ఫాసిస్టు వ్యతిరేక సాహిత్య విమర్శ బలపడాలి: పాణి

(గత సంచిక తరువాయి…)

  1. ఫాసిజానికి చరిత్రలో మూలాలు ఉన్నప్పటికీ 2014 తర్వాత సమాజమంతా ఫాసిస్టుల పట్టులోకి వెళ్లింది. ఈ పరిస్థితులు రాబోతున్నాయని ఊహించినా అడ్డుకొనే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్నికల రాజకీయాలు ఎలాంటివైనా కావచ్చు… రాబోయే ఎన్నికల్లో బీజేపీ దిగిపోకపోతే ఆ తర్వాత దేశం ఎట్లా ఉంటుందో ఊహించుకోవడం కష్టం. ఇది రాజకీయంగా చాలా ముఖ్యమైన సమయం కదా? దీన్ని మీరు ఎలా చూస్తారు?

నిజంగానే ఇవాళ మనం జీవిస్తున్న కాలం చాలా ప్రత్యేకమైనది. ప్రమాదకరమైనది. బీజేపీ ఇంకోసారి అధికారంలోకి వస్తే ప్రజా జీవితం ఈ మాత్రం కూడా ఉండదు. దేశం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి తక్షణ రాజకీయ మార్పు జరగాల్సిందే. ఆ అవసరాన్ని ప్రచారం చేయాల్సిందే. కాకపోతే ఇదంతా ఎట్లా వర్కవుట్‌ అవుతుందనేది చాలా పెద్ద ప్రశ్న. ఏవో ఒకటి రెండు ఉదాహరణలు సరిపోవు. ఎన్నికల్లో ప్రజల ఆకాంక్షలకు, చైతన్యానికి చోటు లేకుండాపోయిందని ఆ రంగానికి చెందిన పండితులే అంటున్నారు. మొదటి నుంచీ ఇదే పరిస్థితి ఉండింది. గత ముప్పై ఏళ్లలో మరింత పెరిగింది. మన దేశంలో సార్వత్రిక ఓటు హక్కు ఇచ్చారుగాని ఎన్నికలకు, సాధారణ ప్రజలకు సంబంధమే లేదు. ఎన్నికలనే తంతు అయ్యాక ఏ పార్టీ అధికారంలోకి రావాలో కార్పొరేట్లే ముందస్తుగా నిర్ణయిస్తున్నారని కూడా ఎన్నికల పరిశీలకులు స్పష్టంగా చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలను ఎన్నెన్ని నిర్ణయిస్తున్నాయో ఇప్పుడు అందరికీ తెలుసు. దీని గురించి ఇప్పుడు బోలెడంత సమాచారం ఉంది. అయితే ఇదేమీ పెడ ధోరణి కాదు. బీజేపీతోనే వచ్చిందీ కాదు. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్వభావమే ఇది. దానికి తగినట్లే అది ప్రవర్తిస్తున్నది. ఇందులో వింత ఏమీ లేదు. అయితే ఎన్నికలు మాత్రం తప్పక జరుగుతున్నాయి. బీజేపీ ఎంత తెగబడినా, జమిలి ఎన్నికలని అంటున్నదిగాని అసలు ఎన్నికలే లేవని అనడం లేదు. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ మిగిలి ఉన్న సుగుణం. ఆ మేరకు అది బలమైనదే. దాన్నయినా బీజేపీ ఉంచుతుందా? అనే సందేహం ఉదారవాదులకు కూడా కలుగుతోంది. అయితే ఫాసిజానికి, బూర్జువా వర్గానికి కూడా భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చాలా అనుకూలమైనది. ఆ పేరుతోనే ఏమైనా చేయవచ్చు. కాబట్టి ఇప్పటికి అది ఎన్నికల రూపంలో ఉన్నది.

మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని ఇలా మదింపు వేసుకోకుంటే తక్షణ సమస్యలకు కూడా పరిష్కారం దొరకదు. అందుకే చట్టబద్ధ, ఉదారవాద ప్రక్రియల్లో భాగంగా పరిష్కారం కావాల్సిన ప్రతి చిన్న సమస్యకు ప్రజలు రోడ్ల మీదికి వచ్చి పోరాడాల్సి వస్తోంది. మీరు కావాలంటే ఒక ఐదేళ్ల కాలంలో రాష్ట్రాల్లోగాని, దేశమంతా కానీ వీధుల్లో జరుగుతున్న పోరాటాల్లోని డిమాండ్ల జాబితాను తయారు చేయండి. అవన్నీ దాదాపుగా రాజ్యాంగపరిధిలోనివే. వాటికవే పరిష్కారం కావాల్సినవి. అసలు వాటిని ప్రజలు అడగనక్కరలేదు. వాటిలో చాలా వాటికి కొత్తగా చట్టాలు చేయాల్సిన పని కూడా లేదు. ఈ డిమాండ్లలో ఎన్ని అసెంబీల్లో, పార్లమెంట్‌లో కనీసం చర్చకు వస్తున్నాయో చూడండి. బహుశా రెండు మూడు శాతం కూడా ఉండవు. ఇక పరిష్కారం అంటారా మరీ మరీ తక్కువ. ఎన్నికల్లోనే కాదు, చట్ట సభల్లో, పాలనా ప్రక్రియల్లో కూడా ప్రజలకు చోటు లేదు. ప్రజాస్వామ్య ప్రక్రియలంటూ ఏమీ జరగడం లేదు. రాజ్యాంగబద్ధ పాలన అని, ఉదారవాద ప్రజాస్వామ్యం అని మనం ముచ్చటపడుతూ ఉంటాంగాని అలాంటివవీ అమలులో లేవు.

స్వాతంత్య్ర పోరాట కాలంలో ఉదారవాద ఆలోచనలు ఉండేవి. కానీ మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో భాగం కాలేదు. ప్రజాస్వామ్యం పేరుతో ప్రభుత్వాలు నడుస్తుంటాయి. చాలా విజన్‌ ఉన్న నాయకుడిగా పేరు మోసిన నెహ్రూ కూడా అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్న పెట్టుబడిదారీ వర్గానికి ప్రజల సొమ్మును రాజ్యాంగబద్ధ అభివృద్ధి ప్రణాళిక ద్వారా ఎలా అందివ్వాలనే దాని మీదే కేంద్రీకరించాడు. ఆ రకంగా ఆయన బూర్జువా విజన్‌నే ప్రదర్శించాడుగాని ప్రజల వైపు నుంచి, కింది నుంచి ప్రజాస్వామ్యం గురించి ఆలోచించలేదు. ఆ స్పేస్‌ మన ప్రజాస్వామ్యంలోనే లేదు. ఆ తర్వాత ఆ మాత్రం కూడా ఉదారవాద విలువలకు, ప్రక్రియలకు అవకాశమే లేకుండాపోయింది. దీనికి మొదటి నుంచి అన్ని ఎన్నికల పార్టీలూ కారణం.

ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లి కదిలించలేని స్థితి ఊరకే రాలేదు. ఆ పార్టీలు కేంద్రంలో, రాష్ట్రంలో రాజ్యాంగ విలువలపట్ల ఖాతరు లేకుండా పాలించాయి. ప్రజలను పక్కన పెట్టి ఎన్నికల్లోకి, చట్ట సభల్లోకి కార్పొరేట్లను అన్ని పార్టీలు కలిసి తీసుకొచ్చాయి. బీజేపీ అదనంగా హిందుత్వను తీసుకొని వచ్చేసింది. కార్పొరేట్ల దోపిడీ ఇప్పుడు కార్పొరేట్‌ హిందుత్వ ఫాసిజంగా మారిపోయింది. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న దృశ్యం ఏమంటే` ఇంత కాలం తెర వెనుక ఉండిన కార్పొరేట్ల బాహాటంగా తమ పనులు చేసిపెట్టగల పార్టీలను వెంటేసుకొని రంగం మీదికి నేరుగా వచ్చేశాయి. ఈ విడత కార్పొరేట్లు ఫాసిస్టు పార్టీని తీసుకొచ్చుకున్నాయి. ఇన్నేళ్ల నుంచి ఎన్నికల రాజకీయాల్లో ప్రజల పాత్ర లేకుండా చేసిన ప్రస్తుత ప్రతిపక్ష పార్టీలకు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల దగ్గరికి వెళ్లి ఏం చెప్పగలరు? అందుకే ఒక విషయాన్ని గమనించండి. ఫాసిస్టు వ్యతిరేక ఆలోచనలు, ఆందోళనలు ఎంతో కొంత ఎన్నికల రాజకీయాలకు బైటే కనిపిస్తున్నాయి. ఇది యాదృశ్చికం కాదు. మామూలుగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న పార్టీని దించేసి తాము ఎక్కాలని అనుకుంటాయి కదా. అట్లా ఇప్పుడు అధికారంలో ఉన్నది ఫాసిస్టు పార్టీ అని, అది దేశానికి ప్రమాదకరమని, కాబట్టి దించేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అనుకుంటున్నాయా? కాంగ్రెస్‌తో సహా ఏ పార్టీకైనా ఈ నొక్కు ఉన్నదా? ఉంటే ప్రజల్లోకి వెళ్లి ఫాసిస్టు ప్రమాదాన్ని తమకు వచ్చిన భాషలో అయినా చెప్పగలవా, ఆందోళనలు లేవదీయగలవా? అది ఎంత జరుగుతున్నది? భారత్‌ జోడోలాంటి ప్రయత్నాలు రాహుల్‌గాంధీ చేసి ఉండవచ్చు. అదైనా ఆ పార్టీ మొత్తానికి ఎంత ఎక్కిందో అనుమానమే. ‘కర్ణాటక ప్రయోగం’ గురించి మేధావులు చాలా చెబుతుంటారు. అదేమైనా ఆ పార్టీ దృక్పథంలో భాగం అయిందా? అనుమానమే. దేనికంటే కాంగ్రెస్‌ పార్టీ హిందూ మతాన్ని ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నది. కార్పొరేట్‌ విధానాలను చక్కగా ఎలా అమలు చేయాలో చేసి చూపింది. అయితే బీజేపీ దేశ సంపదనంతా అదాని ఒక్కడికే ఇవ్వడం నచ్చకపోవచ్చు. కాబట్టి రాజ్యాంగాన్ని, ఉదారవాద ప్రక్రియలను బీజేపీ దెబ్బతీస్తోందనే విషయంలో ఆ పార్టీకి ఎంత నొప్పి ఉంటుంది? నిజంగానే ఉంటే ఫాసిస్టు వ్యతిరేకత అనే పెద్ద మాట అటుంచి, కనీసం ఎన్నికలలోని అంకెలనైనా ప్రభావితం చేయవచ్చు.

  1. అంటే బీజేపీలాగే కాంగ్రెస్‌ కూడా ప్రమాదకరం అంటారా?

ఆ రెండు పార్టీలకు చాలా తేడా ఉంది. పోలికలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్‌ సహా మరే ఎన్నికల పార్టీకి లేని ఫాసిస్టు భావజాల పునాది, నిర్మాణం బీజేపీకి ఉన్నాయి. కాంగ్రెస్‌ ఫాసిజాన్ని ఎంత ఎగదోసినా సరే దాన్ని ఫాసిస్టు పార్టీ అనలేం కదా. ఫాసిజం అంటే ఏమిటో ముందు మనకు స్పష్టత ఉంటే ఈ ప్రత్యేకతలన్నీ కలిపి చూస్తాం. భారతదేశంలో హిందుత్వ ఫాసిస్తు శక్తులు విజృంభించిన చరిత్రను, దళారీ బూర్జువా శక్తులు ఎదిగిన తీరునూ కలిపి చూస్తాం. ఈ రెండు శక్తులూ సపరేట్‌ ట్రాక్స్‌ మీద ఎదిగి రాలేదు. ఈ రెంటి మధ్య సంబంధాన్ని కూడా కచ్చితంగా అంచనా వేయాలి.

అప్పుడే బీజేపీ ఫాసిస్టు పాలన అనే తక్షణ, ప్రధాన సమస్యలపట్ల స్పష్టతకు వస్తాం. ఇదే మన రాజకీయ పరిణతికి గీటురాయి. లేకపోతే ఏదో ఒక వైపు జారిపోతాం. దాని వల్ల ప్రయోజనం లేదు. ముఖ్యంగా ఎన్నికల రాజకీయాల్లో లేని ప్రగతిశీల, పీడిత అస్తిత్వ, విప్లవ శక్తులు తమ బాధ్యతను నిర్వహించడానికి ఈ సంయమనం అవసరం. వామపక్ష విప్లవ శక్తులు ఉదారవాద శక్తులతో కలిసి పని చేసేటప్పుడు చాలా సృజనాత్మకంగా వ్యవహరించాలి. అట్లని విప్లవశక్తులు ఉదారవాదులుగా మారిపోతే ఆత్మహత్యాసదృశమే. ఫాసిజాన్ని ప్రజాస్వామిక ఐక్య సంఘటనతోనే ఓడించగలం. దానిలో భాగం కావడానికి కమ్యూనిస్టులు ఉదారవాదాన్ని ఒంటబట్టించుకోవాల్సిన పని లేదు. వర్గపోరాట దృష్టితోనే వ్యవహరించాలి. ఫాసిస్టు వ్యతిరేక శక్తులన్నిటి మీద వర్గ పరమైన అంచనా ఉండాల్సిందే. ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాల్సిందే. విప్లవ శక్తులు ఎంత బలహీనంగా ఉన్నా ఈ రాజకీయ వైఖరితోనే వ్యవహరించాలి. ఇందులో వైరుధ్యం ఏమీ లేదు.

అరుంధతీరాయ్‌లాంటి వారు బీజేపీ దిగిపోయినా ఫాసిజం వేసిన విషపు బీజాలు పోవని స్పష్టంగానే అన్నారు. ఇండియాలో ఫాసిజం ఎదిగి వచ్చిన చరిత్ర చూస్తే ఇంకో ఆశ్చర్యకర నిర్ధారణకు వస్తాం. అదేమంటే.. బీజేపీలాగా బ్రాహ్మణీయ హిందుత్వ భావజాల పునాది లేని పార్లమెంటరీ పార్టీలతో కూడా గతంలో ఫాసిస్టు శక్తులు తమ పనులు చేయించుకున్నాయి. ఒక దశ అంతా కాంగ్రెస్‌ను పరిచారికగా వాడుకున్నాయి. రేప్పొద్దున బీజేపీ పోయి ఇంకో పార్టీ ఎక్కితే దానితో కూడా ఫాసిస్టులు తమ పని చేయించుకోగలవు. ఫాసిజానికి ఈ అనుకూలత సమాజంలో, సంస్కృతిలో, నాగరికతలోనే ఉన్నది. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోనే ఈ అవకాశం ఉన్నది. కాబట్టి బీజేపీ రాజకీయ అధికారం సంపాదించుకోవడం వల్లే ఫాసిజం వచ్చిందనుకోడానికీి లేదు. అట్లని ఫాసిజమంటే దేవుడు, గుళ్లు, పూజలు అని సరిపెట్టుకోడానికీ లేదు. వీటన్నిటినీ కలిపి చూడాలి. కచ్చితత్వం ఉండాలి. పాసిజం ఇంతగా చెలరేగిపోవడానికి సంఫ్‌ుపరివార్‌కు సమాజమంతా విస్తరించగల భావజాలం, ఆమోదం పొందగల సాంస్కృతిక వాతావరణం ఉన్నాయి. ఫాసిజాన్ని రాజకీయాధికారం, సాంస్కృతిక అధికారం అనే రెండు వైపుల నుంచి చూడాలి. వాటిని కూడా సూక్ష్మ-స్థూల స్థాయిల్లో కలిపి చూడాలి. తక్షణ-దీర్ఘకాలిక దశల్లో చూడాలి. మన దగ్గర ఈ పద్ధతి లేకపోతే దాన్ని ఓడించలేం. రాజ్యాంగ వ్యవస్థలను, చట్టబద్ధ పాలనా రూపాలను ఫాసిజం ధ్వంసం చేస్తున్నదా? లేక రాజ్యాంగ వ్యవస్థలను బూర్జువా వర్గం నిరంకుశంగా, పూర్తి తన ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా వాడుకుంటున్నదా? ఈ క్రమంలో ఇండియన్‌ ఫాసిజం మాగ్జిమం చట్టబద్ధంగానే వ్యవహరించేందుకు ప్రయత్నిస్తుందా? అని కూడా ఆలోచించాలి. ఆ అర్థంలో ఇది ‘చట్టబద్ధ ఫాసిజం’ కూడానా?. ఈ నేపథ్యంలో వచ్చిన ఉమ్మడి పౌరస్మృతిని కేవలం ఎన్నికల ఎత్తుగడగానే చూడ్డానికి లేదు. ఈ దేశంలోని వందల సంస్కృతుల హిందుత్వ నియంతృత్వం కోసం దీన్ని తీసుకొచ్చారు. ఫాసిజానికి శాసన రూపం ఇచ్చే ప్రయత్నం ఇది. ఇలాంటివన్నీ కలిపి ఇండియన్‌ ఫాసిజానికి దీర్ఘకాలిక స్వభావం వచ్చింది. అందువల్ల దీన్ని మంద్రస్థాయి ఫాసిజం అనవచ్చు. దీన్ని అర్థం చేసుకోడానికి, అధిగమించేందుకు కొత్త సిద్ధాంత ప్రతిపాదనలు, అవగాహనలు కావాలి. సామాజిక సాంస్కృతిక రంగాల్లో ఫాసిజానికి ఉన్న సోర్స్‌ రద్దయ్యేందుకు దీర్ఘకాలిక పోరాటం చేయాల్సిందే. దళారీ పెట్టుబడిదారీ విధానం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రద్దయ్యే దాకా, అంటే విప్లవం విజయవంతం అయ్యే దాకా ఇండియాలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ప్రమాదం పొంచే ఉంటుంది. అంత వరకు ఫాసిస్టు భావజాల, సాంస్కృతిక వ్యతిరేక పోరాటం జరగాల్సిందే. లౌకిక, ప్రజాస్వామిక శక్తుల పాత్ర అప్పటి దాకా ఉంటుంది. అట్లని వర్గపోరాటాన్ని పక్కన పెట్టి ప్రత్యేకంగా ఫాసిస్టు వ్యతిరేక పోరాటం ఒక్కటే విజయవంతం కావడం కష్టం. ఇవేవీ దశలవారీ పోరాటాలు కావు. చాలా సమగ్రంగా, తక్షణ-దూర దృష్టితో ఫాసిజాన్ని చూడాలి. దీన్ని ఎదుర్కోవాలంటే ప్రగతిశీల శక్తులన్నీ కనిష్ట స్థాయి నుంచి గరిష్ట స్థాయి దాకా ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో భాగం కావాలి. తద్వారా విప్లవ కార్యక్రమంలో ఫాసిస్టు వ్యతిరేక పోరాటం అంతర్భాగంగా ఉండాలి.

  1. ఈ సంక్లిష్టతను చూస్తోంటే ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం సాధ్యమేనా అనే సందేహం రాదా?

రానవసరం లేదు. ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి కష్టపడి పని చేయాలి. దానికి ఓపిక ఉండాలి. కొత్త ఆలోచనలు చేయాలి. ప్రజా జీవితంలోంచి, ఆలోచనల్లోంచి ఫాసిజానికి అనుకూలంగా ఉన్న అంశాలను తరిమికొట్టే కొత్త దృష్టి కోణాలు అవసరం. కొత్త సామాజిక సాంస్కృతిక ప్రక్రియల గురించి ఆలోచించాలి. అసలు ఫాసిజం మీద ఎలాంటి వాదనలు తయారు చేస్తాం అనేదాన్నిబట్టి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టగలం. ఫాసిస్టు వ్యతిరేకపోరాటం తక్షణ అవసరం. అయితే తక్షణ ప్రయోజనవాదనలు మాత్రమే సరిపోవు. రాబోయే ఎన్నికలు వాళ్లకూ తక్షణ ఎజెండానే. అనుమానం లేదు. కానీ ఫాసిజానికి దీర్ఘకాలిక వ్యూహం ఉన్నది. ప్రజలు ఆ దిశగా ఆలోచించే ప్రత్యామ్నాయ వాదనలను మనం పెట్టాలి. ఫాసిస్టు వ్యతిరేకపోరాటం మన నాగరికతలోని హేతురాహిత్యాన్ని ఎదుర్కొనేలా ఉండాలి. వాళ్లు అబద్ధాలు చెప్పినా, మూఢ విశ్వాసాలను లేవదీసినా మనం మాత్రం ప్రజల్లో తర్కబద్ధ వాదనాశక్తిని పెంచాల్సిందే. బహిరంగ`వ్యక్తిగత జీవితాలలోని తేడాను ఎరుకలోకి తేవాలి. ఎక్కడ ఎలా మసలుకోవాలో చర్చనీయాంశం చేయాలి. భిన్న వాదనలపట్ల సహనం పెంచాలి. వాటి మధ్య చర్చ ద్వారానే ప్రజాస్వామికీకరణ జరుగుతుందని చెప్పాలి. కొత్త పద్ధతులను కనుక్కోవాలి. కొత్త అధ్యయనాలు జరగాలి. ఫాసిజం ఎట్లాంటిదంటే.. దాన్ని ఓడిరచగలమా? ప్రజలను సమీకరించగలమా? అనే సందేహంలో పడేస్తుంది. అది దాని లక్షణం. సాంస్కృతిక రంగంలో ఫాసిస్టు ప్రక్రియలు ఎలా సాగుతున్నాయో మనకు తెలియకుండా చేయగల శక్తి దాని భావజాలానికి ఉన్నది. దీని వల్ల ఫాసిస్టులు చేస్తున్న దుర్మార్గాలన్నీ మనకు సరిగా తెలియడం లేదు. అవి ఎట్లా వక్రీకరించబడుతున్నాయో అర్థం కావడం లేదు. వాటిలో కొన్ని దాచివేయబడుతున్నాయి. వాటిని బైట పెడితే ప్రజలు తప్పక ఐక్యమవుతారు. దానికి కొత్త భాష కావాలి. కొత్త భావనలు కావాలి.

  1. ఎలాంటి అంశాల మీద కొత్త చర్చ చేయవచ్చు?

ఉదాహరణకు అఖండత, ఏకత, దేశభక్తి అనేవి. అవి ప్రజల కామన్‌సెన్స్‌లో ఉన్నంత వరకు ఫాసిజం ఉంటుంది. బీజేపీ దిగిపోయి వేరే పార్టీలు అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వాలు కూడా ఈ వాదనలే చేస్తాయి. దీనికి గత ఎన్నికలప్పుడు జరిగిన పుల్వామా ఘటన మీద కాంగ్రెస్‌ సహా అన్ని దాదాపు అన్ని ఎన్నికల పార్టీలు బీజేపీ వాద పరిధిలోనే ఘర్షణ పడ్డాయి. ఏకత, అఖండత, దేశభక్తి అనేవి సంఘ్ పరివార్‌కు సంబంధించినవే కాదు. అన్ని ఓట్ల పార్టీలు తమ తమ సొంత భాషలో ఈ విషయాలే చెబుతుంటాయి. వాటిని బద్దలు కొట్టాలి. అసలు పాలనాపరంగా తప్ప సాంఘికంగా, సాంస్కృతికంగా భారతదేశమనేదే లేదని చెప్పగల ఢైర్యం మనకు ఉండాలి. వాళ్లు హిందూ రాష్ట్ర స్థాపనకు ఇదే మంచి సమయం అనుకుంటున్నట్లు.. దేశమనే మిత్‌ను బద్దలు కొట్టడానికి ప్రగతిశీల శక్తులకు కూడా ఇదే మంచి సమయం. అయితే ఫాసిస్టు వ్యతిరేక శక్తులన్నిటికీ ఈ విషయాల్లో ఇదే అవగాహన ఉండదు. ఈ వైఖరులు తీసుకోవడం కొందరికి కష్టం. జనంతో ఒప్పించడం మరీ కష్టం. వెంటనే దేశద్రోహులనే ముద్ర పడుతుంది. దానికి వెరవడానికి వీల్లేదు. ఇంత కీలక సమస్యలను వాయిదా వేయడానికి లేదు. పలుచన చేసి చెప్పడం వల్ల కూడా ప్రయోజనం లేదు. వీటన్నిటితో కూడిన ప్రత్యామ్నాయ రాజకీయ, సాంస్కృతిక వ్యూహాన్ని తయారు చేసుకోకుండా ఈ దీర్ఘకాలిక విపత్తు నుంచి ప్రజలు బైటపడ్డం సాధ్యం కాదు. ఫాసిస్టు భావజాలం నిరంతరం, భారీ ఎత్తున ఉత్పత్తి అవుతున్నది. ఒక్కో కోణంలో దీనికి ప్రత్యామ్నాయాలను తయారు చేయాలి. మానవత, స్వేచ్ఛ, ప్రేమ వంటి వాటిని మారిన సామాజిక సాంస్కృతిక పరిస్థితుల్లో తిరిగి చర్చనీయాంశం చేయాలి. వాటి ద్వారా విశాల ప్రజానీకంతో సంభాషించడం తేలిక. నిజానికి జీవితంలో ఇలాంటివి కరువైపోయాయి. వక్రీకరణకు గురయ్యాయి. ఫాసిస్టు ప్రమాదాన్ని చెప్పడానికే కాదు, ఎందుకైనా సరే ఈ సహజాతాలపట్ల ఎరుక పెంచడం చాలా అవసరం. ఇవి తప్పక ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమం చుట్టూ బలమైన మావనీయ రక్షణ వలయాన్ని అల్లుతాయి. ప్రతి సమూహానికి ఉండే సంస్కృతిపట్ల ప్రేమను పెంచాలి. సంస్కృతుల మధ్య ఎలాంటి ఆధిక్యత ఉండేందుకు వీల్లేదనే సమ భావమే ఆ మనుషులను ప్రేమించడానికి దారి చూపుతుంది. లేకపోతే మనుషులందరి పట్ల ప్రేమ అనేది ఒట్టి శుష్కవాదం అవుతుంది. అట్లాగే సంస్కృతం, హిందీ ఆధిక్యతను దెబ్బతీయడానికి భారతీయ భాషా సంస్కృతులను, సాహిత్యాలను ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలి. ప్రభుత్వం గుర్తించిన భాషలనేగాక లిపి లేని భాషల ప్రత్యేకతలను బైటికి తేవాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రజలందరూ ఫాసిజాన్ని అసహ్యించుకుంటారు. ఒక రకంగా ఫాసిజం బహుళత్వాన్ని రద్దు చేయాలని చూస్తున్న ఈ తరుణంలోనే అసలైన భారతీయ బహుళత్వాన్ని, దేశీయతను సరికొత్తగా అర్థం చేసుకోడానికి అవకాశం దొరికింది. వాళ్లు చరిత్రను ధ్వంసం చేయాలని చూస్తున్న ఈ సమయంలోనే భారత ప్రజల అసలైన చరిత్రలను నిర్మించడానికి అవకాశం ఉంది. ప్రజలను తమ సొంత చరిత్రల్లోకి తొంగి చూసేలా చేయాలి. ప్రజల సాంస్కృతిక మూలాలను మళ్లీ మళ్లీ అధ్యయనం చేయడానికి ఇదొక సందర్భం. ప్రజలను ఆర్గనైజ్‌ చేయడానికి ఇట్లా ఎన్నో అవకాశాలను ఫాసిజమే ఇస్తున్నది. ఫాసిస్టులు భావోద్వేగాలను రెచ్చగొట్టవచ్చు కానీ జీవితం కఠోరమైన నిజం. ఫాసిస్టు పొలిటికల్‌ ఎనాకమీ వల్ల ధ్వంసమవుతున్న రోజువారీ ఆర్థిక జీవితం మీద కేంద్రీకరించాలి. వాళ్లు తాము హిందువులకు ప్రతినిధులమని చెప్పుకుంటారు. కానీ ఫాసిస్టుల విధానాలు ఈ దేశంలోని మెజారిటీ ప్రజలను కూడా దోచుకుంటున్నాయి. ఫాసిస్టులు సంస్కృతి వైపు నుంచి చేస్తున్న దాడిని సాంస్కృతికంగా ఎదుర్కొంటూనే రాజకీయార్థిక విధానాల మీద ఉద్యమాలు నిర్మించాలి. బహుశా ఆ రకంగా దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలకు గతం కంటే ఇప్పుడే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వర్గం, వర్గ చైతన్యం, వర్గపోరాటం ఆవశ్యకతను పాసిజం పరోక్షంగా పెంచుతోంది. దాన్ని గుర్తించగలమా లేదా? అనే ప్రశ్న వామ పక్ష విప్లవ శక్తులు వేసుకోవాలి. కార్మికోద్యమాలు పాత కాలపు జాడ్యాలను, సంప్రదాయక బలహీనతలను వదిలించుకొని సరికొత్త పునాది మీద నిర్మాణం కాగల వాతావరణం చాలా ఉన్నది. సాంస్కృతిక పోరాటాలకు, దోపిడీ వ్యతిరేక పోరాటాలకు మధ్య పోటీ లేని దశకు మనం చేరుకున్నాం.

  1. మళ్లీ సాహిత్యం దగ్గరికి వద్దాం. మనం ఉన్న ఇలాంటి పరిస్థితులు తెలుగు సాహిత్యకారులకు ఎంత అర్థమైందని చెప్పవచ్చు?

అసలే తెలియదనలేం. తెలుగు సీరియస్‌ సాహిత్యమంతా ప్రగతిశీల సాహిత్యమే. మెజారిటీ మతం పేరుతో, ఆధిపత్య కులం పేరుతో జరిగే అన్యాయాలను సగటు తెలుగు కవి, రచయిత అంగీకరించరు. వ్యక్తిగతంగా సంప్రదాయబద్ధంగా ఉండేవారు కూడా ఒక మనిషి మీద మరో మనిషి సంప్రదాయ విశ్వాసాల పేరుతో దాడి చేస్తే అంగీకరించని చైతన్యం తెలుగు సాహిత్యంలో ఉంది. కాబట్టి ఫాసిజం గురించి తెలియదనడానికి లేదు. అంత పరిమిత అర్థంలో మీరు ఆ ప్రశ్న వేశారని నేను అనుకోవడం లేదు. ఫాసిజం బేసిక్‌ పని విధానం, దాని విశ్వరూపం రచయితలకు తెలుసా? అని ప్రశ్నించుకుంటే మాత్రం సంతృప్తి కలగదు. ఫాసిజం ఇప్పుడే ఎందుకు వచ్చింది? అనే దగ్గరి నుంచి ఫాసిజం ఇప్పుడే వచ్చిందా? బీజేపీ అధికారంలోంచి పోతే పోతుందా? అనే దాకా చాలా వైపుల నుంచి చూడాలి. అంటే అసహనం, మతతత్వం, మెజారిటేరియనిజం వంటి మాటలు ఇప్పుడు సరిపోవు. ఆ దశకు ఫాసిజం చేరుకుంది. సంస్కృతి, కులం, మతం, బ్రాహ్మణవాదం, నాగరికత, ఆధునికత, దేశీయత, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, చరిత్ర, తత్వశాస్త్రం, దళారీ పెట్టుబడిదారీ సంక్షోభం వంటి ఎన్నో అంశాలతో ఫాసిజం ముడిపడి ఉన్నది. సాహిత్యకారుల్లో చాలా మందికి ఇవేవీ పెద్దగా తెలియవు. అందునా కవులకైతే మరీ. సామాజిక రాజకీయ కర్తవ్యాలతో పని చేసే సాహిత్యకారులకు, సాంస్కృతిక కార్యకర్తలకు, సాహిత్యంతోపాటు సామాజిక శాస్త్ర అధ్యయనం ఉన్నవాళ్లకు తప్ప మిగతా వాళ్లకు ఈ విశ్లేషణలేవీ ఎక్కవు. స్థూలంగా ఫాసిజం గురించి తెలుసు.

అయితే సృజనాత్మక రచన ఈ శాస్త్ర తలానికి సంబంధించింది కాదు. అది పూర్తిగా వేరే తలానికి చెందినది. సామాజిక వాస్తవాన్ని సృజనాత్మక రచయితలు ఎక్కడో అట్లా పట్టేస్తారు. గొప్పగా రాసేస్తారు. వాళ్లు సరిగ్గా ఆ పని చేశారంటే శాస్త్ర విశ్లేషణల్లో పట్టుబడని వాస్తవాలను సహితం సాహిత్యంలోకి తీసుకరాగలరు. ఆ శక్తి రచయితలకు ఉంటుంది. ఈ వైపు నుంచి రచయితలకు ఫాసిజం మీద రచన చేయగల అనుభవాన్ని, అవగాహనను సంపాదించుకోవాలి. ఫాసిజం మీద పాటలు, కవితలు వచ్చాయి, కొన్ని కథలు వచ్చాయి గాని ఫాసిస్టు వ్యతిరేక సాహిత్యం అని గట్టిగా చెప్పగల సృజనాత్మక రచనలైతే రాలేదు. వామపక్ష, విప్లవ సాహిత్య శిబిరం నుంచి ఫాసిజం మీద మంచి విశ్లేషణ రచనలు మొదటి నుంచీ వస్తున్నాయి కానీ ఫాసిస్టు వ్యతిరేక కాల్పనిక సాహిత్యం అంతగా రావడం లేదు.

  1. కళ్ల ముందు ఇంత జరుగుతున్నా కల్పనా రచనలోకి ఎందుకు రావడం లేదు..?

నిజంగానే ఇది చాలా సీరియస్‌ విషయం. అందరం ఆలోచించాలి. ప్రయత్న పూర్వకంగా పని చేయాలి. విరసంలాంటి వామపక్ష, ప్రగతిశీల సంస్థలు గతంలో ఫాసిస్టు వ్యతిరేక సాహిత్యం ఎలా వచ్చిందీ.. ఇప్పుడు ఎలా రాయాలి అని ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నాయి. వర్క్‌షాపులు నిర్వహిస్తున్నాయి. సృజనాత్మక రచయితల మధ్య ఈ విషయం ఏదో ఒక రూపంలో చర్చనీయాంశం అవుతున్నది. అయితే దీనికి తగినట్లు రచయితలు హిందుత్వ ఫాసిజం గురించి మధన పడుతున్నారా? ఏ ఇద్దరు కథకులో, నవలా రచయితలో కలిసినప్పుడు ఫాసిజం గురించి మాట్లాడుకుంటున్నారా? అందులో సాహిత్యం కాగల వస్తువు ఏమిటో, దానికి అవసరమైన శిల్పం ఏమిటో తర్కించుకుంటున్నారా? ఏ దృక్పథంతో రాస్తే మానవ జీవితంలోంచి ఫాసిజాన్ని ఎత్తి చూపగలమని వాదించుకుంటున్నారా? చాలా వరకు రచయితల కలయికలు అవార్డుల, పురస్కారాల మేళాగా మారిపోయాయి. ఎట్ల రాస్తే అవార్డు వస్తుందనే ఆలోచనలో ఉన్నప్పుడు ఫాసిజాన్ని ఎట్లా రాయాలనే మధన జరగదు. ఈ బాదరబందీకి దూరంగా ఉండే రచయితలకు కూడా ఫాసిజాన్ని కల్పనా సాహిత్యంలోకి తేవాలనే ప్రత్యేక శ్రద్ధ లేనట్లు ఉంది. ఏదైనా ఘటన జరగగానే, అది ఎందుకు జరిగిందో, దాని వెనుక సామాజికంగా, సాంస్కృతికంగా ఫాసిజం ఎట్లా ఉన్నదో తెలిసినా.. తెలియకపోయినా కవులైతే కవిత్వం రాసేస్తారు. కానీ కథలు, నవలలు అట్లా రాసేవి కాదు కదా. లోతైన పరిశీలన ఉండాలి. బోలోడు వెతుకులాట జరగాలి. దాన్నంతా జీవితానుభవంగా మలుచుకోవాలి. లేకపోతే భావోద్వేగ రచనగా అది మారదు. అట్లని కేవలం భావోద్వేగాలతోనే రాసేస్తామని ఎవరు అనుకున్నా వాళ్లు కాల్పనిక సాహిత్య రచనకు దూరంగా ఉన్నట్లే. భావోద్వేగాల రూపంలో సామాజికతను రచనలోకి తేవాలి. అది ఎంత తేగలం? ఎట్లా తేగలం? అనే ప్రశ్నలు మన ముందున్నాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిత్యం చూస్తూనే ఉంటాం.. కానీ అందులో మనకు చాలా కనిపించకుండాపోతాయి. మనం వింటూనే ఉంటాం.. కానీ మన మనసుకు ఎక్కవు. మనకు తెలిసినట్లే ఉంటుంది.. కానీ తెలియకుండా దాగిఉంటుంది…అట్లా దాపులో ఉండే వాస్తవాలను తొవ్వి తీస్తేగాని కథలు, నవలలు బైటికి రావు. అట్లాంటి అన్ని తావులా ఫాసిజం ఎట్లా పని చేస్తున్నదో, ఎందుకు అలాంటి జీవితపు మారుమూలల్లోకి సహితం ఫాసిజం వెళ్లిపోయిందో చూడగల సృజనాత్మకమైన చూపు రచయితలకు ఉండాలి. అప్పుడే విశ్లేషణ రచనలకంటే భిన్నంగా ఫాసిజాన్ని కొత్త కోణాల్లో చూపించే కథలు విరివిగా వస్తాయి. ఫాసిజం తాకిడిని నేరుగా జీవితానుభవం నుంచేగాక మన అధ్యయనం నుంచి, పరిశీలన నుంచి కూడా తెలుసుకోవచ్చు. మన రచయితలకు పాసిజం గురించి ఎంతో కొంత తెలుసు. కానీ అది సమాచారంగానే ఉండిపోతోంది. అక్కడి నుంచి సృజనాత్మక తలానికి చేరుకోవాలి. దీనికి సిద్ధాంత, రాజకీయ విశ్లేషణలతో చెప్పుకోదగ్గ పరిచయం ఉండాలి. ఫాసిస్టు వ్యతిరేకంగా ఏదో ఒక స్థాయిలో జరుగుతున్న ఉద్యమాలతో సంబంధం ఉండాలి. వీలైన వరకైనా భౌతిక ఆచరణలో ఉండాలి. ఇవి ప్రత్యేకించి ఈ తరం రచయితలకు ఉండాల్సినంత లేకపోవడంతో ఫాసిజాన్ని తెలుసుకోవానే తపన లోపించింది.

  1. చూపు.. అన్నారు కదా.. అది ఎలా ఉండాలి?

మొదట ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో కళా సాహిత్యాల పాత్ర తెలియాలి. ఫాసిజానికి-జీవితానికి, జీవితానికి-సాహిత్యానికి ఉన్న సంబంధం తెలియాలి. ఈ రెండూ తెలిస్తే స్థూలంగా సరైన చూపు ఉన్నట్లే. ఫాసిజం ప్రజల మధ్య ఇప్పటి దాకా ఉన్న సాంస్కృతిక సంబంధాలను ధ్వంసం చేస్తున్నది. మార్చేస్తున్నది. ఒకరి మీదికి ఒకరిని ఎగదోస్తున్నది. ప్రజలను ఇట్లా కృత్రిమ సమస్యల సుడిగుండంలోకి తోసేసి అన్ని రంగాల్లో స్థిరపడాలని ఫాసిజం అనుకుంటుంది. ఫాసిస్టుల హిందూ రాష్ట్ర స్థాపనా లక్ష్యం రాజకీయమైనదే కాదు. రాజ్య వ్యవస్థను హిందుత్వీకరించి సరిపెట్టుకొనేదే కాదు. సమాజం మొత్తాన్ని హిందుత్వీకరించడం అనే సమగ్ర వ్యూహం వాళ్లకు ఉన్నది. దానికి తగినట్లు మనుషుల మధ్య సంబంధాలు ఉండాలి. హిందూ రాష్ట్ర అనేది అన్ని రకాలుగా భౌతికంగా వ్యవస్థీకృతం కావాలి. మనుషుల ఆలోచనారీతులను, స్పందనలను, విలువలను సంపూర్ణంగా హిందుత్వీకరించి హిందూ రాష్ట్రను స్థిరపరచాలని అనుకుంటున్నారు. హిందూ రాష్ట్రకు తగిన మనుషులను తయారు చేయడం వాళ్ల లక్ష్యం. ఈ క్రమంలో సమాజం సోకాల్డు ఆధునికంగానే ఉంటుంది..అందులో ఏ ఆధునిక విలువా ఉండదు. ప్రజలందరూ ఫాసిస్టులు కోరుకొనే హిందుత్వ సంబంధాల మధ్య జీవించాలి. మానవులు ఏ సంబంధాల్లో ఉంటారో వాటినే పునరుత్పత్తి చేస్తుంటారు. అలాగే ఆలోచిస్తుంటారు. అప్పుడు ఫాసిజం సామాజిక దృగ్విషయంగానేకాక నైతిక ఫాసిజంగా మారుతుంది. ప్రతి ఒక్కరి మనసు ఫాసిస్టు ఆలోచనలకు తగినట్లు తయారవుతుంది. మానవ జీవితంలోని అన్ని తావుల్లో ఫాసిజం పాగా వేస్తుంది. అప్పుడు మెజారిటీ ప్రజలు ఫాసిజానికి తగినట్లు జీవించే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇంత వైవిధ్యమైన దేశంలో ముస్లింలు, దళితులు, ఆదివాసులు, మహిళలు ఏమవుతారో, వాళ్ల అస్తిత్వం ఏమిటో ఊహించడానికే కష్టంగా ఉంది. ఈ విషాద, భీభత్స స్థితి కంటే సాహిత్య వస్తువు ఏముంటుంది?

  1. సాహిత్యం కేవలం ఫాసిజాన్ని చిత్రించడమేగాక దాన్నుంచి బైట పడటం గురించి కూడా చెప్పాలి కదా.

అవును. ఆ పని సాహిత్యం తప్పక చేయాలి. మామూలుగా మనం అంటూ ఉంటాం.. సమాజమంతా ఫాసిజం ఉక్కు పిడికిళ్లలోకి వెళ్లిపోతోందని. దాని వల్ల సమాజం భయంలో కూరుకపోతుంది. ఫాసిజం లక్షణాల్లో భయపెట్టడం ఒకటి. అది మనలోని నైతికశక్తిని కూలదోయాలని చూస్తుంది. ఇలాంటి స్థితిలో సాహిత్య స్వభావం తెలిసి, ఈ కాలానికి తగిన రచన చేయడానికి సిద్ధం కావాలి. మనుషులకు ఉద్యమాలు ఒక రకంగా ధైర్యం చెబుతాయి. సాహిత్యం ఇంకో రకంగా ధైర్యం చెబుతుంది. ఉద్యమాలు బలపడని పరిస్థితుల్లో, దెబ్బ తినిపోయిన పరిస్థితుల్లో కూడా సమాజపు అంతర్గత ధైర్యం, వివేకం, సాహసం, నమ్మకం సాహిత్యం రూపంలో వ్యక్తమవుతుంది. ఇప్పటికిప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి వల్ల మన చుట్టూ భయం ఆవరించి ఉండవచ్చు. కానీ ధైర్యం అనేది మానవ ఉనికిలోనే ఉంది. మానవుల సామూహితలో ఉంది. సామాజిక చరిత్రలో ఉంది. అంత లోతుల నుంచి, అనివార్యంగా భయ విహ్వలమైన మానవులకు తెగువ సంక్రమిస్తుంది. ఈ స్థితి ఉన్నది కదా.. ఇందులోని సంఘర్షణను సాహిత్యమే చిత్రించగలదు. సామాజిక చరిత్రే తనదైన ధైర్య ప్రకటన చేయడానికి తగిన సాహిత్యకారులను ఎన్నుకుంటుంది. దీనికి సాహిత్యకారులు నిరంతరం తమలోని సృజనాత్మకతను పదునుపెట్టుకుంటూ ఉండాలి. సామాజిక సంఘర్షణల ప్రాంగణంలోకి చైతన్యవంతంగా చేరుకోవాలి. అప్పుడే చరిత్ర అవసరాలు, వ్యక్తుల సంసిద్ధతలు కలిసి గొప్ప రచనలు వస్తాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి సామాజిక సాహిత్య సందర్భంలో మనం ఉన్నాం. సాహిత్యమంటేనే నిరంతరం మారుతూ ఉండే, అనేక అంతస్తులతో సంక్లిష్టంగా తయారయ్యే సామాజికతను కాల్పనికంగా చిత్రించడం. ఫాసిజం మనుషుల్ని బలవంతంగా తాను కోరుకొనే సంబంధాల్లోకి తోసేస్తోంది. ఆ సంబంధాల్లోనే ప్రజలు జీవించాలి. ఫాసిజమనే సామాజిక రాజకీయార్థిక వాస్తవం మనుషుల సంబంధాల్లో ఎట్లా ఉంటుంది? మనిషి అంతరంగంలో ఎట్లా ఉంటుంది? సహజ మానవ స్పందనలను రద్దు చేసి ఎలాంటి అసహజ, అమానుష స్పందనలను ప్రేరేపిస్తున్నది? ఇంత అసహజ స్పందనలు కూడా మానవ సహజంగా ఎట్లా మారుతున్నాయి? అనే విషయాలపట్ల శ్రద్ధ పెరిగినప్పుడే ఎక్కడెక్కడి నుంచి మనుషులు ధైర్యాన్ని ప్రోది చేసుకోగలరో సాహిత్యంలో చెప్తుంది.

మన చుట్టూ ఉన్న ఫాసిస్టు భౌతిక పరిస్థితితోపాటు మనుషుల అంతరంగంలో, నైతికతలో, స్పందనల్లో, విలువల్లో, వైఖరుల్లో ఉండే ఫాసిస్టు అనుకూల స్థితిని సాహిత్యం చిత్రించాలి. ప్రతి సామాజిక అంతరంలో ఫాసిజం పని చేయడమేగాక, ప్రతి సంబంధంలో ఫాసిజం పునరుత్పత్తి కావడమేగాక చివరికి ప్రతి మనిషిని ఫాసిస్టు అనుకూలంగా మార్చుకోవడం అనే అత్యంత దుర్మార్గమైన పథకం వాళ్ల దగ్గర ఉంది. దాన్ని చూసే దృక్పథం ఉంటేనే ఫాసిస్టు వ్యతిరేక రచనలు చేయగలరు. అంటే ప్రతి మనిషిలో, ప్రతి సమూహంలో, ప్రతి అస్తిత్వంలో, కార్మిక వర్గంలో ఫాసిజానికి సంబంధించిన ఎలిమెంట్‌ ఉంటుంది. ఇది మానవాళిని ఎంత ప్రమాదపు అంచుల్లోకి తీసికెళుతుందో సాహిత్యం హెచ్చరించాలి. అదెంత అమానవీయమో, ప్రగతి వ్యతిరేకమో చిత్రించాలి. ఫాసిజానికి వ్యతిరేకంగా మనుషులు తమ నైతిక స్థాయి నుంచి అన్ని తలాల్లో ఎరుకపరుచుకొనే క్రమం ఎట్లా ఉంటుందో రాయాలి. అతి తప్పక ఫాసిజానికి అనుకూలంగా ఉన్న మానసికతలో మార్పు తీసుకొస్తుంది. సమానత్వం, మానవత, ప్రేమ, సహనం వంటి విలువలతో కూడిన మన:స్థితిని తిరిగి తీసుకరావడానికి దోహదం చేస్తుంది. సాహిత్యం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఇదే. మనుషుల మధ్య సంబంధాలు, వ్యక్తికి` సమాజానికి ఉండే సంబంధాలు, చివరికి వ్యక్తి అంతర్‌ బహిర్‌ అస్తిత్వాలు సృజనాత్మక సాహిత్యానికి వనరు కదా. ఫాసిస్టు వ్యతిరేక సాహిత్యం అక్కడి నుంచి బయల్దేరాలి. సాంస్కృతికంగా, రాజకీయంగా పెద్ద ప్రజా వెల్లువలు ముందో వెనుకో రావచ్చు. వాటితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి అంతరంగంలో ఫాసిస్టు వ్యతిరేక ఆలోచన, సహజ మానవ స్పందన, తార్కిక చింతన లేచి నిలబడి ప్రశ్నిస్తూనే ఉంటాయి. బైట ఫాసిస్టు ఉధృతి వల్ల అది ఒక్కోసారి అణగారిపోవచ్చు. కానీ మౌలికంగా మానవుల సహజాతాలు రద్దయిపోవు. దేనికంటే మానవతే మనుషుల అంతిమ సారం. హేతుచింతన నుంచి ఆధునిక మానవులు ఎన్నటికీ దూరం కారు. ఫాసిస్టులు మనుషులను ఆధునిక పూర్వ చీకటి కుహరంలో బంధించాలని చూస్తారు. దీనికి మనుషులు లొంగిపోయినట్లు కనిపిస్తారు. మనిషి లోపల, మానవ సంబంధాల మధ్య వీటి మధ్య సంఘర్షణ సాగుతూనే ఉంటుంది. ప్రగతిదాయకంగా మారే ఈ సంఘర్షణ మీద ఫాసిజం ఇవాళ ఇనుప పరదాలు వేయవచ్చు. అది మనుషుల్లో దిగ్భ్రాంతికరమైన అనుభవంగా మారుతుంది. కానీ లేచి కూచుంటారు. ఇది కేవలం ఆశావాదం కాదు. మానవత్వంతో ఉండటం తప్ప మరోలా ఎన్నటికీ మనుషులు ఉండలేరు. అదే ఫాసిస్టు ప్రతిఘటన. ఈ తార్కికతను కళాసాహిత్యాలు మాత్రమే చిత్రించగలవు. అయితే మనకు అలాంటి సాహిత్యం గట్టిగా రావడం లేదు. దీనికి సామాజిక కారణాలు ఉన్నట్లే సాహిత్య కారణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఏ ఏ సామాజిక అనుభవాలను, క్రమాలను, వాటిలోని అవ్యక్త రూప సారాలను ఎట్లా కథలుగా, నవలలుగా రాయవచ్చో సాహిత్య మార్గదర్శకత్వం లేదు. దృక్పథానికి సంబంధించిన రాజకీయ మార్గదర్శకత్వంతోపాటు వస్తువు ఎంపిక, కథన పద్ధతి, తద్వారా సాహిత్యీకరించడం వంటి వాటి మీద రచయితలు సొంతంగా ఆలోచించాలి. ముఖ్యంగా సాహిత్య విమర్శ ఆ దిశగా పని చేయాలి. అప్పుడు తప్పక పరిస్థితి మారుతుంది.

  1. ఫాసిస్టు వ్యతిరేక సాహిత్యమే పెద్దగా రానప్పుడు విమర్శను ఊహించగలమా?

చాలా మంది ఇలాగే అనుకుంటారు. సాహిత్య విమర్శ పాత్రను సరిగా గుర్తిస్తే ఈ సమస్యను ఇంకో వైపు నుంచి ఆలోచించవచ్చు. మన విమర్శ పరిస్థితి ఎట్లా ఉందంటే దశాబ్దాలుగా ఆ రంగంలో ఉన్నవారు కూడా అచ్చయిన రచనల గుణదోషాలు చెప్పడమే తమ పని అనుకుంటున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్లితే.. ఆ గుణ దోషాలను చారిత్రక దృష్టిలో చూసి అంచనా వేయడమే సాహిత్య చారిత్రక విశ్లేషణ అనుకుంటున్నారు. ఇవి సాహిత్య విమర్శ చేయవసిన ముఖ్యమైన పనులే. మన సాహిత్య విమర్శకుల్లో ఎక్కువ మంది వాచకంలోకి వచ్చిన అనుభవాలను, భావోద్వేగాలను, వాటి సామాజికతను, రచయిత వాటిని చెప్పిన శిల్ప ప్రత్యేకతలను బాగా వివరించగలరు. కానీ సాహిత్య విమర్శ కార్యక్షేత్రం అంతకంటే చాలా విశాలమైనది. రచయితలు అచ్చేసే పుస్తకాలకు, పత్రికల్లో వచ్చే రచనల అవతలికి సాహిత్య విమర్శ సొంత కార్యక్షేత్రం విస్తరించి ఉంటుంది. అటు రచయితలకు, ఇటు పాఠకులకు మధ్య సాహిత్య విమర్శకు ముఖ్యమైన పాత్ర ఉన్నప్పటికీ ఈ రచయితలు, పాఠకులు సమాజంలో భాగం. సమాజపు సాంస్కృతిక, భావజాల ప్రపంచమంతా సాహిత్య విమర్శ కార్యక్షేత్రమే. విమర్శ సృజనాత్మక సాహిత్యానికి అనుబంధ జీవి కాదు. పరాన్నజీవి అంతకంటే కాదు. ఒక టెక్ట్స్‌లోకి వచ్చిన సమాజాన్ని, సంస్కృతిని, భావజాలాన్ని విశ్లేషించడంతోపాటు రచనలోకి రావలసిన వాటిని కూడా సాహిత్య విమర్శ చర్చించాలి. సాహిత్యంలోకి రాని ప్రజలు, వాళ్ల జీవితం, కష్ట సుఖాలు, చాలా ఉన్నాయి. సాహిత్యంలో భాగంకాని సమాజం చాలా ఉంది. అక్కడ బతుకుతున్న ప్రజలు ఎందరో ఉన్నారు. అంటే సాహిత్యంలోకి రాని సామాజిక వాస్తవికత బైట ఎంతో ఉండిపోయింది. ఇప్పటికీ మన సాహిత్యంలోకి ముస్లింలు, క్రైస్తవుల వంటి మత ప్రజల జీవితం రావలసినంత రాలేదు. ఇక ఆదివాసులనే వాళ్లు ఉన్నారని అంతంత మాత్రం ప్రగతిశీల రచయితలకు ఎంత సోయిలో ఉంటుందో చెప్పడం కష్టం. ఇట్లాంటి జీవిత వైవిధ్యాలను, ప్రత్యేకతలను, సొంతదనాలను ఎట్లా సాహిత్యీకరించాలి? ఎట్లా కళాత్మకం చేయాలి? తద్వారా మొత్తం సమాజంలో రావలసిన మార్పుకు ఇది ఎట్లా దోహదం చేస్తుంది? సాహిత్యం వల్లనే జీవితంలో వచ్చే ప్రగతిదాయకమైన, విమర్శనాత్మకమైన మార్పు ఎట్లా ఉంటుంది? సాహిత్యం వల్లనే సామాజిక మార్పు ఎట్లా సమగ్రమవుతుంది? అనే దిశగా విమర్శ ఆలోచింపచేయాలి.

  1. విమర్శకు సొంత కార్యక్షేత్రం అనే మాట ఉపయోగించారు…

అవును. ఆ మాట గురించి అందరూ ఆలోచించాలని అనుకుంటున్నా. మనం సృజనాత్మక సాహిత్యం గురించి పట్టించుకున్నంత విమర్శ గురించి పట్టించుకోవడం లేదు. దాని మీద శ్రద్ధ పెడితే ఒక రచనలోకి వచ్చిన జీవితాన్ని, ఆ రచనలోని శిల్ప విశేషాలను, వాటికి దారి చూపిన దృక్పథాన్ని వివరించడమేగాక ఇప్పటి దాకా వచ్చిన రచనలకు బైట ఉన్న సామాజిక జగత్తుకు, సాహిత్యానికి అనుసంధాన కర్తలుగా విమర్శకులు మారిపోతారు. రచయితలకు, పాఠకులకు వారధిగా ఉండే విమర్శ కర్తృత్వం మరింత విశాలమవుతుంది. తన అసలైన కార్యక్షేత్రంలోకి వెళుతుంది. అక్కడ తానే చేయగల పని విమర్శ చేయగలుగుతుంది. సాహిత్య విమర్శ అంటే సామాజిక విమర్శే అనే సూత్రీకరణకు అప్పుడే నిండుదనం వస్తుంది. నిజానికి సాహిత్యకారులు తమ స్వీయానుభవంలో లేని జీవితాన్ని, ఉద్వేగాలను తమ సృజనాత్మకత ద్వారా సాహిత్యంలోకి తీసుకొచ్చినట్లే సాహిత్య విమర్శకులు అప్పటిదాకా సాహిత్యంలోకి రాని సామాజిక విశేషాలను శాస్త్రీయ సంవిధానంతో విమర్శలోకి తీసుకరావాలి. చారిత్రక సిద్ధాంతం, రాజకీయార్థిక శాస్త్రం, భాషా సాంస్కృతిక సిద్ధాంతాల ఆధారంగా సాహిత్య విమర్శను అభివృద్ధి చేస్తేనే ఈ పని సాధ్యమవుతుంది. అప్పుడే చీకటిలో దాగిపోయిన, క్రీనీడల్లో కనిపించకుండా పోయిన, అనేక సామాజిక, చారిత్రక వాస్తవాలను, అందులో కునారిల్లుతున్న మనుషుల, సమూహాల, వ్యక్తుల సుఖదు:ఖాలను, బలాబలాలను అన్నీ సాహిత్యంలోకి ఎలా తేవచ్చో విమర్శకులు చెప్పగలరు. మానవ సాంస్కృతిక జీవితంలోని పొరలన్నిటినీ ఎట్లా విప్పి చూడాలో చెప్పగల స్థాయికి సాహిత్య విమర్శ ఎదగాలి. అప్పుడు సాహిత్య విమర్శ మిగతా సామాజిక శాస్త్రాల స్థాయిని అందుకుంటుంది. ఇది సాహిత్య విమర్శ మౌలిక క్షేత్రం. ఇక్కడ విమర్శకులు పని చేస్తే సృజనాత్మక సాహిత్యంతోపాటు మన సంస్కృతి, భావజాలం, ఆలోచనారీతులను కూడా ప్రగతిశీలంగా తీర్చిదిద్దినవాళ్లవుతారు. అప్పుడు విమర్శ అత్యద్భుతమైన తాత్విక, సాంస్కృతిక, భావజాల, రాజకీయ ఆయుధం అవుతుంది. మామూలుగా పాఠకులకు, రచయితలకు విమర్శకులు వారధిలాంటి వాళ్లని అనుకుంటాం. వాస్తవానికి చాలా మంది పాఠకులు విమర్శకులను పట్టించుకోరు. తమ పద్ధతిలో సాహిత్యం చదువుకుంటారు. రచయితలే ఎంతో కొంత విమర్శకులను పట్టించుకుంటారు. వాళ్ల్లకు కూడా ప్రశంసలైతేనే రుచికరంగా ఉంటాయి. వెరసి విమర్శకులు ఎవరికిపట్టని వాళ్లుగా మిగిలిపోయారు. దీనికి విమర్శకులే ప్రధాన కారణం. తమ కార్యరంగాన్ని గుర్తించకపోవడం వల్ల, తమది ఒక మహత్తరమైన, విశాలమైన, విమర్శనాత్మక రాడికల్‌ స్వభావం గల సాంస్కృతిక పోరాటమని తెలియకపోవడం వల్ల ఇదంతా జరుగుతున్నది. చివరికి కవులు, రచయితలు ఎట్లా విమర్శకుల ప్రశంసలు కోరుకుంటారో అట్లే కొందరు విమర్శకులు కూడా రచయితల ప్రశంసలను, గుర్తింపును కోరుకొనే పరిస్థితి ఏర్పడిరది. రచయితలు, విమర్శకులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొనే సంబంధంలోకి వెళ్లిపోయారు. అంతకుమించి విమర్శకు సొంత పని ఏదీ లేకుండా పోయింది. విమర్శకులు దీన్నుంచి బైట పడాలి. తమ కృషికి పునాదిగా సాంస్కృతిక సిద్ధాంతాన్ని తయారు చేసుకోవాలి. ఎలాంటి సృజనాత్మక ప్రేరణల ద్వారా ఎలాంటి రచన చేయవచ్చునో, తద్వారా మనుషుల మధ్య సంబంధాలను, మనుషుల వ్యక్తిత్వాలను, అంతరంగాలను, సాంస్కృతిక వైవిధ్య ఆచరణలను చిత్రించడం ద్వారా ఏ సామాజిక వాస్తవికతను ప్రకటించవచ్చునో విమర్శకులు చెబుతూ ఉండాలి. ఫాసిజం విషయంలో ఆ పని విమర్శకుల వైపు నుంచి జరగడం లేదు. వివిధ ప్రగతిశీల, అస్తిత్వ, విప్లవ భావజాలాల వైపు నుంచి సాగుతున్న విమర్శకులు తరతమ స్థాయిలో ఇలాగే ఉన్నారు. ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో తాము భాగం కావాలని సాహిత్య విమర్శకులు గుర్తిస్తే తక్షణం ఈ పరిమితి నుంచి బైటికి రావాలి. ఫాసిస్టు వ్యతిరేక సాహిత్యోద్యమంలో విమర్శ పాత్ర చాలా పెద్దది. అలాంటి పోరాటాన్ని నిర్మించాలని అనుకున్న సాహిత్యకారులు విమర్శ మీద కేంద్రీకరించాలి. ఇప్పటికే విమర్శ రంగంలో ఉన్నవారు ఈ పోరాటానికి తగినట్లు తమను తాము సిద్ధం చేసుకోవాలి. బీజేపీ అధికారంలోంచి దిగిపోయినా భారతీయ సామాజిక, సాంస్కృతిక, భావజాల, మేధో రంగాల్లో సంఫ్‌ు భావజాలం ఆధిక్యంలోనే ఉంటుంది. దాన్ని ఎదుర్కొనేలా సాహిత్య విమర్శ తనదైన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి.

  1. ఇటీవల తెలుగులో సాహిత్య విమర్శ లేదని కొందరు అంటున్నారు. ఇంకోలాగా మీదీ అదే అభిప్రాయంలా ఉంది..

తెలుగులో సాహిత్య విమర్శే కాదు.. అసలు సాహిత్యమే లేదనే వాళ్లూ ఉన్నారు. ఇంకొందరైతే సాహిత్య విమర్శే అక్కరలేదంటున్నారు. ఇవేవీ నిజం కాదు. ఇట్లా అనేవాళ్లు తమ అభిప్రాయాలను నిరూపించుకోలేరు. తెలుగులో సాహిత్య విమర్శ చాలా ఉంది. అదే ప్రధాన రంగంగా పని చేస్తున్నవాళ్లు తక్కువ సంఖ్యలో అయినా ఉన్నారు. కొంత వేగం తగ్గినా, కుంటుపడినా విమర్శ కృషి కొనసాగుతూనే ఉంది. మామూలుగా కవులకు ఎట్లా ఉంటుందంటే ఏటా తాము అచ్చేసే పుస్తకాల మీద సమీక్షలు రాసే వాళ్లు ఉంటే విమర్శ ఉన్నట్లు. లేకుంటే లేనట్లు. ప్రచురణకర్తలూ అట్లాగే అంటారు. అసలు తమను పొగిడితేనే విమర్శ ఉన్నదని భావించే రచయితలను, తాము అచ్చేసే పుస్తకాలు బాగా అమ్ముడుపోయేలా సమీక్షలు రాస్తేనే విమర్శ ఉన్నదని అనుకొనే ప్రచురణ కర్తలను విమర్శకులు పట్టించుకోనక్కర లేదు. విమర్శ పరిధిలోకి రాని గోల అది. తెలుగులో విమర్శ లేదని సీరియస్‌గానే ఎవరైనా చర్చించదల్చుకుంటే దానికి అవసరమైన ప్రమాణాలు ప్రతిపాదించాలి. వాటి ప్రకారం విమర్శ అభివృద్ధి కావడానికి దోహదం చేయాలి. అంతేగాని విమర్శ లేదనే మాట దానికదే ఏ సమస్యనూ పరిష్కరించలేదు. మన సమాజంలాగే సాహిత్య విమర్శ కూడా ఏక మొత్తంగా లేదు. వేర్వేరు సామాజిక సిద్ధాంతాల మీద వేర్వేరు సాహిత్య విమర్శ పద్ధతులు ఉన్నాయి. వాటిలో అభివృద్ధి కావలసిన అంశాలను ముందుకు తేవాలి. అప్పుడు విమర్శ ఎలా బలపడుతుందో చెప్పాలి. నిజానికి ప్రగతిశీల, విప్లవ, అస్తిత్వ సాహిత్య విమర్శ మార్గాల ముందున్న సమస్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. వాటిని ఏ విమర్శ సంప్రదాయం ఎట్లా అధిగమిస్తుందో చూడాలి.

  1. నిర్దిష్టంగా ఫాసిస్టు సందర్భంలో సాహిత్య విమర్శ అభివృద్ధి గురించి ఎలా ఆలోచించవచ్చు?

ఇప్పుడైతే సాహిత్య విమర్శ ఫాసిస్టు వ్యతిరేక సాంస్కృతిక, భావజాల, రాజకీయ పునాదిని సంతరించుకోవాలి. వీలైనంత వెనక్కి వెళ్లి సాహిత్యంలో కుల, మత, పితృస్వామ్య ఆధిక్యతను నిలదీసిన ఆలోచనలు ఎట్లా ఉన్నాయో చెప్పాలి. సంప్రదాయ సాహిత్యంలో కూడా రచయిత భావజాలానికి భిన్నంగా ఈ నిలదీతలు, విమర్శలు ఉంటాయి. వాటికి సోర్స్‌ ఏమిటో చెప్పవచ్చు. మానవులు ఆ కాలాల ఆధిక్య భావజాలంతో ఉన్నప్పటికీ వాళ్లలో సహజమైన వివేకం, మానవత, తర్కబద్ధత, ప్రేమలాంటివి వాటికి కారణం. వాటిని వెలికి తీయాలి. ఇక దేశీ సాహిత్యంలో అయితే సనాతనధర్మానికి, కులవ్యవస్థకు, పితృస్వామ్యానికి, రాచరికానికి, భూస్వామ్యానికి వ్యతిరేకంగా పీడిత సమూహాల వ్యక్తీకరణలు కొల్లలుగా ఉంటాయి. అయితే ఇదంతా గతం. అదే సరిపోదు. ఫాసిజం ఎలా పని చేస్తున్నదో వివరించి, ప్రతిఘటనా సాహిత్యం రూపు రేఖలను వివరించాలి. అట్లాంటి రచనలు చేయడానికి అవసరమైన సాంస్కృతిక, భావజాల వాతావరణాన్ని విమర్శ తయారు చేయాలి. అంటే విమర్శకులు తమ సొంత కార్యక్షేత్రంలో పని చేయడం ద్వారా సాహిత్య సృజనకు దోహదం చేయాలి. అచ్చయిన రచనల మీద పరామర్శ, సమీక్ష, విమర్శ దగ్గరి నుంచి సమాజం, చరిత్ర కోరుకొనే సాహిత్య సృజనకు అవసరమైన మేధో, కాల్పనిక, సాంస్కృతిక వాతావరణాన్ని నిరంతరం తయారు చేస్తూ ఉండటం విమర్శకుల పని. దీని కోసం ఫాసిస్టు వ్యతిరేక సాంస్కృతిక సిద్ధాంతం తయారు కావాలి. ఈ పని చేసే క్రమంలో మొత్తంగానే విమర్శకు ఉన్న పరిమితులు తొలగిపోవచ్చు. నిజమైన విమర్శ కర్తవ్యాలు నెరవేరవచ్చు. ఈ పనికి మిగతా సాహిత్య విమర్శ పద్ధతులకంటే మార్క్సిస్టు సాహిత్య విమర్శలో ఎక్కువ అవకాశం ఉంది. దేనికంటే మార్క్సిస్టు విమర్శకు ఏకకాలంలో చారిత్రక, రాజకీయార్థిక, సాంస్కృతిక, భావజాల, కళా విమర్శగా విస్తరించడానికి తగిన సిద్ధాంత పునాది ఉన్నది. దేశీయంగా ఫాసిస్టు మూలాలను అర్థం చేసుకోగల పరికరాలు అందులో ఉన్నాయి. చరిత్రలో భాగమైన ప్రతిదాన్నీ మిగతా అన్నిటితో కలిపి చూడగల పద్ధతి ఉంది. ముఖ్యంగా దేన్నయినా దాని సకల సంక్లిష్టతల మధ్య పరివర్తనా క్రమంలో చూడగల పద్ధతి ఉంది. దీన్ని వాడుకొని తెలుగు మార్క్సిస్టు విమర్శ ఫాసిస్టు సందర్భానికి తగినట్లు సమగ్రత కోసం ప్రయత్నించాల్సి ఉన్నది.

  1. మరి ఇలాంటి విమర్శ అభివృద్ధి కావడం లేదు కదా. ఆటంకంగా ఉన్న అంశాలు ఏమిటి?

చాలా ఉండొచ్చు. ప్రస్తుతానికి ఒక విషయానికి పరిమితం అవుదాం. 1850లనాటి హితసూచిని దగ్గరి నుంచి ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రను చూస్తే ఒక్కో దశ దాటేకొద్దీ వేగం చాలా పెరిగినట్లనిపిస్తుంది. ఇది 1920ల దాకా ఒకలాగా ఉంది. ఆ తర్వాత 1970 దాకా ఒక రకమైన వేగంలో మారింది. ఆ తర్వాత గతంలో ఎన్నడూ లేనంత వేగం పుంజుకుంది. నిజానికి దీన్ని వేగం అని మాత్రమే అనలేం. విస్తృతి, లోతు, ప్రజాస్వామికీకరణ, విప్లవాత్మకత వంటి ఎన్నో భావనల వైపుల నుంచి చూడాలి. తెలుగు సాహిత్యరంగం ఈ యాభై ఏళ్లలో కూడా మూడు నాలుగు దశలుగా ఎప్పటికప్పుడు విప్లవాత్మక భావజాల పునాదిని సంతరించుకుంది. సమాజంలో వర్గపోరాటం అనేక రూపాల్లో విస్తరించడం వల్ల, ఇతర ప్రజాస్వామిక పోరాటాలు ముందుకు రావడం వల్ల, వాటి వెలుగులో భావజాల సంఘర్షణ వల్ల ఇదంతా జరిగింది. ఆ రకంగా ఇప్పుడున్న సాహిత్య ఆవరణ అన్ని రకాలుగా చాలా కొత్తది. ఇందులో భాగంగానే ఈ తరం రచయితలు సాహిత్యంలోకి అనేక తెలుగు భాషలను తీసుకొస్తున్నారు. అవన్నీ సమాజంలో ఉన్న జీవభాషలే. ఇదొక అద్భుత పరిణామం. ఇదంతా సృజనాత్మక సాహిత్యానికి సంబంధించింది. ఇట్లా ఈ సందర్భానికి తగినట్లు సామాజిక, సాహిత్య విమర్శలో తగిన భాష ఇంకా తయారు కాలేదేమో అనిపిస్తోంది. కాల్పనిక సాహిత్యంలోకి సమాజంలో ఇంత కాలంగా వివక్షకు గురైన భాషను యథాతధంగా తీసుకరావచ్చు. కానీ విశ్లేషణాత్మక భాష అట్లా రెడీమెడీగా ఉండదు. తయారు చేసుకోవాలి. మనకు వర్ణనాత్మక భాష ఉంది. సమాచారం గుదిగుచ్చి వివరించే భాష ఉంది. కానీ కన్‌సెప్చువల్‌ ల్యాంగ్వేజ్‌, ఎనలటికల్‌ ల్యాంగ్వేజ్‌ ఇంకా తయారు కావాల్సి ఉంది. అదీ ఆధునిక దృష్టితో. ఈలోగా దిన పత్రికల భాష మేధో రంగాన్ని నమిలేస్తోంది. స్ట్రీట్‌ కార్నర్‌లో ప్రసంగ భాషకు, పత్రికా భాషకు ఉన్న ప్రాధాన్యతను తక్కువ చేయడానికి ఈ మాట అనడం లేదు. చాలా అవసరం. కానీ మారిన కొత్త పరిస్థితులను అందుకోడానికి, వ్యక్తీకరించడానికి, విశ్లేషించి సూత్రీకరించడానికి తగిన భావనలు కావాలి. పద్ధతులు అభివృద్ధి కావాలి. చాలా వేగంగా, సంక్లిష్టంగా మారుతున్న సమాజాన్ని, సామాజిక అనుభవాన్ని విశ్లేషించాలి. ఈ సంక్లిష్టతను కొత్త భావనలతో, కొత్త అర్థాలతో వివరించాలి. ఈ మొత్తానికి అవసరమైన భాష కోసం ప్రయత్నించాలి. ఇక్కడ భాష అంటే పరిభాష అనే అర్థం. మొదట ఈ క్లిష్టతనంతా గుర్తించేలా, ఆ తర్వాత వివరించేలా భాష అభివృద్ధి కావాలి. అప్పుడు మాత్రమే కొత్త సవాళ్లకు తగినట్లు మన విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. ఆధునిక దృష్టితో అలాంటి భాష తయారు చేసుకుంటే సామాజిక, సాహిత్య విమర్శలో ముఖ్యమైన ఆటంకం అధిగమించవచ్చు. ఆ తర్వాత దీన్నంతా సాధారణ పాఠకులకు, శ్రోతలకు తగిన భాషలోకి మార్చాలి. ఓపికగా, శ్రద్ధగా, బాధ్యతగా ఆ పని చేయాలి. అయితే అదేమంత కష్టం కాదు. సైన్స్‌లో, టెక్నాలజీలో వస్తున్న మార్పులను, కొత్త విషయాలను చెప్పడానికి తెలుగు భాష సరిపోవడం లేదనే సంగతి అందరికీ తెలుసు. సరిగ్గా ఇట్లాగే సామాజిక రంగంలోని సంక్లిష్టమైన మార్పులను చెప్పగల హేతుబద్ధ, శాస్త్రీయ పరిభాష లేదని గుర్తించాలి. దీనికి మనం సిద్ధంగా ఉన్నామా? అలవాటైన భాషలోనే అన్నీ చెప్పి ఘోరంగా విఫలమవుదామా? ఇది తేల్చుకోవాలి. అది అధ్యయనాల్లోంచి, పోరాటాల్లోంచి తయారు కావాలి. సాంస్కృతిక సిద్ధాంతానికి అలాంటి భాష దోహదం చేస్తుంది. అప్పుడు విమర్శలోని మిగతా సమస్యలకూ దారి దొరకవచ్చు.

  1. అప్పుడైనా ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి అవసరమైన సాంస్కృతిక విమర్శ సాధ్యమేనా?

అసాధ్యమని చెప్పలేం. అయితే ఇదేదో ఇంగ్లీషు సాహిత్య విమర్శ పుస్తకాల నుంచి తెచ్చుకుంటే సరిపోయేది కాదు. మార్క్సిస్టు పద్ధతిలో దీనికి అవకాశం ఉంది. చారిత్రక భౌతికవాదం, రాజకీయార్థిక శాస్త్రం ఆధారంగా సంస్కృతిని వివరించే క్రమంలో సంస్కృతికి ఉన్న ప్రత్యేకతలను, దానికి ఉన్న సొంత ఉనికిని, పని విధానాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇందులో కొన్ని సాధారణ అంశాలు ఉండవచ్చు. కానీ సంస్కృతి మూలాల్లో, పని తీరులో, దాని నిరంతర పునరుత్పత్తిలో సమాజాన్నిబట్టి ప్రత్యేకతలు ఉంటాయి. భారతదేశంలో సనాతన ధర్మం, కుల వ్యవస్థ, వీటితో పీటముడిపడిపోయిన పితృస్వామ్యం, ఇవన్నీ కలిసిన ప్రజల సగటు మానసికత మొదలైనవి చాలా ప్రత్యేకమైనవి. అందులో కూడా మనం తెలుగు సమాజాల గురించి, సాహిత్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకొన్ని సాంస్కృతిక ప్రత్యేకతలు ఉంటాయి. వాటిని లెక్కలోకి తీసుకొని సంస్కృతిని అధ్యయనం చేయాలి. ఇది ఎక్కడా రెడీమెడీగా దొరకదు. బహుశా నమూనాలు కూడా ఉండవు. ఉన్నా కొంత వరకే ఉపయోగపడవచ్చు. మనమే సొంతంగా చేయవలసిన ప్రత్యేకమైన పని. ప్రతి భాషా సమాజానికీ అంతే. ఇలాంటి పనిని ఎత్తుకుంటే దాన్నుంచి తప్పక మార్క్సిస్టు సాంస్కృతిక సిద్ధాంతం నిర్మాణమవుతుంది. దాని వెలుగులో తెలుగు కళా సాహిత్యాల్లోని వైవిధ్యాన్నంతా వివరించవచ్చు. తెలుగు సాహిత్యంలోకి ఇప్పటికీ రాకుండా మరుగున పడిపోయిన సామాజిక రాజకీయార్థిక సాంస్కృతిక వాస్తవికతను చర్చనీయాంశం చేయవచ్చు. కొత్త శిల్ప ప్రయోగాలను, వ్యక్తీకరణలన్నిటినీ వివరించవచ్చు. ఫాసిస్టు ఆలోచనలకు ఆధారంగా ఉన్న భౌతిక, భావజాల పునాదులను వెలికి తీయవచ్చు. ప్రత్యామ్నాయ శక్తులు మన సమాజంలో ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో గుర్తించవచ్చు. ఫాసిస్టు వ్యతిరేక స్వభావాన్ని సాహిత్య విమర్శ సంతరించుకోవాలంటే జీవితంలో, సంస్కృతిలో ఫాసిస్టు క్రమాలను గుర్తించాలి. అప్పుడు మాత్రమే విమర్శ సృజనాత్మక సాహిత్యానికి ముందు, వెనుక, చుట్టూ ఉండి తనదైన పని చేయగలుగుతుంది. సృజనాత్మక సాహిత్యం వెల్లివిరియడానికి దోహదం చేస్తుంది.

(ఇంకా ఉంది…)

One thought on “ఫాసిస్టు వ్యతిరేక సాహిత్య విమర్శ బలపడాలి: పాణి

  1. If not BJP —CONGRESS //RAHUL IS P.M —BIG JOKE PANI GARU
    50 YEARS THEY RULED THE CONUTRY —ANY PROGRESS SIR
    SAHITYAM DWARA MARPU VASTHUNDHAA??

Leave a Reply