పాము నిచ్చెనలాట

మెట్టు మెట్లు నిచ్చెనలెక్కీ ఎక్కీ
మీదికి చేరుకునే యాల్ల‌కు
పాములు అమాంతం పైకి సాగి
గుహలా నోరు తెరిచి మింగేస్తయి
కూడదీసుకున్న ఊపిరంత తుస్సయిపోతది…

పుట్టుకతోని పైన కూర్చున్నోల్లు
సుఖాసనాల సుఖాన్న‌నుభవిస్తాంటే
ఎగపోసుకుంట మీదికెక్కినోల్లు
కిందికి శవాల్లా జారిపోతుంటరు
పాము పడగ నీడపట్టే ప్రాప్తముండొద్దూ…

అందలమెక్కిన అధికారం
ఆధిపత్య కవచం తొడుక్కున్న
తొండి భారతాన కులవర్ణ కుట్రలు
కట్టుకున్న కరుడుగట్టినతనం
వర్గాల మెట్లు గీసిన వ్యత్యాసాలు…

ఈడ దళితం బహుజనం బలహీనం
అగ్రం ద్విజులిచ్చిన ఆశీర్వాదం
చరిత్ర రాసుకున్నోల్లే విజేతలు !
చరిత్ర అంచులకు ఉరిబడ్డ బలిపశువులు !
ఓఓ.. త్యాగాలు చెయ్యాలె బిడ్డా త్యాగాలు!

బతుకుల్ని బలిదానాల బలిపీఠాలెక్కించాలె
జీవితాల్ని విధ్వంసాల పాలుచేయాలే
గొప్పోళ్ల గోత్రాలు నిలబెట్టాలె
బడా బాబుల గోడవున్లు నింపాలె
స‌ర్వ‌స్వం ధార‌బోసి
స్వ‌చ్ఛందంగ సాగిల‌బ‌డాలె

పోగొట్టుకున్నయన్ని పోయినట్టేగని
శవాల చుట్టూ మూగిన శవాలు
ఎప్పుడు లేస్తయాని.. చిల్లర పైసలకు
సచ్చినోల్లు పడిగాపులు బడ్డట్లు
సావుమర్న‌మే గతాయే మనకు..

మా బావులన్ని చీర్క‌పోతే
సీతమ్మతల్లోలె మట్టిలనన్న కలుద్దుం
చేన్లు చెల్కలు శపిస్తె
కరువులబడన్న సద్దుము
గింతన్యాలమాంటే మా నోట్లే ఇసమా…?

బరిబాతల బజార్నపడ్డం
నాయెం కావాల్న‌ని నెత్తికొట్టుకుంటున్నం
రోట్లె తలలుబెట్టి రోకటిపోటు
పడద్దని వేడుకుంటున్నం
అయ్యో దేవుడాన్నా దిక్కులేనితనం…

దేవుని గుళ్లె మ‌న్న బోద్ద‌మంటె
గుళ్లన్నీ గుటకలేస్తున్నయాయె
ముంచుతరా ముంచుండ్రి
మనిషి మున్కలేస్తే దశావతారాలెత్తేది.
గుడినీ బడినీ ముంచితే
నేలమ్మే చీత్కారం చేస్తదంట…

పుట్టింది వ‌రంగ‌ల్ జిల్లా హ‌న్మ‌కొండ‌. క‌వి, ర‌చ‌యిత‌. విద్యాభ్యాసం వ‌రంగ‌ల్‌లో. బాల్యం నుంచే సాహిత్య‌- ఉద్య‌మాల ఆస‌క్తితో నాటి 'జై తెలంగాణ' ఉద్య‌మం మొద‌లు, మొన్న‌టి ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం వ‌ర‌కు వివిధ సాహిత్య, ప్ర‌జా సంఘాలు, ప్ర‌జాస్వామిక‌ ఉద్య‌మాల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. 12 స్వీయ ర‌చ‌న‌ల గ్రంథాలు, 18 కు పైగా వివిధ సంక‌ల‌నాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు. 'రుద్రమ ప్రచురణలు' 2012 నుండి నిర్వహిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా 'ప్ర‌జాస్వామిక ర‌చ‌యిత్రుల వేదిక' లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply