తెలంగాణ ఉద్యమ చరిత్రను నింపుకున్న పాట ‘పల్లెటూరి పిల్లగాడ’

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పాటను పదునైన ఆయుధంగా మలిచిన స్వరయోధుడు సుద్దాల హనుమంతు. తెలంగాణ సాయుధపోరాటంలో పాటను పోరుబాటలో నడిపించిన సాంస్కృతిక సేనాని సుద్దాల హనుమంతు. జానపద కళారూపాలతో ప్రజలను చైతన్య పరిచిన తొలి ప్రజాకళాకారుడు. పుస్తకరూపంలో తన పాటలు రాకముందే ప్రజల నాలుకల మీద నర్తించిన వాగ్గేయకారుడు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అందుకున్న సంచలన ప్రజాకవి. సరళమైన పదాలతో ప్రజల భాషలో భావోద్వేగాలను పలికించిన సుద్దాల హనుమంతు అనగానే ‘పల్లెటూరి పిల్లగాడ పసుల గాసే మొనగాడ’ అనే గొప్పపాట గుర్తుకువస్తుంది.

సుద్దాల హనుమంతు పాటలతో పాదయాత్ర చేసాడు. ఊరూరు తిరుగుతూ పాటలతో జనం గుండెల్లో విప్లవ ప్రకంపనాలు సృష్టించాడు. తమ చుట్టూవున్న పరిస్థితుల్లోని విషాద వాస్తవాల్ని తెలుసుకునేలా ప్రయత్నించాడు. ‘సంఘం’ పేరుతో జరిగే ఉద్యమ సభల్లో సుద్దాల హనుమంతు పాడే పాటలతో ఒక ఉద్వేగ భరిత ఉత్తేజ వాతావరణం అలుముకొనేది. అలాంటి ప్రయాణంలో భాగంగా ఒక ఊరికి వెళ్ళివస్తూ దారిలో పశువులు కాస్తున్న పసి బాలున్ని చూసి నిలువునా కరిగిపోయి రాసుకున్న గీతమే ‘పల్లెటూరి పిల్లగాడ. ’

సుద్దాల హనుమంతుది అమోఘమైన జ్ఞాపక శక్తి. తన చివరిదశలో చెప్పుకున్నట్లు శిశుప్రాయంలోని సంఘటనలు సైతం జ్ఞాపకాలలో కదలాడుతాయట. బాల్యంలో బడిపంతుళ్ళు వేసిన కఠినశిక్షలకు తట్టుకోలేక బడి మానేసిన సంగతులు ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే వున్నాడు. అందుకే పసువులు కాస్తున్న ఆ పసిబాలున్ని చూడగానే ఒక్కసారిగా భావోద్వేగభరితుడై ఈ గీతం రాసాడు.

“పల్లెటూరి పిల్లగాడ
పసులగాసే మొనగాడ
పాలుమరచి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గల జీతగాడ
కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో”

తెలంగాణ ప్రజల వెట్టిచాకిరి వ్యవస్థ వేదనా గీతానికి పల్లవి లాంటిది ఈ గీతం. పచ్చిబాలింతరాలిని సైతం పనిలోకి తీసుకుని బాధలు పెట్టే క్రూరమైన దొరతనం వేళ్ళూనుకున్న రోజుల్ని చూసిన కవి ఈ గీతం రాయడంలో ఒక చారిత్రాత్మక బాధ్యతను నెరవేర్చాడు. పాలకోసం గుక్కపట్టి ఏడ్చే శిశువులపై జాలిచూపని దొరతనం పాలబుగ్గల పసివాడిని పసులకాపరిగా పని చేయించుకోవడంలో ఆశ్చర్యమేమిలేదు. కవి పసిబాలుడి చెంపలపై నున్న పాలమరకలను, ఆ తడిని దర్శిస్తూ ఆవేదన చెందుతున్నాడు. అంత లేత వయసులో అమ్మ ఒడికి, బడికి, బాల్యపు ఆటలకు దూరమైనాడనే బాధ ధ్వనిస్తుంది. తల్లిదండ్రులనుంచి భద్రజీవితాన్ని ఆశించే పిల్లలకు వెట్టిచాకిరితనం వారసత్వంగా పొందిన తరాన్ని ఉద్దేశిస్తూ ఆరంభమవుతుందీ గీతం.

“చాలీచాలని చింపులంగి
చల్లగాలికి సగము ఖాళీ
గోనెచింపు కొప్పెర పెట్టావా పాలబుగ్గల జీతగాడ
దానికి చిల్లులెన్నో లెక్కపెట్టావా”

తెలంగాణ గ్రామీణ జీవితంలో నెలకొన్న దారిద్య్రానికి ప్రతీక ఈ పంక్తులు. జీతగాళ్ళ దుస్థితిని ఆవిష్కరిస్తుంది. మనిషి ప్రాథమిక అవసరాల్లో ఒకటైన గుడ్డకూడా లేకపోవడం ఎంత విషాదం. ఒంటిపై చాలీచాలని చిరిగిని అంగితో వణికించే చలిలో పని చేయడం, అనేక చిల్లులున్న కొప్పెరతో ఎండా, వానలతో చేసే జీవన పోరాటాన్ని గుర్తుచేస్తూ పసులగాసే మొనగాడు ఆ పాలబుగ్గల పిల్లగాడు అని సంబోధించడం ఔచిత్యవంతంగా కుదిరింది.

“తాటి జెగ్గలా కాలిజోడు
తప్పటడుగుల నడుకతీరు
బాటతో పని లేకుంటయ్యిందా ఓ పాలబుగ్గల జీతగాడ
చేతికర్రే తోడైపోయిందా”

బాల్యపు బుడిబుడి నడకల ముచ్చటైనా తీరకముందే కూలిబాటలో నడవవలసి వచ్చిందా పిల్లగాడికి. తాటిజెగ్గల చెప్పులతో నడవడం రాకపోవడం, తప్పటడుగులు పడడం జీవితపు ఒడిదుడుకుల తీవ్రతకు నిదర్శనం. నిర్దిష్టమైన గమ్యం లేకుండా ఎటుపడితే అటు నడవడం జీవితపు అస్థిరతకు చిహ్నం. వృద్ధాప్యపు భారంతో చేతికి వచ్చే కర్ర జీవనభారాన్ని సూచిస్తుంది. సోపతిగాళ్ళతో సరదాగా వుండవలసిన వయసులో ఏతోడు లేక జీవం లేని కర్రతో బాల్యాన్ని పంచుకుంటున్నాడు. ‘తాటిజెగ్గల కాలిజోడు’ ఈ తరం పిల్లలకు తెలిసే అవకాశం ఉందా అనేది సందేహమే.

“గుంపు తరలే వొంపులోకి
కూరుచున్నవు గుండుమీద
దొడ్డికే నీవు దొరవైపోయావా ఓ పాలబుగ్గల జీతగాడ
దొంగగొడ్ల నడ్డగించేవా”

దొరలు దొంగలై ఊళ్ళలోని భూములను, పంటలను దోచుకోవడాన్ని ఎదిరించేవారు ఒక్కరు కూడా లేరు. కవి పాలబుగ్గల పసివాడిలో దొరలనే దొంగగొడ్లను ఎదురించే సాహసిని చూస్తున్నాడు. రాబోయే రోజుల్లో గడీలు కూలిపోతాయి, దొరతనం నాశనమవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఈ పాలబుగ్గల జీతగాడే రేపటి యజమాని అవుతాడు. వెట్టిచాకిరి నుంచి విముక్తమయ్యే రోజులు సమీపిస్తున్నాయనే ప్రగాఢ నమ్మకం కవి గొంతులో ప్రతిధ్వనిస్తుంది.

“కాలువై కన్నీరుగార
కండ్లపై రెండుచేతులాడ
వెక్కివెక్కి ఏడ్చుచున్నావా ఓ పాలబుగ్గల జీతగాడ
ఎవ్వరేమన్నారో చెప్పేవా”

పసివాడి ఏడ్పు తీవ్రతను కళ్ళముందు కదలాడేటట్లుగా చిత్రించడమే కాదు వినగలిగే చెవులుంటే హృదయం కదిలిపోయి కలుక్కుమనేలా లీలగా ఏడ్పు వినిపిస్తుంది. ఇంటి దగ్గర అమ్మ గుర్తుకొచ్చిందో వయసుకు మించిన కష్టం, బాధ్యతలు, యజమాని పెట్టే కష్టాలు, మనసు గాయపడేలా తిన్న తిట్లు ముసురుకొనగా కన్నీరు గార్చాడు. ఆ దుఃఖనదిలో రెండు చేతుల్ని తెడ్డుగా వేస్తూ ఈదుతున్నట్లుగా అనిపిస్తుంది.

“పెందలాడ అమ్మనీకు
పెట్టలేదా సద్దికూడు
ఆకలిగొని అడులుచున్నావా ఓ పాలబుగ్గల జీతగాడ
అడవి తిరిగి అలసిపోయావా
ఆకుతేల్లు కందిరీగలు
అడవిలోగల కీటకాదులు
నీకేమైన కాటువేశాయా ఓ పాలబుగ్గల జీతగాడ
నిజము దాచక నాతో చేప్పేవా”

కవి పసివాడి కష్టాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతడి అంతరంగంలోకి దూరి, ఆ వయసుకు దిగి ఏమైవుంటుందా అని అంతర్మథనం చెందుతున్నాడు. ఆకలితో అల్లాడుతున్నాడా? అడవిలో సంచరిస్తున్న క్రిమికీటకాదులు బాధపెట్టాయా? అడవిలో ఒంటరిగా తిరగడం భయపెట్టిందా? అనేక ప్రశ్నలు ఒక అమ్మలాగ తనకుతానే వేసుకున్నాడు. అడవిలో అలసిపోని పోరాటాన్ని చూపిన కవికి ఈ పాలబుగ్గల జీతగాడిలో రేపటి విప్లవకారున్ని దర్శిస్తున్నాడు.

“మాయదారి ఆవుదూడలు
మాటిమాటికి కంచేదుంకి
పంటచేలూ పాడు చేశాయా ఓ పాలబుగ్గల జీతగాడ
పాలికాపు నిన్నే కొట్టాడా
నీకు జీతం నెలకు కుంచం
తాలు వడిపిలి కల్తిగాసం
కొలువగా సేరు తక్కువ వచ్చిందా ॥ఓ పాల॥
తలచుకుంటే దుఃఖ మొచ్చిందా”

తన విధిలో ప్రాణహాని వున్నా, ప్రాణభీతి వున్నా కళ్ళుమండుతున్నా పసులగాస్తున్నాడు. తన కడుపు కాలుతున్నా పసువుల కడుపు నింపేపనిలో నిమగ్నుడైనాడు. మేతమేసే పసువుల్లో కొన్ని మాయదారి ఆవుదూడలు వుంటాయి కదా! పసివాడి కన్నుకప్పి పంటపొలంలోకి దుంకినాయి. పసివాడి కష్టాలు రెట్టింపయ్యాయి. ఊళ్ళో దొరే కాదు ఊరిబయట పాలికాపు చేతిలో కూడా వొళ్ళు హూనమైపోయింది. బతుకు హీనమైపోయింది. ఇన్ని కష్టాలు పడ్డా శ్రమకు తగిన ఫలం లభిస్తుందా అంటే అదీ లేదు. నెలకు దొరికే కుంచెడు వడ్లలోనూ మోసపోయాడు. కొలిచిన జీతం వడ్లలో తాలువడ్లు, పొట్టు, వూకతో ఉన్నాయి. వాటిని కొలిచినా సేరు తక్కువే. ఎటు చూసినా మోసమే. తప్పుడు లెక్కలతో దొరలు చేసే శ్రమదోపిడి పసితనపు జీతం నుంచే, జీవితాల నుంచే ఆరంభమయింది. నైతికతలేని నిర్దయ దొరల దాష్టికాన్ని కఠినంగా విమర్శించాడు సుద్దాల హనుమంతు.

“పాఠశాల ముందు చేరి
తోటిబాలుర తొంగిచూసి
ఏటికోయీ వెలవెలబోతావు ॥ఓ పాలబుగ్గల॥
వెలుగులేని జీవితమంటావా”

గ్రామీణ ప్రాంతాలలో దొరలు , భూస్వాములు, అగ్రవర్ణాలవారు తమ దగ్గర పని చేసేవారిని, వారి పిల్లలను బడికి దూరంగా పెట్టారు. ఒక రకంగా చదువుకోవడంపై అప్రకటిత నిషేధం కొనసాగింది. కిందికులాలవారు, వెట్టిపనులకు పరిమితమైనవారు, ఇతరత్రా వృత్తిపనులవారు నిరక్షరాస్యులుగా మిగిలిపోయేవారు. వీళ్ళంతా బడికి వెళ్ళి చదువుకొనే అవకాశం వస్తే తెలివితేటలు పెరుగుతాయి. తామెలా మోసపోతున్నామో అర్థమవుతుంది. ప్రశ్నిస్తారు. తిరుగుబాటు మొదలవుతుంది. తమ ఆధిపత్యం అంతమవుతుంది. ఇంత దుష్టబుద్ధితో సామాన్య ప్రజలను విద్యకు దూరం చేసారు. సుద్దాల హనుమంతు ఈ కోణంలోంచే ఆ పాలబుగ్గల పసివాడిని మేల్కొలిపే ప్రయత్నం చేసాడు. బడిముందర నిలబడి బడిలో చదివే తన ఈడు పిల్లలను చూసి ముఖాన్ని ముడుచుకున్న పసివాడి ఆకాంక్షను అర్థంచేసుకున్నాడు. కవికి చదువు విలువ మరింత తెలుసు. రెండవ తరగతికే పరిమితమైపోయిన తన చదువు, దాని పర్యవసానాలు అనుభవించిన మనిషి సుద్దాల హనుమంతు. చదువులేకపోతే జీవితంలో వెలుగులేదనే సత్యాన్ని బలంగా చాటి చెప్పాడు ఈ పాటలో. పాలబుగ్గల జీతగాడు లాంటి వేలాదిమంది పిల్లలు బాలకార్మికులుగా మిగిలి పోవద్దనే సందేశాన్ని శక్తివంతంగా ఈ పాట ప్రకటిస్తుంది. బాలకార్మిక వ్యవస్థ పునాదుల్ని పెకలింపజేసే ఉద్రేకాన్ని నింపే ఉద్యమగీతం ‘పల్లెటూరి పిల్లగాడ’. 1946లో రాయబడిన ఈ పాట ‘వెలుగులేని జీవితమంటావా’ చరణంతో ముగుస్తుంది. ఆ తర్వాత తదనంతర ఆలోచనలలో భాగంగా ఈ పాటకు ఈ క్రింది చరణాలు చేర్చబడ్డాయి.

“జనవరి ఇరువదియారు
ప్రజాతంత్ర నినాదాలు
కోటీశ్వరుల నాటకమంటావా ॥ఓ పాలబుగ్గల॥
అంతా వొట్టి బూటకమంటావా
కష్టజీవుల కడుపునిండ
కనికరించే ఎర్రజెండ
ఎర్రకోటపై ఎగురాలంటావా ॥ఓ పాలబుగ్గల॥
దోపిడి దొరల రాజ్యం పోవాలంటావా”

చరిత్రలోని కీలకమైన రాజకీయ, సామాజిక ఉద్యమాలు, ముఖ్యమైన పరిణామాలన్నింటిని పరామర్శించింది ఈ పాట. తెలంగాణలో నిజాం రాజ్య విమోచన, భారతదేశ విముక్తి, స్వతంత్ర రాజ్యాంగం, మారిన దొరల వేషాలు, మారని దొరల దోపిడీలతో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఒక నాటకంగా, బూటకంగా నిర్థారణకు వచ్చాడు కవి. రాజీపడని కవిలో విప్లవజ్వాల రాజుకంటునే వుంటుంది. నయా ధనస్వామ్యం కొత్త ఆధిపత్య ధోరణులతో మరింత పీడనకు గురిచేసింది. కష్టజీవుల జీవితాల్లో ఏ మార్పు లేదు. అవినీతి వ్యవస్థీకృత రూపం దాల్చుకోవడం మొదలయింది. ప్రజాస్వామ్య రాజకీయాల ముసుగులో ప్రజలమధ్య వైషమ్యాలు రగిలించే ప్రయత్నాలు కవి కలతకు గురిచేసాయి. ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం ప్రయత్నాలు మానుకోలేదు. సమసమాజ నిర్మాణంలో ఎర్రజెండ నిర్వహించవలసిన పాత్ర ఇంకా మిగిలే వుంది. అసలు పోరాటం ఇప్పుడే మొదలయింది. ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరడమే ప్రస్తుత కర్తవ్యమని భావించాడు. రావినారాయణరెడ్డి ఉపన్యాసాలతో కమిటెడ్ కమ్యూనిస్ట్ గా మారిన సుద్దాల హనుమంతు దృక్పథం, లక్ష్యం, ఆచరణ మరింతగా బలపడి క్రియాశీలంగా మారింది. దోపిడి దొరల రాజ్యం పోవాలనే స్పష్టమైన ఆశయంతో ఈ గీతం ముగుస్తుంది. ఆ పోరాటం మాత్రం ఇంకా జరుగుతూనే వుంది. ఇంతటి విప్లవ స్ఫూర్తిని నింపుకున్న ఈ చారిత్రక గీతం బి. నర్సింగ్ రావు నిర్మించిన ‘మా భూమి’ సినిమాలో టైటిల్ సాంగ్ గా వినిపిస్తుంది. గాయని సంధ్య గొంతులోంచి పాలబుగ్గల పసివాడి గుండెల్లోని విషాదమంతా కన్నీరై మనల్ని బొట్లు బొట్లుగా నిలువెల్లా తడిపేస్తుంది. ‘మాభూమి’ సినిమా కథకనుగుణమైన వాతావరణానికి జీవం పోసింది ఈ పాట. ఆ తరువాత ఆర్. నారాయణ మూర్తి ‘వీర తెలంగాణ’ చిత్రంలోనూ ఈ పాట వినిపిస్తుంది. సుద్దాల హనుమంతు కూతురు భారతి పాడడం, కొన్ని కొత్త చరణాలను కొడుకు సుద్దాల అశోక్ తేజ రాయడం విశేషం. తండ్రి రాసిన గీతాన్ని ఈ తరానికి కొత్తగా అందించే ప్రయత్నం చేయడం గొప్ప ఋణానుబంధానికి ప్రతీక.

సుద్దాల హనుమంతు జానపద కళారూప ప్రక్రియల్లో ఎంతో పాండిత్యం వుంది. వస్తువు కనుగుణమైన ప్రదర్శనా పద్ధతిని, రచనా శైలిని అనుసరిస్తాడు. ఈ పాట కూడా యక్షగాన ప్రక్రియలో వచ్చే పాటల ధోరణిలో నడుస్తుంది. యక్షగాన ప్రక్రియకు దగ్గరగా వుండే ‘ఏలలు’ అనే సంప్రద్రాయ బాణిలో ఈ ‘పల్లెటూరి పిల్లగాడ’ పాట వరుసను అనుసరించాడు కవి. విషాద తత్వాల్లో వుండే ఆర్ద్రత, పాలబుగ్గల పసివాడిలోని దుఃఖం కలగలసిపోయిన పాట మన మూలాలను కదిలిస్తుంది. పదాడంబరం లేకుండా స్థానీయ భాషా ప్రయోగాలతో ఒక బాలకార్మికుడి వెతలను దృశ్యీకరించడతో పాటు తెలంగాణ సామాజిక స్థితిగతులను వెల్లడి చేస్తుంది ఈ పాట. కవి శ్వాస ఆగిపోయిందిగాని అతని పాట ఒక మహాశ్వాసగా వెచ్చగా మన మనసుకు తాకుతూనే వుంది.

జ‌న‌నం: న‌ల్ల‌గొండ‌. 'ఆధునిక క‌విత్వంలో అస్తిత్వ వేద‌న‌', 'అంతర్ముఖీన క‌విత్వం' అనే అంశాల‌పై ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ ప‌రిశోధ‌న చేశారు. ప్రాథ‌మిక త‌ర‌గ‌తి నుండి డిగ్రీ స్థాయి తెలుగు పాఠ్య పుస్త‌కాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మైన స‌భ్యుడిగా, ర‌చ‌యిత‌గా, సంపాద‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనేక కవితలు, సమీక్షలు, ముందుమాటలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. పలు పురస్కరాలు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 'జీవ‌న లిపి'(క‌విత్వం), 'స‌మ‌న్వ‌య‌'(సాహిత్య వ్యాసాలు) ర‌చ‌న‌ల‌తో పాటు వివిధ గ్రంథాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

8 thoughts on “తెలంగాణ ఉద్యమ చరిత్రను నింపుకున్న పాట ‘పల్లెటూరి పిల్లగాడ’

 1. రఘు గారు
  వ్యాసం బాగుంది.
  పాటలోని ఆత్మను పట్టుకున్నారు.

 2. పాట ఉద్యమ సాధనం. ఉపన్యాసం, లిఖిత సాహిత్యం కన్నా పాట ప్రభావశీలమైంది, శక్తివంతమైంది. అటువంటి పాటల్లో పల్లెటూరి పిల్లగాడ పాట మొదటి వరసలో ఉంటది. నాటి దొరల అకృత్యాలకు బలైన ఎందరో పాల బుగ్గల జీతగాళ్ల మనోవేదనే ఈ పాట.
  వృద్ధాప్యపు భారంతో చేతికి వచ్చే కర్ర జీవనభారాన్ని సూచిస్తుంది.
  ఈ పాలబుగ్గల జీతగాడే రేపటి యజమాని అవుతాడు లాంటి పదాలతో, సులభ విశ్లేషణతో మళ్లీ ఓ సారి కదిలిచారు.
  ధన్యవాదాలు…..🙏🙏💐

 3. పాట పాణాన్ని ఆవిష్కరించిన రఘు సార్ పాటాభివందనం

 4. ఇదొక పనికిమాలిన, పసలేని వ్యాసం.
  ఎందుకంటే వాస్తవాలు వేరుగా ఉన్నాయి.
  వ్యాసకర్త దేనికో, ఎవరికో ఆపాదించి
  ఆంధ్రా కమ్మనిస్టులు
  చేసిన దుష్ప్రచారమే ఈ వ్యాసం
  లోనూ చేయడం అవగాహనా లోపం.

  హైదరాబాద్ నిజాం 1940ల్లోనే బాలలకు
  నిర్బంధ విద్యా చట్టాన్ని చేసి అమలు
  చేసిన గొప్ప బహుజన పాలకుడు.

  కొన్ని వాస్తవాలు మచ్చుకు.
  1. సుద్దాల హనుమంతు అనే ఆయన నిజాం కు వ్యతిరేకంగా
  ఎలాంటి రచనలు చేయలేదు.
  అయన చేసిన పోరాటం స్థానిక సామాజిక, కుల ఆధిపత్య వ్యవస్థల
  మీద మాత్రమే;

  1940ల్లో ఉన్న కాలమాన అంశాలు, సామాజిక పరిస్థితులు ప్రపంచం లో
  అన్ని దేశాల్లో నూ ఉన్నాయి.
  కానీ నిజాం హైదరాబాద్ రాజ్యంలోనే ఉన్నట్టు ఇంకా ఎక్కడా లేనట్టు కమ్మనిస్టులు
  దుష్ప్రచారం చేసారు;
  ఆంధ్ర కమ్మనిస్టులు కొంతమందిని “సాదుడు కుటుంబాలు”గా చేరదీసి.
  ఆ సాదుడు కుటుంబాల మూడో తరాన్ని కూడా సాదుతూ, అయన
  అంత గొప్ప, ఈన ఇంత గొప్ప అని చెప్పాడం.
  తెలంగాణ సాయుధ పోరాటం ఒక బోగస్ అని ఇప్పటికే రుజువు అయింది.

 5. మీ వ్యాసం చాలా బాగుంది సార్👌🏽💐
  నిజాం కాలం నాటి తెలంగాణ చరిత్రను నింపుకున్న ఈ పాటను విశ్లేషించడం, అందులోనూ రచయిత జీవిత కోణంలో నుండి విశ్లేషించడం మీకు మాత్రమే సాధ్యం సార్👏🏼
  6వ తరగతి తెలుగు పుస్తకంలో 11వ పాఠంగా ఉన్న ఈ పాటకు పుస్తకంలో లేని కొనసాగింపు చరణాలను ఇచ్చి విశ్లేషణ చేయడం కూడా చాలా బాగుంది🙂
  “ఈ పాట యక్షగాన ప్రక్రియలో వచ్చే పాటల ధోరణిలో నడుస్తుందని, యక్షగాన ప్రక్రియకు దగ్గరగా వుండే ‘ఏలలు’ అనే సంప్రద్రాయ బాణిలో ఈ ‘పల్లెటూరి పిల్లగాడ’ పాట వరుసను కవి అనుసరించాడ”నే కొత్త విషయాలను తెలుసుకున్నాను.
  మీ వ్యాసం చదివితే కొత్త విషయాలు తెలియడంతో పాటు, అన్ని చరణాలను వరుసగా కోట్ చేయడం వల్ల వ్యాసం చదవడంతో పాటు పాటను కూడా పడుకోవచ్చు🙂

 6. 1974 నుండి జన నాట్యమండలి నిర్వహించిన ప్రోగ్రాముల లో సంధ్య ఈ పాట పాడేది .

 7. పదునైన పాటను సమాకాలీనతకు సమన్వయ పరచడం నన్ను ఆకట్టుకున్నది. గోస నుండి మొదలైన పల్లవి కోట్ల గుండెలను కదిలించిన తీరంతా ఈ విశ్లేషణ లో కొలువైంది. వాస్తవికానికి దగ్గరగా సాగిన ఈ విమర్శ పాట ఆత్మను ప్రతిబింబిస్తున్నది. రఘు సార్ కు ధన్యవాదములు, హనుమంతుకు నమస్సులు…

Leave a Reply