పిల్లల గురించి మాట్లాడకండి

మైకెల్ రోజెన్
తెలుగు: చైతన్య చెక్కిళ్ల

పిల్లల గురించి మాట్లాడకండి

(ఇజ్రాయిల్ లో ఒక మానవ హక్కుల సంఘం 2014 లో ఇజ్రాయిల్ దాడుల్లో చనిపోయిన గాజా పిల్లల పేర్లను చదువుతూ ఒక రేడీయో అడ్వర్టైజ్మెంట్ ను వేసింది. ఇజ్రాయిల్ ఆ అడ్వర్టైజ్మెంట్ ను నిషేధించింది. గార్డియన్ పత్రికలో ఆ వార్త చదివిన కవి, రచయిత మైకేల్ రోజెన్ ఈ కవితను రాశాడు. లండన్ లో ఒక యూదు కుటుంబలో పుట్టి పెరిగిన ఆయన లండన్ యునివర్సిటీ లో బాలసాహిత్యంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. ఎన్నో పిల్లల పుస్తకాలు రాశాడు.)

https://www.theguardian.com/world/2014/jul/24/israel-bans-radio-advert-listing-names-children-killed-gaza

పిల్లల గురించి మాట్లాడకండి
చనిపోయిన పిల్లల పేర్లు పలకకండి
ప్రపంచానికి చనిపోయిన పిల్లల పేర్లు తెలియడానికి వీల్లేదు
పిల్లల పేర్లను దాచేయాల్సిందే
పిల్లలు అనామకంగా ఉండాల్సిందే
పిల్లలు అనామకంగానే లోకం విడిచి వెళ్లాల్సిందే
ఎవ్వరికీ పిల్లల పేర్లు తెలియడానికి వీల్లేదు
ఎవ్వరూ పిల్లల పేర్లు అనడానికి వీల్లేదు
ఎవ్వరూ పిల్లలకు పేర్లు ఉన్నాయని అనుకోవడానికి కూడా వీల్లేదు
పిల్లల పేర్లు తెలుసుకోవడం ప్రమాదకరమని జనానికి అర్థమై తీరాలి
పిల్లల పేర్లు తెలుసుకోకుండా జనాలను కాపాడి తీరాలి
పిల్లల పేర్లు దావానలంలా వ్యాపించే ప్రమాదం ఉంది
పిల్లల పేర్లు తెలిస్తే ప్రజలు క్షేమంగా ఉండరు
చనిపోయిన పిల్లల పేర్లు పలకకండి
చనిపోయిన పిల్లలను గుర్తు పెట్టుకోకండి
చనిపోయిన పిల్లల గురించి ఆలోచించకండి
“చనిపోయిన పిల్లలు” అని అనకండి!

*

గాజా పిల్లల కోసం కవిత

గాజా పిల్లలారా,
మీరు మృత్యువు ఆకాశం నుండి వస్తుందనీ
ఇళ్ళు మీపై విరుచుకు పడతాయనీ తెలుసుకుంటారు
పొగే మీకు దుప్పటవుతుందనీ
మట్టే మీ పొట్ట నింపుతుందనీ తెలుసుకుంటారు

కార్లు పల్టీలు కొడ్తాయనీ
బట్టలు ఎర్రబారిపోతాయనీ
స్నేహితులు విగ్రహాలయిపోతారనీ
బేకరీవాడు రొట్టెలు అమ్మడనీ తెలుసుకుంటారు.

రాత్రి ఒక మర ఫిరంగి అనీ
బొమ్మలు కాలిపోతాయనీ
ఊపిరి ఆగిపోవచ్చనీ
ఇక మీవంతే కావొచ్చనీ తెలుసుకుంటారు

మీపై మంటలు కురిపిస్తే
సైనికులే కాదు
మీరూ, ఇంకెందరో చనిపోతారని
వాళ్ళు ఊహించలేరని
మీరు తెలుసుకుంటారు

మీకు తెలిసిన మీ నేలపై
పారిపోగల దారి లేదు
వెళ్లిపోగల దిక్కు లేదు
దాక్కోగల తావు లేదు

బతుకంటే చావు కాదనీ
ఆహారమంటే గాలి కాదనీ
ఈ భూమి ఎవరి సొత్తు కాదనీ
బతికే హక్కు మీకువుందనీ మీరు తెలుసుకుంటారు

పుట్టింది హైదరాబాద్. పెరిగింది మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో. వైద్య విద్య కె. ఎం. సీ, వరంగల్. ‘ప్రజాకళ’ (2006-2007), ‘ప్రాణహిత’ (2007-2010) వెబ్ పత్రికల ఎడిటోరియల్ టీం మెంబర్. వృత్తి - వైద్యం. అభిరుచి - సాహిత్యం. ప్రస్తుతం అమెరికాలోని ఇండియనాపోలిస్ లో ఫామిలీ ఫిజీషియన్ గా ప్రాక్టీస్ చేస్తోంది.

One thought on “పిల్లల గురించి మాట్లాడకండి

Leave a Reply