సమాజ పరిణామ క్రమంలో ఆయా చారిత్రక సందర్భాలకు ప్రతీకగా నిలిచిన వ్యక్తులు అరుదుగా ఉంటారు. వారు ఆ నిర్దిష్ట సమాజ చలనాన్ని తమదైన జీవితాచరణతో తమ అసాధారణ వ్యక్తిత్వంతో తీవ్రంగా ప్రభావితం చేస్తారు. ఆ సమాజ గమనాన్ని మలుపు తిప్పుతారు. పురోగమన దిశగా ముందుకు తీసుకుపోతారు. వారి ప్రభావం ఆ సమకాలీన సమాజంపై ఎంతగా ఉంటుందంటే… వారు లేకుండా నాటి సామాజిక సంఘర్షణ, మార్పు సాధ్యమయ్యేది కాదన్నంతగా ముద్రవేస్తారు. మొత్తంగా నాటి కాలానికి వారు సంకేతాత్మకంగా నిలుస్తారు. అలాంటి వారు చరిత్ర పురోగమనంలో మైలు రాళ్లుగా కనిపిస్తారు. ప్రపంచ చరిత్రలో చూస్తే… స్పార్టకస్ మొదలు.. జీసస్ క్రీస్ట్, ముహమ్మద్ ప్రవక్త, గౌతమ బుద్ధ, కార్ల్‌మార్క్స్, జార్జ్ వాషింగ్టన్, మార్టిన్ లూథర్ కింగ్, లెనిన్, రోజా లగ్జెంబ ర్గ్, స్టాలిన్, మావో, చే గువేరా లాంటి వారిని చెప్పుకో వచ్చు. మన దేశానికే వస్తే.. ఆధునిక చరిత్రలో ఆదివాసీ పోరాటవీరులు గుండాదూర్, బీర్సాముండా, కొమురం భీం మొదలు… బందగీ, చాకలి అయిలమ్మ, సర్దార్ భగత్ సింగ్ దాకా పోరాటానికి, త్యాగాలకు ప్రతీకగా నిలిచారు. అనన్య త్యాగాలతో సమస్త మానవాళికి స్ఫూర్తిదాయకంగా, ఆదర్శంగా నిలిచారు.
నక్సల్‌బరీ, శ్రీకాకుళ పోరాటం నుంచి ఉత్తర తెలంగాణ జగిత్యాల జైత్రయాత్ర మీదుగా దండకారణ్యం మధ్య భారతం దాకా నూతన సమాజ నిర్మాణంలో దేశం ఎందరో ఉత్తమ పుత్రులను కోల్పోయింది. ఆ క్రమంలో… తెలుగు నేలలో తమ అసాధారణ కార్యాచరణ, త్యాగాలతో విప్లవ, విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిం చటంలో 12 వేలకు పైగా వీర యోధులు రక్తతర్పణ చేశారు. భారత విప్లవోద్యమ నేతలుగా నల్లా ఆదిరెడ్డి, కిషన్ జీ, రాజ్‌కుమార్ (ఆజాద్), మురళి, సంతోష్‌రెడ్డి, పులి అంజయ్య, జన్ను చిన్నాలు, పెద్ది శంకర్, పులి మదనయ్య, బయ్యపు దేవేందర్ రెడ్డి, పల్లె కనకయ్, కైరి గంగారాం, గజ్జెల గంగారాం, కట్ల మల్లేశ్, సాకేత్ రాజన్, లింగమూర్తి, పటేల్ సుధాకర్‌రెడ్డి, శాకమూరి అప్పారావు, సుదర్శన్‌రెడ్డి, మేకల దామోదర్ రెడ్డి (సంజీవ్), మఠం రవికుమార్ (మంజీరా), అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే), మాధవ్, యాప నారాయన (హరిభూషన్), దయాకర్ (ధర్మన్న) రామన్న, కటకం సుదర్శన్… ఇలా ఎందరో భారత విప్లవానికి హామీ అనదగ్గ విప్లవకారులు ఇచ్చిన స్ఫూర్తి, చూపిన మార్గం ఉన్నతమైనది.
తెలుగు నేలలో విప్లవోద్యమానికి జవము, జీవంగా నిలిచిన విప్లవ రాడికల్ విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో ఎందరో నవ యువ కిశోరాలు రక్తతర్పణ చేశారు. అందులో… శేషయ్య, రామకృష్ణ, నాగేశ్వర్ రావు, రమాకాంత్, విజయ్‌కుమార్, నవీన్, ఎంఎస్ఆర్, వీరారెడ్డి (రఘు), వివేక్ లాంటి వారు రికన్నాయిటర్స్. జంటనగరాల విప్లవోద్యమ చరిత్రలో అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ప్రభావం వేసిన వాడు వీరారెడ్డి. తన విశిష్టమైన, విలక్షణమైన వ్యక్తిత్వంతో… భూమి పుత్రుడుగా కలం పట్టి కవితలల్లి, రఘుగా విప్లవాభిమానులు, కార్యకర్తలపై చెరగని ముద్రవేశాడు వీరన్న. ఒక సాదా సీదా పల్లెటూరి అమాయక పిల్లవాడు ఒక పరిపూర్ణ ఆదర్శ మానవుడిగా ఎదిగిన క్రమం అందరినీ అబ్బుర పరుస్తుంది. అతి సున్నిత మనస్కుడిగా ఉన్న వాడు… అమానవీయ దోపిడీ పీడనల అసమ సమాజంలో కసితో ఎలా కదం తొక్కాడో చూస్తే… వీరన్న మానవీయ దృక్పథం తెలిసివస్తుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబం లో జన్మించిన వీరారెడ్డి ప్రాథమిక విద్య స్వగ్రామం తుర్కపల్లిలోనే సాగింది. వీరన్నది బక్కపలుచని శరీరమే కాదు, మనసు, మాట సున్నితం. చిన్నతనం నుంచీ.. తన చుట్టూరా ఉన్న ప్రపంచంలో జరుగు తున్న ఘటనలు, పోకడల పట్ల తీవ్రంగా కలత చెందేవాడు. ముఖ్యంగా స్త్రీలపై సంస్కృతి, సాంప్రదాయా ల పేర జరుగుతున్న అణచివేతను, హింసను చూసి తల్లడిల్లిపోయేవాడు. గ్రామాల్లో సాధార ణంగా జరిగే ఉత్సవ సందర్భాల్లో కోడినో, మేకనో బలివ్వటాన్ని చూడలేకపోయేవాడు. అమాయక ప్రాణులను బలిచే యటాన్ని తట్టుకోలేక కన్నీరు పెట్టుకొనేవాడు. హై స్కూల్ చదువు 6 నుంచి 10 వరకు ఆత్మకూరులో ముగించుకొని ఇంటర్ హైదరాబాద్ లోని ఎన్‌బీ సైన్స్ కాలేజీ (ఓల్డ్ సిటీ)లో చేరాడు. ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ చదువుకోసం.. మహారాష్ట్రలోని శ్యామ్‌లాల్ ఇంజి నీరింగ్ కాలేజీలో చేరాడు. ఆ చదువునూ… మధ్యలోనే వదిలేసి హైదరాబాద్ ఏవీ కళాశాలలో బీఏ డిగ్రీలో చేరాడు. ఆ డిగ్రీ చదువును కూడా మధ్యలోనే వదిలేసి, ఏకబిగిన ఎక్సటర్నల్ పరీక్షలు రాసి ఉత్తీర్ణుడై 1988లో ఉస్మానియా యూనిర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ ఫిలాసఫీలో చేరాడు. ఈ క్రమం అంతా చూస్తే… వీరన్నను అనునిత్యం ఏదో వెలితి వెంటాడుతున్నట్లే ఉంటుంది. ఆ నేపథ్యంలోంచి ఉత్పన్నమైన అలజడి, అసంతృప్తితో వీరన్న అనుక్షణం విలవిలలాడాడు అనిపిస్తుంది. అందుకే ఆయన స్థిమితంగా ఒకచోట ఉండలేదు. ఏ చదువూ సంతృప్తినివ్వలేదు. చదివే చదువులో ఉన్న అశాస్త్రీయత, అసంబద్ధత ఆయనను నిలువనీయలేదు. అందుకే ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకున్నాడు. సరియైన దరి దొరికేదాకా వెతుకులాటలో ఆయన సంచారి యై తిరిగాడు. ప్రజల జీవితాలను మార్చటం కోసం, సమాజంలోని అవినీతి అక్రమాలను రూపుమాపటం కోసం జర్నలిస్టుగా మారాలనుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా అవగాహన అన్న పేరుతో సామాజిక సాహిత్య పత్రికను తేవాలని ఆరాటపడ్డాడు. ఆ క్రమంలో హైదరాబాద్ నగరంలోని సామాజిక దృక్ఫతం, ఆచరణ ఉన్న మేధావులందరినీ కలుసుకున్నాడు. ఆ క్రమంలోనే అలిశెట్టి ప్రభాకర్ ను కలుసుకున్నాడు. నేడు సమాజం ఎదుర్కొంటున్న సమస్త రుగ్మతలన్నింటికీ పరిష్కార మార్గం ఏదన్న తన్లాట వెతుకులాటలో… వీరన్నచేరుకోవాల్సిన దరికే చేరుకున్నాడు.
సరిగ్గా అది… 80 దశకం ద్వితీయార్ధం. ఆటా, మాటా బంద్ అన్న ఎన్‌టీఆర్ పాలనలోని నిప్పులు చెరిగే నిర్బంధ కాలం. అడవులు, గుట్టలు, మారుమూల ప్రాంతాల నుంచి ఎన్‌కౌంటర్లు నగరాలకు ఎగబాకిన కాలం. వరంగల్, హైదరాబాద్ లాంటి నగరాల్లో బస్తీలు, కార్మికవాడలు, ప్రధాన రోడ్లు ఎన్‌కౌంటర్ స్పాట్లయిన కాలం. వరంగల్ హంటర్ రోడ్డైతే… పోలీసులకు ఎన్‌కౌంటర్ పేరిట వేటాడే కిల్లింగ్ ఫీల్డ్ అయిన రోజులు. నగరాల నుంచే మనుషులను మాయం చేసే రాక్షస విధానమొకటి మొదలైన చీకటి కాలం. రాడికల్ యువ జన కార్యకర్తలను చిత్రహింసలకు గురిచేసి చంపి నగర ప్రధాన కూడలిలో (వరంగల్ లో మేఘ్యం అనే యువకున్ని) విద్యుత్ స్తంబాలకు వేలాడదీసిన కాలం.
మరో వైపు ఊపిరాడని నిర్బంధంలోంచి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతూ… స్వేచ్ఛా వాయువులకోసం పరిత పిస్తున్న స్థితి. తెలుగు సమాజంలో అంతరచలనంగా ప్రభుత్వ వ్యతిరేకత సంఘటితపడుతున్న పరిస్థి తులు. ఇలాంటి హింసాత్మక సంక్షుభిత కాలంలో వీరన్న విప్లవవిద్యార్థి ఉద్యమంతో సంబంధాల్లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలంచే… ప్రజలపై అమలు చేసిన తీవ్ర నిర్బంధం కారణంగా ప్రజల్లో పెరిగిన తీవ్ర వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకొనే క్రమంలో రాజకీయ లబ్ధి కోసమైనా.. కాంగ్రెస్ నిర్బంధాన్ని ఎత్తివేస్తామని ప్రకటించింది. అలాగే పౌర, ప్రజాస్వామిక హక్కులకు పెద్ద పీట వేస్తానని, అప్పటి విప్లవ పార్టీ పీపుల్స్ వారుతో చర్చలు జరుపుతానని చెన్నారెడ్డి ప్రకటించాడు. సహజంగానే కాంగ్రెస్ గెలిచి చెన్నారెడ్డి అధికారం చేపట్టాడు. ఏదేమైనా… పాలక ప్రభుత్వాలు మారే సంధికాలంలో రాష్ట్రంలో తాత్కాలికంగానైనా ఒక స్వేచ్ఛాపూరిత వాతావరణం ఏర్పడింది. సభలూ, సమావేశాలకు అవకాశం ఏర్పడింది.
ఎన్ టీఆర్ నిర్బంధ కాలంలో విప్లవోద్యమం తీవ్రంగా నష్టపోయిందనీ, పోలీస్ నిర్బంధం కారణంగా ప్రజల్లో భయం పెరిగి విప్లవోద్యమం పట్ల భయకంపితులై ఉద్యమానికి దూరమయ్యారనీ కొంత మంది మేధావులు సూత్రీకరణలు చేసిన కాలం. కానీ విప్లవోద్యమం మాత్రం నిర్బంధం కారణంగా దెబ్బతిన లేదనీ, మరింతగా విస్తరించి బలపడిందనీ ప్రకటించింది. ప్రభుత్వ మార్పుతో అందివచ్చిన అవకాశాన్ని విప్లవోద్యమం సానుకూలంగా మల్చుకొన్నది. లక్షలాది మందితో బహిరంగ సభలు నిర్వహించి విప్లవో ద్యమ విస్తరణను, విప్లవోద్యమం పట్ల ప్రజాదరణను ప్రపంచానికి చాటిచెప్పింది. తీవ్ర నిర్బంధం తర్వాత వచ్చిన వెసులుబాటును విప్లవోద్యమం ప్రయత్న పూర్వకంగా పునస్సమీకరణకు, ఉద్యమ నిర్మాణానికి వినియోగించుకున్నది. 1990 జనవరిలో హైదరాబాద్‌లో విరసం సభలు, ఆ తర్వాత వెంటనే నిజాం కాలేజీ గ్రౌండ్ లో జననాట్య మండలి సభలు.., ఆ తర్వాత చారిత్రాత్మకమైన వరంగల్ రైతుకూలీ సంఘం మహాసలు జరిగాయి. ఈ సభలన్నింటా వాటి ఏర్పాట్లు, నిర్వహణల్లో వీరన్న కృషి, పట్టుదల, నైపుణ్యమున్నది.
రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడిగా జంటనగరాల్లోని కళాశాలలన్నింటా విద్యార్థులను సంఘటిత పరిచి, చైతన్యం చేసేందుకు వీరన్న అహర్నిశలు కాలుకు బలపం కట్టుకొని తిరిగాడు. ఆ క్రమంలో సామాజిక సమస్యలుగా ముందుకు వచ్చిన ప్రతి అంశాన్నీ తీసుకొని ఉద్యమాలు నిర్మించాడు. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం,ఇంజినీరింగ్, మెడికల్ విద్యను ప్రైవేటికరించే విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థులను కదిలించి ఉద్యమించాడు.విద్యార్థిలోకం కదలికను చూసిన నాటి ప్రభుత్వం తిరిగి ప్రైవేటీకరణపై వెనుకడుగు వేసిందంటే… విద్యార్థి ఉద్యమ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బాబ్రీమసీద్ కూల్చివేతకు నిరసనగా వీరన్న నిర్మించిన లౌకిక ప్రజాస్వామిక ఉద్యమం విశిష్ఠమైనది. పాత నగరం కేంద్రంగా ముస్లిం మేధావులను, రచయితలు, కళాకారులను కదిలించి సభలు సమావేశాలు నిర్వహించాడు. సమకాలీన చరిత్రలో ఓల్డ్‌సిటీ కేంద్రంగా మొదటి సారి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించటానికి వీరన్న నేతృత్వంలోనే జరిగిందంటే అతిశయోక్తికాదు.
బబ్రీ మసీదు కూల్చివేసిన సందర్భంలోనే… రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి వీరన్న రాసిన కవిత ఆయన భవిష్యత్ దర్శనానికి ప్రతీక. ఆ సందర్బంగా ‘మనస్సమాధి’ పేరుతో రాసిన కవిత…
”ఇక..
పూసేవిక పువ్వులు కావు
విషగాలులే
వీచేవిక పిల్ల తెమ్మరలు కావు
నెత్తుటి గాయాలే
మత స్మశాన వాటికలో
మొలిచేవిక
మనసుల బ్రహ్మజెముళ్లే… ” అని బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఘ్‌పరివార్ శక్తుల మత రాజకీయాల ప్రమాదాన్ని తెలియజేశాడు.
చెన్నారెడ్డి పాలనాప్రారంభ కాలంలో ముందుకు వచ్చిన చర్చల ప్రక్రియ, ప్రస్థావన అటకెక్కి, వచ్చిన లీగల్ అవకాశాలు కూడా సన్నగిల్లి ఎన్‌కౌంటర్లు ప్రారంభమైయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రనిర్బంధం మొదలైంది. లీగల్ అవకాశాలున్న కాలంలో క్రియాశీలంగా పనిచేసిన యువకులు, విద్యార్థుల కోసం పోలీసుల వేట తీవ్రమైంది. ఆ నిర్బంధ పరిస్థితిని వీరన్న తన మానవీయం కవితలో ప్రతిభావంతంగా చెప్పాడు.
”జీవించటం తెల్సిన తర్వాత
శత్రువుతో క్షణక్షణం పోరాడుతూ
శత్రువులను మట్టి కరిపిస్తూ
నిరంతరం గంధకం వాసన పీలుస్తూ…” అని నాటి నిర్బంధ పరిస్థితినీ, స్వార్థపూరిత గానుగెద్దు జీవితాన్ని కాదని, ప్రజల కోసం పనిచేయటంలో ఉన్న ఉన్నతిని తెలియజేశాడు.
సకల పీడనలు, అణచివేతలనుంచి దేశ ప్రజలను విముక్తి చేయటం కోసం… ప్రజలకే జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకొన్న సందర్భంలో… వీరన్న రాసుకున్న కవిత ఆయన త్యాగనిరతిని చెప్తుంది.
”ప్రియమైన వారిని, ప్రియమైన వాటిని
వదులుకొని
ప్రియాతి ప్రియమైన
ప్రజాపోరాటంలోకి
ప్రాణాలర్పించటానికి…” అంటూ వీరన్న తన గమ్యాన్ని, గమనాన్ని చెప్పుకొన్నాడు.
విప్లవోద్యమ నిర్మాణంలోభాగంగా విప్లవ అవసరాల కోసం హైదరాబాద్‌నుంచి మరో ప్రాంతానికి పోయే పరిస్థితి వచ్చినప్పుడు…, ఒకసారి చూసి పోదామని వీరన్న తల్లిదండ్రులను కలిశాడు. ఆ సందర్భంగా రాసిన అమ్మా నాన్నలను కలిసినప్పుడు అన్న కవిత ఇది.
”బోరున ఏడుద్దామన్నా
బంధాలు వేసే దుష్ట వ్యవస్థ ఇది
బాధలు కష్టాలు, కన్నీరు లేని
అనుబంధాలు చెల్లా చెదురుకాని
సమాజం కోసం…
రక్తాన్ని చెందించటానికి
రణరంగంలోకి దూకానమ్మా…” అంటూ వీరన్న తన భవిష్యత్ ప్రస్థానాన్ని ప్రకటించుకున్నాడు.
1960వ దశకం ప్రపంచ సంక్షుభిత కాలానికి కాంతిరేఖగా చే గువేరా కనిపిస్తే…, తెలుగు నేలలో 90వ దశకం సంఘర్షణాత్మక విద్యార్థి యువతారానికి ప్రతీకగా వీరారెడ్డి (వీరన్న), వివేక్ నిలిచారు. హైదరాబాద్ జంట నగరాల విప్లవ విద్యార్థి ఉద్యమంలో వీరన్న(రఘు) నిర్వహించిన పాత్ర విశిష్టమైనది. యూనివర్సిటీ విద్యార్థిగా రాడికల్ విద్యార్థిసంఘం నేతగా… ప్రజల సకల జీవన పార్శ్వాలనూ నిత్యనూతనంగా, మాన వీయంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషిచేశాడు. ఆ క్రమంలోనే యువజన, కార్మికోద్యమ నిర్మాణానికి కూడా వీరన్న అవిరళ కృషిచేశాడు. అతి తక్కువ కాలంలో జంటనగరాల విప్లవోద్యమాన్నినగరం నలు వైపులా విస్తరింపచేయటంలో.., ప్రజా కంటకులను మట్టి కరిపించటంలో వీరన్నస్పూర్తిదాయక పాత్ర నిర్వహించాడు.
వీరన్న ఊహించినట్లుగానే… బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఘ్‌పరివార్ శక్తులు అధికారాన్ని కైవసం చేసుకొని ప్రజల ప్రజాస్వామిక హక్కులను హరించి ఫాసిస్టు పాలనకొనసాగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో… వీరన్న మార్గం, కార్యాచరణ మరింతగా అత్యావశ్యకం అయ్యింది. సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న హక్కులన్నీ, సంప్రదాయ విలువలన్నీ మోదీ పాలనలో ధ్వంసం అవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ గొంత విప్పాల్సిన అవసరం ఉన్నది. ముచ్చటగా మూడోసారి అధికార పీఠాలెక్కటానికి మోదీ, షా ద్వయం చేస్తున్న కుట్రలను దేశ ప్రజలు ఓడించాలి. చట్టబద్ధ, లౌకిక, ప్రజాస్వామిక విలువలను పరిరక్షించు కోవటం కోసం చేయి చేయి కలిపి కలిసి నడువాలి. ఈ క్రమంలో.. మానవీయ సమాజం కోసం వీరన్న పడిన తపన అందరికీ ఆదర్శం కావాలి.
యూనివర్సిటీ విద్యార్థి జీవితం నుంచి.. విప్లవమే జీవితంగా ఎంచుకొన్న క్రమంలో తనను తాను తీర్చిదిద్దుకోవటానికి వీరన్న చేసిన ప్రయత్నం, పడిన సంఘర్షణ అంతా ఇంతా కాదు. తొందరపాటు తనము, అతి స్పందన, సున్నితత్వం తదితర విషయాలనుంచి బయట పడేందుకు వీరన్న ఎంతగా తనకు తాను ఘర్షణ పడ్డాడో ఆయన డైరీలను చూస్తే తెలుస్తుంది. ఒక సామాన్యుడు విప్లవకారుడిగా రుపుదిద్దుకొనే క్రమం… ఎంతటి క్లిష్టతరమో, కష్టతరమో తెలిసి వస్తుంది. ఆ క్రమంలోనే… విప్లవకారుడైన మానవుడు ఎంతటి ఉన్నతుడో, ఉత్కృష్టుడో అర్థమవుతుంది. ఈ దేశ ప్రియపుత్రుడిగా ప్రజల విముక్తి కోసం చావుకు ఎదురెళ్లి రక్తతర్పణ చేసిన వీరన్న ప్రజాయుద్ధ వీరుడు. వీరన్న నూతన మానవుడు.
వీరన్న కృషిని విపులంగా వివరించారు. చరిత్ర గతిని మార్చిన వారి పేర్లలో అంబేద్కర్ పేరు లేదు. రచయిత కేవలం సాయుధ తిరుగుబాటు చేసిన వారిని మాత్రమే ఊటంకించడం ఆయన దృక్ఫధానికి సంబంధించిందైనా అంబెద్కర్ పూలె వంటి వారి పేరు ఖచ్చితంగా ఊటంకించాలని నా అభిప్రాయం.