పద్యం పదిమంది గొంతు కావాలి

దేశీయ మద్యంలా
పద్యం కిక్కు ఇవ్వాలి

భవభూతి అనుభూతి
మనసు సారె మీద
సుతారంగా అచ్చరువు పొందే
కళాకృతి సంపద పద్యం
మట్టి పరిమళమై వ్యాపించాలి

పద్యం పనిచేస్తూ పాడే
పదుగురి  గొంతు కావాలి

నీలో నీవు నీతో నీవు
ఆకుకు అందక పోకకు పొందక
చీకటిని చీకటి అనక
వెలుతురును వెలుగుగా చెప్పక
ఫేస్బుక్ లోనో బ్లాగులోనో
కష్టాలు కన్నీళ్లు అంటని
చెమట రక్తం వాసన వేయలేని
విద్య తెలిసిన పద్యం ప్రశ్నై భాసించాలి

అవార్డు శాలువా వ్యామోహ మోహ
దాహం కౌగిలి వీడి 
నిస్సిగ్గుగా  నిర్లజ్జగా చేసే
అక్షరం ఆత్మగౌరవం మార్కెట్లో
పద్యం తలెత్తుకు పొగరుగా నడవాలి

గంట సమయం నుంచీ 
ఎంత బతిమాలి బామాలినా
బుజ్జి బుజ్జి మాటలతో బుజ్జగించినా
ఎత్తుకో పోతే చంకకు రాదు
లే చిగురులాటి పదాల అడుగులతో
నడవమని దించితే నడవని
పద్యానికి వేలు పట్టి నడవడికలు నేర్పాలి 

కలలా మొదలై జలలా ప్రారంభమై
పదాలుగా పద చిత్రాలుగా
అమ్మలా బొమ్మ కట్టిన
పాఠం  చేతుల్లో
ఒక ఆయుధం పెట్టి 
కదనరంగ తంత్ర మెలకువలు నేర్పి
యోధగా పద్యం యుధ్ధంలోకి  దూకాలి

నీతో నీవు నీలో నీవు
ఒంటరిగా తలపడాలి
గాయమవ్వాలి గానమవ్వాలి
ఈ మూలకు  కట్టిపడేస్తే
సాధనాసుర చావడి ప్రదర్శనలా
ఆ మూలకు పద్యమై తేలి ధృగ్గోచరించాలి

ఆదివాసీ  ఊపిరి స్పర్శతో
దుప్పి కొమ్ము తుడుం డప్పు
వేట లో మారుమ్రోగే  వాయిద్యల్లా
పద్యం క్రూర జంతువుల్ని  తరిమి కొట్టాలి

గ్లాసులో గలగల ద్రవం 
కంఠంలో ఉపద్రవాలు  సృష్టించాలి

తుపానుల కేంద్రం కావాలి
అలల భాష అర్థ తాత్పర్యాలు చెప్పి
సముద్రంతో సంభాషించాలి
మౌనం ఖైదీ సంకెళ్ల
చెరను బద్దలు కొట్టాలి

పిడికిలెత్తి నినదించే నినాదం కావాలి
పద్యం ఒక బహిరంగ సభ కావాలి
పద్యం కంటిని రెప్పలా కాపాడుకు
పదగురు పాడుకునే గొంతు కావాలి

పుట్టింది కరీంనగర్ జిల్లా తంగళ్ళపల్లి గ్రామం. కవి. కోపరేటివ్ విద్యుత్ విభాగంలో సూపరింటెండెంట్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. రచనలు: చిలుక రహస్యం, తారంగం, ఒకరోజు పది గాయాలు, పిడికెడు కన్నీళ్లు దోసెడు కలలు, పాతాళ గరిగె, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గంగడోలు, వాస్కోడిగామా డాట్ కామ్, బొడ్డుతాడు, తల్లి కొంగు, రాజపత్రం, చెట్టుని దాటుకుంటూ, పస, ఊరు ఒక నారు మడి.. 14 కవితా సంపుటాలు, 'వైఫణి'( నైపుణ్యం) కథల సంపుటి ప్రచురించారు.

One thought on “పద్యం పదిమంది గొంతు కావాలి

Leave a Reply