పాతాళ పరంపర!

“అమ్మా… నాన్న దేశభక్తుడు కాడా?”

కొడుకు మాటకు కొంగు నోటికి అడ్డం పెట్టుకొని చూసింది తల్లి. ఆ మాట యింతకుముందెన్నడూ విననట్టు యిప్పుడు విన్నా అర్థం కానట్టు అయోమయంగా చూసింది.

రెండు కాళ్ళ మధ్య తల పాతేసికున్నట్టు కూర్చున్నాడు బుడతడు. కొడుకుని చూస్తూ “నువ్వు రేపుట్నుంచి బడికి యెళ్ళిపో… ఆ…” తలాడిస్తూ అంది తల్లి.

“బడికెళ్ళిన కాన్నుంచే అలాటి పిచ్చి పేలుళ్ళన్నీ పేలుతున్నాడు” అంది మూలన కూర్చున్న ముసల్ది మండుతూ.

నాయనమ్మ మాటని పట్టించుకోకుండా బుడతడు బుర్ర పేలిపోయేలాగ ఆలోచిస్తున్నాడు.

“అమ్మా అసలు దేశభక్తి అంటే యేటి?”

కొడుకు మాటకు తల్లి జవాబివ్వలేదు. కాని వాడి నాయనమ్మ వూరుకోలేదు. “బక్తి అంటే యేటి? బక్తే. దేవుడంటే బక్తి. మొక్కకపోతే మొట్టులెట్టేస్తాడని బయ్యిమే బక్తి. అలగే దేసమంటే బక్తి. దేసానికి లొంగీ వొంగీ వుండడమే దేసబక్తి…” తన అనుభవం అంతా కూడదీసుకున్నట్టే చెప్పింది ముసల్ది.

వాళ్ళ నాన్నంత లొంగీ వొంగీ వున్నవాడ్ని బుడతడు చూడలేదు గాక చూడలేదు. అందుకేనేమో వాడి బుర్రలో రాజుకున్న అగ్గీ చల్లారలేదు.

పదీ పదిహేను రోజులుగా బుడతడు బుడతడుగా లేడు. కంటి నిండా నిద్రపోతున్నట్టుగా లేడు. కడుపుకింత తిన్నట్టుగా కూడా లేడు. ఇన్నాళ్ళలాగ ఆడుకోవడం లేదు. బుజ్జా మీద దృష్టి కూడా లేదు. వాళ్ళ నాన్న గురించిన దుఃఖంలో వున్నట్టున్నాడనే అనుకుంది వాళ్ళమ్మ. కాని బుడతడు యేటేటో ఆలోచించి అల్లకల్లోలం అయిపోతున్నాడని యిప్పుడిప్పుడే అర్థం అవుతోంది. కాని ఆ అర్థమయింది యేదో పట్టుకు దొరక్కుండా వుంది.

“ఎల్లి ఆడుకో” అంది తల్లి. ఆ మాటతో యిన్నాల్టిలా చెంగున చెవుల పిల్లిలా దూకలేదు బుడతడు. ఈసురోమన్నట్టుగా వుండి బలవంతాన తోస్తే బండరాయి కదిలినట్టుగా కదిలాడు.

సావాసగాళ్ళతో చేరాడేగాని కలవలేదు. తప్పిపోయినట్టు తిరుగుతున్నాడు. అలిసి ఆడొచ్చిన నేస్తగాళ్ళు బుడతడి పక్కనే కూర్చున్నారు.

“అరే, రాహుల్ గాడి ఆలయ్య వుజ్జోగం ఆలమ్మకి గాని, లేపోతే ఆలింట్లో చదువుకున్నోళ్ళకి గాని యిస్తారట” అన్నాడు కర్రోడు.

“రాహుల్ గాడు మనతోటి యేడో క్లాసే కదా చదువుతున్నాడు” అనుమానపడ్డాడు పూతికగాడు.

“ఆడ్ని ఆల తమ్మున్నీ గవర్నమెంటే మొత్తం చదివిస్తాదట…” గొప్ప ఛాన్స్ కొట్టేసినట్టు గొప్పగా చెప్పాడు బక్కోడు.

“మరి… ఆలమ్మ పోలీసు వుద్యోగం చేస్తాదేటి?” మరింత ఆశ్చర్యపోయాడు పొట్టోడు.

ఆ మాటలకు అందరూ నవ్వుకున్నారు. బుడతడు నవ్వలేదు. మా అయ్య పోలీసయినా బాగుణ్ణని కూడా అనుకోలేదు. కాని జవాను పోయినప్పుడు టీవీల్లో చూపించడం గుర్తుకువచ్చింది. ఊరి పేరు వార్తల్లోకెక్కి మర్మోగిపోవడమే కాదు, వూళ్ళో జరిగిన కవతులూ ర్యాలీలూ కళ్ళముందు యిప్పుడూ కదలాడుతున్నాయి. పెద్దపెద్దోల్లు అందరూ మాట్లాడడం… పెద్దపెద్ద పూలదండలు వేయడం… అందరూ గుళ్ళో దేవుడికన్నా మిన్నగా చూడడానికి తండోపతండాలుగా యెగబడడం… అన్నీ బుడతడి బుర్రలో గిర్రున తిరుగుతున్నాయి.

“కోట్లు కోట్లు… బోల్డు డబ్బు గవర్నమెంటు యిస్తంది” పెదవి విరచి కనురెప్పలు టపటపమని ఆడించాడు బక్కోడు.

“ఆల చేతుల్లో యీలు చచ్చిపోయినారు గాని, దొరికితే యీలూ ఆలని చంపేసుందురు. రొండువేలమంది పైన యెళ్లినారు, అడవిలో అన్నల్ని యేటాడడానికి…” పేపర్లో చందివిందో పెద్దలు మాట్లాడితే విన్నదో అన్నాడు జెండాకొయ్యగాడు.

“చంపినా డబ్బే… చచ్చినా డబ్బే…” అన్నాడు బండోడు.

“ఔను మరి ఆలు దేశభక్తి వున్న అమర వీరులు…” కర్రోడి నోట్లో మాట నోట్లోనే వుంది. జెండా కొయ్యగాడు ఝామని లేచాడు. “ఇలాటలాటి దేశభక్తేటి? ఈ పోలీసు జవాన్ల దేశభక్తి అంతా యింతా కాదు, మన కొండోడి ఆల పిన్నమ్మ ఆల వూర్లో… యే వూరది? ఆ… వాకపల్లిలో దొరికినోల్లుని దొరికినట్టు రేపులు చేసినారు. కన్న పిల్లల ముందు. కట్టుకున్నోడి ముందు. ఊరువూరుని చెరిచేసినారు. ఆల దేశభక్తికి మురిసిపోయి గవర్నమెంటు యింకా కాపాడడానికి యిరవై యేళ్ళయి గింజుకుంతంది…” కొయ్యగాడి వంక అందరూ మూగబోయి చూస్తుంటే, “మాయమ్మకి కొండోడాల అమ్మ చెప్పింది. అప్పుడు ఆలమ్మ పదేళ్ళ పిల్లట…” అన్నాడు.

బుడతడు నోరు తెరచి చూశాడు. బుర్ర గోక్కున్నాడు. మూగగా వుండిపోయాడు.

“మన ఆంధ్రా వొరిస్సా బోర్డరు కాడ? ఎన్కౌంటర్ అయితే శవాలకోసం యెల్లినోళ్ళు కళ్ళతోటి చూడలేకపోనారు. ఆడదానికి వొక రొమ్ము క్కోస్సినారు. మగోడికి తల సరిగ్గ సగం సెక్కీసినారు…” జెండాకొయ్యగాడి మాట పూర్తికాలేదు. “ఒరే… బయపెట్టీకురా” కొయ్యగాడి చేతులు పట్టుకు ఆపినాడు పూతికగాడు. వాడి కళ్ళలో భయం చూసి కొయ్యగాడు “అయన్నీ యినడానికి నీకే కాదు, యెవులులికీ దైర్నం లేదు…” నిట్టూర్చి వొదిలేసినాడు.

అందరూ చప్పుడు చెయ్యకుండయిపోయారు.

అప్పటికే పొద్దుగూకింది. సావాసగాళ్ళంతా యెటోళ్ళటు నెమ్మదిగా కదిలారు. ఇళ్ళ కేసి.

బుడతడు మాత్రం చీకట్లో అలాగే చాలాసేపు కూర్చున్నాడు. దుఃఖంతో గుండె బరువుగా వున్నా కంటంట వొక్క చుక్క నీరు రాలలేదు. “ఎవుల్రది సీకట్ల?” అని యెవరో కేకేస్తే, అప్పుడు లేచి బుడతడు అడుగులు వేశాడు. నడుస్తుంటే నీడ కాళ్ళల్లో పడుతోంది. తన నీడని తనే తొక్కుతూ ఆగాడు. తలెత్తి పైకి చూస్తూ వెనక్కి చూశాడు. వీధి లైటు. కళ్ళలో పడ్డ వెలుగు చూడలేక కళ్ళు వొక్కక్షణం మూసి తెరిస్తే కరెంటు పోలు మీద కాకి కాలిపోయినట్టు కాలిపోయి తీగెలకు వేళ్ళాడుతున్న తవుడు మావ కనపడ్డాడు. గుండె గతుక్కుమంది. తుప్పున గుండెలమీద వూసుకున్నాడు. ఆగకుండా యింటికేసి నడిచాడు. కాళ్ళకు అడ్డం పడ్డ నీడ క్రమేనా పొట్టిదైపోయి మాయమైపోయి అంతలోనే మళ్ళీ వెనకాల చేరి వెంటపడింది.

ఇంట్లో అడుగు పెట్టడంతోనే బుడతడ్ని చూసి ఆలమ్మ “యెక్కడ సచ్చినావురా” అని తిట్టబోయి అంతలోనే యేదో యాదికొచ్చి తమాయించుకొని “ఆకలెయ్యదా కడుపుకి…” అని వడ్డించింది. ఒక్కమాట మాట్లాడకుండా కంచం ముందు కూర్చొన్నాడు బుడతడు. అన్నం తింటూ వున్నాడు.

సరిగ్గా అప్పుడే సింహాద్రి పెద్దనాయన వచ్చాడు. భుజమ్మీదుగా కప్పి వున్న తువ్వాలుని తీసి దాచిన పచ్చటి మందు సీసాని పసిబిడ్డలా బయటకు చూపించి నవ్వుతూ చూశాడు. అమ్మ కన్నార్పకుండానే కాదు, కాసింత కోపంగా కూడా చూసింది. “మా తమ్ముడు వుండగా మిలట్రీ కాయ కావాల్రా… మిలట్రీ కాయ కావాల్రా అని అడిగీవోడు. ఆడుండగా అవలేదు. మన నాయ్డుగోరి వెంకటి మిలట్రీ నుండి వచ్చున్నాడు కదా?, యిలక్కిలగ అని చెప్పి అడిగినాను. మారు మాటాకుండా యిచ్చాడు మారాజు. రేపొక్కరోజు ఆగితే తమ్ముడి దినం. ఆడికి నీరట పెట్టు…” బాధతో సింహాద్రి గొంతు బొంగురుపోయింది.

బుడతడు చూపుతిప్పాడు. నిట్టూర్చి నెత్తిన చేతులు వేసుకు కూర్చుండిపోయింది అమ్మ.

మందు సీసా మూలాన పెడుతూ “పెద్దోడు యేడి?” అన్నాడు సింహాద్రి. “ఈదిలోకిప్పుడే యెల్లినాడురా” అంది ముసల్ది.

“ఏటంటన్నాడు, చదువుకుంటాడటా? ఆలయ్య వుంటే అలాటి ఆస పడినా పరవాలేదు. ఇప్పుడు యీడ్ని యెవుడు చదివిస్తాడు? ఇంటికి పెద్దోడు. బారం పడతాది. తప్పదు మొయ్యాల. నీను చెప్తాన్లే…” భరోసాగా అన్నాడు సింహాద్రి.

“పదారే నిండలేదు. పద్దెనిమిది వుండాలనీసి అంతన్నారు…” భయాన్ని వెళ్ళగక్కింది బుడతడి అమ్మ.

“అవన్నీ నీను చూసుకుంతాను, నువ్వు బెంగపడక. సాయపడినోలుకి యివ్వాల్సింది యేదో యిస్తాము గాని మానుతామా? తండ్రి డూటీలోనే గదా చచ్చిపోయినాడు. టెంపరరీగానయినా ఆపని యిస్తార్లే…” నమ్మకంగా అన్నాడు సింహాద్రి.

బుడతడి గుండె ధడ్‌మంది. వాడి మనోనేత్రానికి నాన్న స్థానంలో అన్నయ్య కనిపించాడు. శవంలాగ. మురుగులోకి దిగి వూపిరాడక అచ్చం నాన్నలాగే. బుడతడికి వొళ్ళు వొణికింది. తిన్నది గొంతులోకి తన్నింది. వాడు వెర్రి చూపులు చూస్తుంటే-

“పాకీ పనికి కూడా పుర్రాకులన్నీ పడాల…” తనలో తాను అనుకున్నట్టుగా అంది ముసల్ది.

బుడతడు కంచంలో చెయ్యి కడిగి లేచాడు. చొక్కా యెత్తి మూతి తుడుచుకున్నాడు. “ఒరే… అన్నయ్య యెక్కడున్నాడో సూడు…” అని వాడి అమ్మ చెపుతుంటే, “మేమిద్దరం యెలతాములే” అని బుడతడి భుజమ్మీద చెయ్యేసి సింహాద్రి యింట్లోంచి వీధిలోకి నడిచాడు.

ఇద్దరూ నడుస్తూ వున్నారు. మాటల్లేవు. అప్పటికీ “యేట్రా బుడతా… మవునరతం గాని చేస్తన్నావేటి?” అని సింహాద్రి అడిగాడు. అటూ యిటూ చూస్తూ నోరిప్పి మాట్లాడని బుడతడివంక చూశాడు. “ఏదో డవుటు పడతన్నావు, పర్లేదు అడుగు” తలూపాడు సింహాద్రి.

“నాయుడోల వెంకటికి మందు సీసాలు యెక్కడివి?” అడిగాడు బుడతడు. “ఏమి యేస్తావా?” అడిగాడు సింహాద్రి. “మ్చ్” తలడ్డంగా వూపాడు బుడతడు. సింహాద్రి నవ్వి “మిలట్రీ వాళ్ళకి కోటా వుంటాది, మనకి రేసను కోటాలాగ…” అన్నాడు. “ఆలకి డూటీ కష్టంగా వుంటాదా?” అడిగాడు బుడతడు. ఒక్క క్షణం యే సమాధానమూ యివ్వలేదు సింహాద్రి. “యుద్ధం వస్తేనే, లేకపోతే కూకోని మేపడమే” అన్నాడు. “ఎండకీ వానకీ…” బుడతడు అడగడం పూర్తి కాలేదు. “ఎండావానా యెవులికి లేవు? రాత్రీ పగలూ యెవులికి లేవు?” అన్నాడు సింహాద్రి. “పెళ్ళాం బిడ్డల్ని వొదిలి…” బుడతడు ఆగిపోయాడు. “మీనాయనా నేనూ చేసిన పనికి పీతి కంపుకి పెళ్ళాం వున్నా కూడా యెప్పుడోగాని పక్కలోకి రాదు…” వుగ్గపట్టుకోలేనిది యేదో గొణుగుతూ అనేశాడు సింహాద్రి. అన్నాక మళ్ళీ “ఆ… అది ఆలకీ కష్టమే. అయినా ఆలకి బ్లూ ఫిల్ములూ అవీ చూపిస్తారట, బయటకి కూడా అప్పుడప్పుడూ యెల్లొచ్చట… అయినా గుంటడివి నీకవన్నీ యేల?” అని, అంతలోనే నోరు జారినట్టు గ్రహించాడేమో “యేమి, మిలట్రీల గాని చేరుతావా?” అడిగాడు.

“మిలట్రీ వెంకటి దేశభక్తుడా?” బుడతడు తిరిగడిగిన మాటకి “ఆ?” అని అర్థం కానట్టు చూశాడు సింహాద్రి. మళ్ళీ అంతలోనే “ఊ” అన్నాడు.

“ఎవసాయం చేసే రైతులు దేశభక్తులు కారా?” బుడతడు సింహాద్రి వంక చూడకుండా యేదో ఆలోచిస్తూ అడిగాడు. సింహాద్రి మాత్రం నడక ఆపి బుడతడినే చూస్తున్నాడు.

“లైన్ మెన్ తవుడు మావ దేశభక్తుడు కాడా?” మళ్ళీ అడిగాడు బుడతడు. దెయ్యాన్ని చూసినట్టు చూశాడు సింహాద్రి. ఇంతలో “పెద్దయ్యా” అని పరుగున వచ్చిన బుడతడి వాళ్ళన్న చెయ్యి పట్టుకుంటే “ఆ” అన్నాడు. “ఇంటికెళ్తే అమ్మ చెప్పింది, అందుకని పరిగెట్టుకోని వచ్చా…” జాపోస్తూ అన్నాడు. కాని సింహాద్రి నుండి వులుకూ పలుకూ లేకపోయేసరికి “పెద్దయ్యా…” అన్నాడు మళ్ళీ.

బుడతడ్ని యెగా దిగా చూసి నిట్టూర్చిన సింహాద్రి “మీయయ్య పనిలోకి వస్తావు కదా?” బుడతడి అన్నను అడిగాడు. బుడతడన్న యే సమాధానం యివ్వలేదు. “పని చేస్తే యెప్పుడుకో పదేల్లకో యిరవై యేల్లకో పర్మినెంటు అవుతాది, మంచి ఆపీసర్లు వస్తే…” అని మళ్ళీ “వస్తార్లే… అందరూ వొక్కలాగ వుండరు. దయా దాక్షిణ్యాలు చూపించీవోళ్ళూ వుంటారు…” అన్నాడు సింహాద్రి.

బుడతడి అన్న యేమీ అనకపోయీసరికి యేదో గ్రహించినట్టు “సచ్చరోల్లం, సచ్చర పని చెయ్యడానికి సిగ్గేల?” అన్నాడు సింహాద్రి.

“మా అన్నయ్య పియ్యా పీతులూ యెత్తడు… నీను కూడా యెత్తను. నువ్వు కూడా యెత్తకు…” పెద్ద మొనగాడిలా గొంతు పెంచి అన్నాడు బుడతడు.

సింహాద్రి నివ్వెరపోయి, తేరుకొని “మరేటి చేస్తారు? యేటి తింటారు?” అడిగాడు. ఒళ్ళు మండిపోతోంది సింహాద్రికి.

“ఊ… మూటలు మోస్తాం, కాదంటే దొంగతనం చేస్తాం, దోపిడీలు చేస్తాం…” బుడతడు బుడతడులా లేడు. పెద్ద మనిషిలా వున్నాడు. గొంతు గట్టిగా వుంది.

“కుల రుత్తి చెయ్యడానికి యేటి రోగం?” మండిపడుతూ అడిగాడు సింహాద్రి.

“మా నాన్నలాగే మా అన్నయ్య కూడా సెప్టిక్ టాంకులు క్లీన్ చేస్తాడు. కాలవలు కచడాలు తీస్తాడు. సరే, అది దేశభక్తి అని నువ్వే కాదు, అందరూ వొప్పుకోవాల… అప్పుడే” అనేసి బుడతడు వడివడిగా యింటివేపు అడుగులు వేశాడు.

“ఆడికేటి పిచ్చిరా?” అడిగాడు సింహాద్రి. బుడతడు వెళ్ళిన వంకే చూస్తూ “నువ్వేటి మాట్లాడవేటి?” అడిగాడు.

“అమ్మ చెప్పింది. నాన్న చేసిన పని నేనూ చేస్తాను. కాపోతే యీ బుడతడు నేను యీ పనిలో చేరితే యింట్లోంచి పారిపోతానని చెప్పాడు. అమ్మకు చెపితే చచ్చినంత వొట్టు అని కూడా…” బుడతడి అన్న మాట పూర్తికాలేదు. తల అటూ యిటూ వూపుతూ “ఆడికి నాలుగు పడితే తోవకొస్తాడు. అర్దంయ్యిందా? ఇలాగ వొగ్గీకండి, లేదంటే డాక్టరుకి చూపించండి” అనేసి సింహాద్రి వెళ్ళిపోయాడు.

బుడతడి అన్న పరుగు పరుగున యింటికి చేరాడు. చూస్తే బుడతడు చాపమీద యేమీ యెరగనట్టు పడుకుని వున్నాడు. వాళ్ళమ్మ “పెద్దనాయన కలిసినాడా?” అని అడిగింది. “ఊ” అన్నాడు బుడతడి అన్న. “మీ నాయన పదకుండు రోజుల కార్యం అయిపోతే పనిలోకి యెల్దువు…” అంది అమ్మ.

ఆ మాటతో బుడతడి గుండె ధడ్‌మంది. ఆ ‘ధన్’మన్న చప్పుడు యింతకు ముందు జవాను చనిపోతే తుపాకులు గాలిలోకి కాల్చిన ధన్ ధన్‌మన్న చప్పుడుని గుర్తుకు తెచ్చింది.

బుడతడి బుర్ర గిర్రున తిరుగుతోంది. సుడులు. వేడెక్కిపోతోంది. ఆవిర్లు వస్తూంటే మనసులో వొక రూడీ చేసుకున్నాడు. ‘ఎవరైనా దేశభక్తులు యెప్పుడు అవుతారంటే- వాళ్ళ చేతిలో లాఠీ వుంటే అవుతారు, లేదంటే తూటా తుపాకీ వుంటే అవుతారు. చేతిలో యేదో వొక ఆయుధం వున్నోడే దేశభక్తుడు…’ అనుకుంటూ అలసి నిద్రలోకి జారిపోయాడు.

బుడతడి మాట విని వాళ్ళన్న వాళ్ళ నాన్న చేసిన పనికి పోలేదు. బుడతడు కూడా పోలేదు. సింహాద్రి పెదనాయన కూడా పోలేదు. ఒక్క సింహాద్రి పెదనాయనే కాదు, యెవ్వరూ యే వొక్కరూ ఆ పని చేయడం లేదు. దాంతో వొక్కసారిగా మురుగు కాలువలు దాటింది. పొంగింది. పొర్లింది. రోడ్లెక్కింది. ఇళ్ళల్లోకి వచ్చింది. మనుషులందరూ ముక్కు మూసుకున్నా లాభం లేదు. అందరూ మురుగులోనే నడుస్తున్నారు. మునుగుతున్నారు. తేలుతున్నారు.

గవర్నమెంటు దిగి వచ్చింది. ముందుగా పాకీ పనిని దేశభక్తిగా గుర్తించింది. దేశం కోసం చేసే యే పనయినా భక్తితో చేస్తే అదే దేశభక్తి…

బుడతడి ముఖమ్మీద చిరునవ్వు ప్రవహించింది.

నిద్రలోవున్న బుడతడి ముఖం చూస్తూ వాళ్ళ అమ్మా అన్నా నాయినమ్మా అంతా అర్థం కానట్టు ముఖాముఖాలు చూసుకున్నారు!

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. నాలుగు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. అల్లిబిల్లి కథలు పిల్లల కథా సంపుటం. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- ఇంకా జాతీయాల మీద వచ్చిన పురాణ పద బంధాలు, పిల్లల సమస్యల మీద వచ్చిన ఈ పెద్దాళ్ళున్నారే వంటి పుస్తకంతో ఇరవైయ్యేడు వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’ కాలమ్స్ కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

3 thoughts on “పాతాళ పరంపర!

  1. రక్తం కళ్ళచూడాల. అద్గదీ దేశభక్తి అంటే.ప్రభుత్వ స్పాన్సర్డ్ దేశభక్తి నిర్వచనం ఇదే.అదే ఇప్పుడు యూనిఫాంలో తిరుగుతూ దర్జా వెలగబెడుతోంది.
    సెమటలు కక్కుకోని చచ్చిపోతే, ఉచ్చాపియ్యా దుర్గంధంలోని చచ్చిపోతే అది దేశభక్తి అవుద్దా. అసలు దీనికి గవర్మెంటు రూల్సులొప్పుకుంటాయేటి.
    మన బమ్మిడన్న అన్నీ ఇలపింటి కొత్త లాపోయింట్లు ఎక్కణ్ణుంచి పీక్కొస్తాడో. కధ మాత్రము సూపరూ

  2. నిజానికి బుడతడు వేసింది చాలా పెద్ద ప్రశ్న. ఇలాంటి సమస్యల మీద మరింత సాహిత్యం రావాల్సి ఉంది. ఈ సమస్యను కథగా అద్భుతంగా మలిచిన బజరా గారికి నమస్కారములు.

Leave a Reply