“పగిలిన పాదాల నెత్తురులో…” బైటపడే నిజాలు!

సర్వమూ స్తంభించిన ఈ కరోన కాలంలో కలకత్తా నుండి అన్ని బారికేడ్లనూ, సరిహద్దులను, పికెట్లనూ దాటుకుంటూ ఒక పుస్తకం పక్షిలా ఎగిరొచ్చి నా చేతుల్లో వాలింది. అది మన ప్రవాసాంధ్ర మిత్రులు ఎం.కేశవరావు రాసిన “పగిలిన పాదాల నెత్తురులో…”. “ప్రపంచీకరణ వ్యాసాలు” అనేది ఉప శీర్షిక. ఇందులోని 30 వ్యాసాలు గ్లోబలైజేషన్ (ప్రపంచీకరణ) మీద ఆయన రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలు. గత కొద్ది సంవత్సరాల్లో వివిధ జాతీయ, అంతర్జాతీయ సందర్భాల్లో ప్రపంచ పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తూ, అవి భారతీయ సమాజంతో పాటు భారత్ వంటి వివిధ మూడో ప్రపంచ దేశాలకు చెందిన సమాజాల మీద చూపించే ప్రభావాల్ని, ఆ ప్రభావం వల్ల ఏర్పడే కొత్త పోకడల్ని అధ్యయనం చేసిన వ్యాసాల సమాహారం. ఈ వ్యాసాలన్నీ చాలా సీరియస్గా విషయాల్ని చర్చించే, మేథోపరంగా ఉన్నత ప్రమాణాల్ని పాటించే “వీక్షణం” వంటి మాస పత్రికల్లోనే కాక, శాస్త్రీయ విశ్లేషణకి ప్రాముఖ్యమిచ్చే ప్రముఖ దినపత్రికల్లోనూ కాలంస్ గా ప్రచురించబడ్డాయి.

అయితే ఆ పగిలిన పాదాలు ఎవరివీ అని అడిగే ముందు అసలు ‘ప్రపంచీకరణ’ అంటే ఏమిటో తెలుసుకోవాలి. అనేక దేశాలు, జాతులు, సంస్కృతులు, మతాలు, జీవన విధానాలు, విశ్వాసాలు, వారి అవసరాలు అన్నీ అగ్ర రాజ్యాలకు చెందిన ఒకే “వాణిజ్యపు గొడుగు” కిందకి రావటమే ‘ప్రపంచీకరణ’ అని చెప్పొచ్చు సరళంగా. ఇదివరకులా యుద్ధాల ద్వారా రాజ్యాల్ని ఆక్రమించుకోవటం అనే కాన్సెప్ట్ పోయి దాని స్థానంలో వ్యాప్తికి అనుకూలంగా వచ్చిన సామ్రాజ్యవాదపు ముసుగులోని అసలు రూపమే ప్రపంచీకరణ. వాణిజ్యం అనగానే అది డబ్బుకి, పెట్టుబడికి, లాభానికీ సంబంధించిందని వేరే చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ ప్రపంచీకరణకి ముందు పరిస్తితి ఏమిటి? ఎగుమతులు, దిగుమతులు ఎప్పటి నుండో వున్నవే అయినా, విదేశీ మారక ద్రవ్యార్జనకు ఎగుమతులు తప్పనిసరైనా ప్రపంచీకరణకి ముందు మన దేశ వాణిజ్య చిత్ర పటం దాదాపుగా ఇప్పుడు నేను చెప్పబోయే విధంగానే వుండేది. మనింటి దగ్గర వుండే కిరాణ కొట్టు, ఒక చిన్న కాఫీ హోటల్, చెప్పుల షాపు, బట్టల కొట్టు, గడియారాల షాపు, స్టీల్ సామాన్ల అంగడి, ఫర్నిచర్ దుకాణం వంటివి ప్రధానంగా బతుకుతెరువుకి సంబంధించిన వ్యాపారాలు. వారి లాభార్జన మరీ విపరీతంగా ఏమీ వుండదు. ఇంకా ఆ పైన కొంచెం పెద్ద హోటళ్లు, లాడ్జింగులు, సినిమా థియేటర్లు వంటివి ఇంకొంచెం ఎక్కువగా విలాసాల వ్యాపారాలు. పెట్టుబడిదారులంటే వందల వేల కోట్ల రూపాయిల మరీ ప్రభుత్వాల్ని మోసం చేసేవాళ్లు కాకపోయినా లాభార్జన దృష్టితోనే వుండేవారు. కొన్ని విలువలతో వస్తూత్పత్తి చేసే టాటాలు, బిర్లాలు జాతీయ పెట్టుబడిదారులుగా వుంటారు. అయితే ప్రపంచీకరణ ఈ అతి సాధారణ పెట్టుబడి నమూనాని ధ్వంసం చేసి పారేస్తుంది. స్థానిక సంస్కృతులకి, పరిస్తితులకి, వేష భాషలకి అవసరం లేని వస్తువులతో మార్కెట్ నింపుతుంది. ఎక్కడో చైనాలో తయారయ్యే ఫోన్ నుండి అమెరికాలో తయారయ్యే సెంట్ వరకు మనకి అందుబాటులోకి తెస్తుంది. మనుషుల కోసం వస్తువులు, సేవలు కాకుండా వాటి కోసం మనుషులు అన్నట్లుగా తయారు చేస్తుంది. హోటళ్ల దగ్గర నుండి సెలూన్ వరకు సమస్త సేవలూ అంతర్జాతీయ బ్రాండ్ పరిధిలోకి వెళ్లిపోతాయి. చివరాఖరికి ఊబకాయం తగ్గించటం కూడా బ్రాండెడ్ అయిపోతుంది. బ్రాండ్ అంటే ఒకే వస్తువు ప్రపంచం మొత్తం లేదా దేశం మొత్తం లభ్యమవటం. అంటే పెట్టుబడి సైజ్ పెరిగిపోతుంది. అందువల్ల పెట్టుబడిదారులు తగ్గిపోయి వస్తూత్పత్తిదారుల స్థానంలో ఫ్రాంచైజీలు వస్తాయి. ఒక్క జాతీయ పెట్టుబడి దారులు మాత్రమే ఈ పెట్టుబడి పోటీని కొంతవరకు తట్టుకోగలుగుతారు. వస్తు సేవలకు సంబంధించిన పెట్టుబడిలో అధికభాగం అంతర్జాతీయ సంపన్నుల, దేశీయంగా అంబానీల వంటి దళారీ బూర్జువాల చేతిలోకి వెళ్లిపోతుంది. రిటైల్ వ్యాపారుల స్థానంలోకి మాల్స్, థియేటర్ల స్థానంలో మల్టిప్లెక్సులు వచ్చేస్తాయి. విలాసమైన జీవితం ఒక అత్యవసరం అయిపోతుంది. ఇంక బతుకంతా వస్తు వ్యామోహంలో పడి దొర్లిపోతుంది. పాలకులు ప్రజల్ని వినోదాల్లో ముంచేసి తమ వైఫల్యాల్ని కప్పి పుచ్చుకోగలరు. మనిషికి ఏదీ ఆలోచించే సమయమే వుండదు. ఎటు చూసినా వ్యక్తుల విలాసాలు, సామాజిక విషాదాలు సమాంతరంగా నడుస్తుంటాయి. గ్రామీణ ప్రాంతపు ప్రధాన ఉపాధి అయిన వ్యవసాయంలోకి కూడా ప్రపంచీకరణ చొచ్చుకొచ్చి విత్తనాలు, ఎరువులు కూడా బ్రాండెడ్ అయిపోయి, మనిషి స్థానంలో యంత్రాలు ఎక్కువై ట్రాక్టర్లు, గడ్డి కోసే యంత్రాలు, మోటార్లు పెరిగి గ్రామీణ కూలీలు, చిన్న రైతులు ఉపాధి కోల్పాతారు. బై బాక్ పథకాలు, ఎక్కువకాలం వారంటీలు, గ్యారెంటీలు ఇవ్వటం ద్వారా రిపేర్లకు తావులేక పోవటంతో మెకానిక్కుల జీవన భృతి దెబ్బ తింటుంది. ఋణభారాలు భరించలేక రైతులు, చిన్న పెట్టుబడిదారులు, ప్రైవేట్ కార్పొరేట్ విద్య కలిగించే స్ట్రెస్ తో విద్యార్ధులు, ఇంకా అనేక రంగాలకు చెందిన వారు ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. పొంతనలేని విలువలతో జీవితం గందరగోళం అవుతుంది. పెట్టుబడి ప్రధాన సమాజంలోని అన్ని తరగతుల వారూ ఈ మాయలో చిక్కుకుంటారు.

సరిగ్గా ఈ నేపధ్యంలో కేశవ్ గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రింట్ మీడియా పత్రికల కోసం రాసిన వ్యాసాలనన్నింటినీ ఒక పుస్తకంగా తీసుకొచ్చారు. ఏమిటి ఈ పుస్తకం ప్రత్యేకత అంటే ప్రపంచీకరణని కేవలం సైద్ధాంతికంగా విశ్లేషించి, వివరించటంగా కాకుండా దాని బాహువులు, కోరలు, కొమ్ములతో కూడిన విశ్వరూపపు పదఘట్టనలో నలిగిపోయిన, నలిగిపోతున్న జన జీవన పార్శ్వాలను, ప్రపంచీకరణకు దాసోహమనే భారతదేశం వంటి మూడో ప్రపంచ దేశాల పాలకుల ఊడిగపు చేష్టలు, ప్రపంచీకరణ వాణిజ్యవేత్తలతో “అపవిత్ర కూటమి”గా పాలకులు ఏర్పడటం వలన సమాజం, దానిలొ భాగమైన భిన్న వ్యవస్థలు చచ్చుబడిపోవటాన్ని సోదాహరణంగా వివరించటం, సాక్ష్యాలతో బోనెక్కించటం ఈ పుస్తకంలోని 30 వ్యాసాల ప్రత్యేకత. ఈ వ్యాసాల గుఛ్ఛంలో ప్రపంచాన్నే కాదు మన దేశాన్ని పట్టి కుదిపేస్తున్న అంశాలన్నింటి మీద సమాచారం, విశ్లేషణ, దృక్పథం స్పష్టంగా కనబడతాయి. ఇవి ప్రధానంగా అర్ధశాస్త్ర వ్యాసాలు అయినప్పటికీ సమాజం యొక్క సర్వ సమగ్ర రూపం మీద అవగాహన లేకుండా ఈ అర్ధశాస్త్ర పరిజ్ఞానానికి అర్ధం వుండదు. ఇక్కడే రచయిత తన మేథో పరిణితిని చూపించటం జరిగింది.

మతము, దేశభక్తి ఏవిధంగా వ్యక్తి పూజలోకి, ఓటు బాంకుల్లోకి తర్జుమా అయిందనే వాస్తవం, దాని వల్ల పెరిగే అసమానత్వం, వ్యక్తి పూజకు దోహదం చేస్తూ యువతని మత్తులో కట్టి పడేసిన డిజిటల్ విప్లవం, కార్పొరేట్ల విజృంభణ, వారి కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన వ్యవసాయ పరిస్తితి గురించి, ఆ విధంగా స్థానిక పరిస్తితుల్ని ప్రపంచీకరణ వాణిజ్యం ఎలా తనకు అనుకూలంగా మలుచుకోగలదో మనం మొదటి వ్యాసంలోనే చూడొచ్చు (వ్యక్తిపూజల్లోకి పరిణమించిన ఎన్నికల పరిణితి). మతోన్మాదానికి, యుద్ధోన్మాదానికీ కూడా ప్రాణవాయువులూదేది ప్రపంచీకరణే. ఇది “యుద్ధోన్మాదం-మతోన్మాదం” అనే వ్యాసం ద్వారా తెలుసుకుంటాం.

మూక హత్యల గురించి ఒక వ్యాసంలో రాసింది చదివినప్పుడు మనిషి ప్రతి సామాజిక దుర్మార్గ చర్యకి సమాజంలో ఎక్కడో ఒక ప్రోత్సాహం లభిస్తుంది. దళితుల ఊచకోత మనం చూస్తూనే వున్నాం. ఎవరో ఒకరిని దళితుడనో, ముస్లీం అనో, గెడ్డం పెంచాడనో, ఆవుల్ని అమ్మేస్తున్నడనో, పిల్లల్ని ఎత్తుకుపోతున్నాడనో, ఆవు మాంసం తినేశాడనో, దళితుడై గుర్రం కొని, దాని మీద ఎక్కాడనో హత్యలు చేస్తున్నారని ఇలా ఏదో నెపం మీద హత్యలు చేయటానికి ఒక విలువల మద్దతు ఉందని అర్ధం అవుతుంది. అలాగే ఇది రాజ్యాంగ వ్యవస్థలు, చట్టాల మీద అవిశ్వాసాన్ని కూడా తెలుపుతుంది. మూక హత్యలకు ఒక సామాజిక ఆమోదం లభించాక మిగిలేది అనాగరిక క్రూరత్వమే. అయితే ప్రజల్లో మూక మనస్తత్వం రెచ్చగొట్టి, వాళ్లని ఒక ఓట్ బాంక్ గా మలుచుకోవటంలో వాట్సాప్ వంటి సోషల్ మీడియాదే ప్రధాన పాత్ర. సోషల్ మీడియా ప్రపంచాన్ని దగ్గరకు చేస్తున్నదో లేక పాలకులు ప్రజల మెదళ్లను తమకి అనుకూలంగా మలుచుకుంటున్నారో స్పష్టంగా లేదూ? సోషల్ మీడియా వల్ల జరిగే అనర్ధాలన్నీ ప్రపంచీకరణ దుష్ఫలితాలు కావూ?

గ్లోబలైజేషన్ అంటే ప్రపంచం మొత్తాన్ని వాణిజ్యమే కలుపుతుందన్న అమానవీయ ఆర్ధిక సూత్ర పునాదిగా మొదలవుతుంది. అభివృద్ధి చెందిన లేక చెందుతున్న దేశాలకు బాంకింగ్ వ్యవస్థ కీలకం. అభివృద్ద్ధి చెందుతున్న దేశాల్లో బలిసిన వాళ్లు మరింత బలవకుండా, బలహీనులు మరింత బలహీనమవకుండా చూసేందుకు కరెన్సీ నుండి ఇతర ఆర్ధిక వనరుల సక్రమ పంపిణీ కోసం ప్రభుత్వ బాంకింగ్ వ్యవస్థ పటిషంగా వుండాలి. అయితే గ్లోబలైజేషన్ వ్యూహాల్లో ప్రైవేట్ బాంకుల విస్తరణ ప్రధానం. అవి విస్తరించాలంటే ప్రభుత్వ బాంకింగ్ వ్యవస్థ ధ్వంసం అయి తీరాల్సిందే. ఈ వైనాన్ని కేశవ్ తన వ్యాసాల్లో ప్రధానంగా ఎత్తి చూపించారు. ప్రైవేటు బాంకుల పని విధానంలోని లొసుగులు, వాటికి అండగా నిలిచే ఎఫ్.ఆర్.డి.ఐ. వంటి బిల్లుల మతలబు చాలా ప్రభావవంతంగా రాసారు. నోట్ల రద్దు, పీ.ఎన్.బి. స్కాములు, భారతీయ వ్యవసాయ రంగం, రైతుకు ప్రయోజనం ఇవ్వని రైతు స్కీముల లోని డొల్లతనం, బ్లాక్ మనీ, వాల్మార్ట్ కి స్వాగతం పలుకుతూ దేశీయ రిటైల్ రంగాన్ని ధ్వంసం చేసిన తీరు, శ్రామిక చట్టాలు, టిటాఘర్ జనపనార బతుకులు, ఇంకా ఎన్నార్సీ, మైనింగ్ కార్మికుల దుస్థితి, ప్రపంచీకరణ ప్రభావాల్లో ఒకటైన “టిక్ టాక్”, వ్యవసాయ రంగంలో స్వేఛ్ఛా వాణిజ్య ఒప్పందాల్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాల నుండి వొత్తిడి వచ్చిన కారణంగా 16 దేశాలతో కూడిన ఆర్.ఈ.సీ.పి. నుండి భారత్ బైటకి వచ్చిన సానుకూలాంశం, బెంగాల్లో శారదా కంపెనీ చేసిన వేల కోట్ల పొదుపు మోసాలు జరిగిన తీరు…ఇలా ప్రపంచీకరణకి వున్న ముఖాలనన్నింటినీ ముసుగులు తీసి చూపించిన వ్యాసాలే ఎవన్నీ.

కేశవ్ ఈ వ్యాసాలనన్నింటినీ ఎలా రాయగలిగారు? అది ఆయన ఒక మార్క్సిస్టు అయినందువల్ల మాత్రమే చేయగలిగారు. ఎంచుకున్న అంశంతో సంబంధమున్న ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేసి పొట్టుకి పొట్టు, పొల్లుకి పొల్లు వేరు చేసి చూపించే దృక్పథం ఆయనది. ఎంచుకున్న అంశంతో ముడిపడ్డ అన్ని అంశాల మీద ఒక సమగ్రమైన అవగాహన వల్లనే ఇది సాధ్యం. ఒక బీపీఎల్ కార్మికుడి జీవితాన్ని అర్ధం చేసుకోవాలంటే అతని కుటుంబ జీవన స్థాయి నుండి అతనికి చేరుతున్న ప్రభుత్వ పథకాల వరకు, అతని కొనుగోలు శక్తి నుండి ప్రభుత్వాన్ని నియంత్రించే అంతర్గత, బాహ్య శక్తుల ప్రభావం, వాటి బలం పట్ల అంచనా, అవగాహన తప్పనిసరి. రచయితలో అది పుష్కలంగా వుంది. రచయితది పూర్తిగా శ్రామికజన పక్షపాతం. అతనిది న్యాయం వైపు నిలిచిన దృష్టి. తన అభిప్రాయాలకి, వాదనలకి, కంక్లూజన్స్ కి తగినటువంటి గణాంకాలు, ఇతర సమాచారం చూపిస్తూ రచనలు చేసారాయన.

తెలుగులో ఇలాంటి విశ్లేషణాత్మక వ్యాసాలు అరుదు. ఇంత మంచి వ్యాసాలు మనకి తెలుగులో అందించిన కేశవరావు నిజానికి మన తెలుగు రాష్ట్రాలకి చెందినవారు కాదు. ఆయన పశ్చిమ బెంగాల్లో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందినవారు. వృత్తి రీత్యా ఆయన ఒక బడి పంతులు. ఆంగ్ల భాష బోధిస్తుంటారు. ఆంగ్ల సాహిత్యాన్ని కూడా విస్తృతంగా చదువుకున్నారు. ఆయన, ఆయన జీవన సహచరి సర్వ మంగళ ఇతర మిత్రులతో కలిసి టిటాఘర్ ప్రాంతపు ప్రవాసాంధ్రుల కోసం “జాగృతి సమీక్ష” అనే త్రైమాసిక పత్రికని ప్రచురిస్తుంటారు. ఆ అభ్యుదయ దంపతులు సోషల్ మీడియాలో వామపక్ష భావజాలానికి నిబద్ధమై రచనలు చేయటం ద్వారా ఎందరికో సుపరిచితులు. ఈ పుస్తకం సర్వ మంగళ పూనికతో సాధ్యమైంది అని కేశవ్ అంటారు. వారిరువురు తెలుగు సమాజంతో, సాహిత్యంతో మనకంటే మంచి అనుబంధాన్ని కలిగి వున్నవారు. ఇది నన్ను ఎంతగానో సంతోషకర విస్మయానికి గురిచేస్తుంది.

దేశాన్ని ప్రేమించటమంటే సెంటిమెంట్లని నెత్తికెత్తుకోవటం కాదు. దేశాన్ని ప్రేమించటం అంటే దేశ పౌరులకి ప్రయోజనం కలిగించటం. ఈ పుస్తకంలోని వ్యాసాల్ని దేశం మీద అవగాహనతో కూడిన ప్రేమతో రాసినవి. ఈ పుస్తకం ఒక నవలలా చదివి పక్కన పెట్టుకోవలసినది కాదు. రిఫరెన్స్ కోసం దాచి పెట్టుకో తగ్గ పుస్తకం. ఒక అధ్యయన వేదిక. సమకాలీన సమాజాన్ని సమగ్రంగా ఆకళింపు చేసుకోవాలనుకొని, ఆ దిశగా జ్ఞానాన్ని పెంచుకోగోరే ఔత్సాహికులకి ఒక పాఠ్య పుస్తకం వంటిది. తప్పక చదవండి.

(పగిలిన పాదాల నెత్తురులో…” (ప్రపంచీకరణ వ్యాసాలు). రచన కేశవ్. 216 పేజీలు. వెల 200 రూపాయిలు. ప్రతులకు: Sarva Mangala, Flat No.3/B, Rachana Apartment, 78/1, K.N.Mukharjee Road, Thalpukur Post, KOLKATA-700123. West Bengal. Mobile No. మొబైల్ 9831314213)

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

Leave a Reply