న్యాయవ్యవస్థలో చొరబాటుకు కేంద్రం కుట్ర

గత 75 సంవత్సరాల్లో మొదట కాంగ్రెస్‌ శక్తులు, ఆ పిమ్మట బిజెపి, ఆరెస్సెస్‌ శక్తులు రాజ్యాంగ లౌకిక ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడకుండా వ్యవహరిస్తూ వస్తున్నాయి. 1971-1993 మధ్య దేశ పాలకులు సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా ఉండే న్యాయమూర్తులనే నియమిస్తూ వచ్చారు. దాంతో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకాల్లో ‘సీనియారిటీ’ ప్రశ్న తలెత్తకుండా పాలకులు జాగ్రత్త పడుతూ వచ్చారు. 1981లో ‘ఫస్ట్‌ జడ్జెస్‌’ కేసులో (ఎస్‌.పి. గుప్తా కేసు) వెలువరించిన న్యాయ వ్యవస్థ స్వతంత్రత తీర్పును శిరసావహించవలసిన అవసరాన్ని పాలకులు తోసిపుచ్చుతూనే వచ్చారు. ఈ ధోరణిని 1993లో గట్టిగా నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎన్‌ వెంకటాచలయ్య అడ్డుకున్నారు. దాంతో న్యాయస్థానానికీ, పాలక వర్గానికీ మధ్య అధికార సమతుల్యత వచ్చినట్టు కనిపించిది. ఇప్పుడు పాలక శక్తుల నిరంకుశ ధోరణి (ప్రభుత్వం మాటే చెల్లుబడి కావాలి అన్న వాదన) మళ్లీ యధాతథ స్థితికే వచ్చింది.

2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తీసుకున్న విధాన నిర్ణయాలన్ని రాజ్యాంగ విరుద్ధమైనవే. పెద్దనోట్లరద్దు, జిఎస్‌టి, రాజ్యాంగ అధికరణ 370 రద్దు, ప్రత్యర్థులపై పెగాసస్‌ నిఘా, ప్రశ్నిస్తున్న వారిపై ఉపా చట్టం, మూడు సాగు చట్టాలు, 4 కార్మిక కోడ్లు, నూతన విద్యావిధానం-2020 వంటివన్నీ రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమైనవే. మీడియాను, దర్యాప్తు సంస్థలను, గవర్నర్‌ వ్యవస్థను, చివరికి ఎన్నికల సంఘాన్ని కూడా మోడీ సర్కార్‌ ఏ విధంగా ప్రభావితం చేస్తూ, దుర్వినియోగం చేస్తున్నదో దేశమే కాదు, యావత్‌ ప్రపంచం గమనిస్తున్నది. తన నుంచి ఎవరుగానీ, ఏ వ్యవస్థగానీ ఎటువంటి జవాబుదారీతనాన్ని ఆశించవద్దని, ప్రశ్నించవద్దని ఈ ప్రభుత్వ వైఖరిగా ఉన్నది. తాను ఏం చేస్తే అదే గొప్ప అనే వందిమాగదులు మాత్రమే ఉండాలని భావిస్తున్నది. ఇటువంటి సర్కార్‌కు న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండటం ఎంతమాత్రమూ నచ్చకపోవటంలో ఆశ్చర్యం లేదు. అందువల్లే న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో చొరబడాలని మోడీ అధికారంలోకి రాగానే ప్రయత్నాలు మొదలయ్యాయి. కొలీజియం స్థానంలో ‘న్యాయమూర్తుల నియామకాల కమీషన్‌’ను ఏర్పాటుచేస్తూ చట్టాన్ని కూడా చేసింది. పెను ప్రమాదాన్ని పసిగట్టిన సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకం అంటూ కొట్టివేసింది.

ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రారంభమయ్యాక ఫ్రెంచ్‌ న్యాయనిపుణుడు, తత్వవేత్త మాంటెస్క్యూ ‘ది స్పిరిట్‌ ఆఫ్‌ లాస్‌’ అనే గ్రంథాన్ని రాశారు. అందులో ప్రభుత్వ అంగాలైన శాసనవ్యవస్థ (లెజిస్లేచర్‌), కార్యనిర్వాహక వ్యవస్థ (ఎగ్జిక్యూటివ్‌), న్యాయవ్యవస్థ(జ్యూడిషియరీ) మూడు ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చెలాయించరాదని, ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పారు. అమెరికా రాజ్యాంగంలో మాంటెస్క్యూ ప్రతిపాదించిన ‘అధికార పృథక్కరణ సిద్ధాంతాన్ని’, చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సస్‌’ పేరుతో అమలు చేస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ మూడు వ్యవస్థలు రాజ్యాంగం విధించిన పరిధిలోనే పనిచేయాలని రాజ్యాంగంలో స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో 32వ అధికరణం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన విషయంలో భారతీయ పౌరులందరూ సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అనుమతిస్తుంది. ఇటువంటి కేసులను సుప్రీంకోర్టు స్వీకరించకూడదని ప్రభుత్వం భావిస్తోంది. మేధావులపై, జుర్నలిస్ట్ లపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైళ్లో పెట్టింది. వీరికి బెయిల్ ఇవ్వకూడదన్నది ప్రభుత్వం భావన. అయితే ఇటీవల సుప్రీంకోర్ట్ పౌరహక్కుల, పౌరస్వేచ్చ పరిరక్షణలో భాగంగా జర్నలిస్ట్ జుబైద్, సిద్దిక్ కుప్పన్ కు సామాజిక మేధావులైనా ఆనంద్ తెల్ తుంబ్డే వరవరరావు, గౌతమ్ నవలఖాలకు కోర్ట్ బెయిల్ మంజూరి చేయడంతో ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది.

భారతదేశ రాజ్యాంగం 13వ అధికరణలో న్యాయవ్యవస్థకు గల న్యాయ సమీక్షాధికారాన్ని వివరించింది. గత 73 ఏళ్లలో పార్లమెంటు చేసిన అనేక రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను సుప్రీంకోర్టు న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించుకొని కొట్టివేసింది. ఈ అధికరణ ద్వారానే జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణయ్యర్‌, జస్టిస్‌ పి.ఎస్‌.భగవతి, జస్టిస్‌ ఓ. చిన్నపరెడ్డి, జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌ వంటి న్యాయమూర్తులు ప్రజాస్వామ్య స్పూర్తితో ఎంతో ఉన్నతమైన తీర్పులు ఇచ్చారు.

ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టుకూ ప్రభుత్వానికీ మధ్య ఘర్షణాయుతమైన వాతావరణం పెరుగుతున్నట్లు కనపడుతోంది. ప్రధానంగా ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వం న్యాయవ్యవస్థపై తన విమర్శనా బాణాలు ఉద్దేశపూర్వకంగా ఎక్కుపెట్టడం యాధృచ్చికంగా జరుగుతున్నట్లనిపించడం లేదు. ఎప్పుడో 2015లో సుప్రీంకోర్టు న్యాయ నియామకాల కమీషన్‌ను రద్దు చేస్తే ఇప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌తో సహా అధికారంలో ఉన్న పెద్దలు ఆ విషయం పదే పదే మాట్లాడుతుండడం, ఆర్‌ఎస్‌ఎస్‌ అధికార పత్రిక ‘ఆర్గనైజర్‌’లో కూడా కొలీజియం వ్యవస్థను తీవ్రంగా విమర్శించడ వెనుక ఆంతర్య ఏమిటో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ కమీషన్‌ గురించి మాత్రమే కాదు, సుప్రీంకోర్టు సెలవుల గురించి, పెండింగ్‌ కేసుల గురించి విమర్శిస్తున్నారు. సుప్రీంకోర్టు కొందరికి బెయిల్‌ ఇవ్వకూడదని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను స్వీకరించకూడదని హితబోధలు చేస్తున్నారు. పర్యావరణం, హక్కులకు సంబంధించిన కేసులను మోడీ గతంలో ఫైవ్‌ స్టార్‌ కేసులుగా అభివర్ణించారు. సుప్రీంకోర్టు వాటిని విచారణకు స్వీకరించరాదని హితవు చెప్పారు. ఇప్పుడు బెయిల్‌ పిటీషన్లను, ప్రజాహిత వ్యాజ్యాలను పరిశీలించకూడదని ఆయన మంత్రులు అంటున్నారు. అంటే కేవలం న్యాయమూర్తుల నియామకం గురించి మాత్రమే కాదు, సుప్రీంకోర్టు పనితీరు పట్ల కూడా ప్రభుత్వం తీవ్ర అక్రోశంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధులతో పార్లమెంట్‌ ఏర్పడుతుంది కనుక న్యాయనియామకాల విషయంలో పార్లమెంటు మాటే చెల్లుబాటు కావాలని ప్రభుత్వాధి నేతలు అనడంలో పసలేదు. పార్లమెంట్‌కు ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఎన్నికవుతున్నారు, సరైనవారు ఎన్నికవుతున్నారా? వారిలో పెద్ద సంఖ్యలో నేరచరితులు లేరా? అన్నది చర్చనీయాంశం. అయితే పార్లమెంట్‌, చట్టసభల్లో మెజారిటీ ఉన్నంత మాత్రాన అవి చేసే చట్టాలన్నీ సరైనవి అని చెప్పడానికి కూడా వీలు లేదు. రాజ్యాంగంలో 21వ అధికరణ చెల్లదని, జీవించే హక్కు లేదని మెజారిటీ ద్వారా చట్టసభలు నిర్ణయిస్తే సరిపోతుందా? 1967లోనే గోలక్‌నాథ్‌ కేసులో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కోకా సుబ్బారావు ప్రాథమిక హక్కులను రద్దు చేసే విషయంలో పార్లమెంట్‌కు అధికారాలు లేవని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ హయాంలో ఈ కేసును నీరు కార్చేందుకు ప్రయత్నిస్తే మళ్లీ సుప్రీం అడ్డుపడింది. రాజ్యాంగం మౌలిక స్వభావాన్ని మార్చేందుకు వీలు లేదని కేశవానంద భారతి కేసులో 1973లో సుప్రీం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 356 అధికరణను ఎడా పెడా ప్రయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేయడం చెల్లదని 1994లో ఎస్‌ఆర్‌ బొమ్మయి కేసులో సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు చట్టాలు, విద్యుత్‌ సంస్కరణలు, బీమా వ్యాపారం, ట్రిబ్యునల్‌ సంస్కరణలకు సంబంధించి ప్రవేశపెట్టిన అనేక బిల్లులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 370 అధికరణ రద్దు, రాఫెల్‌ అవినీతి, పెగాసస్‌ పట్ల తీవ్ర విమర్శలు వచ్చిన విషయం మరిచిపోరాదు.

ఉన్నత న్యాయస్థానాలను కాషాయ న్యాయమూర్తులతో నింపుకోడానికి బిజెపి పాలకులు ఒక పద్ధతి ప్రకారం కొలీజియం వ్యవస్థను అప్రతిష్టపాలు చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ నిష్పాక్షికతను కాపాడడం కోసం సుప్రీంకోర్టు దీనిని అదే పనిగా ప్రతిఘటిస్తున్నది. ఈ యుద్దాన్ని మరింత తీవ్రం చేస్తూ కేంద్ర పాలకులు ఉప రాష్ట్రపతి జగ్జీవ్‌ ధన్‌ఖర్‌, న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుల ద్వారా అనుచితమైన ప్రకటనలను ఇప్పిస్తున్నది. శీతాకాలానికి రెండు వారాల పాటు, వేసవి కాలంలో ఆరు వారాల పాటు, దసరా, దీపావళి పండుగలకు చెరి వారం పాటు కలిసి ఏడాదిలో మొత్తంగా పది వారాల పాటు సుప్రీంకోర్టుకు సెలవులు ప్రకటిస్తారు. దీనిపై వచ్చిన విమర్శకు మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఎన్‌.వి. రమణ, కెజి బాలకృష్ణన్‌ వంటి వారు తీవ్రంగా స్పందించారు. సెలవుల్లో జడ్జీలు ఆనందంగా గడుపుతారనే దురభిప్రాయం ఉందని, అది వాస్తవం కాదని, వారాంతాల్లోనూ, సెలవుల్లో కూడా న్యాయమూర్తులు పనిచేస్తారని జస్టిస్‌ ఎన్‌వి రమణ ప్రకటించారు. ఆ సమయాల్లో పెండింగ్‌లో ఉన్న తీర్పులను రాస్తారని వెల్లడించారు. సెలవుల్లో తాము సుఖపడతామనే అభిప్రాయం తప్పన్నది ఆయన అభిప్రాయాన్ని ఎంత మాత్రం కొట్టివేయదగినది కాదు. న్యాయమూర్తులను దుర్వాఖ్యలతో గాయపరచి తమ దారికి తెచ్చుకోవడానికి బిజెపి పాలకులు ఒక పద్ధతి ప్రకారం ఇటువంటి దాడికి పూనుకొన్నట్టు బోధపడుతున్నది.

వాస్తవం చెప్పాలంటే వారి విధి నిర్వహణలో అన్యాయమైన జోక్యం చేసుకొంటున్నారు. బెయిల్‌ పిటిషన్ల వంటి వాటిపై సుప్రీంకోర్టు సమయాన్ని వృధా చేయరాదని పార్లమెంటులో రిజిజు చేసిన ప్రకటన అత్యంత అభ్యంతరకరమైనది. దీనికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ గట్టి జవాబునే ఇచ్చారు. ఆయన ఒక ధర్మాసనానికి సారథ్యం వహిస్తూ వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన అంశాల్లో కలుగజేసుకోలేకపోతే తమ ఉనికికి అర్థమే లేదని ఆయన అన్నారు. పౌరులు స్వేచ్ఛ కోసం చేసే అర్తనాదాన్ని, మా అంతరాత్మ ప్రబోధాన్ని వినిపించుకోవడం మా బాధ్యత అని ఆయన స్పష్టంగా చెప్పారు. రాజ్యాంగంలోని 21వ అధికరణ పౌరుల జీవన హక్కుకు, 19వ అధికరణ వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఇస్తున్నది. చట్టం అనుమతించే మార్గంలో తప్ప ఇతర ఏ విధంగానూ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను, ప్రాణాలను హరించే హక్కు, అధికారం ఎవరికీ లేవని ఈ అధికరణ స్పష్టంగా చెబుతున్నది. పాలకులు గాని, వారి పోలీసులు గాని దీనిని ఉల్లంఘించి వ్యక్తుల ప్రాణాలను బలిగొన్నా, స్వేచ్ఛలను హరించినా రంగ ప్రవేశం చేసి వాటిని గట్టిగా అడ్డుకోవలసిన బాధ్యత రాజ్యాంగం, న్యాయస్థానాలపై ఉంచింది. వాస్తవానికి అదే మన ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైనది. బెయిల్‌ కోసం నిందుతులు చేసుకొనే అభ్యర్థనల పరిష్కారం ఇందులో భాగమే. ఇటువంటి ప్రధానమైన కర్తవ్యాన్ని అప్రధానమైన అంతంగా భావించి బెయిల్‌ దరఖాస్తులపై కాలం దుర్వినియోగం చేయొద్దని కేంద్రం సుప్రీంతో సుప్రీంకోర్టుకి సూచించడం కంటే రాజ్యాంగ అతిక్రమణ బహుశా మరొకటి ఉండదు.

సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం తీసుకున్న నిర్ణయం ఫలితంగా జస్టిస్‌ కె.ఎం. జోసెఫ్‌ లాంటి దళిత న్యాయమూర్తి నిజాయితీ ప్రపంచానికి వెల్లడయింది. ఉత్తరాఖండ్‌లో పరిణామాలు బిజెపి పాలకులకు వ్యతిరేకంగా ఉన్నందున అర్ధంతరంగా అక్కడ రాష్ట్రపతి పాలనను విధించేందుకు మోడీ ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని తిప్పి కొట్టడానికి జస్టిస్‌ జోసెఫ్‌ జంకనందున అప్పటికి ఉత్తరాఖండ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న ఆయన్ని సుప్రీంకోర్టు జస్టిస్‌గా పదవీ స్వీకారం చేయనివ్వకుండా మోడీ ప్రభుత్వం అడ్డుకుంది. అలాగే రాష్ట్ర గవర్నర్లు… రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి, వాటి సలహా సహకారాలతోనే రాజ్యాంగంలోని 163వ అధికరణ ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది గానీ, రాష్ట్ర ప్రభుత్వాలను ధిక్కరించి కాదని బొమ్మై కేసులో జస్టిస్‌ జయచంద్రారెడ్డి తీర్పును దేశవ్యాపిత స్థాయిలోనే ప్రజాస్వామ్య నిర్ణయంగా న్యాయ శాస్త్రవేత్తలు భావించారు. నేడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలోని బిజెపి గవర్నర్లు చేస్తున్న నిర్వాకం దాదాపు పది రాష్ట్రాలలోని బిజెపియేతర ప్రభుత్వాలను పడగొట్టేందుకు తోడ్పడటం. ఇలా 1960ల నుంచి నేటి దాకా పెక్కుమంది గవర్నర్లు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోయడానికి తోడ్పడుతూ వచ్చినవాళ్లే!

కొంతకాలం పాటు సహనంతో ఉన్న కేంద్రం.. ఇటీవల ముఖ్యంగా జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ గత నవంబర్‌లో సిజెఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాడిని ముమ్మరం చేసింది. మంత్రి రిజిజు వ్యాఖ్యలు, బెంగాల్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు మమతతో నిత్యం కయ్యాలు పెట్టుకొని తద్వారా ఉప రాష్ట్రపతిగా పదోన్నతి పొందిన జగదీప్‌ ధన్‌ఖర్‌ మాటలు దీన్ని నిరూపిస్తున్నాయి. భిన్నాభిప్రాయాలకు పెద్దపీట వేసి ఉదారవాద న్యాయమూర్తిగా పేరొందిన జస్టిస్‌ డి.వై.చందచూడ్‌ వచ్చే లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకూ పదవిలో ఉంటారు. ఎన్నికల లబ్ది కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపి ఏ స్థాయికైనా బరితెగిస్తుందనటానికి ఈ ఎనిమిదేండ్లలో అనేక ఉదాహరణలున్నాయి. ఈ బుల్డోజర్‌ రాజకీయాలకు పాతర వేయకపోతే దేశ ప్రజాస్వామ్యం ఉనికిలో ఉండని రోజొస్తుంది. కేంద్రం దాడిని సుప్రీంకోర్టు తిప్పి కొట్టాలి. ప్రజలందరూ కేంద్రం వైఖరిని ఖండించాలి. న్యాయ నియామకాల్లో సంస్కరణలు, పారదర్శకత అవసరమేగానీ, అని న్యాయవ్యవస్థ స్వతంత్రతను హారించేవిధంగా ఉండరాదు. ఆ మార్పులు తెచ్చే నైతికత మోడీ సర్కార్‌కు ఉందా?

ఇటీవల జైపూర్‌లో జరిగిన 83వ అఖిల భారత చట్టసభల అధ్యకక్షుల సదస్సులో ప్రారంభోపన్యాసం చేస్తూ ఉపరాష్ట్రపతి ధన్‌ఖర్‌ శాసననిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ అనే మూడు వ్యవస్థల మధ్య అనుల్లంఘనీయమైన సమానత్వం ఉండాలని, ఇవి ఒకదాని అధికార పరిధిలోకి మరొకటి చొచ్చుకొని వెళ్ళరాదని ఉద్బోధించడం ప్రాథమిక స్థాయి బడి పాఠాన్ని తలపించింది. న్యాయ నియామకాలపై కొలీజియం అధికారాలను ప్రశ్నించే పనిలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు నిర్వహిస్తూ వచ్చిన పాత్రను ఆయనకు మించిన ఉత్సాహంతో ఇప్పుడు ధన్‌ఖర్‌ పోషిస్తున్నారు. ఒక అడుగు ముందుకు వేసి శాసనసభ సభ్యులను ప్రజలెన్నుకుంటారు. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ సభ్యులు నామినేట్‌ చేయబడుతారు. కనుక ఆ రెండింటికంటే పార్లమెంటు ఉన్నతమైనదని ఉద్భోదించాడు.

ఈ వ్యవస్థలన్నింటికీ పునాది రాజ్యాంగమే అనీ, పార్లమెంటు కానీ, సుప్రీంకోర్టు కానీ దానికంటే ఉన్నతమైనవి కావని ఆయన మరిచిపోతున్నారు. పార్లమెంటుకంటే రాజ్యాంగమే సుప్రీం అని 1973లో కేశవానంద కేసులో తీర్పు చెప్పినందుకు ఆ కేసునూ, సుప్రీంకోర్టునూ ఆయన తప్పుబడుతున్నారు. కేశవానందభారతి కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని, అది ప్రజలకు దఖలుపరిచిన ప్రాథమిక హక్కులను ఎవరూ మార్చలేరనీ, తాను వాటి రక్షణకు కట్టుబడి ఉన్నానని సుప్రీంకోర్టు ప్రకటించినందువల్లనే ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బ్రతికిబట్టకడుతోంది. థాబ్దాలుగా అనేక ప్రజానుకూల తీర్పులకు పునాదిగా, అనేక దేశాల్లో కొత్త చట్టాలకు తీర్పులకు పునాదిగా, అనేకదేశాల్లో కొత్త చట్టాలకు తీర్పులకు స్ఫూర్తిగా నిలిచినకేసు ఇది. ప్రజలు ఎన్నుకున్నంత మాత్రాన పార్లమెంటు చేసే చట్టాలన్నీ ప్రజాశ్రేయస్సుకే ఉపకరిస్తాయని అనుకోలేం. అవి సమీక్షకూ, విమర్శకూ అతీతంగా ఉండాలన్న ఉపరాష్ట్రపతి వాదన ప్రజాస్వామ్యవ్యవస్థకే ప్రమాదం.

దేశాన్ని నడిపిస్తున్న పై మూడు వ్యవస్థల ప్రాధాన్యాన్ని గాని, వాటి మధ్య సమతౌల్యం అవసరాన్ని గాని ఎవరూ కాదనరు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థది పైచేయిగా ఉండక తప్పని పరిస్థితిని రాజ్యాంగమే కల్పించిందన్న సంగతిని మరచిపోకూడదు. రాజ్యాంగాన్ని కాచి వడపోసి దాని లోతులు తెలిసిన ఉన్నత న్యాయమూర్తులతో కూడుకొన్న నాయ్య వ్యవస్థ, ప్రజలెన్నుకునే సభ్యులతో కూడిన పార్లమెంటు ఒక దానికొకటి తీసిపోనివే. ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకునే చట్టసభలకు విశేష ప్రాధాన్యమున్న మాట కూడా వాస్తవమే. అయితే దేశ పాలనకు సంబంధించిన కీలక అంశాలపై మీమాంస తలెత్తే అరుదైన సందర్భాల్లో సుప్రీంకోర్టుది పైచేయికాక తప్పదు. అలా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు చట్టసభలు కూడా తలవంచిన సందర్భాలు లేకపోలేదు. స్పీకర్ల, గవర్నర్ల నిర్ణయాలను, రాజ్యాంగ వివేచన అనే గీటురాయి మీద పెట్టి సుప్రీంకోర్టు కొట్టివేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. పార్లమెంటు చేసే చట్టాలు వివాదాస్పదమైనప్పుడు వాటి మంచి చెడ్డలను లోతుగా పరిశీలించి వాటిని సుప్రీంకోర్టు కొట్టివేసిన ఉదాహరణలూ ఉన్నాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే రీతిలో చట్టసభలు చేసే చట్టాలను గాని, ప్రభుత్వాలు తీసుకొనే చర్యలను గాని రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ఉపరాష్ట్రపతి పదవిలోని జగ్దీప్‌ ధన్‌ఖర్‌కు ఈ సూక్ష్మం తెలియకపోవడం ఆశ్చర్యకరం. మూడు వ్యవస్థలనూ అదుపు చేసే పర్యవేక్షక వ్యవస్థ రాజ్యాంగం మాత్రమే.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక కమిటీలో ప్రభుత్వ ప్రాతినిధ్యం అనేది న్యాయవ్యవస్థ స్వతంత్రతను ధ్వంసం చేస్తుందని న్యాయమూర్తుల నియామక కమిటీ చట్టం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. పౌర సమాజం ఇంకా పూర్తి పరిణతిని పొందలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో న్యాయమంత్రి సూచన ఆ తీర్పును తోసిపుచ్చే ప్రయత్నమే. కొలీజియం వ్యవస్థను యథాతథంగా పునరుద్ధరించాలని చెబుతూ అందులోనూ లోపాలున్నాయని చెప్పింది. వాటిని తొలగించుకొని ఆ వ్యవస్థను మరింత మెరుగుపరచుకోవడం తప్ప వేరే దారి లేదు. ఏడేళ్ళ క్రితం ఆ తీర్పు వచ్చినప్పుడు ఇప్పటి ఎన్‌డిఎ కూటమే కేంద్రంలో అధికారంలో ఉంది. ఇంతకాలమూ కొలీజియం వ్యవస్థను అరకొరగానైనా గౌరవిస్తూ వచ్చిన ప్రధాని మోడీ ప్రభుత్వం ఉన్నట్టుండి దానిని రద్దు చేయించి జాతీయ న్యాయ నియామకాల కమీషన్‌ను తిరిగి తీసుకురావాలని కోరుకోవడాన్ని అనుమానించి తీరాలి.

న్యాయవ్యవస్థలో ప్రభుత్వ ప్రతినిధుల చొరబాటుకు మరో రాజ్యాంగ సవరణను పార్లమెంటు చేత ఆమోదింపజేసుకొనే కుయుక్తి సాగుతూ ఉండవచ్చు. అయితే దానిని కూడా కొట్టివేయడానికి సుప్రీంకోర్టు వెనుకాడకపోవచ్చు. న్యాయ వ్యవస్థను తమకు ఇష్టులైన వారితో నింపివేయడమే మోడీ ప్రభుత్వ అంతర్యమని అనుకోక తప్పదు. అమెరికాలో ట్రంప్‌ అధికారంలో ఉన్నప్పుడు పచ్చి మితవాదులను ఉన్నత న్యాయమూర్తులుగా నియమించిన ఫలితంగానే అబార్షన్‌ హక్కు రద్దు అక్కడి స్త్రీల మెడకు చుట్టుకొన్నది. గొప్ప ప్రజాస్వామిక దేశమని చెప్పుకొనే అమెరికాలో అప్రజాస్వామిక న్యాయం ఆ రకంగా ఊడిపడింది. అందుచేత రాజ్యాంగ ధర్మాన్ని గ్రహించిన వారితో కూడిన న్యాయ వ్యవస్థకే అంతిమ నిర్ణయాధికారం ఉండడం కొన్ని సందర్భాల్లో అవసరం. రాజ్యాంగం గీటురాయిని నిజాయితీతో, చిత్తశుద్ధితో వినియోగించే న్యాయమూర్తుల వల్లనే దేశానికి మేలు జరుగుతుంది.

మినర్వా మిల్స్‌ కేసులో న్యాయపాలిక స్పష్టం చేసినట్లు ఆ మూడు వ్యవస్థల్లో ఏ ఒక్కటే మిగిలిన వాటికన్నా ఎక్కువా కాదు, తక్కువా కాదు. ఆ మేరకు అవి సమన్వయంతో పనిచేస్తేనే ప్రజాపాలన రాజ్యాంగబద్ధమవుతుంది. తద్భిన్నంగా చట్టసభలే సర్వోత్కృష్టమైనవని తీర్మానించడమంటే వాటిలో సంఖ్యాబలం కలిగిన అధికారపక్షాల మాటే సర్వత్రా చెల్లుబాటు కావాలనడం! వ్యవస్థల నడుమ లక్ష్మణరేఖలను తోసిరాజంటూ ఏకపక్ష అపరిమిత అధికారాలను ఆశించడమంటే రాజ్యాంగాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడమే దాని స్ఫూర్తిని పూర్తిగా మంటకలపడమే! రాజ్యాంగ సభ సభ్యులు వ్యక్తి స్వేచ్ఛను గౌరవిస్తూ సంవిధానం సమర్థంగా అమలుకావడం కోసం న్యాయవ్యవస్థ స్వతంత్రతను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని వారు గుర్తించారు. రాజ్యాంగ రచనా సమయంలో సర్వోన్నత న్యాయస్థానం ముసాయిదా నిబంధనల రూపకల్పనకు ఒక తాత్కాలిక సంఘం ఏర్పాటైంది. చట్టాల రాజ్యాంగ యోగ్యతలను నిర్ణయించే అధికారం సుప్రీంకోర్టుకు కల్పించడమనేది ఏ సమాఖ్య వ్యవస్థలోనైనా అవసరమేనని అది తన నివేదికలో ఉద్ఘాటించింది. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల చేతలపై న్యాయసమీక్షకు అవకాశం ఉండటం భారత రాజ్యాంగ నిర్మాణంలో విడదీయలేని భాగం.

చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థకు మాత్రమే ఉంది. కానీ, ఆ బాధ్యతను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వర్తించడంలో అది ఎంతవరకు సఫలీకృతమవుతోంది? ప్రజాప్రతినిధుల కూలంకష పరిశీలనలు, చర్చలతో నిమిత్తం లేకుండానే అనేక బిల్లులు క్షణాల్లో శాసన రూపం దాలుస్తున్నాయి. కొత్త చట్టాలకు సభల ఆమోదముద్ర కావాలి కాబట్టి అనివార్యంగా వాటిని కొలువుతీరుస్తున్నారేమో అన్నట్లు సమావేశాలు మొక్కుబడి చందమవుతున్నాయి. అర్థరహిత ఆందోళనలు, అరుపులతో పార్లమెంటు, అసెంబ్లీల ప్రతిష్ఠ పోనుపోను పాతాళానికి పడిపోతోంది. చట్టబద్ధమన పాలన, సమాఖ్యతత్వాలతో పాటు అన్ని ప్రజాస్వామ్య విలువలను ప్రతీప పోకడలు పెచ్చరిల్లుతున్నాయి. దేశీయంగా పౌరహక్కుల పరిరక్షణలో న్యాయస్థానాలే ఆశాదీపాలవుతున్నాయి. ఆ క్రమంలో న్యాయసమీక్షాధికారంపై అడ్డదిడ్డమైన వాదనలు చేస్తూ వాటిపై దాడి చేయడం ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరం. ఎగువసభ అధ్యకక్షుడితో పాటు లోక్‌సభ స్పీకర్‌ కూడా అలా మాట్లాడటమే దురదృష్టకరం!

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికలపై వివాదాలు న్యాయసమీక్షకు అతీతమైనవని, వాటిలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదనేది ఇందిర సర్కారు చేసిన 39వ రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో ఒకటి అంటూ 1975 నాటి ఓ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి, 39వ రాజ్యాంగ సవరణను కొట్టివేసింది. అలాగే పార్లమెంటు చట్టాలను న్యాయ సమీక్షకు అతీతంగా ఉంచడం కోసం ఆ చట్టాలను రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడాన్ని కూడా 2007లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయ సమీక్ష అనేది పార్లమెంటు అధికారాలను సంగ్రహించడానికి, కత్తిరించడానికి ఉద్దేశించినది కాదని, రాజ్యాంగం ప్రబోధించిన నియంత్రణలు, సంతులనాలకు లోబడి పార్లమెంటు ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పనిచేసేలా చూడటానికి ఒక సాధనమని వివరించింది. న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగం తనపై పెట్టిన బాధ్యతను న్యాయస్థానాలు నెరవేర్చడమే తప్ప పార్లమెంటుపై తనదే పైచేయి అని నిరూపించుకోవడానికి కాదని 1952లో స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ వెర్సస్‌ వి.జి. రావు కేసులో జస్టిస్‌ పతంజలి శాస్త్రి ఇచ్చిన తీర్పును ఇక్కడ ప్రస్తావించాలి.

కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజీజు దేశ ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) జస్టిస్‌ చంద్రచూడ్‌కు రాసిన లేఖను న్యాయవ్యవస్థపై కేంద్రం ప్రత్యక్ష దాడిగా పరిగణించాలి. ఇంతవరకూ సదస్సుల్లో, మీడియా సమావేశాల్లో సుప్రీంకోర్టుపై, కొలీజియంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన మంత్రి.. అధికారికంగా లేఖ రాయటం ఇదే తొలిసారి. ఏనాడూ ఏ న్యాయశాఖ మంత్రి సిజెఐపై, న్యాయవ్యవస్థపై అగౌరవనీయమైన వ్యాఖ్యలు చేయగా మనం చూడలేదు. కానీ, తనను మించిన ప్రధానమంత్రి భారతదేశంలో ఇప్పటివరకూ పుట్టలేదనే భ్రమలో ఉన్న నరేంద్ర మోడీ హయాంలోనే కనీవినీ ఎరుగని ఈ దుస్సంప్రదాయం మొదలైంది.

మోడీ మంత్రివర్గ సీనియర్‌ సభ్యుడు కిరణ్‌ రిజిజు జాతీయ స్థాయి న్యాయమూర్తుల నియామకాలను ఖరారు చేసే వ్యవస్థను రద్దు చేసి, పాలకవర్గానికి అనుకూలురుగా వ్యవహరించగల వ్యవస్థను ఖరారు చేసే ప్రయత్నంలో ఉండటం ఇక్కడ గమనార్హమైన విషయం. అందుకే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ లోకూర్‌ ఒక తాజా ఇంటర్వ్యూలో ‘న్యాయ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ సంపూర్ణాధిపత్యాన్ని అనుమతిస్తే న్యాయవ్యవస్థ స్వేచ్ఛగా నిర్ణయాలు చేయగల స్థితిలో ఉండదు’ అన్నారు. బ్రాహ్మణీయ ఫాసిస్టు హిందూత్వ రాష్ట్ర ఏర్పాటుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే సుప్రీంకోర్టుపైన, కొలీజియం పైన జరుగుతున్న దాడిని చూడాలి. ఆర్‌ఎస్‌ఎస్‌- బిజెపి కుట్రల పట్ల ప్రజాస్వామిక వాదులు, హక్కుల సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలే రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని పరిరక్షించుకోవాలి.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

One thought on “న్యాయవ్యవస్థలో చొరబాటుకు కేంద్రం కుట్ర

  1. 75 years independence —judiciary system nothing changed -all political parties playing same musical chair game —this is our democracy ???

Leave a Reply