పయనించమని…

గత రాత్రి కూడా ఏ చప్పుడూ చేయకుండా
మన పక్కటెముకల మధ్య నుంచి వెళ్ళిపోయింది

నిశ్శబ్దాన్ని ఆలింగనం చేసుకొని
కాలం
కలతలోకి ఇంకిపోయింది

నిదుర పట్టక
ఏ మలిజామునో
బిస్తర్ ని తిట్టుకొని
అక్కడ కొన్ని నిట్టూర్పులను ఒదిలి
నువ్వు లేచి వెళ్ళిపోయావు

కొంత దగ్గరతనపు వెచ్చదనాన్ని
కాసింత ప్రేమ పరిమళాన్ని
కదా నువ్వు నా నుండి కోరుకునేది

నా ఎడారి కౌగిలి బొమ్మజెముళ్ళ గాయం
చేసి ఉంటుంది నీకు

గాయాల్ని ఓడించడం ఎట్లా అనేది
తెలుసుకోగలవా
ఎప్పటికైనా

ఇక పై నా నుంచి ఏమీ ఆశించకు
మూలం నుంచి కుళ్ళిపోయిన మానును నేను

ఏ పుష్ప జలధారలు,
ఏ మనోల్లాసాలు
నా నుంచి ప్రసరించవు

నువ్వు నా నుండి వేరు పడడానికి
అన్నీ సిద్ధం చేసుకో

సున్నితమైన నీ హృదయాన్ని
బండబార్చుకో

నా పంజరపు బంధం త్రెంచుకొని
నువ్వు కోరుకున్న గగనపు స్వేఛ్ఛలోకి
పయనించు

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

4 thoughts on “పయనించమని…

  1. నా ఎడారి కౌగిలి
    బొమ్మజేముళ్ళ గాయం చేసి వుంటుంది నీకు…

Leave a Reply