పిడికెడు

నిజంగా నేను కొంచెం అన్నమే వండుకుందామనుకున్నాను, పిడికెడెంత హృదయాన్ని రాజేసుకుని –

***

లాఠీలతో వాళ్ళు, రాజ్యంతో వాళ్ళు, రాముడితో వాళ్ళు. దేవుళ్ళతో వాళ్ళు, దేశంతో వాళ్ళు. కర్కశ దేశభక్తితో వాళ్ళు . గోవులతో వాళ్ళు, గోమాతలతో వాళ్ళు, భారతమాతలతో వాళ్ళు, గుళ్ళతో వాళ్ళు, గోపురాలతో వాళ్ళు, నదీ తీరాల్లో వాళ్ళు –

హృదయం లేని జీవన విధానం వాళ్ళు, నెత్తురంటకుండా చంపడం తెలిసిన జీవన కళ వాళ్ళు. ఇంద్రధనుస్సులు తెలియని ఏకరంగోన్మాదులు వాళ్ళు. నా ఇంట పొయ్యి పక్కన వాళ్లు. నా తిండితో వాళ్ళు, నా దుస్తులతో వాళ్ళు. నా పిడికెడు స్థలంలో వామనుడి పాదాలతో వాళ్ళు –

నన్ను రాస్తూ వాళ్ళు, రాస్తూ, నాకు చరిత్ర లేకుండా చేస్తూ వాళ్ళు, నన్ను నామరూపరేఖలు లేకుండా చేసే ఒక అఖండ జ్యోతితో వాళ్ళు –

రథంతో వాళ్ళు. రథయాత్రలతో వాళ్ళు. కత్తులతో వాళ్ళు, బాణాలతో వాళ్ళు. గుక్కెడు నీళ్ళు అడిగిన గుండెలలోకీ, గర్భాలలోకీ త్రిశూలాలై దిగబడే వాళ్ళు. నెత్తురు పిండాల్ని చీల్చి ‘జై, జై’ అని నినదించే వాళ్ళు. పగలబడి నవ్వే వాళ్ళు. నా తల్లి బట్టలు విప్పి నడి రోడ్డులో ఊరేగించే వాళ్ళు. నా స్త్రీలను మానభంగం చేసే వాళ్ళు. కులం లేదనే వాళ్ళు. దేశాన్ని బిట్లు బిట్లుగా విదేశాలకి అమ్ముకునే వాళ్ళు.

అవును వాళ్ళే. నేలలోంచి సారాన్నీ, నీళ్ళలోంచి తడినీ, ఆకాశంలోంచి నక్షత్రాలనీ, అడవులలోంచి చెట్లనీ, బిడ్డలనీ ధ్వంసం చేసే వాళ్ళు. వాళ్ళే –

సంస్థాగతమైన ద్వేషమై, విద్యలో పాఠ్యంశాల విషమై, రాజ్యమై, మతమై, పిడికెడు అన్నం అందివ్వలేని స్వచ్ఛ భారతమై, రామరాజ్యమై నా లోంచి నన్నూ, నీలోంచీ నిన్నూ, త్రవ్వుకునీ త్రవ్వుకునీ, అమ్ముకునీ, అమ్ముకునీ, సైనికులు చెరచబడ్డ ఒక అమ్మని చేసి వొదిలివేస్తే

***

ఇక్కడ కూలబడి గుప్పెడెంత అన్నమే వండుకుందామని అనుకున్నాను. మరి ఇంత – పిడికెడెంత, హృదయమైనా ఉందా

ఇనుప బూట్లనూ, లాఠీలనూ నియంత్రించే, ఆటల వినోదాల మధ్య తీరిగ్గా ఈ చోద్యం చూసే రాజ్యాధినేతల వద్ద?


బియ్యపు గింజల కథ

ఇదంతా పాతదే.
బియ్యాన్ని నువ్వు గుప్పిళ్ళతో తీసుకుంటున్నప్పుడు
ఒకప్పుడు నువ్వు బియ్యం డబ్బాలో వేసిన వేపాకులు – ఎండిపోయి ఇప్పుడు –
నలిగి చేసే, పిగిలిపోతున్న శబ్ధాలే –

మరి
ఒకతనేమో – బియ్యం ఉండటమే ముఖ్యం అని అంటాడు
మరొకతనేమో – బియ్యాన్ని వెలికి తీసే చేతులే ముఖ్యం అని అంటాడు
ఇంకొకతనేమో – బియ్యాన్ని ఇన్నాళ్ళూ కాపాడిన వేపాకులను చూడమని అంటాడు
చివరతనేమో – బియ్యాన్ని వండే చేతుల గాధ వినమని చెబుతాడు
మొదటతనేమో – ఇంతా చేసి మీరు

బియ్యాన్ని తనలో నింపుకున్న డబ్బాని
మరచిపోయారని గురుతు చేస్తాడు. ఇక
మొదటా చివరా కానీ అతను – అప్పుడు

ధాన్యం వచ్చిన నేల గురించీ పండించిన చేతుల గురించీ చెబితే
ఏడో అతను – ధాన్యాన్నీ, ఆ నేలనూ, పండించిన శరీరాలని
త్రవ్వుకుపోయే రాబందులనీ గుర్తించమని వేడుకుంటాడు –

నీ నోట్లికి వెళ్ళే ప్రతి గింజ పైనా ఒక రక్త లిఖిత చరిత్ర ఉందనీ
ఏదీ శూన్యంలోంచి వచ్చి శూన్యంలోకి పోదనీ చెబుతాడు –
కొంత కార్యాచరణుడివై, ఈ లోకకాలంలో సంచరించాల్సి ఉందనీ
అది నీ ప్రాధమిక కర్తవ్యమనీ చెబుతాడు. అరచేతుల్లో ఒక అద్దం ఉంచుతాడు –

సరే. సరే. సరే. మరేం లేదు.
ఇదంతా పాతదే. ఇదంతా బియ్యపు గింజల కథే
బియ్యాన్ని నువ్వు గుప్పిళ్ళతో తీసుకుంటున్నప్పుడు
బియ్యంతో కలగలసిపోయిన ఎండిన వేపాకులు
నలిగిపోయి చేసే అనాధల ఆక్రందనలే –

అయితే, ఆ శబ్ధాలు మరిప్పుడు
ఎటువైపు నిలబడి ఉన్నాయో
ఏ ఏ కథలని వింటున్నాయో –
నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనే అనుకుంటున్నాను.

స్వస్థలం హైదరాబాద్. క‌వి, అధ్యాప‌కుడు. వివేక వ‌ర్ధిని క‌ళాశాల‌(హైదరాబాద్)లో అసోసియేట్ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. 'కొన్ని సమ‌యాలు', 'ఇత‌ర', 'శ్రీకాంత్  (Selected Poems 2013-18, Vol i ), Saudade (Long Poem) అనే క‌వితా సంపుటాలు వ‌చ్చాయి.

3 thoughts on “పిడికెడు

  1. “సంస్థాగతమైన ద్వేషమై, విద్యలో పాఠ్యంశాల విషమై, రాజ్యమై, మతమై, పిడికెడు అన్నం అందివ్వలేని స్వచ్ఛ భారతమై, రామరాజ్యమై నా లోంచి నన్నూ, నీలోంచీ నిన్నూ, త్రవ్వుకునీ త్రవ్వుకునీ, అమ్ముకునీ, అమ్ముకునీ, సైనికులు చెరచబడ్డ ఒక అమ్మని చేసి వొదిలివేస్తే” …………అయితే, ఆ శబ్ధాలు మరిప్పుడు
    ఎటువైపు నిలబడి ఉన్నాయో
    ఏ ఏ కథలని వింటున్నాయో –
    నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనే అనుకుంటున్నాను”

    బావుంది.

Leave a Reply