పర్యావరణ పరిరక్షణ ఎండమావేనా ?

ప్రస్తుత పర్యావరణ ప్రపంచం ప్రమాదపు అంచులో ఉంది. మానవాళి ప్రకృతితో ఆడుతున్న చెలగాడటం వల్ల రోజు రోజుకి భూమిపై ఉష్ణతాపం అధికమవుతూ ఉంది. 17వ శతాబ్దం అర్ధభాగం నుండి ఐరోపాలో ఆరంభమైన పారిశ్రామిక విప్లవంతో కర్బన ఉద్గారాల విడుదల విచ్చలవిడిగా జరిగింది. మొదట్లో ఈ ప్రగతి చూసి అందరు ఎంతో గర్వపడ్డారు. అభివృద్ధిలో దూసుకుపోతున్నాం అనుకన్నాం. అత్యున్నత ఆవిష్కరణలను కనిపెడుతున్నామని గర్వపడ్డాం. కానీ మానవ చర్యల కారణంగా కాలుష్యం పెరిగి వాతావరణంలో పెనుమార్పులు సంభవించి మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని గురించలేకపోయాం. కొంత కాలానికి గుర్తించినా సామ్రాజ్యవాద శక్తులు, కార్పొరేట్‌ శక్తులు తమ లాభాలనే చూసుకుంటున్నాయి తప్పా సర్వసమాన శ్రేయస్సును పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్యం పేరుతో ఎన్నికల్లో ఎన్నికవుతున్న ప్రభుత్వాలు కూడా ప్రజాప్రయోజనాల్ని విస్మరించి కార్పొరేట్ల దోపిడీకీ, పర్యావరణ విధ్వంసానికీ తోడ్పడటం విచారకరం. శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోకపోతే విపత్తు తప్పదని పలు నివేదికలు ఘోషిస్తున్నాయి.

యావత్‌ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వాతావరణ సమస్యలను అధిగమించడానికి ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల విభాగం ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్‌ ఆప్‌ పార్టీస్‌-27 (కాప్‌-27) సదస్సు ఈజిప్ట్‌లోని సముద్రతీర షర్క్‌ ఎల్‌ షేక్‌ పట్టణంలో నవంబర్‌ 6 నుంచి 20 వరకు జరిగింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో 134 దేశాల నుంచి 35 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో శాస్త్రజ్ఞులు, పర్యావరణ కార్యకర్తలు, వాణిజ్య వేత్తలు ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ దిశగా ఇప్పటివరకు చేసిన తీర్మాణాలు, వాటి అమలు తీరును సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణను అంటే దిశ థను ప్రపంచ దేశాలకు నిర్దేశిస్తారని అందరు ఆశించారు. కానీ ప్రపంచం వాతావరణ సంక్షోభాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సుమారు రెండు వారాల పాటు జరిగిన ఈ సదస్సులో చర్చలు, తీర్మాణాలు ఆశించినంతగా ప్రాధాన్యం సంతరించుకోలేదు.

ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు మించిపోయే దిశలో ప్రపంచం వేగంగా సాగుతోంది. ఈ పెరుగుదల 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా ఉన్న ప్రస్తుత థలోనే అపార విధ్వంసం జరుగుతోంది. ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కోవడంలో ఇంకెంత మాత్రం జాప్యం తగదు. భూ ఉష్ణోగ్రతల పెరుగుదలను నిరోధించేందుకు నిర్ణయాత్మకంగా కార్యాచరణకు పూనుకోకపోవడమనేది దేశాధినేతల మహా వైఫల్యం. అంతేకాదు, ఒక మహా విషాదం కూడా. ఈ వైఫల్యాలను అధిగమించి మేలైన కార్యాచరణను సాధ్యం చేసేందుకు ఈ సదస్సు తోడ్పడుతుందని పర్యావరణ ఉద్యమకారులు ఆశించారు. 17 ఏళ్ల క్రితం ప్యారిస్‌ వేదికగా చేసుకున్న ఒప్పందం అమలుపై సంపన్న దేశాలు పేచీ విడిచిపెట్టి ముందుకు వెళ్తాయనే ఆశాభావం నీరుగారిపోయింది. అభివృద్ధి చెందిన దేశాలు వాతవారణ మార్పుల వల్ల తలెత్తే దుష్ప్రభావాలను కట్టడి చేసేందుకు చిత్తశుద్ధితో ఒక నిర్ణయానికి వస్తాయని ఆశించిన పర్యావరణ శాస్త్రవేత్తలకు నిరాశే మిగిలింది. ఈ సదస్సు కూడ ఎప్పటిలాగే దేశాధినేతల ప్రసంగాలు, ఆచరణకు రాని హామీలు, చిత్తశుద్ధి లేని టార్గెట్లు ప్రకటించుకోవడంతో ముగిసింది.

ఇవాళ యావత్తు ప్రపంచంతో పాటు భారత్‌ను కూడ పర్యావరణ సమస్యలు వేధిస్తోన్నాయి. ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈశాన్య రాష్ట్రాల్లో, బొంబాయి బెంగుళూర్‌ చెన్నై పట్టణాల్లో అతివృష్టి మనం చూస్తున్నాం. ఇటీవల పాకిస్తాన్‌లో వరదల భీభత్సం చూశాము. వాతావరణ మార్పులకు ప్రధాన కారణమైన భూతాపం పెరుగుదలను నియంత్రించేందుకు 2015లో ప్యారిస్‌ వేదికగా ప్రపంచదేశాల మధ్య కుదిరిన ఒప్పందం అమలులో అనిశ్చితి నెలకొనడం విచారకరం. చైనా, అమెరికా, ఐరోపా దేశాలు అధికశాతం కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. 2050 నాటికి సగటు భూతాపం పెరుగుదలను రెండు డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చేస్తామంటూ 196 దేశాలు ప్యారిస్‌ ఒప్పందంలో సంతకాలు చేశాయి. 2030 నాటికి 50 శాతానికి, 2050 నాటికి సమూలంగా కర్బన ఉద్గారాల నియంత్రణకు పర్యావరణ హితకర కార్యక్రమాలను అమలు చేస్తామని హామీ ఇచ్చాయి.

ప్యారిస్‌ ఒప్పందం అమలులో భాగంగా ప్రజల ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేయనున్నట్లు ప్రకటించాయి. సాంకేతిక పరిజ్ఞానం, ఇతర అవసరాలకు ఖర్చు చేయడానికి నిరుపేద, వర్ధమాన దేశాలకు ఏటా రూ.6.70 లక్షల కోట్ల నిధులను కేటాయించడానికి సంపన్న దేశాలు ఆనాడు ముందుకొచ్చాయి. అయిదేళ్లకోసారి వివిధ దేశాలు సాధించిన ప్రగతిని సమీక్షించాలని తీర్మానించుకున్నాయి. ఇప్పటివరకూ జర్మనీ, నార్వే, స్వీడన్‌ దేశాలు మాత్రమే స్వల్పంగా నిధులు కేటాయిస్తున్నాయి. అగ్ర దేశాలు ఆశించిన స్థాయిలో స్పందించడము లేదు. నిరుడు బ్రిటన్‌లో జరిగిన కాప్‌-26 గ్లాస్గో సదస్సులో దీర్ఘకాలిక ఆర్థిక సహకారాన్ని రెట్టింపు చేస్తామని సంపన్న దేశాలు మరో మారు హామీ ఇచ్చాయి. గడచిన ప్యారిస్‌ ఒప్పందం అమలు వైఫల్యాలను మాత్రం లోతుగా చర్చించలేదు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న మంచు, పొంగుతున్న సముద్రాలు మానవాళి శ్రేయస్సుకే కాకుండా ఈ ధరిత్రిపై జీవకోటి మనుగడకు అపార నష్టాన్ని కలుగజేస్తున్న కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు దోహదం చేసే మార్గాలను కనుగొనేందుకు 1995 నుంచి ఏటా (కొవిడ్‌ కారణంగా 2020లో మినహా) జరుగుతున్న అంతర్జాతీయ సంప్రదింపుల చర్చల చరిత్రలో ఈజిప్ట్‌లో జరిగిన కాప్‌-27 (కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌) – (యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేం వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌పై సంతకం చేసిన దేశాలు) సదస్సు ఒక ప్రహసనంగా మిగిలిపోతుందనేది ఒక చేదు వాస్తవం. ఎడారిలో ఎండమావి వలే గోచరించిన అద్భుత సమైవేశమిది. మానవ మనుగడకే వాటిల్లుతున్న ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో కాప్‌ సదస్సుల ద్వారా ఇంతవరకు సాధించిన స్వల్ప పురోగతిని సైతం నిష్ప్రయోజనం చేసిందనే అపకీర్తిని కాప్‌-27 మూట కట్టుకుంది.

కొనసాగుతున్న ప్రకృతి విధ్వంసం :
అడవులు, తీర ప్రాంత పరిరక్షణ, కర్బన ఉద్గారాల నియంత్రణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోని ప్రభుత్వ వ్యవస్థలు ప్రకటించడం పరిపాటిగా మారింది. ప్రపంచ వేదికల్లో చేసే తీర్మానాలను అనుసరించి వాటికి తగ్గట్టుగానే చిత్తశుద్ధిలేని విధానాలు, చట్టాల రూపకల్పన సాగుతోంది. వాటిని అమలు చేయడంలోనే అసలు చిక్కు వస్తోంది. కొన్ని సంపన్న దేశాలు అభివృద్ధి పేరుతో భూగోళంపై విచ్చలవిడిగా వనరుల వెలికితీత, దుర్వినియోగం మొత్తం మానవాళిని ప్రమాదంలో పడేస్తోంది. ఐరాస నివేదికల ప్రకారం ఏటా ఒక కోటీ పదహారు వేల ఎకరాల విస్తీర్ణం మేర అడవులను ధ్వంసం చేస్తున్నారు. 80శాతం వ్యర్థజలాలను నేరుగా నదులు, సముద్రాల్లోకి విడిచిపెట్టడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన శతాబ్దకాలంలో చిత్తడి నేలలు, పగడపు దిబ్బలు 50శాతం మేర అంతరించిపోయాయి. వాయుకాలుష్యం పెచ్చరిల్లింది. ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటోంది. పెరుగుతున్న భూతాపం అనేక విధాలుగా నష్టం కలిగిస్తోంది. తరచూ తలెత్తుతున్న కార్చిచ్చులు, సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల, కరవు కాటకాలు, తుపానులు, వేడి గాలులు వంటి వైపరీత్యాలు ప్రపంచ దేశాలను పీడించడం సర్వసాధారణమైంది.

రోజు రోజుకి పెరుగుతున్న ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, లారీలు, తదితరాలు వెదజల్లుతున్న కాలుష్యం అపారం. వీటి నుండి వెలుబడే సూక్ష్మ దూళి కణాలు వాతావరణంలోకి చేరి వాయు కాలుష్యం ఎన్నో రెట్లు పెరిగింది. ఇక అన్ని రకాల పరిశ్రమలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణాల్లో ఒకటి. వ్యవసాయంలో వాడుతున్న రసాయన ఎరువులు, పురుగు మందులు, నీరు, ఆహారం కలుషితం కావడానికి కారణమవుతున్నాయి. వీటి కారణాన ఇప్పటికే వందలాది రకాల పకక్షులు, జంతుజాలం నాశనమయ్యాయి. అడవులు నరికివేయడం వల్ల జీవ వైవిద్యం దెబ్బతిని కాలుష్యానికి దారి తీస్తోంది. ప్లాస్టిక్‌ వాడకం వల్ల మనిషి ఆరోగ్యాన్ని క్రమంగా క్షీణింపజేస్తోంది. ఇవన్నీ కలిసి కాలుష్యానికి, భూతాపం పెరుగడానికి దోహదం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఏ దేశం కండ్లు తెరువడం లేదు. అలాగే ప్రపంచాన్ని ఎన్నోసార్లు కాల్చి బూడిద చేసే స్థాయిలో సామ్రాజ్యవాద దేశాలు ఆయుధాలు తయారు చేసి, విక్రయించి అపార లాభాలు చేసుకుంటున్నాయి. మొత్తంగా విధ్వంసకర అభివృద్ధితో ఎండమావుల వెంట నేడు ప్రపంచం పరుగెడుతోంది. మరోవైపు పెట్టుబడిదారీ దేశాలు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడానికి యుద్దాలు, అంతర్గత యుద్ధాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇవి విషతుల్యాలు, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తోన్నాయి.

మానవాళికి పొంచి ఉన్న నీటి కరువు :
భూమిపై ఉన్న మొత్తం జల వనరుల్లో 94 నుంచి 97 శాతం సముద్రాల్లో ఉండగా మిగతా మూడు నుంచి ఆరు శాతం మంచినీటి వనరులే తాగడానికి, సాగుకు ఉపకరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గతేడాది సంభవించిన ప్రకృతి విపత్తుల్లో అధిక శాతం నీటి కారణంగానే చోటు చేసుకున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవలి వార్షిక ప్రపంచ నీటి స్థితిగతుల నివేదిక (స్టేటస్‌ ఆఫ్‌ గ్లోబల్‌ వాటర్‌ రిసోర్సెస్‌)లో వెల్లడించింది. భూమ్మీద ఉన్న మంచినీటి వనరులపై, వాతావరణం, సామాజిక మార్పుల ప్రభావాలను అంచనా వేసేందుకు ఆ సంస్థ తొలిసారి ఈ నివేదికను ప్రచురించింది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న నీటి డిమాండ్‌, సరఫరాలో పరిమితుల దృష్ట్యా మంచినీటి వనరుల పర్యవేక్షణ, నిర్వహణకు ప్రపంచ దేశాలన్నీ పెద్దపీట వేయాలని ఆ నివేదిక సూచించింది.

వాతావరణ మార్పులు అధికంగా జలాధార ప్రకృతి విపత్తులకు దారితీస్తున్నాయని, ఈ క్రమంలో తలెత్తుతున్న తీవ్ర కరవులు, వరదలు, హిమనదాల కరుగుదల, రుతుపవనాల్లో మార్పులకు సమాజంలోని ప్రతి జీవీ ప్రభావితమయ్యే పరిస్థితులు ఎదురుకావచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్య్లూఎమ్‌ఓ) అధిపతి ప్రొఫెసర్‌ పెటేరి టాలస్‌ హెచ్చరించారు. 2021లో అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు కల్లోలితమైనట్లు ఆ సంస్థ నివేదించింది. ఇప్పటికే 360 కోట్ల జనాభా, సంవత్సరంలో కనీసం నెలపాటు నీటి ఎద్దడిని ఎదుర్కొంటోందని, 2050 నాటికి ఈ సంఖ్య 500 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. 2001 మొదలుకుని 2018 వరకు సంభవించిన మొత్తం ప్రకృతి విపత్తుల్లో 74 శాతం నీటికి సంబంధించినవేనన్నది ఐరాస అధ్యయనాల సారాంశం. నీటి ప్రభావ ప్రకృతి విపత్తులు వాటిల్లజేసే దుష్పరిణామాలను ఎదుర్కొనేందుకు కరవు, వరదలకు సంబంధించిన ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను బలోపేతం చేయాలని డబ్య్లూఎమ్‌ఓ సూచించింది.

డబ్య్లూఎమ్‌ఓ ఏకీకృత సమాచార విధానం (యూనిపైడ్‌ డేటా పాలసీ) ద్వారా వివిధ ఖండాల్లోని నదీ ప్రవాహాలు మూడు థాబ్దాలుగా ఎలా ఉన్నాయన్నది విశ్లేషిస్తే 2021లోనే భూమిపై ఎక్కువ ప్రాంతాలు సాధారణం కంటే పొడిగా ఉన్నట్టు తేలింది. ప్రపంచవ్యాప్తంగా నేడు మూడింట ఒక వంతు భూభాగంలో అనావృష్టి నెలకొంది. కొలరాడో, మిస్సోరి, మిస్సిసిపీ నదీ పరీవాహక ప్రాంతాల్లో కరవు తాండవిస్తోంది. ఇథియోపియా, కెన్యా, సోమాలియాల్లో ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి నెలకొంది. ఆఫ్రికాలోని నైజర్‌, వోల్టా, నైలు, కాంగో నదుల్లో నీటి మట్టాలు మునుపెన్నడూ లేనంత దిగువకు పడిపోయాయి. మరోవైపు పశ్చిమ ఐరోపా నదులు, చైనాలోని అముర్‌ నదీ పరీవాహక ప్రాంతం, హిమాలయ నదులైన గంగ, సింధు నదీ పరీవాహక ప్రాంతాల్లో రికార్డుస్థాయి వరదలు సంభవించాయి. యూఎస్‌ పశ్చిమ తీరంలో, దక్షిణ అమెరికా, పాటగోనియా, ఉత్తర ఆఫ్రికా, మధ్యఆసియా, మడగాస్కర్‌లలో భూగర్భ జలాలు 2020-2022 మధ్య సంవత్సరాల సగటుతో పోలిస్తే గతేడాది సాధారణం కంటే దిగువకు పడిపోయాయని నివేదిక తెలిపింది.

ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి వనరులైన హిమనదాలతో కూడిన పర్వతాలను మంచినీటి గోపురాలుగా అభివర్ణిస్తారు. భూమ్మీద మంచినీటిలో దాదాపు 69 శాతం హిమనదాలు, ధ్రువప్రాంతాల్లో దాగి ఉండగా, మరో 30 శాతం భూగర్భ జలాల రూపంలో ఉంది. భూ వ్యవస్థలో ఘనీభవించిన నీటి వనరులైన (క్రయోస్పియర్‌), పలు నదులు, కోట్లమంది జీవనానికి ఆధారం. ఈ జలవనరుల్లో మార్పుల వల్ల ఆహార భద్రత, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థ సమగ్రత, నిర్వహణ దెబ్బతింటున్నాయి. విశ్వవ్యాప్తంగా ఉష్ణ్గోతలు, వేసవికాలం పెరుగుతుండటంతో ఏడాదిలో కొన్ని నెలలపాటు మంచు అధికంగా కరిగి నదుల్లో గరిష్ఠ ప్రవాహాలు కొనసాగుతున్నాయని, తరవాత నీటి ప్రవాహాలు దారుణంగా పడిపోతున్నాయని డబ్య్లూఎంఓ వివరించింది.

పెరుగుతున్న భూతాపం :
ఐరాస అంచనా మేరకు గడచిన థాబ్ద కాలంలోనే ఉష్ణోగ్రత సగటున ఒక డిగ్రీ సెల్సియస్‌ మేర పెరిగింది. భూతాపం మరో 0.5 డిగ్రీలు అధికమైతే ప్రకృతి వైపరీత్యాలు ఇంకా దారుణంగా విరుచుకుపడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి విపత్తులకు మానవుల స్వయంకృతాపరాధాలే ప్రధాన కారణమని ప్రపంచ దేశాలు గుర్తించినా సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాయి. సంపన్న దేశాలు, వాటిని నియంత్రించే బహుళజాతి సంస్థలు తమ లాభాలు మేటలు వేసేందుకు భూగోళమంతటా, గనుల త్రవ్వకాలు- అడవుల నరికివేత, శిలాజ ఇంధనాల మితిమీరిన ఉత్పత్తి, వినియోగమూ వంటి విధానాలను యధేచ్ఛగా చేపడుతున్నాయి. దీని ఫలితంగా ఒకవైపు మానవశ్రమ దోపిడీ కావడమే కాదు, తీవ్రమైన పర్యావరణ సమస్యలూ ఉత్పన్నమౌతున్నాయి. గనుల త్రవ్వకాలు, శిలాజ ఇంధనాల వెలికితీత, మార్కెట్ల కోసం సామ్రాజ్యవాద దేశాల మధ్య పోటీ, లాభాల కోసం మితిమీరిన వెంపర్లాడటలలో తమకు ఏ ప్రమేయమూ లేకుండానే సామాన్యులు సమిధలైపోతున్నారు. పర్యావరణమూ విధ్వంసమౌతున్నది. ఆ సామ్రాజ్యవాద శక్తుల కుతంత్రాలకు మన పాలకులు జోహుకుం అంటూ నిస్సిగ్గుగా సాగిలపడుతున్నారు. ఋతువులు తప్పిన వరదలు సంభవించాయి. హిందూ మహాసముద్రం ఉపరితల జలాలు అత్యధికంగా వేడెక్కడం దీనికి ప్రధాన కారణమని పర్యావరణ పరిశోధకులు చెబుతున్నారు.

యూరోపియన్‌ యూనియన్‌ కర్బన ఉద్గారాలు 3.3 బిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేరుకున్నాయి. ఇందుకు ప్రధాన కారణం శిలాజ ఇంధనాలను ఆయా దేశాలు విచ్చలవిడిగా వినియోగించడమే. దీని ఫలితంగా హీట్‌వేవ్‌ ట్రెండ్‌ పెరిగి గతంలో ఎన్నడూ చవిచూడని విధంగా ఐరోపాను వేడిగాలులు ముంచెత్తాయి. 50 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించియున్న, భూగోళపు ఊపిరితిత్తులుగా పేర్కొనే ఈ అమెజాన్‌ అడవులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ అమెజాన్‌ అడవులు ప్రపంచం పీల్చుకునే ఆక్సిజన్‌లో 21 శాతం ఇస్తున్నాయి. అలాగే ప్రపంచం విడుదల చేసిన 25 శాతం కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుంటున్నాయి. బంగారపు గనుల కార్యకలాపాలు, గొడ్డుమాంసపు ఉత్పత్తి, సోయాబీన్‌ ఉత్పత్తి తదితర కారణాల రీత్యా అమెజాన్‌ అడవులు వేగంగా తరిగిపోతున్నాయి.

పేద, సంపన్న దేశాల మధ్య విబేధాలు – ఉద్రిక్తలు :
నవంబర్‌ 18న ముగియాల్సిన కాప్‌-27 సదస్సు నవంబర్‌ 19న కూడ కొనసాగింది. అయినా పలు విషయాలపై పీటముడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అతిథ్య దేశం ఈజిప్ట్‌ రూపొందించిన సంప్రదింపుల పత్రం పూర్తిగా నిస్సారమంటూ చాలా దేశాలు పెదవి విరిచాయి. అందులోని పలు అంశాలపై తీవ్ర అసంతృప్తి, అభ్యంతరాలు వెలిబుచ్చాయి. ఇలాగైతే గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేనంటూ విమర్శలు గుప్పించాయి. ‘1.5 డిగ్రీల లక్ష్యం’తో పాటు యూరోపియన్‌ యూనియన్‌ తాజాగా చేసిన చాలా ప్రతిపాదనలను సదరు పత్రంలో బుట్టదాఖలు చేయడంపై యూరప్‌ దేశాలు గుర్రుమన్నాయి. ఒక థలో అవి వాకౌట్‌ చేస్తామని ముక్త కంఠంతో హెచ్చరించే దాకా వెళ్లింది! ఇలాగైతే పత్రంపై యూరప్‌ దేశాలేవీ సంతకం చేయబోవని ఈయూ కుండబద్దలు కొట్టింది.

వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు ప్రమాదకరంగా పెరిగిపోతే భారీగా ముంపు తదితర ముప్పును ఎదుర్కోవాల్సి వచ్చే ద్వీప దేశాల భద్రతను పత్రంలో అసలే పట్టించుకోలేదన్నది మరో అభ్యంతరం. మరోవైపు ఈజిప్ట్‌ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించడమే గాక ఆయా దేశాలపై ప్రత్యారోపణలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో సదస్సుకు హాజరైన 40 వేల పై చిలుకు ప్రతినిధుల్లో చాలామంది వెనుదిరుగడటంతో ప్రాంగణమంతా బోసిపోయింది. మరోవైపు, విచ్చలవిడి పోకడలతో పర్యావరణ విపత్తులకు ప్రధాన కారకులైన సంపన్న దేశాలు, వాటివల్ల తీవ్రంగా నష్టపోయిన పేద, వర్ధమాన దేశాలను ఆదుకునేందుకు భారీ పరిహార నిధి ఏర్పాటు చేయాలంటూ భారత్‌ సహా పలు దేశాలు చేసిన డిమాండ్‌పైనా చివరిదాకా ప్రతిష్టంభనే కొనసాగింది. నిజానికి వాతావరణ సంక్షోభానికి కారణమైన గ్రీన్‌ హౌస్‌ ఉద్గారాలకు అభివృద్ధి చెందిన దేశాలు అత్యధికంగా (92 శాతం) దోహద పడ్డాయి. వాతావరణ ప్రేరిత మార్పుల వల్ల హాని కలిగే దేశాలకు సహాయం చేయడం అవసరమని యుఎన్‌ చీఫ్‌ ఆంటోనియా గుటెర్రెస్‌ తన ప్రసంగలో నొక్కి చెప్పారు.

కాప్‌-27 వాతావరణ సదస్సు పేద సంపన్న దేశాల మధ్య ఉద్రిక్తతలకు వేదికగా మారింది. విషయం వాడివేడి చర్చల స్థాయిని దాటి ఏకంగా గొడవల దాకా వెళ్లింది. పలు కీలకాంశాలపై ఏకాభిప్రాయం మృగ్యమైంది. అభివృద్ధి చెందిన దేశాల కారణంగా వాటిల్లుతోన్న వాతావరణ మార్పులతో వర్ధమాన దేశాలకు ఆర్థికంగా సంభవిస్తోన్న అపార నష్టాల పట్ల ‘షర్మ్‌ ఎల్‌-షేక్‌ ఇంప్లిమెంటేషన్‌ ప్లాన్‌’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పేద దేశాలకు ఆ నష్టాలను నివారించేందుకు ఒక సంస్థాగత యంత్రాంగాన్ని నెలకొల్పనున్నట్లు అది పేర్కొంది. తద్వారా వాతావరణ మార్పులతో ప్రతికూలంగా ప్రభావితమవుతున్న పేద దేశాలకు ఆర్థిక ఉపశమనంతో పాటు సాంకేతికతా సహాయం కూడా లభిస్తుందని ఆ ‘ఇంప్లిమెంటేషన్‌ ప్లాన్‌’ పేర్కొంది. అయితే ప్రతిపాదిత సంస్థాగత ఏర్పాటుకు అవసరమైన సెక్రటేరియట్‌ను నెలకొల్పేందుకు సకల సదుపాయాలను సమకూర్చే దేశాన్ని 2023లో ఎంపిక చేస్తామన్న ఒక్క ‘నిర్ణయాన్ని’ మాత్రమే కాప్‌-27 తీసుకున్నది.

ఎట్టకేలకు నిధి ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడినట్టు మధ్యవర్తులు నవంబర్‌ 18 సాయంత్రం ప్రకటించారు. ఇందుకోసం ఏటా ఏకంగా 100 బిలియన్‌ డాలర్లు వెచ్చస్తామంటూ 2009లో చేసిన వాగ్దానాన్ని సంపన్న దేశాలు ఇప్పటికీ నిలుపుకోకపోవడం గమనార్హం. మరోవైపు ”శిలాజ ఇంధనాల వాడకాన్ని వీలైనంత త్వరలో పూర్తిగా నిలిపేయాలన్నది గత సదస్సులోనే చేసిన ఏకగ్రీవ తీర్మానం. కానీ ఇప్పటికీ వాటి వాడకం పెరిగిపోతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. నిజానికి ”శిలాజ ఇంధన పరిశ్రమాధి పతులు సదస్సులో ప్రతి చర్చాంశాన్ని తన కనుసన్నల్లో నియంత్రిస్తోంది” అంటూ వర్ధమాన దేశాలు దుమ్మెత్తి పోశాయి. ఒక గమనార్హమైన వాస్తవమేమిటంటే ఆ నిధి విషయమై ఏ దేశం, ఏ మేరకు తోడ్పడుతుందనేది అసలే లేదు. అయితే, వాతావరణ మార్పులకు అమితంగా నష్టపోతున్న పేద దేశాల సహాయార్థం ఉపయోగించేందుకు ఆ నిధిని ఉద్దేశించారు. ఇంతకూ ఆ పేద దేశాలు ఏవి? ఇక్కడే అసలు రాజకీయాలు ప్రారంభమవుతాయి. ఏది పేద దేశం, ఏది సంపన్న దేశం, ఏ దేశం ఏ దేశానికి సహాయం అందించాలనేది స్పష్టం కాలేదు.

పుంజుకోని గ్రీన్‌ పెట్టుబడిదారీ వ్యవస్థ :
ప్రజలందరికి చెందిన సామాజిక అడవులు, గనులు, నదులు తదితర ఆస్తులు సహా ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ చెందడానికి ఆయా ప్రభుత్వాలు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు అమలు చేస్తోన్నాయి. అపారమైన లాభాల కోసం అర్రులు చాసే పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రకృతిని గురించి పట్టించుకోవడం లేదు. గనుల తవ్వకం కోసం అడవులు తవ్వి వేస్తున్నారు. గ్రానైట్‌ కోసం గుట్టలను త్రవ్వి వేస్తున్నారు. నదులను, భూజలాలను, గాలిని, వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ప్రస్తుతం బొగ్గు స్థానంలో ప్రత్యామ్నాయంగా గ్రీన్‌ సాంకేతికతను ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం ఇది శైశవ థలో ఉంది. చమురు, సహజవాయువు, బొగ్గు స్థానంలో పవన విద్యుత్తు, సముద్ర అలల విద్యుత్తు, సౌర విద్యుత్తు, విద్యుత్తు వాహనాలు వాడకంలోకి వస్తున్నాయి. ఇందుకు సంపన్న దేశాలు వర్ధమాన దేశాలకు యేటా వంద బిలియన్‌ డాలర్లు సహాయం ఇస్తామన్న హామీ అమలులోకి రాలేదు. కేవలం 20 బిలియన్‌ డాలర్లు ఇస్తున్నాయి. ఈ నిధి కూడా ప్రకృతి విపత్తులతో నష్టపోయిన వారికి అందడం లేదు. నిధులలో ఎక్కువ భాగం పునర్వినియోగ ఇంధనాల ఉత్పత్తికి, కాలుష్య రహిత వాహనాల తయారీ సంస్థలకి అందుతున్నవి. కొన్ని కార్పొరేట్‌ సంస్థలు గ్రీన్‌ ఉత్పత్తి పరిశ్రమలపై గుత్తాధిపత్యాన్ని సాధించాయి.

కర్బన ఉద్గారాల పరిమితికి చర్యలేవి?
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈజిప్టులో జరిగిన వాతావరణ సదస్సు (కాప్‌-27)లో జరిగిన ఒప్పందంపై పర్యావరణ ప్రేమికులు పెదవి విరుస్తున్నారు. వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి జరిగిన కాప్‌-27 శిఖరాగ్ర సమావేశాన్ని మరో మరువలేని వైఫల్యంగా అభివర్ణిస్తున్నారు. సంపన్న దేశాలు విడుదల చేస్తున్న కర్బన ఉద్గారాల ఫలితంగా విపత్తులు, వాతావరణ ప్రతికూలతలు ఎదుర్కొంటున్న దాదాపు 200 పేద దేశాలను ఆదుకోవడానికి ‘లాస్‌ అండ్‌ డ్యామేజ్‌’ పేరుతో విపత్తు నిధిని ఏర్పాటు చేయాలని కాప్‌-27 సదస్సులో ఒప్పందం కుదిరింది. అయితే కర్బన ఉద్గారాలను పరిమితం చేయడానికి ధనిక దేశాలు చేస్తున్నదేమీ లేదని వాతావరణ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ‘శూన్య పదాలు, బూటకపు వాగ్దానాలతో యుఎస్‌, ఈయూ, యూకే ఇతర దేశాలు… భూగ్రహాన్ని, మిలియన్ల మంది జీవితాలను, జీవనోపాధిని నాశనం చేసినందుకు బాధ్యత వహించడానికి సంపన్న దేశాలు నిరాకరించాయి.

ముగింపు :
కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్న ప్రధాన దేశాలు… ప్రభావిత దేశాలకు సహాయం చేయడానికి, నష్టపరిహారం అందించడానికి ఎట్టకేలకు అంగీకరించాయి. అయితే దీనిని కొంతమంది వాతావరణ నిపుణులు స్వాగతిస్తుండగా, అనేక పర్యావరణ సంస్థలు, కార్యకర్తలు మాత్రం ఇది ఆచరణలో జరిగేది కాదంటున్నారు. సమయాన్ని ఇక ఏమాత్రం వృధా కానీయక, మానవాళి మనుగడకు ఆధారమైన జలవనరుల పరిరక్షణకు నడుం బిగికంచాలంటూ ఇటీవల ఐరాస వాతావరణ సదస్సు (కాప్‌-27)లో నిపుణులు చేసిన హెచ్చరిక- ప్రభుత్వాలకు మేలుకొలుపు. రాబోయే థాబ్దాలలో నీటి కొరత నుంచి జీవజాలాన్ని కాపాడే బాధ్యత నేటి పాలకులదే. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా సమగ్ర నీటి నిర్వహణ విధానాలను చిత్తశుద్ధితో చేపట్టాలి. ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్న కర్బన ఉద్గారాలను సమర్థంగా కట్టడి చేయాలి. శిలాజ ఇందనాల వినియోగాన్ని తగ్గించి, పునరుత్పాదక ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించాలి. ప్రకృతి మనకు అనుకూలించాలంటే, ముందు మనం దానికి సహకరించాలి. దాని ముందు తలవంచాలి. లేకుంటే మనిషికి భస్మాసురుడి కథను గుర్తుచేస్తుంది, త్వరలో – ఈ ప్రకృతి!

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply