ప్రజా జీవితానుభవాలే పాటకు పల్లవి

(1979 జనవరిలో వరంగల్ లో జరిగిన ‘విరసం సాహిత్య పాఠశాల’లో ‘ప్రజల పాట – అనుభవాలు’ అనే శీర్షికతో గద్దర్, రామారావు, వంగపండు ప్రసాదరావు ముగ్గురూ తలా ఒక గంట మాట్లాడారు. ఆ మూడు ఉప‌న్యాస పాఠాల‌ను క్యాసెట్ వింటూ ఎన్‌.వేణుగోపాల్ అక్ష‌రీక‌రించారు. దీన్ని విర‌సం పుస్తకంగా ప్రచురించింది. రామారావు మాట్లాడిన ఆ ప్ర‌సంగ పాఠం య‌ధాత‌థంగా…)

“నేను రచయితను కాను. ప్రజాకవులు రాసినటువంటి పాటలను, బుర్రకథలను, వీధి భాగవతాలను ప్రదర్శిస్తూ, వివిధ ప్రాంతాల్లో వాటికి ప్రజలు ఎలా రెస్పాన్స్ ఇస్తున్నారో, ఆ ప్రాంతాల్లో నేను ఎదుర్కొన్నటువంటి యిబ్బందులను గురించి చెప్తాను.

ప్రజల పాటల గురించి, గద్దర్ గారు చాలా వివరంగా చెప్పారు. వాటిని గురించి మాలాంటి కళాకారులు ఎంతో నేర్చుకోవాల్సింది వుంది. అయితే యిప్పుడు ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో వివిధ రచయితలు రాసినటువంటి పాటలు గాని, నాటికలు గాని, బుర్రకథలుగాని ఎలా వున్నాయో వివరిస్తాను.

మనలో కొంత మంది రచయితలు సాంప్రదాయక రూపాలను వాడుకోవటం అవసరం లేదంటారు. అయితే ఇది నేను సరైందికాదంటాను. కొన్ని నియమ నిబంధనలున్నా ఆ రూపాలను వాడుకోవడం అవసరం. కాని దానికే ఎక్కువ ప్రాముఖ్యత నివ్వరాదు. ఇపుడు కొన్ని కానూరి వెంకట్వేర రావు రాసిన పద్యాలు విన్పిస్తాను.

వాటిలో కానూరి వెంకటేశ్వరరావుగారు రచించినటువంటి ‘కుట్ర’ భాగవతంలో ఒక సమితి ప్రెసిడెంటు, ఒక పంచాయితీ ప్రసిడెంటు వుంటారు. వారిద్దరు ఆ గ్రామ ప్రజలను దోచుకోవడానికి ఎలా పోట్లాడుకుంటున్నారో ఆ రచయిత యిక్కడ వివరిస్తాడు. ముందుగా సమితి ప్రసిడెంటు పంచాయితీ ప్రసిడెంటుతో అంటాడు గదా…

సాముదాయక ఫండు – సాంత మే మింగేసి
గాంధీ బొమ్మకు – ఖర్చు రాసినావు
ప్రైమరీ స్కూలుకని – పది వేలు వసూల్జేసి
పూరి గుడి సెలోన – స్కూలు పెట్టించినావు
చెరువు రిపేరుకని – యిరువది వేలిప్పిస్తే
మూడు గంపల – మన్ను దీసినావు
సమితి ఆబోతుకని – ఆరు వేలిప్పిస్తే
కుంటి దూడను – అంట గట్టినావు
ఔర! చీకటి పల్లె నీయంతవాడు లేడు
రాడు, ఇకముందు పుట్టగలేడు
తెలివి ఎవనమ్మ సొమ్ముర తెగువ నీది
ఏస్కో నా రాజా ఐదేళ్ళు నీకు ఎదురులేదు

అపుడు పంచాయితీ ప్రసిడెంటు అంటాడు గదా

‘నీవు నేర్పిన విద్యయేకదా నీరజాక్ష’
బీడివోసాబును చెల్లించి బెదిరించి
కరువు ఫండంత కాజేసినావు
సమితి జనరల్ ఫండు సగపాలు కాజేసి
ఓడివోకు ట్రాన్స్ఫరిప్పించి నావు
సబ్సీడి బావుల్లో సగము పర్సంటేజీ
ఇచ్చినోడికె బావి యిచ్చినావు
మేంటెనెన్సు, రిపేరు, మెడిసిన్సు,
ఫర్నిచరు లక్షకు పైచిల్కె లాగినావు
ఎరువు కోటాలో నీ మాట కెదురు లేదు
సమితిలో నీ కెదురాడు చవటలేడు
బయట ఎవడేమనుకున్న భయములేదు
దంచరా దంచు దంచు నీ కెదురేది దంచు దంచు స్వామీ !

ఈ విధంగా గ్రామ ప్రాంతాల్లో వున్నటువంటి జ‌నానిక‌ర్థంగాక పోయినప్పటికీ పట్టణాల్లో వున్నటువంటి మధ్యతరగతి ప్రజలకు బాగా ఉపయోగపడుతుందనే నేననుకుంటాను. ఐతే మరి ఈ ఫక్కీలోనే ప్రధానంగా రాయగూడదు. పోతే అదే రూపాల్లోనే, కూచిపూడి బాణీలో వున్నటువంటి కొన్ని వీధి భాగవతాలు. అవి కూడ జనానికి ఆ బాణీలు కాని, అందులో వున్నటువంటి సారాంశం కానీ అర్థం కాకపోయి నప్పటికీ ఆ రూపాలను మాత్రమే తీసుకొని మనం రాస్తే బాగుంటుందని నేననుకుంటున్నాను. ఉదాహరణకు – అదే కానూరి వెంకటేశ్వరరావుగారిచే రచింపబడ్డ ‘ఇందిరా జాలం’ అనే భాగవతంలో అత్యవసర పరిస్థితి కాలంలో ఆ ఇందిరా గాంధీని నయాస్వామ్య వాద సోషలిస్టు సిద్ధాంతి శ్రీపాదామృత డాంగేగారు ఎలా సమర్థించారని చెపుతూ ఆ డాంగేగారి ఆగమనాన్ని గురించి ఆ రచయిత వివరిస్తాడు గదా!

అరుదెంచెను!
అసలు పాత కామ్రేడుల తాత అరుదెంచెను!
రాజకీయ మధనమ్ములో బహు రాటుగన్న రసికుండు
ఓహో! బమ్మిని తిమ్మివి చేసి చూపు బల్
అతివిశారదుడు అమితభేషజుడు
అరుదెంచెను!
మార్క్సిజమును బట్టి నేర్పుగ ముక్కు చెవులు చెక్కి
నయాపొలిటికల్ కొమ్ములు గుచ్చి
స్వయం సూతము కిరీటం బెట్టి
అంబపలుకు జగదంబ పలుకుమని
పాలిటిక్సు కీలుబొమ్మను పట్టుక
అరుదెంచెను!

అదే భాగవతంలో ఆనాటి కాంగ్రెస్ మంత్రులు ఆమె ఎమ‌ర్జెన్సీ విధిస్తే ఆమెను ఎలా కీర్తిస్తున్నారో ఒక దండకంలో రచయిత వివరిస్తున్నాడు.

తల్లీ!
నీ కీర్తి దశదిశలా ఎలా వ్యాపిస్తున్న దనిన
శ్రీ ఇందిరా దాస దాసాన దాసుండ
మాపాలి పెనుగొండ, మాయండ నీవుండ, నిన్ను నమ్మితి నుండ,
మన్నించు మదినిండ, సోషలిస్టు సురాభాండ,
వాణీ!
చతుర్వాడీ! నెలవాణీ! విరిబోణీ! అలివేణీ! హస్తినాపుర రాణీ!
అలహాబాదు మహారాణీ!
చండీ! ప్రచండీ! మహోద్దండీ! ఉద్దండీ! ప్రతిపక్ష కలకండీ !
రమణీయ వాగ్ధండీ! కాశ్మీర కలకంఠీ!
అమ్మా! మొరాలింపవేయమ్మ! తప్పులన్మన్నించ వేయమ్మ!
దయ జూపవేయమ్మ! నెహ్రూ ఇంటిల బొమ్మ!
గాంధి ముద్దుల గుమ్మ! ఇండియా రాణమ్మ! ఇందిరా రాణమ్మ!
నమస్తే నమస్తే నమస్తే నమస్తేన్నమః.

ఈ విధంగా ఈ భాష అర్థం కాక పోయినప్పటికీ ఈ రూపాల్ని తీసుకొని సరళమైనటువంటి భాషలో యిది వుపయోగించుకోవచ్చని నేననుకుంటున్నాను. ఐతే యిక జానపదాల్లోకి చూసినట్టయితే మొట్టమొదటి సారిగా మనం యింతకు ముందు గద్దర్ గారు పాడినట్లు అన్నిట్లో తెలంగాణా ప్రాంతంలో పాడుతున్నటువంటి ‘నైజాము సర్కరోడా’ అయితేనేమి, జనగామ ప్రాంతంలోకి పోయినట్టయితే

అమరజీవివి నీవు కొమరయ్యా!
అందుకో జోహార్లు కొమరయ్యా!

అన్నవి చాలా ప్రసిద్ధమైన పాటలు. ఈ విధంగా అనేక పాటలు తెలంగాణా పోరాటంలో ప్రజలే రాసుకొని ప్రజల్లో ఈనాటి వరకూ విరివిగా ప్రచారంలో వున్నాయి. తెలంగాణా పోరాట పాటల తర్వాత ముఖ్యంగా నక్సల్బరీ పోరాటం తర్వాత మొట్టమొదటగా జనం భాషలో రాసినవాడు జన జీవితాలకు దగ్గరగా జీవించి వాళ్ళలోనికి తీసుకపోయిన వాడు గద్దర్ అని నేననుకుంటాను.

ఈ రోజు గద్దర్ పాటరాని పిల్లవాడు గాని మరి గద్దర్ పాట లేనటువంటి ఊరుకాని లేదంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా గద్దర్ లాగానే అనేక మంది. గద్దర్ తర్వాత చెరబండరాజుగారు. వాటిలో ముఖ్యంగా ఈ తెలంగాణా ప్రాంతంలో అంటే నేను ములుగు ప్రాంతంలో పోయినప్పుడు వినిపించిన పాట.

ఇంటింట చీకటే ప్రతికంట కన్నీరే
రాజ్య మెవరికి వచ్చేనో… రాజన్న
భూములెవరికి దక్కెనో…

ములుగు ప్రాంతంలో ఈ పాట ఎక్కువ ప్రచారంలో వుంది.

చెరబండరాజు గారు రాసిన పాట

ఇదేనండి ఇదేనండి మన ఎర్రని నల్లగొండ
కమ్యూనిస్టు గుండెకాయ కష్టజీవి కలల కొండ

అని రాస్తూ ఆత్మకూరు వాసియైన గొట్టిముక్కల గోపాల్ రెడ్డిని వర్ణిస్తూ

బయటపడ్డ పేగులను పైపంచతో అదిమిపట్టి
పగతురపై పగబట్టి ప్రాణాలను దీసినట్టి
గొట్టిముక్కల గోపాల్ రెడ్డి జన్మించిన జీవగడ్డ! || ఇదేనండి ||

అలాగే ఆ పోరాటానికి అన్నాడు నాయకత్వం వహించి ఆనాడు పోరాటం నడిపించినటువంటి సుందరయ్యలు, చండ్ర రాజేశ్వరయ్యలు ఎలా ద్రోహం చేశారో వివరిస్తారు.

పోరాటం నడిపించిన పుచ్చలపల్లి సుందరయ్య
కంట నిప్పులను చెరిగిన చండ్ర రాజేశ్వరయ్య
ఎన్నికలని కొంపార్చిరి ఇంకెన్నడు నమ్మకండి. || ఇదేనండి ||

ఆ పాటలోనే

కొంరన్నకు వారసులు కోరన్నలు మంగన్నలు
మేలుకునే వున్నారు నల్లగొండ పల్లెల్లో
కో అంటే కో అంటరు సై అంటే సై అంటరు. || ఇదేనండి ||

అలానే చెరబండరాజు తర్వాత ఉద్యమం పాటలు రాసినటువంటి అంజయ్య గారు కూడా ప్రజల బాణినీ తీసుకొని ప్రజల భాషలోనే అనేక పాటలు రాశారు. వాటిలో బాగా ప్రచారంలో వున్నవి.

వూరు మనదిరా ఈవాడ మనదిరా
పల్లె మనదిరా ప్రతిపనికి మనంరా
సుత్తి మనది కత్తి మనది
పలుగు మనది పారమనది
నడుమ దొర ఏందిరో
దొరతనమేందిరో

అలాగే బి.ఎన్.బి గారు అలాంటి ప్రజా బాణీలను తీసుకుంటూ ప్రజల్లోనికి తీసుకొని పోయి ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్ ప్రాంతంలో బి.ఎన్.బి గారి పాటలు ఎక్కువ ప్రచారంలో వున్నాయి. వాటిలో ముఖ్యమైనవి…

మాలోల్ల మంటావు – మాదిగల మంటావు
మాట మాట్లాడితే దూరముండంటావు
నీరక్తమెట్లుండెరో – ఓరోరి
మారక్త మెరుపుండెరా – అరెరే
మారక్త మెరుపుండెరా…

ఇదొక పాట –

రాయే నాలచ్చిమి లస్కరు బండెక్కుదాం
లస్కరు బండెక్కుదాం. లస్కరులో బతుకుదాం || రాయే ||

ఐతే యిక్కడ అన్ని ప్రాంతాల్లో నేను తిరిగాను. కొన్ని చిన్న చిన్న యిబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇపుడు గద్దర్ గారు చెప్పినట్టు కొన్ని పదాలు… ఉదహరణకు తెలంగాణాలో ‘పోరగాడు’ అని వుందనుకోండి. అదే రాయలసీమలో పోతే పోరగాడు అంటే ఏమిటో తెలియదు. అదే శ్రీకాకుళంలో పోతే ‘గుంటడు’ అంటరు. ఈ విధంగా అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న పదాల్ని ఉపయోగించేటప్పుడు, చిన్న చిన్న యిబ్బందులు ఏర్పడుతున్నాయి. అన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటి పదాలను వాడితే బాగుంటుందని అనుకుంటున్నాను.

రచయిత రాసి తనే బాణి గట్టి పాడే పాటలకు ఎట్లా రెస్పాన్స్ వుంటుంది అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. పాటల విషయంలో నేను ఎక్కువ భాగం గద్దర్ గారిలాగా ప్రజల బాణీలతో ఎక్కువ సంబంధం లేని వాణ్ణి గాబట్టి దాదాపుగా సినీ ట్యూన్స్ లేదా క్లాసికల్ ట్యూన్స్ నించే నాకు తడ్తుంటాయి. అయితే అలాంటి ట్యూన్స్ కూడా కొన్ని జనంలో బాగా ప్రచారంలో వున్నాయి.

రామనరసయ్య గారి పాట గుంటూరు చెన్నయ్య అనే కామ్రేడ్ రాశాడు. ఆ రచయిత ఒక సినీట్యూన్ వేశారు.

అన్న అమరుడూ
మన రామనరసయ్య.
పీడితా ప్రజలా
ఆశాజ్యోతి…

ఆ పాట నాచేతి కొచ్చింతర్వాత ట్యూన్ మార్చాను.

అన్న అమరుడురా…
మన రామ నరసయ్య …
పీడితా ప్రజలా ఆశాజ్యోతి… || అన్న ||

కష్ట జీవిగ పెరిగినాడు
కాయ కష్టం చేసినాడు
కష్ట ఫలితమె కోరినాడు
కమ్యునిజమే నమ్మినాడు || అన్న ||

ఈ బాణీ చేసి నేను దాదాపుగా హైద్రాబాదునుంచి శ్రీకాకుళం దాకా పాడితే ఈ ట్యూన్ కు అందర్నీంచీ చాలా రెస్పాన్స్ వచ్చింది. ప్రధానంగా రామ‌న‌ర్స‌య్య‌గారి జన్మస్థలమైనటువంటి ములుగు తాలూకా చల్వాయి గ్రామంలో 68వ స్మారక సభకు పోతే దాదాపుగా పది వేల మంది జనం హాజరయ్యుంటారు. మొట్టమొదటిసారిగా ఆరోజే అంటే అంతకుముందు రెండు రోజులు ఆ బాణీ వేసి అక్కడ పాడితే నిజంగా అక్కడ జనం పాట మొత్తం విని ఏడ్చేశారు.

జంపాల ప్రసాద్ కు జోహార్లు అర్పిస్తూ కాశీపతిగారు రాసిన పాటకు కూడా నేను స్వయంగా బాణి వేసాను . అది కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రచారంలో వున్నది.

ఉయ్యాల లూగింది శిశువు
విప్లవ సయ్యాట లాడింది శిశువు
ఉయ్యాలో… జంపాలా…
ఈ దోపిడి కూల దొయ్యాల…
విప్లవాల డోలలలో ఊగే ఓ కామ్రేడా
నీ బారసాల జరిపేము చెరసాలలో మేము
పీడిత జనముక్తి కొరకే పోరు బెట్టినావురా
ప్రళయకాల కడలి మించి హోరు బెట్టినావురా ||ఉయ్యాలో ||

అలాగే ఇంకా కొంత మంది రచయితలు ఉదాహరణకు ‘నమ్ము’గారు రాసిన కొన్ని పాటలు భువనగిరి, ఆలేరు ఆ ప్రాంతంలో ఎక్కువ ప్రచారంలో వున్నాయి –

కూలీలు మనమంతరో మనకు పొలిమేరలే లేవురో
పల్లెటూరోడైన పట్టణాలోడైన ఏ దేశపోడైన || కూలీలు ||

అది- దాని తర్వాత గోదావరిఖనిలో ‘అరుణతార’ అనే ఒక రచయిత కూడా ప్రజల బాణీలో పాటలు రాస్తారు. ఆయన రాసిన కొన్ని పాటలు వినిపిస్తాను. 1976 అక్టోబర్ 31 తేదీన రామనరసయ్యగారు అరెస్టయినపుడు ఆ నలుగురు వీరులకు జోహార్లర్పిస్తూ

జీపీ మీద జీపీ వచ్చే అన్నలార
జీపీలోన పోలీసొచ్చె అన్నలార – అని చాలా పెద్దపాట అది. అలాగే

అమాస చీకటి అర్థ రాతిరి చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా
యిల్లు దాటితివి పల్లె దాటితివి చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా

అని-

సావిత్రమ్మలు అనసూయమ్మలు చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా
జన్మించిన ఈ గడ్డ మీదనే చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా
మానమమ్ముకొని బతకవలసెనా చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా
పచ్చనోట్లకె బలిగావలసెనా చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా

అని చెప్తూ మరేం చేయాలి

కోడెనాగుపై రావాలమ్మా చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా…

అని ఈ పాట గోదావరిఖని దాదాపు కరీంనగర్ జిల్లాలో ఎక్కువ ప్రచారంలో వున్న పాట. అలాగే అది తేదీ తెలియదుగానీ గుంటూరు జిల్లాలో గ్రంథసిరి అనే గ్రామంలో ఒక భూస్వామి అక్కడున్నటువంటి హరిజనుని చంపేస్తే హనుమంతరెడ్డిగారు ఒక పాట రాశారు.

చెప్పులను గుద్దేటి రామయ్యో….

పల్నాడు తాలూకాలో ఈ పాట ఎక్కువ ప్రచారంలో వుంది. రచయితలు గద్దర్ గారు చెప్పినట్టు ప్రజలతో జీవిస్తూ మరి బాణిలని, ఆవిధంగా పాటలని అభివృద్ధి చేయాలి.

ఈవిధంగా అనేకమంది రచయితల పాటలను వివిధప్రాంతాల్లో పాడుతున్నప్పుడు ఎక్కువ భాగం కొన్ని పదాల యిబ్బందుల వల్ల తప్పితే దాదాపు అన్ని చోట్ల మంచి రెస్పాన్సు వస్తున్నది.

రచయితలను నేను కోరుతున్నటువంటిది… అరుణోదయ సాంస్కృతిక సంఘం

నించి నేను కోరుతున్నటువంటిది… ఎక్కువ‌ భాగం ఇంతకుముందు గద్దర్ గారు తమ అనుభవాలు ఎలా చెప్పారో అలాగే మిగతా రచయితలందరూ ఆయన నించి ప్రజాజీవితానుభవాలు తీసుకోవాలని కోరుతున్నాను! ఐతే నాదొక చిన్న మనవి ఏంటంటే దాదాపు ఈ రచయితలందరూ పాటలు రాస్తూనే వున్నారు. అవి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినవి. నేను పోయిన అన్ని పట్టణాల్లోనూ చాలామంది కార్మికులు అడుగుతున్నారు. మొత్తంగా ఈ విప్లవ రచయితలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన రచనలే చేస్తున్నారు తప్ప కార్మికులకు సంబంధించినటువంటి రచనలు, నాటికలు గాని, నాటకాలు గానీ, ఏమీ లేవని అన్ని ప్రాంతాల్లో కార్మికులు అడుగుతున్నారు.

కాకపోతే చెరబండరాజు గారి టెంపరరీ లేబర్ లాంటి కొన్ని నాటికలు మాత్రమే వున్నాయి. మున్ముందు ఇంకా కార్మికవర్గానికి సంబంధించినటువంటి నాటకాలను, నాటికలను రాయాలని యింతకుముందు గద్దర్ గారు చెప్పినట్టు వారి అనుభవాలను మనం దృష్టిలో వుంచుకొని ఆ పద్ధతిలో రాయటానికి ప్రయత్నించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.”

కర్నూలు జిల్లా, ఆలూరు మండలం మొలగపల్లిలో నిరుపేద దళిత కుటుంబంలో 1955 జూలై 1న‌ పుట్టిండు. ఆయన అసలు పేరు సత్యం. విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా అరుణోదయ రామారావుగా పరిణామం చెంది పాటకు పర్యాయ పదంగా నిలిచిండు. చివరి శ్వాస వరకు ప్రజా కళలను ప్రజల కోసం దేశంలో విస్తృతంగా ప్రచారం చేయడంలో అరుణోదయ సాంస్కృతిక సేనానిగా ముందుకు నడిచిండు. హైదరాబాదులో మే 5, 2019న గుండె పోటుతో చనిపోయిండు.

Leave a Reply