పల్లె.. నది.. అడివి.. బిభూతిభూషణ్ బందోపాధ్యాయ

యెవరైనా “మీకిష్టమైన రచయిత యెవరు?” అని అడగ్గానే చప్పున చెప్పలేను. బహుశా చాల మంది చెప్పలేరనుకొంటాను. విభిన్న సమయాల్లో.. భిన్న వాతావరణాల్లో.. ప్రపంచ సాహిత్యాన్ని చదువుతూ వున్నప్పుడు వొక్కో రచన మనలో వేలవేల సూర్యచంద్రుల్ని వెలిగిస్తోంది. అలాంటప్పుడు వొక్క రచయితనో.. వొక్క పుస్తకాన్నో చెప్పటం యేమంత సులభం కాదు. కానీ కొన్ని రచనలు చదివినప్పటి నుంచి మనల్ని అవో, వాటిని మనమో పెనవేసుకుంటాం. అవి మన శ్వాస.. జీవన శ్వాస.. అంతరంగిక శ్వాస.. అటువంటి రచనల్లో నేను అమితంగా ప్రేమించే రచయిత బిభూతిభూషణ్ బంధ్యోపాధ్యాయ గారు. పశ్చిమ బెంగాల్ లో నదియా లో వొక సంస్కృత పండితుని కుటుంబంలో 1894 సెప్టెంబర్ 12 న జన్మించిన బిభూతిభూషణ్ బందోపాధ్యాయ యిరవై వొక్క నవలలు, 8 కథా సంకలనాలు, డైరీలను సాహిత్య ప్రపంచానికి అందించారు.

బిభూతిభూషణ్ బంధ్యోపాధ్యాయ గారి మొదటి నవల 1929 లో వచ్చిన ‘’పథేర్ పాంచాలి’’ 1950 లో వచ్చిన ‘ఇచ్ఛామతి’కి వారి నవలల్లో చివరిది. భిభూతిభూషణ్ అమూల్యమైన “పథేర్ పాంచాలీ”, “వనవాసి”, “జల్సాగర్”, ‘ఇచ్ఛామతి’కి నవలల్లో అడవులు, నదులు, వెండి మబ్బుల విన్యాసాల్ని బలంగా నాటారు. పచ్చని పూలతో తలలూపే కాష్బాన్ వృక్షాలు, యెర్రని తురాయి చెట్లు, నీలం-వూదా రంగుల్లో నదిలో వికసించే కలువ, తామర, నీటి మల్లె పువ్వులు, అత్తి చెట్లు అవి చెప్పే చల్లని నీడల కథలు, అలాంటి అనేక ఘనీభవించిన క్షణాలకు లెక్కవుండదు. అడవి ఆయన రచనలలో వొక నేపథ్యం కాదు, అది వొక ప్రాణమున్న పాత్ర. దాని వునికి సున్నితమైనది, ఆరోగ్యకరమైనది, ఆహ్లాదకరమైనది. బీభూతిభూషణ్ పాత్రలను తీర్చిదిద్దే విధంగానే అరణ్యంకి ప్రాణం పోస్తారు. ఆ అడవి మనల్ని యెంతగానో ఆకట్టుకుంటుంది. జీవితాంతం మనల్ని వదిలిపెట్టదు. ఆయన నవలల్లోని ప్రతీ పాత్ర అడవి, నదితో సహాప్ విధి యెగుడుదిగుడుల్ని యెదుర్కొనే విధానం, నిశ్చలత, అంతులేని ఆశాభావంతో జీవితంలోని అరుదైన క్షణాలను వెలిగిస్తారు.

అమితవ్ ఘోష్ ‘ది గ్రేట్ డిరాంజ్‌మెంట్’ని చదివినప్పుడు యింగ్లీషు, తెలుగు,తమిళం, మలయాళం ,భాషలలోకి తర్జుమా అయిన బందోపాధ్యాయ్, యింకా అనేక మంది యితర “నదీ పరిచ్చాయ” రచనలు మెదిలాయి.

‘ది గ్రేట్ డిరాంజ్‌మెంట్’ లో, “గణనీయంగా మారిన ప్రపంచంలో, సముద్ర మట్టం సుందర్‌బన్స్‌ను మింగినప్పుడు కోల్‌కతా, న్యూయార్క్, బ్యాంకాక్ వంటి నగరాలు నివాసయోగ్యంగా మారినప్పుడు, పాఠకులు, మ్యూజియం సందర్శకులు కళ, సాహిత్యంల వైపు మొగ్గు చూపినప్పుడు వారు తమ వారసత్వపు మూలాలు, మారిపోయిన ప్రపంచపు జాడలు, చిహ్నాల కోసం వెదుక్కోలేదా? వారు వాటిని కనుగొనడంలో విఫలమైనప్పుడు, ప్రజలు కష్టాల్ని, నిజ జీవిత వాస్తవాలను గుర్తించకుండా, నమోదు చేయకుండా నిరోధిస్తున్న అనేక కళలు, సాహిత్యాలను దాచిపెట్టే సమయం మనది అని నిర్ధారించడం మినహా, నిట్టూర్చడం మినహా వారు యేమి చేయగలరు? బహుశా, యీ యుగం దాని స్వీయ-అవగాహనపై తనను తాను అభినందించుకుంటుంది. తన వికృత మొఖాన్ని ప్రదర్శిస్తోంది. యిది గొప్ప వినాశన సమయం అని తెలుస్తుంది. ” అంటూ ఘోష్ ఆక్రోశిస్తారు.

కానీ వాతావరణ మార్పులు, సహజ ప్రపంచం పతనం యెల్లప్పుడూ నలుగుడులో పూర్తిగా మనపై పడదు. కొన్ని రోజులకి మనపై పడుతున్న అసాధారణమైన మార్పులలో దాని పాదముద్రల సవ్వడి కచ్చితంగా వినబడుతుంది. మనం గ్రహించేలోపే కలుషితమైన, అనకట్టలు కట్టి పీలికలైన నదులు మనముందు వాస్తవంగా నిలుస్తాయి. ఖాళీ నదీ తీరాలు, పూడిక తీసిన నదీ కాలువలు, దాహం తీర్చే వాగులు ,బంజరు మూలాలు కొత్తగా, సాధారణంగా కనిపిస్తాయి. రోజువారీ శబ్దం మనల్ని కలవరపెడుతున్నప్పుడు మనం మనల్ని సమీపించే ఆపదను యెలా వింటాం?

“మనం వర్తమానాన్ని పునరుద్ధరించాలంటే, మనం కచ్చితంగా మన గతాన్ని తెలుసుకోని తీరాలి” అని చెబుతారు.

కానీ మూలాల మనకు తెలుసా?
భూమి మీద నదులు యెలా వుండేవి? బెస్తలు పట్టిన చేపల బరువుతో పడవలు మూలుగుతున్న సమయం నిజంగా వుందా? నది పక్కన నివసించడం, నది వొడ్డున పూసే నాగకేసర పువ్వులను తీయటమంటే యేమిటి? మనుషుల హృదయాలను అద్భుత పరిమళాల అడవి యెలా ప్రభావితం చేసింది? వొక పిల్లవాడు తన తండ్రితో కలిసి నది వొడ్డున కూర్చుని మెరిసే నక్షత్రాలను, జుమ్మని యెగిరే తుమ్మెదలను చూస్తున్నప్పుడు, ఆ పిలవానికి యేమనిపించి వుంటుంది? వొక పల్లెటూరి స్త్రీ సాయంత్రం యీత కోసం వరదల నదిలోకి దూకినప్పుడు నిజంగా యేమి జరుగుతోంది? తమ నది చనిపోతోందని పురుషులకు యెలా తెలుస్తుంది?

వొకప్పుడు సమాజ చైతన్యంలో అంతర్భాగంగా యేర్పడిన యీ పాత అనుభూతులు యిప్పుడు మనలో చాలా మందికి అధివాస్తవికంగానో, కొట్టిపారేసే కట్టు కథలుగానో అనిపిస్తాయి. వాస్తవానికి ఆ అనుభవముందా?! అయితే మనం యెన్నడూ అనుభవించని దానిని భవిష్యత్ తరాలకోసం భద్రం చేయడం కష్టమే. అలానే వొకప్పుడు గ్రామాలు యెలా వుండేవి?! వచ్చిన మార్పులు యేమిటి?!!

యిది సాహిత్య విమర్శ కాదు. నేను రెండు పదబంధాలకు మించి బంగ్లాను చదవలేను, అర్ధం చేసుకోలేను. కొన్ని ప్రాంతాలు, భాషలు బెంగాల్ మాదిరిగా తమ ముద్రల్ని వేస్తాయి. బంగ్లా నవలలు, చిన్న కథలు, కవితలు, పాటల అనువాదాలపై ఆధారపడి, సత్యజిత్ రే అపరాజితో, జిబానానంద దాస్ “రూపసి బంగ్లా” లేదా అపూ పయనించిన ప్రాంతం నా స్వంతం అయినప్పుడు అందులోని మంత్రముగ్ధత నన్ను కమ్ముకున్నాయి.

“అన్నింటికన్నా పచ్చని భూమి యెక్కడ వుంది –
మీ పాదాలు తప్పనిసరిగా యెక్కడ లేత గడ్డి వుంటుందో అక్కడే పడాలి?

మధ్యాహ్నపు యెదుటెండలో బంగారు ధాన్యం వూగుతుంది యెక్కడైతే యెర్రబడే తామర పువ్వులు వుంటాయో అక్కడ?
యిది మన స్వంత బెంగాల్, అన్నింటికంటే పచ్చటి భూమి. ”
… అపరజితో అపు ట్రాయాలజీ
సత్యజిత్ రే రూపొందించిన అపు త్రయం మూడు చిత్రాలను కలిగి వున్న వో గొప్ప జీవిత పయనం. భారతదేశంలో యిప్పటివరకు వచ్చిన వుత్తమ చిత్రాలలో అవి మొదటి స్థానాల్లో వుంటాయి. యీ మూడూ బిభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ్ నవలలు పతేర్ పాంచాలి, అపరాజితో నవలల ఆధారంగా నిర్మించినవే.

“పథేర్ పాంచాలి’’ లో దుర్గ బిభూతి భూషణుడిదో, సత్యజిత్ రే దో, బెంగాలీ అమ్మాయో కాదు అచ్చంగా అందరిది. నవల చదివినా, సినిమా చూసిన “పథేర్ పాంచాలీ” లో దుర్గ పూరిళ్ళ చూరుల నుంచి జారుతోన్న వానధారల్లో చెదరని వెచ్చని ఆత్మీయ వెన్నెల్లా తోస్తుండేది.
‘యీ పెద్దపెద్ద కళ్ళ బక్కపిల్ల దుర్గ’ని చదువుతుంటే దుర్గ నా జీవితపు వూపిరిగా యెప్పుడు నిండుకొందో యేమో కానీ దుర్గని పట్టి యిచ్చినందుకూ దుర్గలాంటి పాపాయి కలని యిచ్చినందుకూ… యెక్కడ బెంగాల్… యెక్కడ మనం… యెలా చొచ్చుకొని వచ్చేసారో అపూ.. దుర్గా.
‘అపూ సెల్ఫిష్’ గానే తోస్తారు. కుటుంబాల్లో స్వార్ధపరులంటే చికాకు.. బాధ… అపూలా వుంటే కుటుంబాల్లో జీవితాలు యెంత దుఖానికి హేతువవుతాయో అర్ధమయ్యే కొద్దీ చలించిపోతాం. మధ్యతరగతి కుటుంబాల్లో అపూ లాంటి వాళ్ళు గుర్తొచ్చారు.

రైలుకూతని విన్నప్రతీసారీ ‘హోంసిక్ నెస్ వస్తుంది… దుర్గ గుర్తొస్తుంది.
రైలు కూత విన్న ప్రతిసారీ దుర్గ యెంత గుర్తు వస్తుందో అంతకు రెట్టింపు ఆ అమాయక బాలబాలికల మాటల నేపధ్యగానంగా వినిపించే రైలుకూత గుండెల సవ్వడి వినిపిస్తుంటుంది… ఆ రైలు కూతెప్పుడూ ‘దా… నీ ఆప్తుల దగ్గరకి తీసుకుపోతాను అంటూ ప్రాణం నిలువునా బెంగని సలసలా పరిగెత్తిస్తుంటుంది.

‘దుర్గంటే తనకి పరిచయం అయిన ప్రతీది తమ్ముని అనుభవంలోకి నింపే అమ్మ హృదయమున్నఅమ్మ… ఆ పసితనపు చిగురింత నడిచి వొచ్చే ప్రతి తోవలోనూ పలకరిస్తోనే వుంది… లేత పిందెల మామిడి కాయల రుచి చూపిస్తూనే వుంది… సదాబాలిక దుర్గ.
అవును… దుర్గ మన హృదయంలో గూడుకట్టుకొన్న పెద్దకళ్ళ గువ్వపిల్ల… దుర్గ మన మనసంతా పల్లవించే లేతరెల్లుపూల పాట.

వోసారి కలకత్తా వెళ్ళినప్పుడు ఆ “నిశ్చిందిపురం” వెళ్లాలని మనసులో బలమైన కోరిక. కలకత్తా ట్రామ్ పట్టాల వెంట నడుస్తూ వుంటే పథేర్ పాంచాలీ సినిమా షూటింగ్ చేసిన 24 పరగణాల్లోని బోరల్ విలేజ్ ని చూడాలని అలానే నడిచి వెళ్ళిపోవాలని అనిపించింది. అపూ తన చిన్ననాటి యింటికి , నిశ్చిందిపురానికి తిరిగి వెళ్లాలని మనమందరం కోరుకుంటాము. కానీ అతను వెళ్ళలేదు.
కానీ “పల్లెలో దుర్గా అపూ వుంటారు కదా.. అక్కడే వుండిపోవాలి” అని వొక చదువరికి అనిపించటానికి మించిన మమేకత యేముంటుంది యే రచనకైనా?!!

1937-39 సమయంలో రచించిన వనవాసి (అరణ్యక) అడవుల నిగూఢ సౌందర్యాన్ని బయట పెట్టింది. బీహార్ అడవుల్లో వుండటాన్ని భరించలేని వొక పట్టణవాసి సత్యచరణ్ అదే అడవి ప్రేమలో పడతాడు. అడవంతా తిరిగి వస్తూనే వుంటాడు. అడవిలో మైమరచిపోయినప్పటికీ అతని పని అడవిని నరికించి, జనవాసాల కోసం మార్గాల్ని యేర్పాటు చేయించడం. రాసుకుంటారు, “అడవుల మీద వొక నవల. యీ వొంటరితనం, చెట్లు, మొక్కలు, మనుషుల కథలు … యీ సాయంత్రం చీకటిలో దట్టమైన అడవి చిత్రాన్ని కలిగి వుండాలి” అని తన డైరీలలో విభూతిభూషణ్ రాసుకొన్నారు.

బిభూతిభూషణ్ ప్రతిరోజూ అడవిలో మైళ్ల దూరం నడిచేవారు. సాధారణంగా అరణ్యంతో చుట్టుముట్టబడినప్పుడు రాయడం కోసం తన నోట్‌బుక్‌ని తీసుకొని వెళ్ళేవారు. అదే బంగ్లాలో కూర్చొని రాసివుంటే రచయిత కేవలం కొన్ని ఆస్పష్ట రేఖల్ని గీసివుండేవారు.
“కానీ బిభూతిభూషణ్ అడవిలో వొంటరిగా నడుస్తూ చిన్న గడ్డిపోచల సవ్వడిని సైతం సమగ్రంగా చిత్రించగలిగారు.”
“నా సాహిత్యం సారాంశం విశాలమైన స్థలాన్ని, గడిచే సమయాన్ని వర్ణిస్తుంది.” అని వారొక వొక లేఖలో అన్నారు.

యీ నవలని సాహిత్య అకాడమీ కోసం ముద్రించిన సరస్వతీ పవర్ ప్రెస్ ప్రాంతంలో తిరుగాడుతూ వనవాసి యిక్కడే కదా ప్రింట్ అయిందని యెన్ని సార్లు అనుకున్నానో. మనకి యెదురైనా అనుభూతిని పంచుకునే మిత్రులు చుట్టూ లేని ఆ రోజుల్లో యెన్ని సార్లు ఆ వనవాసి గురించి రాసుకున్నానో. కడియపు పూల తోటల వెంటో తిరుగుతున్నప్పుడో, నర్సీపట్నం మారేడిమిల్లి అడవుల వెంటో యే పిక్నిక్ కో వెళ్ళినప్పుడు మహాలిఖారూప పర్వత శ్రేణి, మోహన్ పురా అడివి, పువ్వులు చప్పున కళ్ళల్లోకి వచ్చేసేవి. గుర్రమెక్కి వెన్నెల్లో అడివి అడివంతా తిరుగుతూ… అమ్మాయిని కదా గుర్రం యెక్కనిస్తారా… తోలనిస్తారా… గుర్రాన్ని యెక్కడ నుంచి తీసుకురావాలి?! గోదావరి వంతెన మీద నుంచి తిరుగాడే గుర్రబళ్ళు చూసినప్పుడు యీ గుర్రంబండబ్బాయిని అడిగి గుర్రం తీసుకోవాలి.. గుర్రాన్ని తోలటం నేర్చుకోవాలి యిలాంటి ఆలోచనలు.. గుర్రమెక్కి అరణ్యాల్లో కొండాకోనల్లు తిరగలేదు కానీ ఉదకమండలంలో నీలినీలి మేఘాలు వొంటికి చుట్టుకొంటుంటే ఆ చిన్నిచిన్ని యెత్తు పల్లాల్లో గుర్రమెక్కి తిరగడానికి అప్పటి చిన్ని ప్రాక్టీస్ పనికొచ్చింది. అలా సరదాగా తిరుగుతున్నప్పుడు నీలగిరుల మీద చిన్నిచిన్ని పువ్వులని చూసినప్పుడు వనవాసిలోని కొండల చరియల మీదున్న గోల్ గోలీ చెట్లూ, యూకలిప్టస్ చెట్లని చూస్తూంటే శాలవనాలూ చూపుల్లో చిక్కుకునేవి.
యిది కదా సాహిత్యమంటే.. యిది కదా జీవనపు వెలుగునీడల్ని పట్టి మనసు దోసిళ్ళలో పోయటమంటే… రోజుల తరబడీ.. నెలల వెంటా సంత్సరాల వెంటా మనతోనో ప్రయాణించే వొక్క సాహిత్య ప్రక్రియా మనల్ని అంటి పెట్టుకుని వుంటే చాలు కదా.. మనతో మనం వసంత పూర్ణిమ నాటి రాత్రి. నిర్జనమైన అరణ్యమయ పర్వత మార్గంలో, గుర్రం మీద వొంటరిగా వెళ్ళాలనే కోరికని అనుచుకోలేకపోయి సత్యచరణ్ బయలుదేరుతాడు. అతను కొంత దూరం ప్రయానించాక అకస్మాత్ గా సూర్యాస్తమయ దృశ్యమూ, అదే సమయంలో తూర్పున, అతి దూరాన, కృష్ణవర్ణరేఖవలె దృగ్గోచరమౌతున్న మోహన్ పురా రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా, నవోదయ పూర్ణ చంద్రబింబ సాక్షాత్కారం – యేక సమయంలో వుదయాస్తమయాల దృశ్యం చూసి చకితుడై పోయింది సత్యచరణ్ మాత్రమే కాదు పాఠకులు కూడా. యెటుటువంటి వెన్నెల – వెన్నలవెలుగులు చిమ్మిన వెన్నెల్లో నక్షత్రాలు దాదాపుగా కనిపించనే లేదు. నలుదిక్కులా అతనా రోజు వెన్నెల్ని చూసి అనాగరిక నిష్టూర అరణ్య ప్రకృతి, తన స్వేచ్చా స్వాతంత్ర్యాల మంత్రం వుపదేసించి తనకి దీక్షనిచ్చిందని, యింక నగరంలోని పంజరాలలో తనెలా సహించి నులువగలను? మార్గమంటూ లేని యీ పర్వతారణ్యమయ ప్రదేశంలో, విముక్తాకాశతలం కింద నిండు పున్నమిలో, గుర్రాన్ని కళ్ళెం విడిచి స్వేచ్చ గా మహా వేగంతో ప్రయాణం చేసే ఆనందాన్ని మించి ప్రపంచంలో తనకి మరే సంపదా వొద్దు అనుకుంటారు సత్య చరణ్.
యీ ‘వనవాసి’ మనల్ని అరణ్యంలోనే జీవముంది అక్కడికే వెళ్ళిపోయి బతకాలనిపిస్తుంది.

యిక బిభూతిభూషణ్ ” ఇచ్ఛామతి ” కి వొస్తే వొకప్పటి జ్ఞాపకశక్తి తాలూకూ వొక గొప్ప మ్యూజియం. దాదాపు అంతరించిపోయిన వో నది పక్కన వొకప్పుడు విలసిల్లిన జీవన విధానం. ఇచ్ఛామతి వొడ్డున జీవితం యెలా సాగుతూ వుండేదో, మన నదులు నిండి, అడవులు పచ్చగా వుంటే యెలాంటి ప్రశాంతత, సంతృప్తి సాధ్యమవుతుందో దాన్ని చదివాక నమ్మాలనిపిస్తుంది. యీ పుస్తకం చదవడం అంటే మన సాహిత్యంలో ప్రతిబింబించే విధంగా వొకప్పటి భారతదేశంలోని నదులు, అరణ్యాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం. నేడు అలాంటి రచనలు తక్కువయి పోవడమే కాదు, అసలు రావడం లేదనే చెప్పాలి. విభిన్న నదులను అనుసంధానించడం వల్ల, అనకట్టలు కట్టడం వల్ల వేలాది హెక్టార్ల అడవులు మునిగిపోవడం గురించి ఆలోచనని మాత్రం రానివ్వదు.

అదిగో యిలాంటి సమయాల్లోనే బిభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ్, అద్వైత్ మల్లబార్మన్ , అరుంధతీ రాయ్, భూపేన్ హజారికా ,జాసిమ్ వుద్దీన్ పాటలు, రవీంద్రనాథ్ టాగౌర్, జిబానంద దాస్, కాళిదాసు మేఘదూత్, లేదా సిలప్పాదికారం లేదా గంగలహరి వంటి పాటలు, ఋత్విక్ ఘటక్, మొదలైన వారు గొప్ప అమూల్యమైన వారసత్వ పాత్రను మనకి అందిస్తున్నారు. వొక సాంస్కృతిక ,పర్యావరణ సంపద వారి సాహిత్యంలో చాలా సజీవంగా ప్రవహించేది.
యీ కళాఖండాలు నేడు డిస్టోపియన్ దేశంలో ప్రమాదంలో వున్న వాటిని అర్థం చేసుకోవడానికి వొక స్పూర్తిని అందిస్తాయి. స్వచ్ఛమైన గాలి, నీరు మాత్రమే కాదు, బహుశా మనలో మాయమైపోతున్న మానవత్వాన్ని కూడా తిరిగి మనకు పరిచయం చేస్తాయి.

‘ఇచ్ఛామతి’కి మరో వైపున, కమలంతో నిండిన మధుఖాలి చిత్తడి పక్కన, బెట్రాబాటి నదిని దాటుతున్నప్పుడు, నా రహదారి చాలా దూరం విస్తరించి వుంది, వొక దేశం నుండి మరొక దేశానికి, నేను మీ నుదిటిలో సంచారి అదృశ్య గుర్తును యిచ్చాను, మిమ్మల్ని మీ యింటి నుండి బయటకు తీసుకువచ్చాను. యిప్పుడు మనం ముందుకు వెళ్దాం. ”
యిక వారి నవల “ఇచ్ఛామతి” ని చదువుతున్నప్పుడు యెప్పుడెప్పుడు చూద్దామనే కుతూహలం. ఆరాటం. యీ నవలని అనువదిస్తూ చాల సార్లు చాల సేపు ఆ నది ఆలోచనల ప్రవాహం చుట్టూ ప్రపంచాన్ని మరిచిపోయేలా చేస్తోంది.

“ఇచ్ఛామతి” చిన్న, అందమైన నది. వొక సంగ్రహావలోకనంతో ప్రారంభమవుతుంది. యిది “నాడియా , జెస్సోర్’ జిల్లాల గుండా ప్రవహిస్తుంది . మొదటి పేజీలోనే బిభూతిభూషణ్ జీవావరణశాస్త్రం, అత్యున్నత జ్ఞానం గురించి తెలుసుకుంటాం. ఆయన నదిని శృంగార భరితంగా వర్ణించలేదు. కానీ వెదురు, కిరీటం పువ్వులు, నీటి పాలకూర, దుర్బా గడ్డితో పాటు వొడ్డున మర్రి,రావి, సెముల్ వంటి గంభీరమైన చెట్లతో బెంగాల్ వికసించే నది వొడ్డు లక్షణాన్ని వర్ణించాడు . పువ్వులు, చెట్లు కేవలం అలంకారాలు కావు. వాటికి పేర్లు, గూళ్లు పాత్రలపై వాటి ప్రభావాలు వుంటాయి. వారు “ఇచ్ఛామతి”లో 50 కి పైగా నిర్దిష్ట మొక్కల గురించి వివరించారు. దానిని అనువదించిన చందా చటోపాధ్యాయ్ బెవట్రా లాంటి వాళ్ళు ఆ మొక్కల లాటిన్ , సాధారణ పేర్లను కలపడానికి కష్టపడి ప్రయత్నించారు. బిభూతిభూషణ్ పనిలో అరణ్యం, నది ప్రధాన పాత్రధారులుగా, మానవ పాత్రలకు సాక్షులుగా మనకు అనిపించిన సందర్భాలు చాలా వుంటాయి.

“ఇచ్ఛామతి” నదికి భిభూతిభూషణ్ సజీవతనిచ్చారు. ప్రవహించే “ఇచ్ఛామతి” సాక్షిగా కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్న ఘటనల్ని రాసారు. ఇచ్ఛామతి వొడ్డున నివసిస్తున్న ప్రజల చిరునవ్వులు, కన్నీళ్లని, సమస్త జీవితాల్ని నమోదు చేస్తారు. యింకా: “యీ సందేశాలు, సంఘటనలు, యీ పాత కథలన్నీ మన దేశానికి నిజమైన చరిత్ర. నిశ్శబ్ద ప్రజల చరిత్ర, చక్రవర్తులు, రాజుల విజయ కథలు చరిత్ర కాదు” అని అంటారు వారు.

యిది బెంగాల్‌లో “నది” నేపథ్యంలో నవలలు రాసిన చాలా మంది రచయితలను బంధించే వొక సాధారణ అంశం. వారు మట్టి మనుషుల కథల విలువను అర్థం చేసుకున్నారు. అద్వైత్ మల్లబార్మన్ ” టిటాష్ యేక్తి నాదిర్ నామ్‌” లో చెప్పినట్లుగా , “టైటాష్ వొక సాధారణ నది. చరిత్ర పుస్తకం, క్రానికల్స్ లేదా జాతీయ తిరుగుబాట్లలో యెవరూ దాని పేరును కనుగొనలేరు. కానీ అది నిజంగా చరిత్ర లేకుండా వుందా? దాని తీరాలు దాని ప్రజల కథలతో నిండివుంటాయి. అవి కథలు కాదు చరిత్ర. అది చరిత్ర అని కొంతమందికి తెలుసు, మరికొందరికి తెలియదు. ”
హన్సూలీ బ్యాంకర్ వుపకథలోని తారాశంకర్ బందోపాధ్యాయ్ కేవలం కోపాయి నది వొడ్డున జరిగిన సంఘటనలే చరిత్ర అని చెప్పే, “చిన్న కథనం (వుపకథ) గొప్ప నది కథల కోవలో చేరింది.”

“ఇచ్ఛామతి’’ పంతొమ్మిదవ శతాబ్దం రెండవ సగంలో బెంగాల్ విడిపోని కాలంలో పంచపోత, మొల్లహతీ అనే గ్రామంలోని జీవితాన్ని చిత్రీకరిస్తుంది. ఆ రెండు గ్రామాలు నీలిమందు తోటల మీద ఆధారపడి బతికే గ్రామాలే. 1859-1862లో జరిగిన నీలిమందు తిరుగుబాటుతో సహా, ప్లాంటేషన్ రోజుల అల్లకల్లోలాలను వర్ణించినప్పటికీ, ఇచ్ఛామతి ప్రధానంగా “ప్లాంటేషన్” నవల కాదు. నీలిమందు పోరాటాల చారిత్రాత్మక నేపథ్యం వున్న నవల కాదు.

యిది వొక నది వొడ్డున వొక సమయంలో జరిగిన కథ. మెలోడ్రామా ,పదునైన మలుపులు లేని అనేక సౌందర్యాత్మక భావాలతో నిండిన వొక కవితా నవల. యిందులో దుర్మార్గులు లేరు. వలస వచ్చిన బుర్రా సాహెబ్ , చిన్న గ్రాంట్ సాహెబ్ లను కూడా అవకాశం వున్నప్పటికీ రచయిత విలన్లుగా చిత్రీకరించలేదు. మరణ శయ్యమీద పడుకొని బుర్రా సాహెబ్ యింగ్లాండ్‌లోని తన నదుల గురించి కలలు కంటుంటాడు. అయితే కోల్స్‌వర్త్ గ్రాంట్ బెంగాల్‌ను “శకుంతల భూమి- యీ అస్పష్టమైన చిన్న గ్రామంలో నది వొడ్డే తన జన్మస్థలం” అని భావిస్తారు.

యీ నవల్లో ప్రతి మహిళా కథానాయిక వొక సాహస వనితే. సిగ్గుపడే లక్షణం లేకుండా, దృఢంగా, ఆశ్చర్యకరంగా, “ఇచ్ఛామతి” వొడ్డుని వారి ప్రత్యేకమైన శోభతో ప్రకాశవంతం చేస్తారు.

అయితే “ఇచ్ఛామతి” నవలని నేను అనువదిస్తున్న సమయంలో ‘నిస్తారిణి’ అంటే వో ప్రత్యేకమైన అభిమానం, ఆరాధన కలిగాయి. అందమైన, తెలివైన, జ్ఞానం వున్న వధువు ప్రేమ నియమాల్ని లేదా గ్రామంలోని గౌరవం సోపానక్రమాల్ని అర్థం చేసుకోలేదు. అయితే వరదలు వచ్చిన నదిలో యీత కొడుతున్నప్పుడు “ఇచ్ఛామతి” నది గుండెల్లో దాగివున్న ముత్యంని కనుగొన్నది నిస్తారిణి.

భాద్రపద మాసంలో ‘ఇచ్ఛామతి’ వేగంగా ప్రవహించే పదునైన నీటిలో, గడ్డి కూడా కొన్ని క్షణాల్లో రెండుగా చిరిగిపోయింది. సొరచేపలు, మొసళ్ల భయంతో ప్రజలు ఆ సమయంలో స్నానం చేయడానికి భయపడతారు. నిస్తారిణి వీటిలో దేని గురించి యెప్పుడూ భయపడలేదు. నీటి కుండ సాయంతో సైతం యెప్పుడూ యీత కొట్టని వారికి యీతలోని ఆనందం గురించి ఆమె యేమి చెబుతారంటే “మీరు యిలాంటి వేళల్లో యీత కొడితే, దాదాపు వుధృతంగా పోటుతో పుట్టినట్టు వుంటారు, మీరే దాని విద్యుత్ కి లొంగిపోతారు. మీతో పాటు తేలియాడే వృక్షసంపద వస్తుంది. తోకా -పానా, తేలి కుచో లత నుండి ప్రకాశవంతమైన పండిన పండ్లు, మీరు ఛేదించుకుంటూ వెళ్లే నాచు దీవుల నుండి చిందుతున్న నది మీ ముందు కచ్చితంగా చిన్నబోతుంది. అలాంటి ఆనందం! విముక్తి ఆనందం! మొసళ్ళు మిమ్మల్ని పట్టుకుంటే.. పట్టుకొనివ్వండీ ! అది కూడా వొక రకమైన విముక్తి, ప్రత్యేకమైనది, వైవిధ్యమైనది. అది పరిపూర్ణ ఆనందం. ” అని చెప్పే ‘నిస్తారిణి’ భలే నచ్చారు.

యెన్నోయెన్నెన్నో మలుపుల్లో జీవన ప్రవాహమైన యీ నది మృదువుగా వంకర తిరిగినట్టు నవల ముగుస్తుంది.

నది వొడ్డున జీవితముంది అక్కడే బతకాలనిపిస్తుంది.

పల్లె.. అడివి.. నది – జీవితముంది.. జీవనముంది.. అర్ధవంతమైన ప్రయాణముంది… చూసారా.. రచయిత వొక్కరే… మూడు ఆవరణల్లోని జీవితాన్ని మన హృదయంలో వొత్తుగా నింపారు. అందుకే ఆ నవలలు చదివినప్పుడు ఆ ప్రాంతంలోకి వెళ్ళి బతకాలని బలంగా అనిపిస్తుంది. అక్కడున్నారు రచయిత.. యిటువంటి రచయిత మనకి చాల యిష్టమైన రచయిత అవ్వటంలో ఆశ్చర్యమేమీ లేదు.
బిభూతిభూషణ్ బంధ్యోపాధ్యాయ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వినమ్ర నమస్సులు.
***

కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, మూడు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, 'మసిగుడ్డ', 'ముక్త', 'ఇన్స్టంట్ లైఫ్', ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, ముక్త, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, 'నెమలీకలు పూసే కాలం' (కవిత్వం), 'మంత్రనగరి సరిహద్దుల్లో (ప్రేమ కథలు), 'పొగమంచు అడవి', 'మోహనదీ తీరంలో నీలి పడవ' (కవిత్వం) సంకలనాలుగా వచ్చాయి.

15 thoughts on “పల్లె.. నది.. అడివి.. బిభూతిభూషణ్ బందోపాధ్యాయ

 1. బిభూతి భూషణ్ పథెర్ పాంచాలి.. ఇచ్చామతి ఈ ఈ రెండు ఆయన రచనల్ని మీరు అవగతం చేసుకొని మాతో ప్రతి మై న్యూ ట్ డీటెయిల్స్ ను చెప్పడం ఒక ఎత్తు.. ఆ కథలోని ప్రదేనాల్లో మీరు తిరుగుతూ ఆ నోస్టాల్జియా ను పంచడం ఇవన్నీ మీ వ్యాసాన్ని అందంగా అద్భుతంగా తయారు చేసినది.. కొన్ని పాత్రలను మీరు ప్రత్యేకించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నిజంగా అబ్బుర పరిచింది..బేసిక్ గా మీరు కథయత్రి కావడం మూలాన్నేమో చాలా విషయాలను మాకు తెలియచేశారు.. ఆ ఇచ్చామతి ..ని ఎలాగైనా చదవాలని, అలాగే మరొక్క . సారి ఆ పథేర్ పాంచాలి మూవీ చూసే ఇష్టం కలిగేలా చేసారు…కుడొస్ మీకు..

  1. బిభూతి భూషణ్ సాహిత్యాన్ని పరిచయం చేయడం ద్వారా మమ్మల్ని ప్రకృతి ఒడిలో విహరింప చేశారు. గొప్ప రచయిత యొక్క రచనలన్నీ చదివేసిన అనుభూతిని కలిగించారు. మీ విశ్లేషణకు జోహార్లు. గతం ఎంత అద్భుతమైనదో ప్రస్తుత తరానికి తెలియాల్సిన అవసరాన్ని అత్యంత అద్భుతంగా చెప్పారు…

   1. వాణీ ప్రసాద్ గారు, హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్.

  2. సురేష్ గారు, మీ అభిప్రాయంని వివరంగా పంచుకున్నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్.

  3. మీ అభిప్రాయంని పంచుకున్నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు సురేష్ గారు.

  4. మీ అభిప్రాయం ని పంచుకున్నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్.

 2. చదవడాన్ని మర్చిపోతున్న ఈ కాలంలో, మరీ ముఖ్యంగా సాహిత్యాన్ని చదవడం అంటే గతానికి గుర్తుగా గడ్డకట్టుకుపోతున్న ఈ ఆధునిక తరుణంలో, నూరేళ్ల కిందటి సాహిత్యాన్ని నెమరు వేయించి, వంద వసంతాల కిందటి భారతీయ గ్రామీణ జీవితాన్ని జ్ఞాపకాల దొంగల నుంచి అతి భద్రంగా తీసి మనకందించిన గొప్ప సాహితీ సమీక్షకులు కుప్పిలి పద్మ గారు.

  బెంగాలీ జీవితం, సాహిత్యం తెలుగు వారిపై ప్రభావాన్ని చూపడం అనేది అనాదిగా వస్తోంది. పల్లె జీవితం, నదీతీరాలు, దుర్గమమైన అరణ్యాలు, కొండ గుట్టలు వాటితో ముడిపడిన బెంగాలీ జీవితాన్ని పోలిన జీవనం తెలుగు ప్రాంతంలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్లనే బిభూతి భూషణ్ బందోపాధ్యాయ గారు తమ రచనల్లో చిత్రించిన వాతావరణం చాలావరకూ మన తెలుగువారికి సుపరిచితమైనది గానే కనిపిస్తుంది. బిభూతి భూషణ్ గారి రచన లోని సౌందర్యం అప్పుడే తుట్టె నుంచి తీసిన పచ్చి తేనె వంటిదైతే, పద్మగారు దాన్ని మనకు సుగంధభరితమైన పూల రేకుల దొన్నెలలో ఆప్యాయంగా అందించారు ఈ వ్యాసంలో.

  బిభూతి భూషణ్ గారి రచనల్లోని ప్రాకృతికమైన సౌందర్యం, వర్ణనలు, సజీవమైన పాత్రలు, వాటి అంతరంగాలు మన మనసును అమాంతంగా పట్టి, ఆనాటి బెంగాలీ గ్రామసీమల్లోకి తమవెంట తీసుకువెళతాయి. పద్మ గారు రాసిన ఈ సమీక్షా వ్యాసం కూడా మనల్ని ఆనాటి తెలుగు పల్లెల్లోని ప్రాకృతిక సౌందర్య సీమల లోనికి తీసుకువెళ్లి, అక్కడి చెట్లలోని పచ్చదనాన్ని మనకు అనుభూతింప చేస్తుంది. పంట చేలలోని సుగంధాన్ని ఆఘ్రాణింప జేస్తుంది. అక్కడి ఆ… మనుషుల గుండె సవ్వడిని మనకు వినిపింప చేస్తుంది. వారి సుఖదుఃఖాలతో కూడా మనకు సహానుభూతిని కలిగింప జేస్తుంది. అదేసమయంలో ఒకానొక మార్మికమైన సౌందర్య జగత్తులోకి మనకు ఆహ్వానాన్ని కూడా పలుకుతుంది.

  అంతేకాక
  మండువేసవిలో
  పచ్చని వరిచేల పక్కన పారుతున్న
  పంటకాలవ లోని కలువపూల నీడలో నీటిని
  దోసిళ్ళతో తాగిన మధురానుభూతిని కలిగిస్తుంది. మళ్లీ ఒక కొత్త పుస్తకాన్ని కొని, తనివితీరా చదువుకోవాలి అనే ఆపుకోలేని ఆకాంక్షను కూడా కలిగించిన ఈ వ్యాసానికి,
  పద్మ గారికి కూడా ధన్యవాదాలు…

 3. బిభూతి భూషణ్ నవలల సమగ్రచిత్రం ఇచ్చారు. పల్లె – అడవి – నది ల సంబంధాన్ని హృద్యంగా సమన్వయించారు. బిభూతి భూషణ్ విసిరే మోహపాశంలో చిక్కుకుంటే బయటపడడం కష్టం. ఆ అనుభూతి మెరుపుతో కూడిన మైమరపు మీ అక్షరాలలో కనిపించింది. అభినందనలు పద్మ గారూ…💐💐💐

 4. అందమైన వివరణ, అనుభూతైకవేద్యమైన రచనా శైలి తో వ్రాసిన ఈ వ్యాసం చాన్నాళ్ల తర్వాత గది లోంచి అడవి నది వద్దకు తీసుకెళ్ళింది.అభినందనలు పద్మ గారు. 👌

  1. హృదయ పూర్వక కృతజ్ఞతలు శైలజా గారు.

 5. పద్మ గారు నమస్కారం
  బిభూతి భూషన్ ను చక్కగా పరిచయం చేశారు. ఏక బిగిన చదివిం చింది. ఎంత బాగా రాశారు!
  నెలకు కనీసం రెండు సార్లు అడివి కి వెళుతుం టామ్. అడివి కి వెళ్ళే ముందు చదివి తె ఇం కా ఎంత బాగుండేది!

  1. సర్, మళ్ళీ వెళ్ళినప్పుడు బిభూతి గారు మీతోనే వుంటారు. హృదయ పూర్వక కృతజ్ఞతలు మీకు.

Leave a Reply