న్యాయం

“నేనియ్యాల బడికి పోనమ్మా, నీతోబాటు అడివికొస్తా ’’ అంటూ మారాం చేసింది చిన్న పొన్ను.

“చెప్పు తీసుకు కొడతా, ఆ మాటన్నావంటే’’, విరుచుకు పడింది పరిపూర్ణం.

“ఎందుకు పోవే బడికి? ఏం చేస్తావ్ అడివికొచ్చి?”, అంటూ తల్లి రెట్టించేసరికి భోరుమంది చిన్న పొన్ను.
“నాకస్సలు చదువుకోవాలని లేదమ్మా . ఇంట్లో ఉండి పని చేస్తా. నేను పోనేపోను, భయం పుడతావుంది’’ గట్టిగా ఏడుపు మొదలెట్టింది కూతురు.

“బిడ్డల్ని సదివించుకోడానికి నానా అగచాట్లు పడుతుండా గదే ! నా కడుపుకు తిన్నా తినకున్నా మీకు నాలుగు అచ్చరాలు చెప్పించుకోవాలని కదా నా ఆరాటమంతా ! మీ నాయనగానీ యిన్నాడంటే తోలు తీస్తాడు. నోరు మూసుకొని బడికిపో’’
చిన్న పొన్నుకు దిక్కు తోచలేదు.

“ఈ ఒక్క రోజుకి ఒదిలెయ్యమ్మా , రేపు పోతాలే.నాయనకు చెప్పకమ్మా’’ అంటూ బతిమాలసాగింది.

“ఇన్నాళ్లూ బాగానే పోయ్యావుగదే , ఇయ్యాలేమొచ్చింది నీకు ? నాలుగు ముక్కలు ఒస్తేనే బతుకు బాగుపడేది. లేదంటే కుక్క బతుకు బతకాల్సిందే. ఈ రూపాయి తీసుకోని, ఏమన్నా కొనుక్కో. బ్యాగు తీసుకో ఇంక’’ కూతురి కళ్ళు తుడుస్తూ బుజ్జగించింది పరిపూర్ణం.

“డబ్బులు నాకేం ఒద్దు. బడికి పోను’’ అంటూ మళ్లీ రాగం అందుకుంది కూతురు.

బడికి పోతూవున్న కిట్టనమ్మాళ్ వీధిలో కనబడగానే…
“ఏయ్ పిల్లా! ఇట్టా రామ్మా. మా పిల్లను కూడా బడికి పిల్చకపొమ్మా !”, అని కేకేసింది పరిపూర్ణం.

“ఆ కోవెల వీధిలో ఉండే పిలకాయలు నిన్న దీన్ని బాగా కొట్టారు అత్తమ్మా ! అందుకే బడికి రావడానికి బయపడతా ఉంది’’ చెప్పింది కిట్టనమ్మాళ్.

“అట్టానా , ఆమాట చెప్పదేం ! ఎందుకు కొట్టారు, ఏం చచేసినవని?”

“నిన్న మద్యాన్నం బళ్ళో అన్నం తినడానికి కంచం తెచ్చుకోవడం మర్చి పోయింది ఇది. ఆ జోతి లక్ష్మి అన్నం తెచ్చుకునే బాక్సు ఒకసారి ఇయ్యమని అడిగిందంతే!”

“వాళ్ల ఇయ్యమని అడిగినావంటే!”, కూతుర్ని అడిగింది పరిపూర్ణం.

“ఔను అడిగినా . ఇయ్యనని ఆమె చెప్పేసింది. నేనూ, మునియమ్మా ఒకటే కంచంలో తినేసినాం’’.

“మరి నిన్నెందుకు కొట్టడం ?” తల్లికి అర్థం కావటం లేదు .
“కాదు అత్తమ్మా. ఇది ఆ కోవెల వీధి వాళ్ళను బాక్సు అడిగింది కదా, అందుకు’’, మరో సారి చెప్పింది కిట్టనమ్మాళ్.

“వాళ్ళనెందుకు అడిగినావే , మన ఈదిలో వాళ్లను అడగక పోయావా ?”

“మన వీధి పిలకాయలు అందరూ అన్నాలు తింటూ ఉండారమ్మా. జోతి లక్ష్మి తినేసింది కదా అని, ఖాళీ బాక్సు అడిగినా’’.
అప్పటిదాకా కూతురి మీదున్న కోపం చల్లారింది . ఒక బళ్ళో చదువుకునే పిలకాయల్లో ఇచ్చి పుచ్చుకోవడం ఉండదా , ఆ మాత్రానికే కొట్టాలా !

“వాళ్ళు కొడుతుంటే అయ్యవారికి చెప్పొద్దా ?”
“చెప్పినాం అత్తమ్మా , ఆయన కూడా చిన్నినే కొట్టాడు’’.

“అదేందే?”, ఆశ్చర్యపోయింది పరిపూర్ణం.

“మీ వాళ్ల దగ్గర తీసుకోవాలి గానీ, వాళ్ళనడుగుతావా’’ అని కొట్టాడు!.

ఇట్లాంటి వాళ్ళు పిల్లలకు ఏం నేర్పుతారు , అని ఆశ్చర్యం వేసింది ఆమెకు.

“ఇయ్యాల నా కూలి పోతే పోయిందిగానీ , బడికొచ్చి మాట్లాడతా పద! పిల్లను చావగొట్టి బడికి రాకుండా చేస్తారంటనా!” , కూతురిని బరబరా ఈడ్చుకు పోయింది .
నేరుగా చిన్నపొన్ను చదివే నాలుగో తరగతి గదిలోకి నడిచింది. టీచరు లేడు. ఆఫీసు రూం లో వున్నాడని పిల్లలు చెబితే అటు వెళ్ళింది.
హెడ్ మాస్టారు, మిగతా టీచర్లు అక్కడే ఉన్నారు.

“ఏం సార్ , చిన్న పిలకాయలన్నాక ఒకరి వస్తువులు ఒకరు తీసుకోరా ! అంత మాత్రానికే మీ వీధి పిలకాయలు నా బిడ్డను కొడతారా ? అది ఇప్పుడు బడికే రానని మొండికి ఏస్తా ఉందయ్యా ! ఇది న్యాయమేనా ?”, కోపాన్ని అణుచుకుని నెమ్మదిగానే అడిగింది.

నాలుగో తరగతి టీచర్ ,హెడ్ మాస్టర్ తో ఏదో చెప్పాడు . ఆయన పరిపూర్ణం వైపు చిరాగ్గా చూస్తూ “ ఇంత చిన్న
విషయానికి నువ్వు ఇంతదాకా పరిగెత్తుకుని వచ్చావా ?’’

తప్పు చేసింది నీ కూతురు. కొట్టంలో పడుండే గాడిద రాజ భవనంలో నిద్ర పోవాలని పగటి కలలు కన్నదట, అట్లా ఉంది మీ వ్యవహారం. నీ కూతురు ఎంగిలి చేసిన గిన్నెలో వాళ్ళు మళ్లీ ఎట్లా తింటారు ? దేశంలో ఒక పద్ధతీ పాడూ లేదా ఏం ?” అంటూ మండిపడ్డాడు.

“పసి బిడ్డకు ఏం తెలుసు సార్ !” అన్నది పరిపూర్ణం భయపడతూ .

“అదేమరి, అందుకే మిమ్మల్ని ఈ బళ్ళో చేర్చుకోనే కూడదు . పోన్లే పాపమని రానిస్తే ఇట్లాంటి గొడవలు తెచ్చి మా నెత్తిన పెడతారు. ఎక్కడి వాళ్ళను అక్కడే ఉంచాలి. నీ కూతురికి బడికి రావటం ఇష్టం లేకపోతే నాలుగు పందుల్ని అప్పగించు, మేపుకొస్తుంది. మీకూ కాస్త ప్రయోజనం ఉంటుంది.” అంటూ కుర్చీ లోంచి లేచాడు.

మిగతా వాళ్ళు కూడా ఆయన వెనకాలే నడిచారు. కూతురి చెయ్యి పట్టుకుని నిస్సహాయంగా ఇంటికి నడిచింది పరిపూర్ణం .


జరిగిన విషయం విని ఆమె భర్త కోపంతో మండి పడ్డాడు.

“మన బిడ్డలు బళ్లోకి రాగూడదని చెప్పడానికి ఆయన ఎవరు, అదేమన్నా వాళ్ల అబ్బ సొత్తా ?మన బిడ్డలందరూ పోతేనే ఆయనకు జీతం వస్తుందని తెలుసా?
ఐనా అయ్యోర్లందరూ వాళ్ల మనుషులే అయితిరి !

మన మనుషులు ఒకరో ఇద్దరో చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నా ,వాళ్ళను ఎదిరించే శక్తి ఎక్కడిది ?
ఎదురు చెప్పిన వాళ్ళను ఏదో వంక పెట్టి ఏ మూలకో బదిలీ చేయిస్తుంటిరి. ఇది ఇట్టాగే సాగితే వీళ్ళ పెత్తనానికి అంతు లేకుండా పోతది “.

“అవున్లేయ్యా ! ఇన్నాళ్లూ మనోల్లందరూ చాతగాక పడుందారు. ఇప్పుడు నువ్వు పోయి అన్నీ సక్కబెడతావ్ !ముందు నీ కూతురికి నచ్చజెప్పి బడికి
పంపించు. లేకపోతే దాని బతుకు నాశనం అవుతాదని గుర్తుపెట్టుకో!”

“ఇట్టాంటి బళ్ళో చదివితే మన బిడ్డలు నిజంగానే నాశనం అవుతారే ! రేపు వాళ్ల సంగతి తేల్చుకుందాం ! మన బిడ్డల మీద ఎవుడు చెయ్యేస్తాడో చూస్తా !”

“ఇంక చాల్లే తగ్గు ! నువ్వు పోయి గొడవ చేస్తే మన పిల్లను ఫెయిల్ చేసి కూచోబెడతారు. అట్టా ఎంతమందిని చేశారో తెలుసా ?”


పెద్ద కులం పిల్లలతో మాట్లాడవద్దని ,వాళ్ళను ఏ వస్తువూ అడగవద్దని కూతురికి వివరంగా చెప్పి , ఆ మరునాడు బళ్ళోకి తీసుకు వెళ్లి వదిలారు తల్లిదండ్రులు. భయపడుతూ క్లాసులో కూచున్న ఆ పిల్లకు పాఠాలు బుర్రకు ఎక్కనే లేదు .

బడిలో జరుగుతున్న ఈ విషయాలు వాడలో జనానికంతా తెలుస్తున్నాయి .తమ పిల్లలను టీచర్లు హీనంగా ఎంత హీనంగా చూస్తున్నారో మాట్లాడుకుంటున్నారు .
“రోజూ మన బిడ్డలే బడంతా వూడ్చి ,కడుగుతారు. వాళ్ళు దర్జాగా ఒచ్చి కూర్చుంటారు. ఈ మాత్రానికి బడికి పంపటం మాత్రం ఎందుకమ్మా ?”, అని చెప్పుకుంటున్నారు ఆడవాళ్ళు .

“ఈ సంగతంతా చూసి మన కుర్రోళ్ళు మండిపోతా ఉండారు .మన బతుకులు ఎట్టాగూ ఇంతే . బిడ్డలైనా నాలుగు అక్షరాలు నేర్చుకొని మంచి బతుకులు బతకాల కదా !” , అని ఒకామె అన్న మాటలకు అందరూ ఆలోచనలో పడ్డారు.

మూడు నాలుగు వారాల్లో ఇంకో సంఘటన…

ఆ రోజు టీచర్లు అందరికీ సంక్రాంతి బోనస్ అందింది. మూడో తరగతి టీచర్ కోమలవల్లి ,తన పర్సులో పెట్టుకున్న డబ్బు సాయంత్రానికి మాయమయింది .
దళిత వాడ పిల్లలు అందరిమీదా విచారణ జరిగింది . వెల్లు కణ్ణన్ కొడుకు కట్టారి ,ఆ డబ్బు దొంగిలించాడని నిర్ణయించారు .ఆ పిల్లవాడిని సాయంత్రం ఇంటికి పంపకుండా బడిలోనే ఒక గదిలో పడేశారు .

వాడి తల్లికి ఇది తెలిసి ఏడ్చుకుంటూ పరిగెత్తుకు వచ్చింది.వెల్లు కణ్ణన్ కూడా దళిత వాడ పెద్దనూ , మరికొందరు మనుషులను తీసుకుని వచ్చాడు .
పది మంది గ్రామ పెద్దలను హెడ్మాస్టర్ పిలిపించాడు .

పిల్లవాడు బెదిరిపోయి నోట మాట రాని స్థితిలో పడ్డాడు .

“ఇంత చిన్న పిల్లవాడు మూడు వేల రూపాయలు కాజేశాడంటే చిన్న సంగతి కాదు . తప్పు ఒప్పుకొని డబ్బు కట్టకపోతే పోలీసులను పిలవాల్సి ఉంటుంది’’,అంటూ విరుచుకు పడ్డాడు హెడ్మాస్టర్ .

“మూడో తరగతి గదిలో డబ్బులు పోయినాయంటే క్లాసులో అందరినీ విచారించాల కదయ్యా ! మా బిడ్డల మీదనే దొంగతనం పెట్టడం ఏం న్యాయం ?” అన్నాడు దళిత వాడ పెద్దాయన కుట్టియన్ .

“ఏం వాగుతున్నావు రా!మా పిల్లలను విచారించమని చెప్పేంత పొగరు నెత్తికెక్కిందా!”, గర్జించాడు గ్రామ పెద్ద.

“ఆయన మాటలో తప్పేం వుందయ్యా ? అందరినీ అడగకుండా నా కొడుకు మీద దొంగతనం మోపి గదిలో పడేస్తారా ? చిన్న కులం వాళ్లంటే అంత లోకువా ?” అని నిలదీశాడు వెల్లు కణ్ణన్ .

’’ఏం రా ! నువ్వు డబ్బులు తీసావా?”, అని కొడుకును అడిగాడు .

“లేదు నాయనా ,నేను తీసుకోలా ! ఒంటేలు గంటలో బయిటికి పోయినప్పుడు అరవింద్ దగ్గర శానా డబ్బులు చూసినా. పెద్ద బిస్కెట్ పాకెట్ కూడా కొన్నాడు “.

“ఆ అరవింద్ ఎవురో పిలిచి అడగండయ్యా!”, వెల్లు కన్నన్ మాట పూర్తి కాకముందే గ్రామ పెద్ద అతని మీద పడి, ‘‘నా కొడుకు దొంగతనం చేసాడంటావా, ఎన్ని గుండెలు రా , నీకు ?”, అంటూ ఎడా పెడా బాదుతున్నాడు.

కట్టారి పరిగెత్తుకు వెళ్లి , తండ్రిని కావిలించుకొని గట్టిగా ఏడుస్తున్నాడు. ఇంతలో ఒక టీచర్ హెడ్మాస్టర్ ను పక్కకు పిలిచి ఏదో చెప్పాడు .

వెంటనే హెడ్మాస్టర్ గ్రామ పెద్దను ఆపుతూ “మీరు ఆగండి ఆ వీధి కుక్కలను కొట్టి మీరెందుకు మైల పడతారు?
వాళ్ళు మారతారా , చస్తారా ?పైగా ఈ రోజుల్లో వాళ్ల మీద చెయ్యేస్తే లేనిపోని గొడవలు మనకు’’, అని సర్దిచెప్పాడు .

“వాడేం కూసాడో వినలేదా మీరు ?”

“మీరు అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీ కుర్రాడ్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపొండి ముందు ! ఆ టీచరు గారి డబ్బులు దొరికాయట. సమస్య తీరిపోయింది “, అన్నాడు హెడ్మాస్టర్ అంతదాకా అసలేమీ జరగలేదన్నంత తేలిగ్గా.

తన అసహ్యాన్ని , నిస్సహాయమయిన ఆగ్రహాన్ని వెలిగక్కుతూ నేలపై ఖాండ్రించి వుమ్మాడు వెలు కన్నన్.

కొడుకును భుజాలపై ఎత్తుకుని ఇంటివైపు మళ్ళాడు. దళిత వాడ జనమంతా మౌనంగా అనుసరించారు.

తమిళ మూలం: బామ
తెలుగు అనువాదం : కాత్యాయని

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.

Leave a Reply