పాపం పుణ్యం ప్రపంచమార్గం

సమాజానికి సంబంధించిన ఏ వివాదమూ వ్యక్తిగతం కాదు. చివరికి ఆధ్యాత్మికాంశాలు కూడా! విశ్వాసం వ్యక్తిగత పరిధిని దాటి వీధుల్లోకి వచ్చినప్పుడు అది సామాజికమే అవుతుంది. ప్రశ్నించబడుతుంది. పరీక్షలకి నిలవమని సవాల్ విసరబడుతుంది. శివుడిని నమ్మనివాళ్లని “గాడ్ది కొడుకులు” అని మొన్నామధ్య తనికెళ్ల భరణి నోటి తీట తీర్చుకొని ఆనక క్షమాపణ చెప్పినప్పటికీ అది ఆయన వ్యక్తిగతమూ కాదు లేదా అది ఆరంభమో అంతమో కాదు. ఆయన “గాడ్ది కొడుకులు” అన్నందుకు “పోరా కుక్కల కొడకా” అని తిరిగి తిట్టడం పరిష్కారమూ కాదు. అయినా నేనిప్పుడు ప్రధానంగా చెప్పాలనుకుంటున్న విషయం వేరు. అదేమిటంటే దైవ విశ్వాసం అనేది నిజంగానే అసలు ఒక సామాజిక విలువా అని ప్రశ్నించటమే నేను చేయాలనుకుంటున్నది. దైవ విశ్వాసం లేనందుకు, చచ్చాక నరకానికి వెళతామేమో అన్న పాపభీతి లేనందుకు అలాంటి విస్వాసాలు లేనివారు వున్నవారి ముందు తలొంచుకు నిలబడాలా? లేదా దైవ విశ్వాసం, పాపభీతి వుంటే ఈ సమాజానికేమైనా మంచి జరుగుతుందా? దైవభక్తి పాపభీతి మనిషిని వాస్తవికంగా పునీతం చేయగలదా? నేరాలు, ఘోరాలు చేసేవారందరూ, అవినీతిపరులు, సామూహిక హత్యాకాండకి పాల్పడేవారూ… నాస్తికులు కారే మరి? పైగా దైవం కోసమే హత్యలు చేస్తామనే వారున్నారే! అందుకే నేను ప్రశ్నిస్తున్నాను. దైవ విశ్వాసం పౌరుల్లో సమాజం పట్ల బాధ్యతని, నిబద్ధతని పెంచుతుందా? వారిని అవినీతి దారుల వెంట పోకుండా నిలువరిస్తుందా? సాటి మనుషుల పట్ల కరుణని, దయని కలగచస్తుందా? సమాజాన్ని ఉన్నతీకరించగలదా? ఆ గ్యారెంటీ ఏదీ లేదనే నా అభిప్రాయం.

నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. పేదల పట్ల, అన్నార్తుల పట్ల కఠోరంగా వ్యవహరించే భక్తుల్ని చూసాను. కుటుంబ సభ్యుల పట్ల నిర్దయగా వ్యవహరించి, హింసాత్మకంగా ప్రవర్తించే విశ్వాసుల్ని చూసాను. అవినీతిపరులైన బాబాల భక్తుల్ని, వడ్డీల రూపంలో రక్తాన్ని పీల్చే తిరుపతి వెంకన్న, షిర్దీ సాయి భక్తులైన వడ్డీ వ్యాపారుల్ని…చాలామందిని చూసాను. ఎప్పుడూ ఆశ్చర్యమేసేది అదేంటి వారి విశ్వాసాలు వారిని మంచి మానవులుగా చేయనప్పుడు ఇంకా ఆ విశ్వాసాలు దేనికి బొంద పెట్టడానిక్కాకపోతే అనుకునే వాడిని. అసలు మనిషి స్వార్ధం నుండే దైవం పుట్టాడని, దురాశ, ప్రాణభీతి, పాపభీతితో మాత్రమే పూజలు చేస్తారని అర్ధమయ్యాక భక్తి విశ్వాసాలతో పులకరించే ప్రతి ఒక్కరూ పూజ, భక్తి ప్రదర్శన సమయంలోని వారి ముఖ కవళికలు, భంగిమలు నవ్వు తెప్పించేవి. ఇప్పటికీ ఏ కోగంటి చాటేశ్వర్రావు ప్రవచనమో లేదా ఓ పిచ్చి కుమార్ నిర్వహించే స్వస్థత కూటముల్లో ఊగిపోవటాలు చూసినా పడీ పడీ నవ్వొస్తుంది. కానీ వారిని వినే వారిని చూసి బాధేస్తుంది. దైవ విశ్వాసం, మతం వ్యక్తిగతమైనంత వరకు నేనూ ఆ హక్కుని గౌరవిస్తాను. సమాజం యొక్క మంచి చెడుల్ని మిడిమిడి జ్ఞానంతో, అశాస్త్రీయ దృక్పథంతో భక్తితో ముడిపెట్టి మాట్లాడుతుంటే ప్రవచనాలు చెబుతుంటే “ఆపరా బాబూ నీ అజ్ఞానం. ఇంక మర్నూస్కో” అనాలి అనిపిస్తుంది. అసలలా విశ్వాసాల్ని, భక్తినీ చరిత్రతో, తెలిసీ తెలియని సైన్స్ తో ముడిపెట్టి మాట్లాడే వాళ్లు సమాజానికి హానికారులుగా కనిపిస్తారు. మీకు వెంటనే, గుర్తొచ్చే ఉదాహరణ చెప్పాలా? క్రితం సంవత్సరం “గో కరోనా గో” అంటూ కేకలేస్తూ, పళ్లేలు పగలగొడుతూ ఏదేదో స్పేస్ అంటూ, కాస్మిక్ ఎనర్జీ అంటూ ఊగిపోయిన సందర్భం గుర్తుందా? (కరోనా అంతర్జతీయ వ్యాధి కదా! అందుకే గో అంటూ ఇంగ్లీషులో అరిచారన్న మాట.)వీళ్లే హిమాలయాల్లో యతి జాడల్ని, రాముడు, సీత గురించి నాసా వంటి సంస్థల పేరుతో అధ్యయనాలని నాన్సెస్ ప్రచారంలో పెట్టేది. అవగాహన పెంచాల్సిన చోట పిచ్చ పద్ధతులు ఫాలో కమ్మని ప్రోత్సహిస్తే ఇలాంటివాళ్లే కరోనా విలయతాండవం చేస్తుండగా కుంభమేళాల్లో లక్ష్యల సంఖ్యలో పాల్గొంటారు. సమాజానికి ప్రమాదకరంగా పరిణమిస్తారు.

దైవ విశ్వాసాలున్నాయని చెప్పేవారిలో, దేవుడిని నమ్ముకొని బతుకుతెరువు సంపాదించుకునే వారిలో, ఏదో ఒక దేవుడిని నెత్తిన పెట్టుకొని మతాన్ని ఆధారం చేసుకొని సమాజం మీద ఏదో మేరకు పెత్తనం చేయాలని చూసేవారిలోనే నిజమైన అవిశ్వాసులు కనబడతారనిపిస్తుంది. అయితే వీరు అతీతశక్తి ఉనికిని ప్రశ్నించే నాస్తికులు కారు. వీరిలో ప్రశ్నలుండవు. నాస్తికత్వంలో శాస్త్రీయ జ్ఞాన జిజ్ఞాస వుంటుంది. హేతుబద్ధమైన ఆలోచనా విధానముంటుంది. మానవీయ ఆలోచనలు వుంటాయి. సమాజం పట్ల నిబద్ధత వుంటుంది. అది వీరిలో వుండదు. కేవలం ఏవో పద్ధతులు, ప్రచారం యావ మాత్రమే వుంటుంది. ఉదాహరణకు దేవుడి బొక్కసాలకు కన్నం పెట్టే పూజారులు లేదా ఉద్యోగులు, విదేశీ నిధులతో జల్సాలు చేసే సంస్థాధిపతులు, తప్పుడు లెక్కలు చూపించే ధర్మకర్తలు వగైరా! జీతాల్లేక కేవలం ప్లేట్ కలెక్షన్ మీద మాత్రమే భుక్తికి ఆధారపడే పేద పూజారుల్ని తప్పు పట్టలేను. ఎందుకంటే వారలానే బతకాలని అందరూ ఆశిస్తారు. కానీ అయ్యవారి బంగారం డాలర్లో లేదా అమ్మవారి ముక్కెరలో కాజేసే వారిని మించిన అవిశ్వాసులు మరెవ్వరూ కనబడరు. వీరు మాత్రమే కాక ఇలా దేవుడు, మతం, ప్రజల నమ్మకాలు…ఇవన్నీ ఒక కెరీర్ లేదా బతుకుతెరువుగా చేసుకొనే వర్గం మరోటి వుంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆశ్రమాలు, బాబాలు, గురువులు, సీఎం, పీఎం వంటి పదవుల్లో వున్నవారికి స్పిరిచువల్ మెంటార్ల వంటి వారన్న మాట. వారిని గమనించండి. ప్రతి ఒక్కరి మీద ఏవో ఒక అవినీతి ఆరోపణలు వుంటాయి. పాలకుల ప్రాపకమే వారికి అండ, దండ. వీరు పాలకులకి, పాలకులు వీరికి సహకరించుకుంటూ వుంటారు. వీరి అవసరాలు పాలకులు చూసుకుంటారు. పాలకుల రాజకీయ చర్యలని వీరు బాకా ఊదుతారు. ఒక రకమైన క్విడ్ ప్రోకో నడుస్తుందన్న మాట. ఈ బాబాల్లో భూ ఆక్రమణదారులున్నారు. రేపిస్టులున్నారు. రాజకీయంగా చక్రం తిప్పగలిగేవారున్నారు. చట్టం కళ్లుగప్పి దేశాలు వదిలి పారిపోయేవారున్నారు. వీరు భగవధ్యానంలో నిరాడంబరంగా వుండరు. వీళ్లకి ప్రచార యావ ఎక్కువ. రాజకీయ ప్రాపకం కోసం అర్రులు చాస్తుంటారు.

పైన చెప్పిన బాబాలూ, గురువులు…వీళ్లూ భగవద్భక్తులే కదా! భగవంతుడి లీలలకు ప్రచారకర్తలే కదా. ఇప్పుడు చెప్పండి ప్రభుత్వాలతో, పాలకులతో కుమ్ముక్కవుతూ ప్రజల అజ్ఞానాన్ని, అభద్రతా భావాల్ని సొమ్ము చేసుకొనే ఈ సోకాల్డ్ ఆధ్యాత్మికవేత్తలు సమాజానికి హానికరం కాదా? ఏ మత ఆధ్యాత్మికవాది రాజకీయాల నుండి దూరంగా వుండగలిగాడు? వీళ్లకి రాజకీయ పరిజ్ఞానం బొత్తిగ శూన్యం. కనీసం మన రాజ్యాంగం చదువుకొని వుండరు. ప్రజాస్వామిక వ్యవస్థకి సంబంధించిన మౌలిక సూత్రాలు తెలియవు. దేశంలోని పేదరికం గురించి, ఆర్ధికాంతరాల గురించి, కుల వ్యవస్థ గురించి వీరిది భయంకరమైన అజ్ఞానమే కాదు వాటి వల్ల ప్రయోజనాలు పొందే స్వార్ధపరులు కూడా వీళ్లే. వీళ్లకి అంతర్జాతీయ రాజకీయాల పట్ల, ఆర్ధికాంశాల గురించి పరిజ్ఞానం అసలే వుండదు. కానీ వీళ్లు పాకిస్తాన్ తో యుద్ధం గురించి, చైనాతో ఘర్షణల గురించి మాట్లాడతారు. యుద్ధోన్మాదుల్లా మాట్లాడుతుంటారు. ఏ రకంగా ఏ బాబా రాజ్యాంగేతర శక్తి కాకుండా వుండగలిగాడు? ఏ మత నాయకుడు తన మతానికి సంబంధించిన ప్రజల వోట్లని చూపి రాజకీయ పరపతి పెంచుకోడు? లేదా రాజకీయ నాయకులకి ఉపయోగపడకుండా వుండగలడు? గల్లీల్లో వుండే కాషాయ సిల్క్ పంచెలతో, బంగారు రంగు కళ్లద్దాలతో కనబడే హనుమాన్ ఉపాసకులు, రవీంద్రభారతిలో ఏ కార్యక్రమం అయినా కుంకుమ రంగు లుంగీలు కట్టి వేళ్లకి ఉంగరాలతో ధగధగలాడుతూ వేదికలెక్కే ఏదో ఒక శర్మల నుండి గంభీరమైన కంఠంతో ఆంగ్లంలో దడదడలాడించే గురువుల వరకు…అందరికీ చిత్ర విచిత్ర ఆహార్యాలు, నాలుగు భాషణలే వీరి పెట్టుబడి. ఒకడు నల్లరంగేసిన జులపాలు, గడ్డంతో తెల్లటి బట్టలేసుకుంటే మరోడు తెల్లగడ్డంతో బానపొట్టని ఎక్స్పోజ్ చేస్తాడు. వీళ్లల్లో కొంతమంది డాన్సులు తగలడ!! అవి కూడా వీరికి ఓ పెద్ద ఆకర్షణ.

కాసేపు చోటా మోటా గల్లీ ఉపాసకులు,పెద్ద గురూలు, స్వామీజీలు, బాబాల వ్యవహారాలు పక్కనపెడదాం. ఈరోజున ఆధ్యాత్మిక చింతన, దైవ విశ్వాసంలో అనేకానేక వాణిజ్యాంశాలు మిళితమై ఉన్నాయి. అంటే జ్యోతిష్యం, వాస్తు, నేం కరెక్షన్స్, గ్రహశాంతుల నిమిత్తం ప్రత్యేక పూజాదికాలు…ఇంకా ఎన్నెన్నో మత, దైవ విశ్వాసాలతో ముడిపడి వున్నాయి. అన్ని మతాల్లోనూ ఏదో ఒక పేరుతో ఇవి నడిచేవే. స్పిరిచ్యువాలిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా! అవును మరోసారి చెబుతున్నా – భారతదేశంలో ఆధ్యాత్మికతే అతి పెద్ద పరిశ్రమ.

ఇప్పుడు కరోన సెకండ్ వేవ్ వల్ల ఆందోళనలతో దేశం హోరెత్తిపోతుంది. కరోన లేకుంటే మాత్రం దేశం ప్రశాంతంగా వుండేదా? రైతు ఉద్యమాలు గర్జించటంలేదా? ఎన్నార్సీ, సీఏఏ కార్చిచ్చు చల్లారేదేనా? పెట్రో మంటలు ఆరేవేనా? ప్రభుత్వరంగ పరిశ్రమల అమ్మకాలపై కార్మిక, ఉద్యోగ వర్గాల ఆందోళనలు సమసిపోయేవేనా? ఇందులో ఏ ఒక్కటీ సానుకూలంగా, సామరస్యంగా పరిష్కారమవ్వదు. ఇది పక్కా. ప్రజాందోళనలు కానీ, నిపుణులు, ఆర్ధికవేత్తల సలహాలు కానీ చెవికెక్కించుకోరు. “ఇలా అయితే ప్రజలు మరోసారి ఎన్నుకుంటారా? ఆ మాత్రం తెలివి లేదా పాలకులకి? మరి ఏమిటి ఆ మూర్ఖత్వం?” అంటారా? అది మూర్ఖత్వం కాదు అక్కడే వుంది కిటుకు. వాళ్ల కేలిక్యులేషన్లు వాళ్లకున్నాయి. ఇక్కడ ప్రజాభిప్రాయం కానీ, ప్రజా సంక్షేమం కానీ ముఖ్యం కాదు వారికి. వాళ్లకి కావలిసిందల్లా మళ్లీ అధికారంలోకి రావటమే. మీరు మళ్లీ అదే ప్రశ్న వేస్తారు కదూ ప్రజాగ్రహం, అసంతృప్తి పెరుగుతుంటే మళ్లీ ప్రజలెలా వోట్లేస్తారని మీ ప్రశ్న కదూ! ప్రజల అజ్ఞానం మీద, మత దైవ విశ్వాసాల మీద అధికారంలోని నాయకులకు అపార విశ్వాసం వుంది. 2024 ఎలక్షన్స్ సమయానికి రామమందిరం పూర్తి చేస్తే చాలు. అప్పుడు చెలరేగించే భావోద్వేగాలకి ప్రజలు మళ్లీ వోట్లేయరా? ఇదే వారి లెక్క ఇక్కడే రాజకీయాలకి, మతానికి వున్న సావయవ సంబందం కనబడుతుంది స్పష్టంగా. ఇలాంటి పని గతంలో కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు బిజేపి ఇంకా బలంగా, నిర్దాక్షిణ్యంగా చేస్తున్నది.

ఈ దేశానికి కావలిసింది విగ్రహాలు, మందిరాలు కాదనీ, దేవుడిని ఇంట్లో కూడా చూసుకోవచ్చని, భద్రమైన, సురక్షితమైన, ప్రశాంతమైన, హుందాయితమైన జీవితానికి కావలిసినంత సంక్షేమ అవసరాల్ని తీర్చే దృక్పథం కలిగిన పాలకులేనని తెటతెల్లం చేయాల్సిన బాధ్యత మనమీద లేదూ వచ్చే ఎన్నికల లోపల ? మనం ఐతే ఫుల్ బిజీగా వుండాలి మేష్టారూ!

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

One thought on “పాపం పుణ్యం ప్రపంచమార్గం

  1. మొత్తం చదివాను ఎప్పటిలాగానే చాలా బావుంది

Leave a Reply