బాపూ…! నేను నీ జీవన కొనసాగింపుని…

బాపూ…

నన్నెవరైనా ‘మీ తండ్రెవరయ్యా’ అని అడిగితే…
నెత్తికి తువ్వాల
పెయిమీద బురద చుక్కల పొక్కల బనీను
నడుముకి దగ్గరగా గుంజికట్టిన ధోతి
జబ్బ మీద నాగలి
గర్వంగా చెప్తాను ‘నా తండ్రి ఒక రైతనీ!’

తన చెమట చుక్కలతో ఈ నేలని సారవoతo చేసినోడు
తన పిడికిలితో ఈ దేశానికి నాగరికతని నేర్పినోడు
అతడు జీవితాన్నే పోరాటంగానెరిగిన సాగిపోయే నాగలికొన
అతడు దెబ్బలు తింటూనే కరిగిపోతూ వాడిని కోల్పోని గడ్డపార

అతడు బొజ్జలు నిమిరే
మీసాలు మెలేసే పరాన్నజీవి కాదు పండితుడు కాడు
అసమాన సమాజన్నెలా నిరంతరoగా కాపాడాలో ప్రవచనాలు చెప్పే మత గురువు కాడు
అతడు వాస్తవంలో బతికే ఒక బుద్ధుడు
అతడు తనతోబాటు కింది వర్గాలు ఎదగాలని కోరుకొనే సాహు మహారాజు వారసుడు
అతడు పనినే జ్ఞానంగానెరిగిన వాడు
అతడు ఆలోచనలనకి ఆచరణకి తేడా తెలియనివాడు
అతడే నా తండ్రని నిన్ను గర్వంగా చూపిస్తాను బాపు!

నా బాపు…!
రెండు కాళ్లు దూరంగా పెట్టి
నడుముకు రెండు చేతులు ఆనించుకొని
మాటకైన పనికైన సిద్ధమనే కట్టెలాంటి నీ శరీరపు పోజు
కూచున్న కాడికెళ్ళి లేచి జబ్బమీది తువ్వాలనొకసారి తీసి
పచ్చ జెండాలాగా గాల్లోకి ఊపి చెమట చుక్కలింధనంగా సాగిపోయే శ్రమ రైలు బండి లాంటి నీ దేహం
రెండు వేళ్ళ మధ్య కాకుండా రెండు వేళ్ళ కొసన పట్టి కండ్లు చిన్నగా చేసుకుంటూ ముక్కులకెళ్ళి పొగ తీస్తూ
తలఊపుతూ నువ్వు తాగిన ఫోటో బీడీ
నా జీవితంలో నా మొదటి కామ్రేడ్ వి బాపు నువ్వు!

బాపు…!
ఎమర్జెన్సీ టైమ్ లో సంజయ్ గాంధీ బలవంతపు కుటుంబ నియంత్రణలు చేయిస్తే
నేనొక్కడినే నా అయ్యకి, నాకొక్కడేనా? అని ఇంటెనుక గోడ దునికి పరిగెత్తి నా కోసం
రిస్క్ తీసుకున్న నా సూపర్ మాన్ వి నువ్వు బాపు !
ఐదో కాన్పుగా చిన్నక్క పుట్టినాగాని నా పుట్టుక మీద నమ్మకంతో
నా కోసం ఎదురుచూసిన నా ఈ జన్మ ప్రదాతవి నువ్వు బాపు!!

అప్పులిచ్చిన సేట్ పంట చేతికి రాక ముందే ఇంటికొచ్చి అవ్వనక్కని తిడితే
కోపమొచ్చినువ్వు సప్పసిప్ప సంపితే అందరు పంచాయితీ పెట్టి నిన్నంగదోలుటకు కాళ్లు పట్టుకొని క్షమాపణ అడగాలన్నపుడు
నిబ్బరంగా నిలిచిన నీ గుండె ఆత్మహత్యలు చేస్కుంటున్ననేటి రైతులకు ఆదర్శం బాపూ!

పాత ఖాతా పెరిగిపోయింది ఇక కడితేనే ఉప్పు పప్పన్నపుడు పుట్లు పండించే రైతింట్లోనే
బియ్యం లేక మేమంతా నీళ్ళు తాగి పన్నప్పుడు
దొర పాలేరు నర్సయ్య మామిచ్చిన కంకులు
అర్దరాత్రి తెచ్చి సాయమానుల కాలిస్తే పొగత్తదని
నడింట్లో కుంపట్ల పెట్టి కాల్చి తినపెట్టిన నీ బాధ్యతెంత గొప్పది బాపూ!
నువ్వు నేర్చుకున్న శాస్త్రం
నేను చదివిన చదువు రైతు బిడ్డలమైనందుకు
అప్పు కాగితాల మీద దస్కత్ ఇట్యాల వెంకటయ్య
కింద దస్తూరి ఇట్యాల కిషన్ దేనాయే
శ్రమవిలువ దోపిడీని చెప్పని చదువులలో
బారువడ్డీ చక్రవడ్డీలు బతుకు పుస్తకములనే నేరిస్తిమి.

పైసల్లేక పైప్ లైనెయ్యలేక ప్రపంచములోనే ఎత్తైన ఒడ్డు కం నీటికాలువని రెండు చేతులతోని బొచ్చె మీది ఎంటుకలు మొత్తం ఊడిపోవాంగ తట్ట పారవట్టి మోసి కట్టి
మానవ శ్రమకి మించిన మహాద్భుతము లేదని లోకానికి చూపినోడా !

పుట్టెడు కట్టపడి కొట్టమటువంటి రెండిండ్లు కట్టితివి
తట్టెడు ఇసుక పిడికెడు సిమెంట్ వాడకుండానే
మన పొలములోనే సాంచాలతోని ఇటుకలు తయారు చేసి వాము పెట్టి కాల్చితిమి
అక్క పెండ్లుందని ఇంటిలోపల కూడా రావ మట్టితోని గిలాబింగ్ చేయించి లోకము నోరెల్ల పెట్టంగా
చేసి చూపించిన ఓ పర్యావరణ మిత్రుడా !!

ఎండాకాలం పూట పశువుల కోసం నీటి తొట్టెల నిర్మాణమట ! దానికి కోట్ల బడ్జెటట !!
తెల్లారంగ పండ్ల పుల్లేసుకొని బాయి కాడికి పోయి
బట్టలు పిండుకొని అవ్వెండే వరకు తానము చేసి
అచ్చినోల్లందరు కూడా అదే బోదార్ల మునుగుతుంటే
బీడు అంతా నీళ్ళు పారి పశువులొచ్చి తాగి పంటే
బీడంత నీటితోట్టెలే తయారయ్యే
పశువులు పెండ పెట్టి మన సాయమేమి అవి ఉంచుకోకపాయే.

నీకిష్టమని నేను కూడా నాకు నచ్చిన హీరో కృష్ణం రాజు అని కొండవీటి నాగులు సినిమా చూసి మా దోస్తులతో చెప్పుకుంటే
చిరంజీవి నాగార్జునల ఫాన్స్ వాళ్ళు విరగబడి నవ్వితే…
నవ్వనియ్యిపో బిడ్డా తిరగబడ్డోడే నీ హీరో ఎప్పటికని చెప్తివి

మన ఇంట్లోకి అన్న టీవీ తెచ్చినంక ఉదయభాను ప్రోగ్రామ్ చూసుకుంటా కూచున్న మధురమ్మ సుశీలమ్మలు
“వెంకన్నా!గీ ముండకైతే గింతంత టెంపర్, డిళ్ళకి లేదు బిడ్డా”
అనంగానే మేమంతా వక్కడ వక్కడ నవ్వితే…
” ఏందే….! మల్లగిట్లా మాట్లాడేరు మీ అయ్యలా…
మన పోరి మన సుల్తానాబాద అరుణమ్మ డాక్టర్ బిడ్డ గాడిదాక పోయెగురుతుంటే …
గంత మందినెగిరిత్తుంటే గంత మందిని సంబాలిత్తందంటే సంబరపడాలే గాని పేర్నాలపెడుతరానే మీ అయ్యలా… “
అన్న నీకన్నపెద్ద ఫెమినిస్టెవడు బాపు నా ముందర

మనతో మంచితనములేని కాక (చిన్న బాపు ) బిడ్డ గురించి వాళ్లత్త తప్పుగా చెప్తుంటే నోరెళ్ళపెట్టి వింటున్న అవ్వకి
గాంధర్వులు దుర్యోధనున్నీ కట్టేత్తే విడిపించిన పగదారి అర్జునుని కథ చెప్పి హితబోధ చేసిన, నిన్ను మించిన గురువెవరు బాపు నాకు.

పట్నం పోయినపుడు కొని తెచ్చుకొని సందుగల దాచుకుని చదివిన నీ వెనుకటి దినపత్రికలు చూస్తే
నీ జిజ్ఞాస ముందు నీ జీవితేచ్ఛ ముందు చూసుకుంటే మెరుగైన వసతులున్న నేనెంత అల్పున్ని బాపూ!

పొయ్యి అంటుపెట్టాలంటే అగ్గిని కూడా కుమ్మరి పెంకలో పక్కింటి నుండి అడుక్కచ్చుకునే మంచి రోజులాయే మరి
నీ అoగి కీసలో రూపాయి ఉంటే అదే మన ఇంటి ఆస్తి అనుకునే కాలము అది
బతుకమ్మ పండుగప్పుడు సోపతులందరు తుపాకీలు పటాకలు కొనుక్కుంటే నాకు కావాలని అడిగితే
ఏమీ చెప్పకుండా పొలము దగ్గరి నుండి చెరువు కట్ట మీదికి తీసుకపోయి
సిపాయోల్లు (సి.పి.ఐ.) చేస్తున్న రెడ్ ఆర్మీ ట్రైనింగ్ చూపించి నన్ను నేను మర్చిపోయేలా చేసినవు
ఊరిలో రాత్రి నడుస్తున్న ఓపెన్ టాకీస్ సినిమా చప్పుడు వినవస్తుంటే నా మనసునెరిగి నన్నో పద్యము పాడమని అడిగి
నేను అల్పుడెపుడుపల్కు… అని మొదలుపెడితే నువ్వు ఉపకారికినుపకారము…, అని అందుకుంటే
గంటల కొద్ది మన బాధల్ని వాకిట్లో గాలిలో ఊదినమే గాని మనమెప్పుడు కష్టాలకు లొంగలేదు బాపు.

మనము పొలము దగ్గరున్నపుడు
“అరేయ్…! గడ్డపోడా ఇటు రారా “
అని నిన్ను వయసుకైనా విలువివ్వకుండా దొర కొడుకు పిలిచినప్పుడు
“నువ్వేవడివిరా అక్కడ్నేఉండు నేనత్తున్న “
అని దొరకొడుకునురికిచ్చిన అన్న దైర్యం వెనుక ఉంది
నీ ధర్మాగ్రహధైర్నమే కదా బాపు!

మేమేదైనా తప్పు చేస్తే తప్పుగా మాట్లాడితే
పొద్దాంత పోయోచ్చి కడుపు మాడ్చుకొని పండి మళ్ళీ పనిచేస్కుంటూంటే
ఆ ఉపాసము చూసి మా తప్పు తెల్సుకునేలా చేసిన గొప్ప అహింసా సాధకుడివి బాపు నువ్వు మాకు.

నా ఎనిమిదేళ్ల వయసులోనే నీ దోస్తులతో కూడి యాదగిరి గుట్టకి పోతే అందరూ సింగల్ గా వస్తే నువ్వేమో నన్నెంబడి తీసుకపోతివీ
నీ జబ్బ మీద ఎక్కి మానేట్ల విన్న కథల నుండి
ఎడ్ల బండి మీద పొత్కపల్లి మార్కేట్ లో మక్కలు అమ్ముడు వరకు
నాకు రోజు కొత్త లోకాన్ని చూపించితివి.

నా ఎనిమిదో తరగతిలో నన్నోక్కడినే విజయవాడ ఉభయ కమ్యూనిస్టుల సభకి పంపితివి
నా పద్దెనిమిదో ఏట దసరా పండుగత్తే రెండ్వందలిచ్చి దోస్తులతో కలిసి తాగితినమంటివి
చదువుకునేకాడ ఒక్కడివి టిఫిన్ చేయకున్న గాని
అవే పైసలతోని నల్గురికి చాయే తాగిపియ్యమంటివి
వ్యక్తి స్వేచ్ఛని గుర్తించే నీ వ్యక్తిత్వమెంత గొప్పది బాపు!

ఏ వరుసవాల్లైన సరే మనుషులందరికి నీకంటే చిన్నోల్లకి వెంకన్నవయితివీ…
పెద్దోల్లకి కొడుకా… బిడ్డ… వెంకన్నవయితివి
అందరి బాధలు అందరి కడుపుల కువారమంత నీకే చెప్పుకోవాలని ఎదురుచూసేది
నువ్వెంత గొప్ప మనిషివైతే నీకలా చెప్పుకుంటరు చెప్పు బాపూ !

నువ్వు పంచాయితీలెన్నడు చెప్పలే…
కచ్చీరు కాడ కూచోలే…
కానీ నువ్వు తొవ్వపొంట భుజాన నాగలెత్తుకొని పోతుంటే
నీ చెవున పడంగనే…
తను చంపిన మొదటి భార్య బిడ్డనే అట్లనో ఇట్లనో బ్రతికి తండ్రి దగ్గరికొచ్చి తనకింత వాట ఇయ్యమని అడుక్కుoటుoటే
ఎవ్వతివే లంజే నువ్వని తిడుతుంటే జనసభలో ఎంటుకలు గుంజి కొడుతుంటే
” ఒరేయ్ దొరోడా! ” అంటూ నాగలి కింద పడేసి చెప్పుతీసి కొట్టబోయి కండ్లెర్రజేసి మల్ల నాగలి భుజాన్నెత్తుకొనిపోయి
సకలము సబ్బండ మంది బాధ్యతని గుర్తు చేసిన నీ తీర్పు
ఏ పెద్ద మనిషి చెప్తడే బాపు !

రోహిణి చొర్రంగనే దుక్కి దున్ని ముర్కసిలలో గింజలు జల్లి
చిన్నపూసాలలో ఎల్లితే పెసాల్లు ఎల్లకుంటే పశువులకు దాణగా పంట లేకుంటే
బురదలోనే కలదున్నిపంటకి పాటులాగా( ఎరువు )…,
భూదేవినైతే వదిలి బతుకవు
కాలము మన్నిస్తే అశ్వినికార్తి పంట కూడా పండిస్తాననే ఉషారుతనము నీది
ఇంటిముంగట ఊరవిశ్కెలకు వరిగొలుసు…
పంటపైన పడితినే పురుగులకు మద్యలో బంతిపూల చెట్లు
పచ్చని పైరుని చూసి ఆకలిగా ఉరికొచ్చే పశువులకు
దడి అవ్తల నీళ్ళు ఎక్కువ పారించి పెంచిన గడ్డి
ఎంత పెద్ద సైంటిస్టువే బాపు నువ్వు
ఎంత భూతదయనే బాపు నీకు !

మోటకొట్టి గూడేసి ఏతాముతొక్కి ఆయిల్ ఇంజిన్ నడిపి కరెంట్ మోటార్ నుండి కమాండింగ్ మోటార్ వరకు
పట్టుకార స్క్రూడ్రైవరు టెస్టర్ పదిపైసల పాణా నుండి ఛైన్ పాణా వరకు నీ చేతిలో తోలుబొమ్మలాయే
ఎంత పెద్ద ఇంజనీరువే బాపు నువ్వు !
ఏ చదువులన్న అడుగుతున్నాయా నీ అనుభవాన్ని నేర్పమనీ.

నారుపోసి నీరుపెట్టి కోతకోసి కుప్పపెట్టి
సకల కులపనులొల్లకి, కలిమెడిగా ఉండేటోళ్లకి
కల్లం కుప్పకాడికొచ్చిన అచ్చెగాల్లకు బుచ్చెగాల్లకు లేదనకుండా కుంచము పట్టి కొలిచి …
షావుకారికమ్మగా మిగిలిన చిన్న పిరమిడ్ వడ్ల కుప్పమీద జారఒరిగి బనీన్ విప్పి ఒక జబ్బ మీద వేసుకుని కాలు మీద కాలేసుకొని చేతులు పైకి చాపి ఎల్లెలుకల పండి నువ్వు సూర్యుడి దిక్కు
తీక్షణంగా చూస్తుంటే…
ఆయనేమో మబ్బుల చాటుకి దాక్కుంటుoటే…
ఎహె పో….!
యూ ఆర్ మై ఫరెవేర్ హీరో బాపు !
అదనపు విలువ దోపిడీని అరికట్టగా
సామ్యవాధ సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన నా లెనిన్ వి బాపు నువ్వు !

నీ దుక్కి దున్నుడెంత సక్కదనము బాపు
కోoడ్ర కోoడ్ర కి భూదేవి వాకిట్ల కొత్త ముగ్గు గీసినట్లు
నీ వడ్ల మండే పోసుదెంత నిండుదనం బాపు
వాయిలాకులు ఎండుగడ్డిపెట్టి పొదివిగా అదే నీ గుండె అయినట్లు
నీ మొలుక అలుకుడెంత సక్కదనము బాపు
ఆకాశము నిండా చుక్కల్నిసమానంగా పరిచినట్లు
నీ పిండి (ఎరువు ) జల్లుడెంత సుందరము బాపు
వాన చినుకులు నేల మీద ఒకే తీరుగా కురిసినట్లు
నీ బ్రతుకెంత అందమైనది ఆరోగ్యవంతమైనది నిష్కల్మశమైనది బాపు
పచ్చని వరి పొలము లయబద్దంగా తన్మయంగా తలలూపుతూ కదిలినట్లు.

ఆయిటి మూనంగనే ఉడుకుడుకు పెంట తవ్వి కచ్చురములో పోసి
మడిమడి కి నువ్వు కుప్పలు కుప్పలు పోత్తాంటే బండినొడుపుగా నడిపింది నేను.
చెరువు కట్టపైనుండి మట్టి బండ్లో తెస్తాంటే కట్ట స్పీడ్ గా దిగి బండి లావాకు పడితే
నువ్వు నొగలు పట్టి కిందికి గుంజుతుంటే
చెంగన కిందికి దునికి కనాలు దొత్తెలు తప్పించి ఎద్దులను ఉరి నుండి కాపాడింది నేను.
నాట్లెసేముందు నువ్వు జంబు కొడుతుంటే
పొలము ఒక్క లెవెల్ ఉండడము కోసం అవసరమైన చోట బరువు కోసం
చిన్న పోరడినైనా నీ వెంట బురదల నడుచుకుంటూ జంబు ఎక్కింది నేను.
నారు మోసింది నేను
వరి కోత కోసింది నేను

చేదబావి ఎండి నీళ్ళు కరువైతే అంతా లోతులో పొద్దంత ఉండి అమిది (అడుగు మట్టి) తవ్వి తట్టలో నింపి పైకి పంపింది నేను.
కొడవండ్లు, గొడ్డల్లు, గడ్డపారలు, పారలు సర్పియ్యడానికి కమ్మరి కుమారస్వామి మామ ఇంటికి పోతే
కమ్మరి కళాత్మకంగా వంచుతుంటే
చెరి కొద్దిసేపు మనము సుత్తె పట్టి కొట్టినము
కొలిమిని లయ కొద్ది తింపినము.
వడ్ల బ్రహ్మయ్య తాత దగ్గరకు పోతే
దుగోడ బర్మ పట్టి సగము పని చేసింది నేను

కుమ్మరి రాయమల్లు తాత కుండలు చేస్తుంటే
మట్టి పెడ్డల్నిమెత్తగా పగలకొట్టుడు మొదలు
మట్టి నీళ్ళు పోసి తొక్కి గారె పైకి ఎక్కించి
కుండ తయారవుతుంటే చెడకొట్టుతనమో కొత్త రూపము కోసమో,
చూడకుండా వేలుపెడుతూ కట్టేపెడుతూ
ఎండపెట్టి వాముపెట్టి కాలినంక బూడిదలోంచి దగ్గుకుంటూ
కుండల్ని తీసి కాలిన రంగుబట్టి ఒకదిక్కుపెడుతూ
వాళ్లింట్లోనే తింటూ…
ఊరికి పోయేటపుడు సాకలి కనుకవ్వకి వెయ్యక
రిన్ సబ్బు పెట్టి నువ్వు పక్కన పైడితే పువ్వొలే బట్టల్ని పిండింది నేను

ఖాళీ పిండి బస్తాలు (ఎరువు) చీరి మనము నువ్వు పగ్గాలు వేస్తుంటే
పురిలు పురిలుగా గట్టిగా గుంజిపట్టింది నేను.
నువ్వు మోటార్ కి పాకీన్ తాడెక్కిస్తే
మోటారుకి గ్రీజు పూసింది నేను

నువ్వు బండి గీర తీసి కందెన పూయాలంటే
ఉపకారి పెట్టింది నేను

నువ్వు ఏటి కాలువ నీళ్ళు ఎగేసుకస్తే పొలములోకి మడువ కట్టింది నేను.
నాకు నువ్వు నేర్పనీ పనేమిటి?
చెప్పని విద్యేమిటి??
అరొక్క సార్గము నేర్పితివి
నూటొక్క కార్యములల్లో నడిపించితివి.
పాళోల్లతో పగోళ్లతో ఎక్కడ కొట్లాట వస్తదోనని
నీ కోసము కాకున్నా మా కోసము
నడిచే పొలము ఒడ్ల కింద,
పండే మంచం పట్టి కింద,
ఉండే ఇంటి దర్వాజ మీద అడ్డంగా
ఎక్కడికక్కడ గుత్ప కట్టెలు గొడ్డల్ని ఆయుధాలుగా దాచి ఉంచి
జీవితములో అన్నీ రకాలుగా యుద్ద శిక్షణనిచ్చి రహస్యాలు నేర్పిన ఓ మహాసేనా !
కొట్లాట అనివార్యమైనపుడు ఎయ్ ఎయ్ మంటూ ముందుకే తప్ప వెనుకడుగేసేది లేదని
తలలు పగిలిన రక్తమోడిన భీకర స్ఫూర్తి వాక్యాలు పలికే ఓ నా మహావీరా !
ఓ మహామంత్రి నా తండ్రి !
నన్నొక వీరున్నీ శూరున్నీ మహాపరాక్రమవంతునిగా తీర్చిదిద్దిన నా బాపు…!
నేనంటే నీకెందుకయ్యా అంతా ద్వేషము?
నీకిష్టమని..
నాకు కష్టముండొద్దనీ…
నన్ను నా మట్టివాసనకి దూరము చేసి
నా కష్టానికి (శారీరక శ్రమకి) దూరము చేసి
నా కాళ్ళు చేతులు విరగ్గొట్టి
నన్నో చేతకానివాన్ని చేసి
నన్నో ఆలోచనారహితున్ని చేసే
నాకే మాత్రము సంబంధము లేని
నాకే మాత్రము నిపుణత లేని
నాదికాని లోకములోకి
ఈ నప్పతట్ల లోకములోకి
నల్లికుట్ల లోకములోకి నన్ను పంపించితివి

నేను నేనుగా లేని ముఖముపై లేని భావాల్ని పులుముతూ
అధర్మాన్ని ధర్మంగా భ్రమింపచేయుటకు
అసత్యాన్ని సత్యంగా నమ్మించుటకు
తలకిందుల లోకాన్ని వాస్తవమని నిలబెడుతూ
నా వంతు ఈ లోక కళ్యాణార్థమై(?) కరిగిపోతూ కుమిలిపోతూ…
నీకు మన మట్టికి నా జ్ఞానానికి నా బతుక్కి దూరమవుతూ
దుక్కశిల్లుతూ….,

ఇగో…,
వినుకో….!
నీ అవ్వా … నీ … ఇట్యాల లచ్చవ్వ కొడుకా !
భూమి నలు చదురాలనీ నమ్మి
ఎద్దు గుద్ద పొడ్సుక ఎతలు పడoగా
ఎదుగు బొదుగులేని జీవితం నీ కొడుకుకి తప్పియ్యాలనీ చదివించి
నీ భుజాలమీదికెల్లెత్తి ఊరునుంచి దాటించి
పట్నముల పడగొట్టిన వెంకటయ్య పటేలా !!
భూమి కంటికి కనిపించే నాలుగు మూలల మడికట్టు చెక్కకాదు
పండితే తినడానికి ఎండితే పడావుంచి ఉపాసముండడానికి
ఇదో గుండ్రని సుడిగుండాల వలయాల వింతని నీకెలా తెలిపేది ?
ఇది అధికార సూర్యుడి చుట్టూ తిరిగే పాలపుంతని నీకెలా అర్ధం చేయించేది ?
భూమెంత గుండ్రమో బతుకంతే
తిరిగి తిరిగి గాడికే వచ్చేతట్లుందనీ నీ దగ్గరకెట్లా వచ్చేది ?

నీ కొడుకేమి ఇక్కడ సుఖంగా లేడు బాపూ !
స్విమ్మింగ్ పూల్ కి పంపిస్తే వాటర్ లో క్లోరిన్ శాతము ఎక్కువైందని చిన్నదానికి చెవిలో నొప్పి వచ్చే..,
కొడుక్కేమో ఎండాకాలము కూలర్ వాడితే ప్రమాదము ఉబ్బసము వస్తాదనపడితిరి డాక్టర్
చుట్టూ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు లా అగ్ని గుండము మద్య,
చెట్టు పుట్ట రాయి రప్పని మాయం చేసే
దుమ్ము దూళి విధ్వంసపు ద్వీపం మద్య ఎలా బ్రతకాలి మేము మరి?
చిన్నపుడు నువ్వు నాకు నా మొలదారము పట్టి ఈత నేర్పలేదా?
ఎండాకాలము పూట ఇంటి బయటనే పండలేద చెట్ల కింద ఆరుబయట?
పిల్లల్ని బడికి ఆటొలో పంపక నడక ద్వారానో సైకిల్ ఇచ్చి పంపుదామంటే
నామోశాయే

మోటు కట్టం తెలియని జాగర్త తెలియని పిల్లలనీ
భయము కూడా కావట్టే
రెండు కిలోమీటరుల నా చిన్నప్పటి సర్కారు బడి కి లంచ్ కి 50 నిమిషాల టైమ్ లోపే ఇంటికొచ్చి నడకతోనే
తినిపోయి నడుమలనే నన్ను చూసి ఒర్రిన ఇంటి దగ్గరి ఎద్దులకు నీళ్ళు పెట్టి గడ్డి వేసెటోన్ని
యూనివర్సిటీ నుండి ఇంటికొస్తూ పోత్కపల్లిలో ట్రైన్ దిగి 8 కి.మీ. మడక గుట్టల్లో మద్యలో గుడ్డేలుగులున్నాయని తెలిసిన దైర్యంగా ఒక్కడినే నడిచచ్చేటోన్ని
ఇపుడు కోతి ఇంటికత్తేనే భయమైతoది
మనిషులని చూస్తేనే మాయల ఫకీర్ల లెక్క అగులుబుగులవుతుంది.

మహా శక్తివంతుడైన మనిషి మూలుగని సమూలంగా పీల్చే
మహాద్భుతమైన మేధో సంపన్నుని బుద్ది గుజ్జుని గుంజి పిప్పిచేసే
శ్రమకి దూరం చేసి
దోపిడీ యంత్రాంగంలో భాగం చేసి
దేనికి పనికి రానివానిగా చేసే మనిషిలో జరుగుతున్న ఈ విధ్వంసం
ఏ సత్యనాశనానికీ అభివృద్ధి ?
ఏ చావడికొట్టానికీ సంస్కృతి??
నాకు బతకాలని ఉంది బాపు !
మట్టి మనుషుల గట్టిదనపు
జీవకళ ఉట్టిపడే ముఖముతో…
నాకు మంచి తిండి తినాలని ఉంది బాపు
శరీరములో ప్రతి కణము శ్రమతో అలిసి నిజమైన ఆకలితో నోరెళ్ళబెట్టినపుడు
పని మద్యలో మనం ఒడ్డు మీద కూర్చొని ఎర్రటెండల్లో తిన్న చింతకాయ తొక్కు బువ్వనీ
నాకు చూడాలని ఉంది బాపూ ఇంట్లో రూపాయి లేకున్న
ఏ రంధీ లేకుండా కట్టం చేస్కోని బతికిన కుటుంబాలని.

బాపు…!
గిచ్చితే తోలే తప్ప కొవ్వు చేతికి దొరకని ముసలెద్దులాంటి నీ దేహం
ఈ దేశ మూల శ్రమ సంస్కృతికి చిహ్నం
కొవ్వుపట్టిన రోగపు పరాన్నబుక్క, తాబేదారు తాబేలు మా శరీరాలు
దోపిడీ విష సంస్కృతి ప్రదర్శనకి నిదర్శనాలు.

అందుకే …
మన ఊరికి రావాలని ఉంది బాపు…!
నీ గతానికి కొనసాగింపునే కానీ
నీ భవిష్యత్ నై ముందుకు పోయే తొవ్వైతే దొర్కుత లేదు.
నా గతానికి నా నేలకి నా గాలికి నా కార్యక్షేత్రానికి వచ్చి
నీలా బతుకుతూ…
నీ దగ్గర కొడుకై పుట్టినందుకు నీకు సేవ చేస్తూ ….
జీవితాన్ని జీవిత్వీకరిస్తూ సాగిపోయే వేళ
నాకి లోకమిచ్చిన తప్పుడు భుజకీర్తులు ఎక్కడికక్కడ ఊడిపోయి
నాకంటూ ఏమీలేని మట్టి వాసన మనిషిలా
నీలా సాగిపోతుంటే…
ఒకడుగు ముందుకి రెండడుగుల వెనక్కి చూపుతో నడుస్తుంటే…
ఎవ్వరన్నా నన్ను
“ఎవరయ్యా నువ్వు?” అని అడిగితే ….,
గర్వంగా చెప్తాను
చెప్పుకోడానికి గర్విస్తాను
నీ సంస్కృతిని ముందు తరాలకి అందించే మార్గంలో
నీ జ్ఞానంతో మనిషితనం నిలబెట్టే ప్రయత్నంలో….
” నేనయ్యా ఇట్యాల వెంకటయ్య కొడుకును ” అని
” నేనయ్యా శ్రమించే మనిషిని, రైతు బిడ్డను” అని.

పుట్టిన ఊరు: కనగర్తి. ఓదెల మండలం, పెద్దపల్లి జిల్లా. SRR డిగ్రీ కాలేజీ కరీంనగర్ లో బీ.కామ్ . చదివి కాకతీయ విశ్వవిద్యాలయంలో బీ.ఎడ్ చేసారు.
సాహిత్యం పరిచయం: చిన్నతనంలో కమ్యూనిస్టు పార్టీ పాటలు, పాఠశాల స్థాయిలో ఠాగోర్ జీవిత చరిత్ర(7వ తరగతి తెలుగు ఉపవాచకం), గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర(ఇంటర్ లో), డిగ్రీ చదివేటపుడు మాక్సిం గోర్కీ అమ్మ, నేను హిందువునెట్లయిత?, చలం సాహిత్యం.
రచనలు: 'ఒక మూల్నివాసీ గీతం' పేరుతో త్వరలో కవితా సంకలనం రానుంది. 'మహానీయుల జీవిత చరిత్ర'ల వ్యాసాలు (దినపత్రికల్లో). ప్రస్తుతపు కథ ఆరవది . మంచిర్యాల్ జిల్లా జన్నారం తహసీల్దార్ గా పనిచేస్తున్నారు.

 

Leave a Reply