నేనూ – నా కథలూ

నేను రాయడం చాలా ఆలస్యంగా మొదలుపెట్టేను. మొదటి కథముప్పై ఏళ్ళు వచ్చేక రాసేను. ఉదాసీనత ఒక కారణం. జర్నలిస్టు కావడం ఇంకో కావడం మరొక కారణం. కథలు రాయాలని వున్నా ఎలా రాయాలో తెలీయక పోవడం అసలు కారణం కావచ్చు. మొదటి కథ రాసింది మాత్రం విరసంలో చేరేకనే. చేరకపోతే అసలు కథలు రాసివుండేవాడినో లేదో తెలీదు కాని నా కథా రచనా ప్రస్థానం అక్కడే మొదలైంది. చేరకపోతే ఎలాంటి కథలు రాసేవాడినో, ఎన్ని కథలు రాసేవాడినో తెలీదు కాని చేరేక ఓ ముప్పై కథలు రాసేను.

సంస్థలో చేరడం ముప్పైఏళ్ళకు చేరేను కాని ప్రజా సాహిత్యంతో పరిచయం అంతకుముందు పదిహేనేళ్లకు ముందే ఏర్పడింది. సెల్ ఫోన్లు, టీవీలు మింగెయ్యకముందు భోజన సమయాలు మధ్యతరగతి ఇళ్లలో సాహిత్య సంభాషణలుండేవి. మా ఫాదర్ ఎకనమిక్స్ లెక్చరర్ అయినా సాహిత్యమంటే ఇష్టం ఉండేది. షేక్స్పియర్, బెర్నార్డ్ షా రచనల గురించి, ఆ నాటకాల్లోని పిట్టకథల గురించి చెప్పేవారు. మేక్బెత్, ఒథెల్లో నాటకాలు వింటూ పెరిగేను. అలాగే సాక్షి వ్యాసాలు లాటి రచనలు.

కాలేజీ రోజుల్లో చోడవరంలో వర్మ-నారాయణ వేణులు పెట్టిన ‘లైబ్రరీ స్టడీ సర్కిల్’ వల్ల అంకుల్ టామ్స్ కేబిన్, అమ్మ, ఉక్కుపాదం, పిల్లలకే నా హృదయం అంకితం, తల్లి భూదేవి వంటి అనువాద పుస్తకాలతో పాటు గురజాడ, చలం, కొకు, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, పతంజలి, చెరబండ రాజు, అల్లం రాజయ్య, వివి, శివారెడ్డి — వంటి రచయితల, కవుల పుస్తకాలతోపరిచయం.

నారాయణ వేణు ఇంట్లోని చిన్నపాటి లైబ్రరీ మాకు ఎప్పుడూ అందుబాటులో ఉండేది. ‘స్టడీ సర్కిల్’ చర్చలు చిట్టిబాబు, కృష్ణ, రాచకొండ శ్రీను – ఇంకా చాలామందికి ఉపయోగపడ్డాయి. ‘కుడి’ నుంచి ‘ఎడమ’కు — నా ప్రయాణం కూడా అక్కడే పూర్తయ్యింది. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో జర్నలిజం చదువుతున్నపుడు, ఆ తర్వాత మార్కిస్ట్ మేధావి- గొప్ప జర్నలిస్ట్ (చారిత్రక ‘ఈనాడు’ సమ్మెకు నాయకత్వం వహించిన) సుబ్బరాయుడు గారు ప్రిన్సిపల్ గా వున్న ‘ఉదయం’ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం లో చేరడానికి హైదరాబాద్ వచ్చేను. వచ్చేక కూడా సాహిత్యంతో సంబంధం కొనసాగింది. నిజానికి తొంభైల్లోని కఠినమైన రోజులను దాటడానికి పుస్తకాలు ఉపయోగపడినంతగా ఇంకేమీ ఉపయోగపడలేదు. దళిత అస్థిత్వాన్ని బలంగా కవిత్వంలో చెప్పడం అప్పుడే మొదలు పెట్టేడు నా రూమ్మేటు విల్సన్ సుధాకర్. బయట ప్రజాఉద్యమాల సంఘీభావ సభలు, ప్రజాసాహిత్య సభలు, ‘ద్వారకా’ సమావేశాలు, రూమ్ లో సుధాకర్ తో తీవ్రమైన, ఎడతెగని చర్చలు, తీవ్రమైన వాదోపవాదాలు. ఆస్బెస్టాస్ పైకప్పున్న రూమ్ ఎండా, చలీ, వానా — దేన్నీ ఆపేది కాదు. ‘ఉదయం’లో అన్నిరకాల వామపక్షభావజాలలతో వున్న రచయితలైన జర్నలిస్టులెంతమందో వుండేవారు. కిశోర్, తల్లావజ్జల శివాజీ, యార్లగడ్డ రాఘవేంద్రరావు, చైతన్యప్రసాద్ ల షిఫ్ట్ లో ఉద్యోగం. ‘ఉదయం’ హఠాత్తుగా మూతపడ్డాక, పత్రిక తెరిపించాలన్న ఉద్యమం సద్దుమణిగేక పతంజలి గారు ఎడిటర్ గా వున్న ‘మహానగర్’ లో ఉద్యోగం.

సుబ్బరాయుడి గారి దగ్గర ట్రైనింగ్, పతంజలి గారి దగ్గర పనిచెయ్యడం – అది కూడా వృత్తిలో చేరిన మొదటి ఒకటి-రెండేళ్లలోనే – ఒక గొప్ప అనుభవం. ప్రపంచ సాహిత్యంలో గొప్ప వర్క్స్ గురించి ఆయన దగ్గర నుంచి వినడం, నేర్చుకోవడం మరిచిపోలేని జ్ఞాపకం.
ఆ తర్వాత ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో చేరేను. వేణు బెంగళూరు నుంచి హైదరబాద్ కి షిఫ్ట్ అయిన వేణు-వనజ అప్పుడే పరిచయం. వేణు లైబ్రరీతో కూడా.

**

జర్నలిస్టులైన రచయితలకు బలమూ బలహీనతా — ఉద్యోగమే. ఉద్యోగంలో భాగంగా ఎన్నో విషయాలమీద రాస్తుంటారు. ఏదైనా రాయడం ప్రాథమికంగా కథ చెప్పడమే. వ్యాసాలు, వార్తలు, వార్తా వ్యాఖ్యలు, ప్రత్యేక కథనాలు — జర్నలిస్టులు ప్రతిరోజూ శక్తియుక్తులన్నీ వాడి కథలు రాస్తూనే వుంటారు. ఈ ప్రాసెస్ లో విడిగా రాయాలన్న కోరిక తగ్గిపోతుంది. మార్క్వెజ్, పతంజలి గారి లాంటి అసాధారణ జర్నలిస్టుల సంగతి వేరు. చాలా గొప్పగా కథలు, మంచి కవిత్వం రాయగలిగినా కేవలం డెస్క్ ఉద్యోగ బాధ్యతలకో లేదా రిపోర్టింగుకో పరిమితమైపోయిన వాళ్ళు ఎంతో మంది వున్నారు. కొన్ని కథలు, కవితలు రాసి తాము రాయగలం, ఒకప్పుడు రాసేమన్న సంగతి మరిచిపోయిన వాళ్ళూ వున్నారు.

విరసంలో చేరకుండా ఉంటే బహుశా నేను ఎప్పటికీ కథలు రాసివుండేవాడిని కాదేమో. నా మొదటి కథ ‘క్షుద్రక్రీడ’. ‘ఆదివారం ఆంధ్రజ్యోతి’లో వచ్చింది. ఊపిరాడనివ్వని ఉద్యోగంలో, కుర్చీల కోసం జరిగే ఆట చుట్టూ తిరిగే ఎన్నికల ప్రహసనమే ప్రజాస్వామ్యంగా చలామణీ అవుతున్న చోట ప్రజలకోసం పనిచేస్తున్నవాళ్ళని ఎంత సునాయాసంగా మట్టుబెడుతున్నారో, జర్నలిస్టులు అలాటి వార్తలను ఎంత ఉదాసీనంగా చూసి ఎంత మామూలుగా రాసి సరిపెట్టుకుంటున్నారో – చెప్పడానికి రాసిన కథ. కథ రాసినా అది కథ అవునా కాదా , ఎవరైనా నవ్వుతారేమోనని – ‘లాగుడుబారిసి జాంబ్రి’ అన్న కలంపేరు పెట్టుకుని ఉమ (ఉమామహేశ్వరరావు)కు పంపితే పబ్లిష్ చేసేడు. అది ‘కథ’ సిరీస్ లో ప్రచురితమైంది.

రెండో కథ ‘ఒక జననం గురించి’. పౌరహక్కుల సంఘం నాయకుడు, మంచి మనిషి పురుషోత్తంని నగరం నడిబొడ్డులో అందరూ చూస్తుండగా పంతొమ్మిది ముక్కలుగా నరికేసేరు. ఈ ప్రభుత్వ హత్య లక్షల మందిని దుఖభరితుల్ని చేసింది. ఊళ్ళకు వూళ్ళు రోదించాయి. సరిగ్గా ఆరోజుల్లోనే మర్క్వెజ్ రాసిన హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ చదువుతున్నా. దేశాలు వేరైనా సంక్షుభిత సందర్భాలు ఒక్కటే. అదృశ్యమైన వ్యక్తులు, మనల్ని వీడినా వెంటాడే మనుషులు, మనల్ని కనిపెట్టుకునే ఆలోచనలు.

నిన్నటిదాకా కలిసి తిరిగిన, తోడుండిన, భుజం తట్టిన, ప్రజల బాగు తప్ప మరేమీ పట్టని మంచి, గొప్ప మనుషుల్ని హఠాత్తుగా ఎవరైనా మాయం చేస్తే వాళ్ళ ఊసులు, వాళ్ళ ఆలోచనలు – ఎక్కడికి వెళ్తాయి?! మనల్ని అంటిపెట్టుకునే వుంటాయి – ఈ ఇతివృత్తంతో రాసిన కథ. నా హృదయానికి దగ్గరైన కథ ఇప్పటికీ. అలాగే, ‘పూల గుర్తులు’ కథ.

ఈ కథ నేను విరసంలో వుండడం వల్లనే రాయగలిగానని అనుకుంటా. ‘ఈ దుర్మార్గాన్ని తప్పనిసరిగా రికార్డ్ చేయాల’న్న బాధ్యత అక్కడ వుండడం వల్లనే సాధ్యపడిందనుకుంటా. పనిగట్టుకుని ఇలా రాయాలని, అలా రాయాలని ఎవరూ చెప్తారని కాదుకాని ఆ వాతావరణం రచయితకు ఉపకరిస్తుంది. విరసం రచయితల స్వేచ్చని కట్టడి చేస్తుందని, సృజనాత్మకతను దెబ్బతీస్తుందని అంటారు కాని నాకు అలాటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు. ఇది రాయమని అది రాయొద్దని అన్నడూ ఎవ్వరూ చెప్పలేదు.

నిజానికి చారిత్రక సందర్భం వల్ల ఇరవైఏళ్ల క్రితం – దాదాపు ఇదారేళ్ళ పాటు – సాహిత్య సంబంధమైన కార్యక్రమాలకంటే రాజకీయకార్యక్రమాలపైనే దృష్టి పెట్టిన సందర్భం అది. విరసం మీద ఇది ఒక ప్రధానమైన విమర్శ కూడా. కానీ తప్పదు. సాహిత్యం సాహిత్యం కోసం మాత్రమే కాదుకదా. రచయితలు నిర్వర్తించాల్సిన బాధ్యతలుంటాయి. ఆ పనులు చెయ్యడం కూడా బాధ్యతగల రచయితకు, సంస్థకు ఒక ముఖ్యమైన మాండేట్ అనుకోవాలి.
కానీ ప్రజావుద్యమాల అవసరాల కోసం సంస్థ చేసిన పనులు, అందులో భాగంగా చేసిన పనులు రచయితగా ఎడ్యుకేషన్ కోసం ఉపయోగపడింది. ఆ తర్వాత ఫోకస్డ్ గా పెట్టుకున్న కథా వర్క్ షాప్ లు, రాజయ్యగారి లాంటి unassuming రచయితల సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి.

అంతకుముందే చదివిన కొకు, రావిశాస్త్రి, కారా, పతంజలి, చెర, రాజయ్య, వివి రచనలు మళ్ళీ చదవడం, ఉద్విగ్నభరితమైన, ఉత్తేజకరమైన ప్రజావుద్యమాలను దగ్గరనుండి చూడడం – రచయితగా మౌల్డ్ చేసుకోడానికి ఉపయోగపడ్డాయి నాకు.

రచయిత ఏం చెయ్యగలడు? సంక్షోభ కాలంలో ప్రజల జీవితాల్ని, యుద్ధ సమయాల్ని, యుద్ధకాలంలోని ప్రేమల్ని, బాధల్ని, కన్నీళ్లను, ఉద్వేగభరిత సందర్భాలను, వేడుకల్ని,వేదనల్ని, పిల్లల ప్రపంచాన్ని, పిల్లల పట్ల పెద్దల తీరుగురించి, జర్నలిస్ట్ జీవితం గురించి – రికార్డు చెయ్యాలి. ఇలా రికార్డు చేయాలన్న బాధ్యతని గుర్తుచేసి నడిపిస్తున్నది విరసం.

“ప్రజలకి, సత్యానికి నువ్వు జవాబుదారీవి. ఒకవేళ నువ్వు అనుకున్న వస్తువుకి, అందులోని సత్యానికి – నువ్వు నమ్మిన భావజాలానికి ఎప్పుడైనా సంఘర్షణ వస్తే ఆ వస్తువుని రాయకుండా వదిలెయ్యి. సత్యాన్ని ఎప్పుడూ కుదించకు,” అని కారా మాస్టారు చెప్పిన సలహా; ఇంకా ‘రచయిత అన్నవాడు మంచికి అపకారమూ – చెడుకి ఉపకారమూ చెయ్యకూడదూ’ అన్న మహారచయిత రావిశాస్త్రి గారి సూచన – నాకు conscience keepers.

రచయిత, జర్నలిస్టు.

Leave a Reply