నైవేద్యం

నిద్ర రావడం లేదు. కళ్లు మూసుకొని, మూసుకొని నెప్పెడుతున్నాయి. కానీ నిద్ర పట్టడం లేదు. పక్కలో తడుముకోవడానికి పాప లేదు. అప్పుడే ఐదుగంటలైంది. పాప తనకి దూరమై. ఏమౌతుంది పాపకి? అమ్మమ్మా నిద్ర పోలేదని తెలుస్తూనేవుంది. ముందుగదిలో మాటిమాటికి లైట్‌ వెలుగుతుంది. మళ్లీ ఆరుతుంది. అమ్మమ్మే భయానికి అలా చేస్తుందేమో. కొడుకు గది తలుపులు కొట్టే ధైర్యం ఆవిడకీ లేదు. రాత్రి తొమ్మిది గంటలకి పాపని తీసుకొని మావయ్య తన గదిలోకి వెళ్లిపోయాడు. చిన్నపిల్ల. సంవత్సరం నిండని పిల్ల. ఎలా తన దగ్గర ఉంచేసుకున్నాడో? అసలెందుకు గదిలోకి తీసుకొని వెళ్లిపోయాడో? ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు.

నిన్న రాత్రి ఏమయ్యింది? వివరంగా మళ్లీ గుర్తుచేసుకోవడానికి ప్రయత్నించింది. మావయ్య భోజనానికి వచ్చాడు. అమ్మమ్మ అన్నం పెట్టింది. ఎప్పటిలాగే మావయ్య ఎప్పుడూ కూర్చుని తినేచోట, ఆ కుర్చీలోనే కూర్చున్నాడు. ఎదురుగా బల్లమీద అన్నం వడ్డించింది అమ్మమ్మ. నేను పక్కగదిలో ఉన్నాను. మావయ్య అన్నం తినే చోట కొంచెం దూరంలో నేలమీద బాబు పడివున్నాడు. నా చేతుల్లోంచి పాప ఆడుతూ క్రిందకి దూకింది. దానికి పాకడం వచ్చిన దగ్గర్నుంచీ ఒంటిమీద నిలవడం లేదు. నేలంతా పాకుతూ ఏవేవో ఊసులు చెప్తూ కేరింతలు కొడుతూ ఉంటాది. బల్లలూ, కుర్చీలూ, మంచాలూ పట్టుకొని నిలబడతాది. విజయం సాధించి నవ్వుతాది. అస్సలు పట్టుకోలేకపోతున్నాం కానీ మావయ్య రాత్రి భోజనం చేసే సమయంలో మాత్రం పాపను పట్టుకొని నేను గదిలోనే వుంటాను. మావయ్య పాపని చూడకపోతే మంచిదని అలా గదిలోపలే ఉంచేస్తాను. పాపకి పాకడం వచ్చాక అల్లరి ఎక్కువైపోయింది. నా చేతుల్లో నిలవకుండా ఇల్లంతా తిరగడం దానికి బాగా అలవాటైపోయింది. అలాగే ఈమధ్య చాలాసార్లు మావయ్యకి అది ఎదురైపోయింది. అతను అన్నం తినేటప్పుడే ముందుగదిలో వుంటాడు. అదే కుర్చీలో కూర్చొని ఎదుట బల్లమీద ఏది పెడితే అది తినేసి తన గదిలోకి వెళ్లి తలుపు వేసేసుకుంటాడు. మాకు పెళ్ళయిన ఈ ఆరు సంవత్సరాలుగా అతనెప్పుడూ రోజులో ఏ సమయంలోనూ నా కంటపడడు. ఉదయం వేళ అతని పన్లన్నీ గదిలోనే చేసుకోని బయటకు వస్తాడు. అమ్మమ్మ కారేజీ బ్యాగ్‌ చేతికిస్తాది. తీసుకొని వెళ్లిపోతాడు. వస్తూనే గదిలోకి వెళ్లిపోతాడు. ముందుగదిలో నేలమీద కూర్చోబెట్టో, పడుకోబెట్టో ఉండే బాబు వైపు కూడా చూడడు. తిన్నగా తన గదిలోకి వెళ్లిపోతాడు. తొమ్మిది గంటలకి వచ్చి అన్నం తినేసి మళ్లీ గదిలోకి వెళ్లిపోతాడు. అమ్మమ్మతో కూడా మాట్లాడడు. అసలు కన్నెత్తైనా చూడడు. జీతం అందుకున్న రోజున కవరులో కొంత డబ్బు టి.వి. దగ్గర పెట్టేస్తాడు. అమ్మమ్మ తీస్తాది. ఇల్లు గడుపుతాది. నేనన్న ఒక మనిషిని ఇంట్లో ఉన్నానన్న ధ్యాసే అతనికి ఉండదు.

రాత్రి అలాగే వచ్చి అన్నం తింటుండగా పాప తన చేతుల్లోంచి దూకి వేగంగా పాక్కుంటూ హాల్లోకి వెళ్లిపోయింది. అన్నం తింటున్న మావయ్య ఎదురుగా వెళ్లి ఏవేదో వూసులు చెప్పింది. అతను తలొంచుకొని తింటూ ఆ పిల్లవైపు చూడకుండా ఉండే ప్రతయ్నం చేశాడు. అమ్మమ్మ పాపని ఎత్తుకోబోతే అది ఉండకుండా మారాం చేసి మళ్లీ కిందకి దిగిపోయింది. పాక్కుంటూ వెళ్లి మామయ్య కాళ్లు పట్టుకోని నిలబడిపోయి, అతని కాళ్ల మీద కొడుతూ నవ్వుతూ, కేరింతలు కొడ్తూ కళ్లల్లోకి చూస్తుండిపోయింది అంతే. మావయ్య దాని మొహంలోకి చూశాడు. ఆశ్చర్యంగా అలా కొన్ని క్షణాలు చూశాడు. అన్నం తినడం మరచిపోయి చూశాడు. దాని నుదుటి మీద చిందరవందరగా పడిన ఉంగరాల జుట్టును ఎడంచేత్తో సరిచేసి ఎంగిలిచేతిని కడుక్కోకుండానే పాపని ఎత్తేసుకున్నాడు. గట్టిగా హత్తుకొని, అంతే గదిలోకి తీసుకొనివెళ్లిపోయాడు. అమ్మమ్మ ఏంచేయలేక అలా నిలబడిపోయింది. తలుపు ఎక్కడ వేసేసుకుంటాడోనన్న భయంతో. మరి ఎలాతట్టిందో గబగబా పాలు కలిపి సీపాలో పోసి గది తలుపు చిన్నగా తెరచి ఉండడంతో ఆ లోపలికి పెట్టేసి ఇటు వచ్చేసింది. నాకేమీ అర్థం కాలేదు. అమ్మమ్మ మొహంలోకి చూస్తూ కంగారుగా నిలబడ్డాను. అమ్మమ్మ కళ్లల్లో నీళ్లతో నా మొహంలోకి చూసి, ఏడుపు ఆపుకుంటూ బయటకు వెళ్లిపోయింది. ఆ తరువాత మావయ్య తలుపు ఎప్పట్లానే వేసేసుకున్నాడు. ఏంచేయాలో తెలీక అమ్మమ్మా నేనూ ఇంట్లో అటూ ఇటూ తిరిగాం. ఇద్దరం అన్నం తినలేకపోయాం. ఒకరి మొహంలో ఒకరం చూసుకోలేకపోయాం. నిద్రరాదు. ఆలోచనలు తెగవు. జరిగిన వింత నెలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. మావయ్య అంటే ఎవరో కాదు, నాకు తాళిగట్టిన భర్తే. అమ్మమ్మే నా అత్తగారు. ఆ నేలమీద పడుకొని నిద్రపోతున్నది, కాళ్లూ చేతులూ, ఒళ్లూ అన్నీ అవుకే అయి, మానసిక ఆరోగ్యం కూడా లేని, మాట్లాడలేని పిల్లాడు నాకూ మావయ్యకి పుట్టిన పిల్లాడే. వాడికప్పుడే ఐదేళ్లు. కానీ సంవత్సరం పిల్లాడికుండే తెలివి కూడా లేదు. శారీరకంగా, మానసికంగా కూడా వికలాంగుడు మా అబ్బాయి. మా బతుకుల్లోని వికలత్వమంతా వాడు మోస్తున్నాడు.

పాప, ఆ పాప ఎవరు? ఎవరంటే నా కూతురు. మావయ్య తండ్రికాడు, అమ్మమ్మ దాని నాయనమ్మ కాదు ఎలా? ఎలా? జరిగిందిదంతా? ఇలాక్కూడా జరుగుతాయా? జీవితాల్లో ఇన్ని విచిత్రాలుంటాయా? అంటే ఉంటాయి, నా బతుకులో జరిగాయి. మా బతుకుల్లో పొడచూపాయి. అందుకే నేన్నమ్ముతున్నాను. ఇలాంటివి జరుగుతాయని.
……..
నాకు అమ్మానాన్న లేరు. లేకుండా నేనెలా పుడతానూ? పుట్టేవరకూ ఉన్నారు. పుట్టాకే లేరు. అమ్మ అనారోగ్యంతో, నాన్న తాగితాగి చచ్చిపోయారు. అప్పటికి నాకు ఊహ తెలీదు. అమ్మమ్మ దగ్గరకి పంపించేసారు. అప్పటికి మావయ్య హైస్కూల్‌కి వెళ్తున్నాడు. పేంటులేసుకొనే వయసు. అమ్మమ్మే నన్ను పెంచింది. ఔనా? కాదు మావయ్యే నన్ను పెంచాడనిపిస్తుంది. ఎప్పుడూ ఎత్తుకొని తిప్పేవాడు. అమ్మమ్మ తినిపిస్తుంటే కాదని తనే ముద్దలు కలిపి చక్కగా తినిపించేవాడు. ముక్కు తుడచి, మొహం మీద జుట్టు వెనక్కితీసి సవరించేవాడు. వెనకెనకే తిప్పుకొనేవాడు. కొట్టుకెళ్లి ఏదైనా తెమ్మని అమ్మమ్మ చెప్పడం ఆలస్యం తనని మోసుకుంటూ తీసుకొని వెళ్లేవాడు. అమ్మమ్మ వద్దని చెప్పినా వినేవాడు కాదు. స్నేహితుల్తో ఆటలకి వెళ్లేవాడు కాదు. నన్నాడించడమే తనకి ఆట. తనకు ఎవరేమిచ్చినా నాకు తెచ్చి తినిపించేవాడు. బడికి వెళ్లే సమయం తప్ప మిగతా రోజంతా తనతోనే గడిపేవాడు. నన్ను చెయ్యి పట్టుకొని నా బ్యాగ్‌ కూడా తనే మోసుకుంటూ బడి దగ్గర దింపేవాడు. ఉసిరికాయలు, జీళ్లూ, బఠానీలు కొనుక్కొచ్చి ఇచ్చేవాడు.

‘‘ఎప్పుడు దాన్తోనేట్రా, ఎల్లి మొగ్గుంటల్తో ఆడుకోలేవా? ఆడపిల్లతోనేట్రా ఎప్పుడుసూసినా ఆట్లు?’’ అని అమ్మమ్మ తిట్టేది. లెక్కచేసేవాడు కాదు. అన్నింటికన్నా నాకు తల్లోకి పూలకోసం ఇల్లిల్లు తిరగడం మావయ్యకెంతిష్టమో!
‘‘ఏట్రా మీ మేనగోడలికేనేటి పూలు? మాకక్కర్లేదా? మా ఇల్లల్ల పువ్వులన్నీ నువ్వట్టుకెలిపోతే మావేటెట్టుకోవాల్రా తల్లో!’’ అని చుట్టుపక్కల ఆడోళ్లు మాయ్యని వెటకారాలు ఆడేవారు. కొందరైతే తిట్టేవారుకూడాను.

‘‘ఏవిరా? ఏటా దయర్నం? మా ఇంట్లోకెలిపోచ్చి పువ్వులు కోసేడమేటి? ఏట్రా నీ మోతుబరితనం?’’ అని మందలించేవారు. మావయ్య ఎవ్వరిమాటా ఖాతరు చేసేవాడు కాదు. అందుకు తగ్గట్లే నేను పెద్ద పిల్లనయ్యినప్పటికి నా జుట్టు రింగులు రింగులు తిరిగి మోకాళ్లవరకూ వచ్చేసేది.
‘పిల్ల పొడుగు పెరగడం నేదు కానీ తలేటి ఇలగా పెరిగిపోతోతంది? బుర్ర రుద్ది సిక్కులు తియ్యనేక సత్తన్నాను’ అని అమ్మమ్మ గోల.
ఒకనాడు పక్కింటి కనకం అత్తా, అమ్మమ్మా కూడి మాట్లాడుకోని నా జుట్టు సగం వరకూ కత్తెర్తో కత్తిరించీసారు. నాకు వివరం తెలీక పళ్లికిలించాను. సాయంత్రం కాలేజీ నుంచి మామయ్య ఇంటికొచ్చి నా జుట్టు చూసి అమ్మమ్మని గట్టిగా అడిగాడు. అమ్మమ్మ నసుగుతూ ‘‘దాని తలకి సాకిరీ సెయ్యలేప్పోతన్నాన్రా అందుకే కత్తిరించీసినాం’’ అని నసుగుతూ చెప్పింది.
‘‘బుద్దిలేకపోతే సరి, అలగ చెయ్యడానికి నీకు మనసెలా ఒప్పింది?’’ అని అమ్మమ్మను తిడుతూనే వున్నాడు. నేను నవ్వుతుంటే నన్నూ కసిరాడు.
‘‘నీకు బుద్ధి లేదా? కట్‌ చేస్తుంటే నువ్వేటిచేస్తున్నావ్‌? ఇలగే ఇకిలించుకోన్నిలబడ్డావా? అని కేకలేసాడు. ఈ గొడవ వీధందరికీ తెలిసి అందరూ నవ్వుకున్నారు.
‘‘ఆడపిల్ల జుట్టు మీద ఆడి పట్టుదలేటి? అని విడ్డూరంగా మాట్లాడుకున్నారు.
‘‘ఆడిక్కాపోతే ఇంకెవరికర్రా? ఆడి పెల్లం జుట్టు ఆడికే కావాల?’’ అని కూడా అనుకున్నారు.
నేను హైస్కూల్‌లో చదివేటప్పుడు మావయ్య డిగ్రీ అయిపోయి ఉద్యోగాలెక్కడా దొరక్క, ఎందుకైనా ఉంటాదని ఐటిఐ చేస్తుండేవాడు. నా చదువు గురించి బాగాపట్టించుకునేవాడు. ‘‘నువ్వు చాలా తెలివైనదానివి సుమా, కొంచెం దృష్టి పెడితే ఇంకా బాగా మార్కులొస్తాయి. బుర్రపెడితే పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేసుకోవచ్చును’’ అని బోధించేవాడు. నేను బాగానే చదివేదాన్ని. నా మార్కులు చూసి మెచ్చుకొని ఇంకా బాగా చదవాలనేవాడు. టెన్త్‌ మంచి మార్కులతో పాస్‌ అయ్యాను. అమ్మమ్మతో పోట్లాడి మావయ్య నన్ను ఇంటర్‌ కాలేజీలో జాయిన్‌ చేశాడు. ఐ.టి.ఐ అయిపోగానే ఏదో కంపెనీలో అప్రెంటిస్‌ చేసేవాడు. ఉద్యోగం కోసం బాగా ప్రయత్నం చేసేవాడు. చివరకు తననుకున్నట్లుగా కాకపోయినా కాస్త మంచి కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది. నేను ఇంటర్‌ ఫస్ట్‌క్లాస్‌లో పాస్‌ అయ్యాను. మావయ్య కాలేజీ కోసం అప్లికేషన్‌ తెచ్చాడు. ఎక్కడ జాయిన్‌ అయితే బాగుంటాదో నాతో మాట్లాడుతూ వుండేవాడు.

ఆ రోజు మధ్యాన్నం వీధిలోకి బట్టల మూట వచ్చింది. మా ఇంట్లోనే ఎప్పుడూ మూట దింపుతాడాయిన. మా ముందుగది పెద్దదవడం వలన అందరూ అక్కడికే చేరేవారు. ఆడోళ్లంతా చీరెలు చూసుకుంటూ బేరాలాడుతూండగా మావయ్య కంపెనీ నుంచి భోజనానికి వచ్చాడు. తనకి దారిచ్చి మళ్లీ గుమిగూడారందరు.

అమ్మమ్మ మావయ్యకి బల్లమీద అన్నం పెట్టింది. మావయ్య కుర్చీలో కూర్చొని తింటూ వీళ్ల బేరాలు చూస్తున్నాడు.
‘‘ఏరా ఇస్వం, మీయావిడికి నువ్వూ ఒక సీర కొనచ్చొకదా? ఇంకా మీ అమ్మే కొనాలా? ఇంక అది సీరలు కట్టే వొయిసే కదా?’’ అని ఎదురింటి పెద్దమ్మ హాస్యమాడింది. మావయ్య ఏమీ అర్థంకానట్టు చూశాడు.
“వచ్చీఏడు పెల్లటకదా, అప్పట్నించీ ఆ బాబు కొంటాడు. మేనగోల్లంటే పిచ్చి కదా, ఈ మూటంతా దానికే కొనీసినా కొనేత్తాడు, ఆడికి మనం సెప్పాలేటీ?” ఎవరో అంటుండగా మావయ్య చివాల్న కంచం దగ్గర్నుంచి లేచాడు. వంటింట్లోకెళ్ళి చెయ్యికడిగేసుకొని విసురుగా బయటకు వెళ్ళిపోయాడు.
అదేటే అలగ ఎల్లిపోయాడు? ఆసికవాడితే అలగమొకం మాడ్సీసాడేటి? మనవేటి తప్పన్నాం? ఉన్న మాటేకదా అన్నాం, అని ఆడోళ్ళు చాలాసేపు గింజుకున్నారు. నాకేమీ అనిపించలేదు. ఎందుకంటే వీధిలోవాళ్ళు నన్నెప్పుడూ మావయ్య పెళ్ళంగానే మాట్లాడతారు. కాకపోతే కొంచెం పెద్దయ్యాక మావయ్య నలుగురితోనూ కలిసేవాడు కాదు. మగపిల్లత్తోటి ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఎప్పుడూ కబుర్లన్నీ నాతోనే. ఇద్దరం ఇంట్లో ఉంటే కారంస్ ఆడేవాళ్లం. వారపత్రికలు చదివేవాళ్లం. ఎప్పుడన్నా సినిమాలకీ వెళ్లివచ్చి, ఆ సిన్మాలగురించే నాలుగైదు రోజులు మాట్లాడుకునేవాళ్లం. అప్రంటీస్‌ చేసినప్పుడే మావయ్య బైక్‌ కొన్నాడు. ఉద్యోగానికి తప్ప ఎక్కడికెళ్ళాలన్నా ఇద్దరం కలిసే వెళ్లేవారం. నా రుచులూ, అభిరుచులూ కనిపెట్టి ఆ ఏర్పాట్లు చెయ్యడమే తనకిష్టం. కాలేజీలో జరిగే విషయాలు నేను చెప్తుంటే తను నవ్వేవాడు. తన కంపెనీ విషయాలు తను చెప్తే నేను నవ్వేదాన్ని. ఎప్పుడూ నవ్వుకుంటూ ఉండేవాళ్లం.
‘‘ఎందుకలగ నవ్వి సచ్చిపోతన్నారు?’’ అని అమ్మమ్మ మురిపెంగా తిట్టేది.
అంతేకానీ వీధిలోవాళ్లతో మాట్లాడడం మావయ్య ఎన్నడూ ఎరగడు. అందరితో చాలా ముభావంగా ఉండేవాడు. అందువల్ల వారు అనే ఇలాంటి మాటలు తన కస్సలు తెలీవు.

ఆ రోజు రాత్రి ముభావంగానే అన్నం తింటున్న మావయ్యని ‘‘ఎందుకురా ఇందాలకలగ అలిగి ఎలిపోయావు? ఆలన్నదాంట్లో తప్పేటుంది? కుసుమని నువ్వు పెళ్లాడవా? నువ్వాడచ్చుగానీ ఆలు ఆసికవాడితే నీకు తప్పొచ్చిందా?” అని అమ్మమ్మ కదిపింది.

‘‘అమ్మా’’ అని పెద్ద రంకె వేశాడు మామయ్య. నేనూ అమ్మమ్మా జడుసుకున్నాం. అమ్మమ్మైతే జాకెట్లో ఉమ్ముకుంది.
‘‘ఇంకోసారి ఇలాంటి చెత్త మాట్లాడావంటే నేనేంచేస్తానో నాకే తెలీదు’ అని మళ్లీ గట్టిగా అరిచాడు మావయ్య.
మావయ్యనలా ఎప్పుడూ చూడలేదు. అమ్మమ్మా జడిసిపోయినట్లాగిపోయింది. తేరుకొని ‘‘ఏంటి విస్సూ ఆ కోపం, కుసుమని పెళ్లి చేసుకోమనేకదా నీనన్నాను. తప్పేటన్నానూ?’’ అనబోతుండగానే మావయ్య కోపంతో కళ్ళర్ర చేసి, చేత్తో ఆగమన్నట్లు సైగచేసి ‘‘ఆ మాటే ఇంకోసారనద్దంటున్నాను. సుమని నేను పెళ్లి చేసుకోవడమేంటి? చిన్నప్పటినుంచీ ఈ చేతుల్లో పెరిగిందితను. ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నావమ్మా’’ అంటుండగా.
‘‘అదేట్రా అదినీ మేనగోళ్లు. దాన్ని సేసుకుంటే తప్పేటి? సిన్నప్పట్నించీ దాన్ని నీకన కట్టీసేం కదా?’’ అంది అమ్మమ్మ.
‘‘ఏంటే అన కట్టీసారా? ఎవరమ్మా అలా అనుకున్నదీ’’ అన్నాడు.

‘‘అయ్యో! దానమ్మా, బాబూ సచ్చిపోయాక దీన్ని మనకాడకి తేడానికి నీనెల్తే దాని నానమ్మా తాతా ఒప్పలేదురా. నా కొడుకు పిల్ల బవిసెత్తు ఏటవుతాదో మీకాడొగ్గిత్తే అని పంతం పట్టుకొని కూతుంతే నీను ‘పిల్లకి బయమేవీ లేదు. నా కొడుక్కే సేసుకుంతాను. పెంచి పెద్దసేసి నా కోడల్నే సేసుకుంతా’మని పెద్దల్లో మాటిత్తే అప్పుడు దీన్ని మనకొగ్గినారు. నువ్వు సిన్నోడివి అప్పుడు నీకియ్యన్నీ తెలవు’’ అందమ్మమ్మ.

‘‘అదేమన్నా శిలాశాసనమా? పిచ్చివాగుళ్లు వాళ్లవి. అదే గొప్పనుకున్నారు కాబోలు. ఇవ్వన్నీ నా కనవసరం అమ్మా, మీరేమనుకున్నాసరే నేనలాంటి పనులకి ఒప్పుకోను. సుమని నేనెప్పుడూ అలా ఊహించుకోలేదు. తను నా ఇంటి మనిషే కానీ నా భార్య ఎప్పటికీ కాదు. తను చదువుకొని, ఏదోఒకలా తన కాళ్ల మీద నిలబడాలి. అప్పుడు తనకి తగిన వాణ్ణి చూసి పెళ్లి చేద్దాం’’ అన్నాడు నిశ్చయంగా.

అప్పటివరకు భయంభయంగా మాట్లాడిన అమ్మమ్మ ఇంక సంకోచాలన్నీ ఒదిలేసి ‘‘ఒలే ఆడిమాట్లు ఇన్నావా? నిన్నాడు సేసుకోడటే, ఇలగవుతాదనుకుంటే నిన్నాల కాడే ఒగ్గేద్దునమ్మ… ఆలకి తెలిత్తే ఆలు నన్నూరుకుంటారా’’ అని ఏడుపు మొదలెట్టింది.
‘‘ఆళ్లవరూ, నా పెళ్లిగురించి నిర్ణయించడానికి? సుమ మన దగ్గరికొచ్చాక వాళ్లొక్కసారే ఇక్కడికొచ్చారు. వాళ్లకేం బాధ్యత ఉందని మనల్నడుగుతారు. అయినా నేను పెళ్లిచేసుకోనుదాన్ని అంటున్నాను గానీ మనం తన బాధ్యత ఒదిలేద్దాం అనడం లేదు. రాద్ధాంతం చెయ్యకమ్మ నాకు చాలా అసహ్యంగా ఉందిదంతా?” అన్నాడు మావయ్య.

నా మొహంకూడా చూడకుండా అప్పటివరకు మాట్లాడిన మావయ్య ఈసారి నా కళ్ళల్లోనికి చూసి ‘‘సుమా ఇలాంటి ఏడుపులకీ వాదనలకీ నేను లొంగను నువ్వూ లొంగకు. మన మధ్య స్నేహాన్ని మనమే నిలుపుకోవాలి, అసహ్యకరమైన బంధంలోకి దిగొద్దు, అయినా ఈవిడకి ఏంతెలుసు, అన్నా చెల్లెల్లలాంటి వాళ్ళకి పెళ్ళిల్లు చేసేసి అదేదో గొప్ప అనుకుంటారీళ్ళు. వాళ్ళ మనసుల్లో ఏముందో వీళ్ళకు అనవసరం. ఇంత దగ్గర సంబంధం చేసుకుంటే ఎలాంటి పిల్లలు పుడతారో ఆవిడకి అర్ధమయ్యేలాగ చెప్పు. చాలా చిరాగ్గా ఉందిదంతా నాకు. నువ్వే అమ్మకి అర్థమయ్యేలా చెప్పు. ఇంకొసారి ఇలాంటిమాటలు ఈ ఇంట్లో రాకూడదంతే’’ అని గదిలోకి వెళ్ళి తలుపేసేసుకున్నాడు.

అమ్మమ్మ ఏడుస్తూనే ఉంది. ఇంట్లో వాతావరణం ఆ రోజుతో మారిపోయింది. మావయ్య నాతోకూడా సరిగా మాట్లాడటంలేదు. అమ్మమ్మతో కూడా పూర్తిగా మాట్లాడటం మానేసాడు. నేనే అన్నం పెడుతున్నాను. ముగ్గురం నిశ్శబ్ధం అయిపోయాం. నా కాలేజి విషయం కూడా మావయ్య మాట్లాడటంలేదు. నాకంతా అయోమయంగా ఉంది. మావయ్య మాటల్లో చాలా నిజం ఉంది. ఎంత చక్కగ మాట్లాడాడో అనిపిస్తుంది. కాని పెళ్ళి వేరే వాళ్ళతో అయితే జీవితం ఎలా ఉంటుందో అనిపిస్తుంది. మావయ్య అన్నమాట ఎంతబావుంది ‘‘మనిద్దరం స్నేహితులం, అన్నాచెల్లెళ్లాంటోల్లం” అన్నాడు కదా. చాలా బాగుందామాట. కాని ఇంట్లో పరిస్థితి భయంవేసేలా తయారైంది. ఇదంతా ఎటు దారి తీస్తుందో’’ అని అనుకుంటుండగా ఒకరోజు మళ్ళీ అమ్మమ్మ కదిపింది.

‘‘బాబూ ఇస్సూ దాన్ని పెల్లి చేసుకుంటావా? దాని బతుకు ఎలా పోతే నాకెందుకంటావా? ఏదో ఒకటి సెప్పీ’’ అంటే… మావయ్య అక్కడ్నించి లేచి గదిలోకి వెళ్తూ వెనక్కి తిరిగి ‘‘చచ్చిపోతాను కాని అలాంటి పని నేను చెయ్యను” అని ఖరాఖండీగా చెప్పేశాడు.
అమ్మమ్మ రాగం అందుకుంది. పరువు తీసేస్తున్నాడని తిట్టింది. మా నానమ్మ వాళ్ళకి తెలిస్తే పీకలు తెగిపోతాయంది. బంధువుల్లో తలెత్తుకోలేనంది. ఈ ఇంటికి ఇంకో కోడలొస్తే తనకి గెంజి పొయ్యదంది. సచ్చీముందు ముస్టడుక్కొని సావాల్సివస్తాదంది. నాకు వేరే సంబంధాలే రావంది. గుండెలమీద కుంపట్లా నేనింట్లో ఉంటే మావయ్యకి పెళ్ళవడం కష్టమంది. అయినా ఇవన్నీ చూడ్డానికి తన బతికుండడం దండగంది. చివరకి చస్తానని మావయ్యని బెదిరించింది. మావయ్య బెదరలేదు. మాట్టాడడం ఇంకా పూర్తిగా మానేసాడు. ఇంకేముంది ఒకరోజు రాత్రి మేము పడుకొని ఉండగా అమమ్మ గన్నేరుపప్పు నూరుకొని మజ్జిగలో కలిపి తాగేసింది. పెద్దగా వాంతులు చేసుకుంటుంటే లేచి ఇద్దరం చూశాం. ఏమయ్యింది అని అడిగితే చక్కగా తన చేసినపని చెప్పేసింది. అమ్మమ్మని ఆసుపత్రికి తీసుకెల్లాం. అతి కష్టంమీద డాక్టర్లు బతికించారు. ఈ విషయం తెలిసి అమ్మమ్మ దగ్గరి బంధువులు వచ్చారు చూడ్డానికి. విషయం తెలుసుకున్నారు. నోళ్ళు తెరిచారు. ‘‘అదేటి వరసైన మేనగోడల్ని వద్దంటన్నాడా? దానికేవీ అందాలబొమ్మ. దానెనకనే తిరుగుతాడని సెప్పుకుంటారు. దాన్నొద్దనడం ఏంటీ? ఈ మజ్జిలో ఎవర్నైనా మరుగడ్డాడా! పేవలు, దోమలు అనిగాని తిరుగు తున్నాడా?’’ అని మొదలెట్టారు వాళ్ళు. నాకు వినడానికే కష్టమనిపించింది. అమ్మమ్మ బుర్రలో మాత్రం ఈ పురుగు దూరిపోయింది. అసుపత్రి నుంచి వచ్చి కొద్దిరోజులు నీరసంతో పడుకొనే ఉందమ్మమ్మ. మళ్ళీ డాక్టర్‌కి చూపించాడు. మావయ్య అమ్మమ్మకి బి.పీ., షుగర్‌ ఉన్నాయని తేల్చారు. డాక్టర్లు చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. పరిస్థితులు మరింతగా దిగజారినట్టనిపించింది. ఇక అమ్మమ్మ రోజూ మందులేసుకోనని, సస్తానని గొడవ మొదలు పెట్టింది. మీ పెళ్ళి చూసి చచ్చిపోతానని ఒకసారి, చూడకుండానే చచ్చిపోతానని మరోసారి ఏడ్చేది. అసలీపెళ్ళి కాకపోతే ‘‘బలివిని సస్తానని’’ అస్తమానం ఏడుపూ, గొడవా మొదలుపెట్టింది. ఒకసారి చేసిన అఘాయిత్యం గుర్తొచ్చి నాకైతే చెమటలు పట్టేసేవి. మావయ్య బింకం సడలిపోయే రోజులొచ్చాయి. మందులు వేసుకోనని అమ్మమ్మ మంకుపట్టు పట్టేసింది. ఏంచెయ్యాలో తెలియడం లేదు. రోజు ఇదే గొడవ.

ఇంక ఏక్షణంలో ఇంట్లో ఏం జరుగుతుందో అన్నట్లుగా తయారయ్యింది పరిస్థితి. అమ్మమ్మకి నేనుకాపలా అయితే మావయ్యకి అమ్మమ్మ కంచెలు కట్టడం, ఇలా గడిచాయి రోజులు. అమ్మమ్మ ఆరోగ్యం అస్సలు బాగులేదని తెలుస్తూనే ఉంది. ఇక మావయ్య ఓడిపోయాడు. మా పెళ్ళి జరిగిపోయింది. మళ్ళీ మావయ్య నా మొహం చూడలేదు. ఇంట్లో శవం లేచినట్లే ఉండేది. అమ్మమ్మ బలవంతంగా పెళ్ళయితే చేయించింది గాని మావయ్యతో కాపురం చేయించలేకపోయింది. మావయ్య చాలా కఠినంగా మారిపోయాడు. మాతో మాటలు కాదు చూపులు కలపడం కూడా మానేశాడు. రాత్రి భోజనం అదే కుర్చీలో కూర్చుని తినేసి గదిలోకి వెళ్ళి తలుపు దగ్గరకి చేరేసి పడుకుండిపోయేవాడు. ఎన్నోరోజులు ఇలా సాగలేదు. నాకైతే పుస్తెలు నా మెళ్ళోకి రావడానికి జరిగిన తంతూ, దానిముందు జరిగిన రాద్దాంతం వలన మనసు గడ్డకట్టినట్లైపోయింది. నాకూ ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. అమ్మమ్మ పెళ్ళి బడలిక తీరే వరకూ మమ్మల్ని కదపలేదు. ఇక అక్కడ్నించి మళ్ళీ మొదలెట్టింది. ఊరూ, వాడా మావయ్య నాతో కాపురం చెయ్యకపోవడం గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అన్ని మాటలు చివరికి ‘‘మావయ్యకి ఎవరితోనన్నా బయట సంబంధం ఉందేమో? ’’ అన్నదగ్గరే ఆగేవి. అతను మా పెళ్ళి వద్దనడానికి కారణం ఎంత వివరంగా చెప్పాడో నాకు బాగా అర్థమయింది కాబట్టి ఎవరన్నా ఆమాట అంటుంటే పిచ్చెక్కిపోయేది. మాట్లాడి ఏంలాభం? మావయ్య ఎంత మాట్లాడాడు? చివరికేమయ్యింది? వాళ్ళ నోళ్ళు మూయించడానికి నాకు ఆసక్తి లేదు. చివరికి ‘‘ఆడు మగాడేనా’’ అసలికి? ఇంత అందగత్తెని ఇంట్లో ఎట్టుకొని కల్లు మూసుకొని పడుకుండిపోతున్నాడంటే ఆడికి ఏదైనా ప్రొబ్లమేమో?

చివరికి ఇందులోకి దిగారందరూ. అమ్మమ్మకి తలకొట్టేసి నట్లయింది. ఏడుపూ, ఉక్రోషం, పంతం అన్నీ కలగలిపి సాధించడం మొదలు పెట్టింది. కొడుకు వినడని బాగా అర్ధమయింది. బలవంతంతో కొడుక్కి చేసిన పెళ్ళి ‘తను చేసిన తప్పుగా’ ఆమెకి తోచలేదు, తోచిందేమో, అయినా అలా అంగీకరించడానికి ఆమె మనసు సిద్ధంగాలేదు. ‘సగం సగం పనులు చెయ్యడం వాళ్ళింటావంటా లేదు’ అన్నట్లుగా మరింత పిచ్చిగా తయారయ్యిదమ్మమ్మ. నన్ను సాధించడంలోకి దిగింది. ‘‘మొగుడ్ని నీవైపు తిప్పలేక పోతున్నావు, నువ్వేం ఆడదానివి? అయినా పుట్టడవే తల్లీతండ్రీ గండాన పుట్టావు. నువ్వు లేప్పోతే ఆయిమని నాకొడుక్కి ఆడికి నచ్చిన్దాంతో పెళ్ళి సేసీసుందును, ఈ పాటికి ఆ వచ్చే ఆడది నీలుపోసేసుకున్ను. నువ్విలాగే ఉంటే మా వంశం ఇక్కడితో ఆగిపోద్ది. మొగుణ్ణి ఎలాగొకలాగ దగ్గరసేసుకోడం ఆడదానికి సిటికిలో పని, ఆపని సేతకాక నవ్వు నాపక్కలో దూరి పడుకుంటన్నావు’’. ఇలా చాలా అసహ్యంగా నన్ను వేదించడం మొదలుపెట్టింది. నేనూ సరిగా తినలేక పోయీదాన్ని, ఉండలేక పోయీదాన్ని. అందర్లాగా కాపురం చేసుకుంటే ఈ బాధలేవీ ఉండవుకదా, మావయ్యయినా ఎందుకంత మంకుపట్టు పట్టడం? పెళ్ళి జరిగిపోయాక ఇప్పుడిలా ఉండటం వలన ఏంటిలాభం? అనేవైపుగా నా ఆలోచనలు సాగడం మొదలైంది. మావయ్య డ్యూటి కెళ్లిపోయాక అమ్మమ్మ నాకేవో చిట్కాలు చెప్పేది. చుట్టపక్కల ఆడవాళ్లు చేరి వాళ్లూ నేనెలా మావయ్యకి దగ్గరవ్వాలో చెప్తూ ఉండేవారు. మావయ్య మనస్తత్వం తెలిసిన నాకు అవ్వన్నీ అతని దగ్గర సాధ్యం కావని అనిపించేది. కొన్ని పనులు వినడానికీ సిగ్గుగా అనిపించేది. కానీ అమ్మమ్మ గోల భరించడం నావల్ల కావడం లేదు. తన దగ్గర పడుకోవద్దంటుంది. మావయ్య రూమ్‌కి వెళ్లిపొమ్మంటుంది.

ఇంకా లాభం లేదు మావయ్యతోనే మాట్లాడాలని వెళ్లానొకరోజు. మావయ్య మాట్లాడలేదు. నాకూ పిచ్చిపిచ్చిగా అయిపోయింది. కోపంగా ఏవేవో అనీసి ఆ గదిలోనే కింద పడుకుండిపోయాను. కొన్ని రోజులు రోజూ ఆ గదిలో పడుకోని ఏడ్చేదాన్ని. ఆ తరువాత పంతం వచ్చేసింది. అసలెందుకు మావయ్య నాతో ఇలా ఉండాలీ, నన్నెందుకు బాధ పెట్టాలీ? అని ఆలోచించేదాన్ని. మావయ్య వైపునుంచి ఆలోచించడం దాదాపు మరచిపోయాను. చుట్టుపక్కల ఆడవాళ్ల సలహాలు, చిట్కాలూ పాటించి చూద్దాం అనిపించింది. చూడడమంటే మావయ్యని ఆకర్షించడానికి ఎన్ని చేయాలో అన్నీ చేశాను. అమ్మమ్మకి ఎంతో ఆశాజనకంగా, తృప్తిగా వుంది నా వేషాలుచూసి. కాలం మలుపు తీసుకుంది. మావయ్యకీ బంధువుల నుంచి ఎదురౌతున్న ప్రశ్నలూ, చూపులు బాగా ఇబ్బంది కలిగించయో లేక ఇక ఎదుర్కొనే శక్తి లేకపోయిందో అణిగిపోయాడు. నా పట్టుదల నాలోనూ, అతని తప్పనిసరితనం అతనిలోనూ ప్రతిఫలించి ఒకనాటికి మా శరీరాలు కలిశాయి. అప్పుడప్పుడూ మావయ్య ఒక యంత్రంలాగా నాతో కలిసేవాడు. ‘నాకు ఒక నెల పీరియడ్స్‌ ఆగిపోయాయి. వాంతులు చేసుకుంటుంటే అమ్మమ్మ మొహం వెలిగిపోయింది.

‘‘విస్సూ, నీ కొడుకు నెత్తుకొని సచ్చిపోతాన్లేరా, నా శవంతోనన్నా మాట్లాడదూగానీ’’ అని కళ్లనీళ్ళతో బాగా సంతోషంతో మావయ్యకి ఎదురెళ్లింది. మొహంలో ఏ భావం లేకుండానే మావయ్య గదిలోకి వెళ్లిపోయాడు. ఆ రోజునుంచీ గదిలోపల గడియపెట్టేసుకోవడం మొదలుపెట్టాడు. నాకు వేవిళ్ల బాధ కన్నా మావయ్య తిరస్కారం నొప్పి ఎక్కువైపోయింది. ఉక్రోషం, కసీ, బాధా అన్నీ కలిసి నన్ను కదిలిస్తే అమ్మమ్మని తిట్టేదాన్ని. అమ్మమ్మకి చిన్నప్పటినుంచీ ఎప్పుడూ చెప్పని జవాబులన్నీ చెప్పేదాన్ని. ఆమె తినమంటే మానేసి పడుకునేదాన్ని. అమ్మమ్మని బాధ పెట్టడమే చాల ముఖ్యం అన్నట్లు తయారయ్యాను.

‘‘ఎందుకే ఏవైందని అలగ మాటాడుతున్నావు? పిల్లోపిల్లోడో పుడితే ఆడే సుబ్బరంగ సూసుకుంటాడు’’ అని మొదలెట్టిందమ్మమ్మ.
మీదపడి రక్కేయాలనిపించింది.‘‘నువ్వూ.. నువ్వు చేశావిదంతా?’ అని పళ్లు కొరికి ఊరుకున్నాను. నా కోపం చూసి అమ్మమ్మ భయపడింది. నాతో మాట్లాడడం తగ్గించేసింది. నెలలు నిండి, ప్రైవేట్‌ ఆసుపత్రిలో బాబు పుట్టాడు. బాబు తొంభై శాతం వైకల్యంతో పుట్టాడని డాక్టర్‌ చెప్పగానే భూకంపం వచ్చినట్లయింది నాకు. అమ్మమ్మ నా మొహానికి సరిగ్గా ఎదురుపడకుండా తప్పించుకు తిరుగుతూ నాకు సేవలు చేసింది. పిల్లాడు ఎదుగుదల లేక నానా ఇబ్బందీ పడుతున్నాడు. మామయ్యకీ విషయం తెలిసినప్పుడు తానే గెలిచినట్లు నవ్వాడట. ఇదొక్కటీ నిజం. మిగతావన్నీ అబద్ధమైపోతే బాగుణ్ణనిపించింది. పిల్లాణ్ణి ఆసుపత్రికి తిప్పుతున్నాను. ఆడికీ సుఖం లేదు. మాకూ సుఖం లేదు. నోరి తెరిస్తే అమ్మమ్మని తిట్టడానికేనన్నట్లు తయారైపోయాను. హాస్పిటల్‌కి అస్తమానం తిరగడం వలన బయట తిరిగే పద్ధతి తెలిసింది. ఎవరితోనైనా పరిచయం పెంచుకొని మాట్లాడడమూ వచ్చింది. డాక్టర్స్‌ ఎక్కడికి తీసికెళ్లమటే అక్కడికి బాబును టెస్టుల కోసం, ట్రీట్‌మెంట్‌ కోసం తిరిగేదాన్ని. విశాఖపట్నం అంతా నాకు తెలిసిపోయిందనేంతగా తిరిగాను. బాబును పట్టుకోని తిరగడానికి చాలా కష్టమయ్యేది. రోడ్‌ మీద తెలియని వాళ్లని కూడా సహాయం అడిగేసేదాన్ని. ఎక్కువగా అలాంటి సహాయాలు మగవాళ్లే చేసేవారు. నన్నూ బాబును చూసి జాలిపడేవారు. తరువాత ఆ పరిచయాలు ఒక్కొక్కటి కొంచెం పెరిగేవి. అప్పుడు నన్ను చూసి మాత్రమే జాలిపడేవారు. నా కథ ఒక్కొక్కరికీ ఒక్కలా చెప్పడం అలవాటు చేసుకున్నాను. శరీరం మీద, మనసు మీద నిర్లక్ష్యం పెరిగింది. అంటే అదుపు తప్పినట్లేకదా! నేనెలా ఉన్నా నా వయసు ఎదుటివారిని కట్టిపడేస్తుందని నాకు తెలుసు. అలా ఎవర్నో ఒకర్ని నా వెనుక తిప్పుకోవడం నాకదో ఉన్మాదంలా మారింది. నన్నొద్దన్న వాళ్లకి ఇలా బుద్ధి చెప్తున్నాననిపించేది. నా ప్రపంచంలో మావయ్య, అమ్మమ్మ అదృశ్యమయ్యారు. నా పిల్లాడి జబ్బు నాకొక సాకు. మరీ చెప్పాలంటే ఒక వరం. వాణ్ణి భుజం మీద వేసుకొనే తిరిగేదాన్ని. పిల్లాడి వైద్యం కోసం అని ఎక్కడికెళ్లినా అమ్మమ్మ అడగలేకపోయేది. ఒక్కోసారి రాత్రుళ్లు ఇంటికెళ్లేదాన్నికాదు. అమ్మమ్మ మొదట్లో ఏడ్చుకునేది. ఒక్కోసారి గొణుక్కునేది. ఆ తరవాత ఆమె మొహంలో ఏ భావాలు కనిపించేవి కావు. ఎవరో చెప్పగా బాబుని రాయవెల్లూరు తీసుకొని వెళ్లాను. కనీసం వాడు నిలబడడం, కూర్చొవడమైనా చేస్తే చాలుననే ఆశ ఎక్కడో నాలో మిణుక్కుమనేది. వాణ్ణి మొయ్యడం చాలా కష్టంగా ఉన్నప్పుడల్లా అలా అనిపించేది. రాయవెల్లూరు వెళ్లడానికి అమ్మమ్మను డబ్బులడిగాను.

‘‘ఎందుకే ఆడ్నంతదూరం ఒక్కదానివీ తీసికెల్లడం, ఎల్లగలవా?’’ అంది.
గయ్యమని లేచాను. ‘‘నీ కొడుకు కనీసి ఒదిలేసాడు. ఆడ్ని చూసి కనికరమైన లేని కొడుకుని కన్నావు. నా కంటకట్టీసావు. నేలమీద పడున్న కన్నబిడ్డని కన్నెతైనా చూడ్డు నీ కొడుకు. నా కొడుకుని నేనలా ఒదిలీలేను. నువ్వివ్వకపోతే చెప్పు. అతన్నే గట్టిగా అడుగుతాను’’ అన్నాను. మళ్లీ ఏం గొడవ జరుగుతాదోనని భయపడి అమ్మమ్మ ఇచ్చీసింది. మొదట్నించీ సొంతిట్లో, తాతయ్య పెన్షన్‌తోనే మమ్మల్ని లాక్కొచ్చింది. అమ్మమ్మకి నాలుగు పోర్షన్ల అద్దెలొస్తాయి. చీటీలు కలిపి డబ్బులు దాస్తాది. ఇంట్లోనే మాకూ ఏవేవో కొంటుంటాది. చిన్నప్పుడు అమ్మమ్మ చూపించే ఆ ప్రేమ ఎంతో అపురూపం. నా కిప్పుడు ఆ ప్రేమ కావాలా? ఏం అక్కర్లేదు. మావయ్యే నన్నోదిలీసేడు. ఇంక నాకిప్పుడేం కావాలి? ఏమో, నాకే తెలీదు.

రాయవెల్లూరు రైల్లోని పరిచయాలు ఆ ఊళ్లో నాకు పనిచేశాయి. బాబుని పెట్టుకొని అక్కడ రెండు నెలలు ఉన్నాను. ఆసుపత్రి బయట అక్కడ నాకో లోకం ఏర్పడింది. బాబుకి వైద్యం అంతంతమాత్రంగా జరిగింది. ‘‘నయమయ్యే జబ్బు కాదని, కొంచెం మెరుగు చేయడానికి చూస్తున్నామని’’ డాక్టర్లు చెప్పారు. బాబుకి గుండెలో రంధ్రం ఉందన్నారు. బతికినన్నాళ్లు బతకకపోవచ్చనీ చెప్పారు. అయినా, వైద్యం చెయ్యమన్నాను. బాబు డిశ్చార్జ్‌ అయిపోయినా నాకు విశాఖపట్నం వెళ్లాలనిపించలేదు. అక్కడక్కడే తిరిగేదాన్ని. రాణి అనే ఆవిడతో బాగా స్నేహం కుదిరింది. స్నేహమా? పాడా? ఇద్దరికీ కొన్ని విషయాలు కుదిరాయి. వాళ్లింట్లో బాబుని ఉంచేసి ‘‘నేనవసరం అన్నదగ్గరి’’కల్లా తిరిగాను. నా వెంటపడే మనుషులు పిచ్చిగా తిరిగేవారు. నా శరీరం కోసం ఎంతకన్నా తెగించేవాళ్లని వెర్రిత్తించేదాన్ని. నేను ఒక మగాడికి ఎంత అవసరమో నాకు నేను ఋజువుచేసుకుంటున్నట్లు అనిపించేది. బతుకుమీద కక్ష తీర్చుకుంటానా? అన్నట్లు తిరిగాను. కోపం, బాధ, ఇష్టం, అయిష్టం, ఆలోచనా, తిరిగి చూసుకోవడం ఇవేవీలేవు. ఏ దారి కనిపిస్తే ఆ దారి తొక్కడవే. నాలుగు నెలలు గడిచాయి. బాబుకీ బాగోవడం లేదు. మళ్లీ అక్కడి ఆసుపత్రికే తిప్పాను. వైజాగ్‌ నుంచీ తీసుకొచ్చానని అబద్దమాడాను ఆస్పత్రివాళ్లతో.


నా తిరుగుళ్ల బరువుని రాణి తన బ్యాగ్‌లో మోసేది. నాకు నచ్చిన చీరలు కొనేది. అలంకరణ మీద నాకు మోజుపుట్టింది. పొట్టిగా ఉండడమొక్కటే నాలోని చిన్నలోపమని చెప్పి పాయింటెడ్‌ హైహీల్స్‌ అలవాటు చేయించింది. నా నడతకి నడక తోడయ్యింది. ఆ ప్రాంతాల్లో మగాళ్లకి గుబులు పుట్టించాను. కిర్రెక్కించాను. ఇంతలో అనుకోని నీరసం మొదలైంది. వాంతులూ, వికారం చూస్తే నెలతప్పానేమోనని అనుమానం తగిలింది. కాళ్లు భూమ్మీద కొచ్చాయి. ఎలా? అని ఆలోచించి ఒక చిన్న క్లినిక్‌లో చెక్‌ చేయించుకుంటే మూడోనెల దాటిందని చెప్పారు. రాణీ, నేనూ రెండు ఆసుపత్రులకు తిరిగాం. అబార్షన్‌ చెయ్యం అనీసారు. రోజులు గడిచిపోతున్నాయి. భయం మొదలయ్యింది. ఎవరిదో ఈ కడుపులోని మొలక. గుర్తు తెచ్చుకుందామంటే మొహాలన్నీ అలికేసినట్లయ్యాయి. ఏ గుర్తింపూ తెలియలేదు. రాణి ధైర్యం చెప్పింది. కనేవరకూ అక్కడే ఉండి పుట్టిన పిల్లనో పిల్లాడ్నో ఎవరికన్నా ఇచ్చేద్దామంది. అమ్మో మళ్లీ నా బాబులాంటి బిడ్డ పుట్టేస్తే? ఇద్దర్నీ ఎలా చూసుకోగలను? అని భయపడుతుంటే ‘‘అప్పుడు చూద్దాంలే ఎలా చెయ్యాలో అప్పుడాలోచిద్దాం, ముందెలా ఊహించగలం? అని సర్దిచెప్పింది. అలాగే కనక పుడితే ఆసుపత్రిలో వదిలేసి వచ్చేద్దాం’’అంది. వణుకు పుట్టింది, ఊహిస్తేనే. అమ్మమ్మకి ఫోన్‌ ద్వారా బాబుకి వైద్యం నడుస్తుందనీ, రావడానికి టైం పడతాదనీ చెప్పేసాను. నెలలు నిండి రాణి ఇంట్లోనే నార్మల్‌ డెలివరీ అయిపోయింది. డబ్బు పెట్టాల్సివస్తాదని రాణియే అలా ప్లాన్‌ చేసిందని నా అనుమానం. పుట్టిన పాప తెల్లగా మెరిసిపోతోంది. నల్లటి కళ్లూ, ఉంగరాల జుట్టు అని స్పష్టంగా తెలిసిపోయింది. అచ్చం నాలాగానీ ఉందని అర్థమైపోయింది. చటుక్కున దగ్గరకు లాక్కున్నాను. ముద్దులు మాటకట్టే పాపని చూస్తుంటే లోకమంతా అందంగా మారిపోయినట్లయింది. మనసులోని కల్మశమంతా పురిట్లో మాయతో సహా బైటకి కొట్టేసినట్లయింది. పాపకి పాలిస్తుంటే, బాబు పుట్టుకతో పాలు తాగడం తెలీక పాలు వదిలేయడం గుర్తొచ్చింది. పాపని హత్తుకుంటే ఎన్నడూ ఎరగని వెచ్చదనం నాలోపలికి ఇంకి స్తన్యంగా బయటకొచ్చినట్లుండేది. మాతృత్వపు వెలుగు బతుకు నావరించినట్లయింది. అన్ని మరపుకొచ్చి కొత్తగా మారిపోయినట్లనిపించేది. పాప పుట్టాక రాణి నాకు కావలసిన ఏర్పాట్లు చెయ్యడంలో చాలా నిర్లక్ష్యం చేసింది. డబ్బుల్లేవని అస్తమానం చెప్పేది. ఇంక అక్కడ ఎంతోకాలం ఉండలేననిపించింది. చేతి గాజులు రెండు ఇచ్చి అమ్మేసుకోమన్నాను. అమ్మిందో లేదో తెలీదుకానీ రెండురోజులు బాగా చూసింది. ఆమె నిర్లక్ష్యంతో బాబు పరిస్థితి మరింత దిగజారిపోయింది. జంతువుకన్నా హీనంగా చూసేది రాణి బాబుని. అమ్మమ్మ ఎంత శ్రద్ధగా బాబుని సంరక్షించేదో జ్ఞాపకం వచ్చింది. నిలవలేనట్లయిపోయాను. ఏదైతే అయిందని రాణిని విశాఖపట్నం టికెట్‌ కొనమన్నాను. నా కోసం అప్పులు చేస్సాననీ, ఎలా తీర్చాలని అడిగింది. ఆలోచించాను. తెలివిగా బయటపడాలనుకున్నాను. కానీ ఇద్దరు పిల్లలతో రైల్లో జనరల్‌ బోగిలో ప్రయాణించలేనని తెలుసు. అందుకనీ బాబుని అమ్మమ్మ కప్పచెప్పేసి మళ్లీ వచ్చేస్తానని అబద్దమాడాను. పాపని వదిలేసి వెళ్లమంది. ఎవరికన్నా పాపని ఇచ్చేయడానికి నిర్ణయించుకుంటే నేను వైజాగ్‌ వెళ్లొచ్చేలోగా ఆ పనిచేస్తానంది. ఈ లోపల డబ్బా పాలు పడుతూ మేనేజ్‌ చేస్తానంది. నాకు గుండె దడ వచ్చేసిందామాటలకి.
‘‘ఇంకా పాలు తాగుతుంది కదా, అయినా నువ్వు చూళ్లేవు. రాత్రుళ్లు ఒకటే ఏడుస్తుంది. నా దగ్గర పాలు మానిపించాలంటే నేను దగ్గరుండి నెమ్మదిగా మానిపించాలి, తీసుకొని వెళ్లి వారం, పదిరోజుల్లో వచ్చేస్తాను? అని తప్పించుకున్నాను.

‘‘మీ అమ్మమ్మకి పాప గురించి ఏం చెప్తావ్‌?’’ అంది.
‘‘ఏ ఫ్రెండ్‌ ఇంట్లోనో ఉంచేసి ఇంటికెళ్తాను. మళ్లీ ఆ ఫ్రెండ్‌ దగ్గరకే వెళ్లిపోతాను, కొంచెం డబ్బులు చూసుకొని వస్తాను’’ అని ఎరవేసాను.
పడింది. తనే వచ్చి రైలెక్కించింది. బండంత వేగంగా ఆలోచించాను. అయినా ఇలా గాలిపటంలా తయారయ్యాక బుర్ర చాలా చురుకైపోయింది. ‘‘మావయ్య అనీవాడు కదా నేను తెలివైనదానినని’’ నిజమే మంచి ఆలోచనే వచ్చింది.
కాబ్‌లో ఇంటిముందు దిగాను. అమ్మమ్మ వచ్చి బాబునీ, బ్యాగ్‌నీ అందుకుంది. నా చేతిలో పిల్లను చూసి ఆశ్చర్యపోయి నోరు తెరిచి నిలబడిపోయింది.

‘‘చెప్తాను లోనిక పదా’’ అన్నాను. హాల్లో పిల్లాడ్నీ, బ్యాగ్‌ని జారవిడిచేసి, నా మొహంలోకి చూస్తూ నిలబడింది. అమ్మమ్మ బాబుని ఆసుప్రతికి తిప్పుతుండగా ఒకమ్మాయి ఈ పాపని పట్టుకొని ఆసుపత్రికొచ్చిందనీ, చూస్తూ వుండమని నా పక్కన బెంచి మీద పడుకోబెట్టి వెళ్లి మళ్లీ రాలేదనీ, పిల్లనూ వదిలెయ్యలేక చూసుకుంటున్నాననీ చెప్పాను. భలే చెప్పాననుకున్నాను.
అమ్మమ్మ మొహంలో ప్రశ్న వీడలేదు. సాయంత్రం లోపల నాగుట్టు రట్టయ్యింది.
‘‘పాపకి పాలు పెట్టడం అమ్మమ్మ చూసింది’’
‘‘ఏటిదంతా?’’ అనడిగింది.
‘‘ఉండనా? వెళ్లిపోనా?” అని తెగించినట్లడిగాను.
‘‘ఆడు సూత్తే ఏటి సెప్పాలీ?’’ అన్నాది.
‘‘ఆయనగారు ఆ ప్రశ్న అడగడానికైనా మన్తో మాట్లాడాలి కదా?’’ నిర్లక్ష్యంగా చెప్పాను.
అమ్మమ్మ ఏమీ మాట్లాడలేదు.
‘‘నన్నడగనీ, సరిగ్గా చెప్తాను’’ అని రెట్టించాను.
‘‘అమ్మమ్మ చిన్నగా తిట్టుకుంటూ బయటకెళ్లిపోయింది. పాప ఉనికిని మావయ్య గ్రహించే ఉంటాడు వెంటనే. కానీ ఎప్పట్లాంటి నిర్లిప్తత.
అమ్మమ్మ వండి పెడితే తింటున్నాను. బాబుకి ఏవో మందులు వేస్తున్నాను. కానీ వాడి పరిస్థితి బాగులేదు. డాక్టర్లు చెప్పిన మాట అమ్మమ్మతో చెప్పాను. ‘‘నాకు ఈ పేప్తం లేదన్నమాట’’ అని వాణ్ణి పట్టుకొని ఏడ్చింది. చుట్టుపక్కలవాళ్లు పాప ఏడుపుకి ఇంటివైపు వింతగా చూసారు.

‘‘మా కుసుమకి ఆస్పట్ల దగ్గర దొరికిందంటమ్మా, ఎవులో ఒగ్తీసి ఎలిపోన్రట. ఒగ్గీలేక తెచ్చీసింది’’ అని అమ్మమ్మ చెప్పడం, వాళ్లు నమ్మక పోవడం యధాలాపంగా జరిగిపోయాయి. వీధిలో పాప పాతబడిపోయింది.
‘‘అచ్చం కుసుమ కళ్లే, ఆ ఉంగరాల జుట్టు చూడు, ఆల్లమ్మనే అన్నిందాలా పోలింది’’ అని మొహాన్నే అనేసేవారు. అన్ని వింతలూ పాతబడతాయి కదా! ఇదీ అంతే. ఇలాంటి రోజుల్లో ఈ రోజు ఒకటనుకున్నాను కానీ, ఈ రోజు మావయ్య పాపని తన గదిలోకి తీసికెళ్లిపోయాడు.

‘‘ఎందుకు జరిగిందిలా?’’ అని గట్టిగా అనుకుంటుండగా పాప ఏడుపు వినిపించింది. ఆ వెంటనే మావయ్య గది తలుపు తెరుచుకుంది. నాకు గుండెలు దడదడా కొట్టుకున్నాయి. పాపని ఎత్తుకొని తెచ్చి ముందుగదిలో దివాన్‌ కాట్‌ మీద పడుకోబెట్టేసి మావయ్య మళ్లీ గదిలోకి వెళ్లిపోయాడు. పాపని గబుక్కున ఎత్తుకొని గదిలోకి వచ్చేసి, మంచం మీద పడుకొని పాలిస్తూ జరిగిన వింతను ఎలా అర్థం చేసుకోవాలో తెలీక పిచ్చిదాన్నయిపోయాను. రాత్రంతా పాపని తన దగ్గర పడుకోబెట్టుకున్న మావయ్య మళ్లీ అస్సలర్థం కాకుండా అయిపోయాడు. అమ్మమ్మా నేనూ మాట్లాడుకోవడానికి సిగ్గుపడిపోయాం. మావయ్య డ్యూటీకి వెళ్లివస్తూ బిస్కెట్‌ పాకెట్లూ, పాలపాకెట్లు తెచ్చాడు. మీమిద్దరం తెల్లబోయాం. కన్నకొడుక్కి ఒక్కనాడు ఏదీ పట్టుకురాని ఇతడు పాప కోసమే ఇవ్వన్నీ తెచ్చాడని అర్థమయ్యి అమ్మమ్మా నేనూ మొహాలు చూసుకున్నాం. రోజుకన్నా ముందే ముందుగదిలోకి వచ్చి అక్కడాడుతున్న పాపని ఎత్తుకున్నాడు మావయ్య. అది మావయ్యతో అలవాటున్న దానిలాగే కేరింతలు కొడుతూ ఆడుతోంది. పాపకి నా పాలు సరిపోక పోతపాలు కొంచెం అలవాటు చేశాం కాబట్టి రాత్రి సీసాపాలతో సరిపెట్టేసుకుందది మావయ్య దగ్గర. ఆ రాత్రి మళ్లీ అదే జరిగింది. జీతాలనాడు పాపకీ, బాబుకీ బట్టలు కొనుక్కొచ్చాడు. అదే మొదటిసారి తండ్రి పిల్లాడి కోసం ఏదన్నా కొనుక్కురావడం. పాపకొక్కదానికే తేలేక వాడికీ తెచ్చినట్లు కాసేపటికి నాకర్థమయ్యింది. మావయ్య పిల్లల్తో రాత్రి పెందరాళే ముందుగదిలోకొచ్చి ఆడడం మాకు అలవాటయిపోయింది. పాపని బండెక్కించుకొని బయట తిప్పి తీసుకురావడమూ మొదలయ్యింది. ఈ వింతా వీధిజనం జీర్ణం చేసుకుంటున్నారు. ఒకరోజు పాపని ఒంట్లో చిన్న జ్వరం వచ్చింది. మావయ్య వచ్చేసరికి దివాన్‌ మీద పడుకోబెట్టి ఉంది. ఎప్పుడూ ఆడుకుంటూ ఎదురొచ్చే పిల్ల అలా పడుకోవడం చూశాడు మావయ్య. నేను గుమ్మంలో ఆగిపోయాను. మావయ్య డ్యూటీబ్యాగ్‌ భుజాన ఉండగానే దాని దగ్గరకెళ్లి ‘‘సుమా’’ ఏమైందిరా? ఎందుకలా బబ్బున్నావూ?’’ అని దాన్తో మాట్లాడుతున్నాడు. నాకర్థమయింది మావయ్య ఎందుకలా మారిపోయాడో. అది అచ్చం చిన్నప్పుడు నేనెలా ఉన్నానో అలాగే వుంటాది. మావయ్య పాషాణ హృదయాన్ని ఆ పిల్ల రూపం కదిలించిందని నాకర్థమయిందప్పటికి. కాదు, మావయ్య ఇప్పటికి నాకర్థమయ్యాడు. అందరం కలిసి అతని పసిహృదయాన్ని ఎలా చిదిమేసామో. కఠిన శిలలా అతనెందుకు మారిపోయాడో నాకిప్పుడర్థమయింది. మా బాల్య స్నేహాన్ని నేనెలా కోల్పోయానో నాకిప్పుడు బోధపడింది. అందరం కలిసి అతన్ని ఎలా తప్పుపట్టామో, ఎలా బలవంత పెట్టామో గుర్తొచ్చి సిగ్గేసింది. మావయ్య హృదయం అమృతం. ఏ పాపాలూ అతన్నంటవు. నేను పాపాల్ని మోసి పుష్పాన్నికన్నాను. మావయ్య దేవుడు. అతని కాళ్ల దగ్గర ఆ పువ్వునుంచుతాను. నాకింకేం అక్కర్లేదు. అతనే వరాలనిస్తాడు. కదిలిన దేవుడు అందరి పాపాలన్నీ కడిగేస్తాడు.

మహిళా సంఘం కార్యకర్త. ఉపాధ్యాయిని. పుట్టిన ఊరు విశాఖపట్నం. ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేసి, రాజీనామా చేశారు. నలభై రెండేళ్లుగా మహిళా సంఘం కార్యకర్తగా పనిచేస్తున్నారు. మహిళల సమస్యలపై పనిచేయడం వలన కలిగిన అనుభవాలను రికార్డ్ చేస్తున్నారు.

Leave a Reply