అక్షరం నను ఆజ్ఞాపించింది
కాగితం మీద కలంతో కవితా సేధ్యం చేయమని
రైతు భరోసా అడిగాడు నేను తనతోనే వుండాలని
శ్రామికుడు చమట చుక్క అందించాడు
నా అక్షర సేధ్యానికి తన వంతు తడిని వంపుతూ
మహిళ చైతన్యమై ప్రవహించింది
నా నరాల్లో సత్తువ నింపి నేనొక నినాదమవ్వాలని
బాల(కార్మికు)లు ఎలుగెత్తి చాటారు
రేపటి పౌరులమే కానీ ఈరోజు నీ పెన్నులోకి ఇంకుతామని
విద్యార్థులు అడిగారు
తమ రేపును వేగుచుక్కను చేసి నీ కాగితమ్మీద వె(ప)లిగిస్తావా అని
ప్రజలంతా బారులు తీరారు
వారి వ్యధలన్నీ నా కలంలోనుంచి తూటాలై దూసుకు రావాలని
ఇక నేను సన్నద్దమయ్యాను
వారి చరిత్ర నవ్వాలని, వారి గేయమవ్వాలని,
వారి పదపదాన నడచి వారి పాదానికి గజ్జెనవ్వాలని,
వారి వ్యధలకు నా ఊపిరినద్ది మరో చరిత్రనివ్వాలని
వారి అడుగులో అడుగునై వారితోనే నేనూ
పోరు నినాదమవ్వాలని,
మిణుగురు వెలుగులు అక్షరాలుగా కాగితం నింపాలనీ
నా కలంలో పారే సిరాతో ఈ సమాజపు కుళ్లును కడగాలనీ
మరి నేనే కనుక కవినైతే!
Baavundi
Chala spurtidayakanga rasaru