నేనూ మా నాన్న… కొడవటిగంటి కుటుంబరావు

మా నాన్న పుట్టింది తెనాలిలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో. చదివింది తెనాలి, గుంటూరు, విజయనగరం, కాశీలలో. తెనాలిలో విద్యార్థి దశలోనే గాంధీ సహాయ నిరాకరణోద్యమం ప్రభావంతో జాతీయ పాఠశాలలో చేరి వడ్రంగం నేర్చుకున్నారు. గ్రంథాలయోద్యమ ప్రభావంతో ప్రాచీన, ఆధునిక సాహిత్యం చదివారు. చిన్ననాడే సంగీతం, హోమియోపతి, నాటకాలు, ఫొటోగ్రఫీ లాంటి అభిరుచులు అబ్బాయి. ఉన్నవ ప్రభావానికి లోనై, కుల బేధాల పట్ల వ్యతిరేకత, వితంతు స్త్రీలపట్ల సానుభూతి పెంచుకున్నారు. అర్థంలేని ఛాందస సంప్రదాయాల మీద నమ్మకం పోయాక, జంధ్యం లాంటివి తీసేశారు. కాశీలో మదన్ మోహన్ మాలవీయ జాతీయ భావాలకి ఆ తరవాత వామపక్ష భావాలతో ప్రభావితులయ్యారు. పాకీవాళ్ళ వడ్డన తిన్నారు. ఆర్థికమాంద్యంలో ఆస్తిపాస్తులు పోవటంతో, ఎం.ఎస్. సి చదువు ఆగిపోయింది. జీవనోపాధి కోసం మదాసు, సిమ్లా, జైపూరు, బొంబాయి నగరాల్లో పలు రకాల పనులు చేశారు. ఫ్యాక్టరీ పనిలో కార్మికవర్గ జీవితం తెలుసుకున్నారు. సినిమాలకి, పత్రికలకి పనిచేశారు. మా అమ్మని పెళ్ళి చేసుకున్నాక మద్రాసులో స్థిరపడి, చనిపోయే వరకూ ‘చందమామ’ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఆయన ప్రవృత్తీ వృత్తీ ఒకటే. మధ్యతరగతి జీవితాన్ని అనేక కోణాలలో విశ్లేషించారు. సైన్స్ విద్యార్థి కావటంతో వైజ్ఞానిక రచనలను సామాన్య జనం కోసం రాసేవారు. తన శాస్త్రీయ దృక్పథాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. మూఢ విశ్వాసాల నుంచి బయటపడి శాస్త్రీయ దృష్టి అలవరచుకోవాలని తన వ్యాసాలలో చెప్పేవారు. ఎన్నో అనువాదాలు కూడా చేశారు. కంప్యూటర్ లేని రోజుల్లోనే దాదాపు ఏభైయేళ్ళ కాలంలో ఆయన రాసిన దాన్లో ఈనాడు లభ్యమవుతున్న సాహిత్యం పన్నెండు వేల పేజీలకి మించే వుంది. ఇవి ఆయన నేపథ్యానికి సంబంధించిన విషయాలు.

మా తరం పిల్లల తలిదండ్రులంటే భయ భక్తులతో పెరిగాం. సామాన్యంగా పిల్లలు పెద్దవాళ్ళవుతున్నప్పుడు తలిదండ్రుల్లోని బలహీనతల్ని గమనిస్తారు. అప్పుడు ఆ భయభక్తులు కొంత తగ్గిపోతాయి. కానీ పిల్లలకి తమమీద గౌరవం ఉండేట్లు పెంచే తలిదండ్రులు వాళ్ళ దృష్టిలో ఎన్నటికీ దిగజారరు. భయమనేది పోయే అవకాశముంది, కానీ గౌరవం కాలంతో పాటు ఇనుమడిస్తుందే తప్ప తగ్గదు. మా ఇంట్లో అటువంటి వాతావరణమే ఉండేది. అమ్మకీ పిల్లలకీ మధ్య చనువెక్కువుంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి. నావిషయంలోనూ అదే జరిగింది. ఎక్కడో తప్ప, సామాన్యంగా పిల్లలతో తండ్రులు తక్కువగానే మాట్లాడతారు. వాళ్ళు బైట ఎక్కువ సేపు గడపడం వల్ల అలా జరుగుతుందేమో. వాళ్ళు పిల్లతో గడిపే సమయం ఎలా ఉంటుంది అనేది ముఖ్యం. మా నాన్నసాయం కాలాలూ, రాత్రిళ్ళూ ఆరుబైట కూర్చుని కథలే కాక, ఎన్నో ఆసక్తిని రేకెత్తించే విషయాలని మా స్థాయికి అర్థమయే విధంగా చెప్పేవారు. ఇన్ని విషయాలలో మాకు ఆసక్తి కలగడానికి అదే కారణమని అనుకుంటాను. విషయ పరిజ్జానం… ముఖ్యంగా స్వార్థ ప్రయోజనాలని ఆశించనిది… బుద్ధినీ, మనసునీ విశాలం చేస్తుంది, అనే విషయాన్ని నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను.

విజ్ఞానం, సంగీతం, సాహిత్యం, మొక్కల పెంపకం పట్ల అభిరుచి మా నాన్న వల్లే ఏర్పడింది. నాకు వీణ నేర్పించారు. వైణిక విద్వాన్ చిట్టిబాబుని విని కొమ్మలో కోయిల పాటలో ఆయన పలికించిన ‘కూ’ అనే శబ్దాన్ని నేను వీణ మీద పలికిస్తే మెచ్చుకునేవారు. ప్రతీ సంగీత కచేరీకీ మమ్మల్ని తీసుకున్ని వెళ్ళేవారు. నేను ఢిల్లీలో వెళ్ళిన కచేరీలు వివరాలు అడిగి తెలుసుకునే వారు. హిందీ భాష నాకు చిన్నప్పట్నించీ ఇష్టం. అమ్మ మా చేత హిందీ పరీక్షలురాయించేది. నాన్న నన్ను బీ.ఏ. హిందీ లో చేర్చటమే కాకుండా, ఆ సాహిత్యం గురించి ఎన్నోవిషయాలు నన్ను అడిగి తెలుసుకునేవారు. ప్రేమ్ చంద్ ఆయనకి ఇష్టమైన హిందీ రచయిత . అప్పుడాయన నాతో ఒక మాటన్నారు, హిందీ భాషా, సాహిత్యం చదువు కానీమన సంస్కృతిని మరిచిపోవద్దు. ఆ మాట అని అర శతాబ్దం అయినా అది ఇంకా నాకు గుర్తుండిపోయింది. తరవాత ఒక ముఫ్ఫై యేళ్ళకి ఆయన అన్న మాటలోని అర్థం తెలిసింది. ఇర వైఒకటో శతాబ్దంలో మన దేశంలో విదేశీ సంస్కృతి ఎంతలా పాతుకుపోయిందో చూస్తూంటే అది ఇంకా స్పష్టంగా అర్థమౌతుంది.

ఆయన తన రచనలని చదవమని ఎప్పుడూ అనేవారు కాదు. మాకూ మా నాన్నకీ మధ్యసాహిత్య చర్చలుండేవి కావు.(మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఏనాడూ ఇంట్లో కూనిరాగం కూడా తియ్యరని విన్నాను! ఇదీ అలాటిదే.) వారసత్వంగా నాకు కొద్దో గొప్పో అబ్బిందని అనుకోవాలి. కాలేజీ విద్యార్థినిగా రాష్ట్రస్థాయి హిందీ వ్యాసరచన పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి తెచ్చుకున్నాను. దానిలో భాగంగానే కాశీ, ఢిల్లీ సందర్శించే అవకాశంలో ప్రముఖ హిందీ రచయితలనెందరినో కలుసుకునే అదృష్టం దక్కింది. అదికూడా మా నాన్న వల్లే. ఆయన వెనకాలే నేనూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాను. మదాసుకి వెనక్కివచ్చాక వాళ్ళందరికీ హిందీలో ఉత్తరాలు రాశాను. నా ఉత్తరానికి జవాబిస్తూ, సుప్రసిద్ధ కవి హరివంశరాయ్ బచ్చన్ నా హిందీని మెచ్చుకుని అనువాదాలు విరివిగా చెయ్యమని ప్రోత్సహించారు. అప్పుడు కూడా మా నాన్న తన రచనలని అనువదించమని సూచించనుకూడా సూచించలేదు. బహుశా మా నాన్న నాకున్న పరిమితులు గ్రహించారనుకుంటా. ఆయనలా నేను జీవితంలో ఎటువంటి ఆటుపోట్లనీ ఎదుర్కోలేదు, నాది వడ్డించిన విస్తరి. సృజనాత్మక రచయితకి అటువంటి జీవితం ముడి సరుకు. అదినాకు లేదు కదా! మా నాన్న రాసిన ‘ఉభయ భ్రష్టుడు’ నేను అనువదించిన మొట్టమొదటి కథ. దానిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందీ డైరెక్టరేట్ వెంటనే ప్రచురించింది. నేషనల్ బుక్ ట్రస్ట్ హిందీ ఏకాకింకల అనువాదం నాకు అప్పగించింది. నాన్న బతికుండగా వచ్చిన నా అనువాద గ్రంథం ఇది. నాన్న పొగడనూ లేదు, తిట్టనూలేదు.

నేను లిబియాలో వుంటూ అక్కడి జీవితం గురించి ఆయనకు ఉత్తరాలు రాస్తే, అందులోని విషయాలు ప్రచురణకి వనిత మాస పత్రికకి ఇచ్చేవారు. దాన్నిబట్టి ఆయనకినేను రాసే పద్ధతి నచ్చే వుండాలి అనీ అనిపించింది. నాన్న పోయాక ఆయన నవల ‘చదువు’ సాహిత్య అకాడమీ కోసం హిందీలోకి అనువదించాను. తెలుగు కవితలను హిందీ అనువాదాలు అరుదుగా వస్తున్నాయని సాహిత్య అకాడమీలో హిందీ సంపాదకులు డా.రాఠీ నన్ను కోరటం జరిగింది. తమాషాగా కవిత్వం అంటే నేను పడి చస్తాను, నాన్నేమో దానికి ఆమడ దూరం ఉండేవారు. అయితే కవిత్వం రాయకపోయినా, అందులో అభిరుచి ఉండేది. సాహిర్ అంటే నాకు చాలా ఇష్టమని మేము రికార్డ్ ప్లేయర్ కొన్న కొత్తలో వచ్చిన’తాజ్ మహల్’ సినిమా రికారు కొనితెచ్చారు. సాహిర్ పాటల్లో అర్థం కాకపోయినవి నన్నుఅడిగి తెలుసుకునేవారు.

నాన్న ఇష్టపడ్డ ‘బకాసుర’ కథని మిత్రులు తారక రామారావు నాటకంగా రూపొందిస్తే దానిని హిందీలోకి అనువదించాను. అలా అనువాదమే నన్నుచేపట్టింది, దానిని వృత్తిగా చేసుకోలేదు. నాకు నచ్చిన రచనలనే నేను అనువాదంచేస్తాను. కొన్ని నియమాలు నాకు నచ్చవు. నాన్నకు ఉన్నంత స్వేచ్ఛాప్రియత్వం ఉన్న వాళ్ళునా ఎరికలో లేరు. ఆ స్వేచ్ఛా ప్రియత్వం నాకు కూడ అంత కాకపోయినా కొంత అబ్బింది .సమయ పాలన విషయంలో నాన్నది విలక్షణమైన పట్టింపు. అన్నీ టైము ప్రకారం జరిగిపోవాలి. ఆయనతో పనిచేసిన వాళ్ళు చెప్పగా విన్నాను, ఆఫీస్ గదిలోకి తన బాస్వచ్చినా సరే, అయిదయేసరికి ఆయన ఇంటికి బైలుదేరేవారట. మొహమాటం, ఇచ్చకాలూ అనేవి తెలీని వ్యక్తి మా నాన్న.

నేనూ మా నాన్నా మాత్రమే ఆసక్తి చూపించిన ఇంకో విషయం గురించి చెప్పాలి. ఆ అవసరం ముఖ్యంగా ఇప్పుడుంది, ఎందుకంటే ఈమధ్యే ఆ విషయం మీదే తెలుగు పత్రికల్లో అనవసరమైన వివాదం లేవదీశారు. ఆయన శైలిలోని భాగమైన అవహేళన, అధిక్షేప హాస్యం, వ్యంగ్యం అర్థంకాక! నేను పెళ్ళయి ఢిల్లీ వెళ్ళాక అక్కడ హిందీ పత్రికల్లో అతీంద్రియ జ్ఞానం గురించి పరిశోధనలు చేసిన ఒక శాస్త్ర జడి వ్యాసాలు వస్తూండేవి. అవి నేను చాలా ఆసక్తిగా చదివేదాన్ని. వాటిలో రెండేళ్ళ పిల్లవాడు తన పూర్వ జన్మవృత్తాంతాలని చెప్పడం లాంటివి ఉండేవి. ఎప్పటినించో మా నాన్నకి అలాంటి విషయాల్లో ఆసక్తి, కుతూహలం ఉండే వన్న సంగతి నాకు తెలుసు. అందుకే ఆ వార్తలు ప్రచురించబడ్డ ఆ పేపర్ కటింగ్స్ ఆయనకి పంపేదాన్ని. ఆయన దగ్గరున్న కొన్ని పుస్తకాలునేను చదివాను. నాకు తెలిసినంత వరకూ మా నాన్నకి చనిపోయే వరకూ కొత్త విషయాలని తెలుసుకోవాలని వాటి గురించి దొరికిన సమాచార మంతా చదవాలనీ ఉండేది. మన అనుభవాలకి భౌతికవాదంతో కూడిన వివరణల కోసం అన్వేషించేవారు. మాఇంట్లో, గణితం, భౌతిక శాస్త్రం లాంటి విషయాలకి సంబంధించిన విదేశీ పుస్తకాలే కాక, ఈజిపు, మాయా నాగరికతలకీ, మానవ జాతి పరిణామానికీ సంబంధించిన పుస్తకాలు ఉండేవి. చీమల గురించీ లిపి గురించి పుస్తకాలుండేవి. మాకు మా నాన్న ఎన్నివిషయాలని అందుబాటులో ఉంచేవారో అని చెప్పడంకోసంమే దీనిని ప్రస్తావిస్తున్నాను. చివరికి ‘ఎస్పెరాంటో అనే ఒక కొత్త భాషని కనిపెట్టిన ఒక విదేశీయుడు మదాసుకి వస్తే ఆయనని కలుసుకుని ఆ భాషని నేర్చుకున్నారు. అదీ తన యాభైయో పడిలోఎన్నినేర్చుకున్నా ఆయనకి ‘ఓపెన్ మైండ్’ ఉండేది. తనకే అన్నీ తెలుసునన్నట్టు మా దగ్గర కూడా ప్రవర్తించేవారు కాదు. ఇతరులు చెప్పింది వినేవారు, చర్చించే వారు, తన అభిప్రాయాలు చెప్పేవారు, అంతే కాని వాటిని రుద్దటానికి ప్రయత్నించేవారు కారు. ఆ కారణం గానే పత్రికల్లోఒకరు అదీ ఆయన గతించి మూడు దశాబ్దాలయాక ఆయన నమ్మకాలనీ, మేధస్సునీవిమర్శిస్తూ, వ్యక్తిగత దూషణలకి దిగినప్పుడు బాధ వేసినా, అదే ధోరణిలో స్పందించడం సబబు కాదని ఊరుకోవలసి వచ్చింది. పిల్లలతోనే స్నేహితుల్లా మెలిగిన మా నాన్న తనురాసే మాటలే వేద వాక్కులనీ, అందరూ విని తీరాలనీ అన్నారంటే నాకు నవ్వొస్తుంది! అదిఅర్థం చేసుకోలేని వాళ్ళని అజ్ఞానులు అనుకోవలసిందే. ఏమైనా, అయన కూతురిగా ఆయనతో మూడు దశాబ్దాలకి పైగా గడిపాను. ఆయన రచనలూ, వ్యక్తిత్వమూ వేరు వేరు కాదని నా కన్నా గట్టిగా ఎవరూ చెప్పలేరనుకుంటా.

మా నాన్న ఒక తీవ్ర స్త్రీవాది. ఆ వాదం సాహిత్యంలో ప్రవేశించటానికి ముందే, తన కథ ‘ఆడజన్మ’లో కొందరు తక్కువ కులాలలో, కొందరు బీదల కడుపున, మరి కొందరు ఆడవాళ్ళుగా పుడతారు అంటూ వాళ్ళ దయనీయమైన స్థితిని వర్ణిస్తారు. ఆయనలా నేనుకల్పనా సాహిత్యం సృష్టించలేకపోయినా, ఒక స్త్రీవాదిగా నేను తరచూ ఆకోణం నుంచిరాసిన ఇతర భాషల కథలనే నా అనువాదానికి ఎన్నుకుంటాను. అలాగే కొన్నిదశాబ్దాల క్రితమే ఆయన ప్రపంచీకరణ దుష్ఫలితాలని ఊహించారు, తన ఫారిన్ కొలాబరేషన్ అనే గల్పికలో లంక పొగాకు అమ్మే ఒక చిన్న దుకాణాదారుని కోకా కోలా సెంటర్ ఎలా మింగేసిందో హృద్యంగా చిత్రించారు. ఆయనిచ్చిన స్ఫూర్తితోనే నేను ఇటీవల ప్రపంచీకరణ మీద వచ్చిన అద్బుతమైన తెలుగు కథలని హిందీ పాఠకులకి పరిచయంచేశాను. కథన్ అనే పత్రిక సంపాదకులు డా. రమేశ్ ఉపాధ్యాయ తెలుగులో ఇంత మంచి కథలు వస్తున్నాయని ఆశ్చర్యపోతూ క్రమం తప్పకుండా పెద్దింటి అశోక్ కుమార్, గొరుసు జగదీశ్వర రెడ్డి, అజయ్ ప్రసాద్, గోపరాజు నారాయణ రావు లాంటి యువ రచయితల కథలు ప్రచురించారు. మా నాన్న ఇచ్చిన స్ఫూర్తితోనే సైన్స్ మీద అభిమానం పెంచుకున్నాను. విస్తృతంగా అసిమోవ్ రచనలను చదివాను. ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞులు కార్ల్ సాగన్ అభిమానిని. ఆయన రచనలన్నీ సేకరించాను. ఆయన్ని అనువదించే సాహసం చేయలేదు.

ఇక భాష విషయానికి వస్తే నాన్నే నా ఆదర్శం. అంటే నా తెలుగు ఆయన తెలుగంత బావుంటుందని అనడం కాదు. సులభ గ్రాహ్యం కావటం కోసం ఆయన భాషని సులభతరం చేస్తే, నేను నా అనువాదాల్లో వీలైనంత సరళ భాషని ఎంచుకుంటాను. నేను అనువదించిన ఒక చేతన్ భగత్ నవలకి ఐ.ఐ.టీ లో అత్తెసరుగాళ్ళు అని పేరు పెడితే కొందరు చాలా బావుందని మెచ్చుకున్నారు.

మా నాన్నలో ఉన్న బలహీనతలని కూడా చెప్పాలంటే, రెండే రెండు కనిపిస్తున్నాయినాకు. ఆయనకి ప్రథమ కోపం ఉండేది. కానీ అది ఎంత త్వరగా వచ్చేదో అంతే త్వరగా తగ్గిపోయేది. మనసులో కోపం దాచుకోవటం, తరవాత దానిని కక్కటం ఆయనకి తెలీదు. రెండోది… ఆయనకి డబ్బు కూడబెట్టటం, దాన్ని పెంచటంలో ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. దీన్ని చాలామంది ఆయన బలహీనతగానో , చేతకాని తనంగానో భావించేవారు. చివరిదాకా చాలా సీదా సాదాగానే బతికారు. అలాగే తన రచనలని చదవటం జనం ఎంత త్వరగా మానేస్తే అంత సంతోషిస్తాననటంలో ఒక పక్క తన రచనలు తాత్కాలిక ప్రయోజనాలకి సంబంధించినవే అనీ, ఆ రచనల్లో ప్రస్తావించిన సామాజిక సమస్యలు త్వరలో సమసిపోవాలనీ ఆయన అనుకున్నట్లు కనబడుతుంది. పేరు ప్రతిష్ఠలకీ, డబ్బుకీ వెంపర్లాడకుండా ఉండటమనేది నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆయన నాకు నాన్న మాత్రమే కాదు, గురువు కూడా. ఆయన వ్యక్తిత్వం, మేధస్సు, సాహిత్య కృషి ఒక మహాసముద్రం. అందులో వారసత్వంగా నాకు దక్కింది ఒక శాతం అనే అనిపిస్తుంది. సూటిగా చెప్పకపోయినా ఎన్నో జీవిత విలువలని నేను ఆయన దగ్గరే, ఆయన్ని గమనిస్తూనే నేర్చుకున్నాను.

నాలుగు దశాబ్దాలకు పైగా అనువాద రంగంలో కృషి చేస్తున్నారు. కథ, కవిత, నవల, నాటకం, వ్యాసాలు, ఆత్మకథలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు. కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల 'చదువు'ని హిందీలోకి అనువదించారు. ఈమె చేసిన అనువాదాలలో, 'మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు', ' అసురుడు', డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ, 'బేబీ హాల్దార్ జీవిత చరిత్ర' వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నోకవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో అనువదించారు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించారు. సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంత సుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు.

4 thoughts on “నేనూ మా నాన్న… కొడవటిగంటి కుటుంబరావు

  1. కొ.కు.నించి ఎన్ని నేర్చుకున్నామో… ఎన్నిసార్లు ఆయన రచనలు చదివామో…. ఆయన గురించి రాసిన ఈ విషయాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. చాలా విషయాల్లో ఆయన ఆశ్చర్య పరుస్తూనే ఉంటారు.

  2. Nice article on a great thinker the Telugu land ever produced. enjoyed it. best. Veluri Venkateswara Rao

  3. కథకుడైన తండ్రి జీవితం గురించి కూతురు రాస్తే ఆసక్తిదాయకమే కదా ! ఇంకా రాసివుంటే బాగుండనుకున్నాను

  4. i wondered about his writings that resembles what is happening in my house and others. chaduvu navel is the first social book that I had read in 10th class.

Leave a Reply