బహుళత్వాన్ని ఆయుధంగా ధరించి ఫాసిజం మీద పోరాడాలి: పాణి

(గత సంచిక తరువాయి…)

  1. సాహిత్య విమర్శలో అన్ని వాదాలను కలపాలనే వాళ్లు ఉన్నారు కదా?

సాహిత్య విమర్శలోనే కాదు. సామాజిక విమర్శలోనే ఇష్టమైనవన్నీ కలపాలనుకొనే వాళ్లు ఉన్నారు. ఎవరైనా నిజంగానే సిద్ధాంత రంగంలో పని చేయదలుచుకుంటే ఇందులో ఉన్న సమస్య సులభంగానే అర్థమవుతుంది. దేనికంటే ప్రతి సిద్ధాంతానికి తనదైన మౌలిక సంవిధానం ఉంటుంది. అసలు ఏ సిద్ధాంతాన్నయినా తెలుసుకోవడం అంటే దాని పద్ధతిని తెలుసుకోవడమే. అలాంటి వేర్వేరు పద్ధతులను కలపడం ఎవ్వరి వల్లా కాదు. ఇట్లా కలపాలని అనుకొనే వాళ్లు మొదట ఏ సిద్ధాంతమూ అన్నిటినీ వివరించలేదు అనే సూక్తిని తయారు చేసుకుంటారు. వీళ్లు మార్క్సిజం వర్గ దోపిడీని తప్ప ఇంకేమీ వివరించలేదని అంటారు. కానీ వాళ్లకు తెలియనిది ఏమంటే… మార్క్సిజం సామాజిక చరిత్రలోని అన్నిటినీ వివరించగల స్థూల పరిశీలన పద్ధతి. అందువల్లనే మరే శిబిరంలో సాధ్యం కాని అనేక సామాజిక రాజకీయార్థిక సాంస్కృతిక విషయాలను మార్క్సిస్టులు పట్టించుకుంటారు. ఆ విషయాల మీద విశ్లేషణలను అందిస్తారు. ఇందులో భాగంగానే మార్క్సిస్టు సాహిత్య కళా విమర్శ అభివృద్ధి చెందింది. ఈ రంగంలో జరగాల్సిన పని ఇంకా చాలా ఉంది. అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంది. అయితే దీనికి అవసరమైన పరికరాలు మార్క్సిస్టు సాహిత్య విమర్శలో ఉన్నాయి. సామాజిక సిద్ధాంతమైన మార్క్సిజంలాగే మార్క్సిస్టు కళా సాహిత్య విమర్శ కూడా నిరంతరం అభివృద్ధి చెందుతున్నది. గత వందేళ్ల తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శా చరిత్రను పరిశీలిస్తే ఇది తెలుస్తుంది. తొలి రోజుల్లో అందులో అనేక ఎగుడుదిగుళ్లు ఉండొచ్చు. ఆలంకారిక వాసనలు కూడా ఉండవచ్చు. కొంచెం యాంత్రికత కూడా ఉండవచ్చు. కానీ ప్రజా పోరాటాల నేపథ్యంలో సాగిన నిర్దిష్ట అధ్యయనం, పరిశీలనల వల్ల చాలా అభివృద్ధి చెందింది. అంతకంటే ఎక్కువ సవాళ్లు ఉన్నాయి. వాటిని అధిగమించకుంటే ఇవాళ మన సాహిత్య కళా సాంస్కృతిక రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లేదు. ఇలాంటి ప్రయాణంలోనే జీవితంలోని అన్ని వైవిధ్యాలను చిత్రించే సాహిత్యాన్ని విశ్లేషించేలా సిద్ధాంత పునాదిని తయారు చేసుకుంటున్నది.

మార్క్సిజానికి వేరే సిద్ధాంతాలను కలపాలని అనుకొనే వాళ్లు ముందు మార్క్సిస్టు పద్ధతిలో ఉన్న ఈ అవకాశాలను పరిశీలించాలి. మార్క్సిజం వర్గాన్ని తప్ప వేరే వాటిని వివరించలేదని నిరూపించాలి. మార్క్సిజం సరిగా అర్థమైతే కులాన్ని, పితృస్వామ్యాన్ని, మతాన్ని, సాహిత్యాన్ని విశ్లేషించగల సిద్ధాంతిక ఆవరణ మార్క్సిజంలో ఉన్నదని తెలుస్తుంది. మార్క్సిజంలోని స్థలకాలబద్ధత, చారిత్రకత, నిర్దిష్టత, సార్వజనీనత మొదలైన వాటి ఆధారంగా మన సమాజాన్ని, దాని ప్రతిఫలనమైన కళా సాహిత్యాలను మార్క్సిస్టులు విశ్లేషిస్తున్నారు. ఈ పని మరింతగా చేయడానికి ఆయా రంగాల్లో ఇప్పటికే కృషి చేసినవారి నుంచి స్వీకరిస్తున్నారు. ఉదారవాదుల దగ్గరి నుంచి అన్ని రకాల మార్క్సిస్టేతర ధోరణులకు చెందిన వారు అందించే సమాచారం ఉపయోగపడుతున్నది. కులం విషయంలో అంబేద్కర్‌ పరిశీలనలు, సూత్రీకరణలు ఉపయోగపడుతున్నాయి. సాంస్కృతిక భావజాల రంగాలను ప్రధానంగా చేసుకొని పని చేసిన ఫూలే, పెరియార్‌లాంటి వాళ్ల భావనలు అవసరం అవుతున్నాయి.

దీన్నే ఆ వైపు నుంచి కూడా చూడవచ్చు. పితృస్వామ్యం, మతం, కులం, భాష మొదలైన వాటి గురించి సీరియస్‌గా పని చేస్తున్న వాళ్లు మార్క్సిస్టులు ఇచ్చే వివరణలను, భావనలను తీసుకొన్నారు. పైవన్నీ సామాజిక చారిత్రక ఉత్పత్తి అనీ, చలనంలో ఉన్నాయనే స్థూల అవగాహనతో ఉన్నవాళ్లందరూ ఎక్కడో ఒకచోట, ఎంతో కొంత మార్క్సిస్టు పద్ధతిని అనుసరిస్తున్నారు. వ్యక్తులుగా వాళ్లకు మార్క్సిస్టు రాజకీయాలతో పేచీ ఉండొచ్చు. విప్లవ కార్యక్రమంతో విభేదం కూడా ఉండొచ్చు. మార్క్సిజంలో అతి ముఖ్యమైన వర్గపోరాట భావనను దాని అసలైన అర్థంలో తీసుకోకపోయినా వాళ్ల పరిశోధనల్లో మార్క్సిస్టు ఛాయలు ఉన్నాయి. అంత మాత్రాన మౌలికంగా వేర్వేరు సిద్ధాంత పద్ధతులు కలిసిపోయినట్లు కాదు. ఈ తేడా తెలిస్తే బాగుండు.

  1. అట్లా కలపకపోతే సాహిత్య విమర్శ అభివృద్ధి చెందనే ఆలోచనతో చాలా మంది ఉన్నట్లుంది..

బహుశా ఇప్పుడు సాహిత్య విమర్శ పేరుతో అదే జరుగుతోంది. అలాంటివాళ్లే ప్రజాస్వామికంగా ఉన్నారని, సమస్యను గుర్తించి పరిష్కరించే పనిలో ఉన్నారనే గుర్తింపు పొందుతున్నారు. ఇదంతా సాహిత్య విమర్శను అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతోనే చేస్తున్నారు. వీళ్లలో కొద్ది మంది ముందు మార్క్సిజాన్ని వర్గ కుదింపువాదం అంటారు. పదార్థంచైతన్యం అనే ద్వంద్వంలో మార్క్సిజం ఇరుక్కపోయిందని అంటారు. అక్కడి నుంచి సాహిత్య విమర్శలోకి వచ్చి వస్తువుశిల్పం మధ్యపడి సాహిత్య స్వభావాన్ని పట్టించుకోలేదని అంటారు. సాహిత్య ప్రయోజనం పేరుతో రాజకీయ ప్రచారం తప్ప సాహిత్యతత్వాన్ని అర్థం చేసుకోలేదని అంటారు. ఇట్లా మార్క్సిజం మీద, మార్క్సిస్టు సాహిత్య విమర్శ మీద కాల్పనిక ఆరోపణలు చేస్తుంటారు. దీనికి విరుగుడుగా వర్గపోరాటం బదులు మానవతావాదాన్ని మార్క్సిజానికి కలపాలని కొందరు అంటారు. మార్క్సిజం వర్గాన్ని మాత్రమే వివరిస్తుంది కాబట్టి కులాన్ని వివరించే ఫూలే అంబేద్కర్‌ భావనలను కలపాలని మరి కొందరు అంటారు. తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ వికాస చరిత్రను పరిశీలిస్తే ఈ కసరత్తు అంతా అనవసరమని తేలుతుంది. అంత లోతైన అధ్యయనానికి ఓపిక లేనివాళ్లు ఈ పులుముడు వాదాలను తయారు చేస్తున్నారు. మార్క్సిస్టు సాహిత్య విమర్శ పద్ధతిని పాటిస్తున్నామని అనుకొనే వారు కూడా దానికి స్త్రీవాదాన్ని, బహుజనవాదాన్ని, ముస్లిం వాదాన్ని కలుపుకుంటూపోయి సమగ్రం చేద్దామని అనుకుంటున్నారు. పీడిత అస్తిత్వ వాదాలను కలిపి మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతాన్ని బలపరచాలని అనుకుంటారు. ఒక రకంగా ఇదే బహుళవాదంగా మారింది.

ఫాసిజం ఏకాత్మవాదం తెచ్చి అన్నిటినీ ధ్వంసం చేస్తున్న సమయంలో బహుళత్వాన్ని ఆయుధంగా ధరించి దాని మీద పోరాడాల్సిందే. సామాజిక జీవితంలోని బహుళత్వం, సిద్ధాంతపరమైన బహుళవాదం వేర్వేరు విషయాలు. మార్క్సిజాన్ని అంబేద్కరిజాన్ని కలపాలని శరత్‌జోషి దగ్గరి నుంచి మన దగ్గర ఉ.సా దాకా ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ సిద్ధాంతాలు కలవనట్లే వాటి రాజకీయ లక్ష్యాలు కూడా కలవవు. అయితే ఆధునిక, ప్రగతిశీల రాజకీయాలన్నిటిలోని ఆదర్శాలకు, విలువలకు ఉమ్మడి స్వభావం ఉంది. వాటిని కలపగలం. వాటి ఉమ్మడి ప్రాంతం చాలా విశాలమైనది. అక్కడ జరుగుతున్న ఉమ్మడి పని ఇంకా ముందుకు పోవాలి. మన సమాజాన్ని ఆధునికంగా తీర్చిదిద్దడానికి అది చాలా అవసరం. ఉదాహరణకు ఫూలే, పెరియార్‌, అంబేద్కర్‌లాంటి వాళ్లు గొప్ప ఆధునికులు. సమానత్వం, వ్యక్తి స్వేచ్ఛ, హేతు చింతన మొదలైన ఆధునిక విలువల కోసం జీవితమంతా పని చేశారు. అంబేద్కర్‌ అయితే తాత్విక, సిద్ధాంత రంగాల్లో కూడా కులవ్యవస్థ మీద కేంద్రీకరించాడు. అవి సాధించుకొనే వరకు ఆయన ప్రాసంగికత నిలిచే ఉంటుంది. ఆధునిక సామాజిక సిద్ధాంతమైన మార్క్సిజం నుంచి మన సామాజిక, సాంస్కృతిక రంగాల వికాసాన్ని అధ్యయనం చేయాలనుకొనే వాళ్లకు ఆయన ఆలోచనలు శక్తివంతంగా ఉపయోగపడుతున్నాయి. ఆ వైపు నుంచి సాహిత్య విమర్శను అభివృద్ధి చేయవచ్చు. అయితే మార్క్సిజం దానికదే సాహిత్య సిద్ధాంతం కానట్లే, అంబేద్కరిజం కూడా దానికదే సాహిత్య సిద్ధాంతం కాదు, సాహిత్య విమర్శ కాదు. ఈ దేశంలో సంస్కృతిగా చెలామణి అయిన దాని మీద అంబేద్కర్‌ చేసిన విశ్లేషణల నుంచి సాహిత్య విమర్శను అభివృద్ధి చేయవచ్చు. కానీ అలాంటి గట్టి ప్రయత్నాలేవీ జరగడం లేదు.

  1. మీరు ఇందాక రాజకీయ లక్ష్యాలు కలవకపోయినా అని అన్నారు కదా? ఏ విషయంలో…?

అంబేద్కర్‌లో బలమైన రాజకీయ పార్శ్వం ఉంది. సామాజికంగా, సాంస్కృతికంగా ఆయనలో విప్లవాత్మక కోణం ఉన్నప్పటికీ రాజకీయంగా పార్లమెంటరీ ప్రజాస్వామికవాది. ప్రపంచవ్యాప్తంగా వలస వ్యతిరేక పోరాటాల నుంచి చాలా దేశాలు బైటపడి సొంత రాజ్యాంగాలను తయారు చేసుకుంటున్న సమయంలో అంబేద్కర్‌ పార్లమెంటరీ ప్రజాస్వామికవాదిగా ఆలోచించడాన్ని అర్థం చేసుకోవచ్చు. అమానవీయమైన కుల వ్యవస్థ నుంచి దళితులకు చట్టపరమైన రక్షణలను ఆయన కోరుకున్నాడు. ఈ దేశంలో దళితులకు చట్టబద్ధ పాలన తప్ప, రాజ్యాంగపరమైన రక్షణ తప్ప మరే ఆసరా లేకపోవడంతో ఆయన ఈ రాజకీయ వైఖరి తీసుకున్నాడు. రాజ్యాంగ మార్గదర్శకత్వంలో సమానత్వ సాధనకు అవకాశం ఉందని కూడా ఆయన కలలుగన్నాడు. వీటితోపాటు వేర్వేరు సమయ సందర్భాల్లో అప్పటి కమ్యూనిస్టుల వైఖరుల్లాగే ఆయన వైఖరుల్లో కూడా కొన్ని వివాదాస్పదమైనవి ఉన్నాయి. వాటిని ఆనాటి చరిత్రలో భాగంగా చూడాలి. కానీ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అతి కొద్ది కాలంలోనే ఘెరంగా తన అసలు స్వభావాన్ని బ్రాహ్మణిజంతో సహా బట్టబయలు చేసుకున్నది. పెద్ద సిద్ధాంత విశ్లేషణలేవీ అక్కర లేకుండానే మామూలు జనాలకు కూడా అది అర్థమైపోయింది. రాజ్యాంగయంత్రం మీద అగ్రకుల, సంపన్న దోపిడీ వర్గాలపట్టు రాజ్యాంగబద్ధంగానే పెరిగిపోయింది. దేనికంటే మన రాజ్యాంగం దోపిడీని చట్టబద్ధం చేసింది. రాజ్యాంగబద్ధ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇంతగా దిగజారి మార్పుకు ప్రతిబంధకంగా తయారయ్యాక కూడా ఆంబేద్కరిస్టులు ఇప్పుడు ఆయన పేరుతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో దళితుల విముక్తి సాధిస్తామని అంటున్నారు. దీన్ని అంగీకరించడం కష్టం. ఈ చర్చ చాలా లోతైనది. దాన్ని పక్కన పెడితే అంబేద్కర్‌ రాజకీయాల్లోని కోర్‌ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. రాజ్యాంగ ఆదర్శాలు అమలు కాకపోతే దాన్ని ధ్వంసం చేయడంలో నేను ముందుంటానని ఆయన అన్న మాటను ఉటంకించి కొందరు అంబేద్కర్‌ రాజకీయంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పరిమితం కాలేదని అంటూ ఉంటారు. ఆ మాట అన్నప్పటికీ ఆయన మౌలికంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యవాది. దాన్ని గుర్తించకపోతే ఆయన స్ఫూర్తికి వ్యతిరేకంగా మాట్లాడినట్లవుతుంది. ఇక్కడే ఆయన రాజకీయ లక్ష్యాలతో విప్లవకారులకు పేచీ. ఈ అర్థంలోనే రాజకీయ లక్ష్యాలు కలవకపోయినా అని అన్నాను.

  1. లాల్‌ నీల్‌ ఐక్యత ఈ రాజకీయ లక్ష్యాలను ఉద్దేశించే కదా?

సైద్ధాంతిక ప్రత్యేకతలు ఉన్నప్పుడు రాజకీయ లక్ష్యాల్లో తేడా ఉంటుందని తెలియని వాళ్లు లాల్‌ నీల్‌ ఐక్యతను తీసుకొచ్చారు. పీడిత కులాల, వర్గాలను సూచించే ఈ మాటల్లోని ఐక్యత గౌరవనీయమే. రాజ్యాంగ ఆదర్శాలు, సమానత్వం, స్వేచ్ఛ, ప్రతి మనిషికి ఒకే విలువ వైపు నుంచి ఈ ఐక్యతా భావనకు మన దేశంలో చాలా ప్రాధాన్యత ఉంది. అవి దెబ్బతినిపోతున్న సమయం ఇది. ఐక్యంగా పోరాడి సాధించుకోవాల్సిందే. పూర్తి భిన్నమైన సిద్ధాంత పద్ధతులు, రాజకీయ లక్ష్యాలు ఉన్న ఈ మార్గాలకు విలువల ప్రాతిపదిక మీద సారూప్యత ఉంది. అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే రాజ్యరూపానికి లోబడిన రాజకీయ కార్యక్రమాన్ని అనుసరించేవాళ్లకు, ఈ రాజ్యానికి, వ్యవస్థకు వ్యతిరేకంగా మౌలిక మార్పు ద్వారా కొత్త చారిత్రక దశకు చేరుకోవాలనే వాళ్లకు మధ్య రాజకీయ వ్యూహాల్లోనే తేడా ఉంది. అవి పొసిగేవి కావు. విప్లవకారులకు, అంబేద్కర్‌వాదులకు మధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఎన్నిక రాజకీయాలు అడ్డంగా ఉన్నాయి. ఆ కోణంలో ఐక్యతకు అవకాశం లేదు. దేనికంటే ఈ రెండు మార్గాల వాళ్లకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద దృఢమైన అభిప్రాయాలు ఉన్నాయి. దళారీ స్వభావంతోపాటు బ్రాహ్మణీయ స్వభావం కూడా ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఈ దేశంలో మౌలిక మార్పుకు(చిన్న చిన్న మార్పులు చాలా తెచ్చినప్పటికీ) తీవ్రమైన అవరోధం అనే వాదన ఒక పక్కన ఉంది. అనేక చారిత్రక, రాజకీయార్థిక కారణాల వల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రపంచంలోని కొన్ని దేశాల్లో నిర్వహించిన ఉదారవాద పాత్ర మన దేశంలో నిర్వహించలేదనే లోతైన విశ్లేషణ ఉన్నది. నీల్‌ శిబిరంలో దీనికి పూర్తి భిన్నమైన అంచనా ఉన్నది. అలాంటప్పుడు లాల్‌ నీల్‌ ఐక్యత పరిధి ఏమిటో తేల్చుకోవాలి. ఫాసిస్టు శక్తులను నిలువరించాలంటే ఈ ఐక్యత ఇంకింత బలపడి ఉద్యమాలు చేయాల్సిందే. నిజానికి ఇవాళ ఇంకా ఎన్నో రంగాల నుంచి, అనేక వైపుల నుంచి పోరాటాలు జరగాల్సిన అవసరం ఉంది. అయితే కొంత మంది ఆర్థిక సామాజిక రంగాల్లో సమూల మార్పును తెచ్చే విప్లవాన్ని కూడా లాల్‌నీల్‌ ఐక్యతతోనే సాధించగలం అని సిద్ధాంతాలు చెబుతున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఓట్ల రాజకీయాల మీద స్పష్టత లేకుండా ఎంత చర్చించినా అయ్యేదేమీ లేదు. ఇట్లా అంటే లాల్‌ నీల్‌ ఐక్యతావాదులు కోప్పడతారు. విప్లవోద్యమం`బహుజన అస్తిత్వవాదం కలవాలని కోరుకొనేవాళ్లు బాధపడతారు. విమర్శిస్తారు. అన్నిటినీ కలిపితే అందరూ సంతృప్తి చెందుతారనే పేరాశ సిద్ధాంత విషయాల్లో కష్టం. రాజకీయ ఆచరణలో ప్రమాదం. ఉమ్మడి అంశాల్లో, పోరాటాల్లో కలవడానికి, సిద్ధాంత, రాజకీయాల్లో కలవడానికి ఉన్న తేడా తెలియకపోవడం వల్ల ఇట్లా ఫీలవుతుంటారు.

  1. అసలు విప్లవోద్యమం, బహుజన ఉద్యమాలు అన్నీ విఫలమయ్యాయని, ఇప్పుడు ఇలాంటి చర్చకే ప్రాధాన్యత లేదనే వాళ్లు కూడా ఉన్నారు కదా? ఇంతకూ వాటి ముందున్న ప్రశ్నలేమిటో చెప్పగలరా?

ఇదొక స్వీయ విఫల వాదన. విప్లవోద్యమం ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ఆటుపోట్లకు గురైంది. నిజమే. అంత మాత్రాన విఫలమైనట్లు కాదు. గత యాభై ఏళ్లుగా విప్లవోద్యమం సాధించిన విజయాల వల్లేకాదు, ప్రభుత్వం చుట్టుముట్టి దెబ్బతీయడంలో కూడా విప్లవోద్యమ ప్రాసంగికత రుజువవుతున్నది. విప్లవోద్యమం ఏ మౌలిక వైరుధ్యాలను రద్దు చేయాలని ఆరంభమైందో అవి మరింత తీవ్రయ్యాయి. కాబట్టి మావోయిస్టు ఉద్యమ ప్రాసంగికత మరింత పెరుగుతున్నది. అనేక ఉద్యమాలు మన కళ్లెదుటే వ్యవస్థలో కలిసిపోయాయి. పాలకవర్గాలతో రాజీపడిపోయాయి. కానీ విప్లవోద్యమ సాహసికంగా పోరాడుతున్నది. దాని సిద్ధాంతం, ఆచరణ, లక్ష్యం విఫలం కాకపోగా గత ఇరవై ఏళ్లలో చాలా నేర్చుకున్నది. స్థూలంగా మూడు వైపుల నుంచి ఇది జరిగింది. ఒకటి: తన ఆచరణలో ఎదురవుతున్న సవాళ్ల నుంచి, రెండు: సమాజంలో వ్యవస్థాగతంగా, రాజ్యం నుంచి, సామ్రాజ్యవాదం నుంచి వస్తున్న సవాళ్ల నుంచి. ఫాసిస్టు దాడిలో నిర్మాణపరంగా కొంత కోల్పోయినా ఇప్పుడు ఉన్నంత రాజకీయ సిద్ధాంత అవగాహన, పరిణతి గతంలో లేదు. అనేక కొత్త అవగాహనలు పెంచుకుంటూ రాజకీయ నిర్మాణ రంగాల్లో ఎందుకు ఎదురు తాకిడిలకు గురైందీ విప్లవ శిబిరం లోతుగా పరిశీలించుకోవాలి. మూడో కోణం ఏమంటే… అస్తిత్వవాదాలలోని పార్లమెంటరీ రాజకీయ కోణాన్ని వ్యతిరేకిస్తూనే, సామాజిక అస్తిత్వాల గురించి చాలా నేర్చుకున్నది. మొత్తంగా ఫాసిస్టు, దళారీ బూర్జువా వర్గ విధానాలతో, వ్యవస్థాగమైన మార్పులతో తీవ్రమైన రాపిడి జరుగుతున్న సమయంలోనే విప్లవోద్యమం ఎప్పటికప్పుడు లోతుగా, తాజాగా చాలా నేర్చుకున్నది. అందువల్ల రాజకీయంగా, సిద్ధాంతపరంగా బలపడిరది. ఆ వైపు కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అస్తిత్వవాదులు ఈ నలభై ఏళ్లలో తమ అవగాహనను, ఆచరణను ఏమన్నా పరీక్షకు పెట్టుకున్నారా? ఆచరణాత్మకంగా తమ భావాలకు నిర్మాణ రూపాన్ని ఇచ్చారా? ఒక రాజకీయ సామాజిక కార్యక్రమాన్ని కనీసంగా ప్రతిపాదించారా? కొంచెం అటూ ఇటూగా బీఎస్పీ రాజకీయాలు చెప్పడం తప్ప వేరే ఏమైనా నేర్చుకున్నారా? పీడిత అస్తిత్వ ప్రజల మీద వ్యవస్థ నుంచి, రాజ్యం నుంచి, సామ్రాజ్యవాదం నుంచి జరుగుతున్న దాడిని ఎదుర్కోవాలని అనుకున్నారా? వాళ్లు ఎంతసేపూ విప్లవోద్యమం మీదే తమ చూపును ఎక్కుపెడుతున్నారుగాని సంఘ్ పరివార్ బహుజన కులాలను, ఆ కులాల స్త్రీలను వాడుకొని హిందుత్వను తీవ్రం చేయడాన్ని అడ్డుకోవాలని అనుకుంటున్నారా? ఇదంతా పీడిత అస్తిత్వవాదులను, వాళ్ల నాయకులను ఏమైనా డిస్ట్రబ్‌ చేసిందా? సమాజంలో చాలా కంఫర్ట్‌గా ఉండే పురుషులను, అగ్రకులాలను ఒక దశ దాకా తీవ్రంగా ప్రశ్నించి నిలేసిన అస్తిత్వవాదాలు ఆ తర్వాత కంఫర్ట్‌ జోన్‌లోకి వెళ్లి స్థిరపడ్డాయా? అనే ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. వీటి నుంచి అస్తిత్వవాదులు ఏం నేర్చుకున్నారు? కనీసం హిందుత్వ వ్యతిరేక అస్తిత్వవాద ప్రతివ్యూహాన్ని అందరూ కలిసి తయారు చేసుకున్నారా? వామపక్ష శక్తుల మధ్య స్థూలంగా ఉన్న ఏకాభిప్రాయంలాంటిదైనా వివిధ అస్తిత్వ నాయకుల మధ్య ఉన్నదా? అగ్రకుల పీడనకు, పురుషాధిపత్యానికి, హిందుత్వ ఫాసిస్టులకు వ్యతిరేకంగా పని ఎంత చేస్తాం? చేసే క్రమంలో గొడవలు ఏమిటి? అనేది వేరే. కనీసం అలాంటి ప్రయత్నం చేయడానికైనా ఒక శిబిరంగా అస్తిత్వవాదులు ఉన్నారా? ఒక వాదంగా అయినా, ధోరణిగా అయినా, ఉద్యమంగా అయినా ఆరంభ దశను దాటి మరో దశకు చేరుకోడానికి ప్రయత్నపూర్వక కృషి ఎంత ఉన్నదని సమీక్షించుకోగలగాలి. ఒకవేళ విప్లవోద్యమం మరింత బలహీనపడ్డా… తిరిగి దాన్ని సమీక్షించుకోడానికి, మళ్లీ పని ప్రారంభించడానికి పూనుకొనే కేంద్రం ఎక్కడో మిగిలే ఉంటుంది. ఈ సంగతి దాని చరిత్రలో రుజువైంది. కానీ బహుజన ఉద్యమం విఫలమై ఉంటే, దానికి బాధ్యతపడి సమీక్షించే వ్యక్తులు, శక్తులు, నిర్మాణాలు ఏమైనా ఉన్నాయా? విప్లవోద్యమం, బహుజన ఉద్యమం రెండూ విఫలమయ్యాయని అనే వాళ్లు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయని ఓపన్‌ మైండ్‌తో అందరం ఆలోచించాలి. కనీసం ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలు నిర్మించేందుకైనా ఇలాంటి ఈ లోచూపు ప్రదర్శించాల్సిందే.

  1. సాహిత్యంలోకి వస్తే..ఇవాళ తెలుగు సాహిత్యంలో ఏ వాదమూ లేదని, ఏ ఉద్యమమూ లేదని, అన్ని కలిసి నడుస్తున్నాయని, అందరూ అన్నీ రాస్తున్నారనే అభిప్రాయం కూడా ఉన్నట్లుంది కదా?

అందరూ అన్నీ రాస్తున్నారా? అనుమానమే. రాస్తే మంచిది. కానీ ఈ వాదన ఆ మాట చెప్పడానికి కాదనుకుంటా. అంత వరకైతే మంచిదే. బహుశా విప్లవ సాహిత్యోద్యమం లేదని చెప్పడానికి ఈ మాట అంటున్నారు కావచ్చు. అస్తిత్వవాద ధోరణులు కొన్ని కోణాల్లో సాంస్కృతిక అవగాహనను అందించిన్పటికీ, వాటికి ఉన్న స్వీయ పరిమితి వల్లనే అవి ఉద్యమాలు కాలేకపోయాయి. చరిత్రలో కలిసిపోయాయి. వెనుక రాజకీయ ఉద్యమాలు లేనప్పుడు సాహిత్యంలో ఒక ధోరణి కొంత కాలం మాత్రమే ధోరణిగానే ఉండి ఆగిపోతుంది. అది అందించిన చైతన్యం మాత్రం సమాజంలో మిగిలి ఉంటుంది. ఈ ధోరణులు ప్రధానంగా సాహిత్యరూపంలో వచ్చాయి కాబట్టి ఇవాళ మన తెలుగు సాహిత్యానికి ఇంత లోతు, విస్తృతి, వైవిధ్యం రావడానికి అవి చాలా వరకు కారణమయ్యాయి. దీనికి స్త్రీవాదానికి మించిన ఉదాహరణ లేదు. బహుజనవాదం కూడా సుమారుగా అంతే. అయితే దానికి కొంత ఉద్యమ గుణం ఉంది. కులపరమైన దాడులు జరిగినప్పుడు బహుజనవాదులు వ్యక్తులుగా, బృందాలుగా పని చేస్తున్నారు. దీని ప్రభావం సమాజమంతా ప్రసరిస్తోంది. ఇప్పుడు అస్తిత్వవాదాలు ధోరణులుగా అయినా ఉన్నాయా లేదా? అనేదాన్ని ఈ ప్రత్యేకతల్లోంచి చూడాలి.

ఇక విప్లవ సాహిత్యోద్యమానికి వస్తే, మార్క్సిజం అనే హోలిస్టిక్‌ అండర్‌స్టాండింగ్ దానికి ఉన్నది. సమాజాన్ని మౌలికంగా మార్చాలనే ఎజెండా ఉన్నది. ఆ మౌలికత మొదటి పదేళ్లతో పోల్చితే చాలా విస్తరించింది. లోతుల్లోకి వెళ్లింది. ముఖ్యంగా వెనుక అనేక సంక్షోభాల మధ్యనే కావచ్చు, తీక్షణమైన ప్రజా రాజకీయ ఆచరణ ఉన్నది. పీడిత సమూహాలుగా, పీడిత వర్గంగా ప్రజలు విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆచరణలో అనేక వైరుధ్యాలను పరిష్కరించే పోరాటాలు నిర్మిస్తున్నారు. ఈ అనుభవం నుంచి, చైతన్యం నుంచి విప్లవ సాహిత్యోద్యమంలో సామాజిక సమస్యలు భాగమయ్యాయి. ఏదో ఒక ప్రక్రియలో రచనలు వస్తున్నాయి. పాటలు, వ్యాసాలు, విశ్లేషణలు వచ్చినంత కల్పనా సాహిత్యం రాకపోవచ్చు. మొత్తం మీద ఈ ఎరుకతో సాహిత్య సృజన జరుగుతున్నది.

అయితే ఒక్కటి మాత్రం నిజం. ఇవాళ తెలుగు సాహిత్య ఆవరణ మారింది. ఇందులో మూల్యాంకనం చేయాల్సిన అంశాలు మిగిలే ఉన్నాయి. దీనికి అవసరమైన సామాజిక, తాత్విక, సాంస్కృతిక పునాదిని పునర్నిర్మించే పని మొదలైంది. అది సమగ్రం కావాల్సి ఉంది. ముఖ్యంగా ఇలాంటి పనికి అవసరమైన భాషను తయారు చేసుకోవాలి. ఒక్కోసారి మనకు ఈ మారుతున్న పరిస్థితి అర్థమవుతున్నట్లే ఉంటుంది. కానీ దాన్ని శాస్త్రీయంగా చెప్పగల పరిభాష ఉందా అనే సందిగ్థత వెంటాడుతూ ఉంటుంది. దీన్ని అధిగమించాలి.

సృజనాత్మక సాహిత్యంలోకి వస్తే జీవితానుభవం, భావోద్వేగాలు చాలా ముఖ్యం. కానీ వాటిని కూడా మారుతున్న సామాజిక సాహిత్య ఆవరణలో వివరించగల భావజాల విస్తృతి ఉండాలి. చాలా వేగంగా రాజకీయార్థిక సాంస్కృతిక సంబంధాలు మారుతున్నాయి. సృజనాత్మక రచయితలు వీటిని ఎంతో కొంత చిత్రించగలరు. ఈ మార్పులను సిద్ధాంతపరంగా సాహిత్య, సామాజిక విమర్శకులే పట్టించుకోవాలి. ఈ కృషి పెరిగితేనే మారుతున్న జీవితంలో ఏది రాయాలి? ఎలా రాయాలి? అనే స్పష్టత ఇంకింత వస్తుందనుకుంటా. అందరూ అన్నీ రాయడం అనే మాట వస్తు వైవిధ్యానికి సంబంధించింది. నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో గొప్ప వస్తు వైవిధ్యం ఉంది. ఈ వైవిధ్యాన్ని, ప్రత్యేకతలను, కొత్తదనాలను కలుపుకోగల భావజాల విస్తృతి సాహిత్యరంగానికి లేనప్పుడు లేనప్పుడు వస్తు వైవిధ్యం కిరాణకొట్టులోని ఐటమ్స్‌లా కనిపిస్తాయి. ప్రయోగాలు వ్యక్తిగత స్థాయి క్రీడలుగా మారుతాయి.

  1. విరసంలో వస్తు శిల్పాల మధ్య సంబంధం విషయంలో ఇప్పటికీ సందిగ్ధత ఉందనే ఆరోపణ ఉంది కదా?

ఇప్పుడు కాదు.. గతంలో కూడా సందిగ్ధత ఏమీ లేదు. వస్తువు, శిల్పం, దృక్పథం వేర్వేరుగా ఉంటాయని అనుకుంటే సాహిత్య స్వభావమే తెలియనట్లు. అవి వేరు చేయడానికి వీల్లేని ఉమ్మడి అంశాలు. ఈ మూడిరటి అత్యున్నతస్థాయి కలయికలోంచే గొప్ప సాహిత్యం వస్తుంది. సామాజికత, తాత్వికత, కళాత్మకత అనే మూడు వనరుల నుంచి సాహిత్యంలో వస్తువు, శిల్పం, దృక్పథం కలిసి రూపొందుతాయి. పాత సమాజం ధ్వంసమైపోయి కొత్త సమాజ నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఈ మూడు విప్లవాత్మకంగా మారిపోతాయి. వాటిలో ఏ ఒక్కటో మారి, మిగతావి పాతవే ఉండటానికి వీల్లేదు. విప్లవాత్మకమైన సామాజిక చలనాల్లో విధ్వంసమూ`నిర్మాణమూ ఉంటాయి. తీవ్రమైన ఘర్షణ మధ్య అవి సంబంధాల్లో ఉంటాయి. ఆ సంబంధాలను ప్రగతిదాయక క్రమంలో చిత్రించేదే విప్లవ సాహిత్యం. సమాజంలో విధ్వంసం, నిర్మాణం జరుగుతున్నప్పుడు విధ్వంసాన్ని మాత్రమే చిత్రించే రచయితలు ఉంటారు. వాళ్లు దాన్ని చూసి విచారపడతారు. దు:ఖపడతారు. అదే రాస్తారు. కానీ ప్రగతిదాయకంగా చూసేవారు ఏది విధ్వంసమవుతున్నదో చెప్పడమేగాక ఏది నిర్మాణమవుతున్నదో, ఎలా అవుతున్నదో, దాని కోసం ఎలాంటి ఘర్షణ నడుస్తున్నదో చిత్రిస్తారు. అప్పుడు వస్తువు, శిల్పం, దృక్పథం మూడూ మారిపోతాయి. ఏ ఒక్కదానిలో రావలసిన మార్పు రాకపోయినా ఆ వైకల్యం పాఠకులకు తెలిసిపోతుంది. కొందరు ఔత్సాహిక విప్లవ కవులు ఈ మూడింట ఏదో ఒకదానిలో వెనుకబడి ఉండవచ్చు, అలాంటి వాళ్లు ఎప్పుడూ కొందరు ఉంటారు. అయితే విప్లవోద్యమం తొలి రోజుల్లోనే సాహిత్యంలోని ఈ మూడింటి ఉమ్మడి క్షేత్రాన్ని మార్చేసింది. దీని ప్రభావాన్ని అంచనా వేయడం సంప్రదాయక శిల్పదృష్టి ఉన్న విమర్శకులకు సాధ్యం కాదు. వాళ్లకు సహజంగానే ఈ మూడింటిని కలిపి చూడ్డం రాదు. అలాంటి విప్లవాత్మక పద్ధతి ఉంటుందని కూడా వాళ్లకు తెలియదు. వీళ్లలో ఉదారవాదుల నుంచి కాస్తో కూస్తో విప్లవాన్ని ప్రేమించేవారు కూడా ఉంటారు. వాళ్ల సంప్రదాయక దృష్టి వల్ల విప్లవ సాహిత్యంలో శిల్పం లేదనో, వస్తు శిల్ప సందిగ్థత ఉందనో అంటూ ఉంటారు. నిజానికి ఈ చర్చ సృజనాత్మక సాహిత్యానికే కాదు. సాహిత్య విమర్శకు, సామాజిక విమర్శకు కూడా సంబంధించింది. ఈ స్పష్టత లేని రచయితలు విప్లవ భావజాలాన్ని, రాజకీయాలను ప్రకటించుకున్నా సరే వాళ్లు సంప్రదాయ సాహిత్యం రాసినట్లే.

వస్తువు, శిల్పం, దృక్పథం, విధ్వంస నిర్మాణాల మధ్య సంబంధంలో ఇలాంటి విప్లవాత్మక అవగాహన 1980ల నుంచి పెరిగింది. గత పది ఇరవై ఏళ్లలో అన్ని రంగాల్లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మరింత బలపడింది. అందుకే విప్లవ రచన అంటే కేవల వర్ణన కాదు. అనుభవాల చిత్రణ కాదు. బాధలను తలపోసుకోవడం కాదు. గతాన్ని తలచుకొని వగచడం కాదు. భవిష్యత్తును ఊహించుకొని పరవశించడం కాదు. విప్లవ రచన అంటే కళ్ల ముందున్న వాస్తవ ప్రపంచంలోంచే తార్కికంగా, హేతుబద్ధంగా ఒక నూతన ప్రపంచాన్ని నిర్మించడం. ఆ నిర్మాణ క్రమాలను ఎత్తి చూపడం. దాని అవకాశాలనే కాదు, అవరోధాలనూ చిత్రించడం. ఇంత పెద్ద కర్తవ్యాన్ని పెట్టుకొని వస్తు శిల్పాల సందిగ్థతను విప్లవ సాహిత్యోద్యమం ఎట్లా భరిస్తుంది?

(ముగింపు వచ్చే సంచికలో…)

Leave a Reply