పాట పుట్టిందిలా…

“నువ్వు గాయపడ్డవాడి దగ్గరకెళ్ళొద్దు
నువ్వే గాయపడ్డవాడివి కావాలి “
– Walt Witman.

“నడవాలెనే తల్లి” పాట ఒక్కసారిగా, ఒక ఊపులో రాసింది గాదు. సాలె మగ్గంమీద దారంలాగ, తెగిపోతూ… కలిసిపోతూ.. సాగినపాట ఇది.. ఓ విధంగా బిడ్డను కనడానికి తల్లి పడే పురుటి నొప్పుల లాంటివేవో నేనా పాట రాయడానికి అనుభవించాను.

వలస కూలీల మహాయానం మొదలయ్యాక, కుప్పలు తెప్పలుగా కవితలు పాటలు వొచ్చిపడ్డాయ్. నేను కూడా ఏమన్నారాద్దామనుకున్న. కాని, ఏమీ రాయలేకపోయా. చిన్న చిన్న విషయాలకే చలించిపోయే నేను, ఇంత మహోత్పాతం గురించి ఏమీ రాయలేక పోవడం గురించి గిల్టీగా ఫీలయ్యాను. బహూశా మెదడు మొద్దుబారిందేమో.

రెండో ప్రపంచ యుద్ధ పరిణామాలు జూశాను. దేశ విభజన నెత్తుటికాండ జూశాను. సిరియా, రోహింగ్యాల వలసలు జూశాను. ఇది భిన్నంగా ఉంది. మన కళ్ళముందే మన తల్లి శవం వెళ్ళిపోతున్నట్లు, మన కళ్ళముందే ఓ దుఃఖ ప్రవాహం సాగిపోతోంది. ఓ వారం రోజులు ఉత్తగనే గడిచాయి.

** **

ఓ రోజు వలస కూలీల దృశ్యాల్ని నిర్వేదంగా చూస్తున్నపుడు, ఓ ప్రత్యేక దృశ్యం నన్ను కదిల్చి వేసింది. అదేమంటే, ఓ చిన్నపిల్ల నడవలేక నడవలేక, మాటిమాటికీ తల్లి కాళ్ళకు అడ్డం పడ్తుంటది. తల్లి ఆ పిల్లను సముదాయించి నడిపించే ప్రయత్నం జేస్తుంటది. నిజానికి, ఆ తల్లి పక్కన నేనూ నడిచాను. ఆమె దుఃఖం నా దు:ఖమైపోయింది. ఏడ్చే పిల్ల, సముదాయించే తల్లీ, నారక్తంలో కలగల్సిపోయారు.

ఇక పాట పుడుతుంది అనుకున్నా. కానీ అదేం జరగలేదు. పల్లవీ చరణాలు పడ్తున్నాయి గాని ముగింపు పలకడంలేదు. నాకు మొత్తం పాటొస్తెనే గాని రాయడం కుదరదు.

** **

పాటను పక్కనపెట్టి వేరే పనుల్లో పడిపోయాను. వారం పది రోజులు గడిచాయి. రోజు వలస కూలీల వ్యథలు మాత్రం చూడడం మానలేదు. ఓ రోజు ఓ పాప ఫోటో పేపర్ల పడింది. ఆ పిల్ల నడుస్తూ నడుస్తూ తన ఊరి దగ్గర కొచ్చి… ఇంకొంచెం దూరముండగానే చచ్చిపోయింది. “మనిషికోసం ఎదురుచూస్తే, శవమొచ్చిందన్నమాట.”

ముగింపు ముంగిట కొచ్చింది. కాని పాట మొత్తం ఒక మూడ్ లోరాసి, ఈ మరణాన్ని ఎట్లా జత కలపాలో అర్థంగాలే. కలిపినా కృత్రిమంగా ఉంటుందేమో ననిపించింది. ఏదైతే అదే అవుతది అనుకోని పాట షురూ జేసిన. చివరి మరణం సీనువొచ్చె సరికి గుండె పట్టుక పోతోంది. వాక్యాలు పడడంలేదు. ఆ పిల్ల కోసం అవ్వాతాత ఎదురు చూస్తున్నట్టు రాద్దామనుకున్న. మనిషోస్తదనుకుంటే/శవమొచ్చెనేంది? అన్న వాక్యాలతో ముగించాలనుకున్న. ఏదో అసంతృప్తి. పాటకూడ శిల్పకళ వంటిదే. నచ్చినవిధంగా వొచ్చేదాంక చెక్కుకుంటూ పోవల్సిందే. ఆవాక్యాల కోసం ఓ రోజంతా మథనపడ్డాను. చివరకు “ఊరు జేరకముందే/ఊపిరాగిందా”అంటూ ముగించి హాయిగా ఊపిరి పీల్చాను.

బహూశా కొట్టేసి తీసేసి కలిపేసి సరిజేసి ఓ రూపుకు తేవడానికి ఆ పాటను ఏడెనిమిది సార్లు మల్ల మల్ల రాసి ఉంటా.

** **

హమ్మయ్య పాట ఓ కొలిక్కొచ్చింది. ఇక రాగం గట్టాలి. సాధారణంగా నేనేదైన పాటరాస్తే, ముందు ట్యూన్ గట్టి తర్వాత పాటరాసుకుంటా. ఇదినా పద్ధతి. సరిగా చెప్పాలంటే ట్యూన్ గున్ గునాయించుకుంట పాట గడ్తుంటా. ఇక్కడ ఉల్టా అయింది. పాట వొచ్చింది గాని ట్యూన్ కుదరడంలేదు. నేనొక ట్యూన్ గట్టుకున్నగాని నాదినాకే నచ్చలేదు.

ట్యూన్ కోసం అన్వేషణ మొదలయ్యింది. ఒకరిద్దరిని అడిగిజూశా. వాల్లు చేతులెత్తేశారు. స్పందనకోసం ఇద్దరు ముగ్గురికి పంపించాను. వాల్లు మూల్గలే. దగ్గలే.. బాగా బాధనిపించింది. నా పాట అభిప్రాయమే చెప్పలేనంతహీనంగా ఉందా? ఒకాయనను అడిగితే, అందులో ప్రతిఘటన లేదన్నాడు. ఓ పిల్లను చంకలబెట్టుకోని, ఓ పిల్లను కడుపులో బెట్టుకోని, ఓ పిల్లను నడిపించుకు తీసుకు పోయే వలస కూలీలో నేనేం ప్రతిఘటన జూపేదీ? ప్రతి పాటలో ప్రతిఘటన చూపడం కుదిరే పనేనా? విషాదం. కారుణ్యం, ప్రేమలు చూపే పాటలుండగూడదా? ఇట్లాంటివే సవాలక్ష ప్రశ్నలు.

విరసం.ఆర్గ్ కు పంపాను. వెంటనే వేశారుగాని పెద్దగా కామెంట్స్ లాంటివేంరాలేదు. బాగా నిరాశ పడిపోయాను. బహూశా నావి చాలా పాటలవలె ఇదికూడా cold storageకి వెళ్ళిపోతుందనుకున్న. కష్ట పడి పాటరాస్తే ట్యూన్ గట్టే మనుషులు దొరకడంలేదు. ఈ లోపున ఈ పాటను హైద్రాబాద్ నుండి వెలువడే ప్రజాపక్షం పత్రిక వాళ్లు తిరిగి అచ్చేసుకున్నారు. ఓహో మన పాటల ఏదో సత్తా ఉందన్నమాట అనుకున్న.

** **

ఇదిలా ఉండగా ఓ రోజు సంధ్యక్క నుండి ఫోన్ వొచ్చింది. చాలా క్లుప్తంగా,. “అన్నా.. నీ పాట ఇప్పుడేజూసిన.. బాగొచ్చింది” అన్నది. కొంచెం ఆశ పుట్టింది.” అక్కా.. నువ్వీ పాటకు ట్యూన్ కట్టొచ్చుగదా ” అన్నా. ” ఔనన్నా.. నేనూ అదే అనుకుంటున్న.. నువ్వేమైనా ట్యూన్ గట్టినవా “అని అడిగింది..” “లేదు.. నువ్వే ఆ పనిజేయాలి”అన్న. ఎదురుచూసిన తీగ కాళ్ళకడ్డం పడ్డట్లయింది. ఆ రోజు తెగ సంతోషపడి “సంధ్యక్క నాపాటకు ట్యూన్ గడ్తోంది” అని మిత్రులకు చెప్పిన. కదలిక మొదలయింది.

** **

ఆ సాయంత్రం ఓట్యూన్ తయారయింది. ఓ పల్లవి, ఓ చరణం పాడింది. పాడుతూ, పాడుతూ మధ్యలో “ఓ బిడ్డా నడువ్. నడువ్ బిడ్డా నడువ్” అనే పొడి వాక్యాలు నాకు భలే నచ్చాయ్. అదే విషయం చెప్పిన. ఐనా ఏదో అసంతృప్తి. తన గొంతులో మెలోడీ పలుకుతోంది గాని, దుఃఖం పలుకడం లేదు. ఆ విషయమే తనకు మెసేజ్ పెట్టాను. ఎందుకంటే ఆ పాటకు విషాదమే ఆత్మ. పాటకు సంబంధించిన చర్చలో, లక్ష్మయ్య సార్ (సంధ్యక్క సహచరుడు) మాట్లాడుతూ ,”నాకీ పాట వింటుంటే నా కండ్లల్ల నీళ్ళొచ్చినయ్” అన్నాడు. నాకు మరో మెట్టెక్కినట్టయింది.

ఓ వారం రోజులం గడిచినాక, కొంత చర్చ జరిగాక, పాటలో మెలోడీ స్థానంలో దుఃఖం వొచ్చేసింది. చాలా సంతోషమయింది. ఇంకొంచెం బాగా రావాలని ఉండె. అదెట్లానో రూపుగట్టలే (మిత్రుడు క్రాంతి విజువల్స్ ఏర్పాటు చేయడంతో పాట మరింత ఎలివేట్ అయింది)

** **

సంధ్యక్క నా పాటను గుర్తించింది. ఇతరులెవ్వరూ పట్టించుకోని సమయాన, దుమ్ముపట్టి న పాటను, మల్లె పూవులా చేతులోకి తీసుకుని, రెక్కల కంటిన దుమ్మును దులిపి, లోకానికి పరిచయం చేసింది. వర్షపు బిందువు కాస్తా ఆలు చిప్పలో బడి ఆణిముత్యమైంది. తాను పాడకపోతే, ముందే చెప్పినట్లుగా cold storage లోకి వెళ్ళిపోయేదేమో. ఇవాళ ఆ పాటను విన్నవాళ్ళందరూ, సంధ్యక్కను పొగుడుతున్నారు. ఆ పెయిన్ చాలా కదిలిస్తుందంటున్నారు. She deserves it….

జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).

2 thoughts on “పాట పుట్టిందిలా…

  1. udyamithra gaari saahityam , sadhyakka swaram kalisi kalla mundu paruchukonna jeevana vishada drushyaanni dukhapu thaditho gunde thalupulaku hattheshaayi. ” aa thalli pakkana nenoo nadichaanu. aame dukham naa dukham ayindi. edchepilla samudaayinche thalli naa rakthamlo kalisipoyaru” ee maatalalo udyamithra mana andari badhanu palikinchaaru.deepalu veliginchi cheekati ekkada? leneledu ani mabhyapette raajakeeyalanu vimarshaku pettina teeru bagundi. ee paata deepamai cheekati konala loki manavathmanu praveshapeduthundi.

Leave a Reply