పాలస్తీనా ప్రతిఘటన కవిత్వం

పాలస్తీనా మహాకవి దర్వీష్ కవితలు రెండు

నేనక్కడి నుండి వచ్చాను

నేనక్కడి నుండి వచ్చాను
నాక్కొన్ని జ్ఞాపకాలున్నాయి

అందరి మనుషుల్లాగే పుట్టిన నాకు
ఒక అమ్మ ఉంది

చాలా కిటికీలున్న ఒక ఇల్లూ ఉంది
తమ్ముళ్ళున్నారు స్నేహితులున్నారు
చల్లని రాతి కిటికీ తో జైలు గది ఉంది.

సముద్రపు పక్షులు లాక్కెళ్ళిన అల నాది

నాకంటూ ఓ దృశ్యముంది
అందులో అదనంగా ఒక గడ్డిపరక ఉంది.

ఎక్కడో పదాల సుదూరపు అంచుల్లో చంద్రుడూ
అనేకానేక పక్షుల సమూహాలూ
అజరామరమైన ఆలివ్ చెట్టూ
నావే.

కత్తులెన్నో దాని సజీవ దేహాన్నొక వధ్యశిలగా మార్చక ముందే
నడిచాన్నేనీ నేలపై

నేనక్కడినుండే వచ్చాను

ఆమె తల్లికి ఆకాశాన్నిచ్చాను
ఆకాశం ఆమె తల్లికోసం రోదించినప్పుడు
తిరిగి వస్తున్న మేఘానికి తెలపడానికి
నేనూ దుఃఖించాను

అన్యాయపు పాలనను నడ్డి విరగ్గొట్టేందుకు
రక్తసిక్తమైన న్యాయస్థానాల భాషనంతా నేర్చుకున్నాన్నేను

భాషలోని పదాలన్నీ నేర్చుకున్నా
వాటినన్నింటినీ విరిచేసి ఒకే పదం చెయ్యడానికి:
మాతృభూమి.

స్తోత్రము మూడు

నా పదాలు భూమి ఐన రోజు
నేను గోధుమ నార్లకు
నేస్తాన్ని

నా పదాలు ఆగ్రహమైన రోజు
నేను సంకెళ్ళకు
నేస్తాన్ని

నా పదాలు బండరాళ్ళైన రోజు
నేను నదీప్రవాహాలకు
నేస్తాన్ని

నా పదాలు తిరుగుబాట్లైన రోజు
నేను భూకంపాలకు
నేస్తాన్ని

నా పదాలు చేదైన ఆపిల్ పండ్లైన రోజు
నేను ఆశావాదికి
నేస్తాన్ని

కానీ
నా పదాలు తేనె ఐన రోజు
ఈగలు నా పెదవుల చుట్టూ
ఝుమ్మన్నాయి

(అనువాదం: నారాయణస్వామి వెంకటయోగి)

పుట్టింది సిద్ధిపేట‌, చదివింది జిల్లా ప‌రిష‌త్‌ హై స్కూల్ లచ్చపేట, స‌ర్వేల్‌, హైద‌రాబాద్‌ పబ్లిక్ స్కూల్, జేఎన్‌టీయూ, ఓ యూ. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా, అమెరికాలో గత 20 ఏండ్లుగా ఐటీలో, 14 ఏండ్లు విరసం సభ్యుడు. మూడు కవితా సంకలనాలు 'కల్లోల కలల మేఘం', 'సందుక', 'వానొస్తదా'?,  ఒక కవితా ప్రయాణ జ్ఞాపకాలు 'నడిసొచ్చిన తొవ్వ' – ఇప్పటిదాకా ప్రచురణలు. 'ప్రజాకళ', 'ప్రాణహిత'లతో సన్నిహిత సంబంధం.

Leave a Reply