పచ్చపువ్వు

మట్టిమీద నాగలిని పట్టుకో
నాలుగు మెతుకులు దొరుకుతయి
మట్టిలోంచి తట్టెడు మన్నుతీయి
నలుగురి గొంతులు తడుస్తయి

ఏకంగా
మట్టినే లేకుండ చేస్తనంటే ఎట్ల?

మట్టినే ఊపిరిగా చేసుకున్నోళ్లం
మట్టి మీదనే మా దేహాల్ని నిర్మించుకున్నోళ్లం
మట్టి చుట్టూతనే మా పాణాల్ని అల్లుకున్నోళ్లం
మట్టితోనే మా గూడును పదిలంగా పరుచుకున్నోళ్లం

మట్టినుండే
మమ్ముల్ని దూరం చేస్తనంటే ఎట్ల?

మట్టి
మా బతుకు మీద పూసిన పచ్చపువ్వు
మా కడుపుల్ని మూడు పూటలు నింపే అన్నం ముద్ద

మట్టి
మా చెంచుపెంటలు
మా ఆదివాసీ గూడేలు
మా అమ్రాబాద్ మా నల్లమల

రా…
నువ్వైనా నేనైనా
చివరికి ఈ మట్టిలోనే కదా కలువాల్సింది!!

జననం: వరంగల్ జిల్లా వేలేరు. కవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు. రచనలు: పోరుగానం (తెలంగాణ ఉద్యమ గేయ సంపుటి), బలిదానాలు మరుద్దాం (బుక్లెట్), పిడికిలి (తెలంగాణ ఉద్యమ కవితా సంపుటి), కాలాన్ని గెలుస్తూ.. (ప్రత్యేక ప్రతిభావంతులపై కవితా సంకలనం) – సంపాదకత్వం, గెలుపు చిరునామా (ప్రత్యేక ప్రతిభావంతుల పై కవితా సంపుటి), కొన్ని ప్రశ్నలు - కొన్ని జ్ఞాపకాలు(కవితా సంపుటి).

Leave a Reply