పరవదోలు

గెలుపులు గిర్రున తిరుగుతూ
అందర్నీ లాగుతుంటాయి
దాలిలో ఉడుకు కుండలాగా
ఒకడు లోపలికి కట్రాటై నిలబడి పోతాడు
ఉలిపికట్టె….!
లాగుడులోకి పడకుండా
తానే ఒక సూదంటు రాయి కయ్యెరలా మారి మిణుకు మంటాడు
నిండు నూరేళ్ళుగా వాడు దాలి లోలోలోపలికి తొలుచుకుంటున్నాడు

లాక్కొన్న వారిని నల్లనేలయడుగు
ఆదికాలపు జాడీలోకి పరవదోలుతుంటే
సూదంటురాయిని లెక్కలేనన్ని ముక్కలు చేసి
ముక్కముక్కకీ గట్లు పేరుస్తున్నారు
అన్ని గట్ల మీదా పాత జగడాలమారి కొరకంచు పెట్టి
అప్పటి నవ్వుని ఇప్పుడు ముగ్గేస్తున్నాడు
బొమిడికాలు తగిలించుకున్న పొగ
ముక్క వాసన కొట్టుకుంటూ
తలకాయ లోకి కమ్ముకుంటుంది

ఒక గొడుగు కింద వాళ్ళందరూ కలిసి
థింసా ఆడుతుంటే
గీతల్ని పోగేసి కట్టలు కట్టుకొని
వాళ్ళ ఆటకి సయ్యాడుతున్నాం మనం

……………

పరవదోలు – జనాన్ని నిర్బంధించి ఒక చోట పెట్టడం
కయ్యెర – నక్షత్రం
నల్లనేల యడుగు – పాతాళం, బ్లాక్ హోల్ (మతం)
పాత జగడాలమారి – మనువు

జ‌న‌నం: తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. క‌వి, ర‌చ‌యిత‌, ఉపాధ్యాయుడు. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద వ్యతిరేక సాహిత్య సృజన వీరి ప్రత్యేకత. 'ఆవాహన','పారిపోలేం', కవితా సంపుటాలు వచ్చాయి. 'పిట్టలేనిలోకం', 'పర్యావరణ ప్రయాణాలు' అనే దీర్ఘకవితలు ప్రచురించారు. 'సీమెన్'  కథా సంపుటి ముద్రించారు.

Leave a Reply