నేటి ఎలక్ట్రానిక్ యుగంలో కూడా మహిళలపై ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థీకృతమైన అసంబద్ధ క్రూరత్వం!

“అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం” సందర్భం గనుక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళల స్థితిగతుల్ని తెలిపే రెండు సినిమా కధల్ని గురించి అందరికీ తెలియజేస్తే బాగుంటుందనిపించింది. ఎందుకంటే అంతర్జాతీయంగా ఉన్న శ్రామిక మహిళలే మహత్తర సంకల్పంతో ఏళ్ల తరబడి ఎన్నో కష్ట నష్టాల కోర్చుకుని, బ్రహ్మాండమైన కవాతులూ, సమ్మెలూ నిర్వహించి, చివరకు ప్రాణత్యాగాలు చేసి “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” ని సాధించి తమ ముందుతరాలకు చెందిన ప్రపంచ మహిళలందరికీ సంపాదించి పెట్టారు!

ఈ రెండు సినిమాలూ కూడా “అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం” సందర్భంగా 2013, మార్చి 8 కి భారత్ మహిళలకు యూరప్ మహిళలు కానుకగా పంపారు. నిజానికవేమీ ఆహ్లాదకరమైన బహుమతులు కావు. “మా దేశాలలోని మా వేదనల్ని అర్ధంచేసుకుని సాటి మహిళలుగా స్పందించండి” అని ఆ మహిళలు విజ్ఞప్తి చేశారు! కాబట్టి ఈ సందర్భంలో వారిని స్మరించుకుందాం!

మన రాష్ట్రం, మన దేశం అనే సరిహద్దులు కాకుండా రచయితలు ప్రపంచానికి చెందిన వారనుకుంటే మనం ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ ప్రపంచంవైపుకి దృష్టిసారిస్తే, ప్రతి విషాదాన్నీ మనకంటే ముందు ఎదుర్కొన్నవాళ్ళు ప్రపంచసినిమాల్లో కనిపిస్తారు. కష్టంలో ఉన్న మనుషులకి గొప్పదన్నూ, మనం ఒంటరివాళ్ళం కాదు అనే భరోసా లభిస్తాయి. నిరసనలకు ఉద్యమాలకు ఊపిరులూదుతాయి!

ఒకవైపు నుంచి “ప్రపంచ కుగ్రామం” అంటూ దేశ దేశాల మార్కెట్ సరుకులను పాలకులు ప్రజల మీద గుప్పిస్తారు. మళ్ళీ అవసరాలను బట్టి మన దేశం అంటూ జాతీయోన్మాదాన్ని ప్రేరేపిస్తూ ఉసి గొల్పుతారు. సామ్రాజ్య వాద దేశాలతో కార్పొరేట్ వ్యాపారాలకూ, వాళ్ళకు వత్తాసు పలికే ఏలికలకు లేని సరిహద్దులు మనకెందుకు అనే ఎరుకతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచ కార్మికులందరూ ఏకం కావాలన్నట్లే ప్రపంచ ప్రజలందరూ ఒక దేశం నుంచి ఇంకొక దేశపు పోరాటాలనుంచి స్ఫూర్తి పొందాలి.

మొదటి సినిమా “ఒసామా” (Osama). ఇది ఆఫ్ఘనిస్తాన్ చిత్రం. దీని దర్శకుడు సిద్దిక్ బర్మెక్.

1996 నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం చిత్ర నిర్మాణాలను పూర్తిగా నిషేధించింది. ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్, జపాన్, ఐర్లాండ్, ఇరాన్ దేశాల మధ్య ఒక అంతర్జాతీయ సహ-ఉత్పత్తి వల్ల ఈ సినిమా ప్రపంచం ముందుకొచ్చింది. ఇది ఒక నిరాశ, భయంకరమైన లేమి, మరణం, ఒక విషాదం, అన్నీ కలగలిపిన ఒక గొప్ప షాక్! బాలికలు, మహిళలకు సంబంధించి ప్రపంచ దుస్థితినీ, వారి పట్ల పాలక వ్యవస్థలు అవలంబించే దుర్మార్గమైన పద్ధతులనూ అద్దంలో పెట్టి చూపించిన చిత్రమిది.

ప్రారంభ సన్నివేశంలో “క్షమించ గలనేమో కానీ మర్చిపోలేను” అనే నెల్సన్ మండేలా సూక్తితో సినిమా మొదలవుతుంది. మొదటి సన్నివేశం లోనే పైనుంచి కిందివరకూ ముఖాలు కూడా కనపడకుండా నీలి రంగు బుర్ఖాలు ధరించిన మహిళలు గుంపులు గుంపులు గా కనిపిస్తారు.

“ఆకలి మా ప్రాణాల్ని తోడేస్తుంది”
“మేము వితంతువులం”
“మాకు పని కావాలి”
“మేము రాజకీయం చెయ్యడం లేదు”

అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తుంటారు. చావుకి తెగించి మనుగడ కోసం పోరాటం చేస్తున్న మహిళల మీద తాలిబాన్ సైనికులు నీటి గొట్టాలను వదలడం, గ్రెనేడ్ లాంచర్లు పేల్చడం లాంటి దృశ్యాలను ఒక పదమూడేళ్ళ బాలిక (ఈ సినిమా కథానాయిక) తలుపు సందు గుండా చూస్తుంది. ఇది చాలా శక్తివంతమైన దృశ్యం. తర్వాత సినిమా మొత్తం దీని కొనసాగింపుగా నడుస్తుంది.

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల నియంతృత్వ పాలనలో ఉన్న సమయంలో ప్రజలపై ఎన్నో రకాల ఆంక్షలు, పెత్తనాలుండేవి. ముఖ్యంగా మహిళలపై అణచివేత మరీ దారుణంగా ఉండేది. వారికి సామాజిక జీవితం నిషేధించబడింది. తాలిబన్లు స్త్రీలను బురఖా ధరించి తీరాలని నిర్భంధిస్తారు. వారిని ఎవరూ చూడకూడదనుకుంటారు. ఎందుకంటే మహిళల ముఖం చూడడం వల్ల సమాజం లోని అన్ని రకాల అధోగతులు చుట్టుకుంటాయని, సర్వనాశనమైపోతారని మన మనుస్మృతి లో చెప్పినట్లే తాలిబన్లు కూడా బలమైన విశ్వాసంతో ఉంటారు. మహిళలకు పనిహక్కు లేదు. పనిహక్కు సంగతి సరే, అసలు స్త్రీలు భర్తతో తప్పించి బయట కనపడగూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళవలసి వస్తే కాలికున్న చెప్పులు కూడా ఎవరి కళ్ళ బడకుండా ఒబ్బిడిగా బురఖాలో వెళ్ళి, వెంటనే ఇంట్లో కొచ్చిపడాలి. యుద్ధాలవల్ల ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు వారి భర్తల్నీ, తండ్రుల్నీ, కొడుకుల్నీ భారీ సంఖ్యలో పోగొట్టుకుని, అనాధలవుతారు!

ఈ దుర్భర పరిస్థితుల్లో ఒక ఇంట్లో మూడు తరాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మహిళలు బాలిక అమ్మమ్మ-అమ్మ- బాలిక – సంపాదించే పురుషుడే లేకుండా దిక్కులేనివాళ్ళవుతారు. బాలిక తండ్రి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో మరణిస్తే, బాలిక మేనమామ రష్యన్ యుద్ధంలో మరణిస్తాడు. ఆ ఇంట్లో పోషించే పురుషుడే ఉండడు. వృద్ధురాలైన తల్లినీ, బిడ్డనూ పోషించడం కోసం బాలిక తల్లి ఒక హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. అమ్మాయి కూడా తల్లికి తోడుగా అదే హాస్పిటల్ లో చిన్న చిన్న పనులు చేస్తూ అమ్మకు సహాయంగా ఉంటుంది. ఆ సమయంలో స్త్రీలు బయటికొచ్చి పనిచెయ్యకూడదు అనే ఆంక్ష విధిస్తారు తాలిబన్లు. అంతేకాదు. అకస్మాత్తుగా వీళ్లు పని చేస్తున్న హాస్పిటల్ కి నిధులు ఆపేస్తారు. ఆమెకు మూడు నెలల జీతం కూడా రావలసి ఉంటుంది. ఆమె ఎంత మొత్తుకున్నా వినిపించుకునే వారెవరూ ఉండరు. పైగా తల్లీ-బిడ్డా ఎవరో పురుషుణ్ణి కాళ్ళా వేళ్ళా పడి బతిమాలుకుని అతని భార్యా, బిడ్డలుగా బండి మీద వస్తుంటే ఆమె కాళ్ళు బయటికి కనిపిస్తున్నాయని పోలీసు ఆమె కాళ్ళ మీద లాఠీతో కొడతాడు. నానాకష్టాలూ పడి ఆ పూటకి ఇల్లు చేరడమే వారికి గగనమవుతుంది!

ఆకలితో అలమటించిపోతామని భయపడిన తల్లీ-అమ్మమ్మ రోజులు చాలా గడ్డుగా ఉన్నాయనీ, ఏదో ఒకటి చెయ్యకపోతే ప్రాణాలు నిలుపుకోలేమనీ తెగ ఆలోచిస్తారు. కనుచూపుమేర దూరంలో ఏ దిక్కూ తోచదు. ఇంకో దారే లేని పరిస్థితుల్లో పాపకి మారు వేషం వేసి అబ్బాయిగా తయారు చేసి ఎంత చిన్నదైనా ఏదో ఒక పనికి పంపించాలని భావిస్తారు. పాప మాత్రం తాలిబన్లకు ఈ సంగతి తెలిస్తే చంపేస్తారని భీతిల్లి పోతుంది. నిస్సహాయంగా భయం భయంగా బేల చూపులు చూస్తూనే గత్యంతరం లేని పరిస్థితుల్లో అమ్మమ్మ – అమ్మ చెప్పినట్లే చెయ్యడానికి సంసిద్ధమై పోతుంది. అమ్మమ్మ అమ్మాయి పొడవైన జుట్టంతా జడలు జడలుగా అల్లి కత్తిరిస్తుంది. అమ్మ ఇంట్లో ఉన్న వాళ్ల నాన్న బట్టలు తెచ్చి వేస్తుంది. మొత్తానికి అందమైన సుకుమారమైన అమ్మాయి కాస్తా అచ్చం అబ్బాయిగా తయారవుతుంది. తండ్రి స్నేహితుణ్ణి బతిమాలుకుని చిన్న టీ దుకాణంలో పనికి కుదుర్చుకుంటారు. అందరూ మారు వేషంలో ఉన్న అమ్మాయిని అబ్బాయనే అనుకుంటారు గానీ తల్లితో పాటు హాస్పటల్ పనికి వెళ్ళొస్తున్నప్పుడు చూసిన ఎస్పాండీ అనే బాలుడు మాత్రం ఈ రహస్యాన్ని పసిగట్టేస్తాడు. అతనే ఈ మారు వేషంలో ఉన్న బాలుడికి “ఒసామా” అని పేరు పెడతాడు!

ఒసామా బాలుడు కాదు బాలిక అని మిగిలిన పిల్లలకు అనుమానం వచ్చినప్పుడు ఎన్నోసార్లు ఎస్పాండీ ఆదుకుంటాడు. “నాకు తెలుసు. అతను బాలుడే. పేరు ఒసామా” – అని చెప్పి ఎస్పాండీ రక్షించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నాలేమీ ఫలించవు.

ఇంత దయనీయమైన పరిస్థితుల్లో కనాకష్టంగా బతుకీడుస్తున్న వాళ్ళకు ఎదురవుతున్న పరిస్థితులు ఆ రకంగా కూడా వారిని బతకనివ్వవు. గ్రామంలోని బాలురనందరినీ తాలిబాన్ శిబిరం నిర్వహించే ఒక మతపరమైన పాఠశాలకు తరలిస్తారు. తప్పనిసరిగా ఒసామా కూడా వెళ్ళవలసి వస్తుంది. ఆ పాఠశాలలో మతగురువులు పోరాడే పద్ధతులతో పాటు, భవిష్యత్తులో వివాహాల తర్వాత వారి వారి భార్యలతో ఎలా ప్రవర్తించాలో, తర్వాత స్నానంతో వారి శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో కూడా నేర్పించే సన్నివేశం ఉంటుంది. బాలిక తన రహస్యాన్ని తాలిబన్ల నుంచి కాపాడుకోవడానికి అవయవాలను శుభ్రం చేసుకునే సందర్భంలో తప్పించుకోవడానికి విఫలయత్నాలు చేస్తుంది. తాలిబాన్ ఉపాధ్యాయులు పెట్టే నరకయాతనల పరిక్షల సమయం లోనే ఆ పాపకు మెన్సెస్ కూడా వచ్చి ఆమె కాళ్ళనుంచి రక్తం కారడం వల్ల, ఆమె ఒక బాలిక అని వాళ్ళకు తెలిసిపోతుంది. హాస్పిటల్ లో అరెస్ట్ చేసిన ఒక జర్నలిస్ట్, మరొక విదేశీ వనితతో పాటు మన ఒసామాను కూడా జైలుకి పంపిస్తారు. పెద్ద పంచాయితీ చేసి మిగిలిన ఇద్దరికీ మరణ శిక్ష విధిస్తారు. బాలిక లేడికూనలా బెంబేలెత్తిపోతుంది. ఇంతలో ఒక ముసలి ముల్లా వచ్చి తాను బాలికను వివాహమాడతా నంటాడు. న్యాయ నిర్ణేతను “నన్ను ఈ ముసలివాని కివ్వవద్దు. నాకు మా అమ్మ, అమ్మమ్మ కావాలి. నన్ను మా అమ్మ దగ్గరకి పంపించండి” అని దీనంగా, హృదయ విదారకంగా బాలిక వేడుకుంటుంది. జడ్జి మనసు కరగదు. మూర్తీభవించిన పురుషాధిపత్య నిరంకుశ ఆఫ్ఘన్ సమాజంలో పన్నెండు సంవత్సరాల పసిపిల్ల పండు ముసలివానికి ఆఖరి భార్య కాక తప్పలేదు. అప్పటికే అతనికి ముగ్గురు భార్యలూ బోలెడంతమంది పిల్లలూ ఉంటారు. అది ఒక శిక్షగా ఆమెను అతనికిచ్చేస్తారు. అతని కౄరత్వం గురించి, అతని వల్ల తమ జీవితాలెలా నాశనమయ్యాయో అతని భార్యలే బాలికకు వివరిస్తారు. సహాయ పడాలని ఉన్నా తాము ఏమీ చేయలేని నిస్సహాయులమని చెప్తారు. ఇంతకు ముందున్న భార్యలతో పాటు బాలికను కూడా బంధించి, ఒక ఇంటిపైభాగంలో పెట్టి పెద్ద తాళం వేస్తాడు. ప్రతిరోజూ ముసలివాడు పెట్టే హింస చిన్నారిని బాధిస్తూనే ఉంటుందని చెప్పకనే చెప్తారు. ఈ కథనాన్ని గుండెలు బిగబట్టిచూస్తున్న ప్రేక్షకులు భయాందోళనలతో కకావికలమైపోతారు!

ఒక వాస్తవిక కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఆఫ్ఘానీ మహిళల దుస్థితిని చాలా ఆర్ధ్ర్తతతో అద్యయనం చేసిన రచయిత సిద్దిక్ బర్మెక్. ఆయనే ఎడిటర్, దర్శకుడు. స్క్రిప్ట్ కూడా ఆయనే రాశాడు.

మహిళలకు ‘గౌరవం’ సంగతి అటుంచి అమానుష భౌతిక, మానసిక హింసలు జీవితకాలమంతా ఆఫ్ఘనిస్తాన్ లో అమలవు తున్నాయి. ఒక మహిళను గొంతు వరకూ పాతి పెట్టి ఆ పైన రాళ్ళు రువ్వే దృశ్యం కూడా ఉందీ సినిమాలో! బూర్జువా ప్రపంచంలో బాల్యాన్ని, యవ్వనాన్ని, మొత్తంగా జీవితాన్నే పోగొట్టుకున్న ఒక బాలిక ద్వారా మొత్తం దేశాన్ని తద్వారా తాలిబన్ ఇనుప పాలనను గొప్ప స్కోప్ లో సిద్దిక్ బర్మెక్ చూపించారు. ఇది చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు మన దేశంలో నెలల పసిపాపలు అత్యాచారాలకు గురి కావడం, హత్రాస్ దుర్ఘటన, అసిఫా బాలిక గుర్తొస్తారు. అసిఫా అయితే అత్యాచారానికే గాక ఏకంగా దారుణమైన హత్యకే గురైంది కదా!

*

రెండో సినిమా “నీ పేరు జస్టిన్” (Your Name is Justine): ఇది పోలాండ్ చిత్రం. డైరెక్టర్ ఫ్రాంకో డ పెన.

దీని కథ గురించి చెప్పుకోవాలంటే మారియోలా ఒక అందమైన యువతి. పోలాండ్ లోని లక్సెంబర్గ్ లో అల్లారు ముద్దుగా చూసుకునే తన అమ్మమ్మతో భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటూ హాయిగా జీవించే యువతి. తన అమ్మమ్మలా పాతతరం మనుషుల్లాగా సాదా సీదాగా సాఫీ జీవితం కాకుండా జీవితం ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా, భిన్నంగా, ఉత్తేజకరంగా తీర్చిదిద్దుకోవాలని ఉవ్విళ్ళూరుతూ కోటి కోరికలతో తపన పడుతూ ఉంటుంది. ముగ్గురు స్నేహితురాళ్ళలో ఉద్యోగం సంపాదించుకుని జీవితంలోని ప్రతి అడుగులో విజయం సాధించబోతున్న ప్రత్యేకమైన యువతిలా ఉంటుంది.

ఆమెకు ఆర్ధర్ అనే అందమైన ప్రియుడుంటాడు. ఒకరోజు ఆర్ధర్ మారియోలా దగ్గరి కొస్తాడు. ఒక సెలవు దినాన్ని మనిద్దరం కలిసి యూరప్ వెళ్ళి సముద్రతీరంలో సృజనాత్మకంగా, అద్భుతంగా గడుపుదామని ఊరించే కబుర్లతో నచ్చజెప్పి మారియోలాను ఒప్పిస్తాడు. ఆర్థర్ ఆమె మాజీ ప్రియుడు కాబట్టి యూరప్ చుట్టూ విహారయాత్ర అనగానే మురిసిపోతుంది మారియోలా. విడిపోయిన ఆమెను తిరిగి పొందడానికి, ప్రేమగా మాట్లాడుతూ పెళ్ళి చేసుకుంటానని హామీ ఇచ్చి పెళ్ళికి ముందు అతని తండ్రి మారియోలాను చూడాలను కుంటున్నాడని జర్మనీకి వెళదామంటాడు. జర్మనీలోని కొలోన్ లో ఉన్న ఆర్థర్ కుటుంబాన్ని సందర్శించడానికి పోలాండ్ నుండి ప్రయాణం చేయబోతున్నామని చెబుతాడు ఆర్ధర్. టూర్ ప్రారంభానికి ముందు, అతను ఆమె నివసించే ప్రాంతానికి వచ్చి ఆమెను రకరకాల భంగిమల్లో నవ్విస్తూ కొన్ని ఫొటోలు, ఆమె అమ్మమ్మతో కొన్ని ఫొటోలు తీస్తాడు.

వాళ్ళ నాన్న వారి పెళ్ళికి తొందర పడుతున్నాడనీ, ఆయనకి మారియోలాను చూపించడానికి జర్మనీకి తీసికెళ్తున్నానని కూడా మారియోలా అమ్మమ్మతో చెబుతాడు. తాను జర్మనీలో కాబోయే మామగారిని చూడబోతున్నాననుకుని దారిలో చాలా ఉద్విగ్నంగా కొన్ని జర్మన్ పదాలు కూడా నేర్చుకుంటుంది మారియోలా. జర్మనీ దాటగానే బెర్లిన్ లోని ఒక అపార్ట్మెంట్ కి తీసికెళ్తాడు ఆర్ధర్. ఆ ఇంట్లో చంటి పాపాయితో ఉన్న ఒక మహిళ తన వంక వింతగా చూడడం, ఆ ఇంటి వాతావరణం అసాధారణంగా, తేడాగా ఉండడంతో ఆర్ధర్ తో “వెంటనే మనం ఇక్కణ్ణుంచి వెళ్ళిపోదాం, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా” అని అడుగుతుంది మారియోలా. “ఒక్క రాత్రికే. ఎలాగోలా సర్దుకుందాం” అని అంటాడు ఆర్ధర్.

ఇంతలోముగ్గురు మృగాల్లాంటి పురుషులు వస్తారు. అతి కౄరంగా ఉన్న ఒకడు సరాసరి మారియోలా దగ్గర కొచ్చి దౌర్జన్యంగా మీద చెయ్యేస్తాడు. “ఇక నీకు ఎంతమాత్రమూ నీ అసలు పేరు మారియోలా అని ఉండదు. ఈ రోజునుంచి నీ పేరు జస్టిన్” అని అంటాడు. ఒక పక్కనుంచి తీవ్రంగా ప్రతిఘటిస్తూనే, “ఇతను మీద కొస్తున్నాడం” టూ గొప్ప నమ్మకంతో ప్రియుడికి అమాయకంగా ఫిర్యాదు చెయ్యబోతుంది మారియోలా. అందులో ఒకడి దగ్గర నుంచి నోట్లకట్టలు అందుకుంటూ ప్రేక్షకులకు కనిపిస్తాడు ఆర్ధర్. “నీ ప్రియుడు ఆర్ధర్ నిన్ను మాకు అమ్మేశాడు” అంటాడు చెరబట్టినవాడు. మారియోలాను పాస్ పోర్ట్ తో సహా ఒక వేశ్యను అమ్మినట్లు అమ్మేసి మరుక్షణంలో మాయమవుతాడు ఆర్ధర్! ఆమె ప్రియుడు లోపల పైశాచిక ప్రవృత్తి గల అతికౄరుడు అని ప్రేక్షకుల కర్ధమవుతుంది.

లక్సెంబర్గ్ సరిహద్దు దాటి జర్మనీలోకి ప్రవేశించి బెర్లిన్ లోని ఒక ఇంటికి తీసికెళ్ళేవారకూ ఆనందంగా ఉంటుంది మారియోలా. అంతే! తర్వాత ఆమె జీవితంలో సంతోషపు ఘడియ లంతరించిపోతాయి. మరుక్షణం నుంచి జీవితం ఊహించని విధంగా భయానకంగా మారిపోతుంది. ఇక మారియోలా జస్టిన్ గా చలామణీ అవుతూ ఉంటుంది.

అప్పటినుంచి జస్టిన్ జీవితంలో చూడలేని, భరింపరాని లైంగిక హింస మొదలవుతుంది. చెరబట్టిన ముగ్గురిలో ఇద్దరు జస్టిన్ ని చెప్పనలవి కానన్ని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. ఆమె వారించిన కొద్దీ విపరీతంగా కొట్టి కొట్టి రక్తాలు కారేలా చేస్తారు. వారిలో ఇద్దరు ఒకడి తర్వాత ఒకడు పశువులకంటే హీనంగా, నీచాతినీచంగా ప్రవర్తిస్తారు. జస్టిన్ కూడా చాలా బలంగా మంచి శరీర దారుఢ్యంతో ఉండి తనకున్న శక్తినంతా ఉపయోగించి దీటుగా ఎదిరిస్తూనే ఉంటుంది. ప్రచండంగా, భీకరమైన పోరులో శక్తి కొద్దీ శత్రువుతో పోరాడినట్లు ప్రతిఘటిస్తూనే ఉంటుంది. కానీ ఆమె శక్తి చాలదు. ప్రతిసారీ పెనుగులాడీ, పెనుగులాడీ నిర్జీవంగా మిగిలిపోతూ ఉంటుంది. వారి రాక్షసత్వం ముందు ఆమె నిస్త్రాణంగా నిస్తేజంగా నీరసపడి పోతూ ఉంటుంది. ఒకసారి కాదు, అనేకసార్లు ఆమె మీద బలప్రయోగం చేస్తారు. రోజుల తరబడి అత్యాచారం కొనసాగిస్తారు. చివరికి ఆమె నన్ను కొట్టవద్దని దీనంగా వేడుకునే పరిస్థితికి వస్తుంది. వస్తూ, పోతూ తాళాలు వేసి బంధిస్తూ ఉంటారు. ఆ ఇల్లొక భూతాలకొంప లాగా, పాడుపడిన కొంపలా పరమ మురిగ్గా ఉంటుంది. ఎవరూ ఉండరు. తాగుదామంటే పంప్ లో నీళ్ళు రావు. ఫ్రిజ్ తెరిస్తే తినడానికేమీ ఉండవు. అమ్మమ్మను తల్చుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆకలితో అలమటించిపోతూ, ధ్వంసమైపోతున్న తన జీవితాన్ని తలచుకుని భయంకరమైన మానసిక సంఘర్షణకు గురౌతుంది. ఇంట్లో దయ్యం పట్టిన దానిలా తిరుగుతూ తిండి కోసం వెతుక్కుంటూ, అందంగా ఉన్న తన జుట్టును ఒక కత్తిని దొరికబుచ్చుకుని బరబరా కోసేసుకుంటుంది. బట్టలు ఎక్కడివక్కడ చింపేసుకుంటుంది. అపార్ట్ మెంట్ కిటికీ తలుపుల్ని తన బలాన్నంతా ఉపయోగించి ఊడదీసి బయటికొచ్చి రక్షించమంటూ వెర్రికేకలు పెడుతుంది. ఎవరికీ వినిపించని ఆమె కేకలు అరణ్యరోదనగానే మిగిలిపోతాయి. ఆ రాక్షసులు సుడిగాలిలా వస్తూనే ఉంటారు. భీభత్సం సృష్టిస్తూనే ఉంటారు!

వారిలో మూడోవాడు మాత్రం నేను నిన్నేమీ చేయను, నమ్మమంటాడు. లైంగికంగా ఏ విధంగానూ వేధించడు. ఆమెను చూసి జాలి పడినట్లే, దయగా ఉన్నట్లే కనిపిస్తాడు. ఒకరోజు తినడానికి కాస్త తిండీ, తాగడానికి కూల్ డ్రింకూ తెచ్చిస్తాడు. అప్పుడప్పుడూ వస్తూ వచ్చినప్పుడల్లా కాస్త ఆహారం, అవసరమైన చిన్నచిన్న వస్తువులు తెచ్చిపెడుతూ కనికరంగా ఉంటాడు. నేను చెప్పినట్లు వింటే నీకిక్కడ నుంచి విముక్తి కలిగిస్తానని నిరంతరంగా సంప్రదింపులు జరుపుతూ ఉంటాడు. నిస్సహాయస్థితిలో ఉన్న ఆమె వినక చేసేది కూడా ఏమీ లేదు. అతడికి వేరే ప్రణాళికలుంటాయి!

ఆమెను బయటికి తెచ్చి ఒక హోటెల్ లో కాల్ గర్ల్ గా నియమిస్తాడు. ఆ హోటెల్ రూమ్ రష్ ని కాలింగ్ బెల్ మోగడం -వాడొక పక్కన నిలబడి డబ్బు వసూలు చేసుకోవడం ద్వారా సూచిస్తాడు డైరెక్ట్రర్ ఫ్రాంకో. విటులుగా వచ్చిన ప్రతి ఒక్కరిని “నేను మోసపోయాను. నన్ను మా అమ్మమ్మ దగ్గరికి చేర్చి సహాయం చెయ్యమ” ని వేడుకుంటుంది. ప్రతి అడుగులోనూ పదునైన బాకులు పొంచి చూస్తున్నట్లు, పగబట్టినట్లున్న ఆమె జీవితంలో అంతటి అదృష్టమేది?

ఇంతలో ఒకరోజు ఎక్కడినుంచో ప్రియుడి రూపంలో ఉన్న కిరాతకుడు ఆర్ధర్ ఊడిపడతాడు. “నీ కొక చెడువార్త” అంటూ అమ్మమ్మ మరణం గురించి చెప్తాడు. అప్పటివరకూ అంతటి దుఃఖంలోనూ “అమ్మమ్మా! నీ రాజకుమారి కఠినమైన జైల్లో ఉంది. ఎవరూ చొరబడలేని కోట బురుజులున్న రాజ భవనంలో బంధింపబడి ఉంది. స్వేచ్చగా ఎగిరే పక్షుల్ని చూడాలనుకుంటుంది” అని అనుకుంటూ అమ్మమ్మని తల్చుకుని ఊహల్లోనైనా సేదదీరే జస్టిన్ కి ఆ ఆశ కూడా లేకుండా పోయింది. పట్టరాని కసితో ఆర్ధర్ని చంపేస్తుంది! జైలుకి వెళ్తుంది!

మూడేళ్ళ జైలు శిక్ష ముగిశాక కూడా మన మారియోలా గొప్ప ఆశాజీవిగా కనపడుతుంది. తన జీవితాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలనుకుంటుంది. కానీ తన చుట్టూ ఉన్న బయటి ప్రపంచమంతా మారిపోయి ఉంటుంది. తనకి అమ్మమ్మ లేదు! ఊళ్ళో ఎవరూ లేరు! ఉన్న ఇద్దరు దోస్తులు గుర్తొస్తారు గానీ తాను జీవితం నుంచి ఎంత దూరం జరిగిందో తెలుసుకుని నిస్తేజ పడుతుంది. అసలు న్యాయం ఎక్కడుంది? ప్రేమకు అర్ధమేమిటి? స్వేచ్చ అందని వస్తువేనా? అని అనడంతో సినిమా ముగుస్తుంది. ప్రేక్షకుల హృదయాలు కలవరపెట్టే ఊపిరాడని బాధతో భారమవుతాయి.

మహిళలు తరతరాలుగా ఆర్జించి పెట్టి ఈ సమాజానికి అందించిన జ్ఞానం, మాతృస్వామ్య వ్యవస్థ నుంచి ఇంటిపెద్దగా వారి పాలనానుభవం, శక్తిసామర్ధ్యాలు, అందం, అధికారం, అనేక రకాల స్వభావాలతో ఈ ప్రపంచాన్ని అర్ధవంతం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రపంచంలోని అగ్ర రాజ్యాలతో సహా ఏ దేశంలోనూ మహిళల్ని మానవులుగా సమాజంలో సగభాగంగా భావించడం లేదు. మనసుని మెలిపెట్టే బాధతో, గుండెలవిసిపోయేలా గింజుకుని, ఊపిరాడక అల్లాడిపోయే ఈ జస్టిన్ లాంటి యువతులు, ఒసామా లాంటి బాలికలు పోలాండ్, ఆఫ్ఘనిస్తాన్ ల లోనే కాదు ఇటువంటి పేద, ఆదివాసీ, అంచులకు నెట్టబడుతున్న అట్టడుగు వర్గాల అమ్మాయిలు ప్రపంచదేశాల్లో ఉన్నట్లే మన దేశంలోనూ ఉన్నారు. ఈ సినిమా కథలను ప్రపంచీకరణ నేపధ్యంలో దేశదేశాల్లోని బాలికలు, మహిళలు నిస్సహాయమైన పరిస్థితుల్లో రక రకాల అణచివేతలకు, లైంగికదోపిడీకి బలవుతున్నవారికి ప్రతీకగా చూడాలి. పురుషాధిపత్య సమాజాలలో మహిళల కథలు బలంగా వినిపించవు. లేకపోతే కావాలనే కొన్నిసార్లు ఇతర సంఘటనల మాటున దాచేస్తారు. కానీ నేటి ఆధునిక యుగపు స్త్రీలు నిరంతరం పట్టిన పట్టు వదలకుండా బలమైన స్వరాల ద్వారా అన్నీ రంగాల్లోనూ స్త్రీ-పురుష సమానత్వాన్ని సాధించే దిశగా అడుగులేస్తూ తమ హక్కులను డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆడవాళ్ళ జీవితాలలోని అనేక రకాల అంశాలను పైకి అల్పంగా కనిపిస్తూ అనుభవించేవాళ్ళకు మాత్రం నరకప్రాయంగా ఉండడాన్నీ, అసలు మహిళలైనందుకే పుట్టినదగ్గరనుంచి పడుతున్న కష్టాలనూ రక రకాల మాధ్యమాల ద్వారా ఎలుగెత్తి చాటుతున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాలు కూడా వచ్చాయి.

ఈ సినిమా కథలు రెండూ మహిళలపై ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థీకృతమైన అసంబద్ధ క్రూరత్వం గురించి చెప్తాయి. 1913 లో సినిమా విశ్వవేదిక మీదకొస్తే సరిగ్గా ఒక శతాబ్దం తర్వాత 2013 లో తీసిన ఈ రెండు సినిమాలలో ఇంకో శతాబ్దం వెనక్కినెట్టే ఇటువంటి పాతరాతియుగం ఆలోచనలున్నాయని నమ్మటం కష్టం. కానీ ఇది నిజం. కావాలంటే మన దేశంలో జరుగుతున్న సంఘటనలతో పోల్చి చూసుకోవచ్చు. ప్రశ్నించే పురుషులమీద ఉపా చట్టాన్ని ప్రయోగించడం, స్త్రీలయితే అత్యాచారాలు చెయ్యడం చూస్తున్నాం కదా? ఎక్కడో తాలిబన్ లో కదా, పోలాండ్ లో కదా ఇలా జరిగింది అని తేలిగ్గా తీసుకోనక్కరలేదు. మనదేశంలో మొన్న మన నిర్భయకీ, నిన్న మన జిషాకీ, గిరిజన యువతులకీ నిత్యం జరుగుతున్న ఘోరాల సంగతేమిటి? పసిపాపల పట్ల, ఎంత క్రూరమైన అకృత్యాలు జరిగాయి? బీల్కిస్ బానోకి జరిగిన అవమానాలు, హత్యలు తలచుకుంటే వెన్నులో నుంచి వణుకొస్తుంది. ప్రతిరోజూ పేపర్ చూడాలంటే భయంగా ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి? మనం నవనాగరికులమని మురిసి పోతున్న ఈ కాలంలోనే ప్రపంచంలోని కొన్నిమూలల్లో జరుగుతున్నఅమానుషచర్యలివి!

మన చలం లాగా స్త్రీల స్వేచ్చ కోసం తపించి ఆర్తితో పని చేసి కొందరు అణచబడుతున్న బాలికల, మహిళల హృదయ విదారకమైన పరిస్థితుల్ని ప్రపంచం దృష్టికి తెచ్చిన ఈ ఇద్దరు దర్శకులకీ స్త్రీజాతి తరఫున ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుంది.

నటీ-నటుల గురించి, చిత్ర నిర్మాణం గురించి ఎంతైనా రాయొచ్చు. కానీ కేవలం కథలకే పరిమితమవుతున్నాను.

“చీకటి థియేటర్లో సినిమా చూడడం ఒక ధ్యానం లాంటిది. నా దృష్టిలో ఇంకే కళారూపం ఇలాంటి అనుభూతిని ఇవ్వలేదు. చికాకులు, మానసిక ఒత్తిడితో ఒంటరి దీవులుగా మారిపోయిన నేటి మానవకుటుంబాన్ని సమైక్యపరచే ఏకైకశక్తి సినిమా” – అంటారు ఆదూర్ గోపాలకృష్ణన్.

స్త్రీలూ, పిల్లలూ, అట్టడుగు ప్రజలు బలహీనులు. సమానత్వాన్ని కోరుకుంటారు. కాస్త మెరుగైన పరిస్థితుల్లో ఉన్న మనమందరం ప్రపంచ కుగ్రామం లోని వారి పట్ల సహానుభూతితో ఉందాం. ప్రపంచ సినిమా ద్వారా బాధాసర్పదష్టులకు దగ్గరవుదాం!

(ఎవరైనా ఈ చిత్రాలను చూడదలచుకుంటే యూట్యూబ్ లో కొంచెం తక్కువ క్వాలిటీతో ఉన్నాయి. నేనైతే 2013లో జరిగిన అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో “Osama” చిత్రాన్ని, 2013 లోనే “celebrating women” పేరిట జరిగిన 18 వయూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో “Your Name is Justine” చిత్రాన్ని చూశాను)

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

Leave a Reply