పాలు రాట్లే!

“అమ్మా… పాలు రాత్లే”

చెంకన చేరగిలబడి తల్లి పాలు కుడుస్తున్న పసిబిడ్డ మళ్ళీ అన్నమాటే అంది. కాని ఆ తల్లి విని విననట్టే వుంది. బిడ్డాకలి తల్లికి తెలీదా? తెలుసును. కానీ యెలా చెప్పాలో యేమని చెప్పాలో ఆ తల్లికి తెలీలేదు.

అందరు తల్లుల్లాగే ఆ తల్లీ నడుస్తోంది. మెడ నరాలు గుంజేస్తూ నెత్తిన మూట… మంట రేపుతున్న రొమ్ముని చీకుతూ చంటి బిడ్డ… చెయ్యిపట్టి నడుస్తూ వెనక్కి వేళ్ళాడుతున్న చేతి బిడ్డ…

పక్కనే మూటా ముల్లె మోస్తూ బండి యీడుస్తున్న యెద్దులా “పిల్లన్నాకియ్యి” అన్నాడు ఆ పిల్లల తండ్రి.

“అది రొమ్ము తీస్తే యేడుస్తాది…” వుండనీ అన్నట్టుగా చెప్పింది ఆ తల్లి. ఆమెకు మాట రావడం లేదు. గుండెల్లో అలికి వచ్చేస్తోంది. ముందుకు అడుగు వేస్తూ వెనక్కి తలతిప్పి చూసింది.

చేతిపిల్ల చెయ్యి విడిపించుకుంది. తెగిన చెప్పుని చెంకలో పెట్టుకుంది. ఉన్న వొక్క చెప్పులో కాలు పెట్టింది. నడుస్తోంది. కాదు, కాలు యీడుస్తోంది.

“కాలు యెగుడు దిగుడు అవుతాది…” నడక ఆపకుండానే అన్నాడు తండ్రి.

“ఒక్కాలయినా కాలకుంటా వుంటాది, వున్నిలే” అన్నాది తల్లి.

కుంటుతూ నడుస్తున్నట్టు నడుస్తోంది చేతిపిల్ల. కొద్ది దూరం నడిచాక వెనక్కి తిరిగి చూసిన తండ్రి ఆగి, వొంగి పిల్ల కాలికున్న చెప్పు, చెంకలో వున్న చెప్పూ రెండూ తీసి విసిరేశాడు.

ఆ తల్లి చూసింది కాని యేమీ అనలేదు.

నగ్నమైన పాదాలు నడి రోడ్డంట నడుస్తున్నాయి. ఎన్నో లక్షల కోట్ల పాదాలకు మల్లె.

అంతులేని దూరం…

‘యెంతెంత దూరం… కోసెడు కోసెడు దూరం’ అని యే పిల్లలూ యెందుకో పాడుకోవడం లేదు. అంతా మూగవాళ్ళలా పెద్దల వెన్నంటి నడుస్తున్నారు. నడిచి అమ్మనాయిన్ని అందుకోలేక వెంటపడి పరుగులు తీస్తున్నారు. తీయలేక కుంటుతున్నారు.

“అమ్మా… పాలు రాత్లే”

చీకి చీకి దవడలు నొప్పెట్టాయేమో ఆగి తల్లి కళ్ళలోకి చూసింది చెంకబిడ్డ. తల్లి మాత్రం పసిబిడ్డ కళ్ళలోకి చూడలేదు. సముద్రానికి అవతలి అంచును చూస్తున్నట్టే రోడ్డునే చూస్తోంది.

యెండాకాలం… మిట్ట మధ్యాన్నపు యెండ… రోడ్లు రోడ్లు కావవి… పొయ్యి మీద కాలిన పెనాలు… నడుస్తున్న పేనాలు…

“అమ్మా కాలు కాలుతున్నాయే”

పాదం మోపలేక వేస్తున్న అడుగులతో గెంతుతున్నట్టు నడుస్తోంది చేతిపిల్ల.

తల్లి చెవిటిది కాదు. వింది. మూగది కాదు. మాట్లాడలేదు. గుడ్డిది కాదు. చూడ్లేదు. నడుస్తోంది. నడుస్తూనే వుంది. నడిపిస్తూనే వుంది.

నడక… నడక… నడక…

చెమటలు దారలు కడుతున్నాయి. కళ్ళు దారులు వెతుకుతున్నాయి.

పోలీసుల దెబ్బలు తిని పులిసిన వొళ్ళు… వొలిసిన చర్మం… దేన్నీ ఖాతరు చెయ్యడం లేదు…

లాఠీచార్జీలోనే చెప్పులు తెగిపోయాయి.

అయినా ముందుకే… మును ముందుకే…

“అమ్మా… పాలు రాత్లే”

చెంకపిల్ల పట్టు వీడ్డం లేదు. ఎండిన గొంతు. పిడచ కట్టిన నాలుక. ఆగని దుఃఖం. కక్కక ముందే తల్లి మనసు కానుకుంది.

“అల్లా బిడ్జీ సూడు… సూడుమీ” తల్లి బిడ్డని చంక మార్చుకుంది. తలతిప్పి చూసింది. నిండు చూలాలూ నడుస్తోంది. అంతే, తను లేని సత్తువ తెచ్చుకుంది.

“అమ్మా కాలుకి తెల్లగ బుడగలే”

చేతిపిల్ల తల్లి చేతిని వదిలి రోడ్డు మీద కూర్చుండిపోయింది. దాని కాళ్ళకు కాలిన బొబ్బలు. కంట్లో నీళ్ళు. చితికి చిట్లిన కాలి బొబ్బల్లోనూ నీళ్ళు.

తల్లి తల్లడిల్లి ఆగిపోయింది. నెత్తిమీది మూటను దించలేకపోయినా చెంకలోని పిల్లని దిగవన దించింది. అంతే పిల్ల కయ్ మని యేడ్చింది. ఏడ్చీ యేడ్చీ కంకటిల్లిపోయింది. గుక్కపట్టింది. కాలిన తార్రోడ్డు పాదాల్ని మాడ్చినట్టే వుంది. అంతే పిల్లని గబుక్కున యెత్తుకుంది. తల్లి గుండెకు హత్తుకుంది. కందిన పాదాల్ని ముద్దుపెట్టుకుంది. రొమ్ముని నోటికి అందించింది. చెల్లిని చూసి తన బాధని మరిచిపోయింది చేతిపిల్ల. ఆనక, యెగాదిగా చూసి అప్పుడు పాదాలు నేలమీద నిలపలేక కాళ్ళను చూసుకుంది. ‘ఉఫ్… వుఫ్’ అని వూదుకుంది. నెత్తిమీద గుడ్డను సర్రున చింపి పిల్ల కాళ్ళకు చుట్లు చుట్టి కట్లు కట్టింది తల్లి. కడుతూ చూసింది. తమని చూడకుండా దూరంగా వెళ్ళిపోతున్న పెనిమిటి.

“ఏమయ్యోయ్…” పిలిచింది. పలకలే. నడకే లోకంగా వున్నాడు.

చెంకన బిడ్డనెత్తుకొని మరోచేత్తో చేతిపిల్లని పట్టుకొని తలమీద బరువుతో తల్లి పరుగులు తీసింది. కనపడని తండ్రిని వెతుకుతూ ఆందోళనగా తన అవస్థ మర్చిపోయి తల్లితో కూడి చేతిపిల్ల పరుగులు తీసింది.

తండ్రి ఆగాడు. బెంగగా పెళ్ళాం బిడ్డలకోసం కళ్ళతో దేవులాడాడు.

ఊపిరి పీల్చుకున్నారు.

మొగుణ్ణి తిట్టేదే, కాని యింతలో అగ్గి పుట్టింది. గగ్గోలయింది. అందరూ అటుకేసి పరుగులెడుతున్నారు.

చెంకబిడ్డా చేతిబిడ్డతో భయం భయంగా బితుకు బితుకుగా చూస్తూ పెనిమిటి వెంట నడుస్తూ గుమిగూడిన వాళ్ళకేసి చూసింది. ఎవరో వయసు మళ్ళిన బక్కపలచటి మనిషి వూరు చేరకుండానే దారిలో ప్రాణాలు వదిలేశాడు. శవం మీద పడి అయినవాళ్ళు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు.

ఆ తండ్రి “రాయండి రాయండి” అని తొందరపెట్టి అక్కడినుండి పెళ్ళాం బిడ్డల్ని తీసుకు వెళ్ళాడు.

చేతిపిల్ల చెయ్యి విడిపించుకుంటూ “అమ్మా… యెందుకు చచ్చిపోయాడు?” అని అడిగింది. చేతిని వదలకుండా “బగమంతుడు పిలిసినాడు, సరి సెలవయిపోయింది” అంది తల్లి. “అపద్దం… నడవలేక సచ్చిపోనాడు కదా?” అంది పిల్ల. తల్లి మాట్లాడలేదు. “మనం కూడా మద్దిలోనే సచ్చిపోతామా?” పిల్ల అడక్కుండా వుండలేదు.

“నోర్మూసుకొని నడు” తల్లి వొక్క కసురు కసిరింది.

అంతే, యిటు చెంకలో బిడ్డ యేడుపు అందుకోవడంతో “అల్లటు సూడు… వోలమ్మ వోలమ్మ యెంత పెద్ద బిడ్జో… అద్గదిగో సూడు సూడు…” చూపించింది తల్లి.

మూగగా చూసింది చెంకపిల్ల.

“ఇందర దనుసులాగున్నాదమ్మా ప్లయ్యోవరు” నొప్పీ కసురూ మరిచిపోయి మురిసిపోయి చూస్తోంది చేతిపిల్ల.

“ఇనగయితే మనం కాదు, మన పిల్లలు ముసిలయిపోతోటికి వూరు సేరిపోతాం… పదపద…” అనేసి మళ్ళీ నడక మొదలుపెట్టాడు పిల్లల తండ్రి.

పదులు కాదు వందల వేల మైళ్ళ తోవ… అడుగులతో కొలుస్తూ…

నడక… నడక… నడక…

చెంకన బిడ్డ ఆ యెండకు చూడలేక తల్లి గుండెల్లో బుర్రపెట్టి దూరిపోతోంది. దాని ముఖానికి తల్లి రొమ్ము దొరికింది. మళ్ళీ చప్పరించడం మొదలు పెట్టింది.

చేతిపిల్ల తల్లి చెయ్యి పట్టుకు లాగింది, తండ్రి వెళ్ళిపోవడం చూసి. క్షణాల్లో తల్లీ బిడ్డలు పరుగులాంటి నడక అందుకున్నారు.

“అమ్మా అమ్మా యీ బిడ్జీ… ప్లయ్యోవరు వోలు కట్టినారు…” అడిగింది చేతిపిల్ల.

“మీ నాయనాలే”

తల్లి మాటకు ఆ పిల్ల ముఖంలో తేటొచ్చింది. నవ్వుతూ తండ్రివంక గొప్పగా చూసింది. తండ్రి కూడా నవ్వుతూ చూశాడు.

“అమ్మా… పాలు రాత్లే”

చెంకపిల్ల మళ్ళీ పాటందుకుంది.

ఆ పసి దానికి వొక ముద్దు పెట్టి తలడ్డంగా వూపింది తల్లి. కంట్లో నీళ్ళు తిరగకముందే మండతో తుడిచేసి ముక్కు యెగబీల్చేసింది.

“అమ్మా ఆ పెద్ద పెద్ద బిల్దింగులు బంగలాలు యిల్లులూ… వోలు కట్టినారు?”

చేతిపిల్ల కాలి మడమలు మంట పెడుతుంటే ముందరి వేళ్ళతో సేరు సితకల్లేకుండా పిచ్చికలా నడుస్తోంది.

“అవీ మీ నాయనాలే”

తల్లి మాటలు నమ్మలేనట్టు కళ్ళు పెద్దవి చేసి చూసింది చేతిపిల్ల. మళ్ళోసారి తండ్రిని గర్వంగా చూసింది. కారుతున్న చెమటలు భుజమ్మీది తువ్వాలుతో వొత్తుకుంటూ ఆ తండ్రి కూతురి ప్రశంసని అందుకోలేకపోయాడు.

“మరి… మరి… ఆ యిళ్ళకి రంగులు వోలేసినారు?”

అడిగినన్నిటికి చెపుతుంటే అవస్థ మరిచిపోతాదని ఆ తల్లి ఆలోచనలాగుంది. అందుకే అంత అలికిలోనూ వోపికగా చెప్తోంది.

“మీ మామయ్యాలే”

చేతిపిల్లకి కాలివేళ్ళు నొప్పెట్టి మళ్ళీ మడమలు నేలకు ఆనించక తప్పలేదు. భగ్గుమన్న కాళ్ళకు పన్నీరు పోసినట్టయింది తల్లిమాట.

పేద్ద గాడ్పులాగ ఝామని శబ్దం అవుతుంటే తలపైకెత్తి వెళ్తున్న విమానాన్ని చూసింది చేతిపిల్ల.

“మరి గాలోడలు దిగిన కాడ పేద్ద టేసను వుంతాదట కదా?, అది చిన్నాయనాలు కట్టినారని అన్నారు”

లేత పాదాలు రక్తం చిమ్ముతూ సుర్రు మంటున్నాయి.

“ఒకటేటి? గాలోడ టేసన్లు… రైల్వేరు టేసన్లు… బస్సు టేసన్లు… అన్నిటికీ తట్టా మట్టీ యెత్తినాం… యేల?, నోట్ల మట్టిపడిపోయింది గదా?”

ఆ మట్టి కింద వూపిరి సలపనట్టు వుందా తల్లి మాట. అంత గొప్ప మాటని అంత నీరసంగా యెందుకు పలుకుతోందో తిట్టుకుంటుందో ఆ చేతిపిల్లకి అస్సలు అర్థం కాలేదు.  

“అమ్మా… పాలు రాత్లే”

చెంకపిల్ల పట్టుదలగా రొమ్ముని చీకుతోంది. దవడలు నొప్పయినా ఆకలి వల్ల ఆగడం లేదు సరికదా లేని సత్తువ తెచ్చుకుంటోంది. అదే పనిగా పీల్చుతోంది. రొమ్ము మొనల్లో సూదులు పొడుస్తున్న నొప్పిని పంటి బిగువన పట్టీ పట్టలేక పసిదాని నోరుని తన చేత్తో తనే పక్కకు లాగేసింది తల్లి. అంతే ఆ పసిది యేడుపు అందుకుంది.

ఎరుకయినట్టు ఆ పిల్ల తండ్రి ‘యెక్కడ వొక కాపీ వొటలున్నా బాగుణ్ను’ అనుకున్నాడు. “పిల్లన్నాకియ్యి” అన్నాడు. నెత్తిమీది బరువుని తూగకుండా చూసుకుంటూ చెంకబిడ్డని చేతుల్లోకి తీసుకున్నాడు. భుజమ్మీద వేసి జోకొట్టాలని అనుకున్నాడు. భుజానికి వున్న బేగు ఆ అవకాశాన్ని యివ్వలేదు.

చెంకపిల్ల కూడా యేడుపు ఆపలేదు. కచ్చాకి యెత్తుకున్నట్టే వుంది. ఈండ్రబడిపోతోంది. జింకినీలా సాగుతోంది. నెత్తిమీద మూటలు నేలమీద పడ్డాయి.

చెంకలోని బిడ్డని అందుకొని ఆ తల్లి బిడ్డ వీపుమీద వొక్కదెబ్బ వేసింది. తోసేసింది. ఆ పసిది కాలుతున్న రోడ్డుకి గోలపెట్టి యేడుస్తూ తల్లిదగ్గరకే వురికొచ్చింది. తల్లి ముందు తియ్యలేదు. ఆ గుడ్డు కనుగుడ్లు చూసిన తల్లి కరిగి నీరయిపోయింది. ఏరయిపోయింది. శోకమయిపోయింది. సంద్రమయిపోయింది. వలవలా యేడుస్తూ బిడ్డని యెత్తుకుంది. మళ్ళీ గుండెకు హత్తుకుంది. “నాయమ్మే నాతల్లే నా ముద్దులమూటే నా బంగారమ్మూటే నా కన్నలకొండే నా కర్జూరపు మూటే…” యెత్తొక ముత్తెంగా ముద్దులాడింది. “నీ పాపిస్టి తల్లికి నీ ఆకలి తెలీలేదమ్మా” అని యేడ్చింది. ఎదపోసింది. రొమ్ము అందించింది. పిల్ల పల్లకుంది. ఏడుపు కళ్ళతో తల్లి కళ్ళలోకి నవ్వుతూ చూసింది బిడ్డ.

పెద్ద గాలోన వొచ్చి వెలిసినట్టుగయింది.

“నాయనా గొంతెండిపోతంది” అంది చేతిపిల్ల.

బేగులోని సగం ఖాళీ చేసిన నీళ్ళ బాటిల్ తీసి యిచ్చాడు. ఆ పిల్లకి రొండు నీళ్ళు గొంతులో పడేసరికి అమృతం తాగినట్టు ఆవుసు లేచొచ్చింది. ఆగి మళ్ళీ తాగుతోంది. “సేన” అంది తల్లి. టక్కున ఆపేసింది పిల్ల. మళ్ళేమనుకుందో “తాగు… తాగులే” అంది తల్లి. పిల్లకూడా తాగాలని వున్నా నిబాయించుకొని “సేన” అన్నాది. “పరవాలేదు, తాగమ్మా” అన్నాడు తండ్రి. తలడ్డంగా వూపింది పిల్ల. ఆ సమయంలో ఆపిల్ల పిల్ల కాదు, తల్లి.

చెంకలోని పిల్ల వీపు తడిమితే వెన్నుమీద యెత్తుగా తగలింది తల్లి చేతికి. వెంటనే గౌను యెత్తి చూసింది. వెన్నుమీద అరచేతి అచ్చు పచ్చగా అలా దిగిపోయింది.

“నా చేతులిరిగిపోను… నాకొక పెద్దరోగం కూడ…” అని తనని తనే తిట్టుకుంది తల్లి. పసిపిల్ల నోటికి నీళ్ళు అందించింది. రెండు బుక్కళ్ళు తాగి పొలమారింది. “అమ్మమ్మాలు నాయినమ్మాలు సెల్లిని తలస్తన్నారు… కదమ్మా?” అడిగింది చేతిపిల్ల.

ఆ తల్లి జవాబివ్వక ముందే నడుస్తున్న మందిలో అలికిడి అవడం తల్లి పసిగట్టింది. చూపు అన్ని దిక్కులకి తిప్పింది. ఆపదేమో అని శంకించింది. కాదు, నిండు నెలలతో నడుస్తున్న మనిషికి నొప్పులు వచ్చినాయి, రోడ్డువార నలుగురు ఆడవాళ్ళు నాలుగు దిక్కులై చీరపట్టుకొని నిలబడ్డారు. గాలి బిగబట్టింది. ఎక్కడివాళ్ళు అక్కడ నిలబడిపోయినారు.

అప్పుడు “యింగే… యింగే” అని అప్పుడే పుట్టిన బిడ్డ గొంతు వినిపించింది.

గాలి ఆడింది. అందరి ముఖాల్లో నవ్వులు పూసాయి. ఎక్కడికక్కడ నిలబడిపోయినవాళ్ళు మళ్ళీ చీమల్లా కదిలారు.

“ఆ పుట్టిన పిల్ల కూడా నడవాలా?” ఆలోచిస్తున్నట్టు పరాకుగా అన్నాది చేతిపిల్ల.

నడక… నడక… నడక…

“అమ్మా… పాలు రాత్లే”

చెంకపిల్లది మళ్ళీ మళ్ళీ అదేమాట.

“అల్లా పొగ చూడమ్మా అదేటి కాలిపోతంది” దృష్టి మరల్చడానికి అంది తల్లి. ఆ పసిపిల్ల చూడబోయిందే గాని కొడుతున్న యెండకు చూడలేక మళ్ళీ తల్లి గుండెల్లో దూరిపోయింది. తగిలిన రొమ్మును నోట్లోకి లాక్కుంది. చప్పరిస్తోంది.

“అమ్మా… ఆ మందుల ప్యాక్టరీలల్లే కదా పిన్నమ్మాలు పని సేసీవోలు?” మర్చిపోలేని ఫార్మా కంపెనీలు వదిలిన కంపు యిప్పుడెందుకో యాదికొచ్చింది.

రొమ్ము సిరాలు సుల్ సుల్ పొడుస్తుంటే ఆ తల్లి యే సమాధానమూ చెప్పలేదు. అలాగని చేతిపిల్ల కుంటుతూ అడగడం మానలేదు.

కాలువ వంతెన మీద నడుస్తుంటే చూసి “అమ్మా… దొడ్డా పెదనాయినాలు గూడా అప్పుడు కాలువాలు తవ్వినామన్నారు, యిదేనా?” అడిగింది.

“ఇప్పుడంతే కాలవలల్ల నీలు పారతన్నాయి గాని అంతకు మునుపే మన సెవట పారింది. నెత్తురు పారింది. అసలు మన సెవటతో తడవని సేనుందా? మన నెత్తుటితో తడవని సెంటు బూముందా? మన సత్తువ లేకండా యీ బూమండలముందా? బూసెక్రం తిరగాతందా? లేదు. ఉండదు. ఒక్కరోజు లేకపోతే బూమి తిరగదు” కూతురు అడిగిందని కాక అర్థమవుతుందని కాక గుండెలో గొలపొడుస్తున్నదేదో మాట్లాడుతోందా తల్లి.

“మరి మనమెందుకు యిలాగ రోడ్లంట తిరగతన్నామో?” గొణుగుతున్నట్టుగా అంది చేతిపిల్ల.

“స్… స్సోస్…” అని కళ్ళు మూసి తెరిచింది తల్లి. పెద్దగా నోటంట వూపిరి వదులుతూ గుండెల వంక చూసుకుంది. పల్చగా రక్తం… రొమ్ము మొనల మీదే కాదు, ఆ పాల నోటిలోనూ!

పెనిమిటి చూసి గక్కురుమన్నాడు.

చేతిపిల్ల చేవజచ్చిపోయి చూసింది.

“ఉన్నీలే… వున్ని… యింతకాలం యీ నగరాలకి సెవటిచ్చాము. నెత్తురిచ్చాము. అలాటిది నా బిడ్డకు నా వొంట్లోది- అది కూడా ఆకలికి గుక్కెడు యిస్తే వుపద్దరం యేమీ లేదులే, యేమీ కాదులే…” అని గుండెలనిండా గాలి పీల్చుకొని అడుగు ముందుకు వేసింది తల్లి.

అడుగులు పడుతూనే వున్నాయి…

పాదాలు పాళీలు చేసి రాయని చరిత్ర రాస్తున్నట్టు ముద్రలు. రక్తపు ముద్రలు. రోడ్డు పొడవునా…!

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. నాలుగు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. అల్లిబిల్లి కథలు పిల్లల కథా సంపుటం. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- ఇంకా జాతీయాల మీద వచ్చిన పురాణ పద బంధాలు, పిల్లల సమస్యల మీద వచ్చిన ఈ పెద్దాళ్ళున్నారే వంటి పుస్తకంతో ఇరవైయ్యేడు వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’ కాలమ్స్ కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

4 thoughts on “పాలు రాట్లే!

 1. సూపర్ బమ్మిడి
  చాలా బాగుంది

 2. ఏడిపోంచేసారు. ఆ రోడ్డు మీద నేనూ నడుస్తున్నట్టుంది.

  1. ఆ సమయంలో ఆ పిల్ల పిల్ల కాదు.. తల్లి..
   చాలా ఉదాత్తంగా ఉంది.. కథ చాలా బాగుంది..
   ఈ మధ్య ఇలాంటి మనసుని కదిలించే కథను చదివి చాలా రోజులే అయింది. హ్యాట్సాప్ తో బమ్మిడి గారు…

 3. Excellent presentation. Kudos to the writer. Reappeared the very recent history we all witnessed. Your pen is a brush. Words are colours. It’s master piece of painting.

Leave a Reply