‘వాళ్లు మొదట కమ్యూనిస్టుల కోసమే వచ్చారు’

(గత సంచిక తరువాయి…)

14. విప్లవోద్యమం మీద ఇలాంటి వాదనలకు ఫాసిస్టు సందర్భం కూడా తోడైందని అనుకోవచ్చా?

ఇది చాలా ముఖ్యమైన విషయం. అయితే మన చుట్టూ ఇట్లాంటి వాదనలే కాదు. కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. గత పదేళ్లలో ఫాసిజం వల్ల విప్లవోద్యమం కొంత నష్టపోయింది. మిగతా ప్రగతిశీల శక్తులు కూడా ఎంతో కొంత నష్టపోయాయి. ఇంతకముందు దేశం ఎన్నడూ ఇట్లాంటి తాకిడికి గురి లేదు. దీని వల్ల పరిస్థితి చాలా మారిపోయింది. రాజకీయ ఆర్థిక, సాంస్కృతిక, ఉద్యమ రంగాల్లో మార్పులు వచ్చినట్లే సామాజిక మన:స్థితిలో అంతకంటే మార్పు వచ్చింది. గతంలో కూడా ఉద్యమాలు ఆటుపోట్లకు గురయ్యాయి. కానీ ఇలాంటి సామాజిక మానసికత అప్పుడు లేదు. ఉద్యమాలు దెబ్బతినడం వల్లే ఈ స్థితి వచ్చిందని చెప్పలేం. ఫాసిస్టులే దీన్నంతా తీసుకొచ్చారని కూడా అనలేం. ఫాసిజం ఆర్థిక రాజకీయ సాంస్కృతిక, భావజాల శక్తి అయినప్పటికీ, దానితో సంబంధం లేకుండా మొదటి నుంచీ జరుగుతున్న వ్యవస్థాగత పరిణామాలు కూడా ఉన్నాయి. వీటిని ఫాసిస్టు విధానాలు ప్రభావితం చేస్తున్నాయి. అయినా చాలా మంది జనాలకు దేశంలో హిందుత్వ ఫాసిస్టు పాలన నడుస్తోందని తెలియదు. ‘అనేక ప్రభుత్వాలను చూశాం.. ఇప్పుడు దీన్ని చూస్తున్నాం.. ఇదో వెరైటీ’ అనుకుంటున్నారు. ఫాసిజం మీద మన విశ్లేషణలకు ప్రజల్లో ఉండే ఈ అభిప్రాయాన్ని జోడించుకోవాలి. మన దేశంలో ఫాసిజం అంత ‘నార్మల్‌’గా నడుస్తున్నది. అంత సమ్మతి పొందింది. ఇది కొత్త విపత్తుగా కాకుండా ఒక క్రమంలో భాగంగా వచ్చిందని అనుకుంటున్నారు. ఇదంతా భ్రమ అనడానికి లేదు. ఉదాహరణకు మనదేశంలో ఎన్నికల్లో కులాన్ని వాడుకోవడం కొత్తదేమీ కాదు. ఫలానా కులాలు ఫనాలా పార్టీ ఓటు బ్యాంకు అని బాహాటంగానే మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే కొన్ని కులాలకు వ్యతిరేకంగా కొన్ని కులాలను ఆర్గనైజ్‌ చేయడం మొదటి నుంచీ ఉన్నదే. సంక్షేమ పథకాల గీటురాయి మీద ఎన్నికలు జరగడం కూడా కొత్తదేమీ కాదు. ఉచిత విద్యా వైద్యాల్లాంటివన్నీ పక్కకుపోయి ఉచితాల వాగ్దానాల మీద ఎన్నికలు జరగడం మామూలు విషయాలయ్యాయి. ఈ ట్రాక్‌ మీదికి ఇప్పుడు బీజేపీ మతంతో వచ్చింది. కార్పొరేట్ల కోసమే పూర్తిగా ప్రభుత్వాన్ని నడుపుతోంది. గతంలో కూడా ఇది ఉంది. కానీ ఇంత బాహాటంగా లేదు. ఇంకో ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్‌నే చూడండి. ఇక్కడ బీజేపీ బలంగా లేదు. అధికార, ప్రతిపక్షాలన్నీ ఫాసిస్టు పార్టీకి అనుబంధ శాఖలు. ఈ పరిస్థితిలో మనం చెప్పే ఫాసిస్టు యాక్టివిటీ ఎంత జరుగుతున్నది? వేరే మార్పులు ఎన్ని జరుగుతున్నాయి? అని చూడాలి. వీటితోపాటు మొదటి నుంచీ ఇక్కడ ఉన్న రాజకీయార్థిక, సాంస్కృతిక మార్పులు ఎంత వికృతంగా, వేగంగా సాగుతున్నాయో చూడాలి. ఇవన్నీ ప్రజల మానసికతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మనం మూసగా జనమంతా బ్రాహ్మణీయ హిందుత్వ సంస్కృతిలో కొట్టుకపోతున్నారని సూత్రీకరిస్తే ఈ పరిణామాలను కొంత వరకే వివరించగలం. ఇక్కడే ప్రగతిశీలశక్తుల పాత్ర ఉన్నది. ఫాసిజం మిగతా రాజకీయ సాంస్కృతిక ధోరణులకంటే ప్రమాదమని గట్టిగా చెబుతూనే.. మన దేశంలో మొదటి నుంచి సాగుతున్న వ్యవస్థాగత పరిణామాలు ఫాసిస్టు ధోరణులు ఎక్కడ కలుస్తున్నాయో వివరించాలి. వాటిని ఎక్కడ వేరు చేసి చూడాలో చెప్పాలి. వీటిలో ప్రజల మానసికతను ఏది ఎంత ప్రభావితం చేస్తున్నదో అంచనా వేయాలి. ప్రజల మానసికతను హిందుత్వతోపాటు మొత్తంగానే మన వ్యవస్థాగత పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి. ఇవి మన మేధో రంగాన్ని అంతకంటే ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి.

ప్రజా ఉద్యమాల స్థితిగతుల మీద వస్తున్న అనేక వాదనలను ఈ వైపు నుంచి కూడా చూడాలి. మీ ప్రశ్నకు ఈ ప్రాధాన్యత ఉంది. ఫాసిజానికి వ్యతిరేకంగా ఇప్పటి దాకా ఏ పనీ జరగలేదనే వాళ్ల దగ్గరి నుంచి, అసలు దేశంలో ఫాసిస్టు వ్యతిరేక శక్తులు ఉన్నాయా? అనే కొసకు దాకా వెళ్లి ఆలోచించేవాళ్లు ఉన్నారు. సామాజిక మానసికతలోనే వచ్చే మార్పులు సగటు మేధో రంగాన్ని కుదిపివేస్తాయి. వాటిని అధిగమించి, జన జీవితపు లోతుల నుంచి, ఉద్యమాల ఆచరణ లోపలి నుంచి చూడగలమా? లేదా? అనే సవాలు ఇవాళ ఉన్నది. దీని ప్రభావం ఎట్లా ఉంటుందంటే ఏ ఒక్క విషయం మీద స్థూలంగా అయినా మేధావులకు ఏకాభిప్రాయం ఉండటం లేదు. కలిసి ఆలోచించడం లేదు. దీన్నంతా ఆలోచనా పద్ధతుల్లో డైవర్సిటీ అని సమర్థించుకోడానికీ లేదు. ఈ మొత్తంలోంచి కుదురుగా ఆలోచించడం తగ్గిపోయింది. ఉదాహరణకు ఫాసిస్టుల దాడులను వివరించగలుగుతున్నాం. ఘటనల గురించి చెప్పగలుతున్నాం. ఈ పని తేలికే. కానీ వాటిని ప్రోగ్రెస్‌ అనే లైన్‌ మీద పరీక్షించి ఆ ఘటనల పర్యవసానాలను చెప్పడం కష్టం. మన చుట్టూ ప్రతికూల భావజాలం బలపడ్డట్టే దానికి వ్యతిరేకంగా ప్రజానుకూల ఆలోచనలూ బలపడుతున్నాయి. అయితే ఇవేవీ తక్షణంగా ఫాసిజాన్ని తల్లకిందుల చేసేవి కాకపోవచ్చు. కానీ ప్రజాస్వామిక ఆలోచనలు విస్తరిస్తున్నాయి. ఇవన్నీ కలిపి చూడాలంటే మనం మళ్లీ మొదటికి వెళ్లి ఫాసిజాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం? అనే ప్రశ్న వేసుకోవాలి. ఫాసిజాన్ని సరిగా చూస్తే విప్లవోద్యమంతో సహా అన్ని ఉద్యమాల స్థితిగతులను తెలుసుకోవడం సులభం అవుతుంది. ఈ పని చేయాలంటే అనేక విషయాలను కలిపి చూడగల ఓపిక ఉండాలి. మనవాళ్లకు దేనికది విడిగా చూడ్డం వచ్చు. నిర్దిష్టంగా మాట్లాడుకొనే అలవాటు లేదు. జనరల్‌ స్టేట్‌మెంట్లు విరివిగా ఇస్తూ ఉంటారు. అవి పెద్దగా ఉపయోగపడవు. ఏ ఉద్యమాన్నయినా దాని లోపలికి వెళ్లి గతిశీలతను చూడగలిగితే బాగుండు. ఇది చాలా కష్టమైన పని. కాబట్టి ఫాసిస్టుల పనులను వివరిస్తూ ఉంటారు. మొత్తంగా దేశవ్యాప్తంగానో, ఒక్కో ప్రాంతంలోనో ఈ దశలోని విప్లవోద్యమం సహా ప్రజా ఉద్యమాలన్నిటినీ కలిపి వీటి బలాబలాలు ఇవి అని చెప్పడానికి ప్రయత్నించడం లేదు.

15. ఫాసిజం వల్ల మిగతా అన్ని ఉద్యమాలకంటే విప్లవోద్యమమే ఎక్కువ నష్టపోయినట్లుంది కదా? దీన్నెట్ల చూడాలి?

నిజమే. 2010 తర్వాత క్లాస్‌వార్‌ తీవ్రమయ్యాక ఫాసిస్టు అణచివేతలో విప్లవోద్యమం కొంత నష్టపోయింది. ఫాసిస్టులు మొదట విప్లవోద్యమాన్నే లక్ష్యం చేసుకున్నారు. జర్మన్‌ ఫాసిజానికి ఇండియన్‌ హిందుత్వ ఫాసిజానికి ఎన్నో తేడాలు ఉన్నప్పటికీ అక్కడిలాగే ఇక్కడా ‘వాళ్లు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు’. ఈ విషయంలో ఫాసిస్టులు ఎక్కడైనా ఒకటే. వాళ్లకు చాలా స్పష్టత ఉంటుంది.

ఇండియాలో ఫాసిస్టులకు మన్‌మోహన్‌ సింగ్‌ ప్రభుత్వమే కార్పొరేట్‌, కార్పెట్‌ మార్గం చూపింది. ఫాసిస్టు మోదీ సహజంగానే చాలా ముందుకు తీసికెళ్లాడు. మోదీ ఫాసిజం.. ఆయన ప్రధాని అయినప్పటి నుంచే మొదలై ఉండవచ్చు. అట్ల చూసినా ఆయన గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడే ఫాసిజం మొదలైంది. ఇంకో పక్క నుంచి ఆ కాలంలో ప్రధానిగా ఉన్న మన్‌మోహన్‌సింగ్‌ కొన్ని రంగాల్లో ఫాసిజం పెచ్చరిల్లడానికి దోహదం చేశాడు. ఆయన చేసిన పనులు బూర్జువా పాలనలో సహజంగా ఉండేవనీ, సంఘ్ పరివార్‌ చేసేవి ఫాసిజం అనీ వేరు చేయలేం. నిస్సందేహంగా బీజేపీ మిగతా అన్ని పార్టీలకంటే ప్రత్యేకమైనది. ఎక్కువ ప్రమాదకరమైనది. అదే చేస్తున్న పనులు చాలా ఉన్నాయి. అవీ ఇవీ అన్నీ కలిసి మన దేశంలో ఫాసిజం ఎదిగి వచ్చిన చరిత్ర చాలా జటిలమైనది. దీన్ని సరిగా చూడాలంటే ప్రశ్న మళ్లీ మొదటికే వస్తుంది. మనం ఫాసిజమంటే ఏమనుకుంటున్నాం… అని. ఇందులో స్పష్టత లేకుండా విప్లవోద్యమ సాదకబాదకాలు మాట్లాడుతున్నవాళ్లు ఉన్నారు. అలాంటి వాళ్లు ఫాసిజంతో విప్లవ శక్తులు చేస్తున్న బేసిక్‌ వార్‌ను పట్టించుకోవడం లేదు. అయితే విప్లవ శక్తులకు, కార్పొరేట్‌ హిందుత్వ ఫాసిస్టు శక్తులకు కొన్ని రంగాల్లో మాత్రమే తీవ్రమైన ఘర్షణ జరుగుతోంది. ఇది పరిమితే. తీవ్ర నిర్బంధమే దీనికి కారణం కావచ్చు. కానీ ఆ రంగాల్లో జరుగుతున్న ఘర్షణ చాలా కీలకమైనది. దేశంలోని మరే ప్రజాస్వామిక శక్తులు ఫాసిస్టులతో ఈ తరహాలో ఘర్షణ పడటం లేదు. ఆ రకంగా ఫాసిస్టు శక్తులను విప్లవోద్యమం కలవరపాటుకు గురి చేస్తోంది.

16. ఫాసిస్టు ప్రభుత్వానికి ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉందని అంటారు..

మన అంచనాలను, విశ్లేషణలను కాసేపు పక్కన పెడదాం. మన కళ్ల ముందు ఏం జరుగుతున్నదో చూద్దాం. ఫాసిస్టుల అణచివేతను, విధ్వంసాన్ని స్థూలంగా రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చని అనుకుంటా. ఒకపక్క కుల, మత, పితృస్వామ్య ఆధిపత్య స్వభావం వల్ల పీడిత సమూహాల మీద సంఘ్ పరివార్‌ మూకలు వీధుల్లో దాడులు చేస్తున్నాయి. హత్యలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నాయి. ఈ సాంస్కృతిక కోణంతో సహా ఇంకో పక్క రాజకీయార్థిక, సైనిక, పాలనా రంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఆధికారికంగా విధ్వంసం చేస్తున్నది. రాజ్యాంగంలోని విలువలను, ప్రక్రియలను నేలమట్టం చేస్తున్నది. ఇలాంటి వాటిలో ఒక్కో అంశాన్ని తీసుకొని మనం నిర్దిష్టంగానే మాట్లాడుకోవచ్చు. అప్పుడు ఫాసిస్టులకు ఉన్న స్పష్టత అర్థమవుతుంది.

 ఉదాహరణకు దేశంలో ఏదో స్థాయిలో జరుగుతున్న ప్రజాస్వామిక, లౌకిక శక్తుల కలయికలన్నిటిలో ఫాసిస్టు ప్రభుత్వానికి మావోయిజం కనిపిస్తోంది. అణచివేస్తున్నది. దీన్ని అణచివేత అనే అనలేం. ఆ పదం సరిపోదు. అంతగా అవతలి పక్షం విప్లవోద్యమంతో యుద్ధానికి తెగబడిరది. అది కూడా భౌతిక హింసకు సంబంధించిందే కాదు. ఈ ఫాసిస్టు యుద్ధంలో భౌతిక, బౌద్ధిక, మానసిక కోణాలు ఉన్నాయి. ఇది మావోయిస్టుల మీద జరుగుతున్న దాడి అని, దానికి మనకూ, దానికీ ఫాసిజానికీ ఏ సంబంధం లేదని అనుకోగలమా? మనం ఏమనుకుంటాం అనేదాన్ని కూడా పక్కన పెడదాం. ఆ ఫాసిస్టు యుద్ధం ప్రభావం దేశవ్యాప్తంగా విద్యార్థులు, మేధావులు, వివిధ రంగాల్లో పని చేస్తున్న ప్రజాస్వామిక వాదుల మీద పడుతోంది. ఈ ఘర్షణ లోతు, ఉద్దేశం మనకు అర్థమైందా? దీన్ని కేవలం సాకు అనుకుందామా? దేనికంటే ఫాసిజం ప్రజలను క్రియారహితులను చేస్తుంది.. విప్లవోద్యమం ప్రజల మిలిటెన్సీని తీవ్రస్థాయిలో పెంచుతుంది.. ఫాసిజం ఒకరి మీదికి ఒకరిని ఎగదోసి ప్రజల్లో విద్వేషం పెంచుతుంది. విప్లవోద్యమానికి మాత్రమే సూత్రబద్ధంగా ప్రజలందరినీ కలపగల దృక్పథం ఉంది. దేశంలో అస్తిత్వ ధోరణులు, ప్రజాస్వామిక ఉద్యమాలు ఎన్నయినా ఉండవచ్చు.. పీడిత ప్రజలందరినీ కలపే ఆచరణకు విప్లవోద్యమంలోనే అవకాశం ఉంది. ఈ సంగతి గత నలభై ఏళ్ల విప్లవోద్యమ అనుభవాల నుంచి ఎన్నయినా ఎత్తి చూపవచ్చు. అంత మాత్రన ఫాసిస్టు వ్యతిరేక శక్తులన్నిటినీ ఇప్పటికిప్పుడు ఐక్యం చేయగల భౌతికశక్తి విప్లవోద్యమానికి లేకపోవచ్చు. కానీ అలాంటి ఐక్యత ఎట్లా సాధ్యమో తెలుసు. ఆ పని చేయకుండా ఫాసిజం మొదట విప్లవశక్తులను నిర్మూలించాలనుకుంది. గత పది పదిహేనేళ్లలో సాగిన ఒక్కో అణచివేత చర్యను పరిశీలించండి. వాటి చుట్టూ ఉన్న వాస్తవాలను వాస్తవికంగా చూడండి. అట్లా చూడాలంటే ముందు వాటి మీద గౌరవం ఉండాలి. ప్రజలను భయపెట్టి అధికారం చెలాయిస్తున్న ఫాసిస్టులు విప్లవోద్యమమంటే భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు. మిగతా అన్ని ఉద్యమాల విషయంలో ఇదే చేశారు. సాయుధ రూపంలో పార్లమెంటరీ రాజకీయాలకు ఆవల ఉన్నందు వల్ల విప్లవోద్యమానికి ఈ పరిస్థితి వచ్చిందని ఎవరైనా అనుకుంటే వాళ్లకు ఫాసిస్టు వ్యూహం ఏమీ తెలియనట్లే. ఏ లౌకిక ప్రజాస్వామిక ఉద్యమం గురించయినా ఆలోచించడానికి వీల్లేని భయ వాతావరణాన్ని తెచ్చి పెట్టారు. ఏం మాట్లాడితే ఎక్కడ మీదపడి చంపేసిపోతారో, జైల్లోకి తోస్తారో అనే స్థితి ఉంది వచ్చేసింది కదా. దీనికి అర్బన్‌ మావోయిజం అనే ఒక్క మాట చాలు. ఈ పేరుతో దేశంలో గత పదేళ్లలో ఫాసిస్టులు ఏం చేశారో కనీసం సమాచారం ఒకచోట పోగేసినా చాలు. చాలా విషయాలు తెలుస్తాయి. మత, సాంస్కృతిక కోణాల్లో ఫాసిస్టులు చేస్తున్న విధ్వంసాల గురించే కాదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పర్యావరణానికి నష్టం చేసే అనుమతులు ఎట్లా ఇస్తారని ఆ రంగానికి చెందిన శాస్త్రవేత్తలు అంటే మోదీ నేరుగా వాళ్లందర్నీ మావోయిస్టులని అన్నాడు. అణచివేతకు దీన్ని సాకు చేసుకున్నారనుకొని సరిపెట్టుకుందామా? లేక మావోయిస్టు అవగాహలోని, ఆచరణలోని విస్తృతి వల్ల ఆయనకు కలుగుతున్న భయంగా భావిద్దామా? అందరినీ భయపెట్టే ఫాసిస్టుకు ఇంత భయం ఎందుకు? ఫాసిజానికి మావోయిజానికి ఈ ఘర్షణ దేనికి? అనే ప్రశ్నలు మనం వేసుకోగలిగితే బాగుండు.

మొదట గమనించాల్సింది ఏమంటే అర్బన్‌ మావోయిస్టులు అనే మాట ఒకానొక పదబంధం కాదు. వ్యూహం. ఇందులో భాగంగా ఫాసిస్టులు ఏరోజుకారోజు లేవదీస్తున్న వాదనలను చూడండి. ఆరోపణలను, ప్రచారాలను గమనించండి. అదెంత లోతైందో మీకు తెలుస్తుంది. వీటిని విప్లవోద్యమం గట్టిగానే ఎదుర్కొన్నది. అద్భుతమైన ప్రత్యామ్నాయ పోరాటాలను ఎంచుకుంది. అయినా నష్టపోయింది. విప్లవోద్యమం సరే, మిగతా ఉద్యమాల మీద అంతకంటే ఎక్కువ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కదా? వక్రీకరిస్తున్నారు కదా. మానవతా చైతన్యంతో నడుస్తున్న ఆందోళనల మీద అణచివేత సాగుతున్నది కదా. ఇలాంటి వాటి వల్ల అవి ఎంత నష్టపోయాయో ఎవరైనా అంచనా వేశారా? పోనీ, ఈ నష్టాల మధ్యనే కొత్త ఉద్యమాలు ఎన్ని వచ్చాయో చూశారా? ఈ పని చేయాలంటే నిర్దిష్టంగా ఒక్కో ఘటనను, చర్యను, పర్యవసానాన్ని పట్టించుకోవాలి. ఆ వైపే చాలా మందికి చూపు లేదు.

17. అంటే అర్బన్‌ మావోయిస్టులు అనే మాట ఒక భావజాలం అంటారా?

అవును. అదొక భావజాలం. ఫాసిస్టులు విప్లవోద్యమాన్ని భౌతికంగా దెబ్బతీయాలని మాత్రమే అనుకోరు. ఉద్యమ వ్యతిరేక భావజాలాన్ని కూడా తయారు చేస్తారు. విప్లవోద్యమం మీద ఫాసిస్టుల అణచివేతను ఖండించేవారు కూడా తెలిసీ తెలియకా ఈ భావజాలానికి లోబడి ఆలోచిస్తుంటారు. లేదా తాము నిర్మించాల్సిన ప్రత్యామ్నాయ భావజాలం ఎదగకుడా ఫాసిజం నేపథ్యంలో తామే గీతలు గీస్తారు. అందువల్ల వాస్తవాలను అరకొరగా మాత్రమే చూస్తూ ఉంటారు. గత పదిహేనేళ్ల విప్లవోద్యమ ఆటుపోట్లను ఫాసిజంతో సంబంధం లేకుండా ఎవరైనా అంచనా వేయబోతే ఘోరంగా విఫలమవుతారు. విప్లవోద్యమం నష్టపోవడానికి ఫాసిస్టు దాడి కారణం అని గమనించలేని వాళ్లలో కొందరు విప్లవ సిద్ధాంతంలో కారణాలు వెతుకుతారు. ఇంకొందరు అసలు ఇక ఇది విప్లవాల కాలం కాదని తీర్మానించుకుంటారు. ఫాసిజం ఇవాళ భారతదేశపు ప్రస్తుత చారిత్రక యుగావధికి సంబంధించిన కీలక సమస్య. ప్రగతిశీల శక్తులన్నీ కనిష్ట స్థాయి నుంచి గరిష్ట స్థాయి దాకా ఫాసిస్టు వ్యతిరేక పోరాటాన్ని చేపట్టాలి. విప్లవ, ప్రజాస్వామిక ఉద్యమాలకు ఆటంకంగా ఉన్న అన్ని రకాల శక్తులను లోతుగా చూడాలి. కులం, మతంలాంటివి విప్లవ శక్తుల పురోగమనాన్ని ఎంత అడ్డగించేదీ అందరికీ అర్థమైంది. ఫాసిజం ఇంతగా ముదరడానికి ముందు నుంచే విప్లవ శక్తులు అప్పుడున్న అవగాహన మేరకైనా ఈ సమస్యలను గుర్తించాయి. పోరాడాయి. అయితే ఒక పద్ధతి ప్రకారం నిర్ణయాత్మక పోరాటంగా మలిచి ఉండకపోవచ్చు. ఈ లోపం ఇతర ప్రజాస్వామిక శక్తుల్లో కూడా ఉన్నది. అందువల్ల అన్ని ఉద్యమాలు ఎంతో కొంత నష్టపోయాయి. ఇంకా బాగా చెప్పాలంటే సమాజమే నష్టపోయింది. అనేక మార్గాల్లో జరుగుతున్న ప్రజాస్వామికీకరణ ముందుకు తీవ్రమైన సవాళ్లు వచ్చాయి.

18. వీటన్నిటి వల్ల మనం ప్రగతి అని, అభ్యుదయమని పని చేస్తోంటే సమాజం రివర్స్‌లో పోయినట్లుంది కదా?

హిందుత్వ ఫాసిజానికి ఆ లక్షణం ఉంది. అయితే ఫాసిజం ఏ విషయాల్లో సమాజాన్ని వెనక్కి తీసికెళ్లాలనుకుంటోంది? ఏ విషయాల్లో యథాతధ స్థితిని పట్టి ఉంచాలని అనుకుంటోంది? అనేది కూడా చూడాలి. సంఘ్ పరివార్‌ వేలాది సంస్థలను, శాఖలను తయారు చేసుకోవడం, కోట్ల మందితో కర్రసాము, కత్తిసాము చేయించడం, రెండు సీట్లు నుంచి 80 సీట్లకు, అక్కడి నుంచి అధికారంలోకి చేరుకోవడం అనేవి కేవలం డాటానే కాదు. ఇదొక ఫినామినా. ఇది ఈ నలభై ఏళ్లకో, వందేళ్లకో సంబంధించింది. వలస, ప్రత్యక్ష వలసానంతర రాజకీయార్థిక వ్యవస్థలోంచి పుట్టిన హిందుత్వ ఫాసిజానికి వేల ఏళ్ల బ్రాహ్మణీయ మూలాలు ఉన్నాయి. అందుకే దీన్ని సుదీర్ఘమైన మన సామాజిక సాంస్కృతిక పరిణామాల్లోంచి చూడాలి. మన సామాజిక ప్రగతిలోని ఏ చిక్కుముళ్ల నుంచి ఫాసిజం వచ్చిందో చూడాలి. అప్పుడే మనం ఫాసిజం మీద పాపులర్‌ విమర్శలతో సరిపెట్టుకోం. ఉదాహరణకు ఫాసిస్టులు మన సమాజాన్ని మధ్య యుగాలకు తీసికెళ్తున్నారని కొందరు అంటుంటారు. వాళ్ల పనులు అట్లాగే ఉన్నాయి. ముఖ్యంగా హిందూ రాష్ట్ర అనే భావనలో సామాజిక చరిత్రను రివర్స్‌ చేయాలనే వ్యూహం ఉన్నట్లనిపిస్తుంది. కానీ మొత్తంగా వెనక్కి తీసికెళ్లగలరా? వాళ్లేం చేయగలరంటే భారతీయ సంస్కృతి పేరుతో సనాతన సంస్కృతి దగ్గరికి తీసికెళతారు. దాన్ని గౌరవంగా, నమ్మకంగా ఆచరించే సగటు మానసికతను తయారు చేస్తారు. రోజువారి జీవితంలో హిందుత్వను తీసుకొస్తారు. ఇదంతా కలిసిన వికృత సాంస్కృతిక ప్రపంచం ఏర్పడుతుంది. ఇది కేవలం రోజువారీ ప్రజా జీవితంలోనే కాక, రాజకీయ సామాజిక విషయాల్లోకి, సంస్థలలోకి చేరుతుంది. అట్లా వెనక్కి తీసికెళ్లాలనే వ్యూహం వాళ్ల దగ్గర ఉంది. అయితే రాజకీయార్థిక వ్యవస్థను తిరిగి చేతి వృత్తుల దగ్గరికి, కులాధారిత ఉత్పత్తి విధానం దగ్గరికి తీసికెళ్లలేరు. పాత భూస్వామ్యంలోకి మళ్లించలేరు. చరిత్ర దీనికి అనుమతించదు. ఫాసిస్టుల ప్రయోజనాలకు ఇప్పుడున్న కార్పొరేట్‌ ఆర్థిక వ్యవస్థ ఉండాల్సిందే. అది ఇంకా ముదిరిపోవాల్సిందే. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భాగంగా కొనసాగాల్సిందే. మరిన్ని కొత్త దోపిడీ రూపాలతో ఈ దళారీ పెట్టుబడిదారీ వ్యవస్థ ఇంకింద దుర్మార్గంగా తయారు కావాల్సిందే. ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు రావడానికి వీల్లేదు. చిన్నచిన్న మార్పులతో యథాతధ స్థితి కొనసాగాల్సిందే. అట్లని ఫాసిస్టులు మతాన్ని వాడుకొని సమాజం మీద దాడి చేయడం కేవలం దోపిడీ కోసమే కాదు. నిర్దిష్టమైన సాంస్కృతిక, భావజాల లక్ష్యం కూడా వాళ్లకు ఉన్నది. ఏ సమాజమైనా ముందుకుపోవడానికి సాంస్కృతిక, భావజాల రంగాల్లోని కొత్త ఆలోచనలు దోహదం చేస్తాయి. వాటిని అడ్డుకోడానికి కూడా హిందుత్వ అనే పేరుతో పాత కాలపు సంస్కృతిని లేవదీస్తున్నారు. అంత మాత్రాన పరిశుద్ధమైన పాత సంస్కృతిని వాళ్లు స్థాపించలేరు. గత సంస్కృతి మీద వాళ్లకు ఎంత మోజు ఉన్నా సమాజాన్ని అక్కడికి తీసికెళ్లలేరు. అది వర్తమానంలోకి యథాతధంగా రాలేదు. దేనికంటే ఆర్థిక రంగంలోని కార్పొరేట్‌ రాజకీయార్థిక వ్యవస్థ కూడా తనదైన సంస్కృతిని తయారు చేసుకుంటుంది కదా.. దీనితో సంబంధం లేకుండా ఫాసిస్టులు కోరుకొనే హిందుత్వ సనాతన సంస్కృతి ఒంటరి ద్వీపంలో ఉనికిలో ఉండలేదు. వాళ్లు ఈ వర్తమాన సాంస్కృతిక ప్రపంచంలో హిందుత్వ మానసికతతో జీవించేలా మనుషులను తయారు చేయగలరు. ఈ మేరకు సంఘ్ పరివార్‌ తన హిందూ రాష్ట్ర లక్ష్యానికి తగినట్లు పాత సంస్కృతి బలోపేతం చేస్తుంది. దీన్ని ప్రజల రోజువారీ సాంస్కృతిక జీవితం దగ్గరి నుంచి చాలా చోట్లకు తీసికెళుతుంది. కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభిస్తూ యాగాలు చేయడం, రాజదండాన్ని ప్రతిష్టించడం అన్నీ ఇట్లాంటివే.

మొత్తం మీద ఫాసిస్టులు సమాజాన్ని గతంలోకి తీసికెళ్లాలనుకుంటున్నారా? లేక వర్తమాన చారిత్రక పరిస్థితుల్లో హిందుత్వ సాంస్కృతిక నైతిక, మానసిక జీవితాన్ని పునర్నిర్మించాలని అనుకుంటున్నారా? అనే రెండు ముఖ్యమైన కోణాలు ఉన్నాయి. సమాజాన్ని వెనక్కి తీసికెళతామని ఎవ్వరూ బాహాటంగా చెప్పలేరు. మనదైన పాత సంస్కృతిలోకి వెళదామని పిలుపు ఇవ్వలేరు. అట్లా ఇచ్చి వర్తమాన సమాజాన్ని ఎవ్వరూ పట్టుకోలేరు. ఎంత సుదూరంలో ఉండనీగాక ఒక కొత్త సమాజాన్ని స్థాపించుకుందామనే పిలుపే ప్రజలను కదిలిస్తుంది. ముస్లిం మత, ఆధ్యాత్మిక, సాంస్కృతికతల వల్ల హిందూ మతం నాశనమైపోయిందనే కట్టుకథ చెప్పి, ముస్లింలతో సహా అందరూ హిందుత్వ మనస్తత్వంలోకి, సంస్కృతిలోకి వచ్చి తాము చెప్పినట్లు జీవించాల్సిందే అంటున్నారు. ఇది వాళ్ల ముందున్న లక్ష్యం. దీన్ని సాధించడానికి వాళ్లు చేయరాని పనులు చేస్తున్నారు. వాటి వల్ల తీవ్రమైన నష్టాలు జరుగుతున్నాయి. వీటిని అభ్యుదయం కోసం మనం చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకోలేకపోవచ్చు. మనం ప్రస్తుతానికి బలంగా లేకపోవచ్చు. అంత మాత్రాన వాళ్లు చరిత్రను రివర్స్‌లో తీసికెళ్లలేరు. ఈ చారిత్రక దృష్టి లేకపోతే ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో మనం నిలవలేం. ఫాసిస్టులు మన చారిత్రక దృష్టిని కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. దాన్ని కోల్పోకుండా పోరాడాలి.

19. మీరు చెప్పినదాని ప్రకారం ఫాసిస్టులు సమాజాన్నంతా గతంలోకి తీసుకపోలేకపోవచ్చుగాని యథాతధ స్థితినైతే మెయిన్‌టెయిన్‌ చేస్తారు కదా? దానికి సమాజంలో ఏవి అనుకూలంగా ఉన్నాయి?

ఇప్పుడు ఇదే అతి పెద్ద సమస్య. గతంలోకి తీసికెళ్లడానికి, లేదా గత సంస్కృతిని పునర్నిర్మించడానికి సంఘ్ పరివార్‌ చేస్తున్న ప్రయత్నాల మీద వస్తున్నంత విమర్శ యథాతథ స్థితిని పట్టి ఉంచే ధోరణుల మీద రావడం లేదు. ఈ రెంటికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. లోపలి, బైటి కారణాల వల్ల భారత సమాజం అనేక మలుపులు తిరిగింది. గతంతో పూర్తి తెగతెంపులు జరగకపోయినా చాలా మార్పులు జరిగాయి. కొత్తవి చాలా తోడవుతున్నాయి. అయినా పాత సంస్కృతి, భావజాలం అనేక రూపాలు మార్చుకుంటూ కొనసాగుతున్నాయి. ఇవేవో పాత నాగరికతకు సంబంధించినవని, లేదా ఉపరితలానివి అని అనుకుంటే పొరబాటే. ఇవి ఉనికిలో ఉండటానికి ఆర్థిక వ్యవస్థలో, రాజ్యంలో భౌతిక ఆధారం ఉంది. యథాతధ స్థితికి సమాజంలో అనుకూలంగా ఏమున్నాయని మీరు అడిగారు కదా. మన సామాజిక సాంస్కృతిక వ్యవస్థల్లోనే అలాంటి అనుకూలత ఉంది. ఇదంతా కలిసి భారత సమాజం ఎంత చలనశీలంగా ఉన్నా గెంతులాంటి మార్పు రావడం లేదు. కీలకమైన మార్పులకు యథాతధ చట్రానికి మధ్య రాపిడిలోంచి భారతదేశ చరిత్ర కొనసాగుతున్నది. అందులో చాలా వేగం కూడా ఉంది. కాకపోతే ఇది ఎక్కడా రాడికల్‌ గెంతుగా మారడం లేదు. ముఖ్యంగా సామాజిక సాంస్కృతిక రంగాల్లో. ఆర్థిక రంగంలో ఉత్పాదకత విపరీతంగా పెరగవచ్చు. పెట్టుబడిదారీ ధోరణులు బలపడవచ్చు. ఊహించలేని పరిణామాలు జరిగి ఉండవచ్చు. కానీ ఏ రంగంలో కూడా గెంతులాంటి మార్పుకు ఆస్కారం లేని పీటముడి పడిపోయింది. ఆధునిక పూర్వ వ్యవస్థల వల్లే కాదు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థల వల్ల కూడా ఈ పీటముడి మరింత జటిలమైందే తప్ప వదులు కాలేదు. అది ఎంత వికృతమైందంటే ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్యమాల పక్క నుంచే యథాతధ వాదం తాజాగా పుట్టుకరాగలదు. ప్రజాస్వామ్యం అనేది నిరంతర ప్రగతిశీల మార్పు క్రమం. ఫాసిజాన్ని ఓడించి దాన్ని సాధించాల్సిందే. ఫాసిస్టు వ్యతిరేక పోరాటం రూపంలోనైనా ఉన్న పార్లమెంటరీ వ్యవస్థలనైనా కాపాడుకొనే ఆకాంక్షలతో మొదలవుతుంది. ఇది బలపడితే ఉదారవాద బూర్జువా ప్రజాస్వామ్యం వీలైనంత నిలదొక్కుకొనే అవకాశం ఉంటుంది. దీన్ని సాధించాలంటే ఇండియన్‌ ఫాసిజాన్నే గాక ఇండియన్‌ ప్రజాస్వామ్యాన్ని చాలా క్రిటికల్‌గా చూడాలి. 20వ శతాబ్దపు యూరప్‌ ఫాసిజానికంటే ఇప్పడు మన దేశంలో వచ్చిన ఫాసిజం చాలా భిన్నమైనదని చాలా మంది గుర్తిస్తున్నారు. అంతే ఇండియన్‌ డెమోక్రసీని విమర్శనాత్మకంగా చూస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఇది లేకపోతే భారతీయ ఫాసిజం అర్థం కావడం కష్టం. భారతీయ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సమాజంలోని మౌలిక వైరుధ్యాలను పరిష్కరించి తన యుగ ప్రకటనను నిజం చేసే సత్తా ఉన్నదా? ఆ దిశగా కనీస ప్రయత్నం చేయగల స్వభావమైనా ఉన్నదా? ఉంటే ఎంత ఉన్నది? అనేవి చాలా సీరియస్‌ ప్రశ్నలు. సమాజంలో మార్పు సంగతేమోగాని యథాతథ స్థితిని పట్టి ఉంచే స్వభావం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పుష్కలంగా ఉంది. కొన్ని ముఖ్యమైన మార్పులకూ, యథాతధ స్థితికీ మధ్య భారత ప్రజాస్వామ్యం లోలకంలా తిరుగుతూనే ఉంది. రాజ్యాంగంలోని ప్రజానుకూల విలువల గీటురాయి మీద ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి అవకాశం ఉంటుంది. అదే పోరాటంలోంచే రాజ్యాంగవాదం తలెత్తే అవకాశమూ ఉంటుంది. రాజ్యాంగ విలువలను ధ్వంసం చేస్తున్న ఫాసిస్టు సందర్భంలోంచి రాజ్యాంగవాదం పుట్టి అది కూడా యథాతధ స్థితికి కారణం అవుతుంది. ఆ రకంగా ఫాసిస్టులు ప్రధానంగా రాజకీయార్థిక రంగాల్లో యథాతధ దోపిడీ స్థితిని చక్కగా మెయిన్‌టెయిన్‌ చేయగలరు. ఈ విషయంలో ఉదారవాదులకు పెద్దగా సమస్య ఏమీ ఉండదు. కానీ విప్లవ వామపక్షవాదులు చాలా మెలకువగా ఉండాలి.

20. ఫాసిస్టు కాలంలో రాజ్యాంగ విలువల పరిరక్షణకు, రాజ్యాంగవాదానికి తేడాను ఎలా చెబుతారు? 

ఫాసిస్టు కాలంలోనే కాదు. భారత సమాజంలో రాజ్యాంగ విలువల పరిక్షణకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. అయితే రాజ్యాంగ విలువల పరిరక్షణకు, రాజ్యాంగవాదాని మధ్య చాలా పెద్ద తేడా ఉంది. అయితే అది ఎంత సున్నితమైందంటే.. రాజ్యాంగం పట్ల క్రిటికల్‌గా ఉండాలని అంటే అస్తిత్వవాదులకు ఎంత కోపం వస్తుందో అంతకంటే ఎక్కువ ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమకారులకు కూడా వస్తుంది. కానీ అది అతి ముఖ్యమైన రాజకీయ విషయం. ఈ మాట వినే పరిస్థితి ఉండదు. పైగా రాజకీయాలు తెలియకపోబట్టే రాజ్యాంగవాదం అనే మాట అంటున్నారు.. అని కూడా విమర్శించవచ్చు. ఇంకొంత మంది అయితే రాజ్యాంగ విలువలు ఇంత సంక్షోభంలో పడినప్పుడు ఈ చర్చలు అవసరమా? అనవచ్చు. అయినా సరే ఇది రాజకీయ సమస్య కాబట్టి వదిలిపెట్టడానికి లేదు. పైగా ఈ అవగాహన ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమానికి నష్టం చేసేది కాదు. దీర్ఘకాలికగా సాగవలసిన ఆ పోరాటానికి మేలు చేసేదే. సంప్రదాయవాదులే యథాతధ స్థితిని కోరుకుంటారని అనుకోవడం భ్రమ. పరంపరాగతమైన లౌకిక, సహజీవన విలువలను కాపాడుకోవాలనే ప్రయత్నాల నుంచి కూడా బై ప్రొడక్ట్‌గా యథాతథ ధోరణి తలెత్తుతుంది. అక్కడి దాకా ఎందుకు? సమాజంలో అనేక మార్పుల కోసం జరిగిన పోరాటాల నుంచి ఆవిర్భవించిన విలువల ఆధారంగా తయారైన రాజ్యాంగమే ఆ తర్వాత మార్పుకు ప్రతిబంధకంగా మారుతుంది. చిన్న చిన్న మార్పులు ఎన్ని వచ్చినా మౌలికమార్పుకు అదే పెద్ద గుదిబండ అవుతుంది. యథాతధ స్థితికి రక్షణ కవచంలా రాజ్యాంగం మారుతుంది. రాజ్యాంగం పీడిత సమూహాలకు రక్షణ చట్టాలను ఇచ్చినా, ప్రాథమిక హక్కులను, ఆదేశిక సూత్రాలను ప్రకటించుకున్నా వర్గపరంగా అది యథాతథ స్థితిని పట్టి ఉంచుతుంది. భారత సమాజం ముందున్న అతి ముఖ్యమైన చిక్కుముడి ఇది. డెబ్బయి ఏళ్లుగా మన దేశంలో రాజ్యాంగం వల్ల చాలానే మార్పులు వచ్చాయి. కానీ ఈ చిక్కుముడి వీడలేదు. ఇంకా కొత్త ముళ్లుపడుతున్నాయి. దేనికంటే పాలకవర్గానికి రాజ్యాంగయంత్రం మీద అధికారం ఉన్నంత వరకు రాజ్యాంగం యథాతధ దోపిడీ ఆధిక్యాలకు సాధనంగానే ఉంటుంది. ఈ విమర్శనాత్మకత లేనప్పుడు రాజ్యాంగవాదం పుట్టుకొస్తుంది. ఈ విచిత్రం అన్ని దేశాల్లో ఉన్నదే. ఇండియాలో అది ఇంకా చాలా జటిలంగా మారింది. అది ఇండియాలోని రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలోని కీలక వైరుధ్యాన్ని సూచిస్తుంది.

ఈ వైరుధ్యంలోంచి మౌలిక మార్పు కోసం ప్రయత్నాలు ఎట్లా జరుగుతున్నాయి? రాజ్యాంగం అనుమతించిన మార్పులు జరుగుతూనే యథాతధ స్థితి ఎట్లా కొనసాగుతున్నది? అనే వాటిని చూడాలి. ఈ మాట అంటే రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్న ఫాసిస్టులకంటే రాజ్యాంగవాదులకే ఎక్కువ ఆగ్రహం వస్తుంది. ఇది సహజమే. ఆశ్చర్యపోనక్కర లేదు. అట్లని ఆ ఇద్దరూ ఎన్నటికీ ఒక్కటి కాదు. వాళ్లు పూర్తి భిన్నమైన శక్తులు. విప్లవోద్యమానికి ప్రాసంగికత లేదనే వాళ్లలో రాజ్యాంగవాదులు కొందరు ఉన్నారు. వాళ్లు అనే చాలా మాటల్లో ఇదొకటి.

రాజ్యాంగవాదులు రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని చూస్తారు. ఇది చూడటానికి బాగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఫాసిస్టు సందర్భంలో. విప్లవకారులు ఫాసిస్టుల బారి నుంచి రాజ్యాంగంలోని ప్రజానుకూల విలువల పరిరక్షణకు పాటుపడుతూనే మౌలిక మార్పుకు ఆటంకంగా ఉన్న రాజ్యాంగ వ్యవస్థలను పక్కకు తోసి ముందుకు వెళతారు. ఈ రెంటికీ మధ్య తేడా చాలా ఉంది. రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణకు అవసరమైన తక్షణ పోరాటంలో విప్లవకారులు ముందుంటారు. కానీ పైన చెప్పిన వ్యూహాత్మక తేడాను మర్చిపోరు. ఇక్కడే నేను చెప్పాలని అనుకుంటున్న ఇంకో విషయం ఏమంటే.. వ్యవస్థను మౌలికంగా మార్చే విప్లవోద్యమానికి ప్రాసంగికత లేదని చెప్పే ధోరణి నేరుగా ఫాసిజం వల్లనే తలెత్తలేదు. ఇక్కడ ఉన్న యథాతధ స్థితి, రాజ్యాంగవాదం నుంచే ఈ భావజాలం పుట్టుకొచ్చింది. దాని ప్రభావంలో ఉన్నవాళ్లు ఇతరేతరంగా ప్రగతిశీలంగా ఆలోచించినా విప్లవం దగ్గరికి వచ్చేసరికి దానికి ప్రాసంగికత లేదని అంటారు. ఇది వ్యక్తుల సమస్య కాదు. ఆ రాజకీయాల నుంచి, భావజాలం నుంచి పుట్టే వ్యూహాత్మక వైఖరి.

21. ఇదంతా నిజమే కావచ్చు కానీ ఫాసిజాన్ని ఎదుర్కొని ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలనే ఆకాంక్ష బలంగా వినిపిస్తోంది.

ఆ ఆకాంక్ష చాలా విలువైనది. ఫాసిజాన్ని ఉదారవాద విలువలు, ఆదర్శాల వైపు నుంచి ఎదుర్కోవాలనే వాళ్లు దేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ల పాత్ర చాలా ఉంటుంది. కానీ ఒక ముఖ్యమైన సమస్య ఉంది. ఆచరణలో ఉదారవాద ప్రజాస్వామ్యం ఎలా ఉన్నదో, ఎంత ఉన్నదో, దానికి ఉన్న అవరోధాలు ఏమిటో క్షేత్రస్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు పరిశీలించాలి. ఈ విమర్శనాత్మక వైఖరికీ రూపంలో ఉన్న కొద్దిపాటి ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని కూడా ఫాసిస్టులు ధ్వంసం చేస్తున్న సమయంలో దాన్ని కాపాడుకోవాలనే అకాంక్షకు మధ్య వైరుధ్యం ఏమీ లేదు. అసలు ఇండియాలో ఉదారవాద ఆదర్శాలను గత డెబ్పై ఏళ్లలో అన్ని ప్రభుత్వాలు శక్తిమేరకు ధ్వంసం చూస్తూ వచ్చినవే కదా. 2014 నుంచి బీజేపీ చేస్తున్న విధ్వంసంతో పోల్చితే గతంలో జరిగింది చాలా తక్కువే. కానీ విస్మరించడానికి వీల్లేదు. ఒక వేళ బీజేపీ ఓడిపోయినంత మాత్రాన దేశంలో ఉదారవాద ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడుతుందా? రాహుల్‌గాంధీ ప్రధాని కాగానే ఉదారవాద ప్రజాస్వామ్యం వచ్చేసిందని అనుకోగలమా? ఈ సందేహం నుంచి ఊరడిరపు కోసం మనం రాహుల్‌గాంధీ తన పూర్వీకుల వంటి వాడు కాదని అనుకోవాలి. ఆయన కొత్త తరహా కాంగ్రెస్‌ను ఆయన స్థాపిస్తున్నాడని విశ్వసించాలి. అప్పుడు మాత్రమే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో, లేదా ఆ పార్టీ చుట్టూ ఏర్పడే కూటమి నేతృత్వంలో ఉదారవాద ప్రజాస్వామ్యం వస్తుందని నమ్మగలం. దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? సమాచారం ఉన్నదా? నిర్దిష్టంగా ఈ చర్చ చేస్తే ఇలాంటి నమ్మకాలు నిలబడతాయా? ఆలోచించాలి. దేనికంటే మన దేశంలో 1950 నుంచి సాగిన చరిత్ర అంతా ఉదారవాద ఆదర్శాలకు బూర్జువా నియంతృత్వ వాస్తవానికి మధ్య సంఘర్షణే. ప్రతి దశలో బూర్జువా నియంతృత్వమే పైచేయి సాధించిందని చరిత్ర చెబుతోంది. ఇంకో కోణంలో బూర్జువా నియంతృత్వానికి ఫాసిజానికి మధ్య సంబంధాల్లోని ఘర్షణ ఫాసిజానికి దారి తీసింది. ఈ మొత్తం చుట్టూ కొన్ని ప్రజానుకూల మార్పులు కూడా జరిగాయి. అసలు విషయం ఏమంటే.. మన దేశంలో ఉదారవాద భావాలు గట్టిగా నిలదొక్కుకోక ముందే ఉదారవాద ప్రజాస్వామ్యం అనేది అధికార మార్పిడితో వచ్చింది. ఆ తర్వాత కూడా అది చాలా వరకు భావనగానే ఉంటూ వచ్చింది. అది భౌతికశక్తిగా మారలేదు. మన రాజకీయ పాలనా సాంస్కృతిక రంగాల్లో అది ఆచరణలోకి రాలేదు. ఉదారవాద ప్రజాస్వామ్య ప్రక్రియలుగా నిలదొక్కుకోలేదు. చట్టాలు మాత్రం తయారయ్యాయి. ఇదంతా 1980, 90 దాకా ఒక రకంగా ఉండింది. ఆ తర్వాత మారిపోయింది. ఈ మార్పును ఉదారవాద ప్రజాస్వామికీకరణ అనే వాళ్లు ఉన్నారు. వాస్తవానికి ఈ మార్పులు మన ప్రజాస్వామ్యంలోని బూర్జువా నియంతృత్వాన్ని బాహాటంగా ప్రదర్శించుకుంటున్నాయి. ఇన్ని పరిమితులు ఉన్నా సరే ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి మన చరిత్రలోని ఉదారవాద ఆలోచనలు ఊతం ఇస్తాయి. ఆ విలువలు ప్రేరణగా నిలబడతాయి.

 ఈ ఫాసిస్టు వ్యతిరేక ప్రజాస్వామిక పోరాట చైతన్యంలోంచి ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని స్థాపించుకోగలమనే నమ్మకం కూడా కొందరికి ఉండవచ్చు. డెబ్పై ఏళ్లలో ఎంతో కొంత ఉదారవాద భావాలతో జీవించిన నాయకులు ఉన్న రోజుల్లోనే ఉదారవాద ప్రజాస్వామ్యానికి భౌతిక పునాది పడలేదు. ఇదొక కఠోర వాస్తవం. అసలు భారతదేశం సామాజికంగానే ఉదారవాద దశకు ఎంత ఎదిగింది? అందులోని ఎగుడుదిగుళ్ల మాటేమిటి? కనీస ఉదారవాద స్వభావం లేని పార్టీల వల్ల, పాలకుల వల్ల వస్తున్న సవాళ్లను సులభంగానే అర్థం చేసుకోగలం. కానీ మన సామాజిక దశనే అక్కడి దాకా ఎదగకుండా అడ్డుపడుతున్న వ్యవస్థాగత, ఆంతరంగిక కారణాల మాటేమిటి? సామాజిక ప్రజాస్వామ్యం ఊసే లేని ఉదారవాద ప్రజాస్వామ్యం ఉంటుందా? ఉంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ఇలాంటి ఎన్నిటి మధ్యనో భారత సామాజిక ప్రగతి చిక్కుకపోయిన ఈ సంధి దశలోంచి హిందుత్వ ఫాసిజం వచ్చింది. కాబట్టి దానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎన్నికలు జరగడం, న్యాయస్థానాలు పని చేస్తూ ఉండడం, కొద్దోగొప్పో పౌర హక్కులు ఉండటం, రాజ్యాంగానికి ఎంతో కొంత ఖాతరు ఉండటం చూపి ఉదారవాద ప్రజాస్వామ్యం ఉన్నదని అనుకోవచ్చు. ఇవే లేకపోతే ఇంకెంత దుర్భరంగా ఉండేదో ఊహించవచ్చు. ఈపాటి ‘ప్రజాస్వామ్యం’ లేని, చట్టబద్ధత లేని దేశాలను కూడా చూస్తున్నాం. ఇదే ఉదారవాద ప్రజాస్వామ్యమైతే తప్పక ఉన్నట్లే.. బీజేపీ చేతిలో అది ధ్వంసమైపోతే ఆ పార్టీని దించేసి తిరిగి నిలబెట్టుకోవచ్చు.. కానీ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. ఉదారవాద ప్రజాస్వామ్యం ఎంత గొప్పదైనా కావచ్చుగాని, దోపిడీ రద్దు గురించి అదేమీ మాట్లాడదు. అసలు దోపిడీతో దానికి పేచీ లేనేలేదు. దోపిడీని చట్టబద్ధం చేసింది. ఫాసిజానికి ఉన్న కార్పొరేట్‌ దోపిడీ స్వభావంతో అదేమీ ఘర్షణ పడదు. ఉదారవాద ప్రజాస్వామ్యంలో సామాజిక ప్రగతికి దోహదం చేసే ప్రక్రియలు ఏముంటాయో చెప్పలేంగాని దోపిడీ ప్రక్రియలు మాత్రం సజావుగా నడుస్తూ ఉంటాయి.

ఉదారవాద ప్రజాస్వామ్య భావాలు ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఎంత వరకు భాగమయ్యాయి? వాటి మీద ఆధారపడి ప్రజాస్వామికీకరణ ఎంత జరిగింది? అనేవి సైద్ధాంతిక ప్రశ్నలు కాదు. అత్యంత నిర్దిష్టమైన ఆచరణకు సంబంధించినవి. వాటిని ప్రజా జీవితంలోంచి చూడాలి. ప్రజల అనుభవంలోంచి చూడాలి. అప్పుడు ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో ఉదారవాద భావాల సముచిత పాత్రను గౌరవిస్తూనే ఫాసిజానికి ఉదారవాద ప్రజాస్వామ్యం ప్రత్యామ్నాయం కాగలదా? అనే ప్రశ్న మిగిలే ఉంటుంది. ఉదారవాద ప్రజాస్వామ్యాలు చరిత్రలో పోషించిన ప్రగతిశీల పాత్రతో సహా దానికి ఉన్న ఈ స్వభావంపట్ల స్పష్టత ఉంటే సరిపోతుంది.

22. ఇప్పుడు మీరు మాట్లాడుతోంటే అనిపిస్తోంది… ఫాసిజం గురించిన విశ్లేషణ ఏమైనా రొటీన్‌ అవుతోందా?

ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇండియన్‌ ఫాసిజం బహురూపి. నిత్యం అనేక రూపాల్లో ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. వాటన్నిటి మీద పోరాటం కూడా బహురూపాల్లో సాగాల్సిందే. వాటిలో ప్రతిదీ ముఖ్యమే. ఈ ఆలోచనలను, పోరాటాలను కలిపినంత మాత్రాన ఫాసిజం సాంతం తెలిసినట్లు కాదు. ఫాసిజాన్ని సమగ్రంగా చూడగల పద్ధతి తయారు కావాల్సి ఉన్నది. ఉదాహరణకు తెలుగు సమాజాల్లో ఫాసిజాన్ని చాలా రకాల ప్రగతిశీల శక్తులు వ్యతిరేకిస్తున్నాయి. ఎవరి పనులు వాళ్లు చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు అనేక వేదికల్లో కలిసి పని చేస్తున్నారు. ఒక్కొక్కళ్లు ఒక్కోదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందరూ కలవకపోవడానికి ఇతరేతర కారణాలు ఉన్నా ఫాసిజాన్ని అర్థం చేసుకోవడంలోని పరిమితులే ముఖ్య కారణం అనిపిస్తోంది. దీన్ని అధిగమించాలంటే ఫాసిజం ఎన్నెన్ని మార్గాల్లో వచ్చిందో చూడాలి. ప్రగతిశీల, విప్లవ శక్తులను దెబ్బతీసే వ్యూహంతో అది ఎట్లా బలపడిందో చూడాలి. ప్రగతిశీల శక్తులు తగినంత అప్రమత్తంగా లేవని విమర్శించాల్సిందే. అయితే వాటిని ఫాసిజం దెబ్బతీస్తున్నదని కూడా గమనించాలి. ఫాసిజం సరస్వతీ శిశుమందిర్‌ల నుంచి, ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల నుంచి ఫాసిజం వచ్చిందని చాలా మంది గట్టిగా విశ్లేషిస్తుంటారు. ఇది నిజమే. పాఠశాలల స్థాయి నుంచే భావజాల మార్గంలో ఫాసిజం బలపడింది. దీనితోపాటు గాంధీ హత్య, ఆర్‌ఎస్‌ఎస్‌ నిషేధం, ఎత్తివేత తర్వాత మతతత్వశక్తులు రాజకీయాల్లో చేసిన ప్రయత్నాలు చిన్నవి కావు. ఆ వైపు నుంచి చూస్తే పార్లమెంటరీ రహదారిలోంచి ఫాసిజం వచ్చిందని కూడా అర్థమవుతుంది. గుజరాత్‌లో బీజేపీ అధికారం చేపట్టే నాటికే ఫాసిస్టులు చాలా స్పష్టంగా రాజకీయార్థిక మార్గంలోంచి కూడా వచ్చారని తేలిపోయింది. వీటన్నిటి వల్ల ఇండియన్‌ ఫాసిజానికి చాలా ప్రత్యేకతలు వచ్చాయి. అంతర్జాతీయ రాజకీయార్థిక వ్యవస్థ నేపథ్యంలో కూడా ఇరవయ్యో శతాబ్ది ఫాసిజానికికంటే ఇండియాలోని బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం చాలా భిన్నమైనది. దీనికి సామాజిక సాంస్కృతిక అనుకూలతలు చాలా ఎక్కువ. అందువల్ల వచ్చిన సమ్మతి కూడా ఎక్కువ. ఫాసిస్టులు రాజకీయాధికారానికి రావడం వెనుక కార్పొరేట్లు ఉన్నట్లే, ఈ సానుకూలత, సమ్మతి కూడా ఉన్నాయి. అందుకే ఫాసిస్టులు రాజకీయాధికారంతోపాటు సామాజిక సాంస్కృతిక ఆధిక్యతను కూడా పొందారు. ఇవన్నీ కలిసి విచిత్రమైన సామాజిక మానసికత తయారైంది. ఇలాంటి అనేక కోణాల్లో ఇండియన్‌ ఫాసిజాన్ని ఇప్పుడు చూస్తున్నాం. ఇదే చాలదు. ఫాసిజం మూలాలను, ఫాసిస్టు ప్రక్రియలను సమూలంగా నిర్మూలించడానికి ఏం చేయాలి. ఫాసిజం తలెత్తడానికి ఉన్న పర్యావరణాన్నే మార్చేయాలంటే ఎలాంటి భౌద్ధిక, భౌతిక పోరాటాలు చేయాలి? అనే ప్రశ్నలు ఉన్నాయి. ఈ దిశగా తప్పక మనకు అనేక కొత్త విషయాలు తెలుస్తాయి. అట్ల కాకుండా ఫాసిజాన్ని కేవలం సంస్కృతికో, పాలనా విధానాలకో, రాజకీయార్థిక భూమికకో పరిమితం చేసి చూస్తే మీరన్నట్లు తప్పక ఫాసిజం మీద మన విశ్లేషణ రొటీన్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది.

23. సాంస్కృతిక ఫాసిజం అనే మాట ఫాసిస్టు విశ్లేషణలో ప్రధానంగా వినిపిస్తోంది కదా. ఇదేమైనా మిగతా విషయాలను చూడ్డానికి ఆటంకం అవుతున్నదా?

అట్లా కావడానికి వీల్లేదు. దేనికంటే ఒక్కో దేశంలో ఫాసిజం ఒక్కో రకంగా ఉంటుంది. సాధారణ విషయాలు కూడా ఉంటాయి. వాటిలో సంస్కృతి ఒక ముఖ్యమైన విషయం. అట్లాగే భావజాలం కూడా. అందుకే 1980ల ఆరంభంలోనే ఇండియన్‌ ఫాసిజాన్ని విప్లవోద్యమం హిందూ ఫాసిజం అని సూత్రీకరించింది. ఆ తర్వాత హిందుత్వ ఫాసిజం అనీ, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం అనీ విస్తరించింది. నూరేళ్ల కింద సావార్కర్‌ ‘రాజకీయాలను హైందవీకరించండి, హైందవాన్ని సైనికీకరించండి’ అనే ఫాసిస్టు వ్యూహాన్ని ప్రకటించాడు. ఇందులో సంస్కృతి భావజాలం కీలకంగా ఉన్నాయి. మతం, జాతి మీద ఆధారపడిన అన్ని ఫాసిజాలకంటే ఇండియన్‌ ఫాసిజానికి అత్యంత ప్రాచీనమైన సనాతన సంస్కృతి తల్లి వేరుగా పని చేస్తున్నది. కాబట్టి దాన్ని వివరించడానికి సాంస్కృతిక ఫాసిజం అనే మాట చాలా బాగా ఉపయోగపడతుంది. సంస్కృతిని, అందునా భారతదేశంలో సంస్కృతిని ఎంత లోతుగా, నిర్దిష్టంగా అర్థం చేసుకుంటే అంతగా సాంస్కృతిక ఫాసిజం అర్థమవుతుంది. అయితే ఈ ఒక్క వైపు నుంచి చూస్తే ఇండియన్‌ ఫాసిజం సమగ్రంగా అర్థం కాదు. దేనికంటే ఫాసిజం రాజకీయశక్తి. రాజకీయార్థిక శక్తి. దానికి ప్రాచీన సాంస్కృతిక మూలాలు ఉన్నప్పటికీ ఫాసిజంగా అది రంగం మీదికి వచ్చింది ‘ఆధునిక’ యుగంలో. మనం మాట్లాడుతున్నది ఇప్పుడు మన ముందున్న ఫాసిజం గురించి. ఈ కాలపు రాజకీయార్థిక వ్యవస్థలోని సంక్షోభాలతో సంబంధం లేకుండా ఫాసిజాన్ని చూడ్డానికి వీల్లేదు. ప్రపంచమంతా రెండో ప్రపంచ యుద్ధానంతరం సరికొత్తగా పెట్టుబడిదారీ సంబంధాల్లోకి, బూర్జువా పార్లమెంటరీ రాజకీయాల్లోకి వచ్చిన ఈ చారిత్రక యుగంలో మనం భారతీయ ఫాసిజం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మొత్తంలోంచి ఫాసిజాన్ని విశ్లేషించకుండా కేవలం సాంస్కృతిక ఫాసిజం అనీ, హిందూ మత ఫాసిజం అనీ అంటే ఒక ముఖ్యమైన ముఖాన్ని మాత్రమే చూసినట్లవుతుంది. నిజానికి సంస్కృతిని, ఫాసిజాన్ని సవ్యంగా అర్థం చేసుకోవాలనుకుంటే కూడా ఈ సమగ్ర చిత్రంలోకి రావాల్సిందే. రాజకీయాల వైపు నుంచి, రాజకీయార్థిక వ్యవస్థ వైపు నుంచి, సామ్రాజ్యవాదం వైపు నుంచీ ఫాసిజాన్ని చూడకపోవడం పరిమితే అవుతుంది. అంతేగాని సాంస్కృతిక ఫాసిజం అనే సూత్రీకరణ కారణమని చెప్పలేం. విప్లవాన్ని హోలిస్టిక్‌గా చూసే సంవిధానం లేని వాళ్లు ఫాసిజాన్ని కూడా సమగ్రంగా చూడలేరు. అయితే ఏదో ఒక చిన్న కోణంలో ఫాసిస్టుల మీద ఆగ్రహంతో ముందుకు వచ్చేవాళ్లు ఉంటారు. అలాంటి వాళ్లే చాల ఎక్కువ. ఫాసిజం మీద సమగ్ర దృష్టిని సంతరిచుకొనే ప్రయత్నంలో అలాంటి వాళ్లందరూ ఉంటారు. వాళ్లందరూ కలిసేందుకు దోహదం చేయాలి.

(ఇంకా ఉంది)

2 thoughts on “‘వాళ్లు మొదట కమ్యూనిస్టుల కోసమే వచ్చారు’

  1. ఫసిజం అంటే చాలా వివ్గరంగా తెలిపారు. పాణీ గారు.

  2. చాలా గొప్ప విశ్లేషణ. అవసరమైన తార్కిక దృష్టిని కలిగించే ప్రశ్న జవాబులు. ధన్యవాదాలు సర్.

Leave a Reply