మూలం: ఎరియల్ డార్ఫ్‌మన్
అనువాదం: సుధా కిరణ్
(ఎరియల్ డార్ఫ్‌మన్ చిలీ దేశపు రచయిత. తన నవల ‘విడోస్’ తెలుగు అనువాదాన్ని ‘మిస్సింగ్’ పేరిట ప్రచురించారు. సాల్వడార్ అయెందే ప్రభుత్వాల్లో సాంస్కృతిక సలహాదారుగా పనిచేశారు. అయెందే ప్రభుత్వాన్ని సైనిక కుట్రలో కూలదోయడంతో, చిలీ దేశాన్ని వదిలిపెట్టి ప్రవాసంలోకి వెళ్లాల్సి వచ్చింది. తర్వాత, అమెరికాలో స్థిరపడ్డారు.
‘ఆల్ ఐ ఎవర్ హావ్’ అనే ఈ కథ పూర్తి చేయడానికి యాభై ఏళ్ళు పట్టిందని ఎరియల్ డార్ఫ్‌మన్ అంటారు. జనవరి 7, 1966 న తన పెళ్లి రోజున వచ్చిన ఆలోచన ఈ కథకి మూలం. పెళ్ళి, సంగీతం గురించి ఆలోచిస్తున్న సమయంలో ఈ ఆలోచనని కాగితం మీద పెట్టే ప్రయత్నం చేశారు. ఆ కాగితం దొరకకుండా పోయింది. ఆ ఆలోచన తనలో అలాగే ఉండిపోయింది. 2015 నాటికి గానీ ఈ కథకి రూపం రాలేదు.)
ఆ పాట అతని గొంతులోంచి ఒక వరదలా, వెల్లువలా ఉబికి వచ్చింది. చావు భయం దాన్ని ఆపలేక పోయింది. ఒక యువ సైనికుడు ఆ బాకా సంగీత వాద్య గాయకుని చేతులు వెనక్కి విరిచి కట్టేయగానే, అతని గొంతులోంచి ఆ పాట మళ్ళీ ఉబికి దూకింది.
“తాడు మరీ బిగుతుగా బిగించి కట్టానా సార్” అని యువ సైనికుడు అతడిని అడిగాడు. తాడు బిగించి కట్టిన సైనికుడి చేతి వేళ్ళలోని మృదుత్వమూ, ప్రశ్నలోని సున్నితత్వమూ, ఆ పాట తిరిగి అతని గొంతులో నుంచి ఉబికి వచ్చేలా చేశాయి. “మరీ బిగుతుగా కట్టివుంటే నన్ను మన్నించండి”.
యువ సైనికునితో అతనేమీ మాట్లాడలేదు. ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు. ఆ క్షమాపణని పట్టించుకోనూ లేదు. యువ సైనికుడిని ఇబ్బందులలోకి నెట్టడం తనకి ఇష్టంలేదు. అదొక కారణం. 30 గజాల దూరంలో నిలబడి వున్న కెప్టెన్ డేగ కళ్ళతో చూస్తూ వున్నాడు. కాల్పులు జరపడానికి వచ్చిన బృందంలోని మిగతా సభ్యులూ కెప్టెన్ పక్కనే నిలబడి వున్నారు. ఓదార్పుగా గుస గుస లాడుతూ మాట్లాడుతున్న సైనికుడి పెదవులు కదలడం కెప్టెన్ కు కనిపించదు. కానీ జవాబుగా తాను మాట్లాడితే అది కెప్టెన్ కు తెలుస్తుంది. సైనికులు తాము చంపబోయే ఖైదీతో మాట్లాడితే దానికి కఠినమైన శిక్ష వుంటుంది. అయితే, చనిపోబోతున్న ఖైదీగా తన చివరి క్షణాలని కొంచెం ఆహ్లాదకరంగా మార్చాలనీ, తన ఒంటరి తనాన్ని కొంత తగ్గించాలనీ చూస్తున్న ఆ వెర్రిబాగుల యువ సైనికుడిని కాపాడాలన్నదొక్కటే అతని ప్రవర్తనకి కారణం కాదు. పాట కూడా అందుకు కారణమే. ఆ పాట అతని గొంతులోకి వచ్చి చేరింది. మృదువుగా, మొరటుగా అది అతని గొంతులో నిండి పోయింది. అతని నాలుకని, పొత్తి కడుపులో పేగులని, ఇంకా కొట్టుకుంటున్న అతని హృదయాన్ని అన్నింటినీ ఆ పాట ఆక్రమించేసింది, మునుపటి రోజు జరిగిన విధంగానే. ఆ పాటకి ఏదో తనదైన ఒక ప్రత్యేక అస్తిత్వం వున్నట్టు. తన ప్రమేయం, ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వచ్చి పోతూ వున్నట్టు – ఆ పాటలోని శ్రావ్యత ఏదో అతన్ని వేధించి వెంటాడు తుంది. మరిచిపోవాలని ఎంతగా అనుకున్నా ఆ పాట తనని వేధిస్తూనే వుంది.
అంతకు మునుపు గాయకుడు ఆ పాటని మర్చిపోయాడు. దాదాపు ఆ పాటని పూర్తిగా మర్చిపోయాడు.
మొదటిసారిగా నాన్న దగ్గర విన్నాడా పాటని. అతను అప్పటికింకా చిన్న పిల్లవాడు. ఐదేళ్లు కావచ్చు, బహుశా, ఆరేళ్ళుంటాయేమో. అప్పుడు నగరం తగలబడుతున్నది. వీధుల్లో తుపాకీ కాల్పుల మోతలు. అలాంటి విపత్కర పరిస్థితులలోనూ చిన్నపిల్లలు ఎలా నిద్రపోతారో అలాగే తానూ నిద్రపోయాడు. ఎంత గాఢంగా నిద్రపోయాడంటే, వాళ్ల నాన్న మాటలు ఎక్కడో దూరం నుంచి, ఏదో కలలో మాట్లాడుతూ వున్నట్టు, దేశంలో జనాలు ఎప్పుడో స్వేచ్ఛ గా వున్న రోజులలో మాట్లాడుతూ వున్నట్టు వినిపించాయి.
“వాడిని నిద్ర పోనివ్వు” అంది వాళ్ళమ్మ. “పిల్లవాడికి నిద్ర అవసరం.”
కానీ ఆ పిల్లవాడు అప్పటికే మేలుకున్నాడు. వేకువ జామున నాన్న మాటలలో, గొంతులో ఏదో తత్తర పాటు. పసి పిల్లవాడి తల నిమురుతున్న నాన్న చేతులలో ఏదో ఆత్రుత, విషాదం, తడి కలగలిసిన స్పర్శ.
“ఏమైంది నాన్నా?”
“నేను వెళ్ళిపోతున్నాను చిన్నా. మళ్ళీ రావాలంటే చాలా చాలా సంవత్సరాలు పడుతుందేమో. బహుశా ఎప్పటికీ రాలేనేమో.”
“నాన్నా నువ్వు కొండలలోకి వెళ్తున్నావా?”
“చిన్నా నేనెక్కడున్నాననేది నీకూ, అమ్మకూ తెలియకపోవడమే మంచిది. నీకు నాన్న వున్నాడనే విషయం కూడా మర్చిపో. నువ్వూ, నేనూ ఇలా మాట్లాడుకున్న విషయం కూడా మర్చిపో. సైన్యం తిరుగుబాటు చేసి, అధికారంలోకి రాక ముందు, నిన్న నువ్వూ, నేనూ, పాడిన ఆ పాటని మర్చిపో. నాకు సంబంధించిన ప్రతి విషయాన్నీ మర్చిపో చిన్నా”
“నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను. నాన్నా, నిన్న నేనూ, నువ్వూ పాడిన పాటని కూడా అసలు మర్చిపోను.
“మర్చిపోవాలి చిన్నా. అది నీకూ, అమ్మకూ మంచిది. మర్చిపోతే వాళ్ళు అమ్మని చంపరు. నువ్వూ మర్చిపోవాలి. మర్చి పోతావు.”
గాయకుడికి మళ్ళీ వాళ్ళ నాన్న కనిపించలేదు. వాళ్ళ నాన్న చెప్పినట్లుగానే అతనూ ఆ పాటని మర్చిపోయాడు. జ్ఞాపకాల దొంతరలలో అది లోతుగా మరుగున పడిపోయింది. ఆ పాట ఇక మళ్ళీ గుర్తు రాలేదు. పొగమంచు తెరలలో అది అదృశ్యమైపోయింది. ఆ పాటలోని మాధుర్యమూ, ఆ పాట అస్తిత్వమూ పూర్తిగా చెరిగిపోయాయి. దశాబ్దాల కాలంలో తండ్రితో ఆనాటి చిట్ట చివరి సంభాషణని అతను మర్చిపోయాడు. అసలు తనకి ఒక నాన్న వుండే వాడన్న విషయమే అతనికి గుర్తు లేకుండా పోయింది.
ఆ మర్చిపోవడం అన్నది తను బ్రతకడానికి చెల్లించాల్సి వచ్చిన మూల్యం. సైన్యమూ, విదేశీ కంపెనీలు ఇప్పుడు ఆ దేశాన్ని పాలిస్తున్న సమయంలో బ్రతకడం కోసం చెల్లించాల్సిన మూల్యం అది. బడిలో చేరి చదువుకోవడం కోసం, పదేళ్ళ వయసులో బాకా (ట్రంపెట్) వాద్య సంగీతాన్ని నేర్చుకోవడం కోసం, కౌమార దశకి చేరే సమయానికి సైనిక బ్యాండ్ లో ఒక వాద్య గాయకుడిగా ఎంపిక కావడం కోసం అది తాను చెల్లించిన మూల్యం. ఎక్కడో దూరాన వుండిన సైనిక బ్రిగేడ్ లో భాగంగా పనిచేసే సైనిక బ్యాండ్ అది. గుర్తింపు లేని ఒకానొక సరిహద్దు గ్రామంలో, అది ఎల్లప్పుడూ సిద్ధంగా వుండాలి. కానీ, తాను రోజంతా ఆ సంగీత వాద్యాన్ని వాయించే వాడు. అంతకంటే ఇంకేమి కావాలి తనకి? తిరుగుబాటుదారుల కుటుంబంగా ముద్రపడి, వేధింపుల పాలైన ఒక శాపగ్రస్త కుటుంబపు సభ్యుడు తాను. అలాంటి తనకు జీవితంలో ఇంకేం కావాలి? తన తల్లి చనిపోయింది. పితృ భూమికీ, దేశ భక్తి గీతాలకీ అంకితమైన జీవితంలో, పితృ భూమి వున్నాక, తల్లి చనిపోయాక, ఇక తనకి తండ్రి వుండాల్సిన అవసరం మాత్రం ఏముందని?
కెప్టెన్ కసురుకోవడంతో అతని ఆలోచనలు చెదిరిపోయాయి.
“ఎందుకింత ఆలస్యం అవుతుంది? అతని కాళ్ళని కట్టి వెయ్యాల్సిన అవసరం ఏమీ లేదు. అతను ఎలాగూ పారిపోలేడు.”
యువ సైనికుడు వంగి మోకాళ్ళ పై కూర్చున్నాడు. గాయకుడు తలవంచి సైనికుడిని చూశాడు. యువ సైనికుడు ఇంచుమించు మోకాళ్ళపై నిలబడి ప్రార్ధిస్తున్నట్టు, నేలకి మోకరిల్లి ప్రణమిల్లుతున్నట్టు అనిపించింది. కానీ ఎక్కువ సమయం లేదు. కెప్టెన్ లో అసహనం పెరిగి పోసాగింది. సైనికుడు త్వరపడి సర్దుకుని లేచాడు. వెనక్కి వెళ్ళి పోయేముందు ఒక చిన్న మాట మాత్రం చెప్పాడు.
“నువ్వు ఒంటరి వాడివి కాదు.” ఆ సైనికుడి మాట విన్నప్పుడు, చెట్టుమీద ఒక చిన్న కొమ్మ పైన పక్షి ఒకటి వాలి, వాలిన విషయం గుర్తించే లోపలే చిటుక్కున ఎగిరిపోయినట్టు. ఆ చిన్న కొమ్మ సుతారంగా వూగడం, గాలిలో ప్రకంపనలు మాత్రమే పక్షి వాలిన మాటకు సాక్ష్యాలు అన్నట్టు తోచింది తనకు. సైనికుడి మాట తనకు వినిపించింది. ఆ గొంతు దూరం జరిగిపోయింది, కొమ్మ మీద పక్షి ఎగిరి పోయినట్లే. నాన్న పాడిన నిషిద్ధ గీతం లాగా, మర్చిపోవాల్సి వచ్చిన పాటలాగా, కొద్దిసేపు గుర్తుండి, ఆతర్వాత ఒక చీకటి అగాధంలోకి అదృశ్యమై, విస్మృతమై, ఇక శాశ్వతంగా గుర్తు రాకుండా వుండి పోవాల్సిన పాటలాగా. ఆ పాట అలా వుండి పోవాల్సి వచ్చింది.
కానీ ఆ పాట చచ్చిపోలేదు.
నగరంలో ఒకానొక చీకటి సందు మలుపులో ఆ పాట అతని కోసం ఎదురు చూస్తూ వుంది. అప్పటికల్లా అతను స్థిరపడ్డాడు. ఉద్యోగంలో హోదా పెరిగింది. పాత వాద్యం స్థానంలో, తళతళ మెరిసే కొత్త వాద్యాన్ని కొనుక్కునాడు. వూపిరితిత్తుల నిండా గాలి నింపుకొని, పెదవులను వాద్యానికి హత్తుకుని అధికార గీతాలనీ, నివాళి గీతాలనీ సంతోషంగా వాయించ సాగాడు. మెల్లగా పెద్ద పట్టణాలలో, ప్రధానమైన సైనిక పటాలాలలో వాయించడం మొదలుపెట్టాడు. అతని సంగీతంలో స్వచ్ఛత, విశ్వాసం, స్వరాలలో హొయలు అధ్యక్షుడి సైనిక సంగీత బృందపు కమాండరు దృష్టిలో పడేలా చేశాయి. ఆ అత్యున్నత స్థాయి స్థానిక సంగీత బృందంలో చేరడానికి నిర్వహించిన పోటీలో అతను బాగా రాణించాడు. పోటీలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరూ ఆ విషయం మర్చిపోయారు. అసంకల్పితంగానే తన పాటకి చప్పట్లు కొట్టకుండా వుండలేకపోయారు. అందులో అవకాశం తనకే దక్కింది.
ఇక అక్కడ నుంచి ఎదుగుదలకి అడ్డు లేకపోయింది. మొదట అధ్యక్ష సంగీత బృందంలో తనని వెనకాల, చిట్ట చివరి స్థానంలో నిలబెట్టారు. కానీ తన వాద్య సంగీత ప్రతిభని గుర్తించ నిరాకరించలేకపోయారు. తను వాయిస్తుంటే వినడానికి వచ్చిన వాళ్ళు చప్పట్లు కొట్టేవాళ్ళు. కేరింతలు పలికేవాళ్ళు. జనాల కళ్ళలో నీళ్ళు తిరిగేవి. అనతి కాలంలోనే వాద్య బృందంలో ముందు నాయకత్వం వహించి నడిపించే స్థాయి అతనికి దక్కింది. కవాతు సాగుతుంటే ఆ వాద్య ఘోష జనాలని కదిలించేది. బాకా ధ్వని ఆకాశాన్ని తాకేది. అతని సంగీతం పితృభూమి కోసం యుద్ధం చేసేలా, పితృభూమికోసం ప్రాణతర్పణ చేసేలా, సరిహద్దులని కాపాడి, అనాగరికులని జయించేలా, శత్రువులని తుదముట్టించేలా జనాలని ప్రేరేపించేది. కఠినంగా కనిపించే దయామయుడైన ప్రభువు ఆధ్వర్యంలో ఒక్కటిగా ముందుకు సాగాలని స్ఫూర్తి నిచ్చేది. అనతికాలంలోనే అతను దేశాధ్యక్షుడి కోసం సంగీతాన్ని వాయించే స్థానంలోకి చేరుకొన్నాడు. అధ్యక్షుడు పాల్గొనే వేడుకలు, వివాహాలు, ఉత్సవాలు, ప్రారంభోత్సవాలలో అతను సంగీతం వాయించేవాడు.
అందుకు అతనికి తగిన బహుమానాలు కూడా దక్కాయి. తాను అన్నింటికంటే మిన్నగా ప్రేమించిన సంగీతానికి అంకితమైన జీవితం, మెట్టు మెట్టుగా పైకి ఎగబాకిన హోదా, మంచి జీతం, రుచికరమైన వేడి భోజనం, అన్నీ అతనికి దక్కాయి. భోజనశాలలో తనకోసం మంచి మంచి మాంసం ముక్కలను ఏరి, ప్రత్యేకంగా కొసరి కొసరి వడ్డించిన అమ్మాయి కూడా తనని తాను అతనికి అంకితం చేసేసుకొంది. శృతి చేయాల్సిన అవసరం లేని సంగీత వాద్యాలలాగా, పదేపదే పాడుకొనే పాటలాగా ఇద్దరూ కలగలిసిపోయారు.
“అందరూ సిద్ధంగా వున్నట్టేనా?”
కెప్టెన్ మళ్ళీ అడిగాడు. కెప్టెన్ కాల్పులు జరపడానికి సైనికుల బృందం సిద్ధంగా నిలబడి వున్నారు.
తన లోలోపల సుడులు తిరుగుతూ, ఉబికి వస్తున్న ఆ నిషిద్ధ గీతాన్ని ఆపడానికి అతను ప్రయత్నించాడు. భార్య ముఖాన్నీ, చిరునవ్వులు మెరిసే తన చిన్నారుల ముఖాలనీ గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్నించాడు. ఇంటి ముందర తోటలో పూసిన పూలని గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్మించాడు. ఇప్పుడు ఆ ఇంట్లోనుంచి తన కుటుంబాన్ని బయటకు గెంటేస్తారు. ఒక క్షణం తర్వాత తాను మళ్ళీ ఇక వేటిని చూడలేడో వాటన్నిటినీ గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్నించాడు. కానీ, అవేవీ కాకుండా, ఎందుకనో పాటే గుర్తుకు రాసాగింది. ఏం చేసినా ఆ పాటే మళ్ళీ మళ్ళీ గుర్తుకు రాసాగింది. ఆ పాట తనని ఒంటరిగా వదలడం లేదిప్పుడు. జైలు ఆవరణలోని చవిటి నేల మీద, ముప్ఫై గజాల అవతల నిలబడి తన వైపు చూస్తున్న యువ సైనికుని కళ్ళలోకి చూసినప్పుడు ఆ పాట తనలో ఆపాద మస్తకమూ నిండిపోయింది. పది మంది సిపాయిల తుపాకులు గురిపెట్టి వున్నారక్కడ. తననీ, తనతో మళ్లీ వచ్చి చేరిన ఆ పాటనీ చంపబోతున్నారిప్పుడు.
ఆ పాట వుందక్కడ వీధి మలుపులో, ఆ సందులో, ఆ గొంతులో… అదంతా కేవలం యాదృచ్ఛికం అనుకొన్నాడతను. ఒక ఐదు నిముషాలు ముందో, వెనకో బయలుదేరినా, ఇంటికి వేరే దారిలో వచ్చినా, రిహార్సల్స్ కోసం ఇంకొంచెం ఎక్కువ సేపు గడిపినా, ఉదయాన తినడానికి కొంచెం ఎక్కువసేపు ఆగినా, కొండ దగ్గర స్వచ్ఛమైన గాలి కోసమో, సూర్యుడి వెచ్చదనం కోసమో ఇంకాసేపు ఆగినా, నాన్న దగ్గర మొదటిసారి విన్న ఆ నిషిద్ధ గీతం తనకి తారసపడేది కాదని అనుకున్నాడతను. ఆ రోజు ఏదో ఒక పని కొంచెం భిన్నంగా చేసివుంటే, ఆ పాట తనకి మళ్ళీ తారసపడి వుండేది కాదు కదా అనుకున్నాడు. కానీ, అది నిజం కాదు. ఆ రోజు కాకపోతే మరొక రోజు, ఆ పూట కాకపొతే మరొక పూట ఆ పాట తనకి ఎదురు పడి వుండేది. దానికి రుజువు అక్కడే వుంది. చావు ముసురుకున్న ఆ క్షణాన, చుట్టుముట్టి, తుపాకులు ఎక్కుపెట్టి, కాల్చడానికి సిపాయిలు సన్నద్ధమౌతున్న ఆ క్షణాన, తెలియకుండానే ఆ పాట మళ్ళీ తన లోలోపలికి చొరబడింది. తుపాకులతో కాల్చబోతున్న ఆ క్షణాన ఇక ఆ పాటని తాను తప్పించుకోలేనని తనకి అర్థమై పోయింది. ఇక భవిష్యత్తులో శాశ్వతంగా సంగీతాన్ని వూదలేని వూపిరితిత్తులలోకి చివరి శ్వాసని తీసుకోకుండా ఉండడం సాధ్యం కానట్టే, ఆ నిషిద్ధ గీతాన్ని తాను ఇంక తప్పించుకోలేనని తనకి అర్ధమై పోయింది.
ఆ వీధి మలుపు దగ్గరికి ఇంకా చేరుకోకముందే పాట కొంచెం వినపడింది తనకి.
తన పాదాలు ముందుకు సాగకుండా, ఇంకోవైపు మళ్ళించాలని అనుకొన్నాడు. చిన్నతనంలో తననీ, ఆ పాటనీ, చిట్ట చివరి సంభాషణనీ మర్చిపొమ్మని బ్రతిమాలిన నాన్న మాటకి కట్టుబడాలని ప్రయత్నించాడు. కానీ లాభం లేకపోయింది. పాదాలు తన మాట వినలేదు. అవి ఆ పాట వైపే, తమ గమ్యం వైపే సాగాయి. కెప్టెనూ, సైనికుల బృందమూ కాల్చి చంపబోయే వైపుకే నడుస్తున్నామని తెలిసినా, తుపాకీ కాల్చడానికి మనసు రాకున్నా, గత్యంతరం లేక యువ సైనికుడు కూడా కాల్చుతాడని తెలిసినా ఆ పాదాలు అటువైపే నడిచాయి. చిన్నతనంలో తాను ఆ పాటని మర్చిపోకుండా ఎలా ఉండలేకపోయాడో, పెరిగి పెద్దయ్యాక, ఆ పాట మాటు వేసిన ఆ వీధి మలుపు వైపు, ఆ చీకటి సందు వైపు తన పాదాలు నడవకుండా ఉండలేక పోయాయి.
ఒక బిచ్చగత్తె పాడుతూ ఉందా పాటను. తెలివిమాలిన తనమో, తాగిన మైకంలో తెలియనితనమో, పేదరికమో, చావుకు భయపడని ముసలితనపు ధైర్యమో – ఆమె ఆ పాట ఎందుకు పాడుతుందో తెలియదు.
ఆ పాటని తాను వెంటనే గుర్తుపట్టాడు. తెల్లవారు జామున నాన్న నిద్రలేపి చివరి సారి వీడ్కోలు పలికిన చిన్నతనం నుండి ఎక్కువ కాలం దొర్లిపోనట్టు, తానింకా ఆనాటి చిన్న పిలవాడినే అన్నట్టు, ఆ ముసలి బిచ్చగత్తె తన తండ్రి అన్నట్టు, మధ్యలో గడిచిపోయిన కాలమంతా ఒక భ్రమాజనిత స్వప్నం అన్నట్టు అనిపించింది. సైనిక కవాతు ఒక కల. జనం చప్పట్లు కొట్టడం ఒక కల, ఆ దేశభక్తి గీతాలు, వ్యాపార ప్రకటనలు ఒక కల. బహుమానాలు, ఉద్యోగ సోపాన ఆరోహణలు అన్నీ ఒక కల, భ్రమ. పాటే నిజం, సంపద్వంతమైనదీ, అత్యుత్తమమైనది పాట మాత్రమే. అది ఒక నిషిద్ధ గీతం కూడా.
అతనికి ఆ మాట అర్ధమైపోయింది. ఆ బిచ్చగత్తెని దాటి వెళుతూ అదే మాట తనకి తాను చెప్పుకున్నాడు. ఆ బిచ్చగత్తె అకస్మాత్తుగా మౌనంలోకి జారుకుంది. పాటని ఒక వ్యాధిలాగా మరొకరికి అంటగట్టాక తన గొంతు ఇక విశ్రాంతి తీసుకుంటుంది. తన భారాన్ని భద్రంగా వదిలించుకుని, మరొకరికి ఆ ప్రమాదభారాన్ని అప్పగించినట్టు. ఇంతకాలం తాను మర్చిపోయి బ్రతికినట్లే ఇక ఇప్పుడామె కూడా ఆ పాటని మర్చిపోవచ్చు. ఆ సందులలో ఇంటికి దారి వెదుక్కుంటుంటే, ఇప్పుడా పాటని తాను వదిలించుకోలేనని కూడా తెలిసిపోయింది.
ఇంటికి చేరాక, భార్యని ముద్దుపెట్టుకున్నప్పుడు కూడా ఆ పాట తనని వదిలిపెట్టలేదు, రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు, నిద్రబుచ్చడం కోసం పిల్లలకు రాక్షసులు, వీరుల కథ చెబుతున్నప్పుడూ ఆ పాట తనని వదిలిపెట్టలేదు. పడుకోబోయినప్పుడు కూడా అది వదిలిపెట్టలేదు. నిద్రలోకి జారుకునే ముందూ, మేల్కొన్న తొలి క్షణం లోనూ ఆ పాట , అందులోని స్వరాలే వెంటాడాయి.
దీనితో పెద్దగా ఇబ్బంది ఉండదులే అని తనకి తాను సమాధానం చెప్పుకున్నాడు. ఆ పాటని తన లోపల దాచుకుంటే, ఆ విషయం ఇతరులకి తెలియనంతవరకూ సమస్య ఉండదని అనుకున్నాడు. ఆ పాటని తన లోపల దాచుకుంటే, ఇతరులు దాన్ని తెలుసుకోలేరు, నా ఆలోచనలలో ఏముందో ఇతరులకి ఎలాగూ తెలియదు గనక నేను భద్రంగానే ఉంటానని అనుకున్నాడు. ఇంతకు ముందు మర్చిపోయాను, మళ్ళీ దాన్ని మర్చిపోగలనులే అనుకున్నాడు.
కొద్ది సేపు, అతి కొద్ది సేపు మాత్రం అది సాధ్యమైనట్లే అనిపించింది.
ఆ పాటని తాను మచ్చిక చేసిన పులిలా లొంగదీశానని అనుకున్నాడు. పులిని ఇంట్లోకి తీసుకొచ్చి, పిల్లిపిల్ల అనుకున్నాడు. ఇంట్లోకి తీసుకొచ్చింది మాత్రం పులిని.
“గుండెల్లోకి గురిపెట్టండి.” కెప్టెన్ పురమాయించాడు. “పది మంది కాల్చే పది తూటాలూ గుండెలలోనే దిగాలి. ఇది నా ఆదేశం. ఎవరైనా నా ఆదేశాన్ని ధిక్కరించారో, తరవాత వంతు మీదే.”
యువ సైనికుడు క్షణకాలం పాటు చూపులు మళ్ళించాడు. క్షణానికన్నా తక్కువ కాలమే. తాను చేయబోతున్న పనిని తన కళ్ళతో చూడలేనట్టు లిప్తకాలం పాటు చూపు మళ్ళించాడు.
అతను సైనికుడి వైపు చూసి తల ఊపాడు. ఆ సైగతో ఫర్వాలేదన్నట్టు తెలియజేశాడు. సైనికుడు ఆ ఆదేశాన్ని పాటించాడు. అతను కూడా పాటను మర్చిపోవడానికి ప్రయత్నించాడు. తన పెదవులు, తన నోరు పాట పలకకుండా ఉండాలని గట్టిగా ప్రయత్నించాడు.
సైనిక బృందం కాల్పులు జరపబోతున్న ఆ క్షణాన ఆ పాట ఇప్పుడు తనలోనుంచి ప్రవహించింది. లోపలనుంచి మెల్లగా రగులుతున్న అగ్నిపర్వతం వలే, అదుపు చేయలేని అగ్నికీల వలే, అదృశ్యంకాని ఒక నక్షత్రం వలే, ఆ పాట అతని గొంతులోనుంచి దూసుకు వచ్చింది. క్రితం రోజున అధ్యక్ష ప్రాసాదంలో అధ్యక్షుడు, మంత్రులు, ఉన్నతాధికారులందరి ముందు ఆ పాట అంతే స్పష్టంగా, బిగ్గరగా, స్వచ్ఛంగా ఎగసిపడింది. రేడియో, టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారంలో ఇతర వాయిద్యాల హోరునీ, సైనిక కవాతు గీతాన్నీ అధిగమించి దేశం దేశమంతటినీ ఆ పాట ముంచెత్తింది.
దశాబ్దాలపాటు ఆ పాట నిషేధానికి గురైంది. అయినా, అది సజీవంగానే ఉంది.
నిన్న అధ్యక్ష ప్రాసాదం దగ్గర అనూహ్యమైన, సాహసోపేతమైన ఆ చర్యతో అందరూ బిత్తరపోయారు. ఏం చేయాలో ఎవరికీ తోచలేదు. ఆ పాటతో ముగ్ధులైన ఇతరులు తమ వాద్యాలని వాయించడం ఆపేశారు. తన్మయత్వంతోనూ, భయంతోనూ పాట వింటూ నిలబడిపోయారు. అధ్యక్షుని చుట్టూ ఉన్న అంగరక్షకులు కూడా నిశ్చేష్టులై నిలిచిపోయారు. ఇప్పుడు పదిమంది సిపాయిల విషయంలోనూ అదే జరిగింది. అతని ధిక్కార గీతాన్ని వింటూ వాళ్ళ చేతివేళ్ళు, చేతులు, కాళ్ళు, శరీరాలు అన్నీ చేష్టలుడిగి స్తంభించిపోయారు. చెవులు మాత్రమే పనిచేస్తున్నాయి. నిన్న అధ్యక్షుడు నివ్వెరపాటుకి గురయినట్లు, ఇవాళ కెప్టెన్ కూడా క్షణం పాటు నిరుత్తరుడిగా నిలబడిపోయాడు. ఆ పాట వాళ్ళని దిగ్భ్రాంతికి గురి చేసింది. కుదిపి వేసింది. ఆ పాట కొనసాగింది. నిన్న సంగీత వాద్యమైన బాకా ఆ పాటని వినిపిస్తే, ఈ రోజు అతని నాలుక, నోరు, కంఠంలో ఆ పాట ప్రతిధ్వనిస్తున్నది. అదే పాట. అదే నిషిద్ధ గీతం. ఎవరూ గుర్తుపెట్టుకోని పాట. అందరూ గుర్తించి, పోల్చుకున్న పాట.
“కాల్చండి” కోపంగా అరిచాడు కెప్టెన్.
సిపాయిలు కాల్పులు జరిపారు. వాళ్ళకి కాల్చక తప్పలేదు.
అతను నేలకొరిగాడు. కానీ, ఆ అంతిమ క్షణంలో ఆ పాటలోని చిట్ట చివరి స్వరం గాలిలో ప్రతిధ్వనించింది. జైలు గోడలని తాకి తిరిగి వచ్చింది. అతనిలోకి, ఆ పాటల నదిలోకి ఆఖరిసారి ప్రవహించింది. తన శరీరాన్ని నిలబెట్టింది. చావును ధిక్కరిస్తూ, ఆ అంతిమ శ్వాసలో నిలిచిపోయింది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం.
ఆ ఆవరణ అంతా నిశ్శబ్దం. ఆ చనిపోయిన ఖైదీ గొంతులో నిశ్శబ్దం. అతని నెత్తురు నిశ్శబ్దంగా ప్రవహించింది. అతని శరీరాన్ని ఖననం చేయడానికి మట్టిని తవ్వుతున్న పారలు కూడా నిశ్శబ్దంగా పనిచేశాయి. నగరంలో, పట్టణాలలో, పొలాలలో అంతటా నిశ్శబ్దం.
యువసైనికుడు ఇంటికి చేరేవరకూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తలుపు దగ్గర స్వాగతం పలికిన ప్రియురాలితోనూ మాట్లాడలేదు. మౌనంగా, అన్యమనస్కంగా కంచంలో అటూ ఇటూ కెలికి తినకుండా వదిలేసాడు. బట్టలు మార్చుకుని నిద్రకి ఉపక్రమించాడు. నిద్రపోతున్న కూతురు దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు.
ఆ పాపకు ఐదేళ్ళుంటాయేమో. బహుశా, ఆరేళ్ళు కావచ్చు.
పాపని నిద్రలోంచి లేపకూడదనుకుంటూనే మెల్లగా తన తల నిమిరాడు.
అప్పుడు వచ్చింది, ఆ పాట అతని నోటిలోనుంచి.
లో గొంతుకలో, మంద్ర స్వరంలో వినీ వినిపించకుండా, పాడాడు ఆ పాటని.
కానీ, పాప ఆ పాటను విన్నది. నిద్రలోంచి లేచి, కళ్ళు నులుముకుంటూ నాన్నని చూసి నవ్వింది.
“నాన్నా, ఈ పాట ఏమిటి? నేను ఇంతకు ముందెన్నడూ వినలేదు.”
సైనికుడు ఆ పాటని ఇంకాసేపు పాడి ఆపేశాడు. పాటని ఆపాలని అనుకోలేదుగానీ, పాపకి మాత్రం ఒక విషయం చెప్పాలి.
“చిన్నారీ, ఈ పాటని నువ్వు ఇంతకుముందెన్నడూ వినివుండని మాట నిజమే. మళ్ళీ నీకు వినిపించక పోవచ్చు కూడా”.
“నాన్నా, ఎప్పుడు వింటానీ పాటని నేను?”
ఆ యువ సైనికుడు, కాల్పుల బృందంలో తనతో పాటు ఉన్న మిగతా తొమ్మిది మంది సైనికుల గురించి ఆలోచించాడు. అందులో ఎవరైనా ఇప్పుడు ఆ పాటని మెల్లగా పాడుతూ ఉంటారా? అన్నదమ్ముల దగ్గరనో , భార్య దగ్గరనో, పినతల్లుల దగ్గరనో, మేనత్తల దగ్గరనో, స్నేహితుల దగ్గరనో, తండ్రి దగ్గరనో, అపరిచితుల దగ్గరనో, కూతు దగ్గరనో, కొడుకుల దగ్గరనో ఈ పాటని పాడుతూ వుంటారా? అని ఆలోచించాడు.
“మళ్ళీ ఎప్పుడు వింటావీ పాటని?”
యువసైనికుడు సమాధానమిచ్చాడు. అది తన ఒక్కడి సమాధానం మాత్రమే కాకూడదని అనుకున్నాడు.
“ఏదో ఒక రోజున వింటావు. బహుశా త్వరలోనే ఏదో ఒక రోజున ఆ పాటని నువ్వు మళ్ళీ వింటావు”.
అద్భుతమైన కథ.
విమల
chala bagundi . nishedhanni nishedhisthoo migile paataa goppa aasha kadaa !
Extraordinary story, Sudha Kiran gaari translation amazing.