోడీ ప్రభుత్వం పెగాసస్‍ వ్యవహారాన్ని తోసిపుచ్చుతూ వచ్చిందే తప్ప తాము వినియోగించామని కానీ వినియోగించలేదని కానీ ఇదమిత్థంగా తేల్చి చెప్పలేదు. ప్రతి అంశాన్ని దేశ భద్రతకు ముడిపెట్టి సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం కుదరదని అక్టోబర్‍ 27 నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధీనంలోని బెంచి స్పష్టం చేసింది. ప్రభుత్వం చేసిన పనులు న్యాయ పరిశీలనకు అతీతమైనవని ఈ ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. మన పరిపాలనా వ్యవస్థలో చట్ట సభలు, కార్యనిర్వాహక వర్గం (ప్రభుత్వం) చేసే పనులు, తీసుకునే చర్యలు న్యాయ పరిశీలన దగ్గరకు వచ్చేటప్పటికీ తలొగ్గాల్సిందే. పెగాసస్‍ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారా లేదా అన్న ఒక్క మాటకు ప్రభుత్వం జవాబు చెప్పకుండా ఉండడం ప్రజాస్వామ్య వ్యవస్థలో కుదిరే పని కాదని సుప్రీంకోర్టు ఆదేశం వల్ల తేలిపోయింది.

ప్రజలకు ఉన్న రాజ్యాంగ దత్తమైన హక్కులను యధేచ్ఛగా ఉల్లంఘించడం కుదరదని సుప్రీంకోర్టు నిర్మోహమాటంగానే చెప్పింది. ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చినా స్పందించనందుకు అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. ప్రభుత్వం సమర్పించిన ప్రమాణ పత్రం చాలా ‘‘పరిమితంగా ఉంది’’ అని కూడా న్యాయస్థానం చెప్పవలసి వచ్చింది. జాతీయ భద్రత మిషతో వాస్తవాలను కప్పిపుచ్చడాన్ని అంగీకరించడానికి సుప్రీంకోర్టు సిద్ధంగా లేదని తేలిపోయింది. సుప్రీకోర్టు నిర్ణయం మోడీ సర్కారుకు అత్యంత అననుకూల పరిస్థితుల్లో వెలువపడింది. మోడీ పలుకుబడి ఏ మాత్రం తగ్గలేదని టముకు వేసుకుంటున్నా ప్రజల్లో ఇప్పటికే అసంతృప్తి రాజుకుంటోంది. దీనికి తోడు రాజ్యాంగం ప్రకారం దక్కవలసిన హక్కులను కూడా కబళించే ప్రయత్నం చేయడాన్ని సహించేది లేదన్న సుప్రీంకోర్టు వైఖరి మోడీ ప్రభుత్వానికి అశనిపాతమే. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందిన తరువాత దాన్ని న్యాయస్థానం పరిశీలించే సమయంలో బిజెపి అయిదు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉంటుంది. ఆ మధ్యలో సుప్రీంకోర్టు కనక పెగాసస్‍ సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసినట్టు ధ్రువీకరిస్తే అది మరింత ఇరకాటంలో పడవేయక తప్పదు.

దేశ రక్షణ, జాతీయ భద్రత మొదలైన అంశాల్లో ప్రభుత్వానికి సర్వోన్నత అధికారాలు ఉన్నమాట నిజమే కానీ, పౌరుల ప్రాథమిక హక్కులకు హాని చేసే ఏ చర్యనైనా సమర్థించడం సాధ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగం పూచీపడ్డ ప్రాథమిక హక్కులను పరిరక్షించవలసిన బాధ్యత కచ్చితంగా సుప్రీంకోర్టుదే. గోప్యత సైతం ప్రాథమిక హక్కుల్లో బాగమన్న స్పృహ ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు. గోప్యత నిర్నిబంధమైంది కాకపోవచ్చు. దానికి పరిమితులు ఉండవచ్చు. కానీ ప్రభుత్వం విధించే పరిమితులు రాజ్యాంగబద్ధమైనవి అయి ఉండవలసిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనేక కిరాతక చట్టాల కింద ప్రభుత్వాన్ని నిలదీసే వారి మీద బూటకపు కేసులు మోపడం ఈ ప్రభుత్వానికి అలవాటె•పోయింది. ప్రభుత్వాన్ని తప్పు పట్టిన వారందరి మీద ఈ కిరాతక చట్టాలు ప్రయోగించి వారిని జైళ్లల్లో మగ్గేట్టు చేస్తున్నారు. ఇందులో రాజకీయ నాయకులు, పత్రికా రచయితలు, మానవ హక్కుల కోసం పాడు పడే కార్యకర్తలు సామాజిక మేధావులు, రచయితలు, కళాకారులు, విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నారు. దేశద్రోహులు, జాతి వ్యతిరేకులు అని కాకపోతే మావోయిస్టులు అన్న ముద్ర వేస్తూ మోడీ ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తోంది. దీన్ని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు నిర్ణయం ఉపకరించాలని ఆశిద్ధాం.

పెగాసస్‍ విచారణ కమిటీ సభ్యులు :

పెగాసస్‍ దుర్వినియోగానికి సంబంధించిన విచారణ కమిటీకి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‍ ఆర్‍వి రవీంద్రన్‍ ఈ నేతృత్వం వహిస్తారు. విశ్రాంత జస్టిస్‍ రవీంద్రన్‍ న్యూస్‍ బ్రాడ్‍కాస్టింగ్‍ స్టాండర్డస్ ఆథారిటీ (ఎన్‍బిఎస్‍ఎ)కి 2013 నుంచి 2019 వరకూ చైర్మన్‍గా బాధ్యతలు నిర్వర్తించారు. జస్టిస్‍ రవీంద్రన్‍కు సహాయకారిగా ఈ కమిటీలో సభ్యుడిగా 1976 ఐపిఎస్‍ బ్యాచ్‍కు చెందిన ఆలోక్‍ జోషిని సుప్రీంకోర్టు నియమించింది. ఈయన ఇంటిలిజెన్స్ బ్యూరో సంయుక్త డైరక్టర్‍గా బాధ్యతలు నిర్వర్తించారు. విశేషమైన దర్యాప్తు అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. రిసెర్చ్, ఎనాలసిస్‍ వింగ్‍(రా)లో కార్యదర్శిగా, నేషనల్‍ టెక్నికల్‍ రిసెర్చీ ఆర్గనైజేషన్‍కు చైర్మన్‍గానూ బాధ్యతలు నిర్వర్తించారు. మూడవ సభ్యుడు డాక్టర్‍ సందీప్‍ ఒబెరాయ్‍ ప్రపంచవ్యాప్తంగా సైబర్‍ సెక్యురిటీ నిపుణుడుగా గుర్తింపు పొందారు. టిసిఎస్‍ సైబర్‍ సెక్యూరిటీస్‍ సర్వీసెస్‍ గ్లోబల్‍ హెడ్‍గా పనిచేశారు. సాఫ్ట్వేర్‍ ఉత్పత్తుల రంగంలో సదుపాయాల అభివృద్ధికి సబ్‍ కమిటీ అయిన ఇంటర్నేషనల్‍ ఆర్గనైజేషన్‍ ఆఫ్‍ స్టాండరైజేషన్‍ ఇంటర్నేషనల్‍ ఎలక్ట్రో టెక్నికల్‍ కమీషన్‍, జాయింట్‍ టెక్నికల్‍ కమిటీకి చైర్మన్‍గా వ్యవహరించారు.

సాంకేతిక కమిటీ సభ్యులు :

1. డాక్టర్‍ నవీన్‍కుమార్‍ చౌదరి, సైబర్‍ సెక్యూరిటీ, డిజిటల్‍ ఫోరెన్సిక్‍ ప్రొఫెసర్‍గా గుజరాత్‍లోని నేషనల్‍ ఫోరెన్సిక్‍ సైన్సెస్‍ యూనివర్సిటీ డీన్‍గా పనిచేశారు. రెండు దశాబ్ధాలకు పైగా ఉపాధ్యాయుడిగా పనిచేయడంతో పాటు సైబర్‍ సెక్యూరిటీ ఎనేబులర్‍గా, సైబర్‍ సెక్యురిటీ నిపుణుడిగా పేరుగాంచారు. సైబర్‍ సెక్యూరిటీ పాలసీ, నెట్‍వర్క్, వల్నరబిలిటి అసెస్‍మెంట్‍, పెనట్రేషన్‍ టెస్టింగ్‍లో అనుభవం గలవారు. 2. డాక్టర్‍ పి. ప్రభాకరన్‍ కేరళలోని అమృత విశ్వ విద్యాపీఠంలో స్కూల్‍ ఆఫ్‍ ఇంజినీరింగ్‍ ప్రొఫెసర్‍ కంప్యూటర్‍ సైన్స్, సెక్యూరిటీకి సంబంధించి రెండు దశాబ్ధాల అనుభవం ఈయన సొంతం. మాల్‍వేర్‍ డిటెక్షన్‍, క్రిటికల్‍ ఇన్‍ఫాస్ట్రక్చరల్‍ సెక్యూరిటీ, కాంప్లెక్స్ బైనరీ ఎనాలసిస్‍, ఆర్టిఫిషియల్‍ ఇంటెలిజెన్స్, మెషిన్‍ లెర్నింగ్‍లో నిపుణులు. పలు జర్నల్స్లో ప్రభాహరన్‍ వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 3. డాక్టర్‍ అశ్విన్‍ అనిల్‍ గుమాస్తే బాంబే ఇండియన్‍ ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్‍ టెక్నాలజీ (ఐఐటీ)లో కంప్యూటర్‍సైన్స్ ఇంజినీరింగ్‍లో ఇన్‍స్టిట్యూట్‍ చైర్‍ అసోసియేట్‍ ప్రొఫెసర్‍. ఈయన పేరు మీద 20 యూఎస్‍ పేటెంట్లు ఉన్నాయి. 150 పత్రాలు వివిధ ‘‘జర్నల్స్లో ప్రచురితం కాగా మూడు పుస్తకాలు రాశారు. విక్రమ్‍సారాభాయ్‍ అవార్డు (2012), శాంతి స్వరూప్‍ భట్నాగర్‍ అవార్డు (2018) లో అందుకొన్నారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్‍ టెక్నాలజీ విజిటింగ్‍ సైంటిస్ట్ ప్రొఫెసర్‍ గానూ ఉన్నారు.

కమిటీ పరిశీలించే అంశాలు :

భారతీయుల ఫోన్లు, ఇతరత్రా పరికరాలను పెగాసస్‍ స్పైవేర్‍ను వినియోగించి వారి సంభాషణలను ఆలకించడం, ఫోన్లలో నిల్వ ఉన్న సమాచారాన్ని సేకరించడం, లేదా ఇతరత్రా ప్రయోజనాల కోసం వినియోగించడం కేంద్ర ప్రభుత్వం చేసిందా? అలా చేసే బాధితుల వివరాలు ఏంటి? పెగాసస్‍ వినియోగించి 2019లో భారతీయుల వాట్సాప్‍ ఖాతాలు హ్యాకింగ్‍కు గురైనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందించింది. ఏయే చర్యలు తీసుకుంది? కేంద్రం పెగాసస్‍ సహా ఏ తరహావైనా స్పైవేర్‍ను కలిగి ఉందా? భారతీయులపై కేంద్ర దర్యాప్తు సంస్థ దాన్ని వినియోగించిందా? ఒకవేళ కేంద్ర దర్యాప్తు సంస్థ భారతీయులపై ఆ తరహా స్పైవేర్‍ను వినియోగించి ఉంటే ఏ చట్టం ప్రకారం, ఏ నిబంధనల ప్రకారం లేదా ఏ ప్రోటోకాల్‍, న్యాయ సంబంధిత అంశం ద్వారా చేపట్టింది? భారతదేశానికి సంబంధించిన సంస్థ/వ్యక్తులు స్పైవేర్‍ వినియోగించినట్లెతే వారికి ఉన్న అధికారం ఏంటి? ఇతరత్రా సంబంధిత అంశాలు, ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అనేది కమిటీ పరిశీలించాల్సిన అంశాలుగా ఉంటాయని కోర్టు పేర్కొంది.

తీర్పులో జార్జి ఆర్వెల్‍ నవలా ప్రస్తావన :

సుప్రీంకోర్టు తీర్పులో బుద్దిజీవులందరిని కదిలించే అంశమేమిటంటే, 1949లో ప్రముఖ బ్రిటీష్‍ రచయిత జార్జి ఆర్వెల్‍ రాసిన 1984 డిస్పోపియన్‍ సోషల్‍ సైన్స్ ఫిక్షన్‍ నవలలో నియంతృత్వం, నిఘా, అణచివేత ఇతివృత్తంగా ఉంది. ఆ నవలలో ఒసియానా అణే సూపర్‍ దేశం ఒకటుంటుంది. ఆ దేశానికి సూపర్‍ బాస్‍ ఒకరుంటారు. అతడే బిగ్‍ బ్రదర్‍, మహాపురుషుడని, మహానుభావుడని అతడిని నిరంతరం ఊదరగొడుతూ అతడు లేకపోతే అంతా అల్లకల్లోలమవుతుందని ప్రచారం చేసే పార్టీ యంత్రాంగం ఒకటి ఉంటుంది. ఆ దేశంలో సర్వత్రా నిఘా ఉంటుంది. స్వతంత్ర ఆలోచనలను పసికట్టే పోలీసు యంత్రాంగం ఉంటుంది. 1949లో ఈ నవల రాసినప్పుడు, పెగాసస్‍ వంటి గూఢచర్యం చేసే ఆధునిక సాఫ్ట్వేర్‍ అనేది ప్రపంచంలో వినియోగానికి వస్తుందని, ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి కూడా చొచ్చుకుపోతుందని ఆర్వెల్‍ ఊహించి ఉండరు. అయితే అంతటా టెలిస్క్రీన్లు, కెమెరాలు, మైక్రోఫోన్లను అమర్చి నిరంతరం జనంపై నిఘా వేసే రాజ్యాలు ఉంటాయని ఊహించారు. కానీ రాజ్యం నిరంకుశత్వం, సామూహిక నిఘా, వ్యక్తుల భావల అణచివేతను జార్జి ఆర్వెల్‍ తన నవలలో సృజనాత్మకంగా ఊహించాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‍.వి.రమణ ఆర్వెల్‍ నవల సారాంశాన్ని మోడీ పాలనతో పోల్చడం అద్భుతమైన ఉపమానం.

అలలపై నిఘా, అలలు కనే కలలపై నిఘా, చిరుగాలి సితారా సంగీతంపై నిఘా, అలలపై కదిలే పడవలపై నిఘా, పడవల తెరచాలపై నిఘా, తెరచాపల తెల్లధనంపై నిఘా అని ప్రముఖ కవి శివసాగర్‍ రచించిన కవిత్వం తాలూకు నిజాలు ఆర్వేల్‍ రచనలో మనకు కనిపిస్తాయి. అధికారిక వ్యవస్థ ఎవర్ని అనుమానించినా వారు వ్యక్తులుగా ఈ భూప్రపంచం నుంచి అదృశ్యమవుతారు. వారితో పాటు సాక్ష్యాలూ అంతమవుతాయి. నియంతృత్వ పోకడలు కనిపించినప్పుడల్లా ఆర్వెల్‍ ఊహించిన ఫాసిస్టు సమాజం గురించి మేధావులు ప్రస్తావించడం పరిపాటి. మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‍ ఎన్వీరమణ కూడా ఇజ్రాయెల్‍ సంస్థ ఎన్‍ఎస్‍ఓ సృష్టించిన పెగాసస్‍ స్పైవేర్‍కు సంబంధించి వెలువరించిన సంచలనాత్మకమైన తీర్పును ఆర్వెల్‍ తన 1984 నవలలో ప్రస్తావించిన వాఖ్యాలతో ప్రారంభించారు. నీవు ఒక విషయాన్ని రహస్యంగా ఉంచాలంటే దాన్ని నుంచి కూడా దాచుకోవాలి… అన్న వాక్యంతో ఈ తీర్పు ప్రారంభమవుతుంది. మనం వినేది వాళ్లు వింటారు. మనం చూసేది వాళ్ళు చూస్తారు. మనం చేసేది వారు పసికడతారు అని ఆర్వెల్‍ వెలిబుచ్చిన ఆందోళనలను పిటిషన్‍ దార్లు వ్యక్తం చేశారని జస్టిస్‍ రమణ వెల్లడించారు.

ముగింపు :

ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఇన్ఫర్మేషన్‍ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గ దర్శకాలు, డిజిటల్‍ మీడియా ఎథిక్స్ కోడ్‍) నియమాలు-2021’ సైతం పౌరుల స్వేచ్ఛను హరించేవే, మోడీ సర్కారు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ నిరంకుశ పాలన సాగిస్తున్న వేళ పెగాసస్‍ అక్రమ వాడకంపై సుప్రీం దర్యాప్తు కమిటీని వేయడం ఆహ్వానించదగిన పరిణామం. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతర్జాతీయ వ్యవహారం అయినందున విదేశీ నిపుణుల సహయం తీసుకుంటేనే సమగ్ర దర్యాప్తు సాకారమవుతుంది. రాజ్యాంగం పౌరులకు వ్యక్తిగత గోప్యత, భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించిందని, ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడి ప్రభుత్వం చట్టబద్ధ పాలన చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయంతోనైనా మోడీ సర్కారు తన తీరు మార్చుకోవాలి.

నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక యుగంలో అంతకంతకూ ప్రశ్నార్థకమవుతున్న పౌరుల గోప్యతా హక్కుకు రక్షణగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కాని అందుకు పూర్తి విరుద్ధంగా ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వమే నిఘాను స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశభద్రత, దేశద్రోహం పేరుతో ప్రశ్నించే గొంతులపై అభియోగాలు మోపడం, నిర్బంధాలకు గురిచేయడం ఓ అనవాయితీగా మారింది. అప్రజాస్వామికంగా, స్వార్థ ప్రయోజనాల కోసం పెగాసస్‍ స్పైవేర్‍ ప్రయోగానికి తెరతీసిన మోడీ సర్కారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రత్యక్షంగా ప్రజల హక్కులపై, పరోక్షంగా దేశ ప్రజాస్వామ్యంపై దాడికి పాల్పడుతున్న కేంద్రం సుప్రీంకోర్టు ముందు దోషిగా నిలబడక తప్పదు. పలాయన వాదానికి తెరపడక తప్పదు. ఇప్పటికైనా పెగాసస్‍పై ప్రజలకు సమాధానం చెప్పాలి.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply