పూల రుతువు

రక్తపు మరకలంటిన చెట్ల ఆకుల్ని
కన్నీటితో శుభ్రంగా కడుక్కోవాలి
యుద్ధంతో గాయపడిన నేలను ఓదార్చి
కొత్త విత్తనాలు చల్లుకోవాలి

ఆరిన బూడిద కుప్పల్ని తేటగా ఊడ్చేసి
సరికొత్త కలల కళ్లాపితో ముగ్గులెట్టాలి
శవాలు పొంగిన నదీపాయను‌
చెమటచుక్కలతో శుభ్రపరిచి
తేటనీటి దాహపుచెలిమెగా పునర్నిర్మించుకోవాలి

ఊపిరాడని ఉక్కపోతల్ని
రాలిపోయిన పూల కథల్ని
చెదిరిన ఎన్నో జ్ఙాపకాల్ని
చెంపల మీదినుంచి తుడిచేసుకోవాలి

గడిచిన విషసమయాల్ని
మరపు‌ మలుపుల్లోకి సున్నితంగా నెట్టేసి
కొత్తపూల తోటల్లో రంగుల సీతాకోకల్లా
రెక్క విప్పుకోవాలి

గదుల్లోంచి విడుదలైన మనుషులంతా
రివ్వున ఎగిరే పిట్టల ఆకాశాలై
స్వేచ్ఛా సంతకమొకటి చేసి మురవాలి
మబ్బుల చినుకుపూల వానలోతడిసి
మంచు ముత్యంలా మళ్లీ తేటపడాలి

నిన్నటిదాకా చితికి చివికిన కలలన్నీ
కాలి కూలి బూడిదయిన ఆశలన్నీ
మరణించిన మట్టికే ఎరువుగా మారి
ఒక ఆకుపచ్చని కొత్తప్రపంచం మొలకెత్తాలి

పాతగాయాల‌ జ్ఙాపకాలన్నీ రాలిపోయి
కొత్త ఆశల పూల రుతువొకటి
మళ్లీ‌ మన మధ్యే పురుడు పోసుకోవాలి!

పూర్వపు నల్లగొండ జిల్లా. కవి, కథకుడు, విమర్శకుడు. అధ్యాపకుడు. రచనలు: మా నాయిన (2006), నల్ల చామంతి (2017), వెలుతురు మొలకలు(2019) కవితా సంకలనాలు ప్రచురించారు.

One thought on “పూల రుతువు

Leave a Reply